
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్డునెంబర్–8లో నివసించే సినీ హీరో విశ్వక్సేన్(Vishwak Sen) సోదరి గదిలో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు ఆమె తండ్రి సి.రాజు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో(Filmnagar Police Station) ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజు కూతురు మూడో అంతస్తులో ఉంటుంది. తెల్లవారి తన గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆమె ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు బంగారు డైమండ్ ఉంగరాలతో(Diamond) పాటు ఒక హెడ్‌ఫోన్ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి దృష్టికి తీసుకు వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఇంటి ముందు బైక్ పార్కు చేసినట్లుగా గుర్తించారు. సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు వస్తువులు తస్కరించినట్లుగా గుర్తించారు.
సరిగ్గా 20 నిమిషాల్లోనే దొంగిలించిన సొత్తుతో సదరు వ్యక్తి బయటకు రావడం, వెళ్లిపోవడం కూడా సీసీ ఫుటేజీలో నమోదైంది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిలింనగర్ పోలీసులు దొంగ కోసం గాలింపు చేపట్టారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల కదలికలను కూడా గమనిస్తున్నారు. ఇంత ధైర్యంగా గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లడం, దర్జాగా బయటకు వెళ్లిపోవడం చూస్తుంటే ఇది తెలిసిన వారి పని అయి ఉంటుందని భావిస్తున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment