సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంక్షేమ పథకాల అమలులో పూర్తి పారదర్శకత కోసం తెలంగాణ సర్కారు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ (విశిష్ట గుర్తింపు కార్డు) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి పౌరుడికీ విశిష్ట ప్రయోజనాలున్న సరికొత్త ‘స్మార్ట్ కార్డు’ ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేసే రేషన్ సరుకుల పంపిణీ మొదలు సామాజిక పింఛన్లు, విద్యార్థుల ఆర్థిక సాయం తదితర సంక్షేమ పథకాల ఫలాలన్నీ ఈ కార్డు ఆధారంగానే అందించే దిశగా చర్యలు వేగిరం చేస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ అంశం అతిత్వరలో కార్యరూపం దాల్చనుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రతి వ్యక్తికీ కార్డు..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ రేషన్ కార్డుల ఆధారంగా కొనసాగుతున్నాయి. కొత్తగా సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చే క్రమంలోనూ రేషన్ కార్డుల గణాంకాలే కీలకం. కానీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు చేరడంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలు అరికట్టి కేవలం లబ్ధిదారుడికి మాత్రమే ప్రయోజనం కలిగేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం కుటుంబానికి ఒక రేషన్ కార్డు ఉండగా.. ఈ స్థానంలో ఇకపై ప్రతి వ్యక్తికి స్మార్ట్‌కార్డు ఇవ్వనున్నారు. దాదాపు ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ తరహాలోనే ఈ స్మార్ట్‌కార్డులను జారీ చేయనున్నారు. జిల్లా యంత్రాంగంతో ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్స్‌పల్ కార్యదర్శి రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లకు సంబంధించి జిల్లా అధికారులు పలు సందేహాలు అడగగా ఆయన కొత్త స్మార్ట్‌కార్డుల అంశాన్ని వివరించారు.
ఆధార్‌తో అనుసంధానం..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతా నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. దీంతో లబ్ధిదారుడికి చేరాల్సిన సంక్షేమ ఫలాలకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఖాతాకు చేరుతాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ కార్డులు సైతం ఆధార్ కార్డుతో అనుసంధానమవుతాయి. స్మార్ట్‌కార్డులో ఆధార్ నంబర్‌తోపాటు సంబంధిత వ్యక్తి వివరాలు నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం గ్యాస్ సిలిండర్ రాయితీకి ఆధార్‌ను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు అక్రమాలకు అడ్డుకట్టపడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు స్మార్ట్ కార్డులు, ఆధార్ కార్డుల ద్వారా అమలైతే అక్రమాలను అరిక ట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ స్మార్ట్‌కార్డుల అంశానికి సంబంధించి మరింత స్పష్టత రానుంది.
ప్రతి ఒక్కరికీ స్మార్ట్ కార్డు!
Published Fri, Sep 19 2014 11:17 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement