బంజారాహిల్స్: నీళ్లు తోడేందుకు బకెట్‌ను సంప్‌లోకి వదిలిన ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతి చెందగా.. కాపాడటానికి వెళ్లిన మరో ఇద్దరు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులు బాసిన విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివసించే మహ్మద్ రిజ్వాన్ (18), మహ్మద్ రజాక్ (16) అన్నదమ్ములు.
రిజ్వాన్ ఇంటర్ చదువుతుండగా రజాక్ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు. బుధవారం అర్ధరాత్రి తమ ఇంటిపై వాటర్ ట్యాంకర్‌లో నీళ్లు అయిపోవడంతో నీరు తోడేందుకు రజాక్ సంప్‌లోకి బకెట్ ముంచాడు. అప్పటికే నీళ్లు పైకి ఎక్కించేందుకు కరెంటు మోటార్ ఆన్ చేసి ఉండటంతో రజాక్ విద్యుత్ షాక్‌కు గురై సంప్‌లో పడిపోయాడు. వెంటనే అతని సోదరుడు మహ్మద్ రజాక్ కూడా నీళ్లు తోడేందుకు సంప్‌లో బకెట్ వేయగానే షాక్‌కు గురయ్యాడు.
పది నిమిషాలు గడిచినా రజాక్, రిజ్వాన్ రాకపోయేసరికి స్నేహితుడు సయ్యద్ అనసుద్దీన్ హుస్సేన్ (20) సంపు వద్దకు వచ్చి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఆందోళన చెందిన అనస్ వారిని పైకి తీసేందుకు యత్నిస్తుండగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ముగ్గురూ సంప్‌లోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఈ ఘటన పారామౌంట్ కాలనీలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నదమ్ములు ఇద్దరూ కొద్ది రోజుల క్రితమే ఇంటర్, 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment