మేలిమి బంగారంతో ఖరీదైన క్రిస్మస్ ట్రీ, ధర ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా పవిత్ర క్రిస్మస్ సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకల్లో ప్రధానమైంది క్రిస్మస్ ట్రీని తయారు చేయిడం. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ వార్తల్లో నిలిచింది. జర్మనీ ఈ స్పెషల్ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని మేలిమి బంగారు నాణాలతో రూపొందింది ఆవిష్కరించింది. ఆశ్చర్యంగా ఉంది కదా..రండి దీని విశేషాల గురించి తెలుసుకుందాం.అద్బుతమైన బంగారపు ట్రీని మ్యూనిచ్‌లోని బులియన్ డీలర్స్ ప్రో ఆరమ్ (Pro Aurum) తయారు చేసిందట. 10 అడుగుల ఎత్తు, దాదాపు 60 కిలోల బరువు, 2,024 (ఏడాదికి గుర్తుగా) బంగారు వియన్నా ఫిల్హార్మోనిక్ నాణేలతో ఈ ట్రీని తయారు చేశారు. ఈ నాణేం ఒక్కోటి ఒక ఔన్స్ బరువు ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీల పైభాగంలో నక్షత్రం లేదా దేవదూత స్థానంలో 24 క్యారెట్ల బంగారు నాణెంతో(ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణేల్లో ఇదొకటి) వినియోగించారు. ఈ ట్రీని వియన్నా మ్యూసిక్వెరిన్ గోల్డెన్ హాల్ లాగా కనిపించే ఒక వేదికపై ఉంచారు. దీని విలువ ఏకంగా రూ.46 కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఇది అత్యంత ఖరీదైన క్రిస్మస్ చెట్లలో ఒకటిగా రికార్డు క్రియేట్ చేసింది.కంపెనీ ప్రతినిధి బెంజమిన్ సుమ్మ అందించిన వివరాల ప్రకారంప్రతీ ఏడాది ఇలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది తమ కంపెనీ 35వ వార్షికోత్సవానికి చిహ్నంగా ఈ గోల్డెన్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇది కేవలం పండుగ అలంకరణ మాత్రమే కాదనీ, బంగారం విలువ తెలియ చేయడం కూడా ఒక ముఖ్య అంశమని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు అత్యంత ఖరీదైన చెట్టుగా రికార్డుల్లో నిలిచిన ఘనత మాత్రం అబుదాబిలోని ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్లో ప్రదర్శించిన క్రిస్మస్ ట్రీకే దక్కుతుంది.2010లొ 43అడుగులతో 11.4 మిలియన్ డాలర్లు వెచ్చించి వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, ఇతర విలువైన రాళ్లతో దీన్ని తయారు చేశారు.