
సీఎంతో జరిగిన కీలక సమావేశానికి హాజరైన ఆర్టీసీ ఎండీ
సాక్షి, హైదరాబాద్: కేవలం ప్రమోటర్లు, ఇన్‌ఫ్లూ్యయెన్సర్ల దగ్గరే ఆగకుండా బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VS Sajjanar) సైతం కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
సిట్ ఏర్పాటుపై బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఓ కీలక సమావేశం నిర్వహించారు. శాసనసభ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్‌లతోపాటు సజ్జనార్ సైతం పాల్గొన్నారు.
కీలక కేసులు పర్యవేక్షించిన అనుభవం
సజ్జనార్ సీఐడీ ఎస్పీగా ఉన్నప్పుడు మల్టీ లెవల్ మార్కెటింగ్‌పై పోరు ప్రకటించారు. వివిధ సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం రావడానికీ కారణమయ్యారు.
→ సైబరాబాద్ సీపీగా పనిచేసిన రోజుల్లోనూ అనేక బెట్టింగ్ యాప్స్‌పై కేసులు నమోదు చేయించడంతోపాటు వాటి దర్యాప్తుల్ని పర్యవేక్షించారు.
→ ఇటీవల ఆయన సోషల్‌మీడియా వేదికగా చేపట్టిన ‘హ్యష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ #SayNoToBettingApps క్యాంపెయినింగ్ వైరల్‌గా మారింది. దీని కారణంగానే ఆయా యాప్స్, సెలబ్రెటీలు, ఇన్‌ఫ్యూయెన్సర్లపై ఫిర్యాదులు, కేసుల నమోదు తదితర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
→ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి ఏర్పాటు చేసే సిట్‌లో సజ్జనార్‌కు స్థానం కల్పించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. నేరుగా సిట్‌లోకి తీసుకోవడమా? ప్రస్తుతం ఆయనకు ఉన్న బాధ్యతల నేపథ్యంలో సూచనలు, సలహాలతో సిట్ ఏర్పాటు, దర్యాప్తు చేయించడమా? అనేది ఒకట్రెండు రోజుల్లో తేలనుంది.
తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా యాదగిరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయ బీసీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జరిగిన ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షునిగా టి.శేఖర్, అధ్యక్షునిగా తిరందాస్ యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా దీటి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా నవీన్‌కుమార్, ఇతర సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ బిల్లును ఆమోదించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వానికి సంఘీభావంగా నిలుస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో తమవంతు కృషి చేస్తామని, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని సభ్యులంతా తీర్మానించారు.
ఆ రిటైర్డ్ ఉద్యోగులందరూ ఇంటికే: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలోని వివిధ విభాగాలు, కార్పొరేషన్లు, బోర్డులు, ఇతర సంస్థల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరినీ ఈనెల 31లోగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తొలగించాల్సిన వారి జాబితాను ఆయా ప్రభుత్వ శాఖలకు పంపించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (CS Shanti Kumari) ఈనెల 25న అన్ని శాఖలకు లేఖ రాశారు. రిటైర్డ్ అయ్యాక పునర్నియామకం లేదా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన వారందరిని తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఎవరైనా రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సేవలు ఇంకా అవసరమని భావిస్తే ఎందుకు అవసరమో వివరిస్తూ మళ్లీ తాజాగా నియామకానికి అనుమతులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పొదుపు చర్యలు భాగంగా రిటైర్డ్ అధికారులను తొలగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల మేరకు పురపాలక శాఖలోని పలు డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న దాదాపు 177 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
చదవండి: 2030.. కండక్టర్ ఉద్యోగానికి ఏఐ!
జీహెచ్‌ఎంసీలో 50 మందిపై వేటు
ప్రభుత్వ అధికారం, ఉద్యోగం నుంచి రిటైరయ్యాక సైతం వివిధ పేర్లతో మున్సిపల్ పరిపాలన శాఖలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న వారిని వెంటనే పంపించాల్సిందిగా తాజాగా వెలువడిన ఉత్తర్వుతో జీహెచ్‌ఎంసీలోని దాదాపు యాభై మంది ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. జీహెచ్‌ఎంసీలో ఇలా కొనసాగుతున్న వారిలో అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ కమిషనర్, డిప్యూటీ సిటీప్లానర్, సూపరింటెండెంట్, ఆర్‌డీఓ, ఈఈ, సూపరింటెండెంట్‌ల స్థాయిల నుంచి దిగువ స్థాయిల వరకు ఉన్నారు. వీరు రీ అపాయింట్‌మెంట్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ల పేరిట తిరిగి జీహెచ్‌ఎంసీలోనే కొనసాగుతున్నారు.
కొందరు కొన్ని ‘కీ’లక స్థానాల్లో ఉండి చక్రం తిప్పుతున్న వారు సైతం ఉన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు వారి గడువు 2024లోనే ముగిసిపోవాల్సి ఉండగా, చాలామంది ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొందరిని మాత్రం గడువు ముగిసిన వెంటనే ఉండటానికి వీల్లేదంటూ పంపించిన సంబంధిత అధికారులు.. చాలామంది ఇంకా కొనసాగుతున్నా పట్టించుకోలేదు. దీన్ని టాప్ ప్రయారిటీగా పేర్కొంటూ వెంటనే పంపించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంతో వీరు ఇక ఇళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.