ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.
మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్‌కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.
క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.
సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్‌లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.
జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్‌కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి.
అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.
ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు.
- ప్రొ. చెరుకుపల్లి వంశీధర్
Comments
Please login to add a commentAdd a comment