‘మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అపుడు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, పిదప భూదిగంతాల దాకా మీరు నాకు సాక్షులై ఉంటారు’ అన్నది ఆదిమ అపొస్తలులకు, విశ్వాసులకు యేసుప్రభువు తన ఆరోహణానికి ముందు చేసిన వాగ్దానం(అపో.కా 1:8). యెరూషలేములో పెంతేకొస్తు నాడు మేడగదిలో ఆరంభమైన చర్చి అతి త్వరలోనే బాగా వ్యాప్తి చెందింది. అయితే ఉన్నట్టుండి చర్చి శ్రమలకు లోనైంది. క్రైస్తవం వ్యాప్తిని అడ్డుకోవాలన్న కంకణం కట్టుకున్న సౌలు అనే యూదు మతచాందసుడు, పరిసయ్యుడు, స్తెఫను అనే చర్చి పరిచారకుణ్ణి, దైవదూషకుడన్న నేరారోపణపై దగ్గరుండి మరీ రాళ్లు రువ్వించి చంపించాడు. యెరూషలేములోని చర్చికి, అక్కడి విశ్వాసులకు ‘పరిశుద్ధాత్మ శక్తి’ ఎలా ఉంటుందో, అసలదేమిటో అప్పుడర్ధమైంది. అద్భుతాలు చేసే శక్తిని మాత్రమే కాదు, ఆనందంగా ప్రభువు కోసం హత సాక్షి అయ్యే శక్తిని కూడా ఆ పరిశుద్ధాత్ముడే ఇస్తాడని, అది పరిశుద్ధాత్మశక్తిలో అంతర్భాగమని స్తెఫను మరణంతో చర్చికి అర్థమయింది, చర్చిని అందుకు సిద్ధపర్చింది కూడా !!! ఎందుకంటే తగాదాల్లో తలలు నరకడానికి అవసరమయ్యే శక్తి కన్నా వెయ్యిరెట్ల ఎక్కువ శక్తి మంచికోసం పాటుపడేందుకు, పదిమందికీ సాయం చేసేందుకు, ముఖ్యంగా ప్రభువు కోసం శ్రమపడేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనే నాణేనికి భాషల్లో మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం ఒక వైపైతే, శ్రమలు అనుభవించడం దానికి మరో వైపు. ఇందులో ఒకటి మాత్రం కావాలి, మరొకటి నాకొద్దు అనుకోవడానికి వీలు లేదు. నిజమైన పరిచారకుని జీవితంలో అద్భుతాలుంటాయి, శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమల కారణంగా యెరూషలేము చర్చి, విశ్వాసులు పలు ప్రాంతాలకు చెదిరిపోయి, ఆయా కొత్తప్రాంతాల్లో క్రైస్తవాన్ని ప్రకటించి పలు కొత్త చర్చిలు స్థాపించారు. ప్రపంచం నలుమూలలకు చర్చి వ్యాప్తి చెందేందుకు దేవుడు వాడుకున్న ఒక విధానం శ్రమలు.
అలా చెదిరిపోయిన విశ్వాసులు యెరూషలేము చర్చి పరిచారకుడైన ఫిలిప్పు నాయకత్వంలో, నాటి దేవుని వాగ్దానం మేరకు సువార్త వ్యాప్తి కోసం సమరయ ప్రాంతానికి వెళ్లారు. సమరయలో ఫిలిప్పు ఎంత అద్భుతంగా, విజయవంతంగా సేవ చేశాడంటే ఆయనకు సహాయంగా యెరూషలేము చర్చి పేతురును, యోహానును కూడా సమరయకు పంపగా, వారందరి సేవతో సమరయలో చర్చి అక్కడ గొప్పగా విస్తరించింది. వాళ్ళు ఎవరి మీద చేతులుంచితే వారిమీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. మహా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. అసలు అపొస్తలులు సమరయకు వెళ్లడమే పరిశుద్ధాత్ముడు చేసిన ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే, ఒకే దేవుణ్ణి విశ్వసించేవారైనా సమరయులు యూదులకు అంటరాని వారు, వాళ్ళ మధ్య వందల ఏళ్లుగా సైద్ధాంతిక విభేదాలున్నాయి, ఆత్మీయంగా ఎంతో వైరముంది. అయినా ఆ విభేదాలను అధిగమించి అంటరానివారిని కూడా తమకు ఆప్తులైన వారుగా పరిగణించే అవగాహనను, ప్రేమను పరిశుద్ధాత్ముడు అపొస్తలులలో, ఆదిమ విశ్వాసుల్లో రగిలించాడు. వారికి సువార్త ప్రకటించి యేసుప్రభువులో అంతా సమానమేనని వారు ప్రకటించారు. పోతే అంతకుమునుపు అక్కడ సీమోను అనే గారడీవాడు తన కనికట్టువిద్యలతో అందరినీ భ్రమింపజేస్తూ బోలెడు పేరు, డబ్బు సంపాదించుకున్నాడు.
అయితే తన కార్యాలకు మించిన కార్యాలు అపొస్తలుల పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్నాయని చూసి, ముందు వారితో కలిసి తిరిగాడు. ఆ తర్వాత కొంత ద్రవ్యాన్ని వారికివ్వజూపి తాను కూడా పరిశుద్ధాత్మశక్తి ని పొందేలా చెయ్యమని కోరితే అపొస్తలులు అతన్ని తీవ్రంగా మందలించారు. మతాసక్తి, ధన సంబంధమైన దురాశ కలిసైనా నకిలీ పరిచారకులకు గారడీవాడైన సీమోను ఒక ఉదాహరణ. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో సీమోనులాంటి వారి కుతంత్రాలను తిప్పి కొట్టారు. అదే పరిశుద్ధాత్మ శక్తి అంటే!! అన్ని అంతరాలను, విభేదాలను, అడ్డుగోడలనూ ఆ శక్తి కూల్చేస్తుంది. అన్ని కుతంత్రాలనూ అది తిప్పి కొడుతుంది. ఇప్పుడు కూడా ఎవరైనా ‘మా చర్చే మంచిది, మాదే నిజమైనది’ అన్నట్టుగా మాట్లాడుతున్నా,వ్యవహరిస్తున్నా, వారికి పరిశుద్ధాత్మశక్తికి చెందిన వాస్తవాలు అర్థం కాలేదన్నది ఈ పరిణామాలను బట్టి తెలుస్తుంది. విడిపోవడానికి వంద కారణాలున్నా, అందరమూ ఆరాధించే దేవుడు యేసే అన్న ఒక్క కారణాన్ని బట్టి కలిసుండాలంటాడు పరిశుద్ధాత్ముడు. విభేదాలేర్పడి విడిపోవడం కన్నా, విడిపోవాలనుకొని విభేదాలు వెదుక్కునే ధోరణి, ధనార్జన కోసం ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకొనే స్వార్థం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అందుకే దేవుడొక్కడే అని చాటే క్రైస్తవంలో ఈనాడు ఇన్ని వర్గాలు, శాఖలు, ఇన్నిన్ని సిద్ధాంతాలు అన్న అపవాదు!! పరిశుద్ధాత్మునిలో ఐక్యతే ఉంటుంది తప్ప అనైక్యత ఉండదు, బీదా, గొప్ప, చిన్న, పెద్ద అన్న తారతమ్యాలుండవు (అపో.కా.1.8 అధ్యాయాలు). ఒకవేళ తప్పక అవసరార్థం విడిపోయినా వారి మధ్య వైషమ్యానికి తావు లేదు. శత్రువులను కూడా ప్రేమించాలన్న దేవుడు, సైద్ధాంతిక విభేదాలతో పక్క చర్చివాళ్లను ద్వేషించమని చెబుతాడా?
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
Email: prabhukirant@gmail.com
పరిశుద్ధాత్మశక్తిలో ఐక్యత, పరిపూర్ణత...
Published Sun, Feb 17 2019 12:32 AM | Last Updated on Sun, Feb 17 2019 12:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment