mask wears nose
-
Tamil Nadu: మరో కలకలం.. కోయంబత్తూర్‌లో మాస్క్ తప్పనిసరి..
చెన్నై: తమిళనాడులోకి కోయంబత్తూరులో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు అక్కడి అధికారులు. కోయంబత్తూరు జిల్లాలో జ్వరానికి సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. వివరాల ప్రకారం.. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వైరల్ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. పలు జిల్లాలో జ్వరం భారీన పడుతున్న వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో, అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ ఫీవర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై.. కోవిడ్ మాదిరిగానే ఆదేశాలను పాటించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ కాంత్రి కుమార్ మాట్లాడుతూ..‘ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్ బారినపడుతున్న వారి సంఖ్య పెరిగింది. ఫ్లూ వైరస్.. పెద్దలను, పిల్లలను ప్రభావితం చేస్తోంది. దీంతో, జ్వర బాధితులు పెరుగుతున్నారు. బాడీ పేయిన్స్, జలుబు, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు రాబోయే కొద్దిరోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించండి. Tamil Nadu: 'Mask up', Coimbatore administration issues notice amid spike in fever cases due to rains#Fever #Coimbatore Read: https://t.co/GnIZOMx2ys — IndiaTV English (@indiatv) November 22, 2023 ప్రతీ ఒక్కరూ గోరు వెచ్చటి నీటిని త్రాగాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలరో ఇప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు పాటించడం అవసరం. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించండి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారి వివరాలను సేకరిస్తున్నాం. వారి ఏరియాలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. -
కోవిడ్ కేసుల ఎఫెక్ట్.. ఆ మూడు రాష్ట్రాల్లో మాస్క్ మస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. ఇప్పటికే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటిపోయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 31వేల దాటింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య సదుపాయాల సన్నద్ధతను సమీక్షించాలని సూచించారు. ఇదిలా ఉండగా, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అంచనా వేయడానికి సోమవారం, మంగళవారం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేపట్టనుందని స్పష్టం చేసింది. ఐసియూలో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు అమలులో ఉన్నాయని, సంసిద్ధతపై వారానికోసారి సమీక్ష జరుగుతుందని పేర్కొంది. మరోవైపు.. కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరిగా చేశాయి. హర్యానా కోవిడ్ కేసుల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా అమలు చేసేలా చూడాలని జిల్లా అధికార యంత్రాంగం, పంచాయతీలకు ఆదేశాలు జారీ చేశారు. కేరళ కేరళలో గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోవిడ్ సంబంధిత మరణాలు ఎక్కువగా 60 ఏళ్లు పైబడిన వారిలో, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతున్నవారిలో ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. కాబట్టి, వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పుదుచ్చేరి పుదుచ్చేరి ప్రభత్వుం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఆసుపత్రులు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హాస్పిటాలిటీ, వినోద రంగాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఒక ప్రకటనలో తెలిపింది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే విమానం నుంచి దింపేయండి: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: విమానాశ్రయాలు, విమానాల్లో ప్రయాణికులు మాస్క్‌లను కచ్చితంగా ధరించేలా నిబంధనలను అమలు చేయాలని ఢిల్లీ ధర్మాసనం ఆదేశించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించాలని ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) విపిన్ సంఘీ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే విమానం నుంచి దింపేయాలని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో విమాన ప్రయాణంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడంపై పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ధర్మాసనం కోవిడ్ నిబంధనలు అమలు చేయడమే కాకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోమని పేర్కొంది. కరోనా కట్టడి చేసే దిశగా ప్రజల ఆరోగ్య దృష్ట్యా మాస్క్ ధరించడం, హ్యండ్ శానిటైజేషన్ వంటి నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు ఉల్లంఘించే ప్రయాణికుల పై కఠిన చర్యలు తీసుకునేలా విమానాశ్రయాలు, విమానాల సిబ్బందికి పూర్తి అధికారాలు ఇస్తూ కరోనాకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయమని డీజీసీఏని ఆదేశించింది. పైగా నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తులపై జరిమానా విధించడం తోపాటు సదరు వ్యక్తుల పేర్లను కూడా నో ఫ్లై లిస్ట్‌లో ఉంచాలని ఆదేశించింది. ఐతే ధర్మాసనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మాస్క్‌ని తొలగించేలా చిన్న వెసుల బాటు కల్పించింది. (చదవండి: కరోనా కేసులు పైపైకి.. అక్కడ మళ్లీ మాస్క్ సంకేతాలు!) -
గ్రేటర్ అలర్ట్: ఒమిక్రాన్ గుర్తింపుతో కంటైన్మెంట్ జోన్‌గా పారామౌంట్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్ఎంసీలు అప్రమత్తమయ్యాయి. టోలిచౌకి పారామౌంట్ కాలనీని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో వైరస్ సోకిన బాధితులు తిరిగిన ప్రదేశాల్లో హైపోక్లోరైడ్‌తో శానిటైజ్ చేస్తున్నారు. ఆ దారిలో ఇతరులెవరూ ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. తల్లిదండ్రుల్లో బెంగ... ఇప్పటికే డెల్టా వైరస్‌తో ఛిన్నాభిన్నమైన కుటుంబాలు.. తాజా వేరియంట్‌తో మరింత భయాందోళనకు గురవుతున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పిల్లలను బడికి పంపాలా? వద్దా? ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో చాలా వరకు కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు. ఒకే గదిలో 50 నుంచి 60 మంది పిల్లలను కూర్చోబెడుతున్నారు. భౌతిక దూరం అనేది మచ్చుకు కూడా కన్పించడం లేదు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్, సబ్బులు, నీరు అందుబాటులో ఉండటం లేదు. మాస్కులు ధరిస్తున్నా.. తరచూ పక్కకు జారిపోతున్నాయి. ప్రస్తుతం వీస్తున్న చలిగాలుల కు అనేక మంది పిల్లలు ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. పాఠశాలల్లో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే స్క్రీనింగ్ వ్యవస్థ కూడా లేకపోవడం, ఇప్పటి వరకు పిల్లలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం తల్లిదండ్రుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఆస్పత్రుల్లో 1,191 మంది బాధితులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,812 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 1,500పైగా కేసులు గ్రేటర్ జిల్లాల్లోనే ఉన్నాయి. వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 715 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 1,191 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 284 మంది సాధారణ పడకలపై, 497 మంది ఆక్సిజన్‌పై, మరో 410 మంది ఐసీయూలోని వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు. టోలిచౌకి, యూసుఫ్ గూడలో కలకలం నగరంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కెన్యా, సోమాలియా దేశాల నుంచి వచ్చిన ఒక యువతి సహా యువకుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి వచ్చిన ఇద్దరు యువతులు (24), మరో వ్యక్తి(44)కి, యూకే సుంచి వచ్చిన యువకుని (31)కి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకు నగరంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఆరు కేసులు ముప్పు లేని దేశాల నుంచి వచ్చినవే కావడం గమనార్హం. కొత్తగా వెలుగు చూసిన కేసుల్లో మూడు టోలిచౌకికి చెందినవి కాగా. మరొకరు నగరంలోని యూసుఫ్‌గూడకు చెందినవారిగా వైద్యులు ధ్రువీకరించారు. వీరందరినీ చికిత్స నిమిత్తం టిమ్స్‌కు తరలించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్త వేరియంట్ ఇటు టోలిచౌకి అటు యూసూఫ్‌గూడలో కలకలం సృష్టించింది. పాఠశాల విద్యార్థికి కరోనా స్థానికంగా ఉన్న ఓ సర్కారు బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. రెండు రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో బాధ పడుతున్న విద్యార్థికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్న బంజారాహిల్స్ వైద్య సిబ్బంది కరోనా కిట్ అందించి క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఇదే బడిలో మరో 50 మంది విద్యార్థులకు పరీక్షలు చేస్తే అందరికీ నెగిటివ్ వచ్చిందని వారు తెలిపారు. పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలని అనుకుంటున్నప్పటికీ పాఠశాలలో సమ్మెటివ్–1 పరీక్షలు నడుస్తుండటంతో అవి ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థిని పరీక్షిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్.. పారామౌంట్ కాలనీలో రెండు రోజుల క్రితం ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ఫిలింనగర్ ప్రాథమిక కేంద్రంతో పాటు, జీహెచ్ఎంసీ, ఎంటమాలజీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 3ని ఇప్పటికే కంటైన్మెంట్గా ప్రకటించిన అధికారులు రోజుకు మూడుసార్లు శానిటైజ్ చేయడంతో పాటు సాయంత్రం వేళల్లో ఫాగింగ్ కూడా చేస్తున్నారు. మరో వైపు ఫిలింనగర్ ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా ఇక్కడ 230 మందికి ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారిణి జాస్పర్ జాయిస్ తెలిపారు. మరో 14 రోజులు అబ్జర్వేషన్లోనే.. ఇప్పటికే వంద క్లోజ్ కాంటాక్ట్‌లను గుర్తించి, వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించాం. ఇంటింటి ఫీవర్ సర్వే కూడా చేపట్టాం. ఆ ప్రాంతాన్ని మరో 14 రోజుల పా టు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఎవరికీ ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కోసం రోజుకు సగటున పదివేల పరీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున ఆరువేల ఆర్టీపీసీఆర్ టెస్టులు, 8 నుంచి పది వేల ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నాం. – డాక్టర్ జె.వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్ మాస్క్ ఒక్కటే కాపాడుతుంది.. వైరస్ ఏదైనా మాస్క్ ఒక్కటే పరిష్కారం. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. శానిటైజర్లు, సబ్బులతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. విధిగా భౌతిక దూరం పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ విధిగా రెండు డోసులు కోవిడ్ టీకాలు వేసుకోవాలి. – డాక్టర్ శ్రీహర్ష, సర్వేలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్ -
వంద రోజులపాటు మాస్క్ ధరించాలి
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా వంద రోజులపాటు మాస్క్ విధిగా ధరించాలని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పిలుపునిచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ప్రకటించే మొదటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని అన్నారు. సీఎన్ఎన్తో ఆయన మాట్లాడుతూ..జనవరి 20వ తేదీన బాధ్యతల స్వీకారం రోజున 100 రోజులపాటు మాస్క్ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అదీ ఎల్లకాలం కాదు. కేవలం వందరోజులు మాత్రమే. దీనివల్ల కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతాయి’అని చెప్పారు. మాస్క్ ధరించి దేశభక్తిని నిరూపించుకోండంటూ ఎన్నికల ప్రచార సభల్లో కూడా బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాస్క్ ధారణ అంటే కరోనా మహమ్మారిని రాజకీయం చేయడమేనన్న డొనాల్డ్ ట్రంప్ విధానానికి బైడెన్ చర్య పూర్తి వ్యతిరేకం కానుంది. మాస్క్ ధరించడం ద్వారా అత్యంత సులభంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఇప్పటికే 2.75 లక్షల మంది ఈ మహమ్మారికి బలి కావడం తెలిసిందే. కాగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీని అదే పదవిలో కొనసాగాలని కోరినట్లు కూడా బైడెన్ సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో నిర్వర్తించిన బాధ్యతలనే ఇకపైనా చేపట్టాలని తెలిపినట్లు పేర్కొన్నారు. తన కోవిడ్–19 సలహా బృందంలో సభ్యుడిగాను చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఉండాలని కూడా డాక్టర్ ఫౌసీని అడిగానన్నారు. కరోనా టీకా భద్రత, సమర్థతపై వ్యక్తమవుతున్న అనుమానాలు పోగొట్టేందుకు స్వయంగా తానే టీకా వేయించుకుంటానని బైడెన్ అన్నారు. అలా చేయడం తనకు కూడా సంతోషమేనన్నారు. గురువారం ఒక్కరోజే భారీగా మరణాలు, కేసులు నమోదు కావడంతో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కమలా బృందంలో మహిళా మకుటాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తన బృందం మొత్తంలో మహిళలకు పెద్దపీట వేశారు. పాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్న టీనా ఫ్లోర్నాయ్ని చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. అమెరికా పౌరుల రక్షణకు నాన్సీ మెక్ ఎల్డోనీని జాతీయ భద్రతా సలహాదారుగా, డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా రోహిణీ కొసోగ్లులను నియమిస్తున్నట్టు కమలప్రకటించారు. టీనా ఫ్లోర్నాయ్ గత మూడు దశాబ్దాలుగా డెమొక్రటిక్ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నారు. సర్జన్ జనరల్‌గా వివేక్ భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(43)ని బైడెన్ సర్జన్ జనరల్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ వైద్యుడు బైడెన్ కోవిడ్ అడ్వైజరీ బోర్డులోని ముగ్గురు çసహాధ్యక్షుల్లో ఒకరు. గతంలో 2014 డిసెంబర్ 15న వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏప్రిల్ 21, 2017న పదవి నుంచి దిగిపోయారు. బైడెన్ నేతృత్వంలో డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వివేక్ మూర్తి హార్వర్డ్ యూనివర్సిటీలో 1997లో బయోకెమికల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేశారు. -
మాస్క్ లేకుంటే కొరడా
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. మాస్క్‌లు ధరించని వారికి విధిస్తున్న జరిమానాల విషయంలో నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో మారాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ పెరగడంతో మాస్క్ ధరించని వారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.2000కు పెంచారు. గుజరాత్లో భారీగా జరిమానాలు వసూలు కరోనాను కట్టడి చేసేందుకు జరిమానాలు విధించడంలో గుజరాత్ అధికారులు ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందున్నారు. జూన్ 15 నుంచి ఇప్పటì వరకు రాష్ట్రంలో మాస్క్‌లు ధరించనివారికి అధికారులు చలాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 26 లక్షల మంది ప్రజల నుంచి రూ.78 కోట్లు జరిమానా వసూలు చేశారు. ఈ మొత్తం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సంవత్సరపు ఆదాయం కంటే ఎక్కువ అని అధికారులు తెలిపారు. గుజరాత్‌లోని కెవాడియాలో 2018 అక్టోబర్ 31న ఏకతా విగ్రహాన్ని ప్రారంభించారు. దీని తరువాత, పర్యాటకుల నుంచి ఏడాదిలో రూ. 63.50 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా అహ్మదాబాద్‌లో ప్రతి నిమిషానికి అత్యధికంగా 120 మందికి జరిమానా విధించారు. అధికారులు నిరంతరం సూచనలు చేస్తున్నప్పటికీ చాలామంది ప్రజలు ఇప్పటికీ మాస్క్‌లు ధరించట్లేదు. మాస్క్‌లు ధరించని ప్రజలకు జరిమానా మొత్తాన్ని పెంచాలని డిమాండ్ సైతం వచ్చింది. మాస్క్ ధరించకుండా దొరికితే గుజరాత్లో తప్పనిసరిగా కరోనా పరీక్ష చేస్తున్నారు. ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్‌గా వస్తే రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక వారిని వెంటనే ఆసుపత్రికి చికిత్స కోసం పంపిస్తారు. 45 వేల కొత్త కేసులు దేశంలో 24 గంటల్లో 45,209 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90.95 లక్షలకు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 501 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఆదివారానికి 85,21,617కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,40,962గా ఉంది. కాగా, ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో మంగళవారం వర్చువల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కోవిడ్ అంశంపైనే రెండు సమావేశాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. -
మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!
న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ప్రధాని వాటికి బదులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు. ప్రధానికి ట్రంప్ బర్త్‌డే విషెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. గొప్పనేత, విశ్వాసపాత్రుడైన మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి’అని ట్విట్టర్లో ట్రంప్ ఆకాంక్షించారు. -
క్లాసులోనూ మాస్క్
ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాలన్నీ వాయు కాలుష్యంతో నిండిపోయాయనడానికి చక్కని ఉదాహరణ ఈ చిత్రం. శనివారం గుర్గావ్లోని ఓ పాఠశాలలో క్లాస్ సమయంలో విద్యార్థులు, టీచర్ అందరూ మాస్క్‌లు ధరించారు. -
సిటీ మస్కటీర్స్
ఝాన్సీ కి వాణీ హైదరాబాద్ టు విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కాను. పక్క సీట్లో ముంబై నుంచి వస్తున్న ప్రయాణికుడు. నేను వస్తూనే గబగబా ముక్కుకి మాస్క్ తగిలించుకున్నాడు. అసలే సీజన్ బాగోలేదు. ఆ మాస్క్ వీరుడిని చూసి జాలేసింది. జలుబు కానీ ఉందేమోనని ! పలకరింపుగా నవ్వి కూర్చున్నాను. మాస్క్ వెనుక అతని కళ్లు మాత్రమే కనబడుతున్నాయి. తిరిగి నవ్వాడో లేదో అర్థం కాలేదు. అతని కళ్లు నన్ను అనుమానాస్పదంగా చూస్తున్నట్టు అనిపించాయి. ఎందుకొచ్చిన గొడవలే అని మేగజైన్ తిరగేయడం మొదలుపెట్టాను. ప్రయాణంలో కనీసం తోటి ప్రయాణికుడిని పలకరించకుండా ఉండలేని వీక్నెస్ నాది. పైగా సారు గారు చూస్తున్న అనుమానపు చూపులు మరింత కుతూహలం రేకెత్తిస్తున్నాయి. ఇక ఉండబట్టలేక మీరు ముంబై నుంచి వస్తున్నారా అని అడిగాను. నేనేదో అడక్కూడనిది ప్రశ్నించినట్టు ఉలిక్కిపడిపోయి ఆయన జేబులు తడిమేసుకున్నాడు. ఊరు మరిచిపోయిన గజిని అయి ఉంటాడా..? లేక విజిటింగ్ కార్డు వెతుక్కుంటున్నాడా అనుకున్నా. ఆయన జేబు నుంచి బయటకు తీసిన వస్తువును చూసి షాకవడం నా వంతు అయింది. నోస్ మాస్క్ !! అది నా చేతికి ఇచ్చి ముఖానికి పెట్టుకోమని సైగ చేసి చేతులను శానిటైజర్‌తో రుద్దుకున్నాడు. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు. ఒకటి మాత్రం అర్థమైంది. అతనప్పటి వరకు నన్ను వైరస్ క్యారియర్‌గా చూశాడని. అది జాగ్రత్త అనాలో, భయం అనాలో తెలీదు. మొత్తానికి మాట పెరిగింది. సారు ముంబై నుంచి వైజాగ్‌కు ఆఫీస్ పని మీద వెళ్తున్నాడట. వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్.. వయా తెలంగాణ. పైగా ఫ్లైట్ హైదరాబాద్‌లో ఆగుతుంది. కాబట్టి ‘తస్మాత్ జాగ్రత్త అని మిత్రులు హెచ్చరించారట. హైదరాబాద్ స్వైన్ ఫ్లూ క్యాపిటల్’ అని అతనిచ్చిన ఈక్వేషన్ విని తెల్లబోయాను. స్వైనం ఛిందంతి శాస్త్రాని.. ఇదా హైదరాబాద్‌కు బయటున్న ఇమేజ్..! నిజమే హెచ్1ఎన్1 కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, తగిన సమయంలో గుర్తించి మందులు వాడాలి. వీటి గురించి తెలిసుంటే స్వైన్ ఫ్లూ గురించి ఆందోళన చెందక్కర్లేదని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఈ కాంపెయిన్ భుజానికెత్తుకుంది. సమాచారంతో పాటు సంచలనం క్రియేట్ చేసి తద్వారా జనం దృష్టిని ఆకర్షించాలనే ప్రణాళిక వేసిన వారూ లేకపోలేదు. ఆ ప్లాన్ వారికి లబ్ధి చేకూర్చిందో లేదో కానీ, మార్కెట్లో స్వైన్ ఫ్లూ పేరుతో కాసులు పండించుకునే వ్యాపారానికి తెర తీసింది. అవును మరి సమాచారం కంటే భయం తొందరగా పాకుతుంది. అందుకే జనం కూడా మెడికల్ షాప్లకీ, ఆస్పత్రులకూ పరుగులు తీస్తున్నారు. మాస్క్ మస్కా.. సూపర్మార్కెట్లలో హ్యాండ్ శానిటైజర్ల కొరత, మెడికల్ ఫార్మసీలలో మాస్క్‌ల రేటు మోత..! ఫ్లూ వ్యాక్సిన్ కోసం క్యూలు చేంతాడంత ! వ్యాక్సిన్ ధరలు ఎంతున్నా సామాన్యుడికి ఆతృత ! ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం పక్కన పెడితే, కార్పొరేట్లతో వైద్యం చుక్కలనంటుతోంది. ఇక సందట్లో సడేమియా ల్యాబ్‌లలో పరీక్షలతో కూడా లాభాలు గడించేసుకోవాలనుకునే వారూ ఉన్నారు. మొత్తానికి స్వైన్ ఫ్లూ పేరుతో వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇది తెలిసి కూడా ఎదురు ప్రశ్నించని తత్వం మనది. రెండు రూపాయల మాస్క్ పది రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. కానీ, కూరగాయల దగ్గర ఓ రూపాయి తగ్గించుకోమని బేరమాడతాం. భయమేస్తే విలువ పెరుగుతుంది. లొసుగుల ముసుగు ఆరోగ్యంగా ఉన్నవారికి వ్యాక్సిన్ పెద్దగా అవసరం లేదని ఓ పక్కన చెబుతున్నా. ఎంత డబ్బు పోసైనా కొనుక్కుందామనుకునే మన వల్ల నల్లదందాలు మొదలయ్యాయి. స్వైన్ ఫ్లూ కంటే వేగంగా పాకుతున్న భయానికి, భయాన్ని వ్యాపారంగా మార్చిన వైనానికి, అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా బాధ్యత వహించగలదా..! ఇతర సంచలనాలకీ, భద్రతా సమాచారాలకీ ఇదే విధంగా స్పందించని మన సమాజం మీడియాని, మార్కెట్‌ని నియంత్రించగలదా..! ఎవరి చేతుల్లో ఎవరు ఆడుతున్నట్లో? అవసరమైతే ముసుగు వేస్తాం. లేకపోతే లొసుగు వెతుకుతాం. నా పెదవి విరుపు మీకు కనిపించదు. ప్రస్తుతం నేను మాస్క్ వేసుకున్నా.