విశ్వమంతా నిశ్శబ్దం... చీకటి!?
హోలీ వీక్
చీకటి శక్తుల కుట్రలు ఫలించాయి. దైవకుమారుడైన యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పునిచ్చి అత్యంత క్రూరంగా సిలువ వేశారు. కొరడాదెబ్బలు, తిట్లు, అవహేళనలు, ఈసడింపులు, అబద్ధాలదే రాజ్యమైంది. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వైశ్వరుడైన యేసుక్రీస్తు నిస్సహాయంగా, మౌనంగా తలవంచుకొని అన్నీ భరిస్తూ, తనను సిలవ వేస్తున్న వారేమి చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించమని ప్రార్థిస్తూ పొద్దున్నుండి సాయంత్రం దాకా వేలాడి తనువు చాలించాడు. నిన్ను క్షణకాలం కూడా వదిలే ప్రసక్తి లేదంటూ ప్రగల్భాలు, బింకాలు పలికిన శిష్యులంతా తమ బోధకుణ్ణి వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. అరిమలై యేసేపు, నికోదేము అనే ఇద్దరు యూదుమత చాందసులు ఆయన అంత్యక్రియల బాధ్యత వహించారు. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే వారు ఒక రాతి సమాధిలో ఆయన్ను ఖననం చేశారు.
ఇక యేసుక్రీస్తు చరిత్ర ముగిసినట్టేనని శత్రువులు జబ్బలు చరిచారు. విశ్వమంతా నిశ్శబ్దం ఆవహించింది. దేవదూతల కోలాహలంతో ఎప్పుడూ సందడిగా ఉండే పరలోకం చిన్నబోయి విషాదమయమైంది. చెడు ముందు మంచి శాశ్వతంగా ఓడినట్టేనా? వెలుగును చీకటి మింగేసినట్టేనా? నవ్వును ఏడుపు పూర్తిగా ఓడించినట్టేనా..? ఈ ప్రశ్నలు మారుమోగుతున్నాయి. మరి జవాబు? వేచిచూద్దాం...
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్