ఫిర్యాదులపై ఎట్టకేలకు స్పందించిన రవాణా శాఖ
ఎన్‌ఐసీ విచారణలో నాణ్యత లేదని వెల్లడి
కార్డులు సరఫరా చేసిన నోయిడాకు చెందిన సంస్థపై వేటు.. ఇక రవాణాశాఖ టెండర్లలో పాల్గొనకుండా డిబార్
సాక్షి, హైదరాబాద్: వాహనదారులకు తెలంగాణ రవాణా శాఖ సరఫరా చేస్తున్న స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ వాడుతున్న వ్యవహారం వెలుగు చూసింది. స్మార్ట్ కార్డులు సకాలంలో రాకపోవడం, అందిన కార్డుల్లోనూ నాణ్యత లేకపోవటంపై చాలాకాలంగా ఫిర్యాదులు వస్తున్నా, రవాణాశాఖ సరిగ్గా స్పందించలేదు. చివరకు ఆ ఫిర్యాదుల ఆధారంగా ఇప్పుడు ఎట్టకేలకు విచారణ జరిపింది. జారీ అయిన కార్డుల్లో నాణ్యత లేని చిప్స్ ఉన్నాయన్న విషయాన్ని శాస్త్రీయంగా తెలుసుకొని చర్యలకు ఉపక్రమించింది.
తెలంగాణ రవాణా శాఖకు లైసెన్సులు, ఆర్‌సీ కార్డులకు సంబంధించి స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్న నోయిడాకు చెందిన సంస్థను బాధ్యతల నుంచి తప్పించింది. తదుపరి రవాణాశాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా డిబార్ చేయటం విశేషం. వాహన లైసెన్సులు, ఆర్‌సీ కార్డులకు సంబంధించి కొన్నేళ్లుగా రవాణాశాఖ చిప్స్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే.
స్కాన్ చేయగానే పూర్తి వాహనం, లైసెన్సు వివరాలను తెలిపే సమాచారాన్ని అందించే చిప్స్‌ను స్మార్ట్ కార్డుల్లో నిక్షిప్తం చేసి జారీ చేస్తున్నారు. టెండర్ల ద్వారా ఈ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు రవాణా శాఖ అప్పగించింది. అలా ఢిల్లీ సమీపంలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న మెజర్స్ కలర్‌ప్లాస్ట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్మార్ట్ కార్డుల జారీ టెండర్ దక్కించుకుంది.
కానీ, చాలాకాలంగా ఆ సంస్థ కార్డులను సరిగ్గా జారీ చేయటం లేదు. స్మార్ట్ కార్డు రుసుము, పోస్టల్ చార్జీలు చెల్లించినా నెలల తరబడి కార్డులు సరఫరా కాక వాహనదారులు టెన్షన్ పడాల్సి వస్తోంది. దీనిపై అధికారులను ప్రశి్నస్తే, కార్డులు జారీ అవుతాయని చెప్పటం, తప్ప వాస్తవాలు వెల్లడించటం లేదు.
ఆ ఫిర్యాదుతో....
ఇటీవలే మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ది సేఫ్ కమ్యూనిటీ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ నుంచి రవాణా శాఖకు గత మే నెలలో ఫిర్యాదు అందింది. తమకు జారీ అయిన స్మార్ట్ కార్డుల్లో నాణ్యత లేదన్నది దాని సారాంశం. దీంతో రవాణాశాఖ కొన్ని కార్డులను సేకరించి స్మార్ట్ కార్డ్ ఆపరేటింగ్ సిస్టం నిబంధనల మేరకు కార్డుల్లో నాణ్యత ఉందో లేదో తేల్చాలని ఎన్‌ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్)ని కోరింది.
శాంపిల్ కార్డులను పరిశీలించిన ఎన్‌ఐసీ, కొన్ని కార్డుల్లోని చిప్స్‌లో నాణ్యత లేదని తేల్చి నివేదిక అందించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ, ఆ కార్డులను సరఫరా చేసిన నోయిడాలోని సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తేలి్చ, ఇప్పుడు చర్యలకు ఉపక్రమించింది.
కార్డుల జారీకి సంబంధించి రవాణా శాఖతో చేసుకున్న ఒప్పందంలోని అంశాలకు విరుద్ధంగా వ్యవహరించినందున, తదుపరి రవాణా శాఖకు సంబంధించి ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా ఆ సంస్థను డిబార్ చేస్తున్నట్టు రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు, టెండర్ ఒప్పందాలను ఉల్లంఘించినందుకు ఆ సంస్థపై చట్టపరంగా చర్యలు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment