Jesus Christ
-
Christmas 2024 లోక రక్షకుడు
మానవాళి ముక్తికొరకు మనుజావతారుడైన దైవం...జగతిలో భీతి బాపేందుకు దిగివచ్చిన దైవ తనయుడు...సర్వలోకానికి శాంతి సందేశం..దివిలోనూ భువిలోనూ వేడుక...పరలోక దూతావళి పరవశించి పాడిన వేళప్రతి హృదిలో క్రిస్మస్ ఆనందం...జగతిలో పాపం నిండినప్పుడు ప్రేమతో కలిసి జీవించాల్సిన ధరణి వాసుల హృదయాలు అసూయ, ద్వేషంతో రగులుతున్నప్పుడు చీకటి జలధిలో మునిగిన వారికి, శృంఖలాల్లో మగ్గేవారికి మరణ ఛాయలో బతికే వారికి ఒక ఆశాకిరణంగా... అరుణోదయ కాంతిగా... విమోచకుడిగా... జగద్రక్షకుడిగా రెండు వేల సంవత్సరాల క్రితం యేసుప్రభువు ఈ భువిపైకి అరుదెంచాడు. అదొక సుమనోహర ఘట్టం.. సర్వలోకాన్ని సంభ్రమాశ్చర్యాలతో విశేషంగా ఆకట్టుకున్న మధుర కావ్యం. తమను రక్షించే మెస్సయ్య కోసం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న విశ్వాసుల్లో నింపిన అంతులేని ఆనందం వెరసి స్తోత్ర గీతంగా స్తుతి గానంగా మారిన వైనం.. అందుకు యూదా దేశంలోని బెత్లెహేము వేదిక అయింది.ఆ సమయంలో రాజైన హేరోదు యెరూషలేము రాజధానిగా రాజ్యమేలుతున్నాడు. యూదా ప్రజలంతా తమను విమోచించే మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్న తరుణం. ఆ భాగ్యం కన్య అయిన మరియకు లభించింది. అప్పటికే గలిలయలోని నజరేతులో దావీదు వంశస్తుడైన యోసేపునకు మరియ ప్రదానం చేయబడింది. పరమ దేవుని ఆజ్ఞ మేరకు ప్రభువు దూత గబ్రియేలు ద్వారా ఈ శుభ వర్తమానం అందింది. ‘దయా ప్రాంప్తురాలా!’... అంటూ గబ్రియేలు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడే యవ్వన్రపాయంలో అడుగుపెడుతున్న మరియ ఎంతో భయపడింది.ఎందుకంటే ఆ కాలంలో దేవుడు కాని ఆయన దూతల దర్శనం అరుదుగా మారింది. ప్రవక్తలకు ప్రవచనాలు నిలిచి పొయాయి. నిశ్శబ్దకాలంగా చెప్పబడింది. అటువంటి తరుణంలో దేవుని దూత మరియ వద్దకు వచ్చి ‘భయపడకుము నీవు ధన్యురాలవు, దేవుని వలన నీవు కృప ΄పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆయన సర్వోన్నతుని కుమారుడనబడతాడు. అతని రాజ్యము అంతము లేనిదై వుంటుందని’ పేర్కొన్నాడు. దూత మాటలు మరింత విస్మయానికి భయానికి గురిచేశాయి. ఇది దేవాది దేవుని నుంచి వచ్చిన పిలుపుగా మరియ తెలుసుకుంది. ‘అయ్యో నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఏలాగు సాధ్యం?’ అని అడిగింది.‘మరియా! భయపడకు. దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడతాడని దేవదూత చెప్పిన మాటలను బట్టి ఇది దైవకార్యంగా గ్రహించి ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి దేవాది దేవుని తన గర్భంలో మోయడానికి సిద్ధపడింది. వాస్తవానికి వివాహం కాకుండా ఆ రోజుల్లో యూదా స్త్రీ గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపే ఆచారం ఉండేది. దేవుని దయ΄పొంది అంతులేని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను శిరసావహించడానికి ముందుకు వచ్చింది కాబట్టే మరియ స్త్రీలందరి లో ధన్యురాలిగా కొనియాడబడింది.అయితే మరియ గర్భవతియైన సంగతి తెలుసుకున్న యోసేపు కలత చెందాడు. నీతిమంతుడు కాబట్టి ఆమెను నలుగురిలో నగుబాటు చేయకుండా రహస్యంగా విడనాడాలని నిశ్చయించుకున్నాడు. ప్రభువు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియ గర్భము ధరించింది ఏ పురుషుని వలన కాదని పరిశుద్ధాత్మ వలన జరిగినదని మరియను చేర్చుకొనడానికి ఏమాత్రమూ సందేహపడవద్దని పుట్టబోవు శిశువునకు యేసు అని పేరు పెట్టాలని తన ప్రజలందరి పాపములనుండి ఆయనే రక్షిస్తాడని తెలుపడంతో యోసేపులో ఆవేదన తొలగిపొయింది. అంతేకాదు మరియ యేసుకు జన్మనిచ్చేవరకూ ఆమెను ముట్టకుండా జాగ్రత్త పడ్డాడు.ఇదే సమయంలో ఆరు నెలలకు ముందు మరొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. మరియ సమీప బంధువు రాలైన ఎలీసబెతు ఆమె భర్త జెకర్యా కురు వృద్ధులు. ఆ వయస్సులో దేవుడు వారికి సంతాన ప్రాంప్తి అనుగ్రహించాడు. దేవుని హస్తం వారికి తోడుగా వుండి ఒక మగ శిశువును దయచేసాడు. ఆ శిశువే తర్వాతి కాలంలో బాప్తీస్మం ఇచ్చు యోహానుగా పిలువబడి యేసు ప్రభు పరిచర్యకు ముందు ఆయన మార్గం సరళం చేసే సాధనమయ్యాడు.లేఖన ప్రవచనాలు నెరవేర్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు జననం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినా ఆయన ఆదిసంభూతుడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. ఆదియు అంతమునై యున్నాడు. మొదటివాడు కడపటి వాడుగా ఉన్నవాడు. జగత్ పునాది వేయకముందే వున్న యేసు కాలం సంపూర్ణమైనప్పుడు సాతాను చెరలో చిక్కుకున్న మానవుడు పాపానికి బందీగా మారి దేవుని సన్నిధికి దూరంగా వెళుతున్న తరుణంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా పతనమై ఏ నిరీక్షణ లేని సమయంలో నిత్య జీవమిచ్చి తిరిగి దేవునితో ఐక్యపర్చేందుకు భూమి మీద దేవుని కుమారుడిగా క్రీస్తు అవతరించాడు.యేసు పుట్టుకను క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితమే మీకా, యెషయా ప్రవక్తలు ప్రవచించడం విశేషం. ‘బెత్లెహేము ఎఫ్రాతా యూదా కుటుంబంలో స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏల బోవువాడు నీలో నుండి వచ్చును’ అని మీకా ప్రవచించగా ‘ఆలకించుడి కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును’ అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలనగా దేవుడు మనకు తోడని అర్థం.యేసు పుట్టుక ఆవశ్యకత గూర్చి యెషయా వివరించాడు. ‘ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని దృఢ పరచుటకు చెరలో నున్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు’ అని యెషయా ప్రవక్త చెప్పిన లేఖనాలు తన రాక ద్వారా నిజమయ్యాయని యేసుప్రభు తనపరిచర్యలో చెప్పడం విశేషం.ప్రజా సంఖ్యలో రాయబడటానికి యోసేపు మరియలు నజరేతు నుండి బెత్లెహేముకు రావాల్సి వచ్చింది. రెండింటి మధ్య 90 మైళ్ళ దూరం. రెండు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ప్రయాణ సాధనాలు లేనిరోజుల్లో నిండు చూలాలైన మరియను వెంటబెట్టుకొని బహు ప్రయాస కోర్చి చలికాలంలో బెత్లెహేము చేరుకున్నారు దంపతులు. జన సంఖ్య కోసం ఆ గ్రామం అప్పటికే క్రిక్కిరిసి పొయి ఉండటంతో ఎక్కడా స్థలం లేక ఓ పశువుల కొట్టమే వారికి అశ్రయమైంది. అర్థరాత్రి వేళలో క్రీస్తు జన్మించడంతో పశువుల తొట్టె క్రీస్తు పాన్పుగా మారిపొయింది. పరలోకాన్ని విడచివచ్చి పశువుల కొట్టంలో బాల యేసు పరుండాల్సి వచ్చింది. అతి సామాన్య కుటుంబంలో అతి సామాన్యంగా యేసు జన్మించాడు.యేసు పుట్టుక శుభవార్త మొదట తెలిసింది సామాన్యులకే. ఊరి వెలుపల ΄÷లంలో గొఱె<లను కాచుకుంటున్న పశు కాపరుల వద్దకు ప్రభువు దూత వచ్చి వారి మధ్య నిలచినప్పుడు ప్రభువు మహిమ వారిచుట్టూ ప్రకాశించగా వారెంతో భయపడ్డారు. అందుకు దూత ‘భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మీకు తీసుకు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అంటూ శిశువు ఆనవాలు తెలియజేయడం జరిగింది. అప్పుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూతల సమూహం ‘సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక’ అంటూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడారు. యేసు పుట్టుక కేవలం యూదా ప్రాంంతానికే పరిమితం కాలేదు. యేసుక్రీస్తు జన్మవిశేషం తెలియజేస్తూ ఆకాశంలో ఓ వింత తార వెలిసింది. దాన్ని చూసిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రోజును వెతుక్కుంటూ యెరూషలేము చేరుకున్నారు. తుదకు బెత్లెహేము లో పుట్టాడని తెలుసుకొని శిశువును పూజించి తాము తెచ్చిన బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలను సమర్పించి అత్యానందభరితులై తిరిగి వెళ్లారు. ఈ విధంగా యేసు పుట్టుక ఒక విశ్వ వేడుకగా మారింది.రక్షణ తెచ్చిన క్రిస్మస్ యేసు పుట్టుక సర్వమానవాళికి రక్షణ అందించిది. యేసు పుట్టుక పరమార్థమే అది. పాప పంకిలమైన మానవ జాతిని రక్షించడానికే యేసు జన్మించాడు. దేవుని ఆజ్ఞ మీరడం ద్వారా దేవుడు సృజించిన తొలి మానవుడు ఆదాము, అతని భార్య హవ్వ ఈ లోకానికి పాపాన్ని శాపాన్ని తీసుకు వచ్చారు. ఆ పాపానికి ప్రతిఫలంగా నర జాతి మొత్తానికి మరణం సం్రపాప్తించింది. అయితే ఆ శాపాన్ని పాపాన్ని కొట్టివేసి తద్వారా వచ్చిన మరణభయాన్ని తొలగించేందుకు క్రీస్తు అందించిన శిలువ యాగం ద్వారా రక్షణ ΄పొంది నిత్యజీవానికి వారసులై సదా కాలం క్రీస్తుతో నివసించే భాగ్యాన్ని క్రిస్మస్ మనకు అందించింది. క్రిస్మస్ ద్వారా రక్షకుడు ఈ లోకానికి వచ్చి ప్రజలందరి రక్షణార్థం పాపపరిహారార్థ బలిగా శిలువపై తనను తాను సమర్పించుకున్నాడు. యేసు శిలువలో కార్చిన రక్తం ద్వారా పాప విమోచన. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. మానవుడు దేవునితో పరలోకంలో ఉండే భాగ్యం అందించడానికి దేవుడు మానవుడిగా అవతరించాల్సి వచ్చింది. అందుకు క్రీస్తు పుట్టుక వేదికగా మారింది. అప్పుడు ఈ ధరిత్రి మీద మానవునిగా జన్మించిన యేసు ఇప్పుడూ నీవు ఆహ్వానిస్తే నీ హృదిలో ఆత్మరూపుడై వసించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీలో నిత్యసంతోషం నింపుతాడు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సంతోషం... సమాధానం తెచ్చిన క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. క్రీస్తు పుట్టుక సమయంలో కురేనియ, సిరియా దేశమునకు అధిపతి అయిన కైసరు ఔగుస్తు మొదటి ప్రజాసంఖ్య ప్రకటించాడు. ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక అంశాలతో తెలియ చేయబడిన క్రీస్తు జననం ఒక కల్పితకథ కాదు ఒక చారిత్రాత్మక సత్యం. ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు. క్రీస్తుకు ముందు... క్రీస్తు తర్వాతగా కాలం రెండుగా విభజింపబడటయే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ.– బందెల స్టెర్జి రాజన్ సీనియర్ పాత్రికేయులు -
Christmas 2024 ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది
ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్‌కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి. అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. - ప్రొ. చెరుకుపల్లి వంశీధర్ -
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు. -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె -
హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్‌ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్‌లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
ఆయన ప్రణాళిక అమోఘం
దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! బలము తెచ్చుకొని వెళ్ళుము... నిన్ను పంపిన వాడను నేనే (న్యాయా 6:14). కష్టించి పనిచేసిన తరువాత చేతికొచ్చిన ప్రతిఫలం కళ్ళముందే ఎవరైనా తన్నుకుపోతే ఎంత బాధ ఉంటుందో కదా? చెమటోడ్చి సంపాదించిన వాటిని శత్రువులొచ్చి తీసుకుపోతే ఎంతటి వేదన గుండెలోతుల్లో ఉంటుందో కదా? చాలా సంవత్సరాల క్రితం గిద్యోను కాలంలో కూడా ఇశ్రాయేలీయులు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. ఆ విపత్కర సమయంలో దేవుడు గిద్యోనుతో పలికిన మాటలు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. తన ప్రజలను రక్షించడానికి గిద్యోను మీద ఉంచబడిన బాధ్యత చాలా గొప్పది. అనాది నుండి దేవుడు తన ప్రజలను కొన్ని ప్రత్యేక ఉద్దేశ్యాల కోసం పిలుస్తూనే ఉన్నాడు. మహాశ్చర్య కార్యములను నెరవేర్చుటకు తన వారిని వినియోగించుకొంటూనే ఉన్నాడు. దేవుని పిలుపు వెనుక అద్భుతమైన పరమార్థం దాగి ఉంటుంది. కాలయాపన కోసమో, అనవసరంగానో దేవుడు ఎవ్వరిని పిలువలేదు... పిలువడు కూడా. ఆ కాలంలో మిద్యానీయుల భయంతో ఇశ్రాయేలీయులంతా కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకొరకు సిద్ధపరచుకొని వాటిలో నివసించేవారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటను దోచుకొనేవారు. కష్టార్జితం ఇల్లు చేరేది కాదు. చాలాకాలం కష్టించి, శ్రమించి పండించిన పంట చేతికొచ్చే వేళ మిద్యానీయులు వచ్చి సమస్తాన్ని కొల్లగొట్టేవారు. కొన్ని కొన్నిసార్లు విత్తనములు విత్తిన తరువాత మిడతల దండంత విస్తారంగా వారిమీదకు వచ్చి పంటను పాడుచేసి గొర్రెలను, యెడ్లను, గాడిదలను, జీవనసాధనమైన వాటిని దొంగిలించి వారిని బహుగా బాధించేవారు. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు చేరుకున్న తరుణంలో దేవుడు గిద్యోను ద్వారా వారిని రక్షించడానికి సంకల్పించాడు. అవును! ఆయన దివ్యమైన ప్రణాళికలు ఎప్పుడూ అమోఘమైనవే. భయకంపిత వాతావరణంలో బతుకుతున్న గిద్యోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి కొద్దిపాటి గోధుమలను దుళ్ళగొట్టి పొట్టను పోషించుకోవాలని ఆశిస్తున్న వ్యక్తిని దేవుడు ప్రజలందరికి దీవెనకరంగా మార్చాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు తమను తాము సమర్పించుకున్న ప్రతి ఒక్కరూ దేవుని నామమును అత్యధికంగా మహిమపరిచారు. దేవుని కార్యముల కోసం పిలువబడడం, నియమించబడడం ఎంత ఆశీర్వాదమో కదా. దేవుని సహవాసంలో ఉచితంగా లభ్యమయ్యే బలాన్ని పొందుకోవడమే మనకు అసలైన ఆశీర్వాదం! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
సువార్త: నీకున్న విలువ గొప్పది
లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి (1 కొరింథీ 6:20). ప్రపంచ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే పూర్వదినాల్లో కొన్ని దేశాల్లో ట్రేడ్ సెంటర్స్‌లో మనుష్యులను అమ్మేవారు, కొనుక్కొనేవారు. ఆఫ్రికా దేశాలనుండి మనుష్యులను తీసుకెళ్ళి సంతలో పశువులను కొనేటట్లుగా మనుష్యులను తమ ఇష్టాయిష్టాలతో పట్టింపు లేకుండా కొనుక్కొనేవారు. అలా ధనంతో కొనబడిన వ్యక్తులు జీవితాంతం వారికి సేవ చేయాల్సిన పరిస్థితులు ఉండేవి. యజమానుని మాటను జవ దాటకుండా పనిచేసేవారు. వారికి ఏ విషయంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండేవి కావు. చాలా పోరాటాల పిదప ఆ తర్వాతి కాలంలో వారికి విడుదల లభించింది. ప్రభువైన యేసుక్రీస్తు కలువరి సిలువలో తన అమూల్యమైన రక్తం ద్వారా ప్రతి మనుష్యుని కొనుక్కోవాలని ఇష్టపడుతున్నాడు. పాప బానిసత్వం నుండి, సాతాను బంధకాల నుండి విడుదల పొందాలని ఎవరు ఆశపడతారో వారిని తన నిష్కళంకమైన రక్తంతో కడిగి పవిత్రపరిచి వారిని ధన్యజీవులనుగా చేస్తాడు. దానిని విమోచించబడడం అంటారు. వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనము విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషాన్ని నిష్కళంకమునగు గొర్రెపిల్లవంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా (1 పేతురు 1:18–19) అని పేతురు చెప్పిన మాటలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. తన ఉచితమైన కృపద్వారా దేవుడు మనలను కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. ఆయన స్వకీయ సంపాద్యం. రక్షింపబడక పూర్వం ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకుడు. కాని క్రీస్తు మన కోసం వెల చెల్లించటం ద్వారా మనం ప్రయోజనకరమైన వారిగా తీర్చిదిద్దబడ్డాము. లోకంలో మనకున్న విలువ డబ్బుమీద, లేదా అంతస్థుల మీద లేదు గాని దేవుడు విలువపెట్టి మనలను కొన్నాడు గనుక మనం ఖచ్చితంగా విలువగలవారమే. క్రీస్తు మనలను కొనుక్కున్నది మన జీవితాల ద్వారా ఆయనకు మహిమ రావాలని. మన దేహాల ద్వారా దేవుడు ఘనపరచబడవలెనని కోరుతున్నాడు. పాప పంకిలమైన లోకంలో క్రీస్తు ప్రతినిధులుగా బ్రతుకుచూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడాలన్నది దైవ ప్రణాళిక. దేవుడు మనలను కొనుక్కున్నాడు గనుక మనమీద సంపూర్ణ అధికారం ఆయనదే. సిలువలో సంపూర్ణంగా వెలను చెల్లించాడు గనుక ఆయన కోసం మనం జీవించాలి. ఆయన పాలన నియంత పాలన వంటిది కాదు. ఆయన మనలను కొనుక్కొన్నప్పటికి మనమీద పెత్తనం చెలాయించడు. కృపామయుడైన దేవుడు ప్రేమ పూర్వకంగా ఆదేశిస్తాడు. ఆయన ఆదేశాలకు లోబడడం మనకే ప్రయోజనం. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు మనకు మంచి భవిష్యత్తును అనుగ్రహించునట్లుగా, నిరీక్షణ కలుగచేయునట్లుగా సమాధానకరములైనవే గాని హానికరములు కావు. ప్రియస్నేహితా! పరిస్థితులను బట్టి ఎన్నడును కృంగిపోకు. మనుష్యులు నిన్ను తక్కువగా చూస్తున్నారని బాధపడకు. నీవు సర్వశక్తుడైన దేవుని చేతిలో చెక్కబడ్డావు. నిన్ను ఎట్టి పరిస్థితులలో చేజారనియ్యడు. అపవాది చేతికి మరలా అప్పగించడు. ధైర్యంగా ఉండు. – డాక్టర్ జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
Easter Special: లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం
యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. సీయస్ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు. వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము. వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది. శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ప్రాముఖ్యమైనవి. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’ యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’. ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సర్వోన్నతునికి.. సమాధి సంకెళ్లు వేయగలదా..?
యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండీ మానవాళి చరిత్ర ఆయన చుట్టూనే పరిభ్రమిస్తున్నది. కాలం తనకు ముందు, వెనుక క్రీస్తు నామాన్ని ధరించి సాగుతూ ఉన్నది. భూమిమీద మరణాన్ని జయించి, శత్రువు తలను చితగ్గొట్టి, పునరుత్థానుడై, నలభై దినాలు ఈ నేలమీదే సంచరించి, దేవుని రాజ్య విషయాలను బోధించి, అనేక ప్రమాణాలను చూపిన ఏకైక దైవ మానవుడు, దేవుని అద్వితీయ కుమారుడు యేసు ప్రభువు! యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడైన రాజు అని అర్థం. ఈ ‘రక్షకుడు’ రారాజుగా మానవజాతికి శత్రువైన మృత్యువును జయించి, నరకపాత్రులమైన మనం పోగొట్టుకున్న స్వర్గం అనబడే నిత్యానందలోకంలోకి ప్రవేశాన్ని కల్పించాడు! అందుకే .. ఆ పేర్లు! ఆయన ఆరోహణ కోసం వెళ్ళేముందు యెరూషలేములోని ఒలీవా పర్వతసానువులలో తన శిష్యులను కలసి, వారు చేయవలసిన పనులను వారికి వివరించారు. ‘పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చినప్పుడు మీరు శక్తినొందెదరు గనుక ముందుగా యెరూషలేములోనూ, తర్వాత యూదయ, సమరయ దేశములలో, అనంతరం భూదిగంతాల వరకునూ మీరు నాకు సాక్షులైయుందుర’ని వాళ్లతో చెప్పారు. అందుకే, భూ దిగంతాల వరకూ ఈ సత్య శుభవార్త ప్రకటింపబడుతున్నది! వాళ్లు చూస్తుండగానే ఆయన ఆరోహణమై, వాళ్ల కళ్లకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొని పోయింది. వారంతా ఆకాశము తట్టు తేరి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ‘మీ వద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన యేసు ఏరీతిగా పరమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.’ అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో ఈ వివరాలున్నాయి. క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై.. తాను జీవాధిపతి అని, నశించిన దానిని వెదకి రక్షించి నిత్యజీవం ఇవ్వడానికి వచ్చానని రుజువు పరచి ఇప్పటికి ఈ నేల మీద 2000 సంవత్సరాలకు పైగా అయింది! ఆయనకు ముందు చరిత్ర అంతా ‘క్రీస్తుకు పూర్వం’ అని, తర్వాతి కాలమంతా ‘క్రీస్తు శకం’ అని చరిత్ర నమోదు చేస్తున్నది. చరిత్రలో ప్రముఖులైన ఎందరో క్రీస్తును గురించి తమ అభిప్రాయాలను ప్రకటించారు. ఫ్రెంచ్ అధినేత నెపోలియన్ బోనాపార్టే, ప్రపంచ దేశాల స్థాపకుల గురించి చెప్తూ ‘ఈ భూమి మీద సామ్రాజ్యాలను స్థాపించిన అలెగ్జాండర్, సీజర్ , నేను, చార్ల్ మాన్ .. యేసుక్రీస్తుతో ఏ విధముగానూ సరి పోలము .. మా మధ్య ఏ పోలికా లేదు, ఆయన ‘ప్రేమ’ పునాదిగా స్థాపించిన మహా సామ్రాజ్యం అంతమే లేనిది. ఎప్పటికీ నిలిచి ఉండేది! యేసుక్రీస్తు మానవుడు కాదు, మహోన్నతుడు!’ ‘ప్రేమ, సత్యం, త్యాగం అనే దివ్యమైన సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలను సాధించి, జీవించి , చూపించిన యేసుక్రీస్తును నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను?’ అన్నారు మన గాంధీజీ. అల్బర్ట్ ఐన్‌స్టీన్ మాటల్లో ‘నేను యూదుడనే, గానీ, ఆ నజరేయుని (క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రవాహంలో మునిగి పోయాను. క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని ఏ కలమూ వర్ణించలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వారెవరైనా యేసు సాన్నిహిత్యాన్ని అనుభవించాల్సిందే!’ స్వామి వివేకానంద చెప్పిన మాటలు కూడా చూద్దాం ‘యేసుక్రీస్తు దైవ కుమారుడు గనుకనే, దైవ జ్ఞానాన్ని తన మాటల్లోనూ, కార్యాల్లోనూ చూపించారు, ప్రకటించారు.’ ఇలా ఎందరెందరో క్రీస్తు ప్రభువును గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభువు చెప్పారు... ‘తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో, నేను మిమ్మును ఆలాగు ప్రేమించితిని. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకని నొకడు ప్రేమింపవలెను అనుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు.’ సిలువ మీద బలియాగం అయిన యేసు క్రీస్తు మృత్యుంజయుడై 40 దినములు ఈ భూమి మీద సంచరించి, అనేకమందికి దర్శనమిచ్చి, వాళ్లు చేయవలసిన విధివిధానాలను చెప్పి ఒలీవాల కొండ మీద తన శిష్యులతో చెప్పవలసిన మాటలు చెప్పి, దాదాపు 500 మంది యెరూషలేము వాస్తవ్యులు చూస్తూ ఉండగానే మేఘాలలోకి ఆరోహణమయ్యారు. అప్పుడు ఇద్దరు దేవదూతలు అక్కడ నిలబడి ఆ ప్రజలకు చెప్పారు.. ‘యేసుక్రీస్తు ఏ విధంగా పరలోకమునకు మేఘాలపై ఆరోహణమై వెళ్లారో, ఆ విధంగానే ఆయన తిరిగి వస్తార’ని! ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారిని మేఘ వాహనం మీద తీసుకుని వెళ్తారు, తర్వాత ఆయన తీర్పు తీర్చే రోజు ఒకటి ఉన్నది. మృత్యుంజయుడు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోయే ఆ క్షణం కొరకు మనం సిద్ధపడాలి. దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యమైన ఆ పరలోకానికి పాత్రులమయ్యేందుకు ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగుదాం. ఈ పునరుత్థాన పండుగ మనకిచ్చే సందేశం అదే. అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు! దేవుడు మనందరినీ తన పునరుత్థానశక్తితో దీవించును గాక! – ఝాన్సీ కె. వి. కుమారి -
Good Friday Special: వెలుగు పూలు పూయించిన కలువరి సిలువ
మానవాళి రక్షణ కోసం మహోన్నతుని సిలువ యాగం మరణ భయాన్ని పటాపంచలు చేసింది. సాతాను కోరలు చీల్చి వేసింది. అంధకార బంధురమైన జీవితాల్లో వెలుగు పూలు పూయించింది. నిరీక్షణ లేని జీవితాల్లో వెలుతురు కిరణాలు ఉదయింపజేసింది. కరుణామయుని శిలువ యాగం గెత్సెమనే తోట నుంచే ప్రారంభమయింది. శుక్రవారం సిలువకు అప్పగించకముందే గెత్సెమనే తోటలో తన రక్తం స్వేదబిందువులుగా మారే వరకూ ప్రార్థనలో గడిపాడు. లోక పాపాన్నంతా తన వీపుపైన మోసేందుకు సిద్ధమయ్యాడు. ఓ తరుణంలో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నానుండి తొలగించమని ప్రార్థించినా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకే సిద్ధమయ్యాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుటకే ఏర్పాటు చేసిన మార్గం సిలువ మార్గం. ఒకవైపు గెత్సెమనే తోటలో రాత్రంతా ప్రార్థిస్తూ మానవ సాయం కోసం తన శిష్యుల వైపు చూశాడు. శోధనలో పడకుండా మెళకువగా వుండి ప్రార్థించండి అని చెప్పినా వారు నిద్రమత్తులై ఉన్నారు. అప్పుడే తాను ప్రేమించిన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా క్రీస్తు సిలువలో ప్రధాన పాత్రధారిగా మారి 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించేందుకు మత పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని గెత్సెమనేలో ముద్దుపెట్టుకొని మరీ యేసును అప్పగించాడు. యేసును ఒక బందిపోటు దొంగమీదికి వచ్చినట్లు కత్తులతో వచ్చిన వారిని చూసి కనికరపడ్డాడు తప్ప ఒక్క మాటయినను పలుకలేదు. తన శిష్యులు తనను వదిలి పారిపోగా ఒంటరియైన యేసు ప్రధాన యాజకుడైన కయప వద్దకు తీసుకువచ్చి వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి, ఇష్టము వచ్చినట్టు గుద్దారు. మరికొంతమంది అర చేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని హేళన చేశారు. ‘తన ప్రియ కుమారుని నలుగగొట్టడానికి ఆ దేవాది దేవునికి ఇష్టమాయెను’ అన్న లేఖనాలు ఈ విధంగా నెరవేరాయి. ఉదయం యేసును బంధించి అధిపతియైన పొంతి పిలాతుకు క్రీస్తును అప్పచెప్పారు. చివరకు అన్యాయపు తీర్పే గెలిచింది. యూదా మత పెద్దలకు భయపడి పొంతి పిలాతు యేసును సిలువకు అప్పగించాడు. వారు యేసును గొల్గొతా కొండకు తీసుకు వచ్చి చేతులు, కాళ్ళలో శీలలు కొట్టి సిలువకు వేలాడదీశారు. ఇరు పక్కల ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేశారు. ‘‘దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కడతానన్నావుగా చేతనైతే నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా’’ అంటూ దూషిస్తూ ‘‘వీడు ఇతరులను రక్షించెను గానీ తన్ను తాను రక్షించుకోలేడంటూ’’ అపహాస్యం ఒకపక్క, రోమా సైనికుల కాఠిన్యం మరోపక్క యేసును బాధపెట్టినా తన తండ్రి మానవుల రక్షణ కొరకు తలపెట్టిన బలియాగంలో తాను సమి«ధగా మిగిలి పోవడానికే సిద్ధపడ్డాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సిలువ మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. మిట్ట మధ్యాహ్నం ఆ ఎండ వేడికి తాళలేక యేసు మూర్ఛబోయాడు. దాహం అని అడుగగా చేదు చిరకను అందించారు. కొరడాలతో, మేకులతో ఒళ్ళంతా రక్తం ధారలుగా కారుతుండగా చనిపోయాడో లేదోనని పక్కలో బల్లెంతో పొడిచారు. ఆ సమయంలో యేసు మాటలాడిన ఏడు మాటలు ఎంతో శ్రేష్టమైనవి. తనను హింసిస్తున్న వారిని చూసి యేసు ప్రభువు ‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’మంటూ చేసిన ప్రార్థన నభూతో న భవిష్యతిగా చెప్పుకుంటారు. మనలను హింసించే వారి కోసం ప్రార్థించాలి అన్న యేసు సిలువలో తనను చంపుతున్న వారి కోసం చేసిన ప్రార్థన అది సాధ్యమే అని నిరూపించాడు. తనతోపాటు సిలువ వేయబడిన కుడివైపు దొంగ, ‘ప్రభువా నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకోవాలి’ అంటే ఆ క్షణంలో రక్షణను అనుగ్రహించి నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయమొసంగిన జాలిగల ప్రభువు. విశ్వాసంతో ప్రార్థిస్తే ఎటువంటి వారికైనా రక్షణ భాగ్యం దొరుకుతుందన్న ఆశావాదాన్ని కలిగించాడు. క్రీస్తు సిలువ మార్గం, ముక్తి మార్గం పాపంలో నశించిపోతున్న మానవాళి ముక్తి కొరకు ఒక మంచి గొర్రెల కాపరిగా తాను ప్రేమించి గొర్రెల కోసం తన ప్రాణాన్ని కలువరిపై ధారపోసి మరణ భయంతో ఉన్నవారికి నిత్యజీవం అనే వెలుగును ప్రసాదించాడు క్రీస్తు.. రెండు వేల సంవత్సరాలైనా ఆ వెలుగు పూలు అందరి మదిలో వెలుగుతూనే ఉన్నాయి. – బ్రదర్ బందెల స్టెర్జిరాజన్ -
వైభవంగా క్రిస్మస్ వేడుకలు
గుణదల (విజయవాడ తూర్పు)/అనంతపురం కల్చరల్: లోక రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగానున్న క్రైస్తవులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. చర్చి ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీ విశేషంగా ఆకట్టుకోగా.. పశువుల పాకలో కొలువైన బాలయేసును భక్తి శ్రద్ధలతో పూజించారు. కాగా క్రైస్తవ విశ్వాసులు, యాత్రికులు పెద్ద సంఖ్యలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి చేరుకోవడంతో గుణదల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. అనంతపురంలో క్రిస్మస్ ప్రార్థనలకు హాజరైన భక్తులు రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు మాట్లాడుతూ.. యేసుక్రీస్తు ఆచరించి చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అనంతపురం ఎస్ఐయూ చర్చిలో జరిగిన వేడుకల్లో శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. గుణదల మేరీమాత ఆలయం వద్ద భక్తుల సందడి -
ఇలపై జనించిన కరుణ కిరణం
‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహమందున...చెంత చేరను రండి సర్వజనాంగమా..సంతసమొందుమా!’ అని హృదయపూర్వకంగా కీర్తన పాడే సుదినం క్రిస్మస్. సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకంలో బాలునిగా జన్మించిన యేసుక్రీస్తు ఆగమనాన్ని కీర్తించే సంతస దినం క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా నేడు కోట్లాదిమంది హృదయాల్లో ఆనందం పెల్లుబికే రోజు. ఇది చారిత్రాత్మక పర్వదినం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. తన మనస్సును దేవుని ప్రేమతో నింపుకొని పరిపూర్ణ ఆరాధనలో పరవశిస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొలపాలనే ఆశతో నిండిన వ్యక్తి కలం నుండి జాలువారిన మాటలివి. ‘ఓ సద్భక్తులారా! లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాధిరాజు ప్రభువైన క్రీస్తుకు నమస్కరింప రండి... నమస్కరింప రండి’. చాలా సంవత్సరాల కిందట ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్ని వేలానికి సిద్ధపరిచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటకు చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని స్వంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలా మంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు అని దూత రాత్రివేళ పొలంలో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు అనేది లేఖన సత్యం (రోమా 2:23). పాపం దేవునికి మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపంలో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడిచేశాడు. క్రిస్మస్ దేవుడు మనకు సమీపంగా వచ్చాడన్న సందేశాన్ని జ్ఞాపకం చేస్తుంది. కన్యక గర్భవతియై కుమారుని కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని క్రీస్తు పుట్టుటకు కొన్ని వందల సంవత్సరాల ముందు యెషయా అనే ప్రవక్త ప్రవచించాడు. ఇమ్మానుయేలను మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం. మనతో మనలో నివసించడానికి ప్రభువు ఇష్టపడి కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించాడు. మరియ యోసేపులు నజరేతు నుండి బేత్లెహేమునకు వచ్చినప్పుడు సత్రంలో వారికి స్థలం లేనందున యేసును కనిన తరువాత మరియ ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టింది. ఊహకు అందని ఆశ్చర్యం అది. సర్వశక్తిగల దేవుడు భువిలో జన్మిస్తే ఆయన్ను పరుండబెట్టాల్సిన స్థలమా అది? అయితే ప్రభువైన దేవుడు పశువుల శాలలో మరియు తొట్టెలో పరుండబెట్టుట వలన మొదటిగా అతి సామాన్యులైన గొర్రెల కాపరులు నిర్భయంగా దర్శించగలిగారు. ఆ కాలంలో గొర్రెల కాపరులను చాలా తక్కువగా చూసేవారు. అలాంటి అభాగ్యులకు దేవుని దర్శన భాగ్యం కలిగింది. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. జీవిత ద్వారాలు తెరిచి సందేహాలు మరిచి దేవున్ని తలిస్తే దేవుని స్పర్శను అనుభవించగలము. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్టించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైక వేద్యం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ నిన్ను వీడనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు వారిని నడిపించింది. ఆ సందర్భంలో వారు అత్యానందభరితులయ్యారు అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించడంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించ గలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్ధం వేరే వుండదు. నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు...కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు అని ఒక అపర కుబేరుడు మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. భౌతిక అవసరాలు తీర్చబడితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. క్రీస్తుకు తన హృదయంలో చోటివ్వడం ద్వారా తాను పొందిన అనుభూతిని ఒక వ్యక్తి ఇలా వర్ణిస్తాడు. ‘దేవుడే నా యిల్లు. గడచిన కాలమంతా అంతంలేని దారుల్లో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి భయాలు ఆవరించినప్పుడు రక్షకుడైన క్రీస్తును దర్శించాను. ఆయన ప్రేమగల కౌగిల్లో జీవించాలని నిర్ణయించుకున్నాను. దేవుడే నాకు ఆనందంతో పాటు అన్నీ అనుగ్రహించాడు’. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్ధం. దేవుడు అందరికి సమీపంగా ఉండువాడు. ఆయన ఎవ్వరిని త్రోసివేయడు అన్న సత్యం మనుజాళికి ఎంతో ఊరట నిచ్చింది. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
‘నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా మరింతగా వెలుగుతోంది'!
అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు! మనలో చాలా మందికి క్రిస్టమస్ పండుగ చాలా ప్రత్యేకం. క్రీస్తు జన్మార్ధమైన ఈ పర్వదినాన బంధుమిత్రులతో, విందు భోజనాలతో, బహుమతులతో సందడిగా ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడపాలనేది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. అలాగే జరుగునుగాక! ఐతే క్రిస్టమస్ పండుగ సందర్భంగా మీ ప్రియమైనవారికి ఖరీదైన గిఫ్టులివ్వలేకపోయినా, కోట్ల విలువచేసే చిన్న పలకరింపు, చక్కని మాటలతో పేర్చిన మెసేజ్‌లను పంపినా వారెంతో మురిసిపోతారు. సోషల్ మీడియాలో షేర్ చేయదగిన అట్లాంటి కొన్ని కోట్స్, గ్రీటింగ్స్, మెసేజెస్‌లు, ఫొటోలు మీకోసం.. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు!' మీ సెలవులు ఆనందంతో నిండునుగాక... క్రిస్మస్ శుభాకాంక్షలు! నిజమైన క్రిస్మస్ ఆశీర్వాదం మనం స్వీకరించే బహుమతుల్లో ఉండదు. పండుగను ఆనందంగా మలిచే కుటుంబంలో ఉంటుంది. మీ క్రిస్మస్ అద్భుతమైన అన్ని విషయాలతో నిండుగా ఉండాలి. క్రిస్మస్ మెరిసే లైట్లు మీ హృదయాన్ని ఆశలతో నింపాలి. మీకు కావలసినవన్నీ శాంటాక్లాజ్ తేవాలని కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరమంతా ఆనందంతో నిండి ఉండాలి. ఈ సంతోషకరమైన రోజున ఇవే మీకు నా శుభాకాంక్షలు. మేరీ క్రిస్మస్! ఈ హాలిడే సీజన్ మీకు శాంతి, శ్రేయస్సు, కోరుకున్న అన్ని బహుమతులను తెస్తుందని ఆశిస్తున్నాను! హ్యాపీ హాలిడేస్! క్రిస్మస్ మీకు ప్రేమ, ఆనందం, శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాను. మీ క్రిస్మస్ ఆనందాలతో, బహుమతులతో నిండి పోవాలి. హ్యాపీ హాలిడేస్! ఈ క్రిస్మస్ మీ ఇంటిలోని ప్రతి మూలను, మీ హృదయాన్నంతటిని ఆనందంతో నింపుతుందని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! ఈ పండుగ ఆనందం మీ జీవితాన్ని ఆనందం, శాంతితో నింపుతుంది. చదవండి: Good News! ఇక డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండానే ఆన్లైన్ షాపింగ్! ఆనందం, ఐశ్వర్యం, శాంతి అనే గిఫ్ట్ ఫ్యాక్‌లను ఈ క్రిస్మస్ రోజున మీరు విప్పాలని ఆశిస్తున్నాను! ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు కోరుకునేవన్నీ శాంతా క్లాజ్ మీదగ్గరకు తీసుకురావాలి. ఈ క్రిస్మస్ రోజున మీ హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుందని ఆశిస్తున్నాను. నా ప్రతి రోజును ఆనందంగా మార్చే నా ప్రియమైన ఫ్రెండ్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు. నా క్రిస్మస్లో హ్యాపీనెస్‌ను ఉంచి, నిజమైన స్నేహితుడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఈ క్రిస్మస్ రోజున మీ ఆనందం పెద్దగా, మీ బిల్లులు చిన్నవిగా ఉండాలని కోరుకుంటున్నాను! మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022! ఈ కొత్త సంవత్సరం మీకు అన్నీ శుభవార్తలనే తెస్తుంది. క్రిస్మస్ మీకు మంచి ఆరోగ్యం, అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీపై నాకున్నప్రేమ క్రిస్మస్ చెట్టులోని లైట్ల కన్నా దేదీప్యమానంగా వెలుగుతోంది! మీలాంటి ఫ్రెండ్స్ నాతో ఉండటమే క్రిస్మస్ అందించే అత్యుత్తమ గిఫ్ట్. క్రిస్మస్ శుభాకాంక్షలు! (మీరు మీ సన్నిహితులకు మేరీ క్రిస్మస్ విషెష్ తెలియజేయండి ఇలా..) -
హృదయమనే పలక మీద దేవుడుంటే..?
నీ హృదయమను పలకమీద వాటిని రాసికొనుము. సామెతలు 7:3. ఈ సువిశాల ప్రపంచంలో మానవుడు దేవుని రూపంలో, పోలికలో సృషించబడ్డాడు. ప్రతి మనిషికి హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని ఎలా నిర్వచించగలము? దానిని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం ఎలా? పరిశుద్ధ గ్రంథంలో మానవ హృదయాన్ని గురించి అనేక వచనాలు ఉన్నాయి. సామెతల గ్రంథకర్త సొలొమోను మనిషి హృదయాన్ని పలకతో పోల్చి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను వివరించాడు. పలక తెలియనివారెవ్వరు? పూర్వదినాల్లో ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ కాలం భద్రపరచాలనుకున్నప్పుడు వాటిని రాతి పలకల మీద రాసేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు జరుపుతున్న తవ్వకాలలో చాలా రాతి పలకలు బయటపడుతున్నాయి. వాటిమీద రాసిన విషయాలను బట్టి ఆయా కాలాల చరిత్రను, ఆ కాలంలో జరిగిన సంగతులను అర్థం చేసుకొంటున్నారు. బైబిల్ రాతలను, చరిత్రను సమర్థించే చాలా పలకలు నేటికీ ఉన్నాయి. విన్న విషయాల కన్నా చేతితో రాయబడినవి ఎక్కువ కాలం గుర్తుంటాయన్నది పెద్దల మాట. మానవ హృదయం కూడా ఒక పలకే. అనునిత్యం వాటిమీద ఏం రాసుకొంటున్నాము అనేది మన భవిష్యత్తును శాసిస్తాయి. హృదయం నిండియున్న వాటిని బట్టి నోరు మాట్లాడుతుంది అని బైబిల్ సెలవిస్తుంది (లూకా 6:45). కొందరు తమకు హాని చేసినవారి వివరాలు హృదయమనే పలక రాసుకొని ఎప్పటికైనా వారికి ప్రతీకారం చేయాలని కనిపెడతారు. కొందరు యవ్వనస్థులు తాము ప్రేమించే వారిని వారి హృదయాల్లో చెక్కుకుంటారు. అనుక్షణం వారి కోసం జీవిస్తారు, తపిస్తారు. రోజులో ఎక్కువ సమయం వారి గురించే ఆలోచిస్తారు. ఒక్క విషయం స్పష్టంగా ఆలోచించాలి. హృదయమనే పలక మీద ఎవ్వరిని చెక్కుకుంటే, వేటిని రాసుకొంటే వారే జీవితాన్ని శాసిస్తారు. మన ఆలోచనలను, తలంపులను, అలవాట్లను పురికొల్పుతారు. ఇప్పటికిప్పుడు నీ హృదయమనే పలకను పరిశీలిస్తే తీస్తే ఎవరెవరి పేర్లు, జీవితాలు బయటకు వస్తాయి? నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. తన కోసం తాను కట్టుకున్న ఇల్లు అది. దానిని మినహాయించి నీవు దేవునికి ఏం ఇచ్చినా ఆయన సంతృప్తి చెందడు. రకరకాల రాతలు రాయబడిన నీ హృదయమనే పలకను ఒక్కసారి తుడిచేయి! యేసుక్రీస్తు అనే సుమధుర సుందర నామాన్ని లిఖించు. అద్భుతాలు చూస్తావు. ‘‘మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రిక మీరు’’ అని పౌలు దేవుని బిడ్డల ఔన్నత్యాన్ని తెలియచేశాడు. రక్షింపబడిన నీవు దేవుని పత్రికవు. అనుక్షణం ప్రజల చేత చదువబడుచున్నావు. లోకం నిన్ను అడుగుడుగునా గమనిస్తుంది. నీ హృదయమనే పలక మీద క్రీస్తుకు చోటుంటే ఆయన వాక్యానికి చోటున్నట్లే. దేవుని వాక్యంతో హృదయాన్ని సంపూర్తిగా నింపుకుంటే శక్తిగల దేవుని మాటలనే నీవు వల్లిస్తావు. నిన్ను గమనించినవారంతా నీ హృదయమనే పలక మీద రాయబడిన క్రీస్తును, మహోన్నతమైన ఆయన ప్రేమను గమనిస్తారు. – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు
నా రక్షణకు మహిమకు ఆధారం దేవుడే (కీర్తన 62:7). తన జీవిత అనుభవాల నుండి దావీదు ఎన్నో కీర్తనలను రచించాడు. ఆ కీర్తనలు ప్రతి విశ్వాసి జీవితానికి ఎక్కడో ఒకచోట సంబంధం కలిగి ఉంటాయి. కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు దేవుణ్ణే ఆధారంగా భావిస్తూ సాగిపోయే వ్యక్తి ఖచ్చితంగా ధన్యజీవియే. జీవితయాత్రలో నిశ్చలమైన అనుభవాలతో ముందుకు సాగిపోవాలనే ప్రగాఢమైన కోరిక ప్రతి ఒక్కరికి తప్పక ఉంటుంది. దేవుని కృప ద్వారా అన్ని విషయాల్లో పైకి ఎదుగుతున్న వానికి శత్రువుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. నిలబడినవానిని కిందకు తోయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తుంటారు కొందరు. ఒరుగుతున్న గోడను కంచెను ఒకడు చాలా సునాయాసంగా పడగొట్టునట్లు నిల్చున్న వారిని పడగొట్టడానికి అనేకులు ముందుకొస్తారు. లోకసంబంధమైన వారి ఆలోచనలు ఎప్పుడూ ఎదుటివారి అభివృద్ధిని ఓర్వలేనివిగా ఉంటాయి. అటువంటి సందర్భాలలో విశ్వాసి స్పందన ఎలా ఉండాలన్న విషయాన్ని భక్తుడు నేర్పిస్తున్నాడు. మనలను సృష్టించిన దేవుని వలన మనకు రక్షణ, నిరీక్షణ, మహిమ కలుగుతున్నాయి. ఆయనను మించిన ఆశ్రయదుర్గం మనిషికి ఉండదు. మనిషి మహిమకరమైన జీవితాన్ని జీవించాలంటే మహిమాన్వితుడైన యేసుక్రీస్తును హృదయం లోనికి ఆహ్వానించాలి. ఏదెను తోటలో ఆదాము హవ్వలు కోల్పోయిన మహిమను మనుష్యజాతికి మరలా ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పాపం చేయుట ద్వారా మానవుడు దేవుని మహిమను యధేచ్చగా కోల్పోతున్నాడు. అందరునూ పాపం చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు (రోమా 3:23). పాపం వలన మనిషిలో భయం, ఆందోళన, కలవరం వంటివి రాజ్యమేలుతున్నాయి. ఆధ్యాత్మిక పతనం నుండి బయట పడాలంటే మానవుడు దేవుని మహిమతో మరలా నింపబడాలి. కోల్పోయిన మహిమను వెతుక్కునే ప్రక్రియలో మనిషి ఎన్నో భక్తికార్యాలు నిరంతరాయంగా చేస్తున్నాడు. దేవుని మహిమను కలిగి ఉన్నాననే నిశ్చయత నీకుందా? నీవు చేస్తున్న అవిధేయమైన కార్యాల ద్వారా నీవు కోల్పోతున్న వాటిలో చాలా ప్రాముఖ్యమైనది దేవుని మహిమ అని గుర్తించు. నీవు దేవునికి దూరమవటం ద్వారా సాతాను శక్తులు నీమీద విపరీతంగా దాడి చేస్తున్నాయి. నిన్ను నిలువుగా కుంగదీస్తున్నాయి. దురవస్థలోనికి నిన్ను నెట్టేస్తున్నాయి. ఇప్పుడే దేవుని ప్రశస్త సన్నిధిలో వేడుకో! చీకటిని వెనుకకు నెట్టి దేవుని ప్రకాశమయ సన్నిధిలో ప్రార్థించు. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. లోకరక్షణార్థమై యేసుక్రీస్తు కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అనిర్వచనీయమైన తన మహిమను ప్రతి ఒక్కరికి బహుమానంగా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఊహించలేని వెలుగుతో, తన దివ్య మహిమతో నిన్ను నింపగలిగే ఆయన ప్రేమగల దేవుడని సిలువ మరణం ద్వారా రుజువు చేయబడింది. సర్వశక్తుని దివ్య మహిమ మనిషికి అన్ని విషయాల్లో విజయాన్నిస్తుంది. నిత్యజీవానికి మనిషిని నడిపిస్తుంది. ఆమేన్!! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
నిన్ను నిలిపే దేవుడు ఉన్నాడు!
ఎత్తయిన స్థలములమీద ఆయన నన్ను నిలుపుతున్నాడు (కీర్తన 18:33). నిత్య జీవితంలో అనుదినం మనలో ప్రతి ఒక్కరం ఏదో పనిలో నిమగ్నమై ఉంటాము. అహర్నిశలు పని చేయడం కొందరికి ఆనందం, మరికొందరికి బాధ్యత. ఇష్టమైన పనిని ఎంత కష్టమైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చేసేస్తాం. ఇష్టం కాకపోతే సునాయాసం గా చేయగల పనులను కూడా వాయిదాలు వేస్తుంటాం. మనకు మనస్కరించని పనులకు ఏవేవో సాకులు చెబుతూ వాటిని పక్కనపెడుతుంటాం. సకల చరాచర సృష్టిని తన మహత్తయిన మాట ద్వారా సృష్టించిన దేవుడు కూడా తన సంకల్పాలను నెరవేర్చడానికి పనిచేస్తూనే ఉన్నాడు, ఉంటాడు కూడ. ఆయనకు పనిచేయడం ఇష్టం. బలీయమైన తన నిర్ణయాల నుండి ఎవ్వరూ ఆయన్ను పక్కకు తీసుకెళ్ళలేరు. తనను నమ్మినవారి యెడల తన ఉద్దేశాలను నెరవేర్చడం దేవునికి మహా ఇష్టం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు (యిర్మీ 29:11) వ్యతిరేక శక్తులు, ప్రతిబంధకాలు ఆయన్ను ఇసుమంతైనా నిలువరించలేవు. విశ్వాసంలో బలిష్టులను ఉన్నతస్థలాల్లో నిలబెట్టడం దేవునికున్న మహాశయం. చరిత్రలో ఎన్నో ఉదాహరణలు మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి. పెంటకుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తి వారిని తన ప్రతినిధులుగా ప్రపంచానికి పరిచయం చేయడం దేవుని అలవాటు. బెత్లేహేము పొలాల్లో గొర్రెలు కాసుకుంటున్న దావీదును ఇశ్రాయేలు రాజ్యానికి తిరుగులేని రాజుగా నిలబెట్టాడు. ఇప్పుడు పదుల సంఖ్యలో గొర్రెలను కాస్తుంటే... భవిష్యత్తులో వందల సంఖ్యలో కాచే అవకాశం ఉండచ్చు అని అందరూ అనుకొని ఉండవచ్చు. మానవ అంచనాలను పటాపంచలు చేసే శక్తి దేవునిది. ఊహలకు అందని మేళ్లు చేసే మహాఘనుడు మన దేవుడు. గొర్రెలు కాసుకొనే దావీదును ఇశ్రాయేలు రాజ్యాన్ని నలభై సంవత్సరాలు అద్భుతరీతిలో పాలించగలిగే రాజుగా నిలబెట్టాడు. రాజ్యాన్ని అప్పగించిన దేవుడు దావీదు ద్వారా ఎన్నో ప్రజోపకరమైన గొప్ప కార్యాలను నెరవేర్చాడు. ఎందరినో నిలబెట్టిన దేవుడు నిన్నెందుకు నిలువబెట్టడు? విశ్వచరిత్రలో కృంగిపోయినవారిని లేవనెత్తిన దేవుడు నిన్నెందుకు లేవనెత్తడు? నిరాశా నిస్పృహలో కూరుకొని ఏడుస్తున్నావా? పట్టించుకొనే వారెవరు లేరని దుఃఖిస్తున్నావా? పడిపోయిన మనిషిని నిలబెట్టడమే దేవుని పరిచర్య. ఎందుకంటే దేవుడు అందరిని అమితంగా ప్రేమిస్తున్నాడు. పాపమనే అగాథ స్థలములలో చిక్కుకుపోయిన మానవునికి తన కరుణ హస్తాన్ని అందించి వారిని ఉన్నత స్థలాలలో నిలబెట్టి తన ఔన్నత్యాన్ని ఋజువుపరచాలనే యేసుక్రీస్తు ఈ భువికేతించారు. నీవైపు తన చేతులు చాపి అన్ని విషయాల్లో నిన్ను నిలబెట్టాలని ఆశిస్తున్న దేవునికి నీ చేతిని విశ్వాసం తో అందిస్తే చాలు. ఉన్నతమైన అనుభవాలతో, ఆశయాలతో, ఆశీర్వాదాలతో నిన్ను నిలిపి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాడు. ఆమేన్! – డా.జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
అవమానాల్లోనూ ఫలించిన కొమ్మ
‘మనుషుల్ని భూకంపాలు చంపవు, భూకంపానికి కూలే భవనాలు చంపుతాయి’ అంటారు శాస్త్రవేత్తలు. గొప్పగా నిర్మించుకున్న మన జీవితాలనే భవనాలు అనూహ్యపు తుఫానులు, భూప్రకంపనలకు తట్టుకోలేక పేకమేడల్లా కూలితే అదే పెనువిషాదం!! అనుకోకుండా ఎదురయ్యే ఆత్మీయ భూకంపాల్లోనే విశ్వాసి జీవితపు పునాదుల ‘పటిష్టత’, అతని దైవిక విలువల ‘నిబద్ధత’ నిగ్గుతేలుతుంది. యాకోబు కుమారుడైన యోసేపు జీవితం 17 ఏళ్ళ నవయవ్వన ప్రాయంలోనే భయంకరమైన ఆత్మీయ భూకంపానికి గురయ్యింది. యోసేపు చాలా భక్తిపరుడన్న అసూయతో సోదరులే అతన్ని నిర్దాక్షిణ్యంగా ఈజిప్ట్ వర్తకులకు బానిసగా అమ్మేశారు. ఈజిప్తులో తన యజమాని భార్య కుట్రతో జైలుపాలై యోసేపు ఇంకా కృంగిపోయాడు. ఇలా వరుస భూకంపాలకు అతని జీవితం నిజానికి సమసిపోవాలి. కాని అతని పునాదుల పటిష్టత, దేవుని పట్ల చెరగని అతని నిబద్ధత, ముఖ్యంగా ఎడబాయని ‘దైవకృప’ లక్షలాదిమందిని భయంకరమైన కరువు కోరలనుండి కాపాడే ఆశీర్వాద స్థాయికి అతన్ని చేర్చింది. సునామీలో కుప్పకూలవలసిన ఒక జీవితం, లక్షలాదిమంది అభాగ్యులను తెప్పరిల్ల చెయ్యడం, దేవుడే చేసిన ఒక మహాద్భుతం. ఈ లోకంలో దైవభయం లేక స్వార్ధంతో సమస్యలు కొనితెచ్చుకునేవాళ్ళుంటారు. దైవభయం వల్ల ఉన్నతవిలువలకు కట్టుబడి సమస్యల్లో పడేవాళ్ళుంటారు. మరికొంతమందైతే అతి తెలివితేటలతో గొప్ప ‘ప్లానింగ్’ చేయబోయి బోర్లా పడుతుంటారు. కాని అనూహ్యమైన ప్రతికూలతల్లోనే వారి వారి ‘పునాదుల’ పటిష్టత రుజువవుతుంది. దేవుని మాటలు విని బండ మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు, దేవుని పక్కనబెట్టి ఇసుక మీద ఇళ్ళు కట్టుకునేవాళ్ళు అనే రెండు తెగల విశ్వాసులుంటారని యేసుప్రభువే తన కొండమీది ప్రసంగంలో పేర్కొన్నాడు (మత్తయి 7:24–27). దేవుని హృదయపూర్తిగా నమ్మినవాడు తాత్కాలికంగా చితికినా దీర్ఘకాలంలో దీవెనలు పొందుతాడు. వేషధారులు, స్వార్థ్ధపరులు, డబ్బు మనుషులు బాగున్నట్టే కనిపిస్తూ అకస్మాత్తుగా, శాశ్వతంగా దెబ్బ తింటారు. దేవుని కోసం నిలబడి నలిగినవాళ్ళు మాత్రం, దేవుని సాధనాలుగా మారి మానవాళి కి ఆశీర్వాదకారకులవుతారంటోంది బైబిల్. యోబు, మోషే, పేతురు, గిద్యోను, పౌలు, రూతు ఇలా ఎంతోమంది జీవితాల్లో కృంగి, కూలిపోయిన అనుభవాల్లోనే ‘దేవుని కృప’ అద్భుతంగా పరిమళించి, వారికి ఆశీర్వాదాల ద్వారాలు తెరిచింది. చరిత్రలో పాప విశృంఖలత్వానికి, హేయమైన అనేక సంస్కృతులకు పుట్టినిల్లయిన ఈజిప్తు దేశంలోకి, నిష్ఠ కలిగిన యూదు వంశానికి చెందిన యోసేపు ఒక బానిసగా అడుగుపెట్టాడు. అయితే ఉగ్గుపాలతో తల్లిదండ్రులు నేర్పిన దైవిక పాఠాల ‘బైబిల్’ను గుండెల్లో భద్రంగా దాచుకొని యోసేపు తన వెంట తెచ్చుకున్నాడు. చుట్టూ బురదలోనూ తామరలాగా ఆ బలంతోనే అవిశ్వాసుల మధ్య విశ్వాసిగా రాజీపడకుండా బతికాడు. పెనువిషాదాల్లోనూ అదే అతన్ని కాపాడి గమ్యాన్నిచ్చింది. ‘దేవుని ప్రేమ మనల్ని విడువదు, ఎడబాయదు’ అని, ‘పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు’ అని బైబిల్ చెబుతోంది (ద్వితీ 31:8), (యెషయా 54:10). యోసేపు జీవితంలో ఈ వాగ్దానాలు అక్షరాలా నెరవేరాయి. కాని ఇలా అందరి జీవితాల్లోనూ ఎందుకు జరగడం లేదు? ఎందుకంటే, ఈ వాగ్దానాలకు, ‘నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో అద్వితీయుడైన నీ దేవుని ప్రేమించాలి’ అన్న ఒక ముందస్తు షరతు ఉంది (మత్తయి 22:37–39). అంటే, బైబిల్ నమ్మే, చదివే వాళ్లందరికీ కాదు, దేవుని సంపూర్ణంగా, బేషరతుగా ప్రేమించేవారికి మాత్రమే దేవుని వాగ్దానాలు వర్తిస్తాయి. అందువల్ల, దేవుని వాగ్దానాలు నెరవేరనపుడు దేవుని ప్రేమించడంలో మనం ఎక్కడ వెనకపడ్డాము? అని ప్రశ్నించుకోవాలి. సగం లోకం లో, సగం దేవునిలో ఉంటే మనం సునామీకి సమీపంలో అన్నామని అర్థం. ఐగుప్తులో ఒక బానిసగా కాలు పెట్టింది మొదలు, యోసేపు చేసిన ఒకే ఒక పని, తాను విశ్వసించిన దేవుని సంపూర్ణంగా హత్తుకొని జీవించడమే!! అందుకే సునామీలు, భూకంపాల్లోనూ దేవుని కృప యోసేపును విడువలేదు, ఎడబాయలేదు. అతన్ని కష్టపెట్టిన అన్నలే కాదు, అన్నం లేని అనేక దేశాల లక్షలాది ప్రజలు యోసేపు ముందు తలవంచే స్థితిని దేవుడు కల్పించాడు. ‘నీటి ఊటలు, ఫలాలసమృద్ధితో గోడదాటి విస్తరించిన కొమ్మ యోసేపు’, అంటూ అతని తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన అలా అక్షరసత్యమైంది!! (ఆది 49:22). – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ఔదార్యంతో నడిచే పరలోకరాజ్యం!!
విశ్వాసిలో స్వనీతి వల్ల అసంతృప్తి తలెత్తడం, పక్కవాడు లాభపడితే అసూయ చెలరేగటం చాలా అనర్థదాయకం. దేవుని ‘సమ న్యాయవ్యవస్థ’పై అవగాహన లోపించినపుడు ఇలా జరుగుతుంది. అందుకే దేవుని అనంతమైన ప్రేమను, అపారమైన సమన్యాయభావనను ఆవిష్కరించే ఒక చక్కని ఉపమానాన్ని యేసుప్రభువు వివరించాడు (మత్తయి 20:1–16). ఒక భూ యజమాని తన ద్రాక్షతోటలో పనికి తెల్లవారుజామునే కొందరు కూలీలను ఒక దేనారానికి (దాదాపు 220 రూపాయలు) కుదుర్చుకున్నాడు. ఆలస్యంగా 9, 12, 3 గంటలకు ముఖ్యంగా సాయంకాలం 5 గంటలకొచ్చిన కూలీల్ని కూడా ‘మీకేది న్యాయమో అదిస్తాను’ అని చెప్పి ఆయన తన తోటలో పనికి పంపాడు. పని చివర కూలీలందరికీ యజమాని సమానంగా ఒక దేనారాన్నిచ్చాడు. అయితే ఎక్కువ సేపు, ఎక్కువ పని చేసినందుకు తమకు ఎక్కువ దొరుకుతుందని ఆశించి, భంగపడిన మొదటి కూలీలు తనపై సణుగుతుంటే, ‘మీకిస్తానన్న కూలి మీకిచ్చానుకదా? అందరికీ సమానంగా ‘పూర్తికూలీ’ నేనివ్వాలనుకొంటే మీకెందుకు బాధ? ఇది నా డబ్బు, నా ఔదార్యం!!’ అన్నాడా యజమాని. అవును మరి, దేవుని ఔదార్యం ముందు ప్రపంచంలోని మానవ నిర్మిత న్యాయవ్యవస్థలన్నీ దూదిపింజల్లా తేలిపోతాయి. న్యాయవ్యవస్థలకు నేరస్థుని శిక్షించడమే తెలుసు. చాలా సమాజాలకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమే తెలుసు. కాని కరడుగట్టిన నేరస్థుని కూడా ప్రేమించి, క్షమించి, సంస్కరించి, తన ప్రేమతో నింపి, అతన్ని సమాజానికి ఆశీర్వాదంగా మార్చే దేవునిది ఉహలకందని ఔదార్యం అన్నది బైబిల్ బోధించే అపూర్వ సత్యం, అద్భుతమైన పాఠం. దేవుని ‘ఔదార్యమే’ పరలోకరాజ్యాన్ని నడిపే రాజ్యాంగం!! మనం దేవుని పని ఎంత కష్టపడి పనిచేస్తున్నామన్నది కాక, ఎంత ‘ఇష్టపడి’ ఆనందంగా పనిచేస్తున్నామన్నది పరలోకపు యజమాని, న్యాయమూర్తి అయిన దేవుడు చూస్తాడు, తన ఔదార్యంతో దానికి ప్రతిఫలాన్నిస్తాడు. రాగానే తమకు పని దొరికిందని ఉదయాన్నే వచ్చిన కూలీలు మొదట ఆనందించారు, కాని ఆలస్యంగా వచ్చి, తక్కువ పని చేస్తున్న కూలీలకన్నా తమకు ఎక్కువ దొరుకుతుందన్న దురాశ తో తమ ఆనందాన్నంతా ఆవిరిచేసుకొని అసంతృప్తితో ఇళ్లకెళ్లారు. కాని చివరలో, ఒక గంట కోసమే వచ్చిన కూలీలు, ఎంతో కొంత కూలీ దొరికినా చాలు, ఆ రోజుకు తమ కుటుంబానికి అన్నం పెట్టుకోవచ్చుననుకొంటుంటే, అనూహ్యంగా ఒక పూర్తి దేనారం దొరకడంతో, యజమాని ఔదార్యానికి ఉబ్బితబ్బిబ్బై పట్టరాని ఆనందం తో ఇళ్లకు వెళ్లారు. అలా, మొదటి కూలీల ఆనందాన్ని ‘దురాశ’ అసంతృప్తి గా మార్చగా. చివరి కూలీల ‘కృతజ్ఞత’ వాళ్ళ దుఃఖాన్ని, లేమిని కూడా అవధుల్లేని ఆనందంగా మార్చిందన్న ‘విశ్వాస నిత్యసత్యాన్ని’ యేసు బోధించాడు. మనకు చెందనిదాన్ని ఆశించడం దురాశేనని, విగ్రహారాధనలాగే దేవునికది హేయమైనదని బైబిల్ చెబుతోంది (కొల 3:5). ఆకాశమంత ఎత్తయిన, మహాసముద్రాలంత లోతైన దేవుని ఔదార్యాన్ని కొలవడం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి, మహామేధావులకు కూడా అసాధ్యమే. కాని దేవుని ప్రేమస్పర్శ తో పరివర్తన చెందిన ఒక పాపి, నిరక్షరాస్యుడైనా సరే, దేవుని ఔదార్యాన్ని అనర్గళం గా వివరించగలడు. దేవునిపట్ల కృతజ్ఞత విశ్వాసి ఆంతర్యంలో అనంతమైన ఆనందపు ఊటల్ని సృష్టిస్తుంది. కాని అసంతృప్తి విశ్వాసి జీవితాన్ని ఆర్పి బూడిదగా మార్చుతుంది. విశ్వాసుల జీవితాల్లో నిత్యశాంతి, కుటుంబశాంతి కరువైందంటే తప్పకుండా వాళ్లలోనే ఏదో లోపమున్నట్టే. కొళాయి విప్పి దాని కింద బిందెను తలకిందులుగా పెడితే అది నిండుతుందా? దేవుని రాజ్య మౌలిక విలువలు, దేవుని రాజ్యాంగ నిర్దేశనలు, దేవుని ఔదార్యానికి అనువుగా ఎప్పటికప్పుడు జీవితాలను ‘సరిచేసుకునే’ విశ్వాసుల్లో అందుకే ఆనందం, సంతృప్తి, జీవన సాఫల్యం సమృద్ధిగా పొర్లిపారుతుంది. ‘నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు’ అన్నాడు ప్రభువు (యోహాను 15:5). దేవుని తోటలో పని దొరికితే, కేవలం ‘అదనపు డబ్బుకు’ ప్రలోభపడి దేవునికి దూరమైన ఈ ఏశావు బాపతు వాళ్ళనేమనాలి? అయితే, తాము పూర్తి కూలి పొందే అర్హత లేనివాళ్లమని గ్రహించి ఎంతో తగ్గింపుతో, కృతజ్ఞత తో దేవుని హత్తుకున్న చివరి కూలీలతోనే దేవుడు తన రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించుకొంటున్నాడు. మనమంతా ఆ వర్గం విశ్వాసులలోనే ఉండాలన్నది దేవుని అనాది సంకల్పం. ఎందుకంటే దేవుని రాజ్యం, మన అర్హతలతో కాదు, దేవుని ఔదార్యంతో నిర్మించబడుతుంది, నడుస్తుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అరణ్యంలో మారు మోగిన సువార్త స్వరం
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల అవిధేయత, విచ్చలవిడితనం పరాకాష్టకు చేరుకున్న రోజులవి. ధర్మశాస్త్రబద్ధమైన యూదుమతం పూర్తిగా మృతమై, దేవునికి ప్రజలకు మధ్య వంతెనల్లాగా, రాయబారులుగా ఉండాల్సిన ప్రవక్తలు లేకుండా పోగా, ప్రజలు దేవుణ్ణి పూర్తిగా విస్మరించి, యథేచ్ఛగా జీవిస్తున్నారు. యెరూషలేము ఆలయంలో బలులు, ఆరాధనలు యధావిధిగానే జరుగుతున్నా, వాటిని నిర్వహించే యాజకవ్యవస్థ కూడా ఉన్నా, యూదా మతమంతా పూర్తిగా ఒక నామమాత్రపు తంతుగా మారిన అధ్వాన్నపు పరిస్థితులవి. అయితే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాలనుకున్న కాలం సంపూర్ణమైన రోజులు కూడా అవే. యెషయా ప్రవక్త యేసుప్రభువు ఆవిర్భావాన్నే కాదు, ఆయన రాకను, త్రోవను సరాళము చేసే యోహాను పరిచర్యను కూడా 700 ఏళ్ళ క్రితమే ప్రవచించాడు. యోహాను పరిచర్యను మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తూ, ‘ప్రభువు మార్గం సిద్ధపరచండి, ఆయన తోవలు సరాళము చెయ్యండి, అంటూ అరణ్యంలో కేక వేసే ఒకని స్వరం’ అన్న యెషయా ప్రవచనాన్ని పునరుద్ఘాటించాడు (యెషయా 40:1–5,9). యోహాను తల్లి ఎలీసబెతు, యేసు తల్లి మరియకు బంధువు. అతని తండ్రి జఖర్యా యాజక వంశానికి చెందినవాడు. తన పరిచర్య కోసం ప్రత్యేకించి ‘నాజీరు’ గా పెంచమని దేవుడే స్వయంగా అతని తండ్రి జకార్యాను ఆదేశించి, గొడ్రాలైన ఆయన భార్య ఎలీసబెతుకు యోహానును కుమారుడుగా అనుగ్రహించాడు. దేవుడు తన 400 ఏళ్ళ మౌనాన్ని అలా తానే బద్దలు కొట్టి యేసుక్రీస్తు పరిచర్యకు ఉపోద్ఘాతంగా, యేసు త్రోవల్ని సరాళము చేసే ఆంతరంగిక సేవకుడిగా యోహానును పంపించే వార్తను జఖర్యాకు ప్రకటించాడు. అందుకే స్త్రీలు కనిన వారిలో యోహానును మించిన వారు లేరని యేసుక్రీస్తే ఒకసారి ఆయన్ను శ్లాఘించాడు (లూకా 7:28). యోహాను తన పరిచర్య, ప్రసంగాలకు నిర్జన యూదాఅరణ్యాన్ని వేదికగా, ప్రధాన కేంద్రంగా ఎంచుకున్నాడు. అంటే, వేషధారణకు మారుపేరుగా మారిన పరిసయ్యులు, శాస్త్రులనే యూదుమతాధిపతులుండే యెరూషలేము పట్టణాన్ని వదిలేసి, వారికి దూరంగా యోహాను నిర్జనారణ్యంలోకి వెళ్తే, అతని ప్రసంగాలు విని, మారుమనస్సు పొంది. బాప్తిస్మము పొందేందుకు వందలాదిమంది పట్టణాలు వదిలి అతన్ని చేరేందుకు అడవిబాట పట్టారు. దేవుని అభిషేకం లేని పరిసయ్యుల ప్రసంగాలు యెరూషలేములో మారుమోగినా అవి విని ఎవరూ మారలేదు కానీ, యోహాను ప్రసంగాలు దైవస్వరంగా అరణ్యం లో ప్రతిధ్వనిస్తూ ఉంటే, అశేష ప్రజానీకం ఆయన కోసం అరణ్యానికి తరలి వెళ్లి అవి విని పరివర్తన చెందారు. అలా నిర్భయుడైన ప్రవక్తగా, దేవుడే పంపిన ప్రవక్తగా యోహానును ప్రజలు గుర్తించారు. తన సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్రమ కాపురం చేస్తున్న హేరోదు రాజు ‘అనైతిక జీవితాన్ని’ యోహాను చీల్చి చెండాడి, చెరసాల పాలయ్యాడు, చివరికి శిరచ్ఛేదనానికి కూడా గురయ్యాడు (మత్తయి 14:10). కానీ పరిచర్యలో యోహాను ఏ మాత్రం రాజీపడలేదు. కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలంటే, ముందుగా తాను కాలుష్యానికి దూరంగా ఉండాలన్నదే అరణ్యంలోకి వెళ్లడంలో యోహాను ఉద్దేశ్యం. అలా డబ్బు, పేరు, అధికారం, వేషధారణ, విలాసాలకు దూరంగా అరణ్యంలో అజ్ఞాతంగా బతుకుతూనే వేలాదిమంది జీవితాల్ని అక్కడికే ఆకర్షించి, వారిని మార్చి, రక్షకుడైన యేసుక్రీస్తు త్రోవల్ని నిబద్ధతతో సరాళం చేసి, యేసు చెప్పులను కూడా విప్పడానికి తాను యోగ్యుడను కానంటూ వినమ్రంగా ప్రకటించి, ఆ యేసుకే బాప్తీస్మాన్నిచ్చి, తద్వారా పరిచర్యలోకి ప్రభువును ఆహ్వానించిన అసాధారణ, విలక్షణ దైవజనుడు యోహాను. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
మానవుడై అవతరించిన రోజు
అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. కరోనా విలయతాండవం సృష్టించిన ఈ సంవత్సరంలో జరుపుకుంటున్న క్రిస్మస్ మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహిస్తుంది. క్రిస్మస్ మనకేం తెచ్చింది అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉత్పన్నం కావచ్చు. యేసు జననం జగతికి ఏమిచ్చింది అని ఒకసారి పరిశీలిస్తే నిస్సందేహంగా మనకు అపురూపమైన కానుకలను అందించింది. కానుకలు అందరూ నగదు రూపంలోనో, వస్తు రూపంలోనో ఇచ్చి పుచ్చుకుంటుంటారు. కానీ దేవాధిదేవుడు జగతిని, జనులను రక్షించుటకై పాపమెరుగని పరమపావన మూర్తియైన తానే బహుమతిగా ఈ లోకానికి వచ్చాడు. ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేది క్రీస్తును గూర్చిన నిర్వచనం. వాక్కు అంటే పలుకు. వాక్కు అనేది శక్తిగల మాటల సముదాయం. పెల్లుబికే ఆ మాటల సముదాయం భావాన్ని మోసుకొస్తుంది. వాక్కు శాశ్వతం, అనంతం, జీవదాయకం, సృష్టి కారకం. వాక్కులో అపారమైన జ్ఞానముంది. అదే వెలుగు, అదే వికాసం, విజ్ఞానం మరియు సమస్తం. బ్రహ్మాండమైన ఆ వాక్కే శరీరంతో లోకానికి వచ్చాడు. ఆయనే లోకరక్షకుడు క్రీస్తు. ఒక దైవజనుడు ఇలా అంటాడు. ఓ మనిషీ! ఏమి భాగ్యం నీది? ఉన్నతుడైన దేవుడు నీ ఎముకలో ఎముకగా, మాంసంలో మాంసంగా, మానవుడుగా, నీలా జన్మించాడు. యేసుక్రీస్తు అంటే ప్రేమ మరియు శాంతి. ఆ ప్రేమే ప్రాణం పోసుకుని ఆ పరలోకం నుండి మన కోసం ఇలకు దిగివచ్చింది. మనిషిగా జన్మించి మానవతకు క్రొత్త మార్గాన్ని చూపింది. అవధులు లేని ప్రేమగా, అంతములేని కరుణగా, అపురూపమైన వాత్సల్యముగా రూపుదాల్చి మనకోసం మన విమోచన కోసం పాప బంధకములనుండి విడిపించుట కోసం శ్రమలననుభవించింది. అమ్మలాలనను, తండ్రి బాధ్యతను, స్నేహితుని తోడును మనకు అందించింది. నిజమైన నిస్వార్థమైన ప్రేమను మనకు రూచి చూపించింది. ఈ లోకంలోని అగమ్య గోచరమైన బ్రతుకులకు కాంతిని పంచే వెలుగే క్రిస్మస్. బాధలలో వేదనతో నలిగిపోయిన జీవితాలకు, కష్టాలతో కన్నీళ్ళతో కృంగిపోయిన హృదయాలకు ఓదార్పునిచ్చేదే క్రిస్మస్. ఇబ్బందుల నుండి ఇరుకుల నుండి విడిపించి శాంతి నిచ్చేదే క్రిస్మస్. సమస్త మానవాళికీ శ్రావ్యమైన గళంతో శాంతి సందేశాన్నిచ్చేదే క్రిస్మస్. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి కంటికి వెలుగును, కాళ్ళకు మంచి మార్గాన్ని, నోటికి మంచి మాటను, హృదయానికి శాంతిని, మనిషికి మానవత్వాన్ని జగతికి రక్షణను తెచ్చింది క్రిస్మస్. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరంగాల నుండి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలోకి ఒంపుకోవాలన్నా ఘనుడైన క్రీస్తును ఆరాధించాలి. యోగ్యుడైన వానికి, అర్హత గలిగిన వ్యక్తికి ఆరాధనను అర్పించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ మన క్రీస్తే. యేసు జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదట ఝెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుండి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలకు కాసేపు ప్రక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్టు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. మనిషికి అంతకన్నా ఇంకేం కావాలి. విశాల విశ్వంలో అంతకన్నా మధురానుభూతి ఇంకేముంటుంది. రక్షకునికివ్వాలనుకున్న బహుమానాలను వారి పెట్టెలు తెరిచి ఆయన ముందు పరిచారు. ఒకాయన శుద్ధ సువర్ణాన్ని ఇచ్చాడు. మరొకడు అద్భుత సువాసన వెదజల్లే సాంబ్రాణిని, మరొక జ్ఞాని బోళమును ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. క్రీస్తు పాదాల దగ్గర పెట్టబడిన ఆ కానుకలు క్రీస్తులోని మూడు ప్రాముఖ్య లక్షణాలను తెలుపుతున్నాయి. బంగారం పరిశుద్ధతకు, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థపరిచే గుణానికి సాదృశ్యం. మనిషి దేవుని ఆరాధించుటకు ప్రధాన కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధతే. సమస్తమును నిర్వహించే దేవుడే అపవిత్రుడైతే పరిశుద్ధంగా బ్రతకడానికి మనిషికి ఆధారం ఎక్కడుంటుంది? మనిషి పూజలందుకొనే దేవుడు కచ్చితంగా పవిత్రుడే. నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా స్ధాపించగలరా అని క్రీస్తు ప్రశ్నించాడు. జ్ఞానులు తెచ్చిన రెండవ కానుక సాంబ్రాణి. సువాసనను వెదజల్లుతూ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సువాసనభరితం చేయగల సాంబ్రాణి క్రీస్తు ఆరాధనీయుడని తెలుపుతుంది. బోళములో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్రీస్తు మనలను స్వస్థపరచువాడు అనే సందేశాన్ని మూడవ కానుక తెలుపుతుంది. ప్రతియేటా క్రిస్మస్ను క్రైస్తవులంతా ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా పండుగగా జరుపుకొంటునప్పటికీ క్రీస్తు ప్రేమతత్త్వంలో తేలియాడే నిజక్రైస్తవునికి ప్రతిరోజూ పండుగే. ప్రతిరోజూ క్రిస్మస్సే. తేజస్సులో అమరుడైనప్పటికీ మనుజాళిని ప్రేమించి ప్రతి ఒక్కరికీ దగ్గరగా వచ్చిన క్రీస్తును ఆరాధించడానికి ఏ ఒక్కరోజు చాలదు. ఆదిమ«ధ్యాంత రహితుడైన ఆ దివ్యమూర్తిని ఆరాధించడానికి జీవితకాలం సరిపోదు. దేవుడు చేసిన సృష్టి వైభవాన్ని తెలుసుకొనే ప్రక్రియలో ఎన్నో పరిశోధనలు కొన్ని శతాబ్దాల క్రిందటే ప్రారంభించబడ్డాయి. అయితే 1969లో ఓ అపూర్వ సంఘటన చోటుచేసుకుంది. ‘నాసా’కు చెందిన ముగ్గురు వ్యోమగాములు ఎంతో శ్రమించి ఎట్టకేలకు ‘అపోలో–11’ అనే రాకెట్ మీద ప్రయాణం చేసి చంద్రుని మీద కాలుమోపారు. మానవుడు సాధించిన ఓ గొప్ప కార్యంగా అది అభివర్ణించబడింది. అప్పటినుండి ఇప్పటి వరకు మరికొంతమంది చంద్రగ్రహంపై కాలుమోపి తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వారిలో జేమ్స్ ఇర్విన్ ఒకరు. చంద్రునిపై కాలు మోపిన తరువాత తనకు లభించిన విశిష్టమైన గౌరవాన్ని స్వీకరిస్తూ ప్రపంచం నివ్వెరపోయే విషయాన్ని ఇర్విన్ తెలియచేశాడు. ‘‘అశాశ్వతుడైన మానవుడు చంద్రుని మీద కాలుమోపడం కన్నా శాశ్వతుడైన దేవుడు మనిషిని ప్రేమించి ఈ భూమ్మీద కాలుమోపడం గొప్ప’’. అపుడు సృష్టికర్తయైన దేవుడు సృష్టిగా మారడం అన్ని అద్భుతాల కన్నా ఎంతో గొప్పది. పరమాత్ముడైన ప్రభువును ఆరాధించడానికి బలులు, అర్పణలు అవసరం లేదు. మంచి సమయాల కోసం వేచిచూడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మనస్సు తెరిచి ఆయన నామాన్ని స్మరించుకొంటూ భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే చాలు. జీవితం ధన్యమౌతుంది. ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో నిండిన ఒక్క వ్యక్తి దేవుణ్ణి ‘నీవు ఎక్కడుంటావు’ అని అడిగాడట. దానికి దేవుడిచ్చిన జవాబు ‘నేను కట్టుకున్న ఆలయంలో ఉంటాను’. అదెక్కడుంది? ‘నీ హృదయమే నేను కట్టిన ఆలయం’. అపుడు దేవుడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. ఆయనకు హృదయంలో చోటివ్వడమే మానవ జీవిత పరమార్థం. నిండైన నీ హృదయంతో, మెండైన విశ్వాసంతో ఆయనను ఆరాధిస్తే చాలు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా మనుష్యులకు గుండెలనిండా ధైర్యాన్నిచ్చింది. కరోనా రక్కసి సమయంలో ప్రతి ఒక్కరమూ వ్యాక్సిన్ గూర్చిన శుభవార్త కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నాం. ఒక ప్రమాదం నుండి బయటపడడం ఎలా అనే వార్త మనిషికి ధైర్యానిస్తుంది. భయపడకుడి ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను అని దూత భయంతో వణికిపోతున్న గొర్రెల కాపరులకు తెలిపింది. వారు కేవలం భౌతిక సంబంధమైన చీకటిలో మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ చీకటిలో ఉన్నారు. వారికి శుభవార్త అందింది. దేవుడు ఎప్పుడూ మనిషికి మేలు చేయువాడు. ఆయన స్వాభావికంగా మంచివాడు. మనుషులు మంచివారుగా నటిస్తారు. దేవునికి ఆ అవసరం ఉండదు. ఆయన ప్రతి ఒక్కరికీ మంచి చెయ్యాలనే ఆశిస్తున్నాడు. క్రీస్తు అంటే ధైర్యం. ఆయన ఆపదలో అండగా నిలిచే కొండ. అన్ని వేళల్లో ఆదుకునే రక్షణ దుర్గం. చెక్కుచెదరని ధీరత్వం. క్రీస్తు నీతో వుంటే నిశ్చింత, క్రీస్తు నీతో వుంటే దిగ్విజయం. క్రిస్మస్ జగతిలో జనులకందరికీ ధైర్యాన్నిచ్చింది. ఏ ఆటంకాన్నైనా.. అడ్డంకులనైనా అధిగమించే శక్తి నిచ్చింది. అడ్డుగోడలను పగలగొట్టే గుండెబలాన్నిచ్చింది. ముఖ్యంగా ఈ లోకంలో శత్రువు పన్నే కుయుక్తులను, కుతంత్రాలను ఛేదించే దుర్భేద్యమైన కోట గోడలను మన చుట్టూ నిర్మించింది. ఏ దుష్టశక్తులూ మనలను చుట్టుముట్టి అధైర్యపెట్టకుండా రక్షణ వలయాన్ని కవచాన్ని మనకు ఏర్పరిచింది. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. నీ ఎడమపక్కన వేయిమంది పడినను నీ కుడిపక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అశేష ప్రజావాహినికి ఊతమందించే అద్భుత వాగ్దానమది. క్రీస్తు, క్రిస్మస్ గుండెకు కలిగించే ధైర్యం ఇంత గొప్పగానూ. శ్రేష్ఠముగానూ వుంటుంది అనేది నిర్వివాదంశము. క్రీస్తును మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే ప్రతి ప్రతికూల పరిస్థితినీ జయించగలిగే శక్తిని, గుండెధైర్యాన్ని, బలాన్ని మనలో నింపుతాడు. నమ్ముట నీ వశమైతే సమస్తమునూ సాధ్యమే అని సెలవిచ్చిన ఆ దేవాధిదేవుడు స్వయంగా తానే గుండెచెదరిన వారిని బాగు చేయుటకు, దీనులను విడిపించుటకు, ఈ లోకానికి దిగివచ్చాడు, ధైర్యాన్ని మనకు ఇచ్చాడు. కొంతమంది జీవితాలను పరిశీలిస్తే వారు చేయగలిగినవాటిని సైతం చేయలేకపోవడానికున్న కారణాలలో భయం ఒకటి. స్వేఛ్చా స్వాతంత్యాల్రతో జీవించాల్సిన మానవుడు భయం గుప్పిట్లో బతుకుతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టీవీ వ్యాఖ్యాత ల్యారీ కింగ్‌ను ఒకామె ఇంటర్వ్యూ చేస్తుంది. అప్పటికే ఆయన అనేకమందిని తన వాగ్ధాటితో ఆకర్షించుకున్నాడు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వారిని ఇంటర్వ్యూ చేశాడు. తాను అడగాలనుకున్న ఏ ప్రశ్ననైనా ధైర్యంతో అడిగేవాడు. సాహసోపేతమైన తన వృత్తిలో పాతిక సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక ప్రశ్న తన ముంగిట నిలువబడింది. ‘నీవు దేనికైనా భయపడతావా?’– ‘అవును. భయపడతాను!’– ‘దేనికి? మరణానికి!! నేను చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ప్రతి రాత్రి ఇదే భయంతో గడుపుతాను’ అని అతడిచ్చిన జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయానికి భయపడుతూనే ఉంటారు. వెంటాడుతున్న గతానికి, ఎదుర్కొనబోయే భవిష్యత్తును గూర్చి, వర్తమానంలో జరుగుచున్న ప్రతికూల పరిస్థితులను బట్టి, జీవితంలో చెలరేగే తుఫానులను బట్టి భయపడుచున్న మనిషికి చెక్కుచెదరని ధైర్యానివ్వడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ధైర్యంగా ఉంటే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉండగలడనేది బైబిల్ సుబోధ. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. ఇది అక్షరాలా నిజం! జనులందరికీ అవగతమయిన సత్యం! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం. అనుభవించే కొలది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం. అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకాని, ముగింపులేనిది. ఎన్నటికీ ముగియనిదీ, నిన్ను వీడనిది. ప్రస్తుతకాలంలో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమవుతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం వెదకుచున్నారు. నేటి కాలంలో ప్రాముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, వింతైన పోకడలకు బానిసలవుతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే.. ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువవుతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవి కూడా కోల్పోతూ ఆఖరకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెలబ్రెటీలు అని గుర్తింపు పొందినవారు కూడా ఈ విషయంలో అతీతులేమీకాదు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే ఒక సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ తమ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరిచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నాడు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు. కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, ఆ పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలయందునూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసేయడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తతను పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుండి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ రోజుల్లో విజయవాడలో అక్కడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగేవి. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాల నుండి దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు. ప్రపంచ కుబేరుడైన రాక్ఫెల్లర్ ఒక సందర్భంలో ఇలా అంటాడు. ‘నేను కోట్లు కూడబెట్టాను. అవి నాకు సంతోషాన్ని ఇవ్వట్లేదు’. ప్రపంచ వ్యాపారవేత్తలో అగ్రగణ్యుడుగా, జీవితంలో ఇతనికంటూ లోటు ఏమీ లేదనిపించుకున్న ఓ కుబేరుడు ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యమైనప్పటికీ, అది వాస్తవం. ‘నువ్వు వర్షంలో ఎందుకు ఏడుస్తున్నావు’ అని అడిగితే ‘ప్రపంచం నా నవ్వునే చూడాలి గాని నేను కూడా అందరి వలే ఏడుస్తున్నాని తెలియకూడదు’ అని జవాబిచ్చిన హాస్యనటుడు చార్లీ చాప్లిన్ గూర్చి తెలియనివారెవరు. ‘నా కళ్ళలోనుండి కారే కన్నీళ్ళు నేను చేసే కామెడీని నిర్వీర్యం చేస్తాయ’ని చెప్పి ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. నిజమైన ఆనందం బయటనుండి రాదు. భౌతిక వనరులు ఆనందాన్ని మోసుకురాలేవు. అది స్వచ్ఛమైన హృదయంలో నుండే రావాలి. అటువంటి ఆనందం అందరికీ ప్రయోజనాన్ని చేకూర్చుతుంది. క్రిస్మస్ జీవితానికి పరమార్థాన్ని ఇచ్చింది. జీవితానికి అర్థాన్ని, పరమారాధనను అన్వేషించాల్సిన బాధ్యత మనకు వుంది. ఏదో పుట్టాము. కాలాన్ని ఇష్టం వచ్చినట్లు గడిపేసి చనిపోదాం అనుకోవడం కాదు, జీవితమంటే. జీవితానికి వున్న అర్థాన్ని మొదట మనం కనుగోనాలి. పరమార్థాన్ని గ్రహించాలి. జీవితం ఎంత విలువైనదో దాని ఆవశ్యకత ఎమిటో తెలుసుకొని మెలగాలి. నువ్వెందుకు బతుకుతున్నావు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉండాలి. ఒక తత్త్వవేత్త తనకు తెలిసిన వ్యక్తులందరికీ ఒక ప్రశ్నతో కూడిన ఉత్తరం వ్రాశాడు. తన స్నేహితులలో చాలామంది ఆస్తిపరులు, మరికొందరు విస్తారమైన జ్ఞానాన్ని ఆర్జించినవారు, మరికొందరు సమాజంలో అధికారాన్ని, పలుకుబడిని కలిగియున్నవారు. ఉత్తరాలను అందుకొన్నవారు తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చారు. వారిలో ఎక్కువ శాతం మంది ‘మేం ఎందుకు ఈ భూమ్మీద బతుకుచున్నామో మాకు ఇంకా అర్థం కాలేదు’ అని, ‘దాని గురించిన ఆలోచన చేయాల్సిన తీరిక మాకు లేదు’ అని, ‘నీకు తెలిస్తే మాకు కూడా చెప్పొచ్చుగా’ అని రకరకాలుగా జవాబులు పంపించారు. విచారించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలామందికి తామెందుకు బతుకుతున్నాం అనే ప్రశ్నకు జవాబు తెలియకుండా బతికేస్తున్నారు. మనిషి ఎందుకు జీవిస్తున్నాడు? మానవ జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే మనిషిని కలుగచేసిన దేవుని దగ్గరకు రావాలి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి మాత్రమే దానిని తయారు చేయడంలో అతని ఉద్దేశాన్ని కచ్చితంగా చెప్పగలడు. ఈ విశ్వంలో మానవ జన్మ చాలా ప్రత్యేకమైనది. సృష్టికర్త మనలను సృజించినపుడు ఆయన స్వరూపములో మనలను సృజించాడు అని బైబిల్ తెలియచేస్తుంది. ఆయన రూపంలో ఉన్న మనం ఆయన లోకానికి వారధులం. దేవుని సంకల్పాలను నెరవేర్చుటకై నియమించబడిన దేవుని ప్రతినిధులం. యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకానికి ఏతెంచి ఓ అద్భుతమైన జీవితాన్ని జీవించి ప్రతి ఒక్కరికీ అన్ని విషయాలలో మాదిరి ఉంచారు. పశువులతొట్టెలో పవళించి ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నానన్న సందేశాన్ని లోకానికి ఇచ్చారు. జగతిలో నిండివున్న అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చారు. దారీ తెన్నూ కనబడక దిశనిర్దేశం లేని జనులకు మార్గమయ్యారు. ఆయనే మార్గముగా, సత్యముగా, జీవముగా జగతిలో అవతరించారు. అగమ్యగోచరమైన బతుకులలో నడి సంద్రాన చిక్కి అల్లాడుతున్న జీవితాలలో నావను నడిపే నావికుడిగా భువిలో జన్మించారు. మనందరి జీవితాలకు ఒక గొప్ప పరమార్థాన్ని కలిగించారు. ‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు’ అనే జీవన సత్యాన్ని కేవలం బోధించుట మాత్రమే కాకుండా, క్రియల్లో ఋజువుచేసి ప్రపంచాన్ని ప్రేమమయం చేశాడు యేసుక్రీస్తు. ఓ పరమార్థంతో బతికేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందడు. క్రిస్మస్ రక్షణ మార్గాన్ని ప్రబోధించింది. ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించుచున్న మహిమను పొందలేకపోవుచున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. ఒక నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి ఎలా రక్షణ కావాలో, కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ ఎంత అవసరమో, ఒక గనిలో చిక్కుకుపోయి మరణానికి చేరువవుతున్న వారికి రక్షణ ఎంత అవసరమో పాపంలో జీవిస్తూ శాశ్వత మరణానికి చేరువవుతున్న మనిషికి ఆత్మరక్షణ అంతకన్నా ఎక్కువ అవసరం. యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్ధం. ఆయన ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి వచ్చి తన రక్తమును సిలువలో చిందించి విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహిస్తున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు (లూకా 2:11). మానవాళిని రక్షించి, తన దివ్యకాంతులతో ప్రతిఒక్కరినీ నింపి నిత్యజీవనానికి వారసులుగా చేయాలన్నదే దేవుని ఆకాంక్ష. రక్షకుని ఆగమనంతో ఎన్నో ఏళ్లుగా చూస్తున్న మానవుని ఎదురుచూపులు ఫలించాయి. ఒక పిల్లవాడు తండ్రి ఫోటో చూస్తూ, మనసు నిండా గొప్ప ఆశతో ‘మా నాన్న ఆ ఫోటోలోనుండి బయటకు వస్తే బాగుండును’ అని అనుకున్నాడు. సరిగ్గా ఇలాగే మానవులంతా ఆశించారు. ఆశిస్తున్నారు కూడా. కుల మత భాషా వర్గ విభేదాల్లేకుండా మనుష్యులంతా దేవుణ్ణి మరింత సన్నిహితం చేసుకోవాలని తపించారు. ఆయన ఎలా ఉంటాడో చూసి, ఆయనతో ముచ్చటించాలని ఆశపడ్డారు. సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం దేవుడే మనిషిగా దిగివచ్చాడు. నింగి నేల ఏకమయ్యాయి. ఈ భూమికి నడిబొడ్డున ఉన్న బేత్లేహేము అనే కుగ్రామంలో రక్షకుడు వెలిశాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు. వాస్తవ రూపం దాల్చి మనిషికి గోచరుడయ్యాడు. ఎక్కడో రాజభవనంలో పుట్టియుంటే అందరికీ అందుబాటులో ఉండేవాడు కాడు గనుకనే పశువుల తొట్టెలో జన్మించాడు. అతి సామాన్యులైన గొర్రెల కాపరులు మొదట వెళ్ళి రక్షకుని చూశారు. భక్తి పారవశ్యంతో నింపబడి గుండెల నిండా నిరీక్షణతో ముందుకు సాగిపోయారు. క్రీస్తు్త ప్రబోధించిన రక్షణ మార్గం ఈ లోకానికీ ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి ఆ పరలోకానికీ చెందినది. మనుష్యుల జీవిత స్వరూపాన్ని దేవుని మార్గంలోకి మరలించే రక్షణ మార్గమిది నీకు నీవుగా జీవించే జీవితంలో నీ కోసం నువ్వు వెదికే రక్షణను క్రిస్మస్ నీకు అందించింది. శాపాలనుండి పాపాలనుండి విడుదలను పొందే రక్షణ మార్గన్ని క్రిస్మస్ ప్రబోధించింది. చీకటి దారుల్లోకి మరలి భ్రష్టత్వంచెందే మనుష్యులను నిజమైన రక్షణ మార్గంలోనికి తరలి రమ్మని క్రిస్మస్ ప్రబోధించింది. క్రీస్తుతో సహవాసం కలిగి వుండటం, ఆయనకు హృదయాన్ని అర్పించడం ఆ అద్వితీయుని ఆరాధించడం, అయన మార్గంలో నడవడం, ఆయన బోధలను ప్రచురం చేయడం, ఆయన కోసం జీవించడమే మనం చేయవలసిన పని. ఈ సంవత్సరం కరోనా వైరస్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది. ఎటుచూసినా ఏం జరుగబోతుందన్న భయంతో మనుష్యులు గతించిన కొన్ని నెలల నుండి బతుకును వెళ్ళదీస్తున్నారు. మనిషి ప్రాణం కన్నా గొప్పది ఏదీ లేదని ఋజువైంది. మన ఉద్యోగాలు, ప్రయాణాలు, విహారాలు, వ్యాపారాలు ఏవీ మన బతుకుల కన్నా గొప్పవి కావని తేలిపోయింది. కొన్ని కొన్ని సందర్భాలలో మనిషి నిశ్చేష్టుడుగా నిలువబడడం తప్ప మరేమీ చేయలేడనే సత్యం బహిర్గతమయ్యింది. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి. తమ వారిని కోల్పోయి విలపిస్తున్న వారు అనేకులున్నారు. జీవితం చాలా భారంగా మారినందువలన ప్రతిరోజూ దుఃఖంతో బతకాల్సిన పరిస్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అయితే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ధైర్యమును ప్రసాదించాలని, దేవుని వెలుగు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించుట ద్వారా వెలుగులో ప్రజలంతా నడవాలని కోరుకుంటూ, సమసమాజ నిర్మాణంలో మనమంతా పాలిభాగస్తులమై సాగిపోవాలని ఆశిస్తున్నాను. సాక్షి పాఠకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి