Handling charges
-
Jayanti Chauhan: ఆసక్తి లేని పని ఆమెకు వద్దట
వారసులు వారసత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహపడతారు. యువరాజులు కిరీటం కోసం వెంపర్లాడతారు. ఆసక్తి లేని పని చేయనక్కర్లేదని సామ్రాజ్యాలను వదలుకుంటారా ఎవరైనా? 32 ఏళ్ల జయంతి చౌహాన్. 7000 కోట్ల బిస్లరీ వాటర్ సామ్రాజ్యానికి ఏకైక యువరాణి. ‘నాకు ఆసక్తి లేదు’ అని చైర్ పర్సన్ పదవిని నిరాకరించింది. దీని వల్ల సంస్థను టాటా పరం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తృప్తినిచ్చే పని చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు. కాని తృప్తినిచ్చే పనిలోనే ఆనందం ఉందని ఆమె సందేశం ఇస్తోంది. ఈ కాలపు యువత ఈ మాట ఆలకించాల్సిందే. ఇదంతా ఒక జానపద కథలాగే ఉంది. పూర్వం ఎవరో ఒక రాజు తన రాజ్యం మొత్తాన్ని ఏకైక కుమార్తె చేతిలో పెడదామనుకుంటే ‘నాకు వద్దు నాన్నా. నాకు హాయిగా సెలయేళ్ల మధ్య గడుపుతూ, చిత్రలేఖనం చేసుకుంటూ, పూ లతల మధ్య ఆడుకోవాలని ఉంది’ అని ఆ కూతురు అంటే రాజు ఏమంటాడు? రాజ్యం ఏమవుతుంది? ‘జల సామ్రాజ్యం’ లేదా ‘ఆక్వా కింగ్డమ్’గా అందరూ పిల్చుకునే ‘బిస్లరీ’ సంస్థకు ఇప్పుడు ఆ పరిస్థితే ఎదురైంది. దాని అధినేత రమేష్ చౌహాన్ తన సంస్థను అనివార్యంగా టాటాకు అప్పజెప్పనున్నాడు. రేపో మాపో ఇది జరగనుంది. 7000 కోట్లకు సంస్థ చేతులు మారుతుంది. పూర్తి మార్పుకు మరో రెండేళ్లు పడుతుంది. అంతవరకూ సంస్థ భారాన్ని 82 ఏళ్ల రమేష్ చౌహాన్ మోయక తప్పదు. కారణం ఏమిటి? ‘నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. నా కుమార్తె జయంతికి సంస్థ పగ్గాలు స్వీకరించడంలో ఆసక్తి లేదు. సంస్థ అమ్మేయదల్చుకోవడం బాధాకరమే. కాని టాటా సంస్థకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయి. అదైతే నా సంస్థను బాగా చూసుకుంటుందని భావిస్తున్నాను. వారి వైపే నా మనసు మొగ్గుతున్నది’ అని రమేష్ చౌహాన్ అన్నాడు. పార్లే బ్రదర్స్‌లో ఒకరైన రమేష్ చౌహాన్ 1993లో తన సొంత సాఫ్ట్డ్రింక్లైన థమ్సప్, సిట్రా, మాజా, గోల్డ్స్పాట్లను కోకాకోలాకు విక్రయించాడు. ఇప్పుడు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ అయిన బిస్లరీని అమ్మేయబోతున్నాడు. కారణం కూతురు జయంతికి ఉన్న కళాత్మక ఆసక్తులే. మనకు ఏది ఇష్టం? జయంతి నుంచి ఏం నేర్చుకోవచ్చు? ఏది మనసుకు బాగా నచ్చుతుందో ఆ పని చేయాలి. అందరికీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. కాని కుదిరే అవకాశం వచ్చినప్పుడు తప్పక నిర్ణయం తీసుకోవాలి. చాలా మంది జీవితం గడిచిపోయాక ‘నేను ఇది కాదు చేయాలనుకున్నది. నాకు అవకాశం కూడా వచ్చింది. కాని వేరే దారిలో వెళ్లిపోయాను. చాలా అసంతృప్తిగా ఉంది’ అనడం వింటూ ఉంటాము. ఆ రియలైజేషన్ వచ్చేలోపు జీవితం గడిచిపోయి ఉంటుంది. అదే సమయంలో మన అభిరుచులు, ఆసక్తులు అన్ని వేళలా ఆర్థిక సమీకరణాలకు లొంగేలా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నా జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నప్పుడు సొంత మార్గం ఎంచుకోవడంలో తప్పు ఏముంది? ఐ.టి. ఉద్యోగాన్ని వదులుకుని వ్యవసాయం చేసేవారు, ఐ.పి.ఎస్. ఉద్యోగాన్ని వదిలి సంఘసేవ చేసేవారు ఉన్నారు. ఒక స్పష్టతతోనే జయంతి బిస్లరీని వద్దనుకుని ఉంటుంది. ఆ స్పష్టత ఉంటే ఎవరైనా తమకు ఇష్టమైన రంగంలో పని చేస్తూ ఆనందకరమైన జీవితం గడపవచ్చు. డబ్బు వల్ల మాత్రమే ఆనందం లభించదని జయంతి చెబుతోంది కదా. ఎవరు జయంతి? జయంతి చౌహాన్ (37) రమేష్ చౌహాన్‌కు ఒక్కగానొక్క కూతురు. ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆ తర్వాత మొదట న్యూయార్క్‌లో, ఆ తర్వాత లండన్‌లో, ఆ పైన ఇటలీలో చదువుకుంది. ప్రాడక్ట్ డెవలప్మెంట్తో పాటు ఫ్యాషన్ స్టైలింగ్ కూడా చదువుకుంది. దాంతోపాటు లండన్‌లో ‘స్కూల్ ఆఫ్ ఓరియెంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ (లండన్ యూనివర్సిటీ) నుంచి అరబిక్ భాష నేర్చుకుంది. అరబిక్ భాష నేర్చుకోవడం ఒక భిన్న అభిరుచి అని చెప్పవచ్చు. ఆమెకు ఇదొక్కటే కాదు... ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. ప్రయాణాలు ఇష్టపడుతుంది. జంతు ప్రేమ ఉంది. అంత పెద్ద వ్యాపార సంస్థకు వారసురాలైనా చక్కగా ఒక ఆటో ఎక్కి రోడ్డు పక్కన బంతిపూలు కొనుక్కుంటూ కనిపిస్తుంది. ఆమెకు రంగులు అంటే ఇష్టం. మంచి బట్టలు ఇష్టం. భావు కత్వంతో జీవించడం ఇష్టం. అలా అని ఆమెకు వ్యాపార దక్షత లేదనుకుంటే పొరపాటు. చదువు పూర్తయిన వెంటనే 24 ఏళ్ల వయసులో సంస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పని చేయడం మొదలుపెట్టింది. మొదట ఢిల్లీ కార్యాలయంలో చేసి ఆ తర్వాత ముంబై ఆఫీస్‌కు హెడ్ అయ్యింది. జయంతి చేరాక హెచ్.ఆర్, మార్కెటింగ్, సేల్స్‌లో సమూలమైన మార్పులు తెచ్చింది. పోటీదారుల చొరబాటును ఎదుర్కొనడానికి ‘బ్లూ’ కలర్ నుంచి బిస్లరీ రంగును ‘ఆకుపచ్చ’కు మార్చింది. సంస్థలో ఆధునిక యాంత్రికీకరణలో దూకుడు ప్రదర్శించింది. ఇప్పుడు సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉంది. ఇంత సాధించిన కుమార్తె సంస్థ పగ్గాలు చేపడుతుందని తండ్రి ఆశించడం సహజం. కాని జయంతి తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. బహుశా ఆమె మనసు ఇందులో లేదు. ఆమెకు తృప్తినిచ్చే పని ఇది కాకపోవచ్చు. అందుకే ఆమె ఇంత సామ్రాజ్య కిరీటాన్ని వద్దనుకుంది. -
హ్యాండ్లింగ్ దోపిడీ
ఆటో మొబైల్ షోరూంల మాయాజాలం ఇన్వాయిస్లో చూపకుండా వాహనానికి రూ.5 వేల బాదుడు ఏటా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు పలు షోరూమ్‌లపై సస్పెన్షన్ విధించిన ఆర్టీఏ సిటీబ్యూరో : నగరంలో రోజుకు కనీసం 600 కొత్త వాహనాల అమ్మకాలు.... ప్రతి వాహనంపైన ‘హ్యాండ్లింగ్ చార్జీల’ పేరిట రోజుకు రూ. 30 లక్షల వసూళ్లు మొత్తంగా ఏటా కొనుగోలుదారుల నుంచి రూ.90 కోట్ల వరకు లూటీ కొత్త వాహనం కోసం షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారులపై ఆటోమోబైల్ డీలర్లు హ్యాండ్లింగ్ చార్జీల పేరిట కొనసాగిస్తున్న అక్రమ వసూళ్లపర్వం ఇది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్లు, గోడౌన్ నుంచి వాహనాన్ని షోరూమ్ వరకు తరలించినందుకు (దీన్ని ప్రాసెసింగ్ అంటారు.)అయిన ఖర్చుతో పాటు అన్నీ కలిపి ఒక్కో వాహనదారుడి నుంచి ‘హ్యాండ్లింగ్ చార్జీల’ రూపంలో సగటున రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నారు. కొత్తవాహనం కోసం షోరూమ్‌కు వెళ్లిన వినియోగదారుడి సంతోషాన్ని ఆవిరి చేస్తూ షోరూమ్ నిర్వాహకులు వారి జేబులు లూటీ చేస్తున్నారు. నగరంలోని సుమారు175 షోరూమ్‌లుండగా...మెజారిటీ షోరూమ్‌లలో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మోసానికి పాల్పడుతున్న పలు షోరూమ్‌లపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాటికి ఉన్న అధికారాన్ని సస్పెండ్ చేసింది. దోపిడీ పర్వం ఇలా.... సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం బజాజ్ పల్సర్ వాహనం కోసం ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. కానీ హ్యాండ్లింగ్ చార్జీలు, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. కానీ ఇన్వాయిస్లో మాత్రం హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం ఎక్కడా కనిపించదు. రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నగరంలో ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న 600 వాహనాలలో 400 ద్విచక్ర వాహనాలు ఉంటే. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. ఆ తరువాత కొనుగోలు సమయంలో ఠంచన్‌గా హ్యాండ్లింగ్ చార్జీలు తెర మీదకు వస్తాయి. అప్పటికే వాహనం కొనుక్కోవడానికి సిద్ధపడిన వినియోగదారుడు అనివార్యంగా అడిగినంతా చెల్లించవలసి వస్తుంది. ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు నిలువునా దోచుకుంటున్నాయి. ఇలా వాహనాల నుంచి రూ.5000 చొప్పున ప్రతి రోజు 600 వాహనాల పై వసూలు చేస్తున్న హ్యాండ్లింగ్ చార్జీలు రూ.30 లక్షలకు చేరుతున్నాయి.నెలకు రూ.7.5 కోట్లు, సంవత్సరానికి రూ.90 కోట్ల వరకు షోరూమ్‌ల ఖాతాలో చేరిపోతున్నాయి. తాత్కాలిక సస్పెన్షన్ ... ఇలా మోసానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన 3 షోరూమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ వెల్లడించారు. వాటికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ అధికారాన్ని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయండి ఇన్వాయిస్లో నమోదైన ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా, తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల పేరిట, ఆర్టీఏకు చెల్లించాలనే నెపంతో ఎలాంటి అదనపు వసూళ్లకు పాల్పడినా మా అధికారులకు ఫిర్యాదు చేయండి. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ సంయుక్త రవాణా అధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించండి. లేదా ప్రాంతీయ రవాణా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. - రఘునాథ్, జేటీసీ -
బండి కంటే బాదుడే
=వాహనదారుల నుంచి ఏటా రూ.90 కోట్లు దోపిడీ..! =హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో షోరూమ్ నిర్వాహకుల దందా =ఆర్టీఏ కనుసన్నల్లోనే అక్రమార్జన =ప్రేక్షక పాత్రలో రవాణా శాఖ అధికారులు సాక్షి, సిటీబ్యూరో : పండక్కి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులను షోరూమ్‌ల ‘బాదుడు’ బెంబేలెత్తిస్తోంది. హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో ఒక్కో వాహనానికి సగటున రూ.5,000 చొప్పున చేస్తున్న వసూళ్లు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రవాణా శాఖ కనుసన్నల్లో, ఆర్టీఏ అధికార యంత్రాంగం అండదండలతోనే గ్రేటర్లో వాహన షోరూమ్‌ల నిర్వాహకులు యథేచ్ఛగా నిలువు దోపిడీ సాగిస్తున్నారు. గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ల పేరిట సాగించిన దందాకు కొంతకాలంగా ‘హ్యాండ్లింగ్ చార్జీలు’ అనే ట్యాగ్ తగిలించి తమ దోపిడీ పర్వాన్ని కొత్తరూపంలో కొనసాగిస్తున్నారు. కొత్తబండి అంటేనే వినియోగదారులు హడలిపోయేలా బాదేస్తున్నారు. నగర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఉన్న షోరూమ్‌లు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నా రవాణా శాఖకు పట్టకపోవడం గమనార్హం. దోపిడీ పర్వం ఇలా.... మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన రమేష్ దీపావళి సందర్భంగా కొత్తగా బజాజ్ పల్సర్ వాహనం కొనుగోలు చేసేందుకు సోమాజిగూడలోని ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. హ్యాండ్లింగ్ చార్జీలు, వాహనం ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు చెల్లించవలసి వచ్చింది. కానీ అతనికి ఇచ్చిన ఇన్వాయిస్ కాపీలో హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని అతను షోరూమ్ నిర్వాహకులను అడిగాడు. ‘ఆర్టీఏ ఖర్చుల’ కోసమే ఆ డబ్బులు తీసుకున్నట్లు వారు వెల్లడించడంతో ఆ వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఇది ఒక్క రమేష్ అనుభవం మాత్రమే కాదు. నగరంలోని ఏ షోరూమ్‌కు వెళ్లినా... రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్లు కొనుగోలు చేసినా హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏలో చెల్లించాలంటూ నిర్వాహకులు బాహటంగానే వినియోగదారుల జేబులకు చిల్లులు వేస్తున్నారు. ఆర్టీఏ ప్రేక్షకపాత్ర గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్, మెహదీపట్నం, బహదూర్‌పురా, కర్మన్‌ఘాట్, మేడ్చెల్ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 600 కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. వీటిలో 400 ద్విచక్రవాహనాలు ఉంటే.. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట వాహనం బుకింగ్ కోసం వెళ్లిన వినియోగదారుడికి నిర్వాహకులు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవితకాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరసకైనా హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. కానీ వినియోగదారుడు వాహనం కొనుగోలు చేసేందుకు సిద్ధపడి డబ్బులు చెల్లించే సమయంలో ఠంచనుగా ఇవి తెర పైకి వస్తాయి. దాంతో మరో గత్యంతరం లేక వారు అడిగినంతా చెల్లించవలసి వస్తోంది. ద్విచక్రవాహనాలు, కార్లపై సగటున రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆఖరికి ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు వదలటం లేదు. బాహటంగానే ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ రవాణా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మరోవైపు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే మోటారు వాహన ఇన్స్పెక్టర్లు, షోరూమ్‌లకు చెందిన బ్రోకర్లతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని ఈ అక్రమ బాగోతానికి ఊతమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా షోరూమ్‌ల దోపిడీ పర్వంలో ఆర్టీఏ సైతం భాగస్వామి కావడం వల్లనే ఈ అక్రమ వ్యాపారం నిర్నిరోధంగా సాగిపోతోందనే విమర్శలు బలంగా ఉన్నాయి.