హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2,11,20,441 యూనిట్లు. భారత రోడ్లపైకి 2022 సంవత్సరంలో కొత్తగా దూసుకొచ్చిన వాహనాల సంఖ్య ఇది. 2021లో అమ్ముడైన 1,83,21,760 యూనిట్లతో పోలిస్తే ఇది 15.28 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇక 2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త శిఖరాలను తాకిందని ఎఫ్‌ఏడీఏ వివరించింది.
ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు..
‘అక్టోబర్, నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదైనప్పటికీ డిసెంబర్‌లో తగ్గుముఖం పట్టడంతో ద్విచక్ర వాహన విభాగం మరోసారి ఆకట్టుకోవడంలో విఫలమైంది. ద్రవ్యోల్బణం, యాజమాన్య ఖర్చు అధికం కావడం, గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహన విభాగంలో ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించలేదు’ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు.
ఈవీలు మూడంకెల వృద్ధి..
గతేడాది దేశవ్యాప్తంగా రిటైల్‌లో ద్విచక్ర వాహనాలు 1,53,88,062 యూనిట్లు విక్రయం అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.37 శాతం వృద్ధి నమోదైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 16.35 శాతం అధికమై 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కోవిడ్ కారణంగా తిరోగమనం చెందిన త్రిచక్ర వాహన విభాగం రికవరీ అయింది. 2019తో పోలిస్తే అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీ–వీలర్లు విక్రయాలు 71.47 శాతం ఎగసి 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతం మించింది.
ట్రాక్టర్లు.. జీవిత కాల రికార్డు..
ట్రాక్టర్ల విక్రయాలు వరుసగా మూడేళ్లను మించి 2022లో 7.94 లక్షల యూనిట్లతో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవణాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు ఇందుకు కారణం. వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం దూసుకెళ్లి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ మొత్తం 2022లో వృద్ధి చెందుతూనే ఉంది. 2019 స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్‌సీవీ), భారీ వాణిజ్య వాహనాలు (హెచ్‌సీవీ), బస్‌లు, నిర్మాణ రంగ యంత్రాల్లో డిమాండ్‌కు తోడు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విభాగాన్ని వృద్ధి బాటలో కొనసాగించాయి.
ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించాలి..
‘వాహన తయారీ సంస్థలు డిసెంబరులో సాధారణ ధరలను పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ధరలను సవరించాయి. ఇది కాకుండా బీఎస్–6 రెండవ దశ నిబంధనలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అన్ని వాహన విభాగాల్లో ధరల పెంపుదల ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలి. తద్వారా రిటైల్ అమ్మ కాలు ఊపందుకుంటాయి’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది.
రోడ్డెక్కిన 2,11,20,441 వాహనాలు
Published Fri, Jan 6 2023 6:19 AM | Last Updated on Fri, Jan 6 2023 6:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment