
మద్యం దుకాణంలో చోరీ
డబ్బు దొరక్క మద్యం ఎత్తుకెళ్లిన దొంగ
శంకరపట్నం: మద్యం దుకాణంలో రోజుకు రూ.లక్షల్లో గిరాకీ.. కౌంటర్లో డబ్బు బాగానే ఉంటుందని భావించిన ఓ దొంగ.. దుకాణం మూశాక చోరీకి దిగాలని భావించాడు. అర్ధరాత్రి వచ్చి కష్టపడి పైకప్పు రేకు కోసి, లోపలికి దిగాడు. ఆశగా కౌంటర్ తెరిస్తే రూపాయి కూడా లేకపోవడంతో నిరాశ చెందాడు. ఖాళీ చేతులతో వెళ్లడం ఎందుకని ఒక క్వార్టర్, రెండు బీర్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ క్రాస్‌రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనపై వైన్స్ యజమాని, పోలీసుల కథనం ప్రకారం.. మొలంగూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని మద్యం దుకాణంలో బుధవారం రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయించారు. సమయం ముగిశాక సిబ్బంది కౌంటర్‌లోని డబ్బులు తీసుకుని వైన్స్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగ దుకాణం పైకప్పు రేకులను కోసి దుకాణంలోకి చొరబడ్డాడు.
కౌంటర్‌లో డబ్బు లేకపోవడంతో రెండు బీర్లు, క్వార్టర్ సీసా, సీసీ ఫుటేజీ హార్డ్‌డిస్క్ తీసుకెళ్లాడు. గురువారం వైన్స్ తెరవగా.. పైకప్పు కోసి ఉండడాన్ని గమనించి వ్యాపారి శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ రవి, క్లూస్‌టీం వివరాలు సేకరించారు. ఈ వైన్స్‌లో గతంలోనూ దొంగలు పైకప్పు తొలగించి చోరీకి దిగారని, దీంతో ఇనుపరాడ్లు వేశానని, అయినా రేకు కోసి దొంగ లోపలకు దిగాడని యజమాని వాపోయాడు.