పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్.. క్షీణించిన ఎగుమతులు | Passenger Vehicle Sales Growth In India | Sakshi
Sakshi News home page

పెరిగిన ప్యాసింజర్‌ వెహికల్ సేల్స్.. క్షీణించిన ఎగుమతులు

Published Tue, Oct 17 2023 7:27 AM | Last Updated on Tue, Oct 17 2023 9:24 AM

Passenger Vehicle Sales Growth - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా 2023 జూలై–సెప్టెంబర్‌లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 10,74,189 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 4.7 శాతం అధికం. భారత్‌లో ఒక త్రైమాసికంలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ ఇందుకు కారణం. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో (ఏప్రిల్‌–సెప్టెంబర్‌) దేశీయ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ టోకు విక్రయాలు 20 లక్షల మార్కును దాటడం కూడా ఇదే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌తో పోలిస్తే పీవీ హోల్‌సేల్స్‌ 19,36,804 యూనిట్ల నుంచి ఈ ఏడాది 20,70,163 యూనిట్లకు దూసుకెళ్లాయి.  

ద్విచక్ర వాహనాలు మినహా.. 
2023–24 రెండవ త్రైమాసికంలో ప్యాసింజర్‌ వాహనాలు, త్రీ–వీలర్లు, వాణిజ్య వాహనాల విభాగాలు వృద్ధిని సాధించాయి. ద్విచక్ర వాహనాల టోకు అమ్మకాలు స్వల్పంగా తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. 2023 జూలై–సెప్టెంబర్‌లో డీలర్లకు చేరిన మొత్తం ద్విచక్ర వాహనాలు 46,73,931 యూనిట్ల నుంచి 45,98,442 యూనిట్లకు తగ్గాయి. వాణిజ్య వాహనాల హోల్‌సేల్‌ విక్రయాలు గతేడాదితో పోలిస్తే 2,31,991 యూనిట్ల నుంచి 2,47,929 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాలు 1,20,319 నుంచి 1,95,215 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో మొత్తం అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 60,52,739 యూనిట్ల నుండి 61,16,091 యూనిట్లకు ఎగశాయి. పండుగ సీజన్‌లోకి ప్రవేశించడంతో అన్ని వాహన విభాగాలు ఆశాజనకంగా ఉన్నాయి. మూడవ త్రైమాసికంలో కూడా మెరుగ్గా ఉంటుందని సియామ్‌ అంచనా వేస్తోంది.  

ఎంట్రీ లెవెల్‌ బేజారు.. 
యుటిలిటీ, స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ కారణంగా పీవీ విభాగంలో అమ్మకాల వృద్ధికి ఆజ్యం పోసింది. మొత్తం అమ్మకాలలో యుటిలిటీ, ఎస్‌యూవీ విభాగం 60 శాతం వాటాను కలిగి ఉంది. ఎంట్రీ లెవల్‌ కార్ల అమ్మకాలు తగ్గుతూనే ఉన్నాయి. 2018–19 జూలై–సెప్టెంబర్‌లో నమోదైన 1.38 లక్షల యూనిట్ల గరిష్ట స్థాయితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంట్రీ లెవల్‌ కార్ల హోల్‌సేల్స్‌ 35,000 యూనిట్లకు పడిపోయాయి. ఎంట్రీ లెవల్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లోనూ ఇదే ట్రెండ్‌ ఉంది. గ్రామీణ డిమాండ్‌ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం ఇందుకు కారణం. కాగా, సెప్టెంబర్‌ నెలలో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్‌ వెహికిల్స్‌ గతేడాదితో పోలిస్తే 3,55,043 నుంచి 2 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 17,35,199 నుంచి 17,49,794 యూనిట్లకు, త్రీవీలర్లు 50,626 నుంచి 74,418 యూనిట్లను తాకాయి. అన్ని విభాగాల్లో కలిపి సెప్టెంబర్‌లో హోల్‌సేల్‌ అమ్మకాలు 20,93,286 నుంచి 21,41,208 యూనిట్లకు పెరిగాయి.   

క్షీణించిన ఎగుమతులు
భారత్‌ నుంచి వాహన ఎగుమతులు ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలో 22,11,457 యూనిట్లు నమోదైంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం తగ్గుదల. వివిధ దేశాలలో భౌగోళిక రాజకీయ, ద్రవ్య సంక్షోభాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అర్థ భాగంలో ఎగుమతులు క్షీణించాయని వాహన పరిశ్రమల సంఘం సియామ్‌ సోమవారం తెలిపింది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ఎగుమతులు 5 శాతం వృద్ధితో 3,36,754 యూనిట్లకు పెరిగాయి.

టూ వీలర్లు 20 శాతం తగ్గి 16,85,907 యూనిట్లు, త్రీవీలర్లు 2,12,126 నుంచి 1,55,154 యూనిట్లకు, వాణిజ్య వాహనాలు 25 శాతం పడిపోయి 31,864 యూనిట్లకు వచ్చి చేరాయి. ప్రధానంగా రెండు కారణాల వల్ల ఎగుమతులు ఒత్తిడికి గురవుతున్నాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ అగర్వాల్‌ తెలిపారు. మొదటిది కొన్ని ప్రాంతాలలో భౌగోళిక రాజకీయ సమస్యలు, రెండవది పలు భౌగోళిక ప్రాంతాలలో ఫారెక్స్‌ నిల్వలపై ఒత్తిడి ఉందని చెప్పారు. రూపాయి పరంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో సహా చాలా పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎగుమతులు మున్ముందు మెరుగుపడతాయని. భావిస్తున్నామని ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement