కొందరు వాహనదారుల అత్యుత్సాహం
టీఎస్‌ను టీజీగా మార్చేస్తున్న వైనం.. రెండు వాహనాలకు ‘ఒకే నంబర్’ ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఒకే నంబర్‌తో రెండు, మూడు వాహనాలుంటే ఎలా ఉంటుంది? ఏదైనా నేరాలు, అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతో కొంత మంది ఇలా చేస్తుంటారు. కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహం, అవగాహన లేమితో ఇప్పుడు భవిష్యత్తులో ఒకే నంబర్ రెండు వాహనాలకు కనిపించే పరిస్థితి ఎదురుకాబోతోంది. దీంతో ఒక వాహనానికి సంబంధించిన వారు ఏదైనా నేరం చేస్తే దానివల్ల అదే నంబర్ ఉన్న రెండో వాహన యజమాని ఇబ్బంది పడే అవకాశం ఉందని అధికారులంటున్నారు.
ఇదీ సంగతి..: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టేట్ కోడ్ ఏపీ నుంచి టీఎస్‌కు మారింది. దాదాపు పదేళ్లపాటు అదే కొనసాగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మార్చింది. టీఎస్‌కు బదులు టీజీని అమల్లోకి తెచ్చింది. అయితే పాత వాహనాలకు టీఎస్ కోడ్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది.
కానీ కొందరు వాహనదారుల అత్యుత్సాహంతో ఇది సమస్యగా మారనుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ వాహనాలకు టీజీ కోడ్ ఉండాలని బలంగా కోరుకున్న కొందరు... ఇప్పుడు టీజీ కోడ్ అమల్లోకి రావడాన్ని స్వాగతిస్తూ తమ పాత వాహనాల నంబర్ ప్లేట్లపై టీఎస్ అక్షరాలను తొలగించి టీజీ అని పెట్టుకుంటున్నారు.
సమస్య ఏమిటి?
టీజీ కోడ్ కొత్తగా రావడంతో రవాణా శాఖ అధికారులు కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబర్లను మళ్లీ ‘ఎ’ ఆల్ఫాబెట్ నుంచి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ‘సి’ సిరీస్ కొనసాగుతోంది. రాష్ట్రం ఆవిర్భవించిన సమయంలో టీఎస్ కోడ్‌ను ప్రారంభించినప్పుడు ‘ఇ’ సిరీస్‌తో మొదలుపెట్టారు. ఇప్పుడు త్వరలోనే టీజీ కోడ్‌లో కూడా ‘ఇ’ సిరీస్ మొదలవుతుంది. దానికి 0001 నుంచి నంబరింగ్ మొదలవుతుంది. క్రమంగా గతంలో టీఎస్ కింద కేటాయించిన నంబరే ఇప్పుడు టీజీ సిరీస్‌లో కూడా అలాట్ అవుతుంది.
స్టేట్ కోడ్ (టీఎస్, టీజీ) మాత్రమే తేడా ఉంటుంది. అయితే టీఎస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనదారుడు సొంతంగా టీజీ ఏర్పాటు చేసుకుంటే... అధికారికంగా టీజీ కోడ్‌తో అదే నంబర్ ఉన్న వాహనంతో దాని నంబర్ క్లాష్ అవుతుంది. ఉదా: టీఎస్ ఎ 0001 నంబర్‌తో ఉన్న పాత వాహనదారుడు దాన్ని టీజీగా మారిస్తే.. ఇప్పుడు టీజీ ఏ 0001 అని ఏదైనా కొత్త వాహనానికి నంబర్ అలాట్ అయితే రెండు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఒకటిగా మారి సమస్య ఏర్పడుతుందన్నమాట.
రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు, నేరాలు జరిగినప్పుడు ఇలా నంబర్లు క్లాష్ అయితే కేసు దర్యాప్తులో చిక్కులు ఏర్పడతాయి. దీంతోపాటు అధికారికంగా సరైన నంబర్ కలిగి ఉన్న వాహనదారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట.
అలా మార్చడం నేరం
టీజీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొందరు టీఎస్ కోడ్ వాహనదారులు వచ్చి తమ వాహనాలకు టీజీ కోడ్ అలాట్ చేయాలని కోరుతున్నారు. కానీ అది సాధ్యం కాదని... టీజీ సిరీస్ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్న వాహనాలకు మాత్రమే టీజీ కోడ్ వర్తిస్తుందని చెప్తున్నాం. ఎవరైనా సొంతంగా నంబర్ ప్లేట్‌పై స్టేట్ కోడ్ మారిస్తే దాన్ని ట్యాంపరింగ్‌గానే భావించి నేరంగా పరిగణించాల్సి ఉంటుంది. అలాంటి వారిపై చర్యలు కూడా ఉంటాయి. వాహనదారులు ఇది తెలుసుకోవాలి.
– రమేశ్, జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment