మొన్నమొన్నటి దాకా చల్లగా సాగిన ప్రయాణం ఇప్పుడు వేసవి కొలిమికి సిద్ధమైంది. సమ్మర్ వార్తలు కొంతకాలంగా డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఓ వైపు వాతావరణంలో మొదలైన మార్పులు, మరోవైపు నిపుణుల హెచ్చరికలు తెలియకుండానే గుండెలో గుబులు పుట్టిస్తున్నాయి. ఇక నుంచి ఏం తిన్నా, ఏం తాగినా ఆపసోపాలే! ఎటు వెళ్లినా, ఎక్కడాగినా నీరసాలు, నిట్టూర్పులే! మరి ఈ ఎండాకాలాన్ని ఎలా దాటెయ్యాలి?
ఈ వేసవి తాపానికి డీహైడ్రేషన్, వడదెబ్బ, కళ్లు తిరగడం, నీరసం, వాంతులు, జీర్ణసమస్యలు ఇలా ఒకటా రెండా.. ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇతర కాలాల్లో అనారోగ్యం వస్తే.. ఏదో ఒకటి తిని, ఓ టాబ్లెట్ వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రైనాపోవచ్చు. కానీ ఈ ఎండాకాలంలో నిద్ర కూడా పట్టదు. పరచుకున్న పరుపులోంచి, మూసి ఉన్న తలుపుల్లోంచి వేడి తన్నుకొచ్చి.. కుదురుగా ఉండనివ్వదు. ఇలాంటి వడగాల్పులను తట్టుకోవాలంటే.. చలువ చేసే ఆహారాలు, చల్లబరచే పానీయాలను పుష్కలంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తినేవాటిలో ఆయిల్ లెస్, తాగేవాటిలో సుగర్ లెస్ తప్పదంటున్నారు. జంక్ ఫుడ్‌కి, సాఫ్ట్ డ్రింక్స్‌కి బ్రేక్ ఇవ్వాల్సిందే అంటున్నారు. నిజానికి వేసవిలో ఎక్కువగా తినాలనిపించదు. ఆరారగా పానీయాలు తాగాలనిపిస్తుంది. అసలు తినడానికైనా, తాగడానికైనా ఏవేవి మంచివో చూద్దాం.
ఎండాకాలం ఆహారాలు
దోసకాయ, పుచ్చకాయ, మామిడిపండు, అరటిపండు, బొప్పాయి, అనాసకాయ ఇలా ప్రతి పండూ వేసవిలో ఆస్వాదించతగ్గదే! వాటిలోని వాటర్ కంటెంట్ బాడీలోని ఉష్ణోగ్రతల స్థాయిని తగ్గిస్తాయి. అలాగే అరుగుదల సజావుగా చేసి.. జీర్ణకోశాన్ని తేలికపరుస్తాయి. ఆయా పండ్లతో చిక్కగా జ్యూసులు చేసుకుని తాగొచ్చు. భోజనం విషయానికి వస్తే ఆకుకూరలు, కూరగాయలకే పోపు పెట్టడం మంచిది. సమ్మర్‌లో మాంసం, చేపలు వంటివి తినడం వల్ల అరుగుదల ఆలస్యం అవుతుంది. కడుపు బరువుగా మారుతుంది. నాన్‌వెజ్ వంటకాల్లో నూనె, మసాలా వంటివి ఎక్కువగా వాడాల్సి రావడంతో అవన్నీ వేసవి కాలంలో జీర్ణక్రియ సమతౌల్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తినేటప్పుడు తేలికగా అరిగేవి ఎంచుకోవాలి. వేపుళ్లు తినడం వల్ల వడదెబ్బను పోలిన లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరోచనాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి, ఆ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఎక్కువగా నీరు, జావలు, జ్యూసులు, ద్రవాహారాలను తీసుకోవాలి.
డబ్ల్యూఎంఓ హెచ్చరిక
ఈ వేసవి మూడునెలలు మండుతున్న కుంపటే అని మన వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్నే ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) కూడా వెల్లడించింది. ఈ ఏడాది ‘ఎల్ నినో’ ప్రభావం వల్ల పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయని డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. గత ఏడాది జూన్‌లో ‘ఎల్ నినో’ ఏర్పడిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, గతంతో పోల్చుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉండబోతున్నాయని వెల్లడించింది.
ఇవి అస్సలు తినొద్దు...
- కెఫీన్, ఆల్కహాల్: ఈ రెండూ బాడీని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అందుకే వేసవిలో కాఫీ, టీలతో పాటు మద్యానికీ దూరంగా ఉండటం ఉత్తమం.
- స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ చెమటలు పుట్టిస్తాయి. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఉక్కబోతల వాతావరణంలో మరింత వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది.
- ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు బాడీని ఎక్కువగా డీహైడ్రేషన్‌కి గురిచేస్తాయి. ఇలాంటివి తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తుంది.
- కొవ్వు పదార్థాలు: కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాని వల్ల నీరసంగా, అలసటగా ఉంటుంది. అరుగుదల లోపంతో తెలియకుండానే ఆపసోపాలు మొదలవుతాయి.
వేసవి పానీయాలు
సాధారణంగా ఎండాకాలంలో నీళ్లు ఎక్కువ తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అందుకే ‘ఉత్త నీళ్లు ఎన్నని తాగుతాం‘ అనుకునేవారు ’ఇలా చిటికెలో అయ్యే చలవ పానీయాలను తయారుచేసుకుని తాగండి’ అంటున్నారు నిపుణులు. అయితే పంచదారకు బదులుగా తేనె వాడుకోవడం మంచిది. తేనె లేని సమయంలో తక్కువ మోతాదులో బెల్లం పాకం వాడుకోవచ్చు.
సబ్జా నీళ్లు..
ఈ సమ్మర్ సీజన్ లో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. సబ్జా గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే పెక్టిన్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ సీజన్‌లో సబ్జా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి సమస్యలు దరిచేరవు. అందుకే నీళ్లలో సబ్జా వేసుకుని తాగడం మంచిది.
తేనె– నిమ్మరసం నీళ్లు
ఒక గ్లాసు నీళ్లలో ఒక నిమ్మచెక్కను పిండుకుని, ఒకటిన్నర లేదా 2 టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా కలిపి తాగొచ్చు. ఇది తక్షణశక్తిని అందిస్తుంది. ఇలా ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా అనిపించినప్పుడు, తలనొప్పి వస్తున్నప్పుడు ఈ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
సోంపు నీళ్లు
సోంపులో ఈస్ట్రాగోల్, అనెథాల్, ఫెంకోన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని చల్లబరచి, జీర్ణ సమస్యలను దూరం చేసి పొట్టను తేలికగా ఉంచుతాయి. వీటిని నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తేనె లేదా బెల్లం పాకం కలిపి తీసుకుంటే మంచిది.
కొబ్బరి బోండం..
కొబ్బరి నీళ్లు ఎల్లప్పుడూ బాడీని చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఎలక్ట్రోలైట్‌లతో సమృద్ధిగా ఉండే ఈ సహజపానీయం వేసవిలో వేడిని తట్టుకోవడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సామర్థ్యాన్ని పెంచుతుంది. అందుకే వీలైనప్పుడల్లా కొబ్బరి నీళ్లు సేవించడం మంచిది.
జీలకర్ర నీళ్లు..
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్లు, పోషకాలు చాలానే ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉండటంతో జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. ఈ వాటర్ వికారం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. సమ్మర్‌లో రాత్రిపూట జీలకర్రను నీటిలో నానబెట్టి, ఉదయం వడకట్టుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ఏలకుల నీళ్లు
ఏలకుల్లోని ఔషధ గుణాలు.. బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజాన్ని మెరుగు పరుస్తాయి. కడుపులో వేడి, మంట, వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి. ఒక గ్లాసుడు వేడి నీళ్లల్లో ఏలకుల్ని దంచి వేసుకుని, బాగా కలుపుకుని, వడకట్టి తాగాలి. అభిరుచిని బట్టి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. ఈ నీళ్లు శరీరంలో వేడిని వేగంగా తగ్గిస్తాయి.
మెంతుల నీళ్లు
మెంతుల్లో మాంగనీస్, ఐరన్, కాపర్, విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్ , పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని మెంతుల్ని గ్లాసు నీళ్లల్లో నానబెట్టి, వడకట్టుకుని తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గి, చల్లబడుతుంది.
దనియాల నీళ్లు
ఒక టీస్పూన్ దనియాలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టి, వడగట్టుకుని పది నిమిషాల పాటు మరిగించి, చల్లార్చుకుని తాగితే మంచిది. దనియాల్లోని పైబర్ జీర్ణక్రియను సరిచేస్తుంది. అలాగే ఈ వాటర్.. బాడీలోని టాక్సిన్స్‌ను తొలగించి.. చల్లదనాన్ని అందిస్తుంది.
మజ్జిగ..
వేసవికి అసలు సిసలు చల్లదనం మజ్జిగతోనే వస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకుని నిమ్మరసం, చిటికెడు ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని, గిలక్కొట్టి అందులో ఓ గ్లాసుడు నీళ్లు కలిపితే చాలు, మజ్జిగ రెడీ. కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగే కడుపులో చల్లగా ఉంటుంది. ఇలా రకరకాల పద్ధతుల్లో బాడీలోకి నీటిని పంపితే వేసవి తాపం నుంచి ఇట్టే బయట పడొచ్చు. అలాగే ఫ్రిజ్‌లో వాటర్ కంటే మట్టికుండను ఇంట్లో పెట్టుకోవడం మంచిది.
చర్మసంరక్షణ
అధిక ఉష్ణోగ్రతల కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోయి దెబ్బతింటుంది. మొటిమలు రావడం, ముఖం కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం, సాయంత్రం తప్పకుండా చల్లటి నీళ్లతో స్నానం చెయ్యాలి. ముఖాన్ని నీళ్లతో కొట్టినట్లుగా కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు అయినా నేచురల్ స్క్రబ్‌తో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే మృతకణాలు పోతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చెమట కారణంగా వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
క్రీమ్స్ అండ్ లోషన్స్
సాధారణంగా మాయిశ్చరైజర్ శీతాకాలంలో మాత్రమే అవసరం అనుకుంటాం. కానీ వేసవిలో వేడిని తట్టుకోవడానికి కూడా మాయిశ్చరైజర్ అవసరం అంటారు నిపుణులు. చర్మసంరక్షణలో భాగంగా సమ్మర్ క్రీమ్స్ వాడితే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మరచిపోవద్దు. అది సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మంలోని తేమను కాపాడుతుంది.
హెయిర్ కేర్
ఎవరికైనా కురులే ప్రత్యేక అందాన్ని తెచ్చిపెడతాయి. కానీ వేసవి వచ్చేసరికి చెమటకు, ఉక్కపోతలకు ఆ కురులే విసుగుపుట్టిస్తుంటాయి. అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే వేసవిలోనూ జుట్టు ఆరోగాన్ని కాపాడుకోవచ్చు. పొడవాటి జుట్టున్నవారు పైకి ముడిపెట్టుకునేటప్పుడు జాగ్రత్తపడాలి. చిక్కులు పడకుండా అనువైన క్లిప్స్ వాడుకోవాలి. స్విమ్మింగ్ పూల్‌లో కాని, బీచ్‌లో కాని తల తడిసినప్పుడు ఇంటికి వచ్చి మంచి నీళ్లతో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.
లేదంటే వెంట్రుకలు పొడిబారిపోయి బలహీనంగా,పెళుసుగా మారతాయి. కెమికల్ శాతం ఎక్కువగా ఉండే షాంపూలు వాడటం వల్ల చుండ్రు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. తల స్నానం చేసేటప్పుడు, చేసిన తర్వాత కురులను బలంగా రుద్దకూడదు. బాగా ఆరిన తర్వాతే జుట్టుని అల్లుకోవాలి. బయటికి వెళ్లినప్పుడు జుట్టుకి ఎండ తగలకుండా జాగ్రత్త పడాలి. తల స్నానం తర్వాత వెంట్రుకలకు కండిషనర్ వాడటం మంచిది.
గొడుగైనా.. హ్యాట్ అయినా..
ఈ రోజుల్లో కాలుష్యం పెరిగిపోవడంతో బయటకి వెళ్లేప్పుడు తగుజాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. అయితే వేసవికి మరిన్ని జాగ్రత్తలు అసవరం అంటున్నారు నిపుణులు. వేసవిలో ప్రయాణాలు అంత మంచివి కావు. తప్పనిసరి అయితే మాత్రం వెంట తీసుకుని వెళ్లాల్సిన లిస్ట్ ఇదే. ఒక వాటర్ బాటిల్, ఒక గొడుగు లేదా హ్యాట్, కూలింగ్ గ్లాసెస్, స్కార్ఫ్ లేదా హెడ్ బ్యాండ్ మాస్క్.. ఇవన్నీ వెంట తీసుకుని వెళ్లాల్సినవే.
మొత్తానికీ ఈ వేసవి చల్లగా ఉండాలంటే ‘లైట్ ఫుడ్, లాట్ ఆఫ్ లిక్విడ్స్’ అనే పాలసీని ఫాలో అవ్వాలి. ఇంట్లో ఉంటే కుండలో నీళ్లనే తాగాలి. బయటికి వెళ్తే కూలింగ్ గ్లాసెస్ పెట్టాలి. మన సంగతి సరే! పాపం మనతో పాటు జీవించే జంతువులు, పక్షులకూ ఈ వేసవి ప్రాణసంకటమే! కాస్త వాటి దాహాన్నీ తీర్చే ప్రయత్నం చేయాలి. ఇంటి ముందు చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెడదాం. నాలుగు ధాన్యపు గింజలు ప్లేటులో వేసి, గోడ మీద పెడదాం.
ఇవి చదవండి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రధానపాత్ర నిర్వహిస్తున్న అమెరికా పత్రికలు!
Comments
Please login to add a commentAdd a comment