సాక్షి, హైదరాబాద్: ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్‌ఎంసీలు అప్రమత్తమయ్యాయి. టోలిచౌకి పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ సోకిన బాధితులు తిరిగిన ప్రదేశాల్లో హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేస్తున్నారు. ఆ దారిలో ఇతరులెవరూ ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
తల్లిదండ్రుల్లో బెంగ...
ఇప్పటికే డెల్టా వైరస్‌తో ఛిన్నాభిన్నమైన కుటుంబాలు.. తాజా వేరియంట్‌తో మరింత భయాందోళనకు గురవుతున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపాలా? వద్దా? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
పాఠశాలలు, కాలేజీల్లో చాలా వరకు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఒకే గదిలో 50 నుంచి 60 మంది పిల్లలను కూర్చోబెడుతున్నారు.
భౌతిక దూరం అనేది మచ్చుకు కూడా కన్పించడం లేదు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్, సబ్బులు, నీరు అందుబాటులో ఉండటం లేదు. మాస్కులు ధరిస్తున్నా.. తరచూ పక్కకు జారిపోతున్నాయి. ప్రస్తుతం వీస్తున్న చలిగాలుల కు అనేక మంది పిల్లలు ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. పాఠశాలల్లో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే స్క్రీనింగ్ వ్యవస్థ కూడా లేకపోవడం, ఇప్పటి వరకు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది.
ఆస్పత్రుల్లో 1,191 మంది బాధితులు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,812 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 1,500పైగా కేసులు గ్రేటర్ జిల్లాల్లోనే ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 715 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,191 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 284 మంది సాధారణ పడకలపై, 497 మంది ఆక్సిజన్‌పై, మరో 410 మంది ఐసీయూలోని వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు.
టోలిచౌకి, యూసుఫ్ గూడలో కలకలం
నగరంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఒక యువతి సహా యువకుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి వచ్చిన ఇద్దరు యువతులు (24), మరో వ్యక్తి(44)కి, యూకే సుంచి వచ్చిన యువకుని (31)కి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నగరంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఆరు కేసులు ముప్పు లేని దేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో మూడు టోలిచౌకికి చెందినవి కాగా. మరొకరు నగరంలోని యూసుఫ్‌గూడకు చెందినవారిగా వైద్యులు ధ్రువీకరించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం టిమ్స్‌కు తరలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త వేరియంట్ ఇటు టోలిచౌకి అటు యూసూఫ్‌గూడలో కలకలం సృష్టించింది.
పాఠశాల విద్యార్థికి కరోనా
స్థానికంగా ఉన్న ఓ సర్కారు బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్న విద్యార్థికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న బంజారాహిల్స్ వైద్య సిబ్బంది కరోనా కిట్ అందించి క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఇదే బడిలో మరో 50 మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చిందని వారు తెలిపారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలని అనుకుంటున్నప్పటికీ పాఠశాలలో సమ్మెటివ్–1 పరీక్షలు నడుస్తుండటంతో అవి ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థిని పరీక్షిస్తామని వైద్యాధికారులు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్..
పారామౌంట్ కాలనీలో రెండు రోజుల క్రితం ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ఫిలింనగర్ ప్రాథమిక కేంద్రంతో పాటు, జీహెచ్‌ఎంసీ, ఎంటమాలజీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 3ని ఇప్పటికే కంటైన్మెంట్‌గా ప్రకటించిన అధికారులు రోజుకు మూడుసార్లు శానిటైజ్ చేయడంతో పాటు సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కూడా చేస్తున్నారు. మరో వైపు ఫిలింనగర్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఇక్కడ 230 మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారిణి జాస్పర్ జాయిస్ తెలిపారు.
మరో 14 రోజులు అబ్జర్వేషన్‌లోనే..
ఇప్పటికే వంద క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించి, వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాం. ఇంటింటి ఫీవర్ సర్వే కూడా చేపట్టాం. ఆ ప్రాంతాన్ని మరో 14 రోజుల పా టు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం. ఎవరికీ ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కోసం రోజుకు సగటున పదివేల పరీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున ఆరువేల ఆర్టీపీసీఆర్ టెస్టులు, 8 నుంచి పది వేల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నాం.
– డాక్టర్ జె.వెంకటి, డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్
మాస్క్ ఒక్కటే కాపాడుతుంది..
వైరస్ ఏదైనా మాస్క్ ఒక్కటే పరిష్కారం. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. విధిగా భౌతిక దూరం పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు కోవిడ్ టీకాలు వేసుకోవాలి.
– డాక్టర్ శ్రీహర్ష, సర్వేలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment