=వాహనదారుల నుంచి ఏటా రూ.90 కోట్లు దోపిడీ..!
=హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో షోరూమ్ నిర్వాహకుల దందా
=ఆర్టీఏ కనుసన్నల్లోనే అక్రమార్జన
=ప్రేక్షక పాత్రలో రవాణా శాఖ అధికారులు
సాక్షి, సిటీబ్యూరో : పండక్కి కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులను షోరూమ్‌ల ‘బాదుడు’ బెంబేలెత్తిస్తోంది. హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో ఒక్కో వాహనానికి సగటున రూ.5,000 చొప్పున చేస్తున్న వసూళ్లు వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రవాణా శాఖ కనుసన్నల్లో, ఆర్టీఏ అధికార యంత్రాంగం అండదండలతోనే గ్రేటర్‌లో వాహన షోరూమ్‌ల నిర్వాహకులు యథేచ్ఛగా నిలువు దోపిడీ సాగిస్తున్నారు.
గతంలో వాహనాల రిజిస్ట్రేషన్ల పేరిట సాగించిన దందాకు కొంతకాలంగా ‘హ్యాండ్లింగ్ చార్జీలు’ అనే ట్యాగ్ తగిలించి తమ దోపిడీ పర్వాన్ని కొత్తరూపంలో కొనసాగిస్తున్నారు. కొత్తబండి అంటేనే వినియోగదారులు హడలిపోయేలా బాదేస్తున్నారు. నగర వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ఉన్న షోరూమ్‌లు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నా రవాణా శాఖకు పట్టకపోవడం గమనార్హం.
దోపిడీ పర్వం ఇలా....
మలక్‌పేట్ ప్రాంతానికి చెందిన రమేష్ దీపావళి సందర్భంగా కొత్తగా బజాజ్ పల్సర్ వాహనం కొనుగోలు చేసేందుకు సోమాజిగూడలోని ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. హ్యాండ్లింగ్ చార్జీలు, వాహనం ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు చెల్లించవలసి వచ్చింది. కానీ అతనికి ఇచ్చిన ఇన్వాయిస్ కాపీలో హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇదే విషయాన్ని అతను షోరూమ్ నిర్వాహకులను అడిగాడు.
‘ఆర్టీఏ ఖర్చుల’ కోసమే ఆ డబ్బులు తీసుకున్నట్లు వారు వెల్లడించడంతో ఆ వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఇది ఒక్క రమేష్ అనుభవం మాత్రమే కాదు. నగరంలోని ఏ షోరూమ్‌కు వెళ్లినా... రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్లు కొనుగోలు చేసినా హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో దోపిడీ ఇష్టారాజ్యంగా సాగుతోంది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏలో చెల్లించాలంటూ నిర్వాహకులు బాహటంగానే వినియోగదారుల జేబులకు చిల్లులు వేస్తున్నారు.
ఆర్టీఏ ప్రేక్షకపాత్ర
గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, ఉప్పల్, అత్తాపూర్, మెహదీపట్నం, బహదూర్‌పురా, కర్మన్‌ఘాట్, మేడ్చెల్ ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 600 కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. వీటిలో 400 ద్విచక్రవాహనాలు ఉంటే.. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. గ్రేటర్‌లో 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి.
మొదట వాహనం బుకింగ్ కోసం వెళ్లిన వినియోగదారుడికి నిర్వాహకులు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవితకాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరసకైనా హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. కానీ వినియోగదారుడు వాహనం కొనుగోలు చేసేందుకు సిద్ధపడి డబ్బులు చెల్లించే సమయంలో ఠంచనుగా ఇవి తెర పైకి వస్తాయి. దాంతో మరో గత్యంతరం లేక వారు అడిగినంతా చెల్లించవలసి వస్తోంది. ద్విచక్రవాహనాలు, కార్లపై సగటున రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది.
ఆఖరికి ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు వదలటం లేదు. బాహటంగానే ఈ వ్యవహారం జరుగుతున్నప్పటికీ రవాణా అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. మరోవైపు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లు, షోరూమ్‌లకు చెందిన బ్రోకర్లతో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకొని ఈ అక్రమ బాగోతానికి ఊతమిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా షోరూమ్‌ల దోపిడీ పర్వంలో ఆర్టీఏ సైతం భాగస్వామి కావడం వల్లనే ఈ అక్రమ వ్యాపారం నిర్నిరోధంగా సాగిపోతోందనే విమర్శలు బలంగా ఉన్నాయి.