
- యాప్స్ దందాలపై ఈడీ నజర్!
- ఇన్‌ఫ్లూయన్సర్లతో లావాదేవీలపై అధికారుల ఆరా
- పంజగుట్ట, మియాపూర్ ఠాణాల నుంచి కేసుల వివరాల సేకరణ
- ‘టార్గెట్ సజ్జనార్’ క్యాంపెయినింగ్ మొదలుపెట్టిన బెట్టింగ్ మాఫియా
పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్‌లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ నిర్వాహకులు– ఇన్‌ఫ్లూయన్సర్ల మధ్య భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పంజగుట్ట పోలీసుస్టేషన్‌లో 11 మందిపై, మియాపూర్ ఠాణాలో 25 మందిపై నమోదైన కేసులపై లోతుగా ఆరా తీస్తోంది. ప్రాథమిక ఆధారాలు లభించిన తర్వాత కేసు నమోదు చేసి, నిందితులను నోటీసులు జారీ చేసి విచారించనుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ప్రారంభించిన ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’తోనే ఈ కథ మొదలైంది. దీంతో ప్రస్తుతం బెట్టింగ్ మాఫియా ఆయనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం మొదలెట్టింది.
ఈ బెట్టింగ్ మాఫియా దందా మొత్తం వ్యవస్థీకృతంగా సాగుతోంది. వీళ్లు అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్ములో దాదాపు 50 శాతం తమ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయన్సర్లకు ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరి సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేసిన లింకు ద్వారా అయితే ఏఏ పంటర్ తమ యాప్‌ను యాక్సెస్ చేశారనేది నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. ఆ వ్యక్తి ద్వారా తమకు వచ్చిన మొత్తంలో 50 శాతం ఇన్‌ఫ్లూయన్సర్‌కు ఇస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఈ లావాదేవీల్లో అత్యధికంగా నగదు రూపంలో హవాలా ద్వారా జరుగుతున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇందులో విదేశీ కోణాన్నీ అనుమానిస్తూ ఆరా తీస్తున్నారు. ఈ యాప్స్‌కు ఉన్న విదేశీ లింకుల పైనా దర్యాప్తు చేయనుంది.
ఆ కేసులన్నీ తిరగదోడేందుకు నిర్ణయం..
బెట్టింగ్ ఉచ్చులో చిక్కి రాష్ట్రంలో 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులన్నీ ఆయా జిల్లాలు, కమిషనరేట్లలో ఆత్మహత్యలుగానే నమోదయ్యాయి. అయితే.. వారి మృతికి బెట్టింగ్ యాప్స్ కారణమని ఆధారాలు సేకరిస్తే... వారే ఆత్మహత్యకు పురిగొల్పినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా కేసులను సమీక్షించి, ఆధారాలు ఉన్న వాటిలో బెట్టింగ్ యాప్స్ గుర్తించి వాటినీ నిందితులుగా చేర్చడానికి కసరత్తు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ నిందితులుగా చేరితే సాంకేతికంగా దాని నిర్వాహకుడు ఆ జాబితాలో చేరతాడు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయన్సర్ల వివరాలు తెలిస్తే వారినీ ఆయా కేసుల్లో నిందితులుగా చేర్చనున్నారు.
ఇన్‌ఫ్లూయన్సర్లను మళ్లీ ప్రయోగిస్తున్న మాఫియా..
బెట్టింగ్ యాప్స్ ద్వారా వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ దందాను గుర్తించిన వీసీ సజ్జనార్ ఇటీవల తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో యుద్ధం ప్రకటించారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం పోలీసులు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆపై సూర్యాపేట అధికారులు బయ్యా సన్నీ యాదవ్‌పై కేసు నమోదు చేయగా.. అతడు విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు పంజగుట్టలో కేసు నమోదు కావడంతో పాటు బెట్టింగ్ యాప్స్ దందాపై పోలీసుల దృష్టిపడింది. దీంతో బెట్టింగ్ మాఫియా సజ్జనార్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. దీనికోసం కొన్ని వీడియోలు చేయడానికి కొందరు ఇన్‌ఫ్లూయన్సర్లతోనూ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరికి చెల్లింపులు కూడా జరిగినట్లు భావిస్తున్నారు.
మెట్రో రైళ్లపై బెట్టింగ్ ప్రకటనల తొలగింపు
కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నట్లు తమ దృష్టికి రావడంతో వెంటనే వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ, సంబంధిత అడ్వర్టటైజ్‌మెంట్ ఏజెన్సీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతో గురువారం రాత్రి మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ వాణిజ ప్రకటనలను పూర్తిగా తీసివేసినట్లు చెప్పారు. డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment