
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులో గురువారం ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎదురుగా వస్తున్న చెరువుమట్టి టిప్పర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 27మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు ప్రయాణికులు, పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, జిల్లాలోని అంతర్గాం మండలం ముర్మూరు నుంచి చెరువు మట్టిని రంగాపూర్ ఇటుకబట్టీకి తరలిస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. 27మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత కొందరిని ఇళ్లకు పంపించారు. కండక్టర్ కూకట్ల శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో కరీంనగర్‌కు తరలించారు.
సెల్‌ఫోన్ డ్రైవింగ్‌తోనే ప్రమాదం
పెద్దపల్లిలోని శాంతినగర్ నుంచి అప్పన్నపేట వరకు రాజీవ్ రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. వాహనాలను వన్ వే లో నడిపిస్తున్నారు. బస్సు డ్రైవర్ నాగేందర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగిందని కమాన్‌పూర్ ప్రాంత ప్రయాణికుడు సదయ్య తెలిపాడు. ప్రమాదంలో 27మంది గాయపడగా 22 మంది మహిళలే ఉన్నారు. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెండ్ శ్రీధర్‌ను ఆదేశించారు. ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశం పర్యవేక్షించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు
పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయాలపాలైన ప్రయాణీకులకు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించారని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. క్షతగాత్రులు వారి బంధువులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ఆసుపత్రి సూపరింటెండ్ శ్రీధర్ మరో 10 మంది వైద్యబృందం అందుబాటులో ఉంటూ బాధితులకు మెరుగైన సేవలందిస్తారని పేర్కొన్నారు.