E-challans
-
‘ప్లేట్’ ఫిరాయిస్తే కేసే!
ట్రాఫిక్ ఉల్లంఘనులు నగరంలో రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. జరిమానాలు తప్పించుకోవడానికి నిఘా నేత్రాలు, ట్రాఫిక్ కెమెరాలకుతమ వాహన నంబర్ చిక్కకుండా ఉండేందుకు వాటిని ‘కవర్’ చేస్తున్నారు. దీనికోసం నంబర్ ప్లేట్స్‌కు మాస్కులు తొడగటం, వంచేయడం, విరిచేయడం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఉల్లంఘనులపై పోలీసులు మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధిస్తూ వచ్చారు. అయితే ఈ తరహా ఉల్లంఘనుల్లో మార్పు రాకపోవడం, స్నాచింగ్స్, చోరీలకు పాల్పడేవారు సైతం ఇదే బాటపట్టడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్స్ మూసేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలోనే 35 కేసులు నమోదు చేయించారు. - సాక్షి, హైదరాబాద్ఈ–చలాన్లు తప్పించు కోవాలనే ఉద్దేశంతో..ఈ– చలాన్లు తప్పించుకోవడానికే నంబర్ ప్లేట్లు మూసేసే వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా నాన్–కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విధానాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది తమ చేతిలో ఉన్న డిజిటల్ కెమెరాలతో, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు జంక్షన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాల ఫొటోలు నంబరు ప్లేట్స్‌తో సహా చిత్రీకరిస్తున్నారు.వీటి ఆధారంగా ఆయా ఉల్లంఘనులకు ఈ–చలాన్లు జారీ చేస్తున్నారు. ఈ విధానంలో ఉల్లంఘనులు వినియోగించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్, దాని ఆధారంగా సేకరించే రిజిస్టర్డ్ చిరునామానే కీలకం. కొందరు తమ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లను వివిధ రకాలుగా కవర్ చేస్తూ ట్రాఫిక్ కెమెరాలకు చిక్కుకుండా చేస్తున్నారు. కొందరు నేరగాళ్లు సైతం నంబరు ప్లేట్లు కనిపించకుండా చేసి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలో ఇలా జరిగిన కొన్ని నేరాలను కొలిక్కి తేవడానికి పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ముందు వాటి కంటే వెనుకవే ఎక్కువవాహనాల నంబర్ ప్లేట్స్ ఎదుటి వారికి, సీసీ కెమెరాలకు చిక్కకుండా కవర్ చేయడం అనేది కార్లు వంటి తేలికపాటి వాహనాల కంటే ద్విచక్ర వాహనాలకే ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్లపై ఈ తరహా నంబర్ ప్లేట్‌ను పోలీసులు గుర్తించి ఆపడానికి ప్రయత్నిస్తే బైక్స్ మాదిరిగా ఫోర్ వీలర్స్ వాహనాలు తప్పించుకొని వెళ్లిపోలేవు. దీంతో వారు అలాంటి చర్యల జోలికివెళ్లరు. ద్విచక్ర వాహనాల్లోనూ 90 శాతం వెనుక వైపు నంబర్ ప్లేట్‌కే రూపురేఖలు లేకుండా చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ చేసేప్పుడు రహదారులపై కొన్ని వాహనాలను తనిఖీ చేస్తారు. ముందు ఉండే నంబర్ ప్లేట్ వారికి స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆ వాహనాలను ఆపి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే వెనుక నంబర్ ప్లేట్ అయితే వాహనం ముందుకు వెళ్లిపోయాకే ట్రాఫిక్ పోలీసులకు కనిపిస్తుంది. ఇలా ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడం మొదలెట్టారు. గత నెల వరకు ఐపీసీలోని సెక్షన్ 420 ప్రకారం నమోదు చేయగా, ఈ నెల నుంచి బీఎన్ఎస్లోని సెక్షన్ 318 వినియోగించనున్నారు. ఈ కేసుల్లో నేరం నిరూపణ అయితే ఏడేళ్ల వరకు జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది.ఉద్దేశపూర్వకంగా చేసిన వారిపైనే కేసులుఅనివార్య కారణాల వల్ల, పొరపాటుగా వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు డ్యామేజ్ అవుతుంటాయి. మరికొందరికి తమ నంబర్ ప్లేట్ డ్యామేజ్ అయిన విషయం తెలిసినా పని ఒత్తిడి, నిర్లక్ష్యం వంటి కారణాలతో దాన్ని సరి చేసుకోరు. స్పెషల్ డ్రైవ్‌లో ఇలాంటి వాహనాలు చిక్కితే వారికి చలాన్ ద్వారా జరిమానా మాత్రమే విధిస్తున్నారు. కొందరు మాత్రం నేరాలు చేయాలని, ఈ–చలాన్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్లను డ్యామేజ్ చేయడం, వాటిపై ఉన్న నంబర్లు మార్చడం, వంచేయడం, స్టిక్కర్లు వేసి మూసేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై మాత్రమే శాంతిభద్రతల విభాగం పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయిస్తున్నాం. – పి.విశ్వప్రసాద్, అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) -
గీత దాటితే వాత!
సాక్షి, గట్టు: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. పోలీసులు ఉదయం, సాయంత్రం వేళల్లో వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానాలను విధిస్తున్నారు. దీంతో వాహనదారుల్లో భయం పుట్టుకుంది. ఒకప్పుడు నగర ప్రాంతాలకే పరిమితమైన ఈ–చలాన్ విధానాన్ని ఇప్పుడు పల్లెలకు విస్తరించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రస్తుతం ఈ–చలాన్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులకు ఈ–చలాన్ ద్వారా జరిమానాలు వెంటాడుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలను చేపడుతున్న పోలీసులు, నిబంధనలు అతిక్రమించిన వారికి అక్కడికక్కడే ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, డ్రైవింగ్ నిబంధనల అమలుకు పోలీసులు కృషిచేస్తున్నారు. మోటార్ వాహనచట్టం 250 సెక్షన్ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలను విధిస్తున్నారు. నిత్యం వాహన తనిఖీలు.. ప్రధాన రోడ్ల వెంట స్థానిక పోలీసులు నిత్యం వాహన తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా కర్నూలు–రాయచూర్ అంతర్ రాష్ట్ర రహదారితో పాటుగా గట్టు, మల్దకల్, గట్టు, ధరూరు, గట్టు చింతలకుంట, గట్టు మాచర్ల గ్రామాలకు సంబంధించిన ప్రధాన రహదారుల వెంట వాహన తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల సందర్భంగా నిబంధనలు అతిక్రమించిన వాహనదారులను నిలిపి, అనుమతి పత్రాలను పరిశీలిస్తున్నారు. వాహనదారులను ట్యాబ్ ద్వారా ఫొటో తీసి, వాహన నిబంధన ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ట్యాబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయగానే వాహనానికి సంబంధించిన పూర్తి సమాచారం ట్యాబ్ స్క్రిన్‌పై కన్పిస్తుంది. వాహనదారుడు ఏ నిబంధన ఉల్లంగించారనే దాని ప్రకారం వాహనదారునికి జరిమానా విధిస్తున్నారు. జరిమానాకు సంబంధించిన రశీదును అక్కడే వాహనదారునికి అందజేస్తున్నారు. ఆ తర్వాత వాహనదారుడు మీసేవ, ఈ సేవ, నెట్ బ్యాంకింగ్ వంటి ఆన్లైన్ సేవల ద్వారా జరిమానాను చెల్లించవచ్చు. వీటికి జరిమానాలు.. పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించడం, మద్యం తాగి వాహనాన్ని నడపడం, వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు లేకపోవడం, వాహనానికి పిట్నెస్ లేకపోవడం, అధిక శబ్దాలు చేయడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, ద్విచక్ర వాహనాలపై ము గ్గురు ప్రయాణించడం, నెంబర్ ప్లేటు సక్రమంగా లేకపోవడం, తనిఖీ సిబ్బందికి సహకరించకపోవడం వంటి అనేక కారణాలతో వాహనదారులకు అక్కడికక్కడే జరిమానాలను విధిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసమే.. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే ఈ చలాన్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా జరిమానాలు విధించడమే కాకుండా వాహనదారులకు అవగాహన కూడా కల్పిస్తున్నాం. వాహన నిబంధనలు పాటిస్తూ.. అన్ని రకాల అనుమతులను వాహనదారులు కల్గి ఉండాలి. వాహనదారుడు అనుకోని విధంగా ప్రమాదం బారిన పడి, నష్టం జరిగితే, ఆ కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా పరిహారం అందించేందుకు వీలు పడుతుంది. వాహనదారులు తప్పనిసరిగా వాహనానికి సంబంధించిన అన్ని అనుమతుల పత్రాలను కల్గి ఉండాలి. ద్విచక్ర వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా పత్రాలు, హెల్మెట్ లేకపోయినా జరిమానా విధిస్తున్నాం. ఇప్పటి దాకా గట్టు మండలంలో సుమారు 450 దాకా ఈ–చలాన్ ద్వారా జరిమానాలను విధించాం. ఎన్నికల దృష్ట్యా కర్ణాటక సరిహద్దులో ఉన్న బల్గెర దగ్గర ప్రత్యేకంగా చెక్ పాయింట్‌ను ఏర్పాటు చేశాం. రూ.50 వేలకు మించి నగదును తరలిస్తూ, పట్టుబడితే ఆ డబ్బును సీజ్ చేస్తాం. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు ఉంటే తిరిగి వారికి అప్పగిస్తాం. – శ్రీనివాసులు, ఎస్ఐ, గట్టు -
ఇక నుంచి ఈ-చలాన్లతోనే రిజిస్ట్రేషన్ చెల్లింపులు
హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను ఇకపై ఈ-చలాన్ల ద్వారానే చెల్లింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రకాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించేందుకు ఈ ప్రక్రియను రూపొందించారు. ఈ-చలాన్ల ప్రక్రియ అమలు కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏప్రిల్ 15న ఈ-చలాన్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ-చలాన్ల ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లందరికీ దశలవారీగా శిక్షణ ఇస్తున్నామని, తొలిదశలో హైదరాబాద్‌లో శిక్షణ పొందిన సబ్ రిజిస్ట్రార్లు, ఆయా జిల్లాల్లో మిగిలిన సబ్రిజిస్ట్రార్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ-చలాన్లు
- ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు ఏర్పాట్లు - ఆన్లైన్/ఆఫ్‌లైన్‌లో స్టాంప్ డ్యూటీ చెల్లించే సదుపాయం - మార్చి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు అధికారుల సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో మరో వినూత్న ప్రక్రియను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపునకు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత చలానా పద్ధతికి స్వస్తి పలికి, దాని స్థానంలో ఈ-చలాన్ల ప్రక్రియను ప్రవేశపెట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది. వివిధ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం సొమ్ము చెల్లింపులో వినియోగదారులకు మరింత వెసులుబాటు కల్పించడంతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవకతవకలను నివారించే దిశగా అధికారులు ఈ-చలానా ప్రక్రియను రూపొందిస్తున్నారు. పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ కావడంతో వినియోగదారులతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఇకపై బ్యాంకులు, ట్రెజరీల చుట్టూ తిరిగే పని ఉండదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ అమలు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)తో రిజిస్ట్రేషన్ల శాఖ త్వరలోనే అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఎస్ఎస్ఎల్ బ్యాంకుల తో ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించేందుకు అవసరమైన సెక్యూరిటీ సాకెట్ లేయర్ (ఎస్ఎస్ఎల్) సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ శాఖకు లభించింది. దీంతో ఎస్బీహెచ్ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ద్వారా సొమ్ము చెల్లింపు, స్వీకరణ సేవలను వినియోగించుకునేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ మార్గం సుగమమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఉన్న బ్యాంకు శాఖలో మాత్రమే వినియోగదారులు చలాన్లు చెల్లించవలసి వచ్చే ది. ఈ-చలాన్ల ప్రక్రియ అందుబాట్లోకి వస్తే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే ఆన్లైన్ లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 950 ఎస్బీహెచ్ శాఖల్లో ఎక్కడైనా ఆఫ్లైన్లోనూ స్టాంప్ డ్యూటీ చెల్లించవచ్చు. సబ్ రిజిస్ట్రార్ ల ఖాతాలను రద్దు పరిచి కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ పేరిట ఒకే ఖాతా నెంబరుకు సొమ్ము జమ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దొంగ చలాన్లకు చెక్... ఏదైనా బ్యాంకులో లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా స్టాంప్ డ్యూటీ చెల్లించిన వినియోగదారులకు రశీదుతో పాటు 12 అంకెలు కలిగిన కోడ్ నెంబరును బ్యాంకు అందిస్తుంది. వినియోగదారులు తమవద్ద ఉన్న ర శీదు, బ్యాంక్ ఇచ్చిన కోడ్ నెంబరును సబ్ రిజిస్ట్రార్‌కు అందజేస్తే సరిపోతుంది. స్టాంప్ డ్యూటీ చెల్లింపు వివరాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న డాక్యుమెంట్‌పై ముద్రించేలా అధికారులు చర ్యలు చేపట్టారు. దీంతో దొంగ చలాన్లను అరికట్టడంతో పాటు తాము చెల్లించిన మొత్తానికి వినియోగదారులకు భరోసా కల్పించినట్లవుతుందని శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీహెచ్‌తో ఎంవోయూకు అంతా సిద్ధంగా ఉందని, ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే మార్చి 1 నుంచి ఈ-చలాన్ల ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.