వాహనాల నంబర్ ప్లేట్లు ‘మూసేస్తున్న’ ఉల్లంఘనులు
అదే బాటలో స్నాచర్లు, ఇతర నేరగాళ్లు
వరుస ఉదంతాలతో అప్రమత్తమైన అధికారులు
క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
గత నెలలోనే నగరవ్యాప్తంగా 35 కేసులు రిజిస్టర్
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకు
తమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు.
అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్
ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..
ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.
వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువ
వాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది.
ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.
ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులు
అనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు.
కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్)
Comments
Please login to add a commentAdd a comment