Automobile dealers
-
టాప్‌గేర్‌లో వాహనాల స్పీడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 యూనిట్ల వాహనాలు రోడ్డెక్కాయి. 2023 ఫిబ్రవరిలో ఈ సంఖ్య 17,94,866 యూనిట్లు నమోదైంది. రిటైల్ విక్రయాలు గత నెలలో 13 శాతం పెరిగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) గురువారం తెలిపింది. ‘భారత్‌లో ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు రిటైల్‌లో 12 శాతం దూసుకెళ్లి 3,30,107 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 13 శాతం ఎగసి 14,39,523 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 5 శాతం అధికమై 88,367 యూనిట్లు, త్రీవీలర్లు ఏకంగా 24 శాతం పెరిగి 94,918 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల విక్రయాలు 11 శాతం ఎగసి 76,626 యూనిట్లుగా ఉంది. ప్యాసింజర్ వాహనాలు 2024 ఫిబ్రవరి నెలలో గరిష్ట విక్రయాలను నమోదు చేశాయి’ అని ఎఫ్ఏడీఏ వివరించింది. ‘కొత్త ఉత్పత్తుల వ్యూహాత్మక పరిచయం, మెరుగైన వాహన లభ్యత ప్యాసింజర్ వాహనాల అమ్మకాల జోరుకు కారణమైంది. టూవీలర్ల విషయంలో గ్రామీణ మార్కెట్లు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, విస్తృత ఉత్పత్తి లభ్యత, వెల్లువెత్తిన ఆఫర్లు వృద్ధిని నడిపించాయి. -
తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించండి
న్యూఢిల్లీ: ఆటోమొబైల్స్ డీలర్లు.. వాహనాల తుక్కు కేంద్రాలను కూడా ప్రారంభించాలని కేంద్ర రహదారులు, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యుయల్ వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, అలాగే హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉందని అయిదో ఆటో రిటైల్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఎదగడంలో ఆటో డీలర్లు కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న భారత్.. వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉందన్నారు. దేశాన్ని టాప్ ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దడం తన కల అని ఆయన చెప్పారు. -
వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..
దేశంలోని వాహన డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆటోమొబైల్స్ డీలర్లు కూడా వాహనాల స్క్రాపింగ్ సౌకర్యాలను తెరవాలని కోరారు. ఐదో ఆటో రిటైల్ కాంక్లేవ్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తోందని, తదనుగుణంగా వాహన స్క్రాపింగ్ సౌకర్యాలను ప్రారంభించడానికి ప్రభుత్వం డీలర్లకు అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రత్యామ్నాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, దేశాన్ని గ్రీన్ హైడ్రోజన్‌లో అతిపెద్ద తయారీదారుగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఆటో డీలర్లు ముఖ్యమైన పాత్ర పోషించాలని గడ్కరీ పిలుపునిచ్చారు. ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో, వాణిజ్య వాహనాల తయారీలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌ను ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా మార్చడమే తన కల అని గడ్కరీ పేర్కొన్నారు. -
వాహన విక్రయాల్లో 10 శాతం వృద్ధి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూలైలో అన్ని వాహన విభాగాల్లో కలిపి రిటైల్‌లో 17,70,181 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ‘2022 జూలైతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 4 శాతం ఎగసి 2,84,064 యూనిట్లు నమోదైంది. ద్విచక్ర వాహనాలు 8 శాతం ఎగసి 12,28,139 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాలు 2 శాతం అధికమై 73,065 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 74 శాతం, ట్రాక్టర్ల విక్రయాలు 21 శాతం అధికమయ్యాయి. టూ వీలర్ల రంగంలో ఎంట్రీ లెవల్ కేటగిరీ అమ్మకాలు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే రానున్న రోజుల్లో రిటైల్ వృద్ధి అవకాశాలపై పరిశ్రమ ఆశాజనకంగా ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్లో వృద్ధి నిలకడగా ఉంటుంది. సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 50 రోజుల మార్కును మించాయి. ఎంట్రీ లెవల్ కార్ల సెగ్మెంట్లో మందగమనం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది. ఇదే జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిపై ప్రభావం చూపవచ్చు’ అని ఫెడరేషన్ తెలిపింది. -
వాహన రుణాలు రూ.5.09 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వ్యవస్థలో మొత్తం వాహన రుణాలు మే నాటికి రూ.5.09 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది మే నాటికి ఉన్న రూ.4.16 లక్షల కోట్లతో పోలిస్తే ఏడాదిలో 22 శాతం పెరిగాయి. 2021 మే నాటికి ఈ మొత్తం రూ.3.65 లక్షల కోట్లుగా ఉండడం గమనించొచ్చు. అంతకుముందు ఏడాది కంటే గతేడాది వాహన రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. ఆర్బీఐ గతేడాది మే నుంచి వడ్డీ రేట్లను క్రమంగా సవరించడం మొదలు పెట్టి, ఈ ఏడాది ఫిబ్రవరిరి వరకు మొత్తం మీద 2.5 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. అయినప్పటికీ వాహన విక్రయాలు పెద్ద ఎత్తున పెరగడం వాహన రుణాలకు సైతం డిమాండ్‌ను తీసుకొచి్చంది. ఈ ఏడాది జూన్‌కు సంబంధించి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య విడుదల చేసిన గణాంకాలను పరిశీలించినా, అన్ని విభాగాల్లో వాహన విక్రయాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఆటో రిటైల్ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ బలంగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ కన్వార్ గుప్తా తెలిపారు. కార్ల ధరలు, రుణాల రేట్లు పెరిగినప్పటికీ వాహన డిమాండ్ ఆరోగ్యంగా ఉన్నట్టు పేర్కొన్నా రు. అయితే కారు కొనుగోలు వ్యయం పెరిగినందున వాహన విచారణలు, విక్రయాల గణాంకాలు సమీప కాలానికి ఎలా ఉంటాయో పర్యవేక్షించాల్సి ఉందన్నారు. సెమీకండక్టర్ సరఫరా కొంత స్థిరపడినప్పటికీ, ఇక ముందూ సరఫరా పరంగా కొరత ఓఈఎంలను ఆందోళనకు గురి చేయవచ్చని గుప్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఆదాయాలు ఆకాంక్షలు పెరగడం, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి వల్ల కార్లకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు ఆండ్రోమెడా సేల్స్, ఆప్నాపైసా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి.స్వామినాథన్ వివరించారు. ఆధునిక డిజైన్, ఫీచర్లతో నూతన కార్లను విడుదల చేస్తుండడంతో వీటి ధరల్లోనూ పెరుగుదల కనిపిస్తున్నట్టు చెప్పారు. కార్ల రుణాలకు ఎంతో ఆదరణ కనిపిస్తోందని, సగటు వాహన రుణం మొత్తం కూడా పెరిగినట్టు తెలిపారు. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితం వైపు అడుగులు వేస్తుండడం, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో, అది వారి రుణ అర్హతను ఇతోధికం చేస్తుంది. దీనికి అదనంగా రుణ లభ్యతను ఫిన్‌టెక్ కంపెనీలు మరింత సులభతరం చేస్తున్నాయి. దీంతో వ్యక్తులు సులభంగా రుణాలు పొందేలా చేస్తోంది’’ అని స్వామినాథన్ వివరించారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల విస్తరణతో, సాధారణ వర్షపాతం అంచనాలు, ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాతో ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉంటుందని, ఇది ఆటో విక్రయాలకు మేలు చేస్తుందని పరిశ్రమ భావిస్తోంది. -
రోడ్డెక్కిన 2,11,20,441 వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2,11,20,441 యూనిట్లు. భారత రోడ్లపైకి 2022 సంవత్సరంలో కొత్తగా దూసుకొచ్చిన వాహనాల సంఖ్య ఇది. 2021లో అమ్ముడైన 1,83,21,760 యూనిట్లతో పోలిస్తే ఇది 15.28 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 17 శాతం అధికం. కోవిడ్ ముందస్తు సంవత్సరం 2019తో పోలిస్తే 10 శాతం తగ్గుదల నమోదైంది. ఇక 2022లో ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం కొత్త శిఖరాలను తాకిందని ఎఫ్ఏడీఏ వివరించింది. ఆశించిన స్థాయిలో వృద్ధి లేదు.. ‘అక్టోబర్, నవంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదైనప్పటికీ డిసెంబర్లో తగ్గుముఖం పట్టడంతో ద్విచక్ర వాహన విభాగం మరోసారి ఆకట్టుకోవడంలో విఫలమైంది. ద్రవ్యోల్బణం, యాజమాన్య ఖర్చు అధికం కావడం, గ్రామీణ మార్కెట్ ఇంకా పూర్తిగా పుంజుకోకపోవడం, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన అమ్మకాలు పెరగడం వంటి కారణాలతో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ కలిగిన ద్విచక్ర వాహన విభాగంలో ఇంకా ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించలేదు’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈవీలు మూడంకెల వృద్ధి.. గతేడాది దేశవ్యాప్తంగా రిటైల్‌లో ద్విచక్ర వాహనాలు 1,53,88,062 యూనిట్లు విక్రయం అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13.37 శాతం వృద్ధి నమోదైంది. ప్యాసింజర్ వెహికిల్స్ 16.35 శాతం అధికమై 34,31,497 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం అమ్మకాల్లో దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. కోవిడ్ కారణంగా తిరోగమనం చెందిన త్రిచక్ర వాహన విభాగం రికవరీ అయింది. 2019తో పోలిస్తే అంతరం తగ్గింది. 2021తో పోలిస్తే త్రీ–వీలర్లు విక్రయాలు 71.47 శాతం ఎగసి 6,40,559 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహన అమ్మకాలు మూడంకెల వృద్ధి సాధించాయి. దీంతో ఈ విభాగంలో ఈవీల వాటా 50 శాతం మించింది. ట్రాక్టర్లు.. జీవిత కాల రికార్డు.. ట్రాక్టర్ల విక్రయాలు వరుసగా మూడేళ్లను మించి 2022లో 7.94 లక్షల యూనిట్లతో జీవిత కాల రికార్డు నమోదు చేశాయి. మెరుగైన రుతుపవణాలు, రైతుల వద్ద నగదు లభ్యత, వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర, ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల కొనుగోళ్లు ఇందుకు కారణం. వాణిజ్య వాహనాలు 6,55,696 నుంచి 31.97 శాతం దూసుకెళ్లి 8,65,344 యూనిట్లకు ఎగశాయి. కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్ మొత్తం 2022లో వృద్ధి చెందుతూనే ఉంది. 2019 స్థాయిలో అమ్మకాలు ఉన్నాయి. తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్సీవీ), భారీ వాణిజ్య వాహనాలు (హెచ్‌సీవీ), బస్‌లు, నిర్మాణ రంగ యంత్రాల్లో డిమాండ్‌కు తోడు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ విభాగాన్ని వృద్ధి బాటలో కొనసాగించాయి. ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించాలి.. ‘వాహన తయారీ సంస్థలు డిసెంబరులో సాధారణ ధరలను పెంచాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ ధరలను సవరించాయి. ఇది కాకుండా బీఎస్–6 రెండవ దశ నిబంధనలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అన్ని వాహన విభాగాల్లో ధరల పెంపుదల ఉంటుంది. దీనిని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ప్రత్యేక పథకాలను ప్రకటించాలి. తద్వారా రిటైల్ అమ్మ కాలు ఊపందుకుంటాయి’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. -
‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’
న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్ సదస్సులో నమూనా డీలర్ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది. ‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు. విదేశీ ఓఈఎంలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్ పార్టుల స్టాక్‌లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్ మోటర్స్, 2021లో ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
'ఫోర్డ్' పంచాయితీలో సాయం చేయండి: ఎఫ్ఏడీఏ
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీలర్లకు తగు పరిహారం అందేలా సహాయం చేయాలని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ, కేంద్ర ప్రభుత్వానికి కోరుతోంది. డీలర్ల కోసం ఫోర్డ్ ఇండియా తయారు చేస్తున్న పరిహార ప్రణాళికను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే కు ఓ లేఖ రాశారు. డీలర్లకు పరిహార స్వరూపాన్ని నిర్ణయించే విషయంలో ఎఫ్ఏడీఏ ప్రతిపాదించే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే విధంగా ఫోర్డ్ ఇండియాను ఆదేశించాలని గులాటీ ఆ లేఖలో కేంద్రాన్ని కోరారు. పరిహార ప్యాకేజీలాంటిదేమీ ప్రకటించకుండానే నాన్–డిస్క్లోజర్ అగ్రిమెంట్ (ఎన్డీఏ) మీద సంతకాలు చేయాలంటూ డీలర్లను ఫోర్డ్ ఇండియా బలవంత పెడుతోందని గులాటీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలర్లు, కస్టమర్లతో పాటు ఆయా డీలర్‌షిప్‌లలో పనిచేస్తున్న సిబ్బంది ప్రయోజనాలను కూడా పరిరక్షించేందుకు చొరవ చూపాలని కేంద్రాన్ని గులాటీ కోరారు. గడిచిన పదేళ్లలో భారత మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాలు నమోదు చేసిన ఫోర్డ్.. ఇక్కడి తమ తయారీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, ఇకపై దిగుమతి చేసుకున్నవే విక్రయిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు! -
అమ్మకాల జోరు, ఏ వాహనాల్ని ఎక్కువగా కొన్నారంటే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జూలైలో వాహన అమ్మకాలు జోరుగా సాగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం విక్రయాలు అధికమై 15,56,777 యూనిట్లు నమోదయ్యాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. ప్రయాణికుల వాహనాలు 63 శాతం పెరిగి 2,61,744 యూనిట్లు, ద్విచక్ర వాహనాలు 28 శాతం అధికమై 11,32,611, వాణిజ్య వాహనాలు రెండున్నరెట్లు ఎగసి 52,130 యూనిట్లకు చేరుకున్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం వృద్ధి చెంది 82,388 యూనిట్లుగా ఉంది. సెమికండక్టర్ల కొరత ప్రయాణికుల వాహన విభాగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. -
అక్టోబర్‌లో తగ్గిన ప్యాసింజర్ వాహన అమ్మకాలు
ముంబై: సప్లై సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్లు మందగించడంతో అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు 9 శాతం క్షీణించినట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ తెలిపింది. మొత్తం 1,464 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల్లో(ఆర్టీఓ)1,257 ఆఫీసుల నుంచి సేకరించిన వెహకిల్ రిజిస్ట్రేషన్ గణాంకాల ప్రకారం ఎఫ్ఏడీఏ రిటైల్ వాహన అమ్మకాల డేటాను విడుదల చేసింది. సమీకరించిన గణాంకాల ప్రకారం ఈ అక్టోబర్‌లో మొత్తం 2,49,860 పాసింజర్ల వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,73,980 యూనిట్లతో పోలిస్తే ఇవి 9 శాతం తక్కువ. ఇదే అక్టోబర్‌లో టూ–వీలర్స్ అమ్మకాలు 27 శాతం క్షీణించి 10,41,682 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఈ విక్రయాలు 14,23,394 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహన విక్రయాలు 30 శాతం పతనమై 44,480 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 64.5 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 55శాతం క్షీణించాయి. మొత్తం అన్ని విభాగపు అమ్మకాలు 24శాతం క్షీణించి 14,13,549 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే అక్టోబర్‌లో మొత్తం అమ్మకాలు 18,59,709గా ఉన్నాయి. పండుగ సందర్భంగా వాహన రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నప్పటికీ., వార్షిక ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు తక్కువగానే నమోదయ్యాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. ‘‘కరోనా ప్రభావంతో డీలర్లు డిమాండ్‌కు తగ్గట్లు కొత్త వేరియంట్ల కొనుగోళ్లకు, అధిక నిల్వలను పెంచుకునేందుకు ఆసక్తి చూపలేకపోయారు. అలాగే గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తక్కువ డిస్కౌంట్ల ప్రకటన అమ్మకాలపై ప్రభావాన్ని చూపింది’’ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటి తెలిపారు. -
వాహన విక్రయాలు.. 50 శాతం డౌన్!
ఆటోమొబైల్ డీలర్లకు కరెన్సీ షాక్ పెద్ద నోట్ల రద్దుతో సగానికి పడిపోరుున అమ్మకాలు ద్విచక్రవాహనాలు, కార్లపై తీవ్ర ప్రభావం దాదాపు రూ.350 కోట్ల మేర స్తంభించిన లావాదేవీలు సిటీబ్యూరో : పెద్ద నోట్ల రద్దు కొత్త వాహన విక్రయాలకు కళ్లెం వేసింది. గత వారం, పది రోజులు గా గ్రేటర్లో వాహనాల అమ్మకాలు సగానికి సగం పడిపోయారుు. వ్యక్తిగత వాహనాలపై నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. పెద్ద మొత్తంలో డ్రా చేసేందుకు అవకాశం లేకపోవడం, పాత నోట్లను తీసుకొనేందుకు ఆటోమొబైల్ డీలర్లు నిరాకరిస్తుండడంతో వినియోగదారులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, ఉప్పల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టారుు. ఒకవైపు నోట్ల రద్దు, మరోవైపు నవంబర్, డిసెంబర్ ఏడాది చివరి నెలలు కావడంతో ఆటోమొబైల్ రంగంలో స్తబ్ధత నెలకొంది. నోట్ల రద్దు ప్రభావమే ఎక్కువగా ఉందని, ఏడాది చివరి ప్రభావం డిసెంబర్లో మాత్రమే కనిపిస్తుందని పలువురు ఆటోమొబైల్ డీలర్లు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈ నెలలో నోట్ల రద్దు కారణంగా సుమారు రూ.350 కోట్లకు పైగా ఆటోమొబైల్ వ్యాపారం స్తంభించినట్లు డీలర్లు చెబుతున్నారు. 50 శాతం తగ్గిన అమ్మకాలు... గ్రేటర్ హైదరాబాద్‌లో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తదితర రవాణా రంగానికి చెందిన వాహనాలను విక్రరుుంచే ప్రధాన ఆటోమొబైల్ డీలర్లు సుమారు 150 మంది ఉంటారు. సబ్‌డీలర్లు, షోరూమ్‌లు అన్నీ కలిపి 500 లకు పైగా వాహన విక్రయ కేంద్రాలు ఉన్నారుు. ప్రతి ఆర్టీఏ పరిధిలో రోజుకు 150 నుంచి 250 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఖైరతాబాద్ ఆర్టీఏలో సగటున 250 నుంచి 300 వాహనాలు నమోదవుతుండగా నగర శివార్లలోని ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి ఆర్టీఏల్లో సగటున 150 నుంచి 170 వరకు కొత్త వాహనాలు నమోదవుతున్నారుు. నగరంలోని అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల పరిధిలో మొత్తంగా ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతారుు. ఆటోమొబైల్ డీలర్లు, రవాణా అధికారుల అంచనాల మేరకు ప్రతి నెలా సుమారు 25000 ద్విచక్ర వాహనాలు, 70ఁఊ00 వరకు కార్ల విక్రయాలు జరుగుతారుు. కానీ ఈ నెలలో ఇప్పటి వరకు కేవలం 6 వేల ద్విచక్ర వాహనాలు, మరో 1500 కార్లు మాత్రమే విక్రరుుంచినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన ఏకంగా 407 వాహనాలు నమోదు కాగా, ఈ నెల 15వ తేదీన 209 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. సికింద్రాబాద్ ఆర్టీఓలో ఈ నెల 10వ తేదీన కేవలం 75 వాహనాలు నమోదయ్యారుు. బహదూర్‌పురా ఆర్టీఏలో ఈ నెల 11న 47 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ కావడం గమనార్హం. అలాగే నగర శివార్లలోని మేడ్చల్ ఆర్టీఏలో ఈ నెల 6న 354 వాహనాలు నమోదు కాగా పెద్ద నోట్ల రద్దు అనంతరం 11వ తేదీన 145 వాహనాలు మాత్రమే నమోదయ్యారుు. నగదు చెల్లింపులకు అవకాశం లేకపోవడమే.. కార్లు, ఇతర మోటారు వాహనాల కంటే ద్విచక్ర వాహనాల అమ్మకాలే ఎక్కువగా ఉంటారుు. 80 శాతం వినియోగదారులు బ్యాంకు రుణాలపైనే వాహనాలను కొనుగోలు చేస్తారు. రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు నగదు రూపంలో డౌన్‌పేమెంట్ చెల్లించి మిగతా మొత్తానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. కానీ పెద్ద నోట్ల రద్దు అనంతరం బ్యాంకు లావాదేవీల్లో స్తబ్దత నెలకొనడం, పాతనోట్లు చెల్లకపోవడం, పెద్ద మొత్తంలో కొత్త నోట్లు లభించకపోవడంతో వాహనాల కొనుగోళ్లు మందగించారుు. అలాగే కార్ల కొనుగోళ్లపైన కూడా ఇదేవిధమైన ప్రభావం కనిపిస్తుంది. పాతనోట్లతో పన్ను చెల్లింపులతో ఊరట... ఇలా ఉండగా, ఈ నెల 24వ తేదీ వరకు పాత రూ.500, రూ.1000 నోట్లతో జీవితకాల పన్నులు, త్రైమాసిక పన్నులు చెల్లించేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించడంతో కొంత మేరకు ఊరట లభించిందని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. వాహనదారులు ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ పన్నులు చెల్లించవచ్చు. అలాగే షోరూమ్‌ల నుంచి కూడా జీవితకాల పన్ను చెల్లింపునకు అనుమతి లభించింది. -
పన్ను కాడ..‘లెక్క’ తేడా!
వాహనాల జీవితకాల పన్ను చెల్లింపులో అక్రమాలు 14కు బదులు 12 శాతమే చెల్లింపు ఆటో మొబైల్ డీలర్ల మోసాలు ఆర్టీఏ పరిశీలనలో వెల్లడి సిటీబ్యూరో: వాహనాల జీవిత కాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లింపులో కొందరు ఆటో మొబైల్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖకు 14 శాతం జీవిత కాల పన్ను చెల్లించవలసి ఉంటుంది. కొందరు డీలర్లు వాటి ధరలను రూ.10 లక్షల కంటే తక్కువగా చూపుతూ 12 శాతం లైఫ్‌ట్యాక్స్ మాత్రమే చెల్లిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్టరైన రెండు కార్లపైన సుమారు రూ.68 వేల వరకు పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. దీంతో రవాణా శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో జీవిత కాల పన్ను చెల్లింపులో అక్రమాలపై తనిఖీలు చేపట్టాలని రవాణా కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కూకట్పల్లి, ఖైరతాబాద్, తదితర ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో మరో 15 వాహనాలపైన కూడా డీలర్లు ఇదే తరహాలో లక్షలాది రూపాయల మేర పన్ను ఎగవేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు రూ.కోట్లలో ఉండి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా మరింత లోతుగా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇన్వాయిస్లలో మార్పు కార్లు, ఇతర తేలికపాటి మోటారు వాహనాలపై రవాణా శాఖ రెండు రకాల జీవిత కాల పన్ను విధిస్తోంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన కార్లకువాటి ధరలో 14 శాతం... అంతకంటే తక్కువ ఖరీదైన వాటిపై 12 శాతం చొప్పున చెల్లించవలసి ఉంటుంది. ఈ వెసులుబాటును అవకాశంగా తీసుకొని కొందరు డీలర్లు వాహనాల ఇన్వాయిస్లో రూ.9.90 లక్షలుగా నమోదు చేశారు. ఈ మేరకు వాహనం కొనుగోలు చేసిన వ్యక్తికి అసలు ధరతో కూడిన ఇన్వాయిస్ అందజేసి... ఆర్టీఏకు మాత్రం సవరించిన ఇన్వాయిస్ మేరకు జీవిత కాల పన్ను చెల్లించారు. కొనుగోలుదారులకు, ఆర్టీఏ అధికారులకు అనుమానం రాకుండా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులతో తమ జేబులు నింపుకున్నారు. ఇలా నమోదైన రెండు వాహనాలపై అనుమానం రావడంతో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు వాహనాల అసలు ధరల పట్టికను తెప్పించుకొని పరిశీలించారు. రూ.11 లక్షల ఖరీదైన వాహనాల ఇన్వాయిస్లను రూ.9.95 లక్షల చొప్పున సృష్టించినట్లు గుర్తించారు. ఒక్కో వాహనంపై రూ.1.54 లక్షల లైఫ్‌ట్యాక్స్ చెల్లించవలసి ఉండగా... తప్పుడు ఇన్వాయిస్లతో రూ.1.20 లక్షలు మాత్రమే చెల్లించారు. దీంతో మోసానికి పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన రవాణా కమిషనర్‌కు విన్నవించారు. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కమిషనర్ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు ఆదేశించారు. పునరావృతం కాకుండా చర్యలు ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా రవాణా శాఖ కార్యాచరణకు దిగింది. వాహనాల తయారీదారులు నిర్ణయించిన ధరలు.. వాటి ప్రకారం చెల్లించవలసిన జీవిత కాల పన్ను వివరాలు రవాణా శాఖ వెబ్సైట్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ధరల వివరాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నప్పుడే పన్ను చెల్లింపుల్లోనూ పారదర్శకత ఉంటుందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు అక్రమాలకు పాల్పడిన డీలర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై రాష్ట్రవ్యాప్త తనిఖీలు పూర్తయిన తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కోట్లలో వ్యాపారం... సర్కారుకు సున్నం!
♦ పన్ను చెల్లింపులో ఆటోమొబైల్ డీలర్ల చేతివాటం ♦ కొనుగోలుదారుల నుంచి 14.5% పన్ను వసూళ్లు ♦ చెల్లింపుల్లో మాత్రం తప్పుడు లెక్కలు ♦ 300 డీలర్ల ఎగవేత సొమ్మే రూ. 25 కోట్లు ♦ ఏటా సుమారు రూ. 100 కోట్ల ఎగవేత ♦ 900 మంది డీలర్ల మూడేళ్ల లెక్కల సేకరణలో అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆటోమొబైల్ డీలర్లు సర్కారుకు పన్ను చెల్లింపులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పేరున్న టూ వీలర్, త్రీ, ఫోర్ వీలర్ కంపెనీల డీలర్లతోపాటు జిల్లాల్లోని ట్రాక్టర్, ట్రక్ డీలర్లు కొనుగోలుదారుల నుంచి వ్యాట్ పేరుతో భారీగా పన్ను వసూళ్లు చేస్తున్నప్పటికీ దానిని ప్రభుత్వానికి చెల్లించే సమయంలో మాత్రం తప్పుడు లెక్కలు చూపుతున్నారు. దీనిపై ఇటీవల దృష్టిసారించిన వాణిజ్యపన్నులశాఖ కళ్లు చెదిరే వాస్తవాలు తెలుసుకుంది. నెలకు రూ. 1,000 కోట్ల వరకు వ్యాపారం చేసే ఆటోమొబైల్ డీలర్లు ఏటా కనీసం రూ. 100 కోట్ల వరకు వాణిజ్యపన్నులశాఖకు ఎగనామం పెడుతున్నట్లు తేలింది. ఆర్టీవో ఆఫీసుల నుంచి వివరాల సేకరణ.. రాష్ట్రంలో విక్రయించిన ప్రతి వాహనం రవాణాశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ మేరకు గత మూడేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను వాణిజ్యపన్నులశాఖ అధికారులు సేకరించారు. తద్వారా ఏయే డీలర్లు ఎన్ని కోట్ల విలువైన వాహనాలను విక్రయించి ఎంత పన్ను చెల్లించారనే విషయాలను విశ్లేషించారు. వాహనాల బేసిక్ ధర, యాక్సెసరీస్‌తోపాటు వ్యాట్ మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్న డీలర్లు పూర్తిస్థాయిలో పన్ను చెల్లించడం లేదని తేల్చారు. పది వాహనాలు విక్రయిస్తే వాటిలో కొన్నింటి వ్యాట్‌ను చెల్లించడం లేదని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్యపన్నులశాఖ డిప్యూటీ కమిషనర్లు ఆయా జిల్లాల్లో మూడేళ్లలో జరిగిన ఆటోమొబైల్ విక్రయాలు, చెల్లించిన పన్ను వివరాలను కమిషనర్ అనిల్ కుమార్‌కు శనివారం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 900 మంది డీలర్లు ఉండగా వారిలో కేవలం 300 మందికి సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తేనే ఒక సంవత్సరంలో రూ. 25 కోట్ల వరకు పన్ను చెల్లించలేదని తేలినట్లు సమాచారం. ఈ లెక్కన ఏటా సుమారు రూ. 100 కోట్ల వరకు ఆటోమొబైల్ వ్యాపారులు పన్ను చెల్లించడం లేదని అంచనా. ఈ నేపథ్యంలో మూడేళ్లలో 900 మంది డీలర్లు ఎంత మేర ఎగ్గొట్టారనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, వాణిజ్యపన్నులశాఖ చేపట్టిన చర్యల గురించి తెలిసిన కొందరు డీలర్లు బకాయిలను స్వచ్ఛందంగా చెల్లించేం దుకు ముందుకు వచ్చినట్లు తెలియవచ్చింది. ఎగవేతదారుల నుంచి పన్నుతోపాటు కనీసం 25 శాతం అపరాధ రుసుము వసూలు చేయనున్నట్లు వాణిజ్యపన్నులశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
హ్యాండ్లింగ్ దోపిడీ
ఆటో మొబైల్ షోరూంల మాయాజాలం ఇన్వాయిస్లో చూపకుండా వాహనానికి రూ.5 వేల బాదుడు ఏటా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు పలు షోరూమ్‌లపై సస్పెన్షన్ విధించిన ఆర్టీఏ సిటీబ్యూరో : నగరంలో రోజుకు కనీసం 600 కొత్త వాహనాల అమ్మకాలు.... ప్రతి వాహనంపైన ‘హ్యాండ్లింగ్ చార్జీల’ పేరిట రోజుకు రూ. 30 లక్షల వసూళ్లు మొత్తంగా ఏటా కొనుగోలుదారుల నుంచి రూ.90 కోట్ల వరకు లూటీ కొత్త వాహనం కోసం షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారులపై ఆటోమోబైల్ డీలర్లు హ్యాండ్లింగ్ చార్జీల పేరిట కొనసాగిస్తున్న అక్రమ వసూళ్లపర్వం ఇది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్లు, గోడౌన్ నుంచి వాహనాన్ని షోరూమ్ వరకు తరలించినందుకు (దీన్ని ప్రాసెసింగ్ అంటారు.)అయిన ఖర్చుతో పాటు అన్నీ కలిపి ఒక్కో వాహనదారుడి నుంచి ‘హ్యాండ్లింగ్ చార్జీల’ రూపంలో సగటున రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నారు. కొత్తవాహనం కోసం షోరూమ్‌కు వెళ్లిన వినియోగదారుడి సంతోషాన్ని ఆవిరి చేస్తూ షోరూమ్ నిర్వాహకులు వారి జేబులు లూటీ చేస్తున్నారు. నగరంలోని సుమారు175 షోరూమ్‌లుండగా...మెజారిటీ షోరూమ్‌లలో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మోసానికి పాల్పడుతున్న పలు షోరూమ్‌లపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాటికి ఉన్న అధికారాన్ని సస్పెండ్ చేసింది. దోపిడీ పర్వం ఇలా.... సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం బజాజ్ పల్సర్ వాహనం కోసం ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. కానీ హ్యాండ్లింగ్ చార్జీలు, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. కానీ ఇన్వాయిస్లో మాత్రం హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం ఎక్కడా కనిపించదు. రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నగరంలో ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న 600 వాహనాలలో 400 ద్విచక్ర వాహనాలు ఉంటే. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. ఆ తరువాత కొనుగోలు సమయంలో ఠంచన్‌గా హ్యాండ్లింగ్ చార్జీలు తెర మీదకు వస్తాయి. అప్పటికే వాహనం కొనుక్కోవడానికి సిద్ధపడిన వినియోగదారుడు అనివార్యంగా అడిగినంతా చెల్లించవలసి వస్తుంది. ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు నిలువునా దోచుకుంటున్నాయి. ఇలా వాహనాల నుంచి రూ.5000 చొప్పున ప్రతి రోజు 600 వాహనాల పై వసూలు చేస్తున్న హ్యాండ్లింగ్ చార్జీలు రూ.30 లక్షలకు చేరుతున్నాయి.నెలకు రూ.7.5 కోట్లు, సంవత్సరానికి రూ.90 కోట్ల వరకు షోరూమ్‌ల ఖాతాలో చేరిపోతున్నాయి. తాత్కాలిక సస్పెన్షన్ ... ఇలా మోసానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన 3 షోరూమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ వెల్లడించారు. వాటికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ అధికారాన్ని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయండి ఇన్వాయిస్లో నమోదైన ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా, తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల పేరిట, ఆర్టీఏకు చెల్లించాలనే నెపంతో ఎలాంటి అదనపు వసూళ్లకు పాల్పడినా మా అధికారులకు ఫిర్యాదు చేయండి. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ సంయుక్త రవాణా అధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించండి. లేదా ప్రాంతీయ రవాణా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. - రఘునాథ్, జేటీసీ