ఏడాదిన్నర కిందట కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. విపరీతమైంగా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు చాలామంది. వైరస్ ఉధృతిని తట్టుకోలేక.. అదే సమయంలో వాళ్లకున్న ఆరోగ్య సమస్యలతో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. జనాలు కరోనాను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. కరోనాతో మమేకమై బతికేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అయితే.. ఆ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 ఇప్పుడు భారత్‌లో మళ్లీ కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది.
కరోనా వైరస్ జేఎన్.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్‌లో ఇది అక్కడ విజృంభించింది. తాజాగా.. డిసెంబర్ మొదటివారంలో చైనాలోనూ కేసులు వెలుగుచూశాయి. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. జేఎన్.1 వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏం కాదు.. ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. ఇది ఇప్పుడు వైద్యనిపుణులు చెబుతున్నమాట. ఈ మాటనే.. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ఆధారంగా సమర్థించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ..
పెరుగుతున్న కేసులు
చలికాలం.. ఫ్లూ సీజన్. ఇదంతా కామన్ అని అనుకుంటారంతా. కానీ, ఏడు నెలల తర్వాత కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల. కొత్త వేరియెంట్ కేసుల గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫిగర్ దాటే దిశగా కరోనా మరణాలు. ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి?. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్లే కేసుల్లో రోజూవారీ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
- జ్వరం, ఒళ్లు నొప్పులు
- జలుబు.. ముక్కు కారడం,
- గొంతు నొప్పి,
- వాసన-రుచి శక్తిని కోల్పోవడం,
- తలనొప్పి..
- కొందరిలో కడుపు నొప్పి, గ్యాట్రిక్ సమస్య
- వాంతులు, విరేచనాలు
- మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు
పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్ష్యం వద్దు. దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే.. ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండేవాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరస్సే సోకకుండా జాగ్రత్త పడొచ్చు.
సామాజిక వ్యాప్తికి ఎంట్రీ దశలో..
నవంబర్‌కు ముందు దాకా.. భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా కేసుల్లో 1 శాతం మాత్రమే కోవిడ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. నవంబర్ తర్వాత నుంచి 9 శాతంగా బయటపడ్డాయి. ఇప్పుడది.. 30 శాతంకి చేరింది. అందుకు ఉదాహరణగా.. కొచ్చిలో ఒక్కరోజు వ్యవధిలో జ్వరాలు, జలుబులతో కొందరికి టెస్టులు చేశారు. వాళ్లలో 30% మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ పేషెంట్ల ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు పరీక్షలు చేయించగా.. వాళ్లలో కూడా కొందరికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కేరళలోనే కాదు.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.. ఇలా పలు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియెంట్ కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. అక్కడా టెస్టులు చేస్తే అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు నిపుణులు.
అధ్యయనాల సంగతి గుర్తు చేస్తూ..
కోవిడ్ అంటే లైట్.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని అనుకునేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. కానీ, కోవిడ్‌ను సాధారణ జలుబు జ్వరం ఎంతమాత్రం అనుకోవద్దని.. తీసి పారయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారామె. శరీరంపై సుదీర్ఘకాలం ప్రతికూల ప్రభావం చూపెడుతుందని.. గుండెజబ్బులతో పాటు మానసిక సమస్యలకు కారణమవుతుందని పలు అధ్యయనాల నివేదికల్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ద్వారా ప్రకటించిన ఆరోగ్య-అత్యవసర పరిస్థితి ముగిసినా.. మానవాళి ఆరోగ్యం మీద అది చూపించే ప్రతికూలత తగ్గలేదనే అంటున్నారామె.
తట్టుకోగలమా?
కరోనా తొలినాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. ప్రాణాంతక డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్న అనుభవమూ ఉండొచ్చు. వ్యాక్సినేషన్ అందించే ధైర్యం మరో కారణం కావొచ్చు. కానీ, ఇప్పుడు గనుక కేసులు పెరిగితే?.. ఒమిక్రాన్ ఉపరకం అయినా జేఎన్.1.. మాతృక వేరియెంట్‌లాగే చెలరేగిపోతే!. వైరస్ బారినపడి వాళ్లకు దానిని తట్టుకోగలిగే శక్తి లేకపోతే. ఆ భారం ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై కచ్చితంగా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొంచెం జాగ్రత్త
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైరస్ సోకుండా జాగ్రత్తలు పాటించడం కష్టమేమీ కాదు. వయసు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, పిల్లలు, మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మాస్క్‌లు ధరించడం మంచిదని సూచిస్తున్నారు.
‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’.. తాజా సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచన ఇది.
Comments
Please login to add a commentAdd a comment