హ్యాండ్లింగ్ దోపిడీ | suspension imposed on the showroom | Sakshi
Sakshi News home page

హ్యాండ్లింగ్ దోపిడీ

Published Mon, Nov 23 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

హ్యాండ్లింగ్ దోపిడీ

హ్యాండ్లింగ్ దోపిడీ

ఆటో మొబైల్ షోరూంల మాయాజాలం
ఇన్‌వాయిస్‌లో చూపకుండా వాహనానికి రూ.5 వేల బాదుడు
ఏటా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు
పలు షోరూమ్‌లపై సస్పెన్షన్ విధించిన ఆర్టీఏ
 

సిటీబ్యూరో  : నగరంలో రోజుకు కనీసం 600 కొత్త వాహనాల అమ్మకాలు.... ప్రతి వాహనంపైన ‘హ్యాండ్లింగ్ చార్జీల’ పేరిట రోజుకు రూ. 30 లక్షల వసూళ్లు  మొత్తంగా  ఏటా  కొనుగోలుదారుల నుంచి  రూ.90 కోట్ల వరకు  లూటీ
 
కొత్త వాహనం కోసం షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారులపై ఆటోమోబైల్ డీలర్లు  హ్యాండ్లింగ్ చార్జీల పేరిట కొనసాగిస్తున్న అక్రమ వసూళ్లపర్వం ఇది.  వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌లు, గోడౌన్ నుంచి  వాహనాన్ని  షోరూమ్ వరకు తరలించినందుకు (దీన్ని ప్రాసెసింగ్ అంటారు.)అయిన ఖర్చుతో పాటు అన్నీ కలిపి ఒక్కో  వాహనదారుడి నుంచి ‘హ్యాండ్లింగ్ చార్జీల’ రూపంలో  సగటున  రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నారు. కొత్తవాహనం కోసం షోరూమ్‌కు వెళ్లిన వినియోగదారుడి సంతోషాన్ని ఆవిరి చేస్తూ  షోరూమ్ నిర్వాహకులు  వారి జేబులు లూటీ చేస్తున్నారు. నగరంలోని సుమారు175 షోరూమ్‌లుండగా...మెజారిటీ షోరూమ్‌లలో  ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది.  ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మోసానికి పాల్పడుతున్న  పలు షోరూమ్‌లపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లపై వాటికి ఉన్న  అధికారాన్ని సస్పెండ్ చేసింది.

దోపిడీ పర్వం ఇలా....
సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం  బజాజ్ పల్సర్  వాహనం కోసం  ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. కానీ హ్యాండ్లింగ్ చార్జీలు, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. కానీ ఇన్‌వాయిస్‌లో మాత్రం  హ్యాండ్లింగ్ చార్జీలు  అనే పదం  ఎక్కడా  కనిపించదు.

రూ.60 వేల  బైక్ నుంచి  రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.   నగరంలో ప్రతిరోజు  కొత్తగా నమోదవుతున్న  600 వాహనాలలో 400 ద్విచక్ర వాహనాలు ఉంటే. మిగతా  200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. ఆ తరువాత కొనుగోలు సమయంలో ఠంచన్‌గా హ్యాండ్లింగ్ చార్జీలు తెర మీదకు వస్తాయి. అప్పటికే వాహనం కొనుక్కోవడానికి సిద్ధపడిన వినియోగదారుడు అనివార్యంగా అడిగినంతా చెల్లించవలసి వస్తుంది. ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే  సాధారణ  డ్రైవర్లను సైతం  షోరూమ్‌లు నిలువునా దోచుకుంటున్నాయి. ఇలా వాహనాల నుంచి రూ.5000 చొప్పున  ప్రతి రోజు 600 వాహనాల పై వసూలు చేస్తున్న హ్యాండ్లింగ్ చార్జీలు రూ.30 లక్షలకు చేరుతున్నాయి.నెలకు రూ.7.5 కోట్లు, సంవత్సరానికి రూ.90 కోట్ల వరకు షోరూమ్‌ల ఖాతాలో చేరిపోతున్నాయి.

తాత్కాలిక సస్పెన్షన్ ...
ఇలా మోసానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన 3 షోరూమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్  సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్  వెల్లడించారు. వాటికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ అధికారాన్ని సస్పెండ్ చేసినట్లు  పేర్కొన్నారు.
 
ఫిర్యాదు చేయండి

ఇన్‌వాయిస్‌లో నమోదైన ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా, తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్‌ల పేరిట, ఆర్టీఏకు చెల్లించాలనే నెపంతో ఎలాంటి అదనపు వసూళ్లకు పాల్పడినా  మా అధికారులకు  ఫిర్యాదు చేయండి. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ సంయుక్త రవాణా అధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించండి. లేదా ప్రాంతీయ రవాణా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి.
 - రఘునాథ్, జేటీసీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement