జమ్మికుంట/వరంగల్‌క్రైం: రెండు అంతస్తుల ఇల్లు.. 21 ఇంటి స్థలాలు.. ఏడు ఎకరాల భూమి.. కిలోన్నర బంగారం.. ఇతరత్రా కలిపి మార్కెట్ వి లువ ప్రకారం రూ.12 కోట్ల ఆస్తులు. ఇవన్నీ జమ్మికుంట తహసీల్దార్ మర్కల రజనికి చెందిన హనుమకొండలోని ఇంటితోపాటు మరో ఐదు చోట్ల ఏకకాలంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో వెలుగుచూశాయి.
ఉదయం నుంచి హనుమకొండలోని కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీ, ధర్మసాగర్, మరో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్ రజని ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక ప్రకారం అమె బంధువులు, సన్నిహితుల ఇళ్లను టార్గెట్ చేసుకుని తనిఖీలు చేశారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో ఒక్కో చోట ఇన్‌స్పెక్టర్ స్థాయి ఆధ్వర్యంలో దాడులు కొనసాగాయి. ఆమె గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రాంతాల్లో ఆమెకు సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు.
రూ.12కోట్ల అక్రమాస్తులు..
తహసీల్దార్ మర్కల రజనిపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయని డీఎస్పీ రమణామూర్తి తెలిపారు. ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలో ఆరు చోట్ల దాడులు నిర్వహించామన్నారు. రజనికి హనుమకొండలో కేఎల్‌ఎన్‌రెడ్డి కాలనీలో రెండు అంతస్తుల ఇల్లు, 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమి, 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో రూ.25లక్షలు, లాకర్లు, ఇంట్లో కిలోన్నర బంగారం, ఇంట్లో రూ.1.50 లక్షల నగదు లభించినట్లు తెలిపారు.
దీని విలువ (ప్రభుత్వ విలువ ప్రకారం) రూ.3.25 కోట్లు. ఇందులో సుమారు రూ.3కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటి విలువ మార్కెట్ ప్రకారం సుమారు రూ.12 కోట్ల వరకు ఉంటుందని డీఎస్పీ రమణామూర్తి పేర్కొన్నారు. తహసీల్దార్ రజనిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రమణామూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment