ఇక నంబర్ ప్లేట్లపై టీఎస్ సిరీస్ | know number plates On TS Series | Sakshi
Sakshi News home page

ఇక నంబర్ ప్లేట్లపై టీఎస్ సిరీస్

Published Sun, Jun 7 2015 4:04 AM | Last Updated on Thu, May 24 2018 1:57 PM

ఇక నంబర్ ప్లేట్లపై టీఎస్ సిరీస్ - Sakshi

ఇక నంబర్ ప్లేట్లపై టీఎస్ సిరీస్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు ఇక ‘టీఎస్’ సిరీస్‌లోకి మారబోతున్నాయి. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించిన రాష్ట్ర ప్రభుత్వం నంబర్ ప్లేట్లపై ‘ఏపీ’ సిరీస్‌ను తుడిచేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్న వాహనాలకు టీఎస్ సిరీస్‌ను జారీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన వాహనాలకు కూడా టీఎస్ సిరీస్‌ను కేటాయించబోతోంది. అలాంటి వాహనాలన్నింటికీ రవాణా శాఖ కొత్తగా ఆర్సీ కార్డులను జారీ చేస్తుంది.

ఇందుకోసం ఒక్కో నంబర్ ప్లేట్ మార్పుపై రవాణా శాఖకు రూ.200 చొప్పున చెల్లించాలి. అలాగే వాహనదారులు కచ్చితంగా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను మాత్రమే బిగించుకోవాలనే నిబంధన విధించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను రవాణా శాఖ సీఎంకు పంపింది.
 
హైసెక్యూరిటీ ప్లేట్లు తప్పనిసరి
సాధారణ నంబర్ ప్లేట్లను తీసేసి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమర్చుకునేందుకు సుప్రీంకోర్టు డిసెంబర్ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వాహనాలు కూడా డిసెంబర్ నాటికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి. కానీ నంబర్ ప్లేట్ల సరఫరా సరిగాలేక దీని అమలు ముందుకు సాగడంలేదు.

ఈ నేపథ్యంలో డిసెంబర్ నాటికి తెలంగాణలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తాజాగా కేంద్రం ఆదేశించింది. దీంతో నంబర్ ప్లేట్ల సరఫరా సంస్థపై రవాణా శాఖ ఒత్తిడి పెంచింది. అయినా సరే డిసెంబర్ నాటికి అన్ని వాహనాలకూ సరిపడా ప్లేట్ల సరఫరా అసాధ్యమని తాజాగా తేల్చారు. దీంతో తెలంగాణకు మరికొన్ని నెలల గడువు ఇవ్వాలని కోరుతూ త్వరలో ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది. అయితే దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వని పక్షంలో డిసెంబర్ గడువను అమలు చేయాలి.

అదే జరిగితే మరికొన్ని కంపెనీలకూ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల తయారీ బాధ్యత అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 40 ల క్షల వాహనాలున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 24 లక్షల వాహనాలున్నాయి. తొలుత హైదరాబాద్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
 
జిల్లా కోడ్.. నంబర్ పాతదే..

తెలంగాణలో తొలి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే నంబర్ ప్లేట్ల మార్పునకు శ్రీకారం చుట్టింది. అన్ని వాహనాలూ టీఎస్ సిరీస్‌లోకి మార్చాల్సిందేనని హుకుం జారీ చేయటంతో కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా ఆ అడ్డంకి తొలగిపోవటంతో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ మార్చేందుకు రవాణా శాఖ కసరత్తు మొదలుపెట్టి సీఎం అనుమతి కోరింది. కొత్త ఆర్సీల జారీకి ఛార్జీగా రూ.200 నిర్ధారించాలని ప్రతిపాదించింది.

అన్ని వాహనాలకూ అదే వర్తిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో.. కొత్త సిరీస్‌లోకి మారే వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవటాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు కూడా అందులో పేర్కొంది. జిల్లాల కోడ్, వాహన నంబర్ పాతదే ఉంటుంది. ప్రస్తుతం ఏపీగా ఉన్న చోట టీఎస్ అన్న అక్షరాలు మాత్రమే కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement