
10 నెలల క్రితమే భర్త ఆత్మహత్య
అనాథలైన ఇద్దరు పిల్లలు
మానకొండూర్‌లో ఘటన
మానకొండూర్: తల్లి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.. తండ్రి 10 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో ఐదేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఆ దంపతుల పాప, బాబు అనాథలయ్యారు.. ఈ విషాద ఘటన మానకొండూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన కోండ్ర పవన్‌కల్యాణ్, ప్రహర్ష(24) 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక పాప, బాబు సంతానం. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్ 10 నెలల క్రితం ఇంట్లో ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రహర్ష కరీంనగర్‌లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పని చేస్తోంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పిల్లలను స్కూల్‌కు పంపించి వస్తానని మామ లక్ష్మణ్‌తో చెప్పి, వెళ్లింది. తిరిగి రాకపోవడంతో అతను చుట్టుపక్కల వెతికాడు.
సమీప బావిలో ఆమె శవమై కనిపించింది. అయితే, ఉదయం ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి, ప్రహర్షతో మాట్లాడి వెళ్లాడని మృతురాలి అత్త భాగ్య చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రహర్ష చనిపోవడానికి ఆ వ్యక్తే కారణమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని మృతురాలి సోదరి నిర్మిట్ల ప్రసన్న అనుమానం వ్యక్తం చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, పసితనంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసి, వారి నానమ్మ, తాతయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి, స్థానికులు కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment