ముగ్గురు స్నేహితులను బలితీసుకున్న రోడ్డు ప్రమాదం
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు
కుక్కలగూడూర్‌లో విషాదం
రాజారాంపల్లి–రాయపట్నం గుంతల రోడ్డుపై సూచికలూ లేవు
వెల్గటూర్(ధర్మపురి): ఆ ముగ్గురూ స్నేహితులు.. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. కలిసే చదువుకున్నారు, ఆడుకున్నారు.. చివరికి మృత్యువులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోయారు.. వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి అనుబంధ గ్రామం కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ముగ్గురి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం రోజే ఒకరు, ఆ తర్వాత రోజు విడిచి రోజు మరో ఇద్దరు చనిపోవడంతో స్వగ్రామం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్‌లో విషాదం నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. కుక్కలగూడూర్‌కు చెందిన నల్లపు అవినాశ్(19), బడుగు సాగర్(19), కుదిరె సాగర్(18) మంచి స్నేహితులు. గత శుక్రవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు బైక్‌పై ధర్మపురి మండలంలోని రాయపట్నం వైపు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెల్గటూర్ మండలంలోని కొత్తపల్లి స్టేజి వద్ద 7వ నంబర్ రాష్ట్ర రహదారిపై ఎదురుగా ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురికీ తల పగిలి, తీవ్ర గాయాలయ్యాయి. అవినాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మిగతా ఇద్దరిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బడుగు సాగర్ ఆదివారం, కదిరె సాగర్ మంగళవారం చనిపోయారు.
అందరివీ పేద కుటుంబాలే..
బడుగు రవికి ఒక కూతురు, కొడుకు సాగర్ సంతానం. సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కదిరె గట్టయ్యకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు సాగర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. వీరిద్దరివి వ్యవసాయ కుటుంబాలు. నల్లపు తిరుపతికి ఒక కూతురు, కుమారుడు అవినాశ్ ఉన్నారు. అవినాశ్ ఇంటర్ పూర్తి చేశాడు. తిరుపతి మద్యానికి బానిసై, కుటుంబాన్ని పట్టించుకోడు. అవినాశ్ తొలుత పెట్రోల్ బంకులో పని చేశాడు. ప్రస్తుతం టెంట్‌హౌస్‌లో పనిచేస్తూ తల్లి, అక్కను పోషిస్తున్నాడు. చేతికందిన కుమారులు తమకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకుంటే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరివీ పేద కుటుంబాలేనని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ రోడ్డుపై నిత్యం ప్రమాదాలు..
ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి నుంచి రాయపట్నం వరకు ఉన్న రోడ్డు(15 కి.మీ.)పై నిత్యం ప్రమాదాలు జరుగుతుంటాయి. గడిచిన రెండేళ్లలో 20 మందికి పైగా మృతిచెందారు. ఈ రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయి. మరమ్మతు చేయకపోగా కనీసం ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేదు. గ్రామ కూడళ్లలో వీధి దీపాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికా రులు స్పందించి, రోడ్డుకు మరమ్మతు చేయించా లని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment