మొత్తం అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్ వాహనాలకు బలమైన డిమాండ్ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.
నిలకడగా పరిశ్రమ..
వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్ సి.ఎస్.విఘ్నేశ్వర్ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ (పీవీ) విభాగం బలమైన నెట్‌వర్క్ విస్తరణ, ఉత్పత్తి లాంచ్‌ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment