బెట్టింగ్‌ యాప్స్‌పై పోలీసుల స్పెషల్‌ ఫోకస్‌.. వారికి చుక్కలే.. | Betting Apps Victims Sad Comments On Money Lose | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ యాప్స్‌పై పోలీసుల స్పెషల్‌ ఫోకస్‌.. వారికి చుక్కలే..

Published Fri, Mar 21 2025 1:03 PM | Last Updated on Fri, Mar 21 2025 1:54 PM

Betting Apps Victims Sad Comments On Money Lose

సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్‌ యాప్స్‌ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలను తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారు. ఇక, ఒక్కొక్కటిగా బెట్టింగ్‌లకు సంబంధించిన విషాదాలు వెలుగు చూస్తు​న్నాయి. ఏడాదిలో తెలంగాణలో బెట్టింగ్‌కు 25 మందికిపైగా బలయ్యారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

హైదరాబాద్‌లోనే ఎనిమిది మందికిపైగా ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. 2022 నుంచి ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆత్మహత్యలు పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడిన వారి కేసులను పోలీసులు వెలికి తీస్తున్నారు. అలాగే, బెట్టింగ్ యాప్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు. నిర్వాహకులు, ప్రమోటర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.

యాప్స్ ప్రమోషన్స్‌తో.. భారీగా లబ్ధి పొందిన సినీనటులు, ఇన్‌ఫ్లూయెన్సర్లుకు సదరు బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బులు అందాయి, ఏయే మార్గాల్లో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకున్నారనే కోణంలో.. వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.

మరోవైపు.. బెట్టింగ్‌ యాప్స్‌ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బెట్టింగ్ యాప్ ద్వారా 80 లక్షలు పోగొట్టుకున్న నెల్లూరుకు చెందిన రాంబాబు అనే బాధితుడు తాజాగా కీలక విషయాలను వెల్లడించారు. పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేయడంతో నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి ఆవేదన చెప్పుకున్నాడు. ఈ సందర్బంగా బాధితుడు రాంబాబు మాట్లాడుతూ.. ‘హీరోల ప్రమోషన్ చూసే నష్టపోయాను. నేను బెట్టింగ్ యాప్ లో పాల్గొని తప్పు చేశాను. నాకు ఏ శిక్ష పడినా పర్వాలేదు. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోటర్లకు శిక్ష వేయాల్సిందే. అప్పుల వాళ్లు ఊళ్లోకి రానివ్వట్లేదు. ఫోన్ నెంబర్ మార్చుకొని పిచ్చోడిలా తిరుగుతున్నాను. ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవ తీసుకోవడంతో బెట్టింగ్ యాప్‌ల బాగోతం బయటకు వచ్చింది. బెట్టింగ్ యాప్ బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నారు. అమాయకులు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. వచ్చే రోజుల్లో రాజకీయ పార్టీలు బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తామని మేనిఫెస్టోలో పెట్టే రోజులు వస్తాయి’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసిన కేసులో టీవీ యాంకర్‌ విష్ణుప్రియ, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ రీతూచౌదరిలను పంజాగుట్ట పోలీసులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. విష్ణుప్రియను 11 గంటల పాటు విచారించగా.. రీతూచౌదరి విచారణ ఐదున్నర గంటలకుపైగా కొనసాగింది. తొలుత ఇద్దరినీ వేర్వేరుగా.. అనంతరం కలిపి ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మూడు యాప్‌లకు ప్రచారం చేశానని విష్ణుప్రియ అంగీకరించినట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement