Prabhukiran
-
ప్రార్థన పూర్వక జీవితం పరిమళభరితం
క్రైస్తవ విశ్వాసానికి పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అనే ముగ్గురిలో ఇస్సాకు ప్రస్తావన ఎక్కువగా కనిపించదు. అబ్రాహాములాంటి అసాధారణమైన విశ్వాసికి పుట్టిన అతిసాధారణమైన కొడుకు, యాకోబు లాంటి అసాధారణమైన కొడుకును కన్న అతిసాధారణమైన తండ్రి ఇస్సాకు. అబ్రాహాము, యాకోబుల సాహసోపేతమైన జీవితంతో పోల్చితే ఇస్సాకుది సాదా సీదాగా సాగిన ఎంతో సాధారణమైన జీవితం. ఇస్సాకు సాత్వికుడు, ప్రార్థనాపరుడు. ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని దేవుడు అబ్రాహామును ఆదేశించాడు. అపుడు ఇస్సాకుది దహనబలికి అవసరమైన బోలెడు కట్టెలు మోసుకొంటూ మోరియా పర్వతాన్ని ఎక్కగలిగిన వయసు. అంటే తానే బలిపశువునని కూడా అర్థం చేసుకునే వయసే అతనిది. అయినా అతను మౌనంగా తండ్రికి విధేయుడయ్యాడు. నా కుమారుణ్ణి దేవుడు ఈ లోకంలోనైనా, పరలోకంలోనైనా తప్పక సజీవుని చేస్తాడన్న గొప్ప విశ్వాసం అబ్రాహాముదైతే, తండ్రి తనను బంధించి బలిపీఠం మీద పడుకోబెడుతున్నపుడు, నేను ఈ బలిపీఠం మీద చనిపోయి దహనమైనా నా తండ్రియైన అబ్రాహాము దేవుడు నన్ను తిరిగి సజీవుని చేస్తాడన్న మౌనవిశ్వాసం ఇస్సాకుది. అదే జరిగింది. దేవుడు జోక్యం చేసుకొని ఇస్సాకును కాపాడి చనిపోవలసిన వాణ్ణి నిజంగానే సజీవుని చేశాడు. మంచితనం, సాత్వికత్వం, ప్రార్థన, పరిణతితో కూడిన మౌనం ఇవన్నీ సమపాళ్లలో మిళితమైన క్రైస్తవ పరిమళభరితం’ ఇస్సాకు జీవితం. ఇస్సాకు కోసం భార్యను వెదికి తీసుకురావడానికి అబ్రాహాము దాసుడైన ఎలియాజరు నాహోరు ప్రాంతానికి వెళ్తే, అతని ప్రయాణం సఫలం కావాలంటూ ఇంటివద్ద ప్రార్థిస్తున్నాడు ఇస్సాకు. అందుకే కాబోయే భార్య రిబ్కాకు కనానులో ఇస్సాకు ప్రార్థించడానికి పొలానికి వెళ్తూ కనిపించాడు (ఆది 24:63–65). ఇస్సాకుకు నలభై ఏళ్ళపుడు రిబ్కాతో వివాహమైంది. ఆ తర్వాత ఇరవై ఏళ్లపాటు రిబ్కా గర్భవతి కాకపోతే భార్య గర్భం తెరవమంటూ ఇస్సాకు ప్రార్థన చేశాడు(ఆది 25:21). అపుడు ఏశావు, యాకోబు అనే కవలలకు ఇస్సాకు 60 ఏళ్ళ వయసులో తండ్రయ్యాడు. హిమాలయాన్ని అధిరోహించడం, మహా సముద్రాలు దాటడం గొప్ప సాహసమే. కాని దేవుడిచ్చే ఈవుల కోసం ఎన్నేళ్ళైనా, ఎన్ని కష్టాలొచ్చినా మౌనంగా, ఓపిగ్గా కనిపెట్టగలగడం దాన్ని మించిన సాహసం. ఇస్సాకుది ఈ రెండో కోవకు చెందిన సాహసం. ఇస్సాకు ఎన్నోసార్లు తవ్విన బావుల్ని శత్రువులు పగతో పూడ్చేస్తే ఆయన మరో చోట మరో బావి తవ్వుకున్నాడు కాని వారితో ఎన్నడూ తగవులు పెట్టుకోలేదు. ఒక చెంపను కొడితే సాత్వికత్వంతో మరో చెంప చూపించాలి తప్ప ఎదురు దాడి చెయ్యరాదన్న యేసుప్రభువు ప్రేమ ప్రబోధాలకు పాత నిబంధనలోనే ప్రతీకగా నిలిచిన పరిపూర్ణ విశ్వాసి ఇస్సాకు. –రెవ. డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పెనుతుఫానులో ప్రభువిచ్చిన తర్ఫీదు!
యేసుప్రభువుతో ఆయన శిష్యులు ఒకసారి గలిలయ సముద్రంలో ఒక చిన్నదోనెలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్లంతా ప్రభువు శిష్యులుగా మారిన తొలిరోజులవి. అప్పుడొక పెద్దతుఫాను చెలరేగి దోనె నీళ్లతో నిండి, అది మునిగే పరిస్థితి ఏర్పడింది. యేసు మంచి నిద్రలో ఉన్నాడు. అది చూసి శిష్యులు, ప్రభువా మీకు మా గురించి చింత లేదా? మేము నశించిపోతున్నామంటూ గగ్గోలు పెట్టారు. వెంటనే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని కూడా గద్దించి పరిస్థితిని అదుపుజేశాడు (మార్కు 4:35–41). దేవుని నమ్మడం అనే ఆత్మీయాంశం చాలా లోతైనది, విశ్వాసికి ఆచరణలో మాత్రమే నేర్పించగలిగిన అంశమది. ప్రభువు వారికిస్తున్న శిక్షణలో భాగమా అన్నట్టుగా, వారి విశ్వాసానికి అదే గలిలయ సముద్ర ప్రయాణంలో ఈ విషమపరీక్ష ఏర్పడింది. మేమంటే మీకు చింత లేదా? అని శిష్యులు ప్రశ్నిస్తే, జవాబుగా అవిశ్వాసులారా!! అని ప్రభువు వారిని గద్దించవచ్చు. కానీ ఆయన వారిని కాక, సముద్రాన్ని, గాలిని గద్దించాడు. నిజానికి అద్దరికి వెళ్లేందుకు ఆ రాత్రి ప్రయాణానికి ప్రభువే వారిని బయలుదేర దీశాడు. ఎందుకంటే ప్రయాణం మధ్యలో దోనె తుఫానులో చిక్కుకున్నా సరే, అది సురక్షితంగా అద్దరికి చేరుతుందని ప్రభువుకు తెలుసు. పైగా అవతలి దరిలోని గెరాసేనీయుల దేశంలో తాను చెయ్యబోయే దైవకార్యాల తాలూకు స్పష్టమైన అవగాహన, ఆ కార్యాలు జరుగుతాయన్న విశ్వాసం ఆయనకుంది. తుఫానులు చెలరేగని జీవితాలంటూ ఉంటాయా? కానీ ఎంత పెద్దదైనా సరే ప్రతి తుఫానూ జీవితాన్ని ముంచేది కాదని కూడా తెలుసుకోవాలి. అప్పటికి శిష్యుల చేతుల్లో బైబిళ్లు లేవు కానీ, ఉండి వుంటే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అన్న వాగ్దానాలను బైబిల్లో మీరు చదువలేదా? అని యేసుప్రభువు వారిని తప్పక మందలించి ఉండేవాడు. జీవితంలో తుఫానులెదురైనపుడే దేవుడెంత గొప్పవాడో, లోకం ఎంత నికృష్టమైనదో విశ్వాసికి స్పష్టమవుతుంది. ‘తప్పులు చేశావు, అందుకే నీ జీవితంలో ఈ తుఫాను’, నీ తలబిరుసుతనానికి దేవుని తీర్పు ఇది’ లాంటి ఇరుగుపొరుగువారు, సన్నిహితులు, బంధువుల సూటిపోటి మాటలు, వెక్కిరింతలు తుఫాను అలలకన్నా ఉవ్వెత్తున లేస్తాయి. కావాలంటే యోబు గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఇతరుల ఈ అయాచిత సలహాలు, వ్యాఖ్యలు తుఫానుకన్నా ఎక్కువ నొప్పిని, నష్టాన్ని విశ్వాసికి కలుగజేస్తాయి. కాకుల్లాంటి ఈ లోకులను పక్కనపెడితే, దేవుడసలు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా జీవితంలో ఈ తుఫానేందుకు? లాంటి ప్రశ్నల తుఫానులు మన అంతరంగంలోనే చెలరేగితే మాత్రం అది మరీ ప్రమాదం. కళ్లెదుట తాటిచెట్టంత ఎత్తున లేచే అలలు, మన జీవితం అనే చిన్న దోనెను అతలాకుతలం చేస్తుంటే, దేవుడు మనల్ని విడువక కాపాడుతాడని నమ్మడానికి అంతకన్నా ఎత్తైన అలలున్న విశ్వాస స్థాయి కావాలి. ఆ స్థాయి విశ్వాసమే దేవునికి మహిమను, మన జీవితంలోకి సాఫల్యాన్ని తెస్తుంది. అందుకు ప్రాథమికంగా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని విశ్వాసులు కలిగి వుండాలి. ఆ కృతజ్ఞతాభారితమైన హదయం నుండే వినయం, ప్రార్థన, విశ్వాసం, న్యాయం, ధైర్యం, త్యాగం, ప్రేమ, సంతృప్తి, సంతోషం, సద్భావనల వంటి అన్ని క్రైస్తవ సద్గుణాలూ లోకానికి వెల్లడవుతాయి. మరి మన శక్తికి మించిన విషమ పరిస్థితులనుండి దేవుడు మనల్ని కాపాడినప్పుడే కదా విశ్వాసి హృదయంలో దేవునిపట్ల కృతజ్ఞతాభావం ఏర్పడేది? సముద్రంలో పెద్దతుఫానులో చిక్కిన వారి చిన్న దోనెను కాపాడి, అద్దరికి సురక్షితంగా చేర్చిన వారి బోధకుడు, రక్షకుడైన యేసుప్రభువు శక్తి, ప్రేమ ఆయన శిష్యరికంలో వారికి ఆరోజు అత్యంత అమూల్యమైన తొలి పాఠమయ్యింది. ఫలితంగా వారి హృదయాలు ఆయనపట్ల కృతజ్ఞతాభావనతో నిండి పోయాయి. మీ జీవితాల్లో గతంలో ఏం జరిగినా, ఇప్పుడు ఏమి సంభవిస్తున్నా, భవిష్యత్తులో మాత్రం దేవుడు మీకివ్వబోయే విజయాలను, ఆశీర్వాదాలను ఆపగలిగే శక్తి ఆ పరిణామాలకు, ప్రతికూలతలకు లేదన్న ‘స్థిరభావన’ కృతజ్ఞత కలిగిన హృదయంనుండే వెలువడుతుంది. క్రీస్తుప్రేమ నుండి విశ్వాసిని ఎడబాపగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నది దేవుని అత్యంత స్పష్టమైన, ప్రేమామయమైన అభయం (రోమా 8;35). అది అర్థమయ్యేందుకు ఇలాంటి తుఫానులు, వాటి మధ్యలో దేవుని వైపే చూడగల స్థిరమైన విశ్వాసం, ఆ దేవునిపట్ల కృతజ్ఞతాభావం తప్పక కావాలి. ఈ అపొస్తలులంతా సువార్తను భూదిగంతాలకు తీసుకెళ్లి దేవునికోసం హతసాక్షులైనపుడు, భయంకరమైన శ్రమలు అలల్లాగా కాదు ఉప్పెనలా వారిమీద విరుచుకుపడ్డాయి. అయినా బెదరకుండా చిరునవ్వుతో, క్షమాప్రార్థనలతో వారు ఉరికంబాలెక్కారు. యేసుప్రభువిచ్చిన ఈ శిక్షణే దానికి కారణం! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
పరిశుద్ధాత్మశక్తిలో ఐక్యత, పరిపూర్ణత...
‘మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అపుడు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, పిదప భూదిగంతాల దాకా మీరు నాకు సాక్షులై ఉంటారు’ అన్నది ఆదిమ అపొస్తలులకు, విశ్వాసులకు యేసుప్రభువు తన ఆరోహణానికి ముందు చేసిన వాగ్దానం(అపో.కా 1:8). యెరూషలేములో పెంతేకొస్తు నాడు మేడగదిలో ఆరంభమైన చర్చి అతి త్వరలోనే బాగా వ్యాప్తి చెందింది. అయితే ఉన్నట్టుండి చర్చి శ్రమలకు లోనైంది. క్రైస్తవం వ్యాప్తిని అడ్డుకోవాలన్న కంకణం కట్టుకున్న సౌలు అనే యూదు మతచాందసుడు, పరిసయ్యుడు, స్తెఫను అనే చర్చి పరిచారకుణ్ణి, దైవదూషకుడన్న నేరారోపణపై దగ్గరుండి మరీ రాళ్లు రువ్వించి చంపించాడు. యెరూషలేములోని చర్చికి, అక్కడి విశ్వాసులకు ‘పరిశుద్ధాత్మ శక్తి’ ఎలా ఉంటుందో, అసలదేమిటో అప్పుడర్ధమైంది. అద్భుతాలు చేసే శక్తిని మాత్రమే కాదు, ఆనందంగా ప్రభువు కోసం హత సాక్షి అయ్యే శక్తిని కూడా ఆ పరిశుద్ధాత్ముడే ఇస్తాడని, అది పరిశుద్ధాత్మశక్తిలో అంతర్భాగమని స్తెఫను మరణంతో చర్చికి అర్థమయింది, చర్చిని అందుకు సిద్ధపర్చింది కూడా !!! ఎందుకంటే తగాదాల్లో తలలు నరకడానికి అవసరమయ్యే శక్తి కన్నా వెయ్యిరెట్ల ఎక్కువ శక్తి మంచికోసం పాటుపడేందుకు, పదిమందికీ సాయం చేసేందుకు, ముఖ్యంగా ప్రభువు కోసం శ్రమపడేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనే నాణేనికి భాషల్లో మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం ఒక వైపైతే, శ్రమలు అనుభవించడం దానికి మరో వైపు. ఇందులో ఒకటి మాత్రం కావాలి, మరొకటి నాకొద్దు అనుకోవడానికి వీలు లేదు. నిజమైన పరిచారకుని జీవితంలో అద్భుతాలుంటాయి, శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమల కారణంగా యెరూషలేము చర్చి, విశ్వాసులు పలు ప్రాంతాలకు చెదిరిపోయి, ఆయా కొత్తప్రాంతాల్లో క్రైస్తవాన్ని ప్రకటించి పలు కొత్త చర్చిలు స్థాపించారు. ప్రపంచం నలుమూలలకు చర్చి వ్యాప్తి చెందేందుకు దేవుడు వాడుకున్న ఒక విధానం శ్రమలు. అలా చెదిరిపోయిన విశ్వాసులు యెరూషలేము చర్చి పరిచారకుడైన ఫిలిప్పు నాయకత్వంలో, నాటి దేవుని వాగ్దానం మేరకు సువార్త వ్యాప్తి కోసం సమరయ ప్రాంతానికి వెళ్లారు. సమరయలో ఫిలిప్పు ఎంత అద్భుతంగా, విజయవంతంగా సేవ చేశాడంటే ఆయనకు సహాయంగా యెరూషలేము చర్చి పేతురును, యోహానును కూడా సమరయకు పంపగా, వారందరి సేవతో సమరయలో చర్చి అక్కడ గొప్పగా విస్తరించింది. వాళ్ళు ఎవరి మీద చేతులుంచితే వారిమీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. మహా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. అసలు అపొస్తలులు సమరయకు వెళ్లడమే పరిశుద్ధాత్ముడు చేసిన ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే, ఒకే దేవుణ్ణి విశ్వసించేవారైనా సమరయులు యూదులకు అంటరాని వారు, వాళ్ళ మధ్య వందల ఏళ్లుగా సైద్ధాంతిక విభేదాలున్నాయి, ఆత్మీయంగా ఎంతో వైరముంది. అయినా ఆ విభేదాలను అధిగమించి అంటరానివారిని కూడా తమకు ఆప్తులైన వారుగా పరిగణించే అవగాహనను, ప్రేమను పరిశుద్ధాత్ముడు అపొస్తలులలో, ఆదిమ విశ్వాసుల్లో రగిలించాడు. వారికి సువార్త ప్రకటించి యేసుప్రభువులో అంతా సమానమేనని వారు ప్రకటించారు. పోతే అంతకుమునుపు అక్కడ సీమోను అనే గారడీవాడు తన కనికట్టువిద్యలతో అందరినీ భ్రమింపజేస్తూ బోలెడు పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. అయితే తన కార్యాలకు మించిన కార్యాలు అపొస్తలుల పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్నాయని చూసి, ముందు వారితో కలిసి తిరిగాడు. ఆ తర్వాత కొంత ద్రవ్యాన్ని వారికివ్వజూపి తాను కూడా పరిశుద్ధాత్మశక్తి ని పొందేలా చెయ్యమని కోరితే అపొస్తలులు అతన్ని తీవ్రంగా మందలించారు. మతాసక్తి, ధన సంబంధమైన దురాశ కలిసైనా నకిలీ పరిచారకులకు గారడీవాడైన సీమోను ఒక ఉదాహరణ. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో సీమోనులాంటి వారి కుతంత్రాలను తిప్పి కొట్టారు. అదే పరిశుద్ధాత్మ శక్తి అంటే!! అన్ని అంతరాలను, విభేదాలను, అడ్డుగోడలనూ ఆ శక్తి కూల్చేస్తుంది. అన్ని కుతంత్రాలనూ అది తిప్పి కొడుతుంది. ఇప్పుడు కూడా ఎవరైనా ‘మా చర్చే మంచిది, మాదే నిజమైనది’ అన్నట్టుగా మాట్లాడుతున్నా,వ్యవహరిస్తున్నా, వారికి పరిశుద్ధాత్మశక్తికి చెందిన వాస్తవాలు అర్థం కాలేదన్నది ఈ పరిణామాలను బట్టి తెలుస్తుంది. విడిపోవడానికి వంద కారణాలున్నా, అందరమూ ఆరాధించే దేవుడు యేసే అన్న ఒక్క కారణాన్ని బట్టి కలిసుండాలంటాడు పరిశుద్ధాత్ముడు. విభేదాలేర్పడి విడిపోవడం కన్నా, విడిపోవాలనుకొని విభేదాలు వెదుక్కునే ధోరణి, ధనార్జన కోసం ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకొనే స్వార్థం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అందుకే దేవుడొక్కడే అని చాటే క్రైస్తవంలో ఈనాడు ఇన్ని వర్గాలు, శాఖలు, ఇన్నిన్ని సిద్ధాంతాలు అన్న అపవాదు!! పరిశుద్ధాత్మునిలో ఐక్యతే ఉంటుంది తప్ప అనైక్యత ఉండదు, బీదా, గొప్ప, చిన్న, పెద్ద అన్న తారతమ్యాలుండవు (అపో.కా.1.8 అధ్యాయాలు). ఒకవేళ తప్పక అవసరార్థం విడిపోయినా వారి మధ్య వైషమ్యానికి తావు లేదు. శత్రువులను కూడా ప్రేమించాలన్న దేవుడు, సైద్ధాంతిక విభేదాలతో పక్క చర్చివాళ్లను ద్వేషించమని చెబుతాడా? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
గోపురాలు కాదు, బలిపీఠాలు నిర్మించాలి
తాను ఎంతో ఇష్టపడి సృష్టించుకున్న భూమి యావత్తూ పాపభూయిష్టమైపోయిందన్న కోపంతో దేవుడు ఒక్క నోవహు కుటుంబాన్ని మాత్రం మినహాయించి, మహా జలప్రళయం ద్వారా భూలోకాన్నంతా ప్రక్షాళనం చేయగా... లోకంలో జీవనం మళ్ళీ ఆరంభమయ్యింది (ఆదికాండము 8 వ అధ్యాయం). పునరుత్పత్తి కోసం దేవుడు కాపాడిన నోవహు కుమారుల కుటుంబ వారసులే విస్తరించి అనేక దేశాలకు చెదిరిపోయి ఎన్నో జనాంగాలు, రాజ్యాలుగా ఏర్పడ్డారు(ఆది 10వ అధ్యాయం). అయితే భూలోకవాసుల పాపం నీళ్లతో కడిగితే పోయేది కాదని రుజువు చేస్తూ, కొద్దికాలానికే మళ్ళీ భ్రష్టత్వం ఆరంభమయింది. అది పెచ్చరిల్లి ప్రజలు అహంకారులై బాబెలు గోపుర నిర్మాణానికి పూనుకోవడంతో వారి భ్రష్టత్వం పరాకాష్టకు చేరుకుంది( ఆది 11వ అధ్యాయం). ఆకాశాన్నంటే ఒక గోపురాన్ని నిర్మించి పేరు సంపాదించు కుందామన్న అక్కడి ప్రజల ఆశయంలోని హద్దులు దాటిన స్వార్థం, ప్రజల్లో తమ జ్ఞానం పైన తమకున్న అతిశయం, చివరికి తమను తాము నాశనం చేసుకోవడానికే దారితీస్తుందని దేవుడు గ్రహించి, తానే జోక్యం చేసుకొని వారిలో అనేక భాషలు సృష్టించి గందరగోళం రేపి అక్కడి నుండి వారిని అనేక ప్రాంతాలకు చెదరగొట్టాడు. మానవాళికి రానున్న ఒక మహావిపత్తును దేవుడలా తప్పించాడు. అయినా, క్షణాల్లో దేవుని చేరగల ‘ప్రార్థన’ ‘ఆరాధన’ అనే అద్భుతమైన పవిత్ర ఆత్మీయ ప్రసార సాధనాల్ని దేవుడే తన ప్రజలకివ్వగా, ఆయన్ని చేరేందుకు ఆకాశానికి అంటే నిచ్చెనలాంటి గోపురాన్ని ప్రజలు కట్టాలనుకోవడం విడ్డూరమే కాదు, పెరుగుతున్న తన జ్ఞానంతో దేవుణ్ణే సవాలు చేయాలనుకున్న మనిషి తెలివి తక్కువతనం కూడా!! జలప్రళయం సమసిన తర్వాత ఓడలోనుండి తన కుటుంబంతో వెలుపలి కొచ్చిన వెంటనే నోవహు యెహోవా దేవునికి బలిపీఠం కట్టి ఆయన్ను ఆరాధించాడు. దేవుడు నోవహు ఆరాధనతో ఎంతగా ప్రసన్నుడు అయ్యాడంటే, మానవాళినంతటినీ, సమస్త జీవరాశినీ మునుపటి జలప్రళయంలో లాగా ఇంకెప్పుడూ తానిక సమూలంగా నాశనం చేయబోనని దృఢంగా నిశ్చయించుకున్నాడు (ఆది 8:20–22). గోపురనిర్మాణానికి పూనుకున్నవారిని దేవుని ఆ నిర్ణయమే ఆయన మహా ఉగ్రత నుండి కాపాడింది. దేవుడందుకే వారిని చెదరగొట్టడంతో సరిపెట్టుకున్నాడు. దేవుని మీద ప్రతిసారీ తిరుగుబాటు చేసి తనను తాను హెచ్చించుకునే ప్రాథమికమైన మనిషి పాపస్వభావం ఎన్నేళ్లు, ఎన్ని తరాలు గడిచినా మారలేదు. అయితే దేవుని మనసు నెరిగిన మహా భక్తులకు కూడా ఎన్నడూ కొరత లేదు. బాబెలు గోపురాలు కట్టినవాళ్ల తరాల వెనువెంటే బలిపీఠాలు కట్టిన అబ్రాహాము వంటి వినయమనస్కులు, సాత్వికుల తరం కూడా ఆరంభమైంది (ఆది 12వ అధ్యాయం). ఆ అబ్రాహాము వంశంలో నుండే ఎంతోమంది దైవ ప్రవక్తలు చివరికి జగద్రక్షకుడైన యేసు ప్రభువు ఈ లోకానికొచ్చాడు. బాబెలు మహా గోపురం మానవాతిశయానికి, అహంకారానికి సాదృశ్యమైతే, అబ్రాహాము కట్టిన చిన్న బలిపీఠాలు విశ్వాసి సాత్వికత్వానికి, విధేయతకు, వినమ్రతకు సాదృశ్యాలు. తలబిరుసుతనం, జ్ఞానంతో ఆకాశాన్ని తాకాలనుకోవడం ద్వారా కాదు, దీనులై తలవంచి దేవుని పాదాలనాశ్రయించడం ద్వారా మాత్రమే దేవుని ప్రసన్నతకు పాత్రులమవుతాం. సాత్వికత్వం, వినయం, విధేయతతో దేవుని ప్రసన్నతకు పాత్రులైన వారి జీవితాలు, పరిచర్యలు, కుటుంబాల ద్వారానే ‘దేవునిశక్తి’ లోకంలోనికి విడుదలఅవుతుంది, లోకాన్ని దైవాశీర్వాదాలతో నింపుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అట్టహాసం లేని అద్భుతపరిచర్య
భయంకరమైన, దైవవ్యతిరేకమైన మన గతం ఒక గుదిబండలాగా మెడలో వేలాడుతూ ఉంటే జీవితంలో, పరిచర్యలో జయకరంగా ముందుకు సాగిపోవడం సాధ్యమేనా? లోకమైతే ఇది అసాధ్యమనే తేల్చేస్తుంది. కానీ దేవుడైతే నీ పాపగతాన్నంతా తుడిచివేయడమే కాదు, ఇంకెప్పుడూ జ్ఞాపకం చేసుకోనని కూడా వాగ్దానం చేశాడు (యెషయా 43:25). ఈ వాగ్దానం అపొస్తలుడైన పౌలుకు అర్థమైనంతగా మరెవరికీ అర్థం కాదేమో. యేసును, ఆయన ప్రేమను విపరీతంగా వ్యతిరేకించి, తూర్పారబట్టి, క్రైస్తవోద్యమాన్ని అడ్డుకోవడంలో అగ్రగణ్యుడిగా నిలబడిన భయంకరమైన గతం అతనిది. కొన్నాళ్ళకు యేసుప్రభువు ప్రేమను రుచి చూసిన తర్వాత క్రైస్తవోద్యమాన్ని ప్రపంచమంతా విస్తరించడంలో కూడా పౌలు అగ్రగణ్యుడే అయ్యాడు. అతని గతం ప్రపంచానికంతా తెలిసిన బహిరంగ సత్యం. అందుకే అప్పుడప్పుడే అంకురిస్తున్న క్రైస్తవం పౌలును నమ్మలేదు, ఆయన్ని చర్చి లోనికి అంగీకరించలేదు. దమస్కు శివార్లలో పౌలుకు యేసు సాక్షాత్కారం జరిగిన తర్వాత, అతనికోసం ప్రార్థించి, క్రైస్తవంలో అతనికి ఆరంభ పాఠాలు చెప్పమని ప్రభువు ఆదేశిస్తే, దమస్కులోనే ఉన్న అననీయా అనే భక్తుడు ‘అమ్మో ప్రభువా, అతనా?’ అన్నాడు. పౌలు ఆ తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చి అక్కడి చర్చిని, యేసుప్రభువు శిష్యుల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తే అతనికి భయపడి అంతా దూరంగా పారిపోయారు. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో పౌలుకు సహాయంగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి బర్నబా!! బర్నబా కూడా కొద్ది కాలం క్రితమే యేసుప్రభువు ప్రేమ సామ్రాజ్యంలో పౌరుడుగా చేరిన కొత్త విశ్వాసి. కాని తన విశ్వాసంతో, సాక్ష్య జీవితంతో అప్పటికే విశ్వాసులందరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. పౌలును నాటి క్రైస్తవమంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో, బర్నబా ఒక్కడే అతన్ని, అతని దర్శనాన్ని అర్ధం చేసుకొని అతన్ని తోడుకొని వచ్చి యెరూషలేములో అందరికీ పరిచయం చేశాడు. అలా పరిచర్యలో పౌలు తొలి అడుగులు వేయడానికి బర్నబా అండగా నిలబడ్డాడు (అపో.కా.9:27). పౌలు గతాన్ని బట్టి అంతా అతన్ని దూరంగా పెడితే, బర్నబా ఒక్కడే అతన్ని ఆత్మీయంగా హత్తుకొని అతనికి బాసటగా నిలబడ్డాడు. ఆ పాలుగారే ఆ తర్వాత మహా దైవజనుడయ్యాడు, కొత్త నిబంధన బైబిల్లో అత్యధిక భాగం ఆయనే రాశాడు, ప్రపంచమంతా క్రైస్తవం వేళ్ళూనడానికి అతనే ప్రధాన కారకుడయ్యాడు. కాని పౌలు చేసిన ఈ అద్భుతమైన పరిచర్య వెనుక కనిపించని ప్రోత్సాహహస్తం బర్నబాదే. అసలు పరిచర్యలో బర్నబా పద్ధతే వేరు. ఎవరూ అడగకుండానే తన ఆస్తినంతా అమ్మి ఆ డబ్బునంతా తెచ్చి ఆదిమ చర్చిలో అతను అపొస్తలుల పాదాలవద్ద పెట్టాడు. చర్చి నాకేమి చేస్తుంది అని కాక చర్చికి నేనేమి చెయ్యగలను అని ఆలోచించే వారిలో ప్రథముడు బర్నబా. ఎవరూ చెప్పనవసరం లేకుండానే తన వంతు తాను చేయడంలో అతను దిట్ట. అలా ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉన్నాడు గనుకనే అతనికి ‘ప్రోత్సాహపుత్రుడు’ అనే బిరుదునిచ్చింది ఆదిమచర్చి (అపో.కా.4:36). బర్నబా కారణంగా ఎంతోమంది కొత్త విశ్వాసులు ఆనాటి చర్చిల్లో చేరారు (11:24). ఆనాటి అపొస్తలులందరికీ అతను బాసటగా నిలబడ్డాడు. కాని అతనికి ప్రచార యావ లేదు, పొగడ్తల యావ అసలే లేదు. తొలిరోజుల్లో క్రైస్తవం బలపడేందుకు తన ఆస్తిని, శక్తియుక్తులన్నింటినీ సర్వం ధారపోసిన అద్భుతమైన పరిచారకుడు, పౌలువంటి మహాసేవకునితోనే, చెయ్యిపట్టుకొని తొలి అడుగులు వేయించిన గొప్ప విశ్వాసి బర్నబా!! నిబద్ధత, నిస్వార్థత లేకున్నా అట్టహాసం, హడావుడి చెయ్యడం మాత్రమే తెలిసిన నేటి తరం టివి పరిచారకులు లక్షమంది కలిసి చెయ్యలేని పరిచర్యను, బర్నబా ఒక్కడే ఏ అట్టహాసం లేకుండా దేవునికి తలవంచి చేశాడు. అందుకే దేవుడిచ్చే నిత్యజీవకిరీటం ఎప్పటికీ బర్నబా వంటి వారిదే!! – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని ప్రేమ పుట్టిన రోజు
ఇంగ్లాండ్ లో అదొక మారుమూల ప్రాంతం. అక్కడి చర్చికి కొత్తగా ఒక యువకుడు పాస్టర్‌గా వచ్చాడు. అది క్రిస్మస్ సమయం. క్రిస్మస్ను ఎంతో గ్రాండ్ గా జరపాలన్న ఉబలాటంతో అతను సన్నాహాలు ఆరంభించాడు. కాని క్రిస్మస్ ఇంకా పది రోజులుందనగా పెద్ద తుఫాను సంభవించి బీభత్సాన్ని సృష్టించింది. కరెంటు స్తంభాలు, చెట్లు కూలాయి, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, పాత గోడలు వర్షం నీళ్లకు నాని కూలిపోయాయి. ముఖ్యంగా చర్చి భవనం వెనుక గోడ కూడా పాక్షికంగా కూలిపోవడం అతన్ని బాగా నిరుత్సాహపర్చింది. అయినా ఉన్నంతలో ఏర్పాట్లకు పూనుకున్నాడు. కూలిన చర్చి గోడ ‘పులిపిట్’ అని పిలిచే చర్చి వేదికకు సరిగ్గా వెనక ఉన్న గోడ. చర్చిలో కూర్చున్న వాళ్లందరికీ కనిపించే అతి వికారమైన దృశ్యమది. అప్పటికప్పుడు గోడనయితే కట్టించాడు కాని అది ఒక అతుకులాగే కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. అతనికొక ఐడియా వచ్చింది. చర్చి స్టోర్ రూమ్‌లో ఎప్పటిదో పాతదే అయినా అందమైన ఒక సన్నటి కార్పెట్ ఉంది. దాన్ని దులిపించి, డ్రైవాష్ చేయించి అతుకు పైన దాన్ని వేలాడదీశాడు. అద్భుతం!! అతుకు మాయమవడమే కాదు, పూల్పిట్కు అది కొత్త ఆనందాన్నిచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో మిగతా సన్నాహాలకు పూనుకున్నాడతను. చర్చి పాస్టర్ తన ఇంటికి వెళ్ళేదారిలో ఒక ఇంట్లో దాదాపు 65 ఏళ్ళ వృద్ధురాలుంటోంది. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుంది. వస్తూ పోతూ ఆమె కనిపిస్తే ‘బావున్నారా?’ అని పలకరిస్తాడు పాస్టర్. కొన్నిసార్లు ముభావంగానే, బావున్నానంటుంది, మరికొన్నిసార్లయితే అసలు పలకదు. ఆనందంగా ఉండే వారి ఇంటికి వెళ్లడం కన్నా దుఃఖంతో ఉండే వారింటికి వెళ్లడం మంచిదని దేవుడు చెప్పిన మాటను బట్టి క్రిస్మస్ ముందు రోజు పాస్టర్ ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. వృద్ధురాలు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది. కాని లోనికి పిలిచి కూర్చోబెట్టింది. పాస్టర్ తనను పరిచయం చేసుకున్నాడు. ‘మీరు చర్చికి రావడం నేను చూడ లేదు, ఇంట్లో మీరొక్కరే ఉంటారా?’ అనడిగాడు పాస్టర్. తన గురించి చెప్పడానికి మొదట ఆమె ఇష్టపడలేదు. కాని పాస్టర్ మళ్ళీ మళ్ళీ అడగడం వల్ల తన గురించి చెప్పింది. ‘నేను, నా భర్త లండన్ లో ఉండేవాళ్ళం. మాకు పిల్లలు లేరు. ఆయన సైన్యంలో పనిచేసేవాడు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైనిక బృందంతో ఆయన వెళ్ళాడు. హిట్లర్ సైన్యం చేతిలో బ్రిటిష్ సైనికులు చాలామంది చనిపోయారని, వారిలో నాభర్త కూడా ఉన్నాడని నాకు తెలిసింది. అది విని దుఃఖంతో కుప్ప కూలిపోయాను. నా భర్త ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ జ్ఞాపకాలతో నిండిన లండన్ ఇంట్లో ఆయన ఇక రాడన్న విషాదంతో నివసించలేక, ఆ ఇల్లు అమ్మేసి వచ్చి దూరంగా ఇక్కడ గత 35 ఏళ్లుగా బతుకుతున్నాను. నాలోకం నాది. నాకింత అన్యాయం చేసిన దేవుని స్మరించాలని నాకెన్నడూ అనిపించలేదు. అందుకే నేను చర్చికి రాను. ఇంకేముంది? నేను కూడా జీవితంలో చరమదశకు వచ్చాను’ అన్నదావిడ ఎంతో నిర్లిప్తంగా. ‘నాదొక చిన్న విన్నపం. రేపు క్రిస్మస్ లంచ్‌కు మీరు నా ఇంటికి తప్పక రావాలి’ అనడిగాడు పాస్టర్. ‘మీరేమీ అనుకోవద్దు. నేను రాలేను’ అన్నారావిడ. ‘మీరు నాకు తల్లిలాంటి వారు, దయచేసి కాదనకండి.’ అన్నాడు పాస్టర్ నవ్వుతూ. ఎంతోకాలంగా ఒంటరిగా బతుకుతున్న ఆ వృద్ధురాలి గుండెను ‘మీరు నా తల్లిలాంటివారు’ అన్న మాట నేరుగా గుండెలను తాకిందేమో, ఆమె అంగీకరించింది. ‘కాని ఒక షరతు. మీరే నాయింటికి రేపు లంచ్‌కి రండి నేనే వంట చేస్తాను’ అన్నదావిడ. ‘మహాభాగ్యం. తప్పకుండా’ అన్నాడు పాస్టర్. మరికాసేపు మాట్లాడి వెళ్ళిపోతూ, ‘ఈ రోజు రాత్రి 8 గంటలకు చర్చిలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన ఉంటుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే బదులు రావచ్చు కదా?’ అనడిగాడు పాస్టర్. ‘చూస్తాను’ అందావిడ. డిసెంబర్ 24 రాత్రి చర్చిలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన జరుగుతోంది. చర్చంతా కోలాహలంగా ఉంది. పాస్టర్ మాటి మాటి మాటికీ చర్చి మెయిన్ ద్వారం వైపు చూస్తున్నాడు, ఆ వృద్ధురాలొస్తోందేమోనని. ఆరాధన ఇంకొద్దిసేపట్లో ముగుస్తుందనగా ఆమె రానే వచ్చింది. పాస్టర్ గుండె ఆనందంతో నిండిపోయింది, అయితే, ఆమె మాత్రం పూల్పిట్ వైపే తదేకంగా చూడటం గమనించాడు. ఆరాధన అయిపోయాక ఆమెను కలవడానికి దగ్గరికి వెళ్లిన పాస్టర్‌తో ‘నేనొకసారి పూల్పిట్ మీదికి వెళ్ళొచ్చా?’ అనడిగింది. ‘తప్పకుండా’ అని ఆమెను నెమ్మదిగా నడిపించుకు పోయాడా పాస్టర్. ఆమె పూల్పిట్ మీది గోడకున్న కార్పెట్‌ను తడమటం ఆరంభించింది. ఆమె కంట నీళ్లు ధారగా కారిపోతున్నాయి. ఈ కార్పెట్ మీకు ఎక్కడ దొరికింది? అనడిగిందావిడ. ‘తెలీదమ్మా. స్టోర్ రూమ్‌లో ఉండింది. నేనే తీసి ఇక్కడ తగిలించాను’ అని బదులిచ్చాడు పాస్టర్. ‘నాకు, నా భర్తకు కార్పెట్లు నేయడం హాబీగా ఉండేది. మేమిద్దరం కలిసి నేసిన కార్పెట్ ఇది!! కావాలంటే చూడండి, కింద కుడి చివర మా ఇద్దరి పేర్లు కూడా నేయబడి ఉన్నాయి’ అన్నదా విడ ఏడుస్తూ. నిజమే ‘రాబర్ట్–లూసీ’ అన్న పేర్లు కార్పెట్‌లో భాగంగా నేయబడి ఉన్నాయి. ‘లండన్ ఇల్లు అమ్మేసినపుడు విరక్తితో అన్ని సామాన్లతో పాటు ఈ కార్పెట్ కూడా అమ్మేశాను. ఇన్నాళ్లకు మా కార్పెట్ మళ్ళీ నాకు కనిపించింది. ఇది నా భర్త తీపి జ్ఞాపకం. దీన్ని చూసేందుకైనా ఇక ప్రతి ఆదివారం చర్చికి వస్తాను. ‘థాంక్ యు వెరీ మచ్. రేపు నా ఇంట్లో గ్రాండ్ క్రిస్మస్ లంచ్. తప్పక రావాలి’ అని చెప్పి వెళ్లిపోయింది. మరునాడు చర్చిలో క్రిస్మస్ ఆరాధన ముగిశాక, అంతా చర్చ్ ఆవరణలో క్రిస్మస్ శుభాలు తెలుపుకొంటున్నారు. పాస్టర్ కూడా ఆమె ఇంటికి వెళ్ళబోతూ ఎందుకో చర్చ్‌లోకి వెళ్తే పూల్పిట్ వద్ద ఒకాయన ఏడుస్తూ కనిపించాడు. ‘ఏమైంది’ అనడిగాడు ఆయన్ని. ‘నేను గత పదేళ్లుగా పక్క వూర్లో ఉంటున్నాను. అప్పుడప్పుడూ ఈ చర్చికి వస్తూ ఉంటాను’ అన్నాడాయన. ‘పుల్పిట్ మీది కార్పెట్ నేను, నా భార్య కలిసి నేసినదే. కింద మా పేర్లు కూడా వున్నాయి. నేను రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ సైన్యం అంతా చనిపోతూ ఉంటే కొందరితో కలిసి ప్రాణాలతో బయటపడి అనేక దేశాలు తిరిగి లండన్‌లోని మా ఇంటికి వెళ్తే అక్కడ నా భార్య లేదు. ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పారు. అప్పటి నుండీ ఆమెను వెదకని ప్రదేశం లేదు, జ్ఞాపకం చేసుకోని సమయం లేదు.. అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడాయన... పాస్టర్ గుండె ఉద్వేగంతో కొట్టుకొంటోంది. తుఫాను వర్షం, కూలిన గోడ, వికారమైన అతుకు, స్టోర్స్‌లో వున్న కార్పెట్... ఒక వృద్ధ జంటను కలిపిన ‘గ్రాండ్ క్రిస్మస్’, దీనంతటి వెనుక ఉన్న దేవుని సంకల్పం, ప్రేమ... ‘హ్యాపీ క్రిస్మస్ టు యు’ అని పాస్టర్ అంటే, నిజమే, మా తీపి జ్ఞాపకమైన కార్పెట్ నాకు మళ్ళీ కనిపించిన హ్యాపీ క్రిస్మస్ అన్నాడా వృద్ధుడు. అతను వెళ్లబోతూ వుండగా, ‘మీకు బ్రహ్మాండమైన లంచ్‌ని ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. నాతో మీరు రావాలి’ అన్నాడు పాస్టర్. వృద్ధురాలి ఇంట్లో మొదటిసారిగా వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకున్న క్షణంలో ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిసి ఉప్పొంగిన వారి భావనలు వర్ణించడానికి మాటలు చాలవు. వారి కలయికకు తాను కారకుడనైనందుకు పాస్టర్ పొందిన ఆనందం వర్ణనాతీతం.... పోగొట్టుకున్న మానవాళిని తన కుమారుడైన యేసుప్రభువు ద్వారా దేవుడు తిరిగి పొందిన సుదినం ... దేవుణ్ణి మనిషినీ కలిపిన అద్భుత సమయం క్రిస్మస్... (ఇదొక వాస్తవ ఘటన) – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అజేయుల్ని చేసేది ఆ ఒక్కడే!
‘ఆ తర్వాత’ యేసుప్రభువు తిబెరియ సముద్రతీరంలో శిష్యులకు ‘మళ్లీ’ తనను ప్రత్యక్షపర్చుకున్నాడంటుంది బైబిలులోని యోహాను సువార్త (21:1). ఈ వాక్యంలోని ‘ఆ తర్వాత’, ‘మళ్లీ’ అనే మాటలు చరిత్ర గతినే మార్చిన ఒక మహోన్నత ఘటనకు సాదృశ్యాలు. రోమా ప్రభుత్వం, యూదులు కలిసి యేసును సిలువ వేయగా ఆయన చనిపోయిన ‘తర్వాత’, ప్రాణభయంతో శిష్యులంతా ఆయన్ను వదిలి పారిపోయి తమ భవిష్యత్తుంతా అంధకారమైందన్న నిరాశావాదంలో కూరుకుపోయిన ‘తర్వాత’, యేసు పునరుత్థానుడయ్యాడని తెలిసినా, ఆయనకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి పారిపోయిన తమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక దగ్గరకి రానివ్వరని శిష్యులు నిర్ధారణకు వచ్చిన ‘తర్వాత’, యేసు వారిని వెంబడిస్తూ యెరూషలేము నుండి తెబిరియ సముద్ర తీరానికి రావడం, వారికి ‘మళ్లీ’ ప్రత్యక్షమై వారితో సహవసించడం తిరుగులేని, ఎన్నటికీ తరగని దేవుని అద్భుత ప్రేమకు తార్కాణం! మూడేళ్ల క్రితం ఇదే సముద్రతీరంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్న ప్రభువు వాగ్దానంతో (లూకా 5:10) వారి విశ్వాస యాత్ర ఆరంభమైంది. ఇపుడు భవిష్యత్తంతా అంధకారమయంగా కనిపించగా, యేసు లేకుండా మళ్లీ అదే ప్రదేశానికొచ్చారు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేపను కూడా పట్టలేకపోయిన ‘వైఫల్యం’ వారిని మరింత కృంగదీసిన నేపథ్యంలో, ‘సూర్యోదయవేళ’ (యోహాను 21:4) యేసు వారికి తీరంలో కనిపించి పలకరించాడు. పిరికితనం, విద్రోహం, ఇప్పుడు వైఫల్యంతో కూడిన వారి నిరాశావాదమంతా ప్రభువు సాక్షాత్కారంతో పటాపంచలయింది. నిజమే, లోకాన్నంతా వెలుగుమయం చేసే సూర్యోదయం, ఇంటి కిటికీలు తలుపులు తెరిస్తేనే, మన గుండె ద్వారాలు తెరిస్తేనే మన సొంతమవుతుంది. యేసు సహచర్యంతో వారానాడు ఆ తర్వాత బోలెడు చేపలు పట్టారు. ప్రభువు వారితో అదే తీరంలో ఆనాడే పునరుత్థాన వినూత్న యుగానికి చెందిన ఒక కొత్త నిబంధన వారితో చేసుకోగా, నాటి నుండి అసమాన సువార్తవీరులయ్యారు, హతసాక్షులై మానవ చరిత్రను తిరగరాశారు. లోకాన్ని మనమెంత ప్రేమించినా అది మనకిచ్చేది అంధకారమే, నిరాశావాదమే, వైఫల్యమే!! కాని ప్రభువు మళ్లీ ప్రవేశించడంతో విశ్వాస జీవితంలో సూర్యోదయమవుతుంది, బతుకు బాటంతా వెలుగుమయమవుతుంది. వెంటాడి మరీ చీకటిని పటాపంచలు చేసే శక్తి ఎన్నటికీ తరగని, మారని, వాడని దేవుని అద్భుతమైన ప్రేమది. అందుకే పాపులను, పడిపోయిన వారిని ప్రేమించి గుండెలకు నిండుగా హత్తుకొని వారి జీవితాలను దివ్యంగా పునరుద్ధరించే ప్రభువని యేసుకు పేరు. పిరికితనం, ద్రోహస్వభావం, పలాయనవాదం, నిరాశావాదం మనలోనే తిష్టవేసుకున్న మన అంతఃశత్రువులు. వైఫల్యం, అంధకారం అవి మనకిచ్చే బహుమానాలు. వాటి మీద విజయమిచ్చేవాడు, అలా మనల్ని అజేయులను చేసేవాడు మాత్రం ప్రభువే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వమంతా నిశ్శబ్దం... చీకటి!?
హోలీ వీక్ చీకటి శక్తుల కుట్రలు ఫలించాయి. దైవకుమారుడైన యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పునిచ్చి అత్యంత క్రూరంగా సిలువ వేశారు. కొరడాదెబ్బలు, తిట్లు, అవహేళనలు, ఈసడింపులు, అబద్ధాలదే రాజ్యమైంది. సర్వశక్తుడు, సర్వోన్నతుడు, సర్వైశ్వరుడైన యేసుక్రీస్తు నిస్సహాయంగా, మౌనంగా తలవంచుకొని అన్నీ భరిస్తూ, తనను సిలవ వేస్తున్న వారేమి చేస్తున్నారో వారికి తెలియదు గనక వారిని క్షమించమని ప్రార్థిస్తూ పొద్దున్నుండి సాయంత్రం దాకా వేలాడి తనువు చాలించాడు. నిన్ను క్షణకాలం కూడా వదిలే ప్రసక్తి లేదంటూ ప్రగల్భాలు, బింకాలు పలికిన శిష్యులంతా తమ బోధకుణ్ణి వదిలి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. అరిమలై యేసేపు, నికోదేము అనే ఇద్దరు యూదుమత చాందసులు ఆయన అంత్యక్రియల బాధ్యత వహించారు. సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే వారు ఒక రాతి సమాధిలో ఆయన్ను ఖననం చేశారు. ఇక యేసుక్రీస్తు చరిత్ర ముగిసినట్టేనని శత్రువులు జబ్బలు చరిచారు. విశ్వమంతా నిశ్శబ్దం ఆవహించింది. దేవదూతల కోలాహలంతో ఎప్పుడూ సందడిగా ఉండే పరలోకం చిన్నబోయి విషాదమయమైంది. చెడు ముందు మంచి శాశ్వతంగా ఓడినట్టేనా? వెలుగును చీకటి మింగేసినట్టేనా? నవ్వును ఏడుపు పూర్తిగా ఓడించినట్టేనా..? ఈ ప్రశ్నలు మారుమోగుతున్నాయి. మరి జవాబు? వేచిచూద్దాం... – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆరాధనా స్థలాలుగా... మన కుటుంబాలు
విశ్వాసి వాక్యం అకుల అనే యూదు క్రైస్తవుడు అతని భార్యయైన ప్రిస్కిల్ల ఆదిమకాలపు ఆదర్శమయమైన విశ్వాసి జంట. అపొస్తలుడైన పౌలుకు పరిచర్యలో వారు సహాయకులు. ఎంతో ప్రతికూలత మధ్య పౌలు స్థాపించిన కొరింథీ, ఎఫెసీ చర్చిలు ఆ పట్టణాల్లో అకుల, ప్రిస్కిల్ల గృహాల్లోనే ఆరంభమయ్యాయి. పైగా అపొల్లో అనే మహావిద్వాంసుణ్ణి వారు ఎఫెసులో తమ ఇంటిలో చేర్చుకుని క్రీస్తు మార్గాన్ని విశదీకరించి తర్ఫీదునిస్తే ఆయన గొప్ప సువార్త ప్రబోధకుడయ్యాడు (అపొ.కా. 18) మా చర్చిలో మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం తెలుసా? అంటారు చాలామంది గొప్పగా. అకుల, ప్రిస్కిల్ల అనే ఈ దంపతులైతే తమ కుటుంబాన్నే చర్చిగా, బైబిలు కళాశాలగా మార్చుకున్నారు. పగ, వైషమ్యాలు పెచ్చరిల్లుతున్న నేటి సమాజంలో దేవుని భయం, ప్రేమ పునాదిగా కలిగిన ఇలాంటి విశ్వాస కుటుంబాలు ఎడారిలో సెలయేళ్లవంటివే కదా! ఆత్మీయ పునాదులు, విలువల మీద కట్టబడిన కుటుంబాలతోనే పటిష్టమైన సమాజం నిర్మితమవుతుంది. పిల్లల పెంపకంలో అందుకే తల్లిదండ్రులది కీలకమైన పాత్ర. కరెన్సీ కట్టల్ని వేటాడే విద్యల్లో మన పిల్లలు ఆరితేరేందుకు ఆరాటపడుతున్నాం కాని అంతిమంగా ఆత్మీయత రూపంలో వారెలాంటి మూల్యాన్ని చెల్లించవలసి వస్తుందో ఆలోచించడం లేదు. ఆవిరి యంత్రాలతో ఆరంభమైన పారిశ్రామిక విప్లవం వేస్తున్న వెర్రితలల ఆధునిక యుగంలో మనుషులు కూడా మనసులేని యంత్రాలుగా మారి, ఒకనాటి శాంతి, ఆనందాలు ఆవిరైపోతుంటే నిస్సహాయంగా చూస్తున్నాం. అన్నీ చూస్తూ కూడా అలాంటి రాక్షస సమాజంలోనికే మన పిల్లల్ని నెడుతున్నాం. దేవుడు మాత్రమే ఇచ్చే శాంతిని, నిజమైన ఆనందాన్ని, లోకం ఇచ్చే విలాసాలు, వినోదాల్లో పొందే అవివేకానికి ‘ఆధునికత’ అనే పేరు పెట్టి మురిసిపోతున్నాం. మన కుటుంబాలు దేవునికి ఆరాధనా స్థలాలు, బైబిలు బోధనా కేంద్రాలుగా ఉంటే దేవునికి మహిమ, మనకు పరలోకానందం. దేవుడు, ఆయన విధివిధానాల మీద కట్టబడిన విశ్వాస కుటుంబాలు వినూత్న సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి. దేవునికి దూరంగా బతకడమే ఆనందమనుకుంటే నీటికోసం ఎండమావుల్ని ఆశ్రయించడమే. మితిమీరిన వేగం, హింసాత్మకత నిండిన నేటి ‘ప్రగతిశీల సమాజం’లో జీవన సాఫల్యంతో హాయిగా కన్నుమూసే భాగ్యం కోల్పోయాం. బి.పి., షుగర్ వంటి జీవనశైలి రోగాలతో, బుల్లెట్ గాయాలతో కన్నుమూసే నిస్సారపు సమాజాన్ని నిర్మించుకున్నాం. ‘దేవుని సన్నిధి’ అనే అగ్ని మండే బలిపీఠాలుగా మన కుటుంబాలు, చర్చిలు ఉండాలి. అది సకల విధాలైన అపరిశుద్ధతనూ దహించి వేసి శాంతిని, ఆనందాన్ని మనలో నింపుతుంది. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
పరిశుద్ధతతోనే ప్రభువు సన్నిధి
యెరూషలేములో దేవుని కోసం గొప్ప మందిరాన్ని కట్టాలన్నది దావీదు చక్రవర్తి కోరిక. కాని ఆయన కుమారుడైన సొలోమోను దాన్ని కట్టేందుకు దేవుడు అనుమతించాడు. ఆ మందిర ప్రతిష్ట సందర్భంగా దేవుడు ఆ మందిరంలో తన సన్నిధి దయ చేస్తానని వాగ్దానం చేశాడు. అయితే ప్రజలు తన ఆజ్ఞలు, విధి విధానాలు ఉల్లంఘిస్తే మందిరాన్ని తన సన్నిధి నుండి తోసి వేస్తానని కూడా దేవుడు హెచ్చరించాడు (2 దిన 7:12-22). సొలోమోను, దేవుని ప్రజలు కూడా క్రమంగా దేవునికి దూరం కాగా, ఆ తర్వాత తొమ్మిది వందల ఏళ్లలో ఆ మందిరం శత్రురాజుల దాడుల్లో పూర్తిగా ధ్వంసమైంది. సొలోమోను జీవితంలాగే, ఆ మందిరం కూడా వైభవం కోల్పోయింది. ‘దేవుని సన్నిధి’ని పొందేందుకు చరిత్రలో మానవుడు చేయని ప్రయత్నం లేదు. కానుకలిచ్చి, సత్కార్యాలు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునన్న బాలశిక్ష స్థాయి ఆలోచనలు నేటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఆధునిక జీవన శైలి మాత్రం మనిషిని నానాటికీ దేవుని నుండి దూరం చేస్తోంది. నేటి డిజిటల్ యుగంలో అరవై శాతం ప్రజలు పది నిమిషాలు మాట్లాడితే కనీసం రెండు అబద్ధాలాడుతున్నారన్నది ఒక సర్వేలో తేలిన అంశం. అంటే అపరిశుద్ధతకు మనం ఎంత చేరువగా జీవిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. తుపాకి గురిపెట్టే వద్ద అంగుళంలో పదోవంతు తేడా వస్తే లక్ష్యాన్ని తాకడంలో బుల్లెట్ అడుగు మేరలో తప్పిపోతుందట. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లే, అప్రధానంగా కనిపించే అంశాలే పెనుతుఫానులుగా మారి ఆధునిక జీవితాల్లో అశాంతిని మిగుల్చుతున్నాయి. అంధుడికి రంగు అనే మాట తెలుస్తుందేమో కాని ఏ రంగు ఎలా ఉంటుందో ఎన్నటికీ అర్థం కాదు. దేవుని పరిశుద్ధతకు చెందిన అవగాహన లేకుండా ఆయన సాన్నిధ్యం తాలూకు శక్తి, సంపూర్ణత, విస్తృతత్వం కూడా అర్థం కాదు. ‘‘ఇంతకీ నీవెవరవని ఫరోకు చెప్పాలి?’’ అని మోషే దేవుణ్ణి అమాయకంగా అడిగాడు. దానికి దేవుడు తన గొప్పతనాన్ని, ప్రభావాన్ని వర్ణించి చెప్పలేదు కానీ, ‘‘నేను ఉన్నవాడను’’ అని చెప్పమంటూ ముక్తసరిగా జవాబిచ్చాడు. అంటే నీ మాటల్లో, ఆలోచనల్లో ఫరో నీ దేవుని శక్తిని గుర్తిస్తాడు అని పరోక్షంగా చెప్పాడన్నమాట. అదే జరిగింది కూడా. ఒకప్పుడు ఫరోకు భయపడి పారిపోయిన మోషే ఇప్పుడు దేవుని పక్షంగా అతనితో మాట్లాడుతూంటే హడలిపోయి ఫరో దేవుని ప్రజలకు దాస్యవిముక్తినిచ్చాడు. అది చర్చి అయినా, జీవితమైనా, కుటుంబమైనా పరిశుద్ధత లేని చోట ప్రభువు ఉండడు. సంపూర్ణమైన విధేయత, నిబద్ధత లేకుండా పరిశుద్ధత అలవడదు. ఆ దేవుని సాన్నిధ్యం తాలూకు శక్తి, ప్రభావం విశ్వాసి మాటల్లో, చేతల్లో ప్రతిఫలించి అతన్ని అజేయునిగా నిలుపుతుంది. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
పశ్చాత్తాపం ద్వారానే నిత్యశాంతి!
ఒకసారి సీమోను అనే పరిసయ్యుడు యేసును తన ఇంటికి విందుకు పిలిచాడు. పాపాత్మురాలిగా ముద్రపడిన ఒక స్త్రీ ఆహ్వానం లేకుండానే అక్కడికొచ్చింది. యేసును అత్తరుతో అభిషేకించి, ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు తడిపి, తలవెంట్రుకలతో తుడిచి, వాటికి ముద్దు పెట్టింది. నిజానికి ఇంటికొచ్చిన అతిథి కాళ్లు ఇంటి సేవకులు కడిగితే ఇంటి యజమాని అతనికి ముద్దుపెట్టి సాదరంగా లోనికి తీసుకెళ్లడం నాటి ప్రముఖులైన యూదుల ఇళ్లలోని ఆచారం. తాను చేయని పనులన్నీ ఆమె చేస్తూంటే అభ్యంతర పెట్టని సీమోను, ఈయన నిజంగానే ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలన్న విషయం గ్రహిస్తాడని మనసులో అనుకున్నాడు. యేసు అది గ్రహించి, ‘ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె చేసిన విస్తారమైన పాపాలూ క్షమించబడ్డాయి’ అంటూ, శాంతి గల దానవై వెళ్లమంటూ ఆమెను దీవించాడు (లూకా 7:36-50). ‘లోకంలో అందరూ పాపులే! కాకపోతే కొందరు క్షమించబడిన పాపులు, మరికొందరు ఇంకా క్షమించబడని పాపులు’అన్న సత్యాన్ని ప్రభువు సీమోనుకు పరోక్షంగా తెలిపాడు. సీమోను అతిథి మర్యాదలు చేయకపోగా, ఆ లోటును ఆ స్త్రీ పశ్చాత్తాపంతో కూడిన తన దివ్యప్రవర్తనతో పూడ్చి ఆ విందుకే అందాన్ని తెచ్చింది. అనామకురాలు, సమాజం చేత తృణీకరించబడినదే అయినా ఎంతో నిశ్శబ్దంగా ఆమె చేసిన అసమానమైన ఆనాటి ఆరాధన చరిత్ర పుటలకెక్కింది. దేవుని చేతే శ్లాఘింపబడింది. మనిషిదీ దేవునిదీ, పశ్చాత్తాపానికి, ప్రేమకూ మధ్య ఉన్న అనుబంధమే! యేసే ఇంటికొచ్చినా ఆయన నుండి నిత్యజీవాన్ని పొందలేకపోయిన దురదృష్టవంతుడు సిమోను కాగా, పిలవని అతిథిగా వచ్చి ప్రభువు పాదాల వద్ద తన పాపాల భారాన్నంతా వదిలించుకుని ఆయన ప్రసాదించిన శాంతిని, క్షమాపణను మూటగట్టుకుని వెళ్లిన ధన్యజీవి ఆ అనామకపు స్త్రీ!! అందుకే దేవుడిచ్చే నిత్యశాంతిని పొందడం, కోటిరూపాయలు కూడబెట్టినంత తేలిక కాదని మనం గ్రహించాలి. పాస్ పోర్టున్నోళ్లంతా విదేశాలకు వెళ్లినవాళ్లు కానట్టే, దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పేవాళ్లంతా నిత్యశాంతిని పొందిన వాళ్లు కాదు. చెమటోడ్చి పని చేసే రోజు కూలీ తన పూరి గుడిసెలోనే పచ్చడి మెతుకులు తిని, చింకిచాప మీద ఒళ్లు మరచి నిద్రపోతుంటే, ఏసీ గదుల్లో బతికే ధనికులు, బడాబాబులు ఆకలి లేక, నిద్ర రాక అలమటించడం వెనుక రహస్యం అదే! దేవుని నిత్యశాంతి అనే నది ‘పశ్చాత్తాపం’ అనే కాలువ ద్వారానే విశ్వాసి జీవితంలోకి ప్రవహిస్తుంది. ప్రేమ, నిస్వార్థత, కరుణ, పరిశుద్ధత, పరోపకారం, నిర్భయత్వం, నీతి అనే వృక్షాలు ఆ నీటితోనే విశ్వాసి జీవితంలో ఎదిగి ఫలిస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
మట్టి పడవలో ప్రయాణం...
దేవదేవుని మహాస్వరం ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు గొంతులో ఈ లోకంలో ప్రతిధ్వనించింది. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తించినట్టే, విశ్వాసులు కూడా తన స్వరాన్ని గుర్తిస్తారని ప్రభువు చెప్పాడు (యోహాను 10:4). పది నెలల పసిపాప కూడా ఎంతమందిలోనైనా తన తల్లిదండ్రుల స్వరాన్ని గుర్తించి వారివైపు తన చేతులు చాపుతుంది. ప్రతిరోజూ వింటున్న ఆ స్వరాలు ఆమెకు సుపరిచితమవుతాయి. లోకం తాలూకు రణగొణ ధ్వనులు, కీచులాటలు, వాగ్వాదాలు, శబ్దాలహోరులో దేవుని మృదువైన స్వరం మనిషి చెవులకు సోకడం కొంత కష్టమే! అయితే దేవునితో చేసే నిరంతర సహవాసంలో ఆయన స్వరం సుపరిచితమవుతుంది. కాపరి తన గొర్రెలను మేపుతాడు, దారి చూపిస్తాడు. క్రూర మృగాల నుండి వాటిని కాపాడుతాడు.తిరుగుబాటుతత్వం, చపలత్వం, అవిధేయతతో నిండిన మనిషికి కూడా దేవునితో పోటీ, మార్గదర్శకత్వం, భద్రత, క్షమాపణ, దొరుకుతాయి. అంతరిక్షాన్నే గెలిచినవారు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం, నన్ను నేను సంస్మరించుకోవడం ఒక లెక్కా! అన్నది మనిషి ధీమా. అయితే అది మట్టి పడవలో అవతలి తీరానికి చేరాలనుకోవడమే! తనను తాను కాపాడుకోలేని మట్టి పడవ మనల్ని గమ్యం చేర్చుతుందా? ఎంతసేపు ‘అపరిశుద్ధం’ కావడానికే ఆరాటపడే ఆంతర్యాన్ని శుద్ధిచేసి మార్చగల శక్తి అతని సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఉంది. అలా బాహ్య శక్తి మాత్రమే అతన్ని దారికి తేగలదు. దేవున్ని లోతుగా జీవితాల్లో ప్రతిష్టించుకొని ఆయన స్వరం వింటూ విధేయత చూపడమొక్కటే తరుణోపాయం. కనీసం కొత్త ఏడాదిలోనైనా ఆయన స్వరం వినేందుకు అభ్యాసం చేద్దాం. దేవుని ఆశీర్వాదాలకు, శాంతి సమాధానాలకు ఆవిధంగా చేరువవుదాం. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
ఈ వైరుధ్యమే కారణం!
ఆశీర్వాదాలు అందడంలో ఆలస్యానికి గొల్యాతు అనే ఫిలిష్తీయుని దేహదారుఢ్యం, పెడబొబ్బలకు జడిసి ఇశ్రాయేలీయుల్లో ఎవరూ అతన్నెదుర్కోవడానికి సాహసించడం లేదు. అయితే చాలా చిన్నవాడు, బలహీనుడు, యుద్ధ విద్యలేవీ రాని గొర్రెల కాపరియైన దావీదు, విశ్వాసియైన తన ముందు అన్యుడైన గొల్యాతు ఎంత? అన్న రోషంతో కేవలం తన వడిసెలతో చిన్నరాయితో అతన్ని పడగొట్టి చంపి గొప్ప విజయం సాధించి పెట్టాడు (1 సమూ 17:17-54). విజయ సాధనలో ఆయుధాలు, సామర్థ్యం కన్నా దృక్పథమే కీలకం. ‘నేను గొప్పవాణ్ణి’ అని కాకుండా ‘నా దేవుడెంతో గొప్పవాడు’ అన్న దృక్పథం గలవాడే విజయుడవుతాడు. బల్బు వెలగడానికి మూలం అదృశ్యంగా ఉండే విద్యుచ్ఛక్తిలో ఉన్నట్టే, విశ్వాసి శక్తికి మూలం, ప్రాప్తి స్థానం దేవుడే! దేవుడు తన తెలివిని, సామర్థ్యాన్నంతా మనిషిలో నిగూఢపర్చాడు. వాటితో అతడు తన జీవితాన్ని, చుట్టూ ఉన్న లోకాన్ని పరలోకానందమయం చేసుకోవాలని సంకల్పించాడు. కాళ్లు, చేతులు లేని వారిని ఈ లోకం వికలాంగులంటుంది. కాని తాను దేవుని వాడనని, దేవుని రూపమే కాదు శక్తి కూడా తనదేనన్న గ్రహింపులేక జీవితాన్ని నిరర్థకం చేసుకునేవాడే నిజమైన వికలాంగుడు. మనిషి ప్రజ్ఞకు, సామర్థ్యానికి దేవుని కృప అనే నేల, పరిశుద్ధాత్మ సహవాసం అనే తేమతోనే సృజనాత్మక శక్తి రూపం వస్తుంది. ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. తనకేది ఉత్తమమైనదో మనిషికి తెలియదు. ఉత్తమమైనది తప్ప మనిషికి మరొకటివ్వడం దేవునికిష్టం ఉండదు. మనకు ఆశీర్వాదాలు రావడంలో ఆలస్యానికి ఈ వైరుధ్యమే కారణం. అందువల్ల దేవుని సమయానికి, సంకల్పానికి తలవంచే ఆత్మీయ క్రమశిక్షణను అలవర్చుకోవాలి. దైనందిన జీవన స్థితిగతులు, పరిణామాలను పరలోకపు దృష్టితో చూడగలిగితే విశ్వాసి జీవితమంతా విజయపథమే. దేవుని నిర్ణయాల్లో పొరపాట్లుండవు. ఆయన శక్తిని, పద్ధతులను మనం అర్థం చేసుకోవడంలోనే పొరపాట్లుంటాయి. - రెవ. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసి సంపూర్ణంగా తెలుసుకోవాలి
నలభై ఏళ్లు అవిశ్రాంతంగా పరిచర్య చేసిన మహాదైవజనుడు జాన్ న్యూటన్. చివరి దశలో అల్జీమర్స్ అనే మతిమరపు వ్యాధి సోకి ఆయన అన్నీ మర్చిపోసాగాడు. చివరికి తన భార్యను, పిల్లల్ని, తన పేరు కూడా మర్చిపోయాడు. అవ సాన దశలో ఉన్న ఆయన్ను శ్లాఘిస్తూ బ్రిటిష్ వార్తాపత్రికలు వ్యాసాలు ప్రచురిస్తే అవి చదివి ‘‘వీళ్లు రాస్తున్నదెవరి గురించి?’’ అని అమాయకంగా ప్రశ్నించేవాడట. ఆయన మరణించిన రాత్రి తలగడ కింద ఆయన డైరీ దొరికింది. ‘నేను అన్నీ మర్చిపోతున్నానని తెలుసు. కాని దేవా, నేనొక ఘోరపాపినని, నా దేవుడొక అద్భుతమైన రక్షకుడని మాత్రం నన్ను మరువనీయకు’అని చనిపోవడానికి ముందు రాత్రి అందులో రాసుకున్నారు. కొద్దిసేపట్లో మనం చనిపోతున్నామని తెలిస్తే, మన జీవితాన్ని సమీక్షించే రెండు మాటలు రాయవలసి వస్తే మనమేం రాస్తాం?రోమ్ చెరసాలలో మరణ శిక్షను శిరచ్ఛేదనం ద్వారా అమలయ్యేందుకు ఎదురు చూస్తున్న ఖైదీగా అపోస్తలుడైన పౌలు తనకత్యంత ప్రియశిష్యుడైన తిమోతికి రాసిన రెండవ పత్రిక అలాంటిదే! ‘మంచిపోరాటం పోరాడాను, నా పరుగుని తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను’అన్న ఆ పత్రికలోని పౌలు మాటల్లో శిరచ్ఛేదనం కాబోతున్న ఖైదీ తాలూకు బాధ, నిరాశ, నిర్వేదం లేనే లేదు సరికదా, ఒక విజేత తాలూకు సంతృప్తి, విజయభావన, ధీమా ప్రతిధ్వనించడం లేదా?(2 తిమో 4:17)ఇంతటి ఆత్మీయ ఔన్నత్యానికి, పరిస్థితికి కారణం కూడా ఆయనే ‘నేను నమ్మిన వానిని నేనెరుగుదును (1:12) అన్న ఒక్కమాటతో వెల్లడి చేశాడు. అడుగడుగునా ఆపదలు, ప్రాణాపాయ స్థితులతో ఒక నిరంతర పోరాటంగా సాగిన ఆయన జీవితంలో సంతృప్తికి, విజయానికి కారణం దేవుణ్ణి అంతకంతకూ ఎక్కువగా తెలుసుకోవడమే! మీ దేవుడు మీకు తెలుసా? అనడిగితే అంతా అవునంటారు. కాని, ఎంత తెలుసు? అనడిగితే నీళ్లు నములుతారు. విశ్వాసి తన రక్షకుడైన యేసుక్రీస్తు వారి సంపూర్ణ జ్ఞానంలోకి ఎదగడమే అతని ఆత్మీయారోగ్యం బాగా ఉందనడానికి సూచన. తన దేవుని ఎరిగిన వారు బలము పొంది గొప్ప కార్యాలు చేస్తారని బైబిలు కూడా చెబుతోంది(దాని 11:32). తమ దేవుడెవరో తెలియడం వేరు, ఆ దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడం వేరు. యేసుక్రీస్తుగా నరావతారిగా పరలోకాన్ని వీడి, పాపి కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవుని ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పు తెలిసిన విశ్వాసి ఈ లోకంలో అజేయుడవుతాడు. మనిషి తన జీవితాన్ని మెత్తని పక్షిగూడుగా మార్చుకోవాలనుకుంటే అందుకు తాను విశ్వసించే దేవుణ్ణి సన్నిహితంగా ఎరగాలి. ఆ అనుభవం లేకపోతే మనిషి తన తెలివి తక్కువతనంతో జీవితాన్ని పంజరంగా మార్చుకుని బందీ అవుతాడు. అసూయ, ద్వేషం, వైషమ్యం వంటి బందీ భావాలను మనిషి తనకు తానే నిర్మించుకుని స్వచ్ఛందంగా వాటిలో బందీ అవుతున్నాడు. దీనికి తోడు అనవసర భయాలు, చింతలు. జీవితంలోని మాధుర్యాన్ని ఈ కారణాల వల్ల మనిషి ఆస్వాదించలేకపోతున్నాడు. జీవితం అసలే చిన్నదంటే, వీటన్నింటివల్ల దాన్ని మరింత చిన్నదిగా చేసుకుంటున్నాడు. దైవభయం, దైవజ్ఞానంతోనే అతని జీవితం మంచి మలుపు తిరుగుతుంది. ఈ రెండూ లేకుండా జీవితంలో ఆనందం, సంతృప్తి, అనే త లుపులు తెరిచే తాళాలు వెదుకుతుంటే అది వ్యర్థ ప్రయత్నమే! ఎందుకంటే దేవుణ్ణెరిగినవారికి ఆ తలుపులూ వాటంతట అవే తెరుచుకుంటాయి. చింతించడం, భయపడటమంటే ఇంట్లో ఊయలలో కూర్చుని ఊగడమేనంటాడు ఒక తత్వవేత్త. ఊయల అటూ ఇటూ ఊగుతుందే తప్ప దానికంటూ గమ్యం ఉండదు. మరణశిక్షనెదుర్కొంటూ కూడా ఒక ఖైదీగా పౌలు అంతటి సంతృప్తినీ, ధీమానూ వ్యక్తం చేయడానికి కారణం దేవుని పట్ల ఆయనకున్న అవగాహనే! కాని అతనికి శిరచ్ఛేదనం శిక్ష విధించిన నీరో చక్రవర్తి మాత్రం తన అవసాన దశలో పిచ్చివాడై తిరుగుతూంటే సంకెళ్లతో బంధించారు. దేవుణ్ణెరిగిన ఒక ఖైదీలో స్వతంత్రభావం, దేవుణ్ణెరుగని చక్రవర్తిలో ఉన్మాదం, బందీ జీవితం!! విచిత్రం కదూ!! - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ సంపూర్ణంగా తెలుసుకోవడమే సిసలైన భక్తి దేవుడెవరో తెలియడం వేరు, ఆ దేవుణ్ణి లోతుగా అర్థం చేసుకోవడం వేరు. యేసుక్రీస్తుగా నరావతారిగా పరలోకాన్ని వీడి, పాపి కోసం భూలోకానికి దిగి వచ్చిన దేవుని ప్రేమ, ఎత్తు, లోతు, వెడల్పు తెలిసిన విశ్వాసి ఈ లోకంలో అజేయుడవుతాడు. మనిషి తన జీవితాన్ని మెత్తని పక్షిగూడుగా మార్చుకోవాలనుకుంటే అందుకు తాను విశ్వసించే దేవుణ్ణి సన్నిహితంగా తెలుసుకోవాలి.