
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాల అమ్మకాలపై రకరకాల చార్జీలు, ఫీజుల రూపంలో వాహనదారులను నిలువునా దోచుకొనే వాహన షోరూమ్‌లపైన చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తెలంగాణ రవాణాశాఖ సన్నద్ధమైంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాహనాల అమ్మకాలపైన హ్యాండ్లింగ్ చార్జీలు (handling charges), ఆర్టీఏ చార్జీల పేరిట రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. గోడౌన్‌లలో ఉన్న వాహనాలను షోరూమ్ వరకు తరలించి వినియోగదారుడికి విక్రయించేందుకు హ్యాండ్లింగ్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు.
అలాగే వాహనాల రిజిస్ట్రేషన్‌లపైన సుమారు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహన వినియోగదారులపైన నిలువు దోపిడీకి పాల్పడే ఆటోమొబైల్ డీలర్లపైన కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రవాణాశాఖ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అథరైజేషన్‌ను సస్పెండ్ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జీవిత కాలపు పన్ను (life time tax) చెల్లింపుల్లో, వాహనదారుడు రెండవ వాహనం కొనుగోలు చేసే సమయంలో విధించాల్సిన అదనపు జీవిత కాలపు పన్నుపైన కచ్చితమైన నిబంధనలు పాటించవలసిందేనన్నారు.
పన్ను చెల్లింపుల్లో కొందరు డీలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాహనదారులు తాము బండి కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడినా రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. షోరూమ్‌లలో హ్యాండ్లింగ్ చార్జీల కోసం డిమాండ్ చేస్తే నేరుగా రవాణా కమిషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అలాంటి డీలర్లను, షోరూమ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమగ్రమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్‌గౌడ్ స్పష్టం చేశారు.
మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన సంస్థపై కేసు
బంజారాహిల్స్: ప్రఖ్యాత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మించి మోసగించిన సంస్థ యజమానితో పాటు ఇద్దరు ఉద్యోగులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్ నగరానికి చెందిన సురేంద్రకుమార్ చంద్రాకర్ తన కుమారుడు ఆకర్ష్ చంద్రాకర్‌కు ఎంబీబీఎస్ సీటు కోసం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సైబర్ హైట్స్‌లో ఉన్న శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్‌ను సంప్రదించాడు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి రాకేష్ శైనీ మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ సురేంద్రకుమార్‌ను నమ్మించి గత ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాడు.
శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ అధినేత రాఘవేంద్రశర్మతో ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. చత్తీస్‌ఘడ్ బిలాయ్‌లో ఉన్న శంకరాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని ఈ సంస్థ అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్ శైనీ, గిరీష్ రూపానీలు నమ్మబలికి రూ.10,74,167 డీడీ కూడా తీసుకున్నారు. బిలాయ్‌లోని శంకరాచార్య మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా కూడా వెల్లడించారు. అయితే సురేంద్రకుమార్ కుమారుడు ఆకర్ష్‌కు నీట్ పరీక్షలో భాగంగా విశాఖపట్టణంలో మెడికల్ సీటు వచ్చింది. దీంతో తాను ఇచ్చిన రూ.10.74 లక్షల డీడీని తిరిగి ఇవ్వాలని సురేంద్రకుమార్ కోరారు. దీంతో ఈ సంస్థ అధినేతతో పాటు మిగతా ఉద్యోగులు స్పందించలేదు.
చదవండి: 9999 @ రూ.9.37 లక్షలు
తాను ఇచ్చిన డీడీని టోలిచౌకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) నుంచి డ్రా చేసుకున్నారని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకరాచార్య మెడికల్ కాలేజీ పేరుతో డూప్లికేట్ అకౌంట్ తెరిచి తాను ఇచ్చిన డీడీని ఈ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ కార్యాలయం గత ఏడాది అక్టోబర్ 29 నుంచి మూతపడి ఉండగా, దీని అధినేత రాఘవేంద్రశర్మ పరారీలో ఉన్నాడు. ఈ విషయంలో బాధితుడు చత్తీస్‌ఘడ్‌లో కూడా వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్‌తో పాటు శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ, దీని అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్‌శైనీ, గిరీష్ రూపానీలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment