
ప్రపంచంలోనే ఇదొక అరుదైన సంబరం. మెక్సికోలోని వాహాకా నగరంలో జరిగే వేడుక ఇది. ఈ సంబరం జరిగే రోజున వాహాకా నగర వీథుల్లో ఎటు చూసినా ముల్లంగి దుంపలే కనిపిస్తాయి. స్థానిక కళాకారులు ముల్లంగి దుంపలను శిల్పాలుగా తీర్చిదిద్ది ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సంబరం ఏటా డిసెంబర్ 23న జరుగుతుంది. ఇది ప్రధానంగా రాత్రివేళ జరిగే వేడుకే అయినా, ఉదయం నుంచి వాహాకా నగర వీథుల్లో సందడి కనిపిస్తుంది.
స్పానిష్ వలసదారులు అడుగుపెట్టే వరకు మెక్సికన్ ప్రజలకు, ఇతర లాటిన్ అమెరికా దేశాల ప్రజలకు ముల్లంగి తెలీదు. స్పానిష్ వర్తకులు చైనా నుంచి ముల్లంగిని తీసుకువచ్చి, దక్షిణ అమెరికాలోని తమ వలస రాజ్యాల్లో సాగు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ముల్లంగి లాటిన్ అమెరికన్ ప్రజల అభిమాన కూరగాయల్లో ఒకటిగా మారింది. ముల్లంగి సంబరం ఆచారం మొదలవడానికి ముందు వాక్సాకా నగరంలోని క్రిస్మస్ బజారులో కలపతో శిల్పాలు మలచే పోటీలు జరిగేవి.
కొందరు ఔత్సాహిక రైతులు 1897 డిసెంబర్ 23న ముల్లంగి దుంపలతో చిత్రవిచిత్రమైన శిల్పాలను మలచి, ప్రదర్శనకు పెట్టారు. దాదాపు వందమంది రైతులు ఆనాటి ప్రదర్శనలో ముల్లంగి శిల్పాలను ప్రదర్శించారు. ఇవి సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన సందర్శకులు వీటిని ఎగబడి కొనుక్కున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న ‘నోషే డి రబానోస్’ (నైట్ ఆఫ్ రాడిషెస్) సంబరం జరుపుకోవడం ప్రారంభించారు. (కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది! )
మొదట్లో ఈ వ్యవహారం కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికే మొదలైనా, తర్వాత ఇది వాహాకా నగరంలో ఒక పెద్ద సాంస్కృతిక వేడుకలా మారింది. ఈ ముల్లంగి సంబరంలో ముల్లంగి శిల్పాల పోటీలు జరుగుతాయి. విజేతలకు వాహాకా నగర పాలక సంస్థ బహుమతులు అందించి, ఘనంగా సత్కరిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే శిల్పులు క్రీస్తు జననం, శిలువ, చర్చి వంటి ఆకృతులతో పాటు పక్షులు, జంతువులు, మనుషుల బొమ్మలను కూడా ముల్లంగి దుంపలపై మలచి, తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ వేడుకకు విదేశీ పర్యాటకులు వస్తుండటం వల్ల మెక్సికోకు పర్యాటక ఆదాయం కూడా బాగా లభిస్తోంది.