ఆర్నెళ్ల పాపను పక్కింట్లో ఉంచి..
ఆత్మహత్య చేసుకున్న వివాహిత
కోరుట్ల: ఆ తల్లికి ముగ్గురు ఆరేళ్ల లోపు చిన్నారులే. పొద్దున్నే ఇద్దరిని చక్కగా తయారు చేసి బడికి పంపించింది. ఆరు నెలల పాపను పక్కింట్లో నిద్రపుచ్చింది. పాపకు మెలకువ వస్తే ఇంటికి తీసుకురమ్మని పక్కింటి వారికి చెప్పి మరీ వెళ్లింది. గంట గడిచినా తల్లి రాకపోయేసరికి.. పక్కింటి వారు పాపను ఇంటికి తీసుకెళ్లే సరికి ఆ తల్లి రేకుల షెడ్‌కు ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. ఈ సంఘటన కోరుట్లలో విషాదం నింపింది. ఎస్సై కిరణ్ కథనం ప్రకారం.. కోరుట్లలోని కాల్వగడ్డ దిగువభాగంలో పులివేని శశికళ నివాసముంటోంది. ఆమె కొడుకు సురేశ్ కుటుంబ పోషణ కోసం పదేళ్లుగా గల్ఫ్ వెళ్లి వస్తున్నాడు.
అతడికి ఏడేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన సృజనతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు మిధున్ (6), విహాన్స్(4), ఆరు నెలల కూతురు అనుమ ఉన్నారు. సురేశ్ ఆర్నెళ్ల క్రితమే కోరుట్లకు వచ్చి మళ్లీ గల్ఫ్ వెళ్లాడు. సోమవారం ఉదయం శశికళ తన బిడ్డ వద్దకని ఊరికి వెళ్లింది. సృజన తన కుమారులు మిధున్, విహాన్స్‌లను బడికి పంపించింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆరునెలల పాప అనుమను తీసుకుని పక్కింటికి వెళ్లింది. పాప నిద్రపోగానే వారికి ఇచ్చి.. లేస్తే ఇంటికి తీసుకురమ్మని చెప్పి వెళ్లింది.
పక్కింటి వారు కాసేపు చూసి పాపను తీసుకుని సృజన ఇంటికి వెళ్లగా ఆమె ఇంటి రేకులషెడ్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వగా బీఆర్‌ఎస్ మైనార్టీ నాయకుడు ఫయీం అక్కడికి వచ్చి పోలీసులకు విషయం చేరవేశాడు. ఎస్సై కిరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గల్ఫ్ నుంచి భర్త సురేశ్ పంపే డబ్బుల విషయంలో చిన్నపాటి గొడవలు ఉండటంతో సృజన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సృజన మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. తల్లి మృతిచెందడం.. పిల్లలు రోదిస్తుండడాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment