56 మంది డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ల తొలగింపు
ఓ అధికారి కనుసన్నల్లో జరిగిన అవినీతి బాగోతం
త్వరలో మరికొందరిపై వేటు
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో కొందరు అధికారులు, ఓ ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలిసి ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు వాహన దారులు కోట్ చేసిన ధరను రహస్యంగా ఉంచాల్సింది పోయి, ఆ మొత్తాన్ని అనుకూల వాహనదారుల చెవిన పడేసి ఆ నంబర్ వారికే దక్కేలా పావులు కదిపారు. ఇలా ఒక్కో నంబర్ కేటాయింపు ద్వారా భారీగా కమీషన్లు దండుకున్నారు.
ఇదంతా ఓ అధికారి కనుసన్నల్లో జరిగిందని తేల్చుకున్న ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు విప్పే పని ఇప్పుడు వేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు భారీగా అక్రమాలను సాగించారని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన ఓ అధికారిపై భారీగా ఫిర్యాదులున్నాయి.
కమిషనర్‌ను కూడా లెక్క చేయకుండా ఆ అధికారే అన్ని చక్కబెట్టేవారన్న ఆరో పణలున్నాయి. సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇదే తరహాలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు వ్యవహారం కూడా చోటుచేసుకుంది. ఆ అధికారికి చెందిన ఓ బినామీ సంస్థ కూడా ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిందని సమాచారం.
రూ.కోట్లలో కమీషన్లు
రవాణా శాఖ కార్యాలయాలకు సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బందిని ఓ అధికారి తన అక్రమాలకు వినియోగించుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. సెంటిమెంటు ఆధారంగా వాహనదారులు తమకు ఇష్టమైన నంబరును పొందేందుకు ఆసక్తి చూపుతారు. 0001, 9999, 0099, 5555... ఇలాంటి నెంబర్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఏటా దాదాపు లక్ష వరకు నంబర్లను వేలంలో ఉంచటం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది.
ఈ నంబర్ల కేటాయింపు బిడ్డింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి నంబరు దక్కుతుంది. రవాణాశాఖ ప్రధాన సర్వర్ వద్ద విధుల్లో ఉండే ప్రైవేటు సంస్థ సిబ్బంది బిడ్డింగ్‌లో కోట్ చేసిన మొత్తాన్ని ఆ అధికారికి చేరవేసేవారు. అప్పటికి బిడ్‌లో నమోదైన గరిష్ట మొత్తాన్ని తెలుసుకుని అనుకూల వాహనదారులకు చేరవేయటం ద్వారా నంబర్ అలాట్ అయ్యే మొత్తం కోట్ చేసేలా చక్రం తిప్పేవారు. ఇలా కోరిన వారికి నంబర్ ఇప్పించి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేసే వారు. అలా ఏటా రూ.కోట్లలో జేబుల్లో వేసుకునేవారు.
ఇప్పుడు దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా కొందరిని గుర్తించింది. ప్రస్తుతానికి 56 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల(డీబీఏ)లను విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. త్వరలో మరికొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమా చారం. సూత్రధారిగా ఉన్న అధికారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment