
చూస్తుండగానే వేసవికాలం వచ్చేసింది.. ఓ వైపు అప్పుడే మండుతున్న ఎండలు, మరో వైపు పరిశ్రమలు, వాహనాలు, ఏసీల నుంచి వెలువడే కాలుష్యం. వెరసి హైదరాబాద్ నగరంలో ఎప్పటిలానే సమ్మర్ ఎఫెక్ట్ కొనసాగనుంది. గతేడాది ఇదే మార్చ్ నెల్లో అత్యధికంగా 47.2 డీగ్రీ సెంటీగ్రేడ్‌ల ఎండలతో ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మండే ఎండల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు పర్యావరణ, ఆరోగ్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా ముసలివారు, చిన్నారులు అధిక సంఖ్యలో మృత్యువాత పడుతుండటం, ఎలాంటి వేసవి సంరక్షణా తీసుకోకుండా వివిధ కారణాలతో బయటకు వెళ్లే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ సందర్భంగా వేసవి నుంచి సంరక్షణను అందించే ప్రాథమిక పద్ధతులు, విధానాల గురించి పలు జాగ్రత్తలు..
వేసవిలో ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నియమం నీరు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా హైడ్రేట్ అవ్వాలని ఆరోగ్య నిపుణులు, ఫిట్నెస్ ఫ్రీక్స్ సూచిస్తున్నారు. శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నంత వరకూ వేసవిలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. నగర జీవితంలో తప్పని సరిగా మూడు, మూగున్నర లీటర్ల నీటిని, ఇతర పానియాలను తీసుకోవాల్సిన అవసరముంది. బయటికెళుతున్న సమయంలో వాటర్‌బాటిల్ మర్చిపోవద్దు.
వడదెబ్బకు దూరంగా..
వేసవిలో ప్రధాన సమస్య వడదెబ్బ. ప్రతి ఏడాదీ వడదెబ్బతో ప్రాణాలు కోల్పోతున్న వారు కోకొల్లలు. వీలైనంత వరకూ ఎండలకు దూరంగా ఉండటం, ముఖ్యమైన పనులను ఉదయం, సాయంత్రాల్లో చేసుకోవడం ఉత్తమం. తరచూ ఎండలో ఉండేవారు తగినంత విశ్రాంతి, ఫ్యాన్ లేదా ఏసీలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ దూరం వాహనాలపై ప్రయాణాలు చేసేవారు కళ్లద్దాలు, హెల్మెట్, టోపీలు తప్పనిసరిగా వినియోగించాలి. చిన్నారులైతే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
సైక్లింగ్.. జర భద్రం..
ఈ మధ్య కాలంలో ఈజీ మొబిలిటీలో భాగంగా నగరంలో సైక్లిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అంతేకాకుండా స్కూల్స్, గ్రౌండ్స్‌కు వెళ్లే వారు సైతం సైక్లిల్ వినియోగిస్తున్నారు. సమ్మర్‌లో సైక్లిస్టులు జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో విశ్రాంతి, పానియాలు తీసుకోవడం శ్రేయస్కరం. మధ్యాహ్న సమయాల్లో సైక్లింగ్ అంత మంచిది కాదని నగరానికి చెందిన సైక్లింగ్ రైడర్ రవి తెలిపారు.
సన్ర్‌స్కీన్‌తో మేలు..
మండే ఎండలకు కళ్లద్దాలు, తలకు టోపీ, హ్యండ్‌బ్యాగ్‌లో కర్చీప్ లేదా న్యాప్‌కిన్స్ తప్పనిసరి. ఎండవేడి నుంచి చర్మ సంరక్షణకు సన్‌స్క్రీన్ లోషన్స్, కూలింగ్ లోషన్స్ వాడటం కాస్త ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమ్మర్ ముగిసేంత వరకూ ఫ్యాషన్ వేర్‌లో ప్రత్యేక శైలిని ఎంపిక చేసుకోవాలి. సమ్మర్ కేర్ కోసం మార్కెట్‌లో అందుబాటులోకి వచి్చన గార్మెట్స్ ఎంచుకోవాలి. చెమటను గ్రహించే దుస్తులు ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
వేడికి దూరంగా ఈవీ..
ఈ మధ్య కాలంలో నగరంలో ఎలక్ట్రిక్ వాహనల సంఖ్య భారీగా పెరిగింది. ఈ వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండలాని నిపుణులు చెబుతున్నారు. ఈవీ వాహనాలను ఎండలో పార్క్ చేయకుండా నీడలో ఉంచాలి. ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు బ్యాటరీ, ఇంజిన్ వేడి కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి. లేదంటే అధిక వేడికి బ్యాటరీలు పేలిపోయే ప్రమాదముంది. టైర్లు అరిగిపోయిన వాహనాలు మరింత జాగ్రత్తగా నడపాలి. టైర్లు వ్యాకోచించడం, రోడ్డు పై డాంబర్ కరగడం వంటి కారణాలతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది.
నో బ్లాక్..
ఫ్యాషన్ పేరుతో ఎండాకాలంలో నల్లటి దుస్తులు ధరించడానికి స్వస్తి చెప్పాలి. నల్లటి దుస్తులు, వస్తువులు, వాహనాలు అధిక వేడిని గ్రహించి ఆరోగ్యానికి హాని చేస్తాయి. దీనికి పరిష్కారంగా తెల్లటి దుస్తులు లేదా లైట్ కలర్స్ వేసుకుంటే మేలు. ముఖ్యంగా కాటన్ దుస్తులు, మెత్తని స్వభావం కలవి ఉత్తమ ఎంపిక.
కాసింత స్మార్ట్‌గా..
నగర జీవనంలో గ్యాడ్జెట్‌లు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో వాతావరణ ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేసే స్మార్ట్ వాచ్‌లు, ఇతర గ్యాడ్జెట్‌లు వాడటం మంచిది. శరీర ఉష్ణోగ్రత, గుండెపనితీరు, బ్లడ్ ప్రెజర్, న్యూట్రిషన్ తదితర అంశాలను తెలియజేసే గ్యాడ్జెట్‌లు, యాప్‌లు వినియోగించడం మేలని ఈ తరం మెడికల్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి భోజనమే మేలు..
వేసవిలో కాసింతైనా ఆహార నియమాలను పాటించాలి. జంక్‌ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, అధిక మసాలాలతో తయారు చేసిన ఆహారాన్ని తగ్గించాలి. తగినంత నీటిని తాగడంతో పాటు వాటర్‌మెలన్, షర్బత్ విభిన్న రకాల పండ్ల రసాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. దీంతో పాటు అవసరమైన ప్రోటీన్లను, మినరల్స్‌ను అందిస్తాయి. సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ హజర్ తెలిపారు. ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటే కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. ఇంటీరియర్ ప్లాంట్స్ పెంచుకోవడం వల్ల వాతావరణం చల్లగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment