వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా వంద రోజులపాటు మాస్క్ విధిగా ధరించాలని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పిలుపునిచ్చారు. అధికార పగ్గాలు చేపట్టాక ప్రకటించే మొదటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని అన్నారు. సీఎన్‌ఎన్‌తో ఆయన మాట్లాడుతూ..జనవరి 20వ తేదీన బాధ్యతల స్వీకారం రోజున 100 రోజులపాటు మాస్క్ ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అదీ ఎల్లకాలం కాదు. కేవలం వందరోజులు మాత్రమే. దీనివల్ల కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతాయి’అని చెప్పారు.
మాస్క్ ధరించి దేశభక్తిని నిరూపించుకోండంటూ ఎన్నికల ప్రచార సభల్లో కూడా బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాస్క్ ధారణ అంటే కరోనా మహమ్మారిని రాజకీయం చేయడమేనన్న డొనాల్డ్ ట్రంప్ విధానానికి బైడెన్ చర్య పూర్తి వ్యతిరేకం కానుంది. మాస్క్ ధరించడం ద్వారా అత్యంత సులభంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్న ఆరోగ్య నిపుణుల హెచ్చరికలను కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఇప్పటికే 2.75 లక్షల మంది ఈ మహమ్మారికి బలి కావడం తెలిసిందే.
కాగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీని అదే పదవిలో కొనసాగాలని కోరినట్లు కూడా బైడెన్ సీఎన్‌ఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో నిర్వర్తించిన బాధ్యతలనే ఇకపైనా చేపట్టాలని తెలిపినట్లు పేర్కొన్నారు. తన కోవిడ్–19 సలహా బృందంలో సభ్యుడిగాను చీఫ్ మెడికల్ అడ్వైజర్‌గా ఉండాలని కూడా డాక్టర్ ఫౌసీని అడిగానన్నారు. కరోనా టీకా భద్రత, సమర్థతపై వ్యక్తమవుతున్న అనుమానాలు పోగొట్టేందుకు స్వయంగా తానే టీకా వేయించుకుంటానని బైడెన్ అన్నారు. అలా చేయడం తనకు కూడా సంతోషమేనన్నారు. గురువారం ఒక్కరోజే భారీగా మరణాలు, కేసులు నమోదు కావడంతో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కమలా బృందంలో మహిళా మకుటాలు
ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్ తన బృందం మొత్తంలో మహిళలకు పెద్దపీట వేశారు. పాలనా వ్యవహారాల్లో అనుభవం ఉన్న టీనా ఫ్లోర్‌నాయ్‌ని చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమించారు. అమెరికా పౌరుల రక్షణకు నాన్సీ మెక్ ఎల్డోనీని జాతీయ భద్రతా సలహాదారుగా, డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా రోహిణీ కొసోగ్లులను నియమిస్తున్నట్టు కమలప్రకటించారు. టీనా ఫ్లోర్‌నాయ్ గత మూడు దశాబ్దాలుగా డెమొక్రటిక్ పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నారు.
సర్జన్ జనరల్‌గా వివేక్
భారతీయ సంతతికి చెందిన డాక్టర్ వివేక్ మూర్తి(43)ని బైడెన్ సర్జన్ జనరల్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ వైద్యుడు బైడెన్ కోవిడ్ అడ్వైజరీ బోర్డులోని ముగ్గురు çసహాధ్యక్షుల్లో ఒకరు. గతంలో 2014 డిసెంబర్ 15న వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా నియమితులయ్యారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏప్రిల్ 21, 2017న పదవి నుంచి దిగిపోయారు. బైడెన్ నేతృత్వంలో డాక్టర్ వివేక్ మూర్తి తిరిగి కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వివేక్ మూర్తి హార్వర్డ్ యూనివర్సిటీలో 1997లో బయోకెమికల్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నుంచి ఎండీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment