jesus
-
ప్రేమించడానికి అర్హతలు
యేసు ప్రభువు వారి అసాధారణ బోధ ఏమంటే, ‘నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల నీ గొప్పతనం ఏముంది? నీకు కలిగే ఫలం ఏమిటీ?’ అంటే సత్యవిషయమైన ప్రేమను అవలంబించుట ద్వారా దేవుని మెప్పు, సంఘ ప్రోత్సాహాలను పొందుకో గలుగు తాము. సత్యలేఖన ఆజ్ఞల ప్రేరేపణతో ఇక తప్పక అనుసరించదగిన రీతిలో ఉన్నట్టి దైవికప్రేమను చేతలపరంగా చూపుటే సత్యప్రేమ. అది క్రియలలో కనుపరచేదే తప్ప, అది ఏనాడూ తీయని నోటిమాటలతో వ్యక్తం చేయదగ్గది కానేకాదు. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపట విశ్వాసం వంటివి ఉన్నతంగా ప్రేమించడానికి కావలసిన అర్హతలు. ప్రేమించే వారికి తప్పక కొన్ని అర్హతలు ఉండే తీరాలని బైబిలు పదే పదే చెబుతుంది. ప్రేమ ఏనాడూ కీడు చేయక అది ఎప్పుడూ మేలే చేస్తుంది. కాబట్టి, ఆలస్యం చేయక ప్రేమించాలి. ఆతురతతో ప్రేమించాలి. ఆత్మసంబంధ ప్రేమతో ప్రేమాతురతతో వేగంగా ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమించడం ఇరువురి ఆత్మలకు అది బహు మేలే.ప్రేమ పట్ల ఆతురత, క్రీస్తు ప్రేమాతురత ఎప్పుడూ మంచిదే. ఈ విధానం మంచే చేస్తుంది. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకోవడం అంటే ఎలాంటి సమస్యనైనా, కీడునైనా, ప్రతికూలతలనైనా ప్రేమతో దీటుగా ఎదుర్కోవడం. యుక్తంగా, ఉన్నతంగా, అసాధారణ రీతిలో ఇలా సమాజాన్ని ప్రేమించడం. ఆత్రుతతో ప్రేమించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. అయితే ప్రేమాతురతకు కొన్ని అర్హతలు, లెక్కలంటూ ఉన్నాయి.అపొస్తలుల బోధను యెడతెగక వింటూ, వారి సువార్త ద్వారా రక్షించబడి, పరిశుద్ధాత్మను వరంగా పొందుకొని, లేఖనానుసార సంఘంతో అవినాభావ సహవాస బాంధవ్యం, భాగ్యం కలిగినవారే తమ తోటి వారిని, ఈ సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఇలా ఉన్నతంగా ప్రేమించగలుగుతారు. వారికి అవసరమైన పరిచర్యల విషయమై సకాలంలో స్పందించి కార్యరూపంలో వాటిని అందించగలుగుతారు. ప్రేమించే వారికే ఈ అర్హతలు తప్ప అవసరార్థులకు, లబ్ధిదారులకు, బాధితులకు ఈ అర్హతలు ఉండనవసరం లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ దేవునిది. ప్రేమ దేవుని నుండి వస్తుంది. ప్రేమ దేవ స్వభావం. నిజమైన ప్రేమ ఆత్మ సంబంధమైనది. ప్రేమ ఆత్మకు సంబంధించిన ఫలం. ఇలాంటి దైవిక ప్రేమ ఎప్పుడూ గుర్తింపు, గౌరవాలను ఆశించదు. మాటతో నాలుకతో కాక, క్రియతో సత్యంతో ప్రేమించాలి. పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో ప్రేమించాలి అనునదే క్రీస్తు వారి అ పొస్తలుల బోధ.ఒక్కటే క్రీస్తుశరీరం అను లేఖనానుసార సంఘంలో చేర్చబడి ఒక్కటే అను లేఖనానుసార బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందుకొనునప్పుడే ఈ పై అర్హతలు అన్నీ సునాయాసంగా అందివస్తాయని గ్రంథం ఘోషిస్తోంది. వాస్తవమైన జీవాన్ని సం΄ాదించే క్రమంలో, నిజానికి ఆత్మసంబంధ ప్రేమను గూర్చి మాత్రమే ఇలా చెప్పబడుతూ ఉంది. లోకంలో ఎన్నో ప్రేమలు ఉండవచ్చు. రోజురోజుకు ఏదో ఒకటి కొత్తగా పుట్టుకురావచ్చు. ఆత్మప్రేమ ఇలాంటిది కాదు. ఈ అర్హతలు ఇప్పుడిప్పుడే తక్షణమే తాజాగా సం΄ాదించిన వ్యక్తికి తప్పక ఇక ప్రేమించకుండా ఉండలేని పరిస్థితులు తలెత్తుతాయి. అర్హతలు, అనుమతులు రాగానే అతడు ఒకచోట స్థిరంగా ఎలా ఉంటాడు? తనలోని ప్రేమను బట్టి హుందాగా పరదేశిలా, యాత్రికునిలా ప్రవర్తిస్తాడు.‘ఒకడు తాను చూచిన తన తోటివానిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లు ప్రేమింపగలడు?’ అన్నది గ్రంథపు బోధవాక్యం. నిన్ను వలె నీ ΄÷రుగువానిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. యావత్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అనేది గ్రంథపు విలువైన సమాచారం. యుక్తంగా దేవుణ్ణి ప్రేమించాలంటే అనగా సర్వమానవాళిని క్రీస్తు ప్రేమతో ఆ స్ఫూర్తితో ప్రేమించాలంటే మాత్రం ఇట్టి అర్హతలు కలిగి ప్రేమించక తప్పదు. మొదటగా ఈ అర్హతలు సంపాదించకుండా ప్రేమిస్తే అది ఇరువురి మధ్య క్షేమాభివృద్ధి కలిగించదు. ఈ అర్హతలు కలిగి వాటిని ఉన్నతంగా అమలులో పెడుతూ, చేతల పరిచర్యలతో ప్రేమించేవారే దైవికంగా తమ ప్రేమను ఇతరులకు పంచగలుగుతారు. తన తోటివ్యక్తిని ప్రేమిస్తే ఆ దేవ దేవుణ్ణి ప్రేమించినట్టే. ప్రేమ కలిగి సత్యం చెప్పే క్రీస్తు ప్రేమ ప్రచారం అను సువార్త ప్రకటన పరిచర్యలకు అర్హులనే సంఘం నియమించి అనుమతిస్తుంది. అంతియొకయలో ఉన్న సంఘం సద్భక్తితో మార్పు చెందిన పౌలు అనబడిన సౌలును అన్యజనుల పరిచర్య నిమిత్తం ప్రత్యేకంగా కేటాయించి పంపింది. అతడు భూ దిగంతముల వరకు వెళ్ళి క్రీస్తుప్రేమను వ్యాప్తి చేయడం గమనార్హం. ‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది’ అన్న పౌలు మహశయుని మాటలో అర్హత, ప్రేమాతురత ఈ రెండూ ఉండుటను మనం తేటగా గుర్తిస్తాము. ఈ సమాజాన్ని ఉన్నతంగా ప్రేమించాలనే సదుద్దేశం కలిగినవారమై తేటగా క్రీస్తు అడుగు జాడలను గుర్తిస్తే అవే మనలను అర్హతల బాట పట్టిస్తాయి.– జేతమ్ -
కరుణ, ప్రేమ, క్షమ ప్రపంచానికి క్రీస్తు శాంతి సందేశం
-
కన్ను తేటగా ఉంటే... దేహమంతయు వెలుగు
అనేకమంది యువతీ యువకుల కన్నులు పాపంతో నిండి వున్నాయి. ఈ విషయంలో యేసుప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడని, సాధారణంగా కామం కంటిచూపుతోనే మొదలవుతుందన్నారు. శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది. తర్వాత కార్యరూపం దాలుస్తుంది. కనుక కంటిని ఎంతో పవిత్రంగా కాపాడు కోవాలి. దేహానికి, ఆత్మకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయూ వెలుగు మయమై వుండును. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటిమయమవునని వాక్యం బోధిస్తున్నది (లూకా 11:33–34).ఒకరోజు యేసుప్రభువువారు గతిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని–నన్నువెంబడించుమని అతనికి చెప్పాడు.. ఫిలిప్పు నతనయేలును కనుగొని–ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు–నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగ్గా –వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి యితడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కటము లేదు. నన్ను నీవు ఎలాగైనా ఎరుగుదువని నతానియేలు యేసును అడగ్గా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టుకింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నతానియేలు –బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుకింద కూర్చున్నావని చెప్పినందుకు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యక్రమాలు చూస్తావని అతనితో చె΄్పాడు. ఆయన (యేసు ప్రభువువారు) – మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయు, దిగుటయు చూస్తారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని అన్నాడు (యోహాను 1:43–51). కనుక మనకు ఇంత సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి వున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్తయైన యేసుప్రభువు వైపు చూసి పందెంలో ఓపికతో పరుగెత్తవలెను. మీరు ΄ాపంతో ΄ోరాడటానికి రక్తం కారునంతగా ఎదిరింపలేరు. ఇంకో సంగతి నా కుమారులారా! ప్రభువు వేయు శిక్షను తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును.. అని కుమారులతో మాట్లాడినట్లు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు.మనం శరీర సంబంధీకులైన తలిదండ్రులతో భయభక్తులతో ఉన్నాడు కానీ, ఆత్మలకు తండ్రియైన దేవునికి మరింత ఎక్కువగా లోబడి బతుకవలెనని, అట్టి భయభక్తులు దేవునియందు కలిగి ఉండి, మంచిగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది (హెబ్రీ 12:1 –10). కనుక ఆ విధంగా ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొందురు గాక.– కోట బిపిన్ చంద్రపాల్ -
క్రీస్తు బలియాగం వెనుకున్న పరమార్థం ఇదే..!
క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల వెనుక దేవుని దివ్య సంకల్పం ఉంది. దీన్నే సువార్త అంటారు. సువార్త దేవుని సంకల్పంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. పూర్వపు దేవుని సంకల్పం చెప్పక దాన్ని దాటవేసే సువార్త అసలు లెస్సయైన లేఖనానుసార సువార్తగా ఎప్పటికీ కానేరదు. సువార్త పుట్టుకకు ఆయువుపట్టు వంటి దేవుని ప్రణాళికను చాలా పకడ్బందీగా, పటిష్టంగా వివరించకున్ననూ అది సువార్త కాదు. సత్యవాక్యం అనే రక్షణ భాగ్యపు సువార్త ప్రకటన అపొస్తలుల బోధకు లోబడే ఉండి తీరాలి. వారపు ప్రప్రథమ దినం అనే ప్రతి ఆదివారం నాడు యెడతెగక దేవుని ఆరాధనలో భాగంగా జరిగే రొట్టె విరుచుట అనేది క్రీస్తు బలియాగానికి గుర్తు. క్రీస్తు పస్కా బలి పశువుగా, వధకు సిద్ధమైన గొఱె -
హైదరాబాద్‌లో ఏప్రిల్ 8న రన్ ఫర్ జీసస్
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాల సందర్భంగా కథోలిక, ప్రొటెస్టెంట్ సంఘాలను సమీకరించి, సమైక్యపరచి యేసు క్రీస్తు వారి సిలువ మరణ పునరుత్థానాల సందేశాన్ని ప్రకటించే ఒక గొప్ప సంఘ ఐక్య, ఎక్యుమెనికల్, మహోద్యమం రన్ ఫర్ జీసెస్. అన్ని సంఘాల నుండి వేలాది మంది క్రైస్తవులు రోడ్డు మీద నడుస్తూ, పరుగెత్తుతూ, మోటర్ సైకిళ్లు, కార్లు, మొదలగు వాహనాలపై వెళ్తూ, జండాలను ఊపుతూ, "క్రీస్తు లేచెను, నిజముగా క్రీస్తు పురనరుత్థానుడయ్యెను" అని సంతోషంతో ఎలుగెత్తి చాటుతారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ మహాద్భుతమైన స్వార్తీక, ఎక్యుమెనికల్ ర్యాలిని ఆరాధన టీవి బృందం వారు 2011 సంవత్సరంలో రూపక ల్పన చేసి, క్రైస్తవ లోకానికి పరిచయం చేసారు. ప్రారంభంలో కేవలం 30 ప్రాంతాల్లో మాత్రమే రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించినప్పటికీ నేడు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అలాగే విదేశా ల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతోంది. క్రైస్తవ యువత, లే లీడర్స్, పాస్టర్స్, ప్రిస్టులు, బిషప్పులు, అధ్యక్షులు అందరూ తమ తమ ప్రాంతాల్లో నిర్వహించబడే రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొంటారు. కాలక్రమేణ, ఇటు క్రైస్తవ సమాజం అటు క్రైస్తవ నాయకులు రన్ ఫర్ జీసస్‌ను తమ స్వంత కార్యక్రమంగా భావించి, వారి స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మధ్యలో ఉండే శనివారం నాడు రన్ ఫర్ జీవన్ కార్యక్రమాన్ని నిర్వహించడమనేది గమనార్హం. ప్రస్తుతం ఒకే రోజున, ఒకే సమయానికి 500 ప్రాంతాల్లో రన్ ఫర్ జేసెస్ నిర్వహించనున్నారు. ఇప్పుడిది ఎవరో ఒక వ్యక్తికి లేదా సంస్థకు లేదా సంఘానికి సంబంధించినదిగా కాక, యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించిన కార్యక్రమంగా పరిపూర్ణంగా పరిణామం చెందింది. ఏదేమైనా, వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమాన్ని స్థానిక రన్ ఫర్ జీసస్ నాయకులతో కలిపి ఆరాధన టీవీ ముందుకు తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం, గ్రేటర్ హైదరాబాద్‌లో, 2023 ఏప్రిల్ 8, శనివారం వాడు ఉదయం 6 గంటల నుండి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రన్ ఫర్ జీసస్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ మహాఘన పీఠాధిపతులు, కార్డినల్.. పూల ఆంథోని, మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్షులు రైట్ రెవ. డా. పద్మారావ్, హైదరాబాద్ రీజినల్ కావ్వరెవ్ రెసిడెంట్ బిషప్ యం. ఎ. డానియేల్, ఆరాధన టీవీ చైర్మెన్ బ్రదర్ పాల్ దేవప్రియం పాల్గొంటారు. తెలంగాణ ప్రభుత్వ హోంమంత్రి ముహమ్మద్ ఆలీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అలాగే నగరంలో వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో సంఘ నాయకులు, రాజకీయ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు పాల్గొంటారు. రన్లో పాల్గొనే ప్రజలంతా మహాసంతోషంతో ముగింపు సభాప్రాంగాణాలకు చేరుకుంటారు. స్థానిక సువార్త గాయకులు స్తుతి ఆరాధనను జరిపిస్తారు. ఒక సీనియర్ పాస్టర్ ఈస్టర్ సందేశాన్ని అందిస్తారు. క్రైస్తవ సోదరసోదరీమణులు అందరూ ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని.. తద్వారా దేవాధిదేవునికి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువు జీవితమే త్యాగానికి చిహ్నం. ఆ ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి -
భయం నుండి విడుదల
కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును (సామె 1:33). మానవుని పట్టి పీడుస్తున్న అనేక భయాల్లో ఒకటి ‘భవిష్యత్తును గూర్చిన భయం’. తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, గత జీవితాన్ని గురించి భయపడేది కేవలం పది శాతమైతే మిగతా తొంభైశాతం భయం భవిష్యత్తులో ఏం జరగబోతుంది... అనే దానిపై ఆధారపడి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల వివరణ. భవిష్యత్తును గూర్చి తెలీదు గనుక దాని గురించి భయపడడం సహజం. అయితే కొందరు ప్రతి చిన్నదానికి భయపడి తమ చుట్టూ ఉన్నవారిని భయపెడుతుంటారు. దినదినం మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడన్నది వాస్తవ దూరం కాదు. భయంతో మనిషి తన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందమయం చేసుకోలేకపోతున్నాడు. భయం మనిషిలో ఉన్న స్వాభావిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయం వలన మానవుడు తాను చేయాలనుకున్న పనులు చేయలేడు. అనేక మంచికార్యాలను నిలువరించే శక్తి భయానికి మాత్రమే ఉంది. భవిష్యత్తు చాలా అందమైనది. సర్వశక్తుడైన క్రీస్తులో అది సురక్షితమైనది. భవిష్యత్తు మీద ఉన్న ఆశలను నిర్వీర్యం చేసేది నీలో ఉన్న భయమే. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని నిర్దిష్ట పరిధుల్లో భయం ఉండడం సహజమే కానీ కొంతమంది భయకారణం లేని చోట కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టుట. రాత్రివేళ తమ మందను కాచుకొంటున్న గొర్రెల కాపరులకు ఇయ్యబడిన వాగ్దానం భయపడకుడి. వారికున్న భయం బహుశా ఇంకెంత కాలం ఈ గొర్రెలను మేపుతూ ఉండాలి? వాటిని ప్రజల పా పపరిహారార్థమై దేవాలయానికి తరలించాలి? దూత చెప్పిన వర్తమానం వారి కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన సర్వలోక పా పా న్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యమైన బైబిల్లో అనేకచోట్ల భయపడకుడి అనే వాగ్దానం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి గుండెల్లో గూడు కట్టుకుపోయిన భయాన్ని రూపుమాపడానికే దేవుడు ఈ లోకానికి అరుదెంచాడు. ఆయన ధైర్యవంతుడు గనుకనే ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఉచితంగా మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ‘దేవుడు నాకు వెలుగును రక్షణయునై యున్నాడు నేను ఎవరికి భయపడుదును’ అని దావీదు వలే నువ్వు కూడా చెప్పగలవు (కీర్తన 27:1). శత్రువులతో తరుమబడినప్పుడు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో దేవునియందు విశ్వాసముంచి తనలో ఉన్న ప్రతి భయాన్ని జయించిన దావీదు ధన్యజీవిగా మారాడు. నీవు దేవునియందు నమ్మికయుంచి ధైర్యంతో ముందుకు సాగిపో మిత్రమా! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
Christmas Day 2022: మెర్రీ క్రిస్మస్: ‘నీ రాజ్యం వచ్చును గాక...’
ఆకురాలే కాలం తర్వాత చెట్లు చిగిర్చే వసంతం – ‘క్రిస్మస్ సీజన్’కు మనోహరమైన దృశ్య నేపథ్యం కావడంతో, విశ్వాసాలకు అతీతమైన భావన మన లోపలికి చేరి,’ఫీల్ గుడ్’ మానసిక స్థితికి మనల్ని చేరుస్తుంది. ఒంటరిగా ఏ చలిరాత్రిలోనో రెండు చేతులు జేబుల్లో ముడుచుకుని నడుస్తూ వెళుతుంటామా, చీకటి తెరలు చీల్చుకుంటూ ఎవరిదో బాల్కనీలో వెలుగుతూ వేలాడుతున్న ‘క్రిస్మస్ స్టార్’ కనిపిస్తుంది. అటు చూస్తూ దాన్ని మనం దాటతాం. అయితే అదక్కడ ఆగదు, దాన్ని దాటాక కూడా అది మన వెంట వస్తూ మన లోపలికి చేరి, కొంతసేపు అది అక్కడ తిష్టవేస్తుంది. ఎందుకలా? అది ‘ఫీల్ గుడ్’ సీజన్ కావడం వల్లా? అంతే కావచ్చు... ఐరోపాలో మొదలైన ఈ ‘సీజన్’ భావన ‘క్రిస్మస్’ను ప్రపంచ పండగ చేసింది. కానీ ఆసియాలోని బేత్లెహేములో అప్పట్లో జీసస్ పుట్టిన స్థలం ఏమంత పరిశుభ్రమైనదేమీ కాదు. అయినా ఆ జననం నేరుగా రాజమందిరంలో ప్రకంపనలు పుట్టించింది. చివరికి జనాభా నమోదు కోసం స్వగ్రామం నజరేతు నుంచి వచ్చిన దంపతులు తమతోపాటు ‘రాజ్యం’ జాబితాలో వారి మగ శిశువుకు కూడా ఒక ‘నంబర్’ వేయించుకుని, స్వగ్రామానికి తిరిగి వెళ్లారు. అలా చరిత్రలో క్రీస్తును రెండు శకాల మధ్య ప్రతిష్టించడం మొదలయింది. అందుకే ప్రపంచ చరిత్రలో జీసస్ ‘ఫిక్షన్’ కాలేదు. యువకుడైన జీసస్‌ను ప్రార్ధన చేయడం ఎలా? అని శిష్యులు అడుగుతారు. అయన చెబుతాడు– ‘పరలోకమందున్న మా తండ్రీ! నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక...’ అంటూ సాగుతుంది ఆయన చెప్పింది. మరొక రాజ్యమేదో మున్ముందు రావలసి ఉన్నది అనేది అక్కడి సారాంశం. ఆయన దృక్పథం‘రాజ్యం’ ప్రాతిపదికగా ఉంది. మరొకసారి ‘బోధకుడా జార్ చక్రవర్తికి పన్ను చెల్లించాలా?’ అని కొందరు అడుగుతారు. జీసస్ వాళ్ళ చేతిలోని నాణెం తీసుకుని– ‘దీనిమీద వున్న ఈ బొమ్మ ఎవరిది?’ అని అడుగుతాడు. ‘అది జార్ చక్రవర్తిది’ అని వాళ్ళు బదులిస్తారు. ‘అయితే, రాజుది రాజుకు, దేవునిది దేవుడికి ఇవ్వండి’ అంటాడు. ఒకపక్క తండ్రి ‘రాజ్యం’ రావాలి అంటూ ప్రార్థన నేర్పుతూనే, మరోపక్క మనకు పౌరసత్వమున్న ‘రాజ్యాన్ని’ మనం అంగీకరించాలి అంటాడు. అయితే, చరిత్రలో ఈ భావధార ఎక్కడా ఆగినట్టుగా కనిపించదు. దీనికి కొనసాగింపు అన్నట్టుగా మరొక యూదు తత్వవేత్త కార్ల్ మార్క్స్ ‘రాజ్యం అంతరిస్తుంది...’ అంటాడు. ‘రాజ్యం’పై ఆధారపడుతున్న వారు క్రమంగా తగ్గడం, అందుకు సూచిక అయితే కావొచ్చు. బాలుడైన జీసస్ పశువుల పాకలో చలి తగలకుండా గుడ్డలతో చుట్టి ఖాళీగా వున్న పశువులు నీళ్లు తాగే తొట్టెలో ఉన్నట్టుగా ‘క్రిస్మస్’ గ్రీటింగ్ కార్డ్స్ బొమ్మల్లో చూస్తాం. మేరీ, జోసఫ్‌లతో పాటుగా గొర్రెల కాపరులు, తూర్పుదేశం నుంచి వచ్చిన జ్ఞానులు విలువైన కానుకలు సమర్పిస్తారు. రెండు విభిన్న సామాజిక–ఆర్థిక సమూహాలు జీసస్ వద్దకు రావడం– ‘క్రిస్మస్’తోనే సాధ్యమయిందా? నాటి వారి కలయిక ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నదా అంటే, లేదని అనడానికి కారణాలు కనిపించవు. ప్రపంచం ‘క్రిస్మస్’ జరుపుకోవడం రెండు భిన్న సమూహాలు మధ్య దూరాలు తగ్గడంగా కనిపిస్తున్నది. ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ‘కేక్స్’ కట్ చేయడం, ఆనందోత్సాహాలను పంచుకోవడం వంటివి తరాలు మారుతూ ఉంటే అది మరింత ‘ట్రెండీ’గా మారుతున్నది. ‘క్రిస్మస్’ సీజన్లో అన్ని దేశాల్లో రిటైల్ మార్కెట్ ఊపందుకుంటుంది. దుస్తులు, ఫ్యాషన్ల ప్రకటనలు ఇప్పటికే పత్రికల్లో చూస్తున్నాం. ‘కరోనా’ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఎయిర్ పోర్టుల్లో ‘క్రిస్మస్’ సందడి నెల ముందే మొదలయింది. – జాన్ సన్ చోరగుడి -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం ఇది జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్ -
యేసును మురిపించిన జక్కయ్య విశ్వాసం
జీవం లేని బలమైన దుంగలు ప్రవాహంలో కొట్టుకుపోతే, జీవమున్న చిన్నారి చేపపిల్లలు ప్రవాహానికి ఎదురీదుతాయి. లోకంతో పాటు కొట్టుకుపోయే జీవితానికి జక్కయ్య అసలైన ఉదాహరణ. బోలెడు డబ్బు, సామాజిక ప్రాబల్యం జక్కయ్య సొంతం. జక్కయ్య అనే హెబ్రీ పేరుకు ‘పవిత్రుడు’ లేదా ‘నీతిమంతుడు’ అని అర్థం. జక్కయ్య ఎలాంటి వాడు కావాలని తల్లిదండ్రులు ఆశపడ్డారో వాళ్ళతనికి పెట్టిన ఈ పేరునుబట్టి అర్ధం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రబద్ధంగా, తలిదండ్రులు బహుశా అతన్ని ఎనిమిది రోజుల శిశువుగా ఉన్నపుడే సున్నతి కోసం, తాముండే యెరికోకు దగ్గరే గనుక, యెరూషలేము ఆలయానికి తీసుకళ్లారేమో. పన్నెండేళ్ళు పూర్తయినపుడు యూదులంతా చేసే ‘బార్ మిట్జ్వా’ అనే ఉత్సవాన్ని కూడా అతని తల్లిదండ్రులు ఆలయంలో అట్టహాసంగా చేశారేమో. కానీ చివరికి అతని జీవితం మాత్రం వాటన్నింటికీ విరుద్ధమైంది. లోకానికి ఎదురీది మహావిశ్వాసి కావాల్సిన జక్కయ్య, లోకమలినానికి మారుపేరయ్యాడు( లూకా 19:7). ఇది అతని తల్లిదండ్రులకే కాదు, దేవునికి కూడా ఎంతో నిరుత్సాహాన్ని మిగిల్చిన పరిణామం. దేవుని ప్రేమను విస్మరించి, లోకంతో పాటు కొట్టుకోవడంలో అంతకాలం అతనికి ఆనందం, సౌలభ్యం దొరికింది. అయితే అంతమాత్రాన అతను దేవుణ్ణి ఏమీ విడిచిపెట్టలేదు. దేవుడతనికి జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జక్కయ్యకు లోకమే సర్వస్వమ్ అయ్యింది. అదీ అతని సమస్య, అదే మనలో చాలా మందికున్న సమస్య కూడా. అలా లోకపరంగా ఎంతో ఉత్తేజంతో జీవించాడు కాని ఆత్మీయంగా చాలా స్తబ్దంగా ఉండిపోయాడు. అంటే, జక్కయ్య తాజ్ మహల్ లాంటివాడన్నమాట. తాజ్ మహల్ బాహ్యంగా కళ్ళు చెదిరేంత సుందరమైన, గొప్ప కట్టడమైనా లోలోపల కుళ్ళుకంపు కొట్టే సమాధే కదా!! రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే పనిలో జక్కయ్య తన అంతరాత్మను తాకట్టుపెట్టి అవినీతిపరుడు, ధనవంతుడు కూడా అయ్యాడు. ధనవంతుడవడం పాపం కాదు, కానీ దొడ్డిదారిలో ధనార్జన చెయ్యడం, దేవుని మీద కాకుండా, డబ్బు మీదే ఆధారపడి జీవించడం పాపం. నీతిమంతుడు ఏడుసార్లు పడ్డా తిరిగి పైకి లేస్తాడన్న బైబిల్ సూక్తి ప్రకారం (సామె 24:16), అంతగా పడిపోయిన జక్కయ్య, తన జీవితంలో ఒక దశలో ఇక తాను ఆత్మీయంగా తిరిగి పైకి లేవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యేసు వస్తున్నాడని తెలిసి యెరికోలో ఒక చెట్టెక్కి యేసు కోసం ఎదురు చూశాడు. ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఇదొక మహత్తరమైన నిర్ణయం. అలాంటి నిర్ణయాన్ని ప్రభువు కూడా గొప్పగా హర్షిస్తాడు. జక్కయ్యలో ఇన్ని లోపాలున్నా అతనిలో యేసుప్రభువు చూసిన ఒక గొప్ప సుగుణమేమిటంటే, అతను కేవలం యేసు కోసమే యేసు వద్దకొచ్చాడు. జనమంతా స్వస్థతలు, సంపదలు, సమస్యల పరిష్కారం కోసం యేసు వద్దకు తరలివస్తున్న రోజుల్లో, జక్కయ్య మాత్రం యేసే కావాలనుకొని, యేసు మాత్రమే తనకు చాలుననుకొని, యేసును ఆశ్రయించాడు, అలా యేసును జక్కయ్య, అతని కుటుంబం కూడా సంపూర్ణంగా పొందారు. తన డబ్బంతా పేదలకు, తనవల్ల అన్యాయం జరిగిన వారికి పంచి, డబ్బు కన్నా యేసే తనకు ముఖ్యమని, తాను డబ్బు మనిషిని కాదని, యేసుమనిషేనని ఆచరణలో రుజువుచేసుకున్నాడు, ఇదే అత్యున్నతమైన శ్రేణికి చెందిన విశ్వాసం. అందుకే జక్కయ్య అబ్రాహాము కుమారుడన్న బిరుదును ఏకంగా యేసు నుండే పొంది, తన విశ్వాసానికి ప్రభువు నుండే ప్రామాణికతను సంపాదించుకున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని మురిపించేది పరిమాణం కాదు... నాణ్యత మాత్రమే!
మనకు విజయాన్నిచ్చిన గొప్ప నిర్ణయాలను పదిమందికీ చాటి సంబర పడతాం. కానీ మన నిర్లక్ష్యాలు కొన్నింటికి ఎంతటి మూల్యాన్ని చెల్లించామో ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతాం. నిర్ణయాలు, వాటి విజయాలు మనవైతే, నిర్లక్ష్యాలు, వాటి దుష్పరిణామాలు కూడా మనవే కదా? ప్రతినిత్యం వెలుగుతో, ప్రభువు సాన్నిధ్యంతో, ఆనందసంతోషాల వాతావరణంతో అలరారే పరలోకం ఎంతటి నిజమో, తీరనిబాధలు, ఆరని అగ్ని, కటిక చీకటితో కూడిన భయానకమైన నరకం కూడా అంతే నిజం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన యేసుక్రీస్తు వారి కొండమీది ప్రసంగంలో భాగంగా ఆయన చేసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన బోధ పరలోకానికి, నరకానికి సంబంధించినది. నాశనానికి, నరకానికి వెళ్లే ద్వారం వెడల్పుగా, విశాలంగా ఉంటుందని, అందువల్ల అనేకులు ఆ దారినే ఎన్నుకొంటారని, నిత్యజీవానికి దారితీసే ఇరుకు ద్వారాన్ని, సంకుచిత మార్గాన్ని చాలా కొద్దిమందే ఎన్నుకుంటారని ప్రభువు పేర్కొన్న అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఆయన చేసిన కొండమీది ప్రసంగమేనని చాలామందికి తెలియదు. మత్తయి 5,6,7 అధ్యాయాల్లోని 111 వచనాల్లో విస్తరించి ఉన్న ప్రభువు వారి కొండమీది ప్రసంగ మూలాంశం కూడా ఇదే!! తన దారిని ఎన్నుకోవడమంటే, అత్యంత కఠినమైన దారిని ఎన్నుకోవడమే అన్న తిరుగులేని సత్యాన్ని క్రీస్తు ప్రభువే తన బోధల్లో, తన జీవితం లో కూడా స్పష్టం చేశాడు. అయినా సరే, కృపగల దేవుడు తన బిడ్డలకు ఇరుకు ద్వారాన్ని, సంకుచితమైన దారినెందుకిస్తాడు? విశాలమైన ద్వారం, సాఫీగా సాగిపోయే రహదారి లాంటి విశాలమైన దారి ప్రభువుదని భావించి, ఆ మార్గాన్ని ఎన్నుకునే వారే అత్యధికులన్నది రోజూ మనం చూసే ఒక సత్యం. ప్రపంచంలో 95 శాతానికి పైగా ప్రజలు ఎన్నుకునే సువిశాలమైన మార్గం నిత్యనరకానికి ఎలా దారితీస్తుంది? అంటూ ‘మెజారిటీ’ సంఖ్యతో తీసుకునే నిర్ణయాలే సరైనవని నమ్మే ‘ప్రజాస్వామ్యవాదం’ ఇక్కడ పనిచెయ్యదన్నది చాలామంది క్రైస్తవులకు మింగుడు పడని ఒక చేదువాస్తవం. ’మీరు ఇరుకు ద్వారాన, దాని ముందున్న ఇరుకు మార్గాన నడవండి’ అని మనకు చెప్పి ప్రభువు తన మార్గాన తాను నడవలేదు. ఆయన కూడా ఒక సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్లపాటు ఎన్నో ముళ్ళు, గోతులు, అవరోధాలున్న కఠిన మార్గంలో నడిచి, సిలువలో ఘోరమైన శ్రమలనుభవించి, చనిపోవడం ద్వారా తన తిరుగులేని విధేయతతో పరమ తండ్రికి కుడిపక్కన ఉన్న స్థానాన్ని సంపాదించుకున్నాడు. సామాన్య ప్రజలమైన మనకు ఏది ఆయన బోధించాడో, అదే ఆయన తన జీవితం లో ఆచరించి మరీ చూపించాడు. ఆదిమ అపొస్తలులు, క్రైస్తవులు కూడా అదే దారిలో నడిచి పరలోకాన్ని తమ ‘జీవనసాక్ష్యం’ ద్వారా సంపాదించుకున్నారు. ఎలాగైనా సరే ఎక్కువ మందిని క్రై స్తవులను చేస్తే దేవుడు శభాష్ అంటాడన్న దుర్బుద్ధితో, నేటి కొందరు సెలెబ్రిటీ బోధకులు దేవుడు నిర్దేశించిన అత్యున్నతమైన విలువల్ని పలచన చేసి, దేవుని వాక్యాన్ని వక్రీకరించి, సంపదలు, స్వస్థతల వంటి ఈ లోకవిషయాల సాధనకు సువార్తను ముడిపెట్టి, ప్రజల్ని నరకానికి దారితీసే విశాలమైన మార్గంలో తాము ముందుండి మరీ నడిపిస్తున్నారు. ఏదడిగితే అదిచ్చేందుకు, చేతిలో అద్భుత దీపమున్న అల్లావుద్దీన్ కాదాయన. ఆయన సార్వభౌముడైన, పవిత్రతకు మరోపేరైన దేవుడు. మనం వెళ్ళాల్సింది పరలోకానికా, నరకానికా అన్న నిర్ణయాన్ని దేవుడు మన చేతుల్లోనే పెట్టాడు. అది పూర్తిగా మన నిర్ణయమే. అందులో దేవుని బలవంతమేమీ ఉండదు. పెద్ద చర్చి, గొప్ప ప్రసంగం, శక్తిమంతమైన ప్రార్థన వంటి మాటలు మనుషుల్ని మురిపిస్తాయేమో కానీ, దేవుని దష్టిలో ఆ మాటలకు విలువ లేదు. ఎందుకంటే, ఆయన కొలబద్ద పరిమాణాత్మకం కాదు, మనలో అత్యున్నతమైన జీవన విలువల్ని ఆశించే నాణ్యతా దృక్కోణం దేవునిది. అందుకే నాడు కోటీశ్వరులు వేసే కానుకల్ని తృణీకరించి, ప్రభువు ఒక పేద విధవరాలు వేసిన మనః పూర్వకమైన కేవలం రెండు కాసుల కానుకను అత్యున్నతమైనదిగా శ్లాఘించాడు. అప్పుడూ ఇప్పుడూ కూడా ఆయన మారని దేవుడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మెతుకును పంచిన మెదక్ చర్చ్
తీవ్ర కరువులో మెతుకు పంచుతూ.. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికీ అండగా నిలిచి ప్రపంచంలో రెండో అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందిన మెదక్‌లోని కెథడ్రల్ చర్చి ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అన్ని కాలాల్లోనూ చల్లగా ఉండే పంచ రంగుల బండలు.. సూర్యకిరణాలతో ప్రకాశించే గాజు కిటికి లోని అపురూప దృశ్యాలతోపాటు మెట్టుమెట్టుకో విశేషం.. అన్నింటికీ అర్థాలతో మహిమాన్విత చర్చిగా వెలుగొందుతున్న మెదక్ చర్చి గురించి ... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సీఎస్ చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్ల్స్ వాకర్ ఫాస్నెట్ 1914లో ఆరంభించారు. 1924లో దీని నిర్మాణం పూర్తయింది. దీనికి అప్పుడు అయిన వ్యయం రూ.14 లక్షలు. దీనిని ఎంతో అపురూపంగా నిర్మించారు. చర్చి లోపలకు, వెలుపలకు వెళ్లేందుకు పంచద్వారాలు ఉన్నాయి. యూదా దేశ నాయకుడు ఆది, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండలు రాశారు. ఈ ఐదు కాండాలకు గుర్తుగా ఐదు ద్వారాలు నిర్మించారు. ప్రధాన ద్వారానికి ఇరుపక్కల రెండేసి చొప్పున ఉంటాయి. తూర్పు నుంచి పురుషులు, పడమర నుంచి స్త్రీలు లోపలకు వెళ్లాలి. 40 స్తంభాలు.. 40 రోజల ఉపవాసాలు చర్చి లోపల 40 స్తంభాలు ఉన్నాయి. పై కప్పు ఎక్కడ చూసినా సిలువ ఆకారంలో ఉండడం ప్రత్యేకం. 40 రోజుల ఉపవాస దీక్షలకు గుర్తుగా 40 స్తంభాలు ఏర్పాటు చేశారు. 66 దిమ్మెలు.. 66 గ్రంథాలు చర్చి లోపలికి వెళ్తుంటే పది మెట్ల తర్వాత చుట్టూరా 66 చొప్పున ఎడమ, కుడి వైపు విద్యుత్ సొబగులు సమకూరేలా తామర పూలతో నిర్మించిన దిమ్మెలు గొలుసులతో కలపబడి ఉంటాయి. బైబిల్లోని 66 గ్రంథాలకు సూచికగా 66 దిమ్మెలు ప్రతీకగా నిలుస్తున్నాయి. 12 మెట్లు.. 12 మంది శిష్యులు ఏసు ప్రభువుకు ప్రధానంగా 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సువార్తను పరిచయం చేయాలని ప్రభువు వారికి బోధనలు చేశారు. (మార్కు సువార్త 16:15) ఆయన 12 మంది శిష్యులకు గుర్తుగా 12 మెట్లు నిర్మించారు. సూర్యకిరణాలు... సుందర దృశ్యాలు చర్చిలో మొత్తం మూడు గాజు కిటికీలు ఉన్నాయి. వీటిని ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాంక్ ఓ సాలిజ్బరీ రూపొందించాడు. చర్చి లోపల ఆరాధించే స్థలంలో ఒకటి చొప్పున ఉత్తరం, తూర్పు, పడమర వైపు నిర్మించారు. ఈ కిటికీలపై సూర్యకిరణాలు పడితేనే అపురూప దృశ్యాలు కనపడతాయి. సూర్యుడు తూర్పున ఉదయించి.. పడమరన అస్తమిస్తాడు. ఉత్తరం వైపు కిరణాలు పడే అవకాశం లేకున్నా.. ఈ కిటికీని సూర్యకిరణాలు దరిచేరడం విశేషం. తూర్పు, పడమరనపడే కాంతి పుంజాలు కింద వేసిన బండలపై వక్రీభవనం చెంది.. ఉత్తరం వైపునకు ప్రసరిస్తాయి. ఈ మూడు కిటికీలకు స్థలాన్ని వదిలి.. వేర్వేరు సంవత్సరాల్లో అమర్చారు. తూర్పు కిటికీ.. ఏసు జన్మ వృత్తాంతం ఏసు పుట్టుకను తెలియజేసేలా ఈ కిటికీని 1947లో అమర్చారు. సూర్యకిరణాలు పడితేనే ప్రకాశవంతమైన చిత్రాలు దర్శనమిస్తాయి. కింది భాగంలో ఏసుప్రభువు తల్లి మరియ, తండ్రి యేసేపు, తొట్టెలో బాల యేసు, ఎడమ వైపు గొల్లలు, మధ్యలో గాబ్రియల్, లోక రక్షకులు, కుడివైపు జ్ఞానులు ఉంటారు. పైభాగంలో ఏసుకు ఇష్టమైన పిల్లలు, మధ్యలో పెద్ద మనిషి చిత్రాలు కనిపిస్తాయి. ఏసు పుట్టుకకు 700 ఏళ్ల క్రితమే ఏసు ప్రభువు పుడతాడని యేషయా అనే ప్రవక్త తాను రాసిన గ్రంథంలో చెప్పారు. ఆయనకు గుర్తుగా ఈ కిటికీలో పెద్దమనిషిని పెట్టినట్లు ప్రతీతి. పడమర కిటికీ.. ఏసు సిలువ వృత్తాంతం ఏసు సిలువ సందర్భాన్ని తెలియజేసేలా రూపొందించిన ఈ కిటికీని 1958లో అమర్చారు. సిలువ ఎత్తుకున్న తర్వాత కింద కూర్చుని ఉన్న తల్లి మరియ, మీద చేయి పట్టుకుని నిలబడిన మగ్దలేని మరియ దృశ్యాలు కనిపిస్తాయి. ఎడమవైపు స్త్రీలతోపాటు ఏసు శిష్యుడు యోహాన్ పబ్బతి (దండం) పెడుతూ నిలబడి ఉంటాడు. ఏసు తన శిష్యుడు యోహాన్‌కు ఏడు మాటలు చెబుతున్న తీరును ఈ దృశ్యాలు కళ్లకు కడతాయి. కుడివైపు బల్లెంపట్టుకుని ఉన్న శతాధిపతి కూడా కనిపిస్తారు. దీనిపై హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వాక్యాలు ఉన్నాయి. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ సూచన మేరకు మూడు భాషల్లో వాక్యాలు పెట్టినట్లు పెద్దలు చెబుతున్నారు. – కిశోర్ పెరుమాండ్ల, సాక్షి, మెదక్ -
దేవుని కారుణ్యాన్ని పొందిన మోషే!!
దైవజనుడైన మోషే కారణజన్ముడు. కాని లోకపరంగా ఆలోచిస్తే ఒంటరితనానికి నిర్వచనంగా బతికాడు. తల్లి ఒడిలో వెచ్చగా గడపాల్సిన పసితనాన్ని నైలు నదిలో, ఒక జమ్ముపెట్టెలో ఒంటరిగా గడిపాడు. ఫరో కుమార్తె తీసుకెళ్లి రాజభవనంలో పెంచినా, అక్కడా తనవాళ్లెవరూ లేని ఒంటరితనమే నలభై ఏళ్ళ పాటు మోషేను వెంటాడింది. తన వాళ్ళనుకొని హెబ్రీయుల వద్దకు వెళ్తే వాళ్ళతణ్ణి ఈసడించి మరింత ఒంటరి వాణ్ణి చేశారు. ప్రాణభయంతో మిద్యాను అరణ్యానికి పారిపోయి, అక్కడ తనకు పిల్లనిచ్చిన మామతో మందలు మేపుతూ, తన జీవితానికంటూ ఒక గమ్యం, లక్ష్యం, అర్ధం కనబడని పరిస్థితుల్లో మోషే మరో నలభై ఏళ్ళు గడిపాడు. అలా ఎనభై ఏళ్ళు నిండిన పండు వృద్ధుడై జీవితాంతంలో తానిక ప్రజలకు కాని, తన దేవునికి కాని చేయగలిగిందేమీ లేదనుకొని తీవ్ర నిస్పృహకు, తీరని ఒంటరి భావనకు లోనైన దశలో మోషే రాసిన 90వ కీర్తన, బైబిల్లోని 150 కీర్తనల్లోకెల్లా అత్యంత ప్రాచీనమైనది. ఎంతో ప్రతిభ కలిగి, దేవునిలో అత్యున్నతంగా ఎదిగి కూడా, దేవుడు తన ద్వారా ఏం చెయ్యాలనుకొంటున్నాడో తెలియని పరిస్థితుల్లో, అదిక తన జీవిత చరమాంకమనుకొని ‘మా ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు, అధికబలముంటే ఎనభై సంవత్సరాలు’ అని ఆ కీర్తనలో మోషే పాడుకున్నాడు (కీర్తన 90:10). అయితే దేవుడతని ఆలోచనలు తారుమారు చేస్తూ, హోరేబు కొండమీద ఒక మండే పొద ద్వారా ప్రత్యక్షమై ‘ఇది నీ జీవితానికి అంతం కాదు, ఆరంభం’ అన్నట్టుగా తన దర్శనాన్నిచ్చాడు. తన ప్రజల్ని దాస్య విముక్తులను చేసి, ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి నడిపించే అత్యంత ఆశీర్వాదకరమైన పరిచర్యను మోషేకు అప్పగించాడు. ఆ నలభై ఏళ్ల పరిచర్యతో మోషే జీవితానికి సాఫల్యత, సార్థకత లభించి, తాననుకున్నట్టుగా 80 ఏళ్లకు కాక, 120 ఏళ్లకు విజయవంతంగా జీవితాన్ని ముగించుకున్నాడు. దేవునికున్న అత్యంత విశేషమైన లక్షణాల్లో ఒకటి ‘ఆయన ఆశ్చర్యకరుడు’ అన్నది (యెషయా 9:6). మానవాళిని, లోకాన్ని ఆశ్చర్యపర్చడంలో దేవుని మించిన వారు లేరు. కరోనావైరస్ లోకాంతానికి సూచన అంటూ హడావుడి చేస్తున్నారు. చర్చిల్లో, విశ్వాసుల్లో నాణ్యత, పరిపక్వత, నిబద్ధత తగ్గి, మాలిన్యం, రాజకీయాలు, ప్రచారాలు, ధనమొహం, వేషధారణ, ఆడంబరాలు, అహంకారం పెచ్చరిల్లి, దేవుని స్థానాన్ని అవి ఆక్రమించిన పరిస్థితుల్లో, కరోనావైరస్ ఒక ప్రమాద ఘంటిక!! కరోనావైరస్ ఈ అవలక్షణాలన్నింటినీ అంతం చెయ్యాలి, అంతం చేస్తోంది కూడా. పది నెలలుగా చర్చిలు నడవడం లేదు, మొన్నటిదాకా దేవుని స్థానాన్ని చర్చి తీసేసుకుంటే, కరోనావైరస్ విశ్వాసుల్ని ఇపుడు మళ్ళీ దేవుని పాదాల వద్దకు తెచ్చింది. మనిషి ఆలోచనల్ని తారుమారు చేసి, ఆయన తన పద్ధతిలో తన ప్రణాళికల్ని అమలు చేసి ఆశ్చర్యపరిచే దేవుడని మరోసారి రుజువైంది. తాను మహా అయితే 80 ఏళ్ళు బతుకుతానేమో అని మోషే అనుకుంటే, దేవుడతనికి 120 ఏళ్ళ ఆయుష్షునివ్వడమేకాక, జీవితంలోని అతని చివరి దశను అద్భుతమైన పరిచర్యతో నింపి దేవుడతణ్ణి ఆశ్చర్యపరిచాడు. తననాశ్రయించిన ఎవరి జీవితాన్నైనా అనూహ్యమైన ఆశీర్వాదాలతో నింపి, అంతాన్ని ఆరంభంగా, ఆనంద సముద్రంగా మార్చగల సమర్థుడు దేవుడు. నెల్సన్ మండేలా 27 ఏళ్ళు దుర్భరమైన ఏకాంత కారాగారావాసాన్ని గడిపినా, అతని దీక్ష, దర్శనం మసకబారలేదు. మనసుని పిండి పిప్పి చేసే ఏకాంతంలోనూ దేవుడే తనతోపాటు ఉండి జైల్లో తాను బలహీనపడకుండా కాపాడాడని తనకు అత్యంత సన్నిహితుడైన మెథడిస్ట్ బిషప్ పుంవలానాకు జైలు నుండి రాసిన ఒక లేఖలో మండేలా పేర్కొన్నాడు. అయితే తన క్రైస్తవ సాక్ష్యాన్ని బహిరంగం చేసి ప్రజల్లో రాజకీయవిభేదాలకు కారణం కావడం కన్నా, ఆ విశ్వాసాన్ని తనకు, తన దేవునికి మధ్య గల అత్యంత అపురూపమైన బంధంగా దాచుకోవడమే తనకిష్టమని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నాడు. సంకుచితత్వానికి మారుపేరైన డాంబిక క్రైస్తవులకు ఈ మార్మికత అర్థం కాదు. దుర్భరమైన జైలుజీవితం నేపథ్యంలో కూడా దక్షిణాఫ్రికా అధ్యక్షుడుగా ఆయన అందించినసేవల్లో అణువణువునా క్రైస్తవ క్షమ, ప్రేమా సౌరభమే గుబాళిస్తుంది. తనను ఆశ్రయించిన వారికెవరికైనా జీవనసార్థకతను, సాఫల్యాన్నివ్వడానికి దేవుడు ఏ దశలోనైనా సిద్ధమే. – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
సఖ్యతకు తరుణం
తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు. పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది. మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ అనే జీవనదులు పొంగి పారుతున్నాయి. చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు. చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పరలోకపు తండ్రి చేసేది వ్యవసాయం!!
యేసుప్రభువు వ్యవసాయ పరిభాషను తన బోధల్లో విస్తృతంగా వాడాడు. ఆయన బోధలు ప్రజల్లో అందుకే అంత బలంగా నాటుకున్నాయి. సిలువ శిక్షకు తాను సిద్ధపడుతూ తదనంతర పరిణామాలకు తన శిష్యులను కూడా సిద్ధం చేస్తున్న కీలక సమయంలో ‘నా తండ్రి వ్యవసాయదారుడు’ అంటూ ఒక అద్భుతమైన పరలోక వివరణను యేసుప్రభువిచ్చాడు(యోహాను15:1). పగలనక, రాత్రనక తాను ఎందుకు అంతగా శ్రమిస్తున్నాడో ఆ ఒక్క మాటలో యేసుక్రీస్తు వివరించాడు. ఆధునికత ఎంతగా ప్రబలినా, మనిషికి ఆకలెయ్యక మానదు, దాన్ని తీర్చే ధాన్యాన్ని రైతు పండించకా తప్పదు. అందువల్ల రైతు లేని ప్రపంచాన్ని ఇంకొక లక్ష ఏళ్ళ తర్వాత కూడా మనం ఉహించుకోలేం. కష్టాలు, కన్నీళ్లు, శ్రమ, త్యాగం లేని రైతు నిస్వార్థ జీవితాన్ని కూడా మనం ఉహించుకోలేము. ఈ లోకంలో రైతుకొక్కడికే అందరిలాగా వారాంతపు సెలవులుండవు, నిర్ణీత పనివేళలూ ఉండవు. అతని ఆరోగ్యానికి భరోసా ఉండదు, కాయకష్టానికి పరిమితులుండవు, పొలంలో రాత్రిపూట విషసర్పం కాటేసినా పట్టించుకునే నాథుడుండడు. ఎండా, వానా, చలి, వరదలు, భూకంపాల పేరిట అంతటా, అందరికీ సెలవులుంటాయి, ఒక్క రైతుకు తప్ప. చంటి బిడ్డలను రెండేళ్లు జాగ్రత్తగా సాకితే, పెరిగి ప్రయోజకులై తమకు ఆసరాగా ఉంటారన్న భరోసా తల్లిదండ్రులకు ఉండొచ్చు. రైతుకా భాగ్యం లేదు. దుక్కి, దున్ని, విత్తనం వేసిన నాటి నుండి, కోతలు ముగిసి ధాన్యం ఇంటికి చేరేదాకా, అంటే మొదటి నుండి చివరి దాకా నిద్రాహారాలు మానేసి రైతు తన పంటను చంటి బిడ్డ లాగా సాకవలసిందే. ఇంత కష్టపడ్డా, పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం, వరదలొస్తే, భోరున ఏడవాల్సిందే. చేసిన అప్పు తీర్చలేక, మరోవైపు లోకమంతటికీ అన్నం పెట్టేవాడై ఉండీ, తన ఇంట్లోనే భార్యా పిల్లలు పస్తులుండటం చూడలేక కుమిలిపోతూనే, మరో పంట కోసం శ్రమించేందుకు రైతు సిద్ధపడాల్సిందే!! ‘నేను నా పరలోకపు తండ్రి అలాంటి రైతులం, కాబట్టి నా నామాన్ని ధరించిన మీరంతా రైతులే!! అన్నది విశ్వాసులకు ప్రభువు ఆనాడు చేసిన బోధ సారాంశం. ఎందుకంటే, తమ రక్షకుడి లాగే, ఆయన శిష్యులు కూడా రైతుల్లాగా కష్టపడకపోతే, ‘ప్రేమసువార్త’ భూదిగంతాలకు చేరదు. పంటను కాపాడుకోవడానికి రైతు ఎంతటి త్యాగానికైనా, శ్రమకైనా సిద్ధపడినట్టే, ఈ లోకాన్ని శాంతితో, సదాశయాలతో నిండిన పరలోకానికి సాదృశ్యమైన దేవుని రాజ్యంగా మార్చడానికి తన కుమారుడైన యేసుప్రభువును ఈ లోకానికి పంపేందుకు పరమతండ్రి త్యాగం చేసినట్టే, పాపుల కోసం సిలువలో తన ప్రాణాన్నే బలియాగంగా సమర్పించే త్యాగం చేసి రక్షకుడైన యేసుక్రీస్తు తన ప్రేమను చాటుకున్నాడు. ఎటొచ్చీ ఈ రైతులిద్దరిలాగే, నిండా త్యాగాలుండా ల్సిన విశ్వాసులు, పరిచారకుల జీవితాలు, పరిచర్యలు ఈ రోజుల్లో విలాసాలు, భోగాల్లో మునిగి తేలుతు న్నాయి. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి కాని నాకు తల దాచుకోవడానికి కూడా స్థలం లేదని ఎంతో సంతృప్తి, ఆత్మానందం, జీవన సాఫల్యంతో గౌరవప్రదంగా, పారదర్శకంగా ప్రకటించిన యేసుప్రభువు అనుచరులుగా చెప్పుకునే వాళ్ళు. ఈనాడు కోట్లకు పడగెత్తుతూ, వస్త్రధారణలో, జీవన శైలిలో, ధనార్జనలో పోటీపడుతూ ‘టచ్ మీ నాట్’ అన్నట్టు తారల్లాగా వ్యవహరించడం ఎంతో బాధ కలిగించే విషయం. ఇలాంటి వాళ్ళతో ప్రకటించబడేది దేవుని రాజ్యమా, శత్రువు రాజ్యమా? శ్రమ తెలియకుండా తమ కోసం తామే స్వార్థంగా బతికే సెలెబ్రెటీలకు, ‘నేను’ ‘నా’ అనే మాటలే ఉండకూడని దేవుని సేవకులకు పోలిక ఏమైనా ఉందా?? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ ఈ మెయిల్: prabhukirant@gmail.com -
ఆ తొమ్మిది మంది ఎక్కడ?
యేసుప్రభువు ఒకసారి సమరయ ప్రాంతం మీదుగా యెరూషలేముకు వెళ్తుండగా, పది మంది కుష్టు రోగులు ఎదురై, తమను కరుణించమంటూ దూరం నుండే కేకలు వేశారు. ఆ కాలంలో కుష్టు చాలా భయంకరమైన వ్యాధి..కుష్టు వ్యాధిగ్రస్థులు కుటుంబ, సామాజిక బహిష్కరణకు గురై జీవచ్ఛవాల్లాగా ఉరికి దూరంగా నిర్జన స్థలాల్లో బతికేవారు. మామూలు మనుషులు ఎదురైతే కుష్టు రోగులు దూరం నుండే మాట్లాడాలి. అలాంటి ఆ పదిమంది కుష్టురోగుల మీద ప్రభువు జాలి పడి, వారి వ్యాధి బాగు చేసి, వెళ్లి యాజకులకు చూపించుకొమ్మని చెబితే, వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు అలా వెళ్తుండగా బాగుపడ్డారని బైబిల్ చెబుతోంది( లూకా 17:14). అయితే కొద్ది సేపటికి ఆ పది మందిలో అస్పృశ్యుడు, సమరయుడైన ఒకడు తిరిగొచ్చి ప్రభువుకు సాగిలపడి కృతజ్ఞత వెలిబుచ్చగా,’ శుద్ధులైన మిగిలిన తొమ్మండుగురు ఎక్కడ?’ అని ప్రభువు ప్రశ్నించాడు. సమరయులను యూదులు ముట్టుకోరు, వారితో సాంగత్యం అసలే చేయరు. అయితే సామాజిక బహిష్కరణకు గురైన తర్వాత కుష్టు వ్యాధిగ్రస్తులుగా అంతకాలం యూదులైన 9 మంది, సమరయుడైన ఆ వ్యక్తి కలిసే జీవించారు. కానీ ప్రభువు కృపతో శుద్ధులై యాజకులను కలిసేందుకు వెళ్తున్నపుడు బహుశా వారిలో వారికి భేదాభిప్రాయాలు వచ్చాయి. సమరయుడైన ఆ వ్యక్తి అంటరానివాడని, పైగా అతనికి ఆలయప్రవేశం కూడా నిషిద్ధమని యూదులైన తొమ్మండుగురికి గుర్తుకొచ్చి అతన్ని వెలివేస్తే, అతను వెనక్కొచ్చి ప్రభువు పాదాలనాశ్రయించాడు. విచిత్రమేమిటంటే, కుష్టువ్యాధి వారిని కలిపితే, స్వస్థత విడదీసింది. కాకపోతే సమరయుడికి దాని వల్ల ఎంతో మేలు జరిగింది. ఆ తొమ్మండుగురికి శారీరక స్వస్థత, ఆలయ ప్రవేశం మాత్రమే దొరికింది. కాని స్వస్థత పొంది తిరిగొచ్చిన సమరయుడికి, ఆలయంలో ఆరాధనలందుకునే దేవుడే యేసుప్రభువుగా, రక్షకుడుగా దొరికాడు, ఆయన మాత్రమే ఇచ్చే పరలోక రాజ్యంతో కూడిన శాశ్వతజీవం కూడా సమృద్ధిగా దొరికింది. ఆ తొమ్మిది మంది కుష్టువ్యాధి నయమై మామూలు మనుషులయ్యారు, కాని కృతజ్ఞతతో తిరిగొచ్చిన సమరయుడు ప్రభువు సహవాసంలో గొప్ప విశ్వాసి అయ్యాడు. ఆ తర్వాత అపొస్తలుడై ప్రభువు సువార్త ప్రకటించి వందలాది ఆత్మలు సంపాదించి హత సాక్షి కూడా అయ్యాడని చరిత్ర చెబుతోంది. కుష్టు నయమైనా దాని కన్నా భయంకరమైన ‘కృతజ్ఞతారాహిత్యం’ అనే వ్యాధి నుండి మాత్రం ఆ తొమ్మండుగురికీ విముక్తి దొరకలేదు. ‘ఆ తొమ్మండుగురు ఎక్కడ?’ అన్న తన ప్రశ్నకు, ‘ఇంకెక్కడ? కుష్టు నయమై కూడా వాళ్ళు నరకంలో ఉన్నారు’ అన్నదే జవాబని ప్రభువుకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే యేసుప్రభువిచ్చే స్వస్థత పొందడం వేరు, యేసుప్రభువునే రక్షకుడుగా పొందడం వేరు. పరలోకరాజ్యార్హత తో కూడిన ఆ ధన్యత, పదిమందిలో అంటరాని వాడు, అన్యుడైన సమరయుడికి ఒక్కడికే దొరికింది. లంకె బిందెలు దొరికితే, వాటిలోని బంగారం, వెండి, వజ్రవైఢూర్యాది విలువైన సామాగ్రినంతా పారేసి, కేవలం ఖాళీ ఇత్తడి బిందెల్ని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళు ఆ తొమ్మిది మంది కాగా, ఐశ్వర్యంతో సహా లంకె బిందెల్ని తీసుకెళ్లిన వాడు ఆ అన్యుడు, సమరయుడు !! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకుడు – ఆకాశధాన్యం -
పైపై పూతలు మనుషులకే!
ఒకసారి యేసుక్రీస్తు యెరికో పట్టణం గుండా వెళుతున్నాడు. అప్పుడు పన్ను వసూలు చేసే అధికారి జక్కయ్య అనే వ్యక్తి యేసు గురించి అప్పటికే ఎంతో గొప్పగా విని ఉండటం చేత యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అతడు ధనవంతుడు. కాని పొట్టివాడు కావడంతో యేసును చూడాలనుకొని ఆయన చుట్టూ చేరిన జనసందోహంలోకి చొచ్చుకుని పోయి యేసును చూడలేకపోయాడు. దాంతో అతను ఒక మేడి చెట్టు ఎక్కి యేసును తదేకంగా చూడసాగాడు. అతని అంతరంగాన్ని, తన పట్ల అతనికి గల ప్రేమాభిమానాలను గుర్తించిన యేసుక్రీస్తు అతనితో – జక్కయ్యా త్వరగా చెట్టు దిగి రమ్ము, ఈ రోజు నేను నీ గృహంలో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానన్నాడు. అందుకతడు సంతోషించి, యేసును అతని ఇంటికి ఆహ్వానించాడు. అందరూ అది చూసి ‘ఇదేం విడ్డూరం! ఈయన పాపిౖయెన మనుష్యుని ఇంట బస చేయడానికి వెళ్లాడు’ అని గుస గుసలాడుకోసాగారు. యేసును చూసిన ఆనందంతో జక్కయ్య – ప్రభువా నా ఆస్తిలో సగం బీదలకిచ్చేస్తాను. నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా దేనినైనను సంపాదించిన యెడల అంతకు నాలుగు వంతులు అదనంగా ఇస్తానని ఆయన పాదాల నంటి వాగ్దానం చేశాడు. అందుకు యేసు – జక్కయ్యా! నీవు కూడా అబ్రహాము కుమారుడవే, నేడు ఈ ఇంటికి ‘రక్షణ’ వచ్చింది, పాడైపోయిన వ్యవస్థను చూచి, రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడని చెప్పాడు (లూకా 19:1–10). మనుషుల అంతరంగాన్ని ఎరిగినందుననే పాపిగా మనుష్యులు సణుగుకొన్న జక్కయ్య ఇంటికి వెళ్లాడు యేసుక్రీస్తు. పాపిగా ఎంచబడ్డ గోడను అడ్డు తొలగించి రక్షణ కలిగించాడు. ఈ తేడాలు, మనుష్యులకే కాని దేవుని దృష్టిలో అందరూ సమానులేనని చెప్పకనే చెప్పాడు. పై పై రూపాలు, పైపై పూతలను చూసి మోసపోయేది మనుషులే కాని, దేవుడు కాదు కదా... యెహోవా హృదయమును లక్ష్యపెట్టాడు. అందుచేత హృదయములోని తలంపు యెరిగి జక్కయ్య వద్దకు యేసుక్రీస్తు వెళ్లాడు (1 సమూ 16:7).– బి.బి.చంద్రపాల్ కోట -
పశ్చాత్తాప దీపం
దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న కాలంలో ఒక తప్పు చేశాడు. దేవుని చేత పంపబడిన నాతాను ప్రవక్త తెలిపిన వెంటనే తన తప్పును గుర్తించి, పశ్చాత్తాప పడ్డాడు. సరైన సమయంలో ఒప్పుకున్నాడు. కనుక క్షమాపణ పొందాడు. అలాగే హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి సోకినప్పుడు యెషయా ప్రవక్త దైవ ప్రేరణతో అతని వద్దకు వచ్చి ‘‘నువ్వు త్వరలో మరణించబోతున్నావు, నీ ప్రాణ దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో’’ అని హెచ్చరించాడు. రాజు వెంటనే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రభువు అతన్ని బాగు చేసి, పదిహేను సంవత్సరాలు అధిక ఆయుష్షును ఇచ్చాడు. ఈ ఉదంతాలలో.. తమ స్థితిని గుర్తించి, వెంటనే సరిదిద్దుకున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుని కూడా తప్పించుకోక, దాన్నే కౌగిలించుకుని, తన ప్రాణానికే ఉరి తెచ్చుకున్నాడు. అతడే యూదా ఇస్కరియోతు! యేసు ప్రభువు తన మరణానికి ముందు రోజు రాత్రి, శిష్యులతో కలిసి పస్కా భోజనం చేస్తూ, ‘‘మీలో ఒకరు నన్ను శత్రువుల చేతికి అప్పగించబోతున్నారు. లేఖనాల్లో రాయబడిన ప్రకారం నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తాను, మరల వస్తాను. కాని ఎవని చేత దైవ కుమారుడు అప్పగించబడ బోతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ!’’ అని చెప్పినప్పుడు, యూదా ‘‘ప్రభువా? నేనా?’’ అని అడిగి, ‘‘నువ్వన్నట్టే’’ అన్న స్పష్టమైన జవాబును ప్రభువు నుండి పొంది కూడా, పశ్చాత్తాప పడలేదు... వెనుతిరగలేదు. పవిత్ర ప్రేమకు సూచన అయిన ముద్దుతో తన గురువుగారిని శత్రువుకు అప్పగించి కేవలం ముప్ఫై వెండి నాణాలకు అమ్ముడుపోయిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. సిలువలో వేళ్లాడుతూ, రక్తమోడుతున్న తన ప్రభువును చూసి.. తట్టుకోలేక, గుండె పగిలేలా ఏడ్చాడు, మెడకు ఉరేసుకుని పొట్టపగిలి పేగులు వేలాడి చచ్చిపోయాడు! అందుకే దీపం ఉండగానే ఇంటిని సరిదిద్దుకొమ్మన్నారు పెద్దలు! – ఝాన్సీ కె.వి. కుమారి -
దూరాన్ని, దాస్యాన్ని తొలగిస్తూ చిరిగిన తెర !!!
కల్వరిలో యేసు మరణసమయంలో యెరూషలేములోని మహా దేవాలయపు తెర మధ్యలో పైనుండి కిందికి చిరగడం ఒక గొప్ప అద్భుతం. అసలు ఆనాటి ఆ యూదు దేవాలయ నిర్వహణ, నిర్మాణమే ‘ప్రజలను దేవునికి దూరంగా పెట్టడం’ అనే సంప్రదాయంతో సాగింది. దేవాలయ ప్రాంగణంలో మహిళల కోసం, యూదులు కాని అన్యుల కోసం అంటూ మంటపాలను విడి విడిగా కట్టి ఉంచారు. యూదుస్త్రీలకు, యూదులు కాని అన్యులకు దేవాలయ ప్రవేశం లేదు. వారు ఆవరణంలోని మంటపాల దాకా మాత్రమే వెళ్ళాలి. ఇక యూదు పురుషుల కోసమైతే మరో విశాలమైన మంటపాన్ని కట్టారు. వాళ్లకు కూడా అక్కడిదాకానే ప్రవేశార్హత. ఆవరణం మధ్యలో బలి అర్పణల కోసం ఒక బలిపీఠాన్ని నిర్మించారు. బలి పీఠాన్ని యూదులు కూడా తాకడానికి లేదు. కేవలం యాజకులు మాత్రమే బలిపీఠం దాకా వెళ్తారు, వాళ్ళే బలులర్పిస్తారు. ఆవరణలో నుండి దేవాలయం లోనికి వెళ్ళడానికి చాలా మెట్లుంటాయి. అంటే దేవాలయం చాలా ఎత్తులో ఉంటుందన్నమాట. ఇక దేవాలయం మొత్తం పవిత్ర స్థలం, అతి పవిత్ర స్థలం అని రెండు భాగాలుగా నిర్మించబడింది. పవిత్ర స్థలం లోనికి ఆయా పూజా విధుల నిర్వహణ కోసం, అందుకు ప్రత్యేకించబడి, ప్రతిష్ట చేయబడిన యాజకులు మాత్రమే అది కూడా నిర్ణీత విధానంలో ప్రవేశించాలి. పవిత్ర స్థలంలోకి యాజకులు కూడా పూజా కార్యక్రమాలకోసమే వెళ్ళాలి తప్ప, ఆషామాషీగా ఎప్పుడంటే అప్పుడు వెళ్లేందుకు దేవుని అనుమతి లేదు. ఇక దేవుని నివాస స్థలంగా పరిగణించబడే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకులు కూడా ప్రవేశించరాదు. ప్రధాన యాజకుడొక్కడే అది కూడా ఏడాదికొక్కసారి మాత్రమే ప్రజలందరి ప్రాయశ్చిత్తం కోసం ‘ప్రాయశ్చిత్త దినం’ నాడు ప్రత్యేక దుస్తులు ధరించి అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించి పూజలు నిర్వహిస్తాడు. లేవీకాండం 16వ అధ్యాయంలో ఆ వివరాలుంటాయి. యూదులకు అత్యంత ప్రాముఖ్యమైన ఆరాధనా ప్రక్రియను ప్రధాన యాజకుడు అతిపవిత్ర స్థలంలో, పాప పరిహారార్థ బలి వస్తువును చేత పట్టుకొని వెళ్లి అక్కడున్న కరుణాపీఠాన్ని ఆశ్రయించాలి. ఎన్ని లక్షల మంది యూదులున్నా వాళ్ళెవరూ ఆ స్థలంలోకి ఎవరూ కనీసం తొంగి చూడకూడదు. అందుకే యాజకులను, భక్తులను దూరంగా ఉంచడానికి పవిత్ర స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య పొడవాటి తెర వేలాడుతూ ఉంటుంది. అక్కడి దేవాలయ నిర్మాణం, వాతావరణమంతా ఇలా భయం భయంగా ‘ఇక్కడ దేవుడున్నాడు. ఆయన అత్యంత పరిశుద్ధుడు, మీరు అత్యంత పాపులు. అందువల్ల మీరంతా దేవునికి దూరంగా ఉండండి’ అని ఖండితంగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంటుంది. దేవాలయ యాజమాన్యం, వ్యవహారాలన్నీ ధర్మశాస్త్ర నిబంధనల మేరకు జరగాలి. ధర్మశాస్త్ర ఉల్లంఘన జరిగితే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలుంటాయి. ధర్మశాస్త్రపు దాస్యం నుండి, దాని శిక్షావిధి నుండి యేసుప్రభువు సిలువయాగం ద్వారా యేసుప్రభువులో యూదులకే కాదు మానవాళి యావత్తుకూ దేవుడు స్వేచ్ఛను ప్రకటించాడు (రోమా 8:1) అందుకు సూచనగా, శుభారంభంగా దేవుడే దేవాలయపు అడ్డు తెరను చించేశాడు. యాజకులు, యాజకేతరులు, స్త్రీలు, పురుషులు, పాపులు, నీతిమంతులు, భక్తులు, ధర్మకర్తలనే విభేదాలు లేని ఒక ఆత్మీయ సమసమాజావిర్భావం దేవుని హృదయాభిలాష మేరకు కల్వరిలో యేసు ఆత్మత్యాగం ద్వారా జరగడమే గుడ్ ఫ్రైడే నాటి ప్రత్యేకత. ఒక విధంగా తండ్రియైన దేవుడే తన రక్షణ ప్రణాళికలో భాగంగా తన అద్వితీయ కుమారుడైన యేసులో మానవాళికంతటికీ ‘మతస్వేచ్ఛ’ను ప్రకటించి పరలోక ద్వారాలను పూర్తిగా తెరిచాడు. అలా దేవుని కృపా యుగం ఆరంభమయింది. దేవుడంటే అక్కడెక్కడో ఎవరికీ అందకుండా, ఎవరికీ కనిపించకుండా, సామాన్యులకు అందుబాటులో లేకుండా దూరంగా ఉండేవాడన్న ధర్మశాస్త్ర యుగపు చీకటి రోజులకు దేవుడే తెర వేస్తూ ఆయన మానవాళికంతటికీ అందుబాటులోకి వచ్చిన పరలోకపు తండ్రి అయ్యాడు. దేవునితో మనిషి అనుభవించిన యుగయుగాల ఎడబాటుకు, అనాథత్వానికి దేవుడే ఇలా ఒక పరిష్కారాన్నిచ్చాడు. దేవాలయపు అడ్డు తెర చిరగడంతో విశ్వాసుల ఆత్మీయ స్వేచ్ఛకు అంకురార్పణ జరిగి క్షమాయుగం. కృపాశకం ఆరంభమైంది. -
ప్రేమ పునరుత్థానం
చాలా ఏళ్ల కిందట ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక చిత్ర ప్రదర్శన జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకులు ఆ ప్రదర్శనను తిలకించడానికి వచ్చారు. విశ్వఖ్యాతిని ఆర్జించిన ఎందరో మహనీయుల కుంచెల నుంచి జాలువారిన అద్భుతమైన కళాఖండాలు, చిత్రపటాలు దానిలో ఉంచబడ్డాయి. వచ్చినవారంతా అక్కడ ఉంచబడిన వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఆ చిత్రపటాలు ప్రతిబింబించే వింతైన విషయాలను శ్లాఘిస్తున్నారు. కొన్ని రోజులు ఆ చిత్రప్రదర్శన చక్కగా కొనసాగింది. చివరిరోజున కొంచెం రద్దీ పెరిగింది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చి కలియతిరిగి వారి దారినవారు వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఒక్కొక్క చిత్రపటాన్ని పరిశీలించుకుంటూ వచ్చిన ఒక యువకుడు ఒక మూల వేలాడదీసిన ఒక చిత్రపటాన్ని చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు. తన ముందున్న ఒక దృశ్యాన్ని కళ్ళార్పకుండా చూడడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే కళ్ళు చెమర్చడం ప్రారంభించాయి. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ చిన్న మూలుగు మొదలైంది.చెక్కిళ్ళ మీద నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏదో ఒక విషయం అతన్ని చాలా ఎక్కువగా కదిలిస్తోంది. చాలామంది అతన్ని దాటుకుంటూ ముందుకు సాగిపోయారు. తను మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేకపోతున్నాడు. మధ్యాహ్నం గతించినా అక్కడే నిలబడి ఉన్నాడు. సాయంత్రం చిత్రప్రదర్శన ముగింపు సమయం వచ్చింది. నిర్వాహకుడు దగ్గరకు వచ్చి బయటకు వెళ్ళమని ఆ యువకుని కోరాడు. వెక్కివెక్కి ఏడుస్తూ ఆ యువకుడు బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని వేల చిత్రపటాలు ఉన్నప్పటికీ అతన్ని అంతగా కదిలించినదేమిటని ఆ నిర్వాహకుడు తన ముందున్న చిత్రపటాన్ని చూశాడు. దానిలో యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వ్రేలాడుతుండగా, అతని చేతుల్లో, కాళ్ళల్లో మేకులు కొట్టబడియున్నాయి. తలలో ముళ్ళకిరీటం ఉంది. ప్రక్కలో బల్లెపుపోటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాటితో పాటు ఆ చిత్రపటంలో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ‘‘నేను నిన్ను ప్రేమించి నీ కోసం ఇదంతా చేశాను...నీవు నా కోసం ఏం చేశావు’’. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ చిత్రపటాన్ని తదేకంగా చూస్తున్న యువకుడు ఈ మాటలనే ఆలోచించడం ప్రారంభించాడు. యేసు చేసిన త్యాగం అతన్ని కదిలించింది. అంతవరకు అధ్వాన జీవితాన్ని జీవించిన ఆ యువకుడు ఆ క్షణం నుంచి మంచివ్యక్తిగా జీవించడం ప్రారంభించాడు. మార్పు అనేది పరమాత్ముని గుండెల్లోనికి ఆహ్వానించడంతోనే ప్రారంభమౌతుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఓ ప్రముఖ వార్తా పత్రికలో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన, చేస్తున్న వ్యక్తుల జాబితా ప్రచురించింది. పురాతన, నవీన కాలాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వారిని గుర్తించారు. దానిలో మొదటి స్థానంలో యేసుక్రీస్తు ఉన్నారు. ‘ఆయన ఎక్కడో కుగ్రామమైన బేత్లెహేములో జన్మించినప్పటికీ ఆయన గురించి తెలియనివారెవరూ లేరు. తన జీవిత కాలంలో ఎన్నడు యుద్ధం చేయడానికి సైన్యాన్ని నడిపించలేదు... కానీ ఈనాడు అనేకుల హృదయాల్లో రాజుగా చోటు సంపాదించుకున్నారు. ఆయుధాలు ఎన్నడు ఉపయోగించలేదు... అయినా ప్రపంచాన్ని తన ప్రేమతో జయించాడు. మహోన్నతమైన జీవితాన్ని కోరుకొనేవారి కోసం క్రీస్తు ప్రభువు అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలిచారు. ప్రేమ, కరుణ, త్యాగం, జాలివంటి దైవిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవచ్చునన్న సత్యం బోధపడింది. ఆయన జన్మ, జీవితం, బోధలు, మరణం, పునరుత్థానం ఎన్నో పాఠాలను ప్రపంచానికి నేర్పిస్తుంది. క్రీస్తు మరణం, పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి పునాది. సంవత్సరములో వచ్చే యాభై రెండు శుక్రవారాలలో ఒకదానిని శుభ శుక్రవారము (గుడ్‌ఫ్రైడే) అని పిలుస్తారు. ఆ రోజున యేసుక్రీస్తు సర్వమానవ పాప ప్రక్షాళన నిమిత్తం సిలువపై మరణించారు. పాపముల చేత, అతిక్రమములచేత బంధించబడిన మానవుని రక్షించడానికి, వ్యసనాల నుంచి విడిపించడానికి యేసు కలువరి సిలువపై మనిషి స్థానంలో ప్రాణమర్పించాడు. ఆ బల్యర్పణ ద్వారా సకలలోక ప్రజలకు దేవుని రక్షణ అందుబాటులోనికి వచ్చింది. క్షమాపణ కిరణాలు సిలువ నుంచి నలుదిశలా వ్యాపించాయి. దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తు ఊహించలేని ఆనందంతో జీవిస్తున్నారు. ప్రతి మంచి కార్యంవెనుక ఓ గొప్ప త్యాగం దాగిఉంటుంది. తమ బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఆశించే తల్లిదండ్రులు పడుతున్న కష్టాలెన్నో మన కళ్ళముందున్నాయి. తండ్రి తన బిడ్డలమీద జాలిపడేలా దేవుడు కూడా తన రూపంలో సృష్టించబడిన మనుషుల మీద తన కనికరాన్ని, ప్రేమను ఎల్లవేళలా చూపిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మనుష్యాకారంలో వచ్చిన యేసు చేసిన కార్యాలన్ని తన అమూల్య ప్రేమను నిస్సందేహంగా వెల్లడించాయి. గలిలయ ప్రాంతంలో ఒక కొండమీద యేసు ప్రసంగించాడు. ఆ దివ్యసందేశం ఇప్పటికి అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంది. దానికి కొండమీద ప్రసంగం అంటారు. ‘‘నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నిన్ను హింసించువారి కొరకు ప్రార్థించు, ఇతరులు నీకేమి చేయాలని నీవు ఆశిస్తావో వాటిని ఇతరులకు నీవు చేసి చూడు, నీ శత్రువులను కూడా ప్రేమించు’’ అని క్రీస్తు బోధించాడు. కేవలం వాటిని బోధించుటయే గాక క్రియల్లో వాటిని నెరవేర్చాడు. ఒకసారి ఒక కుష్టువ్యాధిగ్రస్తుడు ఆయన యొద్దకు వచ్చి నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ప్రార్థించాడు. తనకున్న వ్యాధిని బట్టి అతడు ఎవ్వరికి ఇష్టంగా లేడు అనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. సమాజంచేత, ఉన్నతస్థితిలో ఉన్న మనుష్యులచేత చీదరించబడిన ఆ వ్యక్తిని ముట్టుకొని నాకిష్టమే శుద్ధుడవు కమ్ము అని చెప్పి యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. అభాగ్యులను, అంటరానివారిని చేరదీసి అడుగడుగునా ప్రజలకు మేలుచేసి తన ప్రేమనంతా వారిమీద కుమ్మరించిన మహనీయుడు యేసుక్రీస్తు. అక్రమకారుల అన్యాయాలకు బలిపశువుగా మారి, విలవిలలాడవలసిన పరిస్థితులలో సైతం అత్యంత క్రూరాతి క్రూరంగా చిత్రవధ గావించబడియు ఆ కలువరి సిలువలో ఆయన పలికిన ఏడు ప్రాముఖ్యమైన మాటలు నిజంగానే ఆయన వ్యక్తిత్వం బహుశ్రేష్ఠమైనదని ఋజువుచేశాయి. ఒక వ్యక్తి యొక్క మొదటి మాటలు, చివరిమాటలు చాలా ప్రాధ్యాన్యతను సంతరించుకుంటాయి. మరణశయ్య నుంచి వెలువడే మాటలు కచ్చితంగా వారి మనసులో నుంచే వస్తాయనుటలో ఏ సందేహం లేదు. యవ్వనకాలంలోనే ప్రపంచాన్ని జయించి జగజ్జేతగా పిలువబడిన అలెగ్జాండరు తన చివరి సమయంలో కొన్ని నిజాలు మాట్లాడాడు. తన సమాధి పెట్టెకు రెండు రంధ్రాలు పెట్టి వాటినుండి తన రెండు చేతులు బయటకు వేయమన్నాడు. నేను ఈ భూమ్మీదకు ఒట్టి చేతులతో వచ్చాను...అవే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను అని అందరికీ తెలియాలి. ప్రపంచాన్ని జయించినందుకు కాకపోయిన ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా అతనిని గ్రేట్ అని పిలవవచ్చు. ‘‘నా జీవితమే ఓ ప్రయోగాత్మకమైన హాస్యం’’ అని తనను గూర్చి తాను చెప్పుకున్న చార్లీ చాప్లిన్. మనిషి తన చరమాకంలో నిజాలు మాట్లాడుతాడు అనడానికి ఈ నిదర్శనాలు చాలవా? అయితే యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు విలక్షణమైనవి. క్షమాపణ, బాధ్యత, సంరక్షణ ఆయన చివరిమాటలో స్పష్టంగా గమనించగలము. ఓ దేవా! నేను పాపంలో జన్మించాను. పాపంలో జీవిస్తున్నాను. పాపంలో మరణిస్తున్నాను. నీవే శరణు కోరదగిన శరణాగత వత్సలుడవైతే నన్ను ఈ పాపము నుంచి విడిపించు అని నిత్యము ప్రార్థిస్తున్న మనిషిని విడిపించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. తన జీవిత చరమాంకంలో నాలో పాపమున్నదని మీలో ఎవ్వరైనా నిరూపించగలరా అని ప్రశ్నించి తన పవిత్రతను, పరిశుద్ధతను నిరూపించుకున్నాడు. ఆయన జీవితాన్ని నిశితంగా పరిశీలన చేసి, ఏ పాపమును లోపమును కనుగొనలేకపోయిన సమాజం ఆయన అద్భుతాలు చేసి రొట్టెలు పంచితే కడుపునిండా భుజించిన భక్త సందోహం, నానావిధ రోగాలతో, వ్యాధులతో అణగారిపోయిన ఎన్నోవేల జీవితాలు ఆయన చూపుతో, స్పర్శతో, మాటతో స్వస్థతపొంది ఆనందడోలికలో ఊరేగించబడిన అభాగ్యులు, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆయన ప్రేమను, దైవత్వాన్ని రుచిచూసిన ప్రతిఒక్కరు ఒక్కసారిగా ఆయనకు శత్రువులుగా మారిపోయి ఆయనను సిలువమీదే కాకుండా‘‘సిలువవేయండని’’ అరవడం ద్వారా అక్కడే ఆయన మానసికంగా, ఘోరంగా గాయపరచినా క్రీస్తు తాను చేయాలనుకున్న కార్యము నుండి వెనుతిరుగలేదు.ఆయనను వెంబడించిన శిష్యుడే కాసులకొరకు ఆశపడి ఆయనను దొంగముద్దు పెట్టుకొని అమ్మివేస్తే, ఆ రాణువవారికి అప్పగిస్తే ప్రక్కలో అందరికి కనబడేటట్టు పొడవబడిన బల్లెపు పోటుకన్నా ఆ పని ఆయన గుండెల్లో దూసుకెళ్ళిన గునపపు పోటంత నొప్పయింది. నోరు తెరువక, చిరునవ్వుతో దుఃఖమునంతా పెదవి చాటున అదిమిపట్టి వారు పెట్టిన బాధలన్ని మౌనంగా భరించి... సిలువను మోసుకొని మేకులతో సిలువకు కొట్టబడి.... ఆ మండుటెండలో...ధారాపాతంగా ఒలుకుతున్న రక్తధారల సవ్వడిలో ...ఓ మాటకోసం నోరు తెరిచాడు క్రీస్తు. ∙∙ యేసుక్రీస్తు మరణించినప్పుడు ఎన్నో అద్భుత సంగతులు చోటుచేసుకున్నాయి. యెరూషలేము దేవాలయంలో ఒక పెద్ద తెర వ్రేలాడదీయబడి ఉంటుంది. సుమారుగా నాలుగు అంగుళాలు మందం కలిగిన ఆ తెర పై నుంచి కిందకు చిరిగిపోయింది. దేవుడే మనిషికి తనకు మధ్య ఉన్న తెరను తొలగించాడన్న సత్యం విశదపరచబడింది. దేవుని యొద్దకు చేరుకొనుటకు మార్గం ఏర్పడింది. సృష్టిలో విచిత్రమైన మార్పులు జరిగాయి. ఎవరైతే క్రీస్తు ప్రభువును సిలువవేయడానికి రోమన్ గవర్నరైన పిలాతు ద్వారా నియమించబడ్డాడో ఆ వ్యక్తి సిలువ ముందు మోకాళ్ళూని నీవు నిజముగా నీతిమంతుడవని ఒప్పుకున్నాడు. ఇతనియందు ఏ దోషము నాకు కనబడడంలేదని అంతకు ముందే తీర్పు తీర్చిన పిలాతు ఒప్పకోక తప్పలేదు. యేసుక్రీస్తు వ్రేలాడదీయబడిన సిలువపై ‘నజరేయుడైన యేసు యూదులకు రాజు’ అనే విలాసము ఉంచబడింది. ఆ వ్రాత ఆనాటి కాలంలో ప్రసిద్ధిగాంచిన హెబ్రీ, లాటిన్, గ్రీకు భాషల్లో వ్రాయబడింది. ఆవైపు వెళ్తున్న ప్రజలంతా దానిని చదవాలని అలా చేసారు. ఈ మూడు భాషలు క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని సూచిస్తున్నాయి. క్రీస్తు సిలువపై మరణించాడనుటకు బైబిల్ ఆధారాలు మాత్రమే గాక చారిత్రక, శాస్త్రీయ ఋజువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయన స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని మనుష్యులందరి కోసం అర్పించాడు. త్యాగనిరతిని చాటిచెప్పాడు. నిజమైన ప్రేమను ఋజువు చేశాడు. అరిమతయియ యోసేపు మరియు నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువ నుంచి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిçస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునర్ అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. గుడ్‌ఫ్రైడే తరువాత వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు సంతోష ఆనందాలతో జరుపుకుంటారు. మరణాన్ని జయించిన క్రీస్తును కొనియాడుతూ ఆత్మలో పరశిస్తారు. యేసుక్రీస్తు ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి పునాది. మొదటి శతాబ్దపు తత్వజ్ఞానుల్లో ఒకడైన పౌలు క్రీస్తు జీవితాన్ని సంపూర్తిగా అధ్యయనం చేసి ఇలా అంటాడు. ‘క్రీస్తు మృతులలోనుండి లేపబడియుండని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మేము చేయు ప్రకటన కూడా వ్యర్థమే’. వీరాధి వీరులు, శూరాధి శూరులు, ఒంటి చేత్తో ప్రపంచాన్ని జయించిన చక్రవర్తులు, గండపెండేరములు సంపాదించిన కవీశ్వరులు, విప్లవకారులు మరియు కళాకారులు ఎందరో మరణం ముంగిట తలవంచితే రెండువేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ముందు మరణమే తలవంచింది. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికీ ఫరోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫరోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది.క్రీస్తు పునరుత్థానము మనిషిలో ఉన్న భయాలను పోగొట్టింది. ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోండంటూ కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యాపారవేత్త పిలుపునిచ్చాడు. ఆ పని జరిగిందో లేదో తెలియదు గానీ మనిషి మాత్రం భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయాడన్నది గమనార్హం. ప్రతి మనిషి ఏదోక భయంతో అల్లాడిపోతున్నాడు. గత జీవితంలో చేసిన తప్పిదాల వలన, భవిషత్తులో ఏం జరుగబోతుందన్న ఆందోళన వలన, ఛిద్రమౌతున్న బంధాలను బట్టి మానవుడు విపరీతంగా కృంగిపోతున్నాడు. అన్నిటికన్నా మనిషిని భయపెట్టేది మరణం. కడపట నశింపచేయు శత్రువు మరణం. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేవడం వలన మరణం తరువాత కూడా మహోన్నతమైన జీవితం ఉందని ఋజువుచేశాడు. ఆదివారం ఉదయమున స్త్రీలు సుగంధ ద్రవ్యాలు ఆయన దేహానికి పూయాలని ఆశించగా వారక్కడ ఖాళీ సమాధిని చూశారు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచియున్నాడు. ఆకాశం భూమి గతించినా దేవుని మాటలు ఎన్నడును గతించవు. భయంతో వణికిపోతున్న స్త్రీలకు వచ్చిన వాగ్దానం ‘భయపడకుడి’. పునరుత్థానుడైన యేసు తనకు కనబడినవారికందరికి ఇచ్చిన శక్తివంతమైన వాగ్ధానం ఇదే. దేవుడు మనకు రక్షకుడుగా వెలుగుగా ఉంటాడు గనుక మనిషి భయపడనక్కరలేదు. భౌతిక ప్రపంచంలోనైనా, ఆధ్యాత్మిక జీవితంలోనైనా భయం అనేది పతనానికి దారితీస్తుంది. సంకల్పశక్తి, మహాబల సంపన్నత దేవుని పాదాల చెంత లభిస్తుంది. సర్వశక్తుడు మనలో ఉన్న అచేతనాన్ని తన దివ్యశక్తి ద్వారా చైతన్యపరుస్తాడు. సూక్ష్మమైన పరమాణువులలో ఉన్న శక్తి చైతన్యపరచినప్పుడే గదా అపరిమితమైన శక్తి వెలువడుతుంది. ఇకపై వ్యాధులకు, బాధలకు, శోధనలకు, శత్రువైన సాతానుకు, భవిష్యత్తు కొరకు భయమక్కరలేదు. దేవుడు శాశ్వతకాలం తన ప్రజలతో ఉంటాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు పేరుంది. దానికి అర్థం ‘దేవుడు మనకు తోడు’. క్రీస్తు పునరుత్థానం ‘సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వతంగా సమాధి చేయలేరన్న సత్యాన్ని నిరూపించింది’. నేనే సత్యమని క్రీస్తు తెలియచేశాడు. శాస్తుల్రు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు, రోమన్లు అందరూ కలిసి క్రీస్తును హింసించి, సంహరించి సమాధిలో ఉంచారు. సత్యాన్ని సమాధి చేసేశాం అంటూ పండుగ చేసుకున్నారు. కానీ వారి అంచనాలు తలక్రిందులై పోయాయి. మరణపు మెడలు వంచుతూ, సమాధిని చీల్చుకుంటూ క్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచాడు. సమాధిముందు ఉంచబడిన రాణువవారుగానీ, రెండు టన్నుల రాయి గానీ క్రీస్తు ప్రభంజనాన్ని అడ్డులేకపోయాయి. అబద్ధం కొంతకాలమే మనిషిని ఊరిస్తుంది. సత్యం ఎప్పటికి నిలుస్తుంది. అంతిమ విజయం సత్యానిదే. క్రీస్తు పునరుత్థానం వలన సర్వలోకానికి శుభం కలిగింది. కలవరంతో, ఆందోళనతో నిండియున్న వారికి మీకు శుభమగును గాక అనే వాగ్దానం క్రీస్తు నుండి అందింది. తన భక్తులతోను తన ప్రజలతోను దేవుడు శుభవచనం సెలవిస్తాడు అనేది బైబిల్ వాగ్దానం. దేవుడు మంచివాడు గనుక తనను ఆశ్రయించినవారికి తప్పకుండా మంచి చేస్తాడు. సర్వశక్తుడు ఏ ఒక్కరికీ కీడు చేయడు. సమ్మతించి ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు మానవుడు అనుభవిస్తాడు. దేవుడు తన బిడ్డల అవసరాలు తీర్చువాడు. తన దివ్యానుభూతితో, మధురాతిశయంతో, ఆనంద పారవశ్యంతో నింపేవాడు. ఆయన పాదాలను తేరి చూచేవారికి ఏలోటూ లేదు. ఉండదు కూడా. ఆయన దివ్య తేజస్సును మనసారా ఆస్వాదించడమే జీవిత పరమార్థం. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతుంది. శాంతిగా బ్రతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బ్రతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తూ ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియనివారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థ జీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. మార్పు అనేది ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి ద్వారా ప్రారంభమవ్వాల్సిందే కదా. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే.ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. గమ్యాన్ని చేరుకోలేనేమోనన్న భయం వెంటాడుతుంది. తన ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టమనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలువబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే నిరాశలో ఉన్నాను... దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏ విషయానికి బెదిరిపోడు... చింతించడు’. ‘తుది శ్వాస వరకు నా భర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. ఇశ్రాయేలు దేశంలో ఝెరూషలేములో యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. నిరాశ నిస్పహలతో అంతమొందే మానవ జీవితానికి ఈ ఈస్టర్ అనగా యేసుక్రీస్తు పునరుత్థానం గొప్ప నిరీక్షణ యిస్తున్నది. నా కొరకు ఒకరు మరణించడమే కాదు నన్ను బలపరచి నాకు ఎల్లప్పుడు తోడుగా వుండటం కొరకు మరణాన్ని కూడా జయించి తిరిగి లేవడమనేది ఎంత ఆశాజనకమైన, ఆనందకరమైన భావన!!! చివరగా ఒక్కమాట! భవిష్యత్తుమీద భయంతో, కలవరంతో జీవిస్తున్న ప్రియ మిత్రమా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కోసం పరలోకాన్ని విడచివచ్చి నీ స్థానాన్ని సిలువలో తీసుకొని నీకు బదులుగా మరణించాడు. దేవుడు నీకేం ఇచ్చాడని ఎవరైనా ప్రశ్నిస్తే ‘నా దేవుడు నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు’ అని చెప్పగలగడం ఎంత గొప్ప విషయం. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఇరుక్కొని నిరాశలో జీవిస్తున్నావా? కీడు జరుగుతుందేమోనన్న భయం నిన్ను వేదిస్తుందా? అయితే క్రీస్తు నామాన్ని స్మరించు. మధుమధురమైన ఆయన నామ స్మరణ నీకు అన్ని విషయాల్లో విజయాన్ని ప్రసాదిస్తుంది. మరణాన్ని జయించిన క్రీస్తు సమస్త విషయాల్లో నిన్ను ఆశ్వీరదించగలడు. కీడు నీ పాదాలను తాకకముందే నిన్ను తన కౌగిట్లోకి లాక్కుంటాడు. నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానని చెప్పి నిన్ను ఊరడిస్తాడు. అంతులేని ఆనందంతో తేలియాడతావు. మహోన్నతుడైన దేవుడు నీ పట్ల కలిగియున్న ప్రణాళికలను గుర్తించి పరవశిస్తావు. నిరాశ చీకట్లు తొలగిపోయి ఆధ్యాత్మిక జీవితంలో వెలుగులు విరజిమ్ముతాయి. ప్రతి ఒక్కరికి గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. క్షమాపణ సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు పలికిన మొదటి మాట.‘‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’... ఇది దైవిక క్షమాపణ ఔన్నత్యాన్ని తెలిపే మాట. దేవుడు మనలను క్షమించువాడు. మనిషికి నిజమైన ఆనందం క్షమాపణ ద్వారానే లభిస్తుంది. కొన్నిసార్లు మనిషిచేసిన తప్పులను, పాపాలను సొంత కుటుంబ సభ్యులే క్షమించలేకపోవచ్చు. మానవుని క్షమాపణకు కొన్ని సరిహద్దులుంటాయి. దేవుని క్షమాపణ అవధులు లేనిది. తనను అతి క్రూరంగా హింసించిన వారిని, శ్రమపెట్టిన వారిని సైతం క్షమిస్తున్న ప్రేమ దేవునిది. నీవు దేవుని కుమారుడవైతే సిలువ దిగిరా నిన్ను నమ్ముతాం అనే సవాళ్ళు వినబడుతున్నా...నీవు రాజువట గదా ఈ మాత్రం గౌరవం చాలా? లేక ఇంకా ఎక్కువ కావాలా అనే హేళన మాటలు తూటాలా గుచ్చుకుంటున్న వేళ క్రీస్తు పలికిన ఈ మా మానవ ఊహకు అందనిది. మిమ్మును హింసించువారికోసం ప్రార్థించండి అని తాను చేసిన బోధను ఆచరణలో పెట్టిన ఆయన మనస్సు ఎంత ఉత్తమమైనది. చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో తాము చేస్తున్న ఆధ్యాత్మిక మరియు సాంఘిక కార్యక్రమాలకు కృతజ్ఞత తెలపడానికి బదులు అతి కిరాతకంగా గ్రాహవ్ు స్టెయిన్స్ మరియు ఆయన ఇద్దరు కుమారులను పొట్టన పెట్టుకున్న వ్యక్తులను నేను మనసారా క్షమిస్తున్నాను అని చెప్పిన గ్లాడిస్‌కు స్ఫూర్తి క్రీస్తు సిలువలో పలికిన మాట కాదంటారా? ఒక మనిషిని తోటి మనిషి క్షమించకపోవచ్చు. చట్టాలు, వ్యవస్థలు క్షమించకపోవచ్చు గానీ దేవుని పాదాల చెంతకు వచ్చి ఆ తప్పిదాలను, పాపాలను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. తన శాంతితో, సమాధానంతో నింపుతాడు. రక్షణ సిలువలో క్రీస్తు పలికిన రెండవ మాట ‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు’. ఇది రక్షణ ప్రాముఖ్యతను తెలిపే మాట. కలువరిగిరిపై క్రీస్తు సిలువవేయబడినప్పుడు ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలు వ్రేలాయవేయబడ్డారు. వాస్తవానికి యేసుక్రీస్తు బరబ్బా అనే బందిపోటు స్థానంలో వ్రేలాడవేయబడ్డాడు. ఎడమప్రక్కన సిలువవేయబడినవాడు క్రీస్తును దూషించాడు. అయితే కుడి ప్రక్కన సిలువవేయబడిన దొంగ పశ్చాత్తాపంతో క్రీస్తును వేడుకున్నాడు. మరణం తరువాత మరొక జీవితం ఉందని...ఆ రాజ్యాన్ని క్రీస్తు ప్రభువు ప్రసాదించగలడని నమ్మి యేసూ! నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అంత వేదనలో సైతం అతని పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుకోలుకు శుభకరమైన జవాబిచ్చి... తన పరదైసులో చోటిస్తానని వాగ్దానం చేసాడు. పశ్చాత్తాపపడితే ఎంతటి హీనులనైనా తన అద్భుత రాజ్యంలో చోటుందని ప్రకటించాడు. చుట్టూ ఉన్నవారు ఎంతో సేపటి నుంచి ఏవేవో చేయమని అడిగారు. ఎడమవైపున వ్రేలాడదీయబడినవాడు కూడా రక్షించమని అడిగాడు. వారి ప్రార్థనలకు, విన్నపములకు జవాబు రాకపోవడానికి కారణం అవి హృదయపు లోతుల్లోనుండి వచ్చినవి కావు. ఒక మనిషి చేసే యథార్ధమైన మరియు నిస్వార్థమైన ప్రార్థనలకు క్రీస్తు దగ్గర ఎప్పుడూ ఓ గొప్ప సమాధానం సిద్ధంగా ఉంటుంది. కరడు కట్టిన ఆ వ్యక్తికి క్రీస్తు ప్రభువు వెంటనే రక్షణ ప్రసాదించాడు. అది శరీర సంబంధమైనది కాదు. ఆత్మ రక్షణ ప్రసాదించాడు. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థము. రక్షణ అనగా శిక్ష నుంచి తప్పించబడుట. నశించినదానిని వెదకి రక్షించుటకు తాను ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని యేసు ఆయా సందర్భాల్లో «ధ్రువీకరించాడు. బాధ్యత సిలువలో క్రీస్తు పలికిన మూడవ మాట ‘‘అమ్మా ఇదిగో నీ కుమారుడు! శిష్యునితో ఇదిగో నీ తల్లి’’. ఇది సంబంధ బాంధవ్యాలను తెలిపే మాట. ముదిమి యందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయవద్దు, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేవి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న విశిష్ట సత్యాలు. అంత అధికమైన సిలువ శ్రమలో సైతం తనకు శారీరకంగా జన్మనిచ్చిన తల్లికి ఆదరణ కనుపరచి ఆమె యెడల బాధ్యతను వ్యక్తం చేశాడు. ఎడబాటును తట్టుకోలేక దుఃఖిస్తున్న తన తల్లికి ఆదరణిచ్చాడు. తనకు ప్రాణప్రదంగా ప్రేమించిన శిష్యుణ్ణి అనా«థగా వదలక తన తల్లినే అతనికి తల్లిగా అందించాడు. తనను నమ్మకంగా వెంబడించి, తన చిత్తాన్ని నెరవేర్చేవారిని అనాథలుగా చేయనని వారిని ఆదుకొనే దేవుడనని ఋజువుచేశాడు. తల్లిదండ్రుల ఆస్తులను చేజిక్కించుకొని వారిని నడిరోడ్డుల మీదనో, వృద్ధాశ్రమాల్లోనో విడిచి వారి బాగోగులు పట్టించుకోని మూర్ఖస్వభావులకు క్రీస్తు చూపిన మార్గం ఎంతో గొప్పది. సహవాసం సిలువలో పలికిన నాల్గవ మాట ‘నాదేవా! నాదేవా! నన్నెందుకు చేయి విడిచితివి’. ఈ లోకంలో యేసుక్రీస్తు జీవితం అత్యంత విలక్షణమైనది. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. సిలువమీద శ్రమనంతటిని సంపూర్ణ మానవుడుగా అనుభవించాడు. ఏ బేధము లేదు అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవుచున్నారు. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనిషిని పతనం చేసింది. దేవునిపై తిరుగుబాటు చేయడం ద్వారా మానవుడు ఎడబాటును అనుభవిస్తున్నాడు. అందువలననే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మనిషికి నిత్యానందము లభించుట లేదు. ఆ సందర్భంలో క్రీస్తు సర్వలోక పాపములన్నింటినీ భరిస్తున్నాడు. ఆయన పాపి కాదుగాని మనుష్యులందరి కోసం పాపముగా చేయబడ్డాడు. పాపము ద్వారా ఏర్పడిన భయంకరమైన ఎడబాటు తీవ్రతను క్రీస్తు వ్యక్తం చేశాడు. తండ్రికి తనకు వున్న అన్యోన్యత పాపియైన మానవుని రక్షించే కార్యముతో తెగిపోవుటతో ఎంతో వ్య«థకు గురై తన తండ్రికి తనకు వున్న సంబంధాన్ని, ఆయన చిత్తము చేయుటలో తను చూపించిన ఆ కర్తవ్యాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేయగలిగాడు. దేవునితో సహవాసము కలిగియుండుటకు మానవుడు కోరిక కలిగియుండాలన్న సత్యాన్ని యేసు విశదీకరించాడు. మానవునికి దేవునితో సత్సంబంధం ఎంతో అవసరం. పరమాత్ముని కృప మరియు సహకారం లేకుండా మనిషి ఏమియు చేయలేడు. సహనం సిలువలో క్రీస్తు పలికిన ఐదవ మాట ‘‘దప్పిగొనుచున్నాను’’. సమరయలోని సుఖారు అను గ్రామంలో పాపపు వాంఛ కలిగిన స్త్రీతో యేసు మాట్లాడుతూ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడెన్నడు దప్పిగొనడు అని చెప్పాడు. మరి సిలువలో ఆయకున్న దాహం ఏమిటి? శారీరకంగా యేసుకు దాహం ఉంది. గెత్సెమనే తోటలో ఆయన్ను పట్టుకున్న దగ్గర నుండి ఎంతో భయంకరంగా హింసించారు. యెరూషలేము రోడ్లమీద సిలువను మోస్తూ అతి తీవ్రంగా అలసిపోయాడు. ఆ సమయంలో దాహం సహజమే. అయితే శారీరక దాహం కన్నా యేసులో మరొక దాహం ఉంది. మనుష్యులందరూ పాపపు సంకెళ్ళ నుంచి విడుదల పొందాలనే కోరిక. సమసమాజ నిర్మాణం జరగాలన్న ఆకాంక్ష. మమతాను రాగాలతో ప్రజలంగా వర్ధిల్లాలనే ఆశ. శాపపు కాడి నుండి ప్రతి ఒక్కరూ విడుదల పొంది స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలనే కోరిక. కుల మత వర్గ బేధాలు లేకుండా ప్రజలంతా శాంతి సంతోషాలతో జీవించాలనే తపన. విజయం సిలువలో క్రీస్తు పలికిన ఆరవ మాట ‘సమాప్తమైనది’. అందరూ క్రీస్తు జీవితం సమాప్తమైనదని తలంచారు. లోకరక్షణార్థం తాను చేయాలనుకున్న పుణ్యదానం సమాప్తమైనది. మనుష్యులందరి కోసం దేవుడు తలపెట్టిన నిత్య బలియాగం సంపూర్తి చేయబడింది. సృష్టికర్తయైన తాను ఏ ఉద్దేశంతో సృష్టిగా మారి వచ్చాడో ఆ కార్యం నెరవేరింది. సిలువపై తాను మరణించుట ద్వారా మనిషికున్న దాస్య శృంఖలాలు తెగిపోయాయి. విరోధియైన అపవాది తల చితికిపోయింది. శత్రు బలమంతటి మీద అఖండ విజయం అనుగ్రహించబడింది. మనిషి దుఃఖానికి, నిట్టూర్పులకు ముగింపు లభించింది. గోనెపట్టలు విప్పబడ్డాయి. సంతోష వస్త్రాలు బహుకరించబడ్డాయి. నిర్లక్ష్యం, నిర్లిప్తత తొలగిపోయాయి. ఆనందం సిలువలో క్రీస్తు పలికిన ఏడవ మాట ‘తండ్రి ! నా ఆత్మను నీకప్పగించుకొనుచున్నాను’. దేవుడు మనిషిని ఎంతగా తనకు దగ్గరగా చేర్చుకున్నాడో తెలియచేసే మాట. క్రీస్తునందు విశ్వాసముంచు ఎవ్వరైనా సర్వోన్నతుడైన దేవున్ని తండ్రీ అని సంబోధించవచ్చును. ఇది విడదీయరాని ఓ అనిర్వచనీయమైన బంధం. పన్నెండు సంవత్సరాలు రక్తస్రావరోగంతో బాధపడుచున్న స్త్రీని యేసు కుమారి అని సంబోధించాడు. అది ఆమెకు ఎంతో ఊరటనిచ్చిన పిలుపు. మానవుడు అనగా పైకి కనిపించే శరీరం కాదు. వాస్తవానికి మానవుడు ఆత్మయై యన్నాడు. అతనికి ప్రాణం ఉంది. ఆత్మ, ప్రాణం శరీరంలో నివశిస్తున్నాయి. ఏనాడైనా శరీరం మృతమైతే ఆత్మ నిత్యత్వంలో నిత్యజీవం, నిత్యనరకం అనే రెండు స్థలాల్లో ఏదో ఒక స్థలానికి చేరుకోవాలి. ఈ భూమ్మీద ఉండగానే మానవుడు దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించి ఆయనతో సహవాసం చేస్తే నిత్యత్వంలో ఆయనతో యుగయుగాలు జీవిస్తాడు. ఇది శుభకరమైన నిరీక్షణ. -
జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
సాక్షి, హైదరాబాద్: జీసస్ మహా త్యాగానికి గుర్తు గుడ్ ప్రైడే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘కరుణామయుడైన ఏసు ప్రభువును సిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తర్వాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజూ.. మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలన్నారు. ‘ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం’ అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. -
పెనుతుఫానులో ప్రభువిచ్చిన తర్ఫీదు!
యేసుప్రభువుతో ఆయన శిష్యులు ఒకసారి గలిలయ సముద్రంలో ఒక చిన్నదోనెలో ప్రయాణం చేస్తున్నారు. వాళ్లంతా ప్రభువు శిష్యులుగా మారిన తొలిరోజులవి. అప్పుడొక పెద్దతుఫాను చెలరేగి దోనె నీళ్లతో నిండి, అది మునిగే పరిస్థితి ఏర్పడింది. యేసు మంచి నిద్రలో ఉన్నాడు. అది చూసి శిష్యులు, ప్రభువా మీకు మా గురించి చింత లేదా? మేము నశించిపోతున్నామంటూ గగ్గోలు పెట్టారు. వెంటనే ఆయన లేచి గాలిని, సముద్రాన్ని కూడా గద్దించి పరిస్థితిని అదుపుజేశాడు (మార్కు 4:35–41). దేవుని నమ్మడం అనే ఆత్మీయాంశం చాలా లోతైనది, విశ్వాసికి ఆచరణలో మాత్రమే నేర్పించగలిగిన అంశమది. ప్రభువు వారికిస్తున్న శిక్షణలో భాగమా అన్నట్టుగా, వారి విశ్వాసానికి అదే గలిలయ సముద్ర ప్రయాణంలో ఈ విషమపరీక్ష ఏర్పడింది. మేమంటే మీకు చింత లేదా? అని శిష్యులు ప్రశ్నిస్తే, జవాబుగా అవిశ్వాసులారా!! అని ప్రభువు వారిని గద్దించవచ్చు. కానీ ఆయన వారిని కాక, సముద్రాన్ని, గాలిని గద్దించాడు. నిజానికి అద్దరికి వెళ్లేందుకు ఆ రాత్రి ప్రయాణానికి ప్రభువే వారిని బయలుదేర దీశాడు. ఎందుకంటే ప్రయాణం మధ్యలో దోనె తుఫానులో చిక్కుకున్నా సరే, అది సురక్షితంగా అద్దరికి చేరుతుందని ప్రభువుకు తెలుసు. పైగా అవతలి దరిలోని గెరాసేనీయుల దేశంలో తాను చెయ్యబోయే దైవకార్యాల తాలూకు స్పష్టమైన అవగాహన, ఆ కార్యాలు జరుగుతాయన్న విశ్వాసం ఆయనకుంది. తుఫానులు చెలరేగని జీవితాలంటూ ఉంటాయా? కానీ ఎంత పెద్దదైనా సరే ప్రతి తుఫానూ జీవితాన్ని ముంచేది కాదని కూడా తెలుసుకోవాలి. అప్పటికి శిష్యుల చేతుల్లో బైబిళ్లు లేవు కానీ, ఉండి వుంటే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు, దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అన్న వాగ్దానాలను బైబిల్లో మీరు చదువలేదా? అని యేసుప్రభువు వారిని తప్పక మందలించి ఉండేవాడు. జీవితంలో తుఫానులెదురైనపుడే దేవుడెంత గొప్పవాడో, లోకం ఎంత నికృష్టమైనదో విశ్వాసికి స్పష్టమవుతుంది. ‘తప్పులు చేశావు, అందుకే నీ జీవితంలో ఈ తుఫాను’, నీ తలబిరుసుతనానికి దేవుని తీర్పు ఇది’ లాంటి ఇరుగుపొరుగువారు, సన్నిహితులు, బంధువుల సూటిపోటి మాటలు, వెక్కిరింతలు తుఫాను అలలకన్నా ఉవ్వెత్తున లేస్తాయి. కావాలంటే యోబు గ్రంథాన్ని ఒకసారి చదవండి. ఇతరుల ఈ అయాచిత సలహాలు, వ్యాఖ్యలు తుఫానుకన్నా ఎక్కువ నొప్పిని, నష్టాన్ని విశ్వాసికి కలుగజేస్తాయి. కాకుల్లాంటి ఈ లోకులను పక్కనపెడితే, దేవుడసలు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తే నా జీవితంలో ఈ తుఫానేందుకు? లాంటి ప్రశ్నల తుఫానులు మన అంతరంగంలోనే చెలరేగితే మాత్రం అది మరీ ప్రమాదం. కళ్లెదుట తాటిచెట్టంత ఎత్తున లేచే అలలు, మన జీవితం అనే చిన్న దోనెను అతలాకుతలం చేస్తుంటే, దేవుడు మనల్ని విడువక కాపాడుతాడని నమ్మడానికి అంతకన్నా ఎత్తైన అలలున్న విశ్వాస స్థాయి కావాలి. ఆ స్థాయి విశ్వాసమే దేవునికి మహిమను, మన జీవితంలోకి సాఫల్యాన్ని తెస్తుంది. అందుకు ప్రాథమికంగా కృతజ్ఞత కలిగిన హృదయాన్ని విశ్వాసులు కలిగి వుండాలి. ఆ కృతజ్ఞతాభారితమైన హదయం నుండే వినయం, ప్రార్థన, విశ్వాసం, న్యాయం, ధైర్యం, త్యాగం, ప్రేమ, సంతృప్తి, సంతోషం, సద్భావనల వంటి అన్ని క్రైస్తవ సద్గుణాలూ లోకానికి వెల్లడవుతాయి. మరి మన శక్తికి మించిన విషమ పరిస్థితులనుండి దేవుడు మనల్ని కాపాడినప్పుడే కదా విశ్వాసి హృదయంలో దేవునిపట్ల కృతజ్ఞతాభావం ఏర్పడేది? సముద్రంలో పెద్దతుఫానులో చిక్కిన వారి చిన్న దోనెను కాపాడి, అద్దరికి సురక్షితంగా చేర్చిన వారి బోధకుడు, రక్షకుడైన యేసుప్రభువు శక్తి, ప్రేమ ఆయన శిష్యరికంలో వారికి ఆరోజు అత్యంత అమూల్యమైన తొలి పాఠమయ్యింది. ఫలితంగా వారి హృదయాలు ఆయనపట్ల కృతజ్ఞతాభావనతో నిండి పోయాయి. మీ జీవితాల్లో గతంలో ఏం జరిగినా, ఇప్పుడు ఏమి సంభవిస్తున్నా, భవిష్యత్తులో మాత్రం దేవుడు మీకివ్వబోయే విజయాలను, ఆశీర్వాదాలను ఆపగలిగే శక్తి ఆ పరిణామాలకు, ప్రతికూలతలకు లేదన్న ‘స్థిరభావన’ కృతజ్ఞత కలిగిన హృదయంనుండే వెలువడుతుంది. క్రీస్తుప్రేమ నుండి విశ్వాసిని ఎడబాపగల శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదన్నది దేవుని అత్యంత స్పష్టమైన, ప్రేమామయమైన అభయం (రోమా 8;35). అది అర్థమయ్యేందుకు ఇలాంటి తుఫానులు, వాటి మధ్యలో దేవుని వైపే చూడగల స్థిరమైన విశ్వాసం, ఆ దేవునిపట్ల కృతజ్ఞతాభావం తప్పక కావాలి. ఈ అపొస్తలులంతా సువార్తను భూదిగంతాలకు తీసుకెళ్లి దేవునికోసం హతసాక్షులైనపుడు, భయంకరమైన శ్రమలు అలల్లాగా కాదు ఉప్పెనలా వారిమీద విరుచుకుపడ్డాయి. అయినా బెదరకుండా చిరునవ్వుతో, క్షమాప్రార్థనలతో వారు ఉరికంబాలెక్కారు. యేసుప్రభువిచ్చిన ఈ శిక్షణే దానికి కారణం! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
పరిశుద్ధాత్మశక్తిలో ఐక్యత, పరిపూర్ణత...
‘మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు, అపుడు యెరూషలేములో, యూదయ, సమరయ దేశాల్లో, పిదప భూదిగంతాల దాకా మీరు నాకు సాక్షులై ఉంటారు’ అన్నది ఆదిమ అపొస్తలులకు, విశ్వాసులకు యేసుప్రభువు తన ఆరోహణానికి ముందు చేసిన వాగ్దానం(అపో.కా 1:8). యెరూషలేములో పెంతేకొస్తు నాడు మేడగదిలో ఆరంభమైన చర్చి అతి త్వరలోనే బాగా వ్యాప్తి చెందింది. అయితే ఉన్నట్టుండి చర్చి శ్రమలకు లోనైంది. క్రైస్తవం వ్యాప్తిని అడ్డుకోవాలన్న కంకణం కట్టుకున్న సౌలు అనే యూదు మతచాందసుడు, పరిసయ్యుడు, స్తెఫను అనే చర్చి పరిచారకుణ్ణి, దైవదూషకుడన్న నేరారోపణపై దగ్గరుండి మరీ రాళ్లు రువ్వించి చంపించాడు. యెరూషలేములోని చర్చికి, అక్కడి విశ్వాసులకు ‘పరిశుద్ధాత్మ శక్తి’ ఎలా ఉంటుందో, అసలదేమిటో అప్పుడర్ధమైంది. అద్భుతాలు చేసే శక్తిని మాత్రమే కాదు, ఆనందంగా ప్రభువు కోసం హత సాక్షి అయ్యే శక్తిని కూడా ఆ పరిశుద్ధాత్ముడే ఇస్తాడని, అది పరిశుద్ధాత్మశక్తిలో అంతర్భాగమని స్తెఫను మరణంతో చర్చికి అర్థమయింది, చర్చిని అందుకు సిద్ధపర్చింది కూడా !!! ఎందుకంటే తగాదాల్లో తలలు నరకడానికి అవసరమయ్యే శక్తి కన్నా వెయ్యిరెట్ల ఎక్కువ శక్తి మంచికోసం పాటుపడేందుకు, పదిమందికీ సాయం చేసేందుకు, ముఖ్యంగా ప్రభువు కోసం శ్రమపడేందుకు, ప్రాణత్యాగం చేసేందుకు కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అనే నాణేనికి భాషల్లో మాట్లాడటం, అద్భుతాలు చెయ్యడం ఒక వైపైతే, శ్రమలు అనుభవించడం దానికి మరో వైపు. ఇందులో ఒకటి మాత్రం కావాలి, మరొకటి నాకొద్దు అనుకోవడానికి వీలు లేదు. నిజమైన పరిచారకుని జీవితంలో అద్భుతాలుంటాయి, శ్రమలు కూడా ఉంటాయి. ఆ శ్రమల కారణంగా యెరూషలేము చర్చి, విశ్వాసులు పలు ప్రాంతాలకు చెదిరిపోయి, ఆయా కొత్తప్రాంతాల్లో క్రైస్తవాన్ని ప్రకటించి పలు కొత్త చర్చిలు స్థాపించారు. ప్రపంచం నలుమూలలకు చర్చి వ్యాప్తి చెందేందుకు దేవుడు వాడుకున్న ఒక విధానం శ్రమలు. అలా చెదిరిపోయిన విశ్వాసులు యెరూషలేము చర్చి పరిచారకుడైన ఫిలిప్పు నాయకత్వంలో, నాటి దేవుని వాగ్దానం మేరకు సువార్త వ్యాప్తి కోసం సమరయ ప్రాంతానికి వెళ్లారు. సమరయలో ఫిలిప్పు ఎంత అద్భుతంగా, విజయవంతంగా సేవ చేశాడంటే ఆయనకు సహాయంగా యెరూషలేము చర్చి పేతురును, యోహానును కూడా సమరయకు పంపగా, వారందరి సేవతో సమరయలో చర్చి అక్కడ గొప్పగా విస్తరించింది. వాళ్ళు ఎవరి మీద చేతులుంచితే వారిమీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. మహా గొప్ప కార్యాలు అక్కడ జరిగాయి. అసలు అపొస్తలులు సమరయకు వెళ్లడమే పరిశుద్ధాత్ముడు చేసిన ఒక గొప్ప అద్భుతం. ఎందుకంటే, ఒకే దేవుణ్ణి విశ్వసించేవారైనా సమరయులు యూదులకు అంటరాని వారు, వాళ్ళ మధ్య వందల ఏళ్లుగా సైద్ధాంతిక విభేదాలున్నాయి, ఆత్మీయంగా ఎంతో వైరముంది. అయినా ఆ విభేదాలను అధిగమించి అంటరానివారిని కూడా తమకు ఆప్తులైన వారుగా పరిగణించే అవగాహనను, ప్రేమను పరిశుద్ధాత్ముడు అపొస్తలులలో, ఆదిమ విశ్వాసుల్లో రగిలించాడు. వారికి సువార్త ప్రకటించి యేసుప్రభువులో అంతా సమానమేనని వారు ప్రకటించారు. పోతే అంతకుమునుపు అక్కడ సీమోను అనే గారడీవాడు తన కనికట్టువిద్యలతో అందరినీ భ్రమింపజేస్తూ బోలెడు పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. అయితే తన కార్యాలకు మించిన కార్యాలు అపొస్తలుల పరిశుద్ధాత్మ శక్తితో జరుగుతున్నాయని చూసి, ముందు వారితో కలిసి తిరిగాడు. ఆ తర్వాత కొంత ద్రవ్యాన్ని వారికివ్వజూపి తాను కూడా పరిశుద్ధాత్మశక్తి ని పొందేలా చెయ్యమని కోరితే అపొస్తలులు అతన్ని తీవ్రంగా మందలించారు. మతాసక్తి, ధన సంబంధమైన దురాశ కలిసైనా నకిలీ పరిచారకులకు గారడీవాడైన సీమోను ఒక ఉదాహరణ. అయితే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తితో సీమోనులాంటి వారి కుతంత్రాలను తిప్పి కొట్టారు. అదే పరిశుద్ధాత్మ శక్తి అంటే!! అన్ని అంతరాలను, విభేదాలను, అడ్డుగోడలనూ ఆ శక్తి కూల్చేస్తుంది. అన్ని కుతంత్రాలనూ అది తిప్పి కొడుతుంది. ఇప్పుడు కూడా ఎవరైనా ‘మా చర్చే మంచిది, మాదే నిజమైనది’ అన్నట్టుగా మాట్లాడుతున్నా,వ్యవహరిస్తున్నా, వారికి పరిశుద్ధాత్మశక్తికి చెందిన వాస్తవాలు అర్థం కాలేదన్నది ఈ పరిణామాలను బట్టి తెలుస్తుంది. విడిపోవడానికి వంద కారణాలున్నా, అందరమూ ఆరాధించే దేవుడు యేసే అన్న ఒక్క కారణాన్ని బట్టి కలిసుండాలంటాడు పరిశుద్ధాత్ముడు. విభేదాలేర్పడి విడిపోవడం కన్నా, విడిపోవాలనుకొని విభేదాలు వెదుక్కునే ధోరణి, ధనార్జన కోసం ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకొనే స్వార్థం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అందుకే దేవుడొక్కడే అని చాటే క్రైస్తవంలో ఈనాడు ఇన్ని వర్గాలు, శాఖలు, ఇన్నిన్ని సిద్ధాంతాలు అన్న అపవాదు!! పరిశుద్ధాత్మునిలో ఐక్యతే ఉంటుంది తప్ప అనైక్యత ఉండదు, బీదా, గొప్ప, చిన్న, పెద్ద అన్న తారతమ్యాలుండవు (అపో.కా.1.8 అధ్యాయాలు). ఒకవేళ తప్పక అవసరార్థం విడిపోయినా వారి మధ్య వైషమ్యానికి తావు లేదు. శత్రువులను కూడా ప్రేమించాలన్న దేవుడు, సైద్ధాంతిక విభేదాలతో పక్క చర్చివాళ్లను ద్వేషించమని చెబుతాడా? – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ Email: prabhukirant@gmail.com -
దీనులకోసం యేసు కొండమీది ప్రసంగం
కష్టాలు, కన్నీళ్లు, ఓటములు, భరించలేని బాధల ‘లోయల్లో’ నలుగుతున్న ఎంతోమంది అభాగ్యుల సాంత్వన, ఆదరణ కోసం యేసుప్రభువు ‘కొండమీద’ ప్రసంగం చేశారు(మత్తయి 5–7 అధ్యాయాలు). ఆత్మలో దీనులు, దుఃఖపడేవారు, సాత్వికులు, నీతిని ప్రేమించేవారు, నీతికోసం హింసించబడేవారు, కనికరం గలవారు హృదయ శుద్ధిగలవారు, సమాధానపర్చేవారు ధన్యులు అంటూ ఎంతో విలక్షణంగా ఆరంభమై ఆత్మీయంగా అత్యంత విప్లవాత్మకంగా సాగిన ఆయన ప్రసంగం విన్న తర్వాత బోలెడు జనసమూహం ఆయన్ను వెంబడించారు కాని, వారిలో కేవలం ఒక కుష్టురోగి మాత్రమే ఆయనకు మొక్కి తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నాడు (8:1,2). కుష్టురోగం మనిషిని నిలువెల్లా గుల్ల చేసి, రసి కారే దుర్గంధపూరితమైన గాయాలతో నింపి అతన్ని వికృతంగా మార్చితే, సమాజం అతన్ని వెలివేసింది. కాని యేసుప్రభువు మాత్రం అతన్ని రోగవిముక్తుని చేసి అక్కున చేర్చుకున్నాడు. తాను బోధించేవాడిని మాత్రమే కాదని, తన బోధల్ని జీవితంలో ఆచరించి చూపిస్తానని ప్రభువలా రుజువు చేసుకున్నాడు. నా మాటలు వినే వాడు కాదు, విని వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతుడన్న తన ప్రసంగవ్యాఖ్యల్ని తన ప్రేమభరితమైన చర్యతో ఆచరించి చూపించాడు( 7:24)దేవుడు తన ధర్మాన్ని, విధివిధానాలను యూదులద్వారా లోకానికి అందించినా, అవి యూదులకే కాదు మొత్తం మానవాళికోసం నిర్దేశించినవని రుజువు చేస్తూ, తాను ప్రసంగించిన వెంటనే అన్యుడు, గ్రీసు దేశస్థుడైన ఒక శతాధిపతి కుటుంబంలో యేసుప్రభువు ఒక అద్భుతం చేశాడు. స్త్రీని ఏవగించుకొని ఎంతో చిన్నచూపు చూసే నాటి యూదు సమాజంలో, రోగపీడితురాలై మంచానికి అంటుకు పోయిన పేతురు అత్తగారిని కూడా ఆ వెంటనే బాగుపర్చి ‘సర్వమానవ సమానత్వాన్ని’ చాటిచెప్పాడు(మత్తయి 8 వ అధ్యాయం) . లోకంలో ఎంతో సులభమైన పని బోధించడం, కాని చాలా క్లిష్టమైన విషయం వాటిని ఆచరించి చూపించడం. యేసుప్రభువు మాత్రం ఆ పనిని అవలీలగా చేసి తన బోధలు సంపూర్ణంగా ఆచరణీయమైనవని రుజువు చేశాడు. అయితే ఆ రోజు ఆయన కొండమీది ప్రసంగం విన్న చాలామంది ఎంతో కలవరంతో తమ ఇళ్లకు వెళ్లారు. దేవుడు తన ధర్మాన్ని తన ప్రజలకందిస్తే, శాస్త్రులు, పరిసయ్యులు వాటిని ‘చేయకూడని, చేయదగిన నియమావళి’ తో కూడిన ఒక శాస్త్రంగా దాన్ని మార్చి, దాని వెనుక ఉన్న ‘దేవుని హృదయాన్ని’ విస్మరించారు. ధర్మశాస్త్రాన్ని అక్షరాలా ఆచరిస్తే చాలు పరలోకానికి వెళ్తామన్న నాటి పరిసయ్యులు, ఉపదేశకుల బోధలు విని అలా చేస్తూ తాము చాలా నీతిమంతులమన్న భావనతో ఉన్నవారి ఆశలన్నింటినీ యేసు ప్రసంగం వమ్ము చేసింది. అలాగే, తన సహోదరుని ద్వేషించేవాడు కూడా నరహంతకునితో సమానమేనన్న నాటి యేసు బోధ వారిని కలవరపరిచింది (5:21–25). పరస్త్రీతో శయనిస్తే అది వ్యభిచారమని ధర్మశాస్త్రం చెబుతుండగా, అలా కాదు పరస్త్రీని మోహపు చూపుతో చూసినా అది వ్యభిచారమేనని ప్రభువు అన్నాడు. ఆదిమ ధర్మశాస్త్రపు పరిధిని అలా విస్తరిస్తూ యేసు చేసిన కొండమీది ప్రసంగం నాటి ప్రజల్లో కలవరాన్ని రేపి ఆత్మావలోకనానికి పురికొల్పింది. పరలోకానికి చాలా దగ్గర్లో ఉన్నామనుకున్న చాలామంది నిజానికి దానికి తామెంత దూరంలో ఉన్నామో ఆ రోజు గ్రహించారు. మనవల్ల లోకంలో ఎంత సంతోషం, శాంతి, సోదరభావం నెలకొన్నది, ఎంతమంది అభాగ్యుల కన్నీళ్లు మనం తుడిచామన్నదే దేవుణ్ణి ప్రసన్నుని చేసే ప్రధానాంశం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఆయన వారిని అమ్మా అని పిలిచాడు
క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేసింది స్త్రీలే. క్రీస్తు బోధలనీ, క్రీస్తు దైవత్వాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ స్త్రీలే. క్రైస్తవంలో స్త్రీలకు గుర్తించదగ్గ స్వేచ్చ ఉంది. కారణం క్రీస్తు బ్రతికున్న రోజుల్లో స్త్రీల మధ్యన ఎక్కువగా పరిచర్య చేయడం. పురుషాధిక్యత ఉన్న యూదా జాతిలో కన్యక అయిన మరియ అనే స్త్రీ, క్రీస్తును కనడానికి ముందుకొచ్చింది. క్రీస్తుకు తల్లిగా మారేందుకు తనని తాను తగ్గించుకుని గాబ్రియేల్ అనే దూత చెప్పినట్టు విన్నది. దేవునికి లోబడతానని తన విధేయతతో ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. యోసేపుకు ప్రధానం చేయబడ్డ ఆమెను, ఒకానొక సమయంలో అవమాన భారం వల్ల యోసేపే వదిలేయాలనుకున్నాడు. అయినా లేఖనాలలో రాయబడ్డట్టు జరిగేందుకు తన సమ్మతిని తెలియజేయడమే కాదు ఆమె అన్ని పరిస్థితులలో దృఢనిశ్చయంతో ఉంది. పురుషాధిక్యత గల యూదా సమాజంలో పురుషులతో స్త్రీలు బహిరంగంగా మాట్లాడడం నిషేధం. క్రీస్తు మగ్ధలేన అనే ప్రాంతానికి చెందిన స్త్రీని దోపిడీగాళ్ల చేతులలో నుండి విడిపిస్తాడు. అప్పటినుంచి మగ్ధలేన మరియ క్రీస్తుతో పాటే ఉంది. క్రీస్తు పరిచర్యలో తనవంతు పాత్రను పోషించింది. క్రీస్తు పరిచర్య చేస్తూ వెళ్ళిన ప్రాంతాల్లో స్త్రీలను సమావేశపరుస్తూ, క్రీస్తును గురించి అనేకులకి చెబుతూ క్రీస్తు కోసం సాక్షిగా నిలబడింది. ఆమె క్రీస్తును ఎంతగా ఆరాధించిందంటే.. క్రీస్తు సిలువ వేయబడిన మూడోరోజున ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయడానికి తనతోపాటు మరికొందరు స్త్రీలను తీసుకుని పొద్దు పొడవకముందే సమాధి దగ్గరకు చేరుకుంది. సమాధిలో క్రీస్తు కనపడలేదని భయపడింది. దేవదూత ద్వారా ఆయన పునరుత్థానాన్ని గురించి తెలుసుకుని, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తా ఆమే మొదటగా చేరవేసింది. క్రీస్తును తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుని, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ గృహంలో ఆతిథ్యం ఇచ్చారు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వాళ్లు మార్త, మరియలు. క్రీస్తు బేతనియకి వచ్చినప్పుడల్లా వాళ్ళింట్లో బస చేసే వాడు. వారి సహోదరుడు లాజరుతో క్రీస్తుకు మంచి స్నేహం. క్రీస్తు చెప్పే మాటలు వినడానికి వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవాళ్లు. ఒకానొక సమయంలో లాజరు అకారణంగా చనిపోయాడు. క్రీస్తు మూడు రోజులయ్యాక ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆయనకీ విషయాన్ని తెలియజేస్తారు. లాజరును తిరిగి బతికిస్తాడు క్రీస్తు. ఇక అప్పటినుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రీస్తును ఘనపరిచి ఆయన ప్రేమ తత్వాన్ని ప్రచారంచేసారు. సమరయులు యూదులకన్నా జాతి పరంగా చిన్న వాళ్లు. క్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో సమరయ గ్రామాల వైపు వెళ్తూ వాళ్లకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ఒకానొక సమయంలో ఒక సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమయంలో క్రీస్తు అటుగా వెళ్లాడు. తాగడానికి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె యూదుడైన క్రీస్తు తనని నీళ్లడగటం చూసి తన గతాన్ని చూసి క్రీస్తు తనని అసహ్యించుకుంటాడని భయపడింది. కాని క్రీస్తు ఆమెకి బుద్ధి వాక్యాన్ని బోధించాడు. తాను క్రీస్తు అనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేసాడు. ఆమె పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్ళింది. క్రీస్తు గురించి ఊరంతా తెలిసేలా ఆయన కోసం గొప్ప సాక్షిగా మారింది. పన్నెండు ఏళ్ళుగా రక్తస్రావం ఆగక బాధపడుతున్న ఓ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. యేసు ప్రభువు తనకి స్వస్థతనివ్వాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. కలవాలి. కాని అంతమంది జనంలో ఆమె ఆయన దగ్గర ఆయన దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అని అనుకుంది. అలాగే చేసింది. వెంటనే రోగం బాగైంది. ఓ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని జనాలు రాళ్లు పట్టుకుని తరుముతూ వచ్చారు. ఆమె మీద రాళ్లు విసురుతున్నారు. ఇక ఆమెని చంపటమే తరువాయి. క్రీస్తు ఆమె దగ్గరకి వెళ్లి పడిపోయిన ఆమెని లేపాడు. రాళ్లు పట్టుకున్న వాళ్లను వారించాడు.పాపం చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయాలన్నాడు. అందరి పాపాలను నేల మీద రాయటం మొదలు పెట్టాడు. అంతే! అందరు ఎవరి పాపాలను వారు చూసుకుని భయపడి రాయి వదిలేసి పారిపోయారు. యేసు క్రీస్తు ఆ స్త్రీ దగ్గరకెళ్ళి ‘‘అమ్మా నీ మీద రాళ్ళేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు లేరు. ఇక వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని ఆమెని విముక్తురాలిని చేసాడు. క్రీస్తు స్త్రీలందరినీ అమ్మా అనే పిలిచాడు. ఒకానొక సమయంలో మరియ అనే ఒక స్త్రీ, క్రీస్తు పరిసయ్యుల ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు బుడ్డి తెచ్చి అతని తల మీద పోసింది. శేరున్నర అత్తరు ఆమె జీవిత కాలం సంపాదించిన డబ్బుతో కొనినదైయుంటుంది. ఆమె తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఆమె చేసిన పని ఎంత గొప్పదో క్రీస్తు చెప్తూ ఆమె ప్రేమ ఎంత గొప్పదో అందుకే అంత గొప్పగా ఆయన్ని సన్మానించుకుందని చెప్తాడు. అది క్రీస్తు వల్ల తన జీవితంలో జరిగిన గొప్ప మేలు వల్ల కావచ్చు లేదా క్రీస్తు మీద తనకున్న వల్లమాలిన ప్రేమ కావచ్చు. యేసు క్రీస్తు పుట్టినప్పుడు అన్నా అనే ప్రవక్తి క్రీస్తును దేవాలయంలో చూసింది. ఆయన పుట్టుక గురించిన ప్రవచనం తనకి ముందే తెలుసునని, క్రీస్తుని చూడడానికే అంత ముదుసలిదైన తాను బతికే ఉందని చెప్తుంది. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకుని శుభవచనాలు పలుకుతూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది స్త్రీలకు క్రీస్తు చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆయనకు స్త్రీ పురుష భేదం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. ఆయన తనలోని మాతృత్వాన్ని ప్రేమగా చూపించడంవల్లే చాలామంది స్త్రీలు పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలనైనా, ఎలాంటి స్త్రీలు తన దగ్గరకి వచ్చినా ఆయన వాళ్లని ‘అమ్మా’ అని సంబోధించేవాడు. క్రీస్తు తత్వమే ఆయనని చాలామంది ఆత్మీయుడిగా చేసింది. ఆ స్త్రీలందరూ ఆయనని ఘనపరిచి అనేకులకి ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన ప్రేమకి సాక్షులుగా నిలుచున్నారు. - మెర్సీ మార్గరెట్ -
క్రీస్తు నడిచిన దారులలో
అనంతమైన ప్రేమను పంచడానికి ఏసు తన శరీరాన్ని రక్తసిక్తం చేసుకున్నాడు. సత్యమార్గం బోధించడానికి ఏసు తన భుజంపై శిలువ మోశాడు. కష్టతరమైన మార్గం ఆవల అగ్ని కంటే స్వచ్ఛమైన జీవనం మనిషిని వెలిగించును అని బోధించాడు. ఆస్తి అడగలేదు... క్షమను అడిగాడు. బంగారం అడగలేదు... కరుణ అడిగాడు.నీ నుంచి నీ దేహభాగాలను అడగలేదు... కేవలం పొరుగువారిని ప్రేమించమన్నాడు. తాత్కాలిక భోగలాలస దుఃఖహేతువు. నీ నడవడిక బలిమి పరలోకానికి సేతువు. క్రీస్తుమార్గం నిజమనిషి మార్గం. ప్రతి మానవుని మార్గం. ఏ మతమైనా మంచితనం, ప్రేమ, దయ, ఉన్నతమైన గుణాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది. ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషిలోనూ ఉండాలని బోధిస్తుంది. తద్వారా లోకమంతా ప్రశాంతంగా, హాయిగా ఉండాలని ఆకాంక్షిస్తుంది. మనిషి మతం నుంచి అనుక్షణం ఎంత వీలైతే అంత మంచిని ఎరుకతో గ్రహించి తీసుకుంటూ ఉండాలి. దృష్టిని చెదరనీక ముక్కుసూటిగా వెళుతూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించాలి. ప్రయాసపడాలి. మతానికి తాను వెలుతురు కావాలిగాని తన స్వార్థానికి మతాన్ని వెలుతురుగా మార్చుకొనరాదు.క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు ఎల్లప్పుడూ బోధించే ప్రేమతత్వం, క్షమాగుణం గురించి ఈరోజు గుర్తు చేసుకోవడం ఆనందమే కాదు అవసరం కూడా.మనిషి సహజంగానే ఆశాజీవి. అతడు తనకెప్పుడూ మంచి జరగాలని తన జన్మకు జీవునికి ఒక ప్రయోజనం కలగాలని ఆశిస్తూ ఉంటాడు. అతడికి వచ్చేది ఏదీ లేకపోతే తాను ఏదీ ఇవ్వడు. ఇదే తీరులో పరలోక ప్రవేశానికి కూడా అతడు ప్రయత్నిస్తాడు. మనిషి లక్ష్యం ఎప్పుడూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలనే ఉంటుంది. మనిషి తన జీవనంలో ఏ మంచి చేసినా క్రీస్తు నామమందు ఏ పనిలో లగ్నమైనా అతని దృష్టి సదా పరలోక రాజ్యంపైనే ఉంటుంది. ఎందుకంటే భూమిపై జీవితం అశాశ్వతం. పరలోక జీవనమే శాశ్వతం. అలా అని ఆరాధకుడు భావిస్తాడు. అయితే పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం. ఇవన్నీ చేయాలంటే మనిషికి కష్టంగా ఉంటుంది. దానికి బదులు తేలికైనది, సులభమైనది అయిన దేవుడిని కీర్తించడం ద్వారా మనిషి తన పని సులవవుతుందని భావించడంలో అతడి అల్పత్వం, స్వార్థం బయట పడుతుంటుంది. తోబుట్టువుపై పగ, ద్వేషం పెట్టుకుని క్షమించడం రాక, మనసులో ఈర్ష్య పెట్టుకుని పొరుగింటివారిని హత్తుకోవడం రాక రెండు గంటలు మోకాళ్ల మీద దేవుని కన్నీటి ప్రార్థనలు చేయడం లాభదాయకం అన్న ఆలోచన ఎంత వరకు సమంజసం అన్నది ఆలోచించాలి. అలా చేస్తే నిజంగానే పరలోకం అనేది ఉంటే దాని ప్రవేశం కలుగుతుందా? ప్రభువు చెప్పిన శాంతిని మనం పెంపొందుతుందా? నిజమైన శాంతి క్షమాపణలో ఉంటుంది అని మనమంతా గ్రహించాలి. అప్పుడే మనం కరుణా హృదయులుగా క్రీస్తులో విరాజిల్లుతాం. క్రీస్తు చెప్పే ఎన్నో మంచి విషయాలను మనం పుస్తకాల ద్వారా ప్రసంగాల ద్వారా ప్రార్థనా కూటముల ద్వారా వింటున్నాం. ఆ సమయంలో ప్రభావితం అవుతాం. అయితే ఆ ప్రభావాన్ని ఘనంగా నిలబెట్టుకోవడంలోనే విఫలమవుతూ ఉంటాం. దైవం మనిషి రూపం ధరించి సాధించినది మనిషి జన్మ ఎత్తిన మనకు సాధ్యం కాకుండా పోతుందా? క్రీస్తు చెప్పేది చేసేది ఎప్పుడూ ఆత్మపరిశీలన గురించే. నిన్ను నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావు... తోటివారితో ఎంత స్వచ్ఛంగా ఉంటున్నావు అన్నదే క్రీస్తు బోధనల్లో ప్రధాన విషయం. క్రీస్తు చెప్పే ప్రతి అంశంలోనూ ప్రేమ, సమానత్వం ఉంటుంది. ‘నీ దగ్గరకు నేను బిచ్చగాని రూపంలో వస్తాను’ అంటాడు. అంటే ఒక అవసరం కోసం ఎదురు చూసేవారిలో తాను ఉంటానని, వారిని దేవునిలా ఆదరించమని అందులో ధ్వని. మనం ఒకరికి సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కచ్చితంగా మనం ఆ సహాయం చేయాలి. మంచిని పెంచాలి. క్రీస్తు ఖరీదైన బట్టలకు వెంపర్లాడటం అటుంచి ఎక్కువ మోతాదులో బట్టలూ ధరించలేదు. రుచుల కోసం వెంపర్లాడలేదు. రక్తమోడుతున్న క్రీస్తే మనకు తెలుసు. క్రీస్తు వరాలు ఇవ్వడు. నీ జీవితాన్ని నువ్వే నిలబెట్టుకొమ్మని ఆశ, బలం ఇస్తాడు. నీ జీవితం నీ చేతుల్లో ఉందని మనకి గుర్తు చేస్తూనే నీకు ఆత్మస్థైర్యం ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా సాధించగలవని భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తాడు. బైబిల్ని చేత ధరించడంతోపాటు దానిని హృదయంలో దింపుకోవడంలోనే మనిషి వెలుతురువైపు ప్రయాణించడం ఉంటుంది. నిజానికి బైబిల్ గొప్ప కౌన్సెలర్. మన నడవడికను గురించి ఈ కాలానికీ అవసరమైన సంస్కరణను చక్కగా సూచిస్తుంది. ఎంతో మధురమైన వాక్యాలను బోధిస్తుంది. వాటిని బట్టీ పట్టడంతో పాటు అర్థం చేసుకొని ఎదగడం కూడా మనం చేయాలి. తనను తాను చిన్న బిడ్డగా మార్చుకొని మార్పు పొంది తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని చెప్తుంది బైబిల్. ఇలా ఉన్నవారిని ఎవరైనా అభ్యంతరపరిస్తే వారి మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట తథ్యమని మనల్ని ఒక భయానికి గురి చేసైనా మంచిని పెంపొందిస్తుంది. ప్రేమ, క్షమాగుణం కలిగి, తల్లిదండ్రులను ప్రేమించడం అనే లక్షణాన్ని కలిగి ఉండటాన్నే అసలైన ఆస్తిగా బోధిస్తాడు క్రీస్తు. దానికి మించి మన దగ్గర ఉన్న ఇతర ఆస్తులను పేదలకు ఇచ్చేయమంటాడు.అప్పుడే నీకు పరలోకంలో జీవం ఉందంటాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్తాడు. రేపటి కోసం ఆస్తులు పోగు చేసుకోవద్దని చెప్పాడు.ఈరోజుకోసం తిండీ గుడ్డా ఉంటే చాలన్నాడు. ఎందుకంటే ఆహార్యం కంటే దేహం గొప్పదన్నవాడు క్రీస్తు. ఈ ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రక్రియ ఉంటేనే శాంతి, సమాధానం, మంచి గుణం బతికుంటుందని క్రీస్తు తత్వం చెబుతున్నాడని అర్థమవుతుంది. అదే క్రమంలో ప్రేమ దేవుని మూలంగా కలుగతున్నది. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు మన కోసం సిలువేసుకోవడంలోనే అమితమైన ప్రేమ ఉంది అంటుంది బైబిల్. సమస్త లోకాన్ని ప్రేమతో నింపమంటుంది. ఇలా సకలం ప్రేమమయం కావాలంటే నీలో ముందు వంచన ఉండకూడదు. నువ్వు ఒకరిపై తీర్పులకు సిద్ధమైనప్పుడు నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోక నీ సహోదరుడి కంట్లోని నలుసుని ఎందుకు చూస్తున్నావంటాడు యేసు. క్రీస్తు రెండవ రాకడకు మనల్ని సిద్ధం చేస్తాడు దేవుడు. క్రీస్తు పరిశుద్ధ ఆత్మ అయి మళ్లీ ఈ భూమ్మీదకు రెండవసారి వచ్చేసరికి మనం సంసిద్ధంగా ఉండాలంటాడు. అంటే ధర్మశాస్త్రం చెప్పిన ఆశయాలను అనుసరించాలి అని అర్థం. మంచి వారిని దేవుడు పరలోకానికి తీసుకువెళతాడన్న చెడ్డవారిని ఇక్కడే వదిలేస్తాడన్న భయమే మనల్ని మంచితనంలోకి నడిపించాలి. అయితే మనం ఎంతవరకూ భయపడుతున్నాం అన్నది మనకు తెలియాలి. ఈరోజు మనిషి తమ జీవితాన్ని నిజంగా క్రీస్తు చెప్పిన తత్త్వంతో నింపుకున్నాడా లేదా అనేది తరచి చూసుకోవాలి. పరలోక రాజ్యానికై ఎదురు చూడటం కంటే నిజంగా అందుకు యోగ్యులుగా మారే లక్షణాల సాధన కోసం శ్రద్ధ పెట్టే సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే క్రీస్తులానే జీవించేవాడు క్రైస్తవుడు. వాడు నిజమైన మానవుడు. హ్యాపీ క్రిస్మస్. పరలోక రాజ్యం ఊరికే వస్తుందా? ఇందుకు రెండు ముఖ్యమైన కార్యాలు చేస్తుండాలి. ఒకటి ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ, ఆయన్ని ఆరాధిస్తుండాలి. మరొకటి ఆయన సూచించిన మార్గాలలో జీవితాలను గడపాలి. ఆ మార్గాలు: అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వకూడదు.. తల్లిదండ్రులను సన్మానించాలి.. వ్యభిచరించకూడదు.. దొంగిలించకూడదు... నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి... క్షమాగుణం కలిగి ఉండాలి... ఇవన్నీ మన జీవితాల్లో ప్రతినిత్యం అనుసరిస్తూ ఉంటే పరలోక రాజ్యం సాధ్యం. ∙మానస ఎండ్లూరి -
సాధారణత, సాత్వికతలే విశ్వాసి ఆభరణాలు
నిశ్శబ్దంగా ప్రార్థనలు సాగుతున్న చర్చిలో అతని సెల్‌ఫోన్ పొరపాటున మోగింది. పాస్టర్ కోప్పడ్డాడు, విశ్వాసులంతా అతన్ని వింతజీవిలాగా చూశారు, భార్యాపిల్లలు కూడా విసుక్కున్నారు. అతను ఇక ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు. సంయమనం, క్షమాపణ, పరస్పర గౌరవం, ప్రేమ, మృదుభాష్యం, సహకారధోరణి, సత్స్పందన, సహృదయం ఇవన్నీ విశ్వాసులు, చర్చిల్లో విధిగా ఉండాలన్నది యేసు బోధ, అభిమతం, జీవితం కూడా. వాటినే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు సొంతం చేసుకొని స్వలాభం కోసం బ్రహ్మాండంగా వాడుకొంటున్నారు. పరిసయ్యులు, అంటే ధర్మశాస్త్రాన్ని ఆమూలాగ్రం చదివి దానికి భాష్యం చెప్పే మతపెద్దల జీవనశైలి ఆరోజుల్లో అత్యున్నతమైన విలువలతో నిండి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాని వారు దైవప్రతినిధులుగా కంటే, దేవునికి తామే మారుపేర్లమన్నట్లు నిరక్షరాస్యులను, సామాన్యులను, నిరుపేదలను పురుగుల కన్నా హీనంగా చూసేవారు. అందుకే బలహీనులు, నిరుపేదలు, నిరాశ్రయులతో మమేకమై జీవించిన యేసు ‘వారు మీతో చెప్పినట్టు చెయ్యండి, కాని వారు చేసినట్టు చెయ్యకండి. మోయలేనంత భారాన్ని వాళ్ళు మీ భుజాలమీద పెడతారు, కాని తమ వేలితోనైనా దాన్ని వారు కదిలించరు’ అంటూ శాస్త్రులు, పరిసయ్యుల నీతిని ఎండగట్టాడు (మత్త23:3.4). వారి నీతికంటె మీ నీతి ఉన్నతంగా లేకపోతే మీరు పరలోకరాజ్యంలో ప్రవేశించరని ఆయన సాధారణ విశ్వాసులను హెచ్చరించాడు (మత్త 5:20). క్రీస్తు జీవితంలో, బోధల్లో ప్రతిధ్వనించిన, పరిమళించిన సోదరప్రేమ, సుహృద్భావం, క్షమాపణ, మృదుభాష్యం, సాత్వికత్వం, నిర్మలత్వం చర్చిలు, విశ్వాసుల కుటుంబాల్లో కనిపించకపోతే వారు ఆయన అనుచరులు ఎలా అవుతారు? తన బోధలు మాటల్లో, ప్రసంగాల్లోకన్నా విశ్వాసుల జీవితాల్లో ఆచరణలో కనిపించాలని కోరుకున్న యేసు ప్రభువుకు అసంతృప్తిని మిగుల్చుతూ, ప్రసంగాల హోరుతో కూడిన ‘ధ్వని కాలుష్యమే’ తప్ప, ఆయన బోధలతో జీవనసాఫల్యం పొందిన విశ్వాసుల దాఖలాలేవీ? తాను దేవుడై ఉండీ, యేసుప్రభువు సామాన్య ప్రజలతో కలిసిపోయి జీవించగా, నిరుపేదలు, సామాన్య ప్రజలు తమను తాకినా మైలపడిపోతామన్న విధంగా నాటి పరిసయ్యులు అంగరక్షకులను వెంబడేసుకొని మరీ వారికి దూరంగా వీధుల్లో తిరిగే వారు, సరిగ్గా ఈనాటి సెలెబ్రిటీ దైవసేవకుల్లాగే!! ‘‘సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు (మత్త 5:5)’’ అన్న క్రీస్తు బోధనల సర్వసారాంశమే మనకర్ధం కాకపోతే, ఆచరణీయం కాకపోతే ఎలా? విశ్వాసుల మధ్య అసూయ, శత్రుత్వం ఏ రూపంలో కూడా ఉండేందుకు దేవుడు అనుమతించడు. తన అన్న ఏశావుతో శత్రుత్వమే ఆదిమ పితరుడు యాకోబును అతని జన్మస్థలం కానాను వదిలి పారిపోయేలా చేసింది. సొంత సోదరుడైన యోసేపుతో శత్రుత్వమే అన్నలు అతన్ని బానిసగా అమ్మేయడానికి దారి తీసింది. ఆ శతృత్వభావమే మోషే ఫరోకు దూరంగా మిద్యానుకు పారిపోయేలా చేసింది. కాని కొత్తనిబంధన కాలపు క్షమాముద్రపడిన పేతురు స్వభావరీత్యా బొంకేవాడు, బలహీనుడైనా, మార్పునొంది క్షమాపణోద్యమానికి మూలస్తంభమయ్యాడు. మునుపు యేసుప్రభువును, ఆయన చర్చిని విపరీతంగా ద్వేషించిన అపొస్తలుడైన పౌలు యేసుప్రేమలో తడిసి మారిపోయి ప్రపంచమంతా క్షమాపణా సువార్తను ప్రకటించాడు, సహనానికి ప్రతీకగా మారాడు. శత్రుత్వం, అసూయాతత్వం చరిత్రలో ఎన్నో గొప్ప నగరాలు, నాగరికతలు సమసిపోవడానికి కారణమయ్యాయి. డాబు, దర్పం, ఈర‡్ష్య, పోటీతత్వాలకు స్వస్తి పలికి సరళంగా, సాత్వికంగా, ప్రేమాపూర్ణతతో జీవించడమే దేవునికి మనమివ్వగలిగిన గొప్ప బహుమానం. నిజమైన పశ్చాత్తా్తపంతో కలిగిన మారుమనస్సు విశ్వాసిలో దీనత్వాన్ని రగిలిస్తుంది. దీనత్వాన్ని కలిగిన విశ్వాసులు ఈ లోకాన్నే పరలోక రాజ్యంగా మార్చుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
‘క్షమాపణ’లో తడిసిముదై్దన యోసేపు!!
యోసేపు చిన్నప్పటి నుండీ దేవుని భయం కలిగిన వాడు. దేవుని భయమంటే తెలియని అతని అన్నలు ఆ కారణంగా అతనిపై పగబట్టారు. అన్నల దుర్మార్గపు ప్రవర్తన గురించిన నివేదికలు యోసేపు తమ తండ్రియైన యాకోబుకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వచ్చిన కారణంగా అన్నలతనిపై మరింత కక్ష పెంచుకున్నారు. ముందతన్ని చంపుదామనుకున్నారు, ఆ తర్వాత మనసు మార్చుకొని ఐగుప్తు వర్తకులకు బానిసగా అమ్మేసి, అడవిలో యోసేపు క్రూరమృగం బారినపడి చనిపోయాడని తండ్రికి అబద్ధం చెప్పారు. అలా చిన్నతనంలోనే ఒక బానిసగా ఐగుప్తుకు వెళ్లిన యోసేపు మరెన్నెన్నో శ్రమలనుభవించినా, అతని సత్ప్రవర్తనకు దేవుని అపారమైన కృప కూడా తోడైన కారణంగా, ఏడేళ్ల భయంకరమైన కరువుకాలంలో ఒక్క ఐగుప్తు దేశానికే కాదు పొరుగు దేశాలవాసులకు కూడా అన్నం పెట్టిన ఒక గొప్ప ప్రధానమంత్రిగా దేవుని ద్వారా నియమించబడి ప్రఖ్యాతి చెందాడు. పొరుగునే ఉన్న అతని అన్నలు కూడా ఒకరోజున ధాన్యం కోసం అతని సమక్షానికి రావలసి వచ్చింది. యోసేపు వెంటనే వారిని గుర్తుపట్టాడు. కానీ దైవభయం, తన అత్యున్నత స్థితికి కారకుడు దేవుడేనన్న కృతజ్ఞత, నమ్రత, తగ్గింపు స్వభావం కల్గిన ఒక అసమాన విశ్వాసిగా, చేజిక్కిన అన్నలపై పగ తీర్చుకోకుండా, వారిని హృదయపూర్వకంగా క్షమించాడు. పైగా మీరు నాకు అన్యాయమేమీ చెయ్యలేదు, అబ్రాహాము వంశంగా తనకోసం ప్రత్యేకించుకున్న మనల్నందర్నీ ఇలాంటి కరువులో పోషించి కాపాడటం కోసం దేవుడే ముందస్తు ప్రణాళికతో మీ ద్వారా ఐగుప్తుకు నన్ను ముందుగా పంపించాడంటూ దేవుని ప్రణాళికను వారికి వివరించాడు. వారిని క్షేమంగా ఇళ్లకు పంపి అన్నలను, వారి కుటుంబాలను, తన తండ్రిని కూడా సాదరంగా ఐగుప్తుకు రప్పించుకొని వాళ్లందరినీ పోషించాడు. దేవుని అపారమైన ప్రేమకు, సిలువలో పరిమళించిన యేసుక్రీస్తు క్షమాస్వభావానికి యోసేపు నిలువెత్తు నిదర్శనం. యోసేపు నిజానికి ‘స్వయం సాధక వ్యక్తి’ గా తనను తాను శ్లాఘించుకోవచ్చు. అయితే తన జీవితంలో జరుగుతున్న ప్రతి మంచి, చెడు, చిన్న, పెద్ద సంఘటన దేవుని సంకల్పం మేరకు తనకు, తన ద్వారా లోకానికి మేలు కలిగేందుకే జరుగుతుందని, జరుగుతోందని విశ్వసించిన యోసేపు పాతనిబంధన కాలంలో నివసించిన కొత్తనిబంధన కాలపు మహా విశ్వాసి(రోమా 8:28). పాతనిబంధన కాలంలో తరచుగా జరిగినట్టుగా, యోసేపు తమను, తమ కుటుంబాలను కత్తివాతకు గురి చేసి చంపుతాడేమోనని భయంతో బిక్కచచ్చిన అన్నలతో ‘భయపడకండి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ మీతోపాటు లక్షలాదిమందిని ఈ భయంకరమైన కరువులో చనిపోకుండా బతికేంచేందుకు దేవుడు మీ కీడును నాకు, లోకానికి కూడా మేలు గా మార్చాడు’ అంటూ వారికి కొత్తనిబంధన కాలపు క్షమాసిద్ధాంతాన్ని వివరించాడు. రాబోయే వేలసంవత్సరాల తర్వాత క్రీస్తు ద్వారా ఆవిష్కరించబడనున్న క్షమాయుగపు కృపాసువార్తను ముందే తెలుసుకొని దాన్ని అంగీకరించి, అనుభవించి, ఆచరించి, తద్వారా దేవుని ఆశీర్వాదాలు తనివితీరా పొందిన అసమాన విశ్వాసం యోసేపుది!! పాతనిబంధన వాడైనా క్షమాస్వభావిగా యోసేపు జీవితం చరిత్ర, బైబిల్ పుటలకెక్కితే, కొత్తనిబంధన విశ్వాసులమైన మనం మాత్రం పగలతో రగులుతూ, ప్రతీకారేచ్ఛలతో జీవితాలను అశాంతిమయం చేసుకొంటున్న పాతనిబంధన తాలూకు కరడుగట్టిన ప్రజలముగా మిగిలిపోతున్నాం. పగ, కోపం, ప్రతీకారేచ్ఛ శత్రువుకన్నా ముందుగా మనల్నే దహించి బూడిద చేస్తుంది. క్షమాస్వభావం హృదయాన్ని దూదికన్నా తేలికగా చేసి దేవుడు తెరిచిన ఆశీర్వాదాల ద్వారాల గుండా హాయిగా ఆనందంగా ఎగురుతూ, లోకానికి ఆశీర్వాదాలు పంచే పరిచర్యలో మనల్ని ప్రతిష్టిస్తుంది. విశ్వాసికి క్షమాపణ, ప్రేమ శ్వాసగా మారాలి, అప్పుడే అతనిలో, అతని కుటుంబంలో శాంతి, ఆనందం అపారంగా ప్రజ్వలిస్తాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మెట్లు దిగడంలోని ‘ఆనందం’...
అతి సాధారణమైన జీవన స్థితిగతుల ప్రస్తావనతో, అత్యంత మర్మయుక్తమైన పరలోక సత్యాలను ఆవిష్కరించిన మహా ప్రబోధకుడు యేసుప్రభువు. ఆయన పరలోకంలో ఉండే దేవుడు. మరి భూలోకానికి ఎందుకొచ్చాడు? అన్నది అప్పుడు, ఇప్పుడు కూడా అంతా వేసే ప్రశ్న. అందువల్ల తన ఆగమన ఉద్దేశ్యాన్ని యేసు ఒక ఉపమానంలో అద్భుతంగా వివరించాడు. ఒక కాపరికి వంద గొర్రెలుండేవట. వాటిలో ఒకటి తప్పిపోతే, ఆ కాపరి మిగిలిన తొంబై తొమ్మిది గొర్రెలనూ వదిలేసి, దాన్ని వెదికి, చివరికి కనుగొని దాన్ని భుజాన వేసుకొని ఇంటికొచ్చి అది దొరికినందుకు తన కుటుంబంతో, స్నేహితులతో కలిసి చెప్పుకుని ఆనందించాడట. (లూకా 15:4–7). తన వారే అయిన మానవాళి తనను విడిచి తప్పిపోతే, వారిని వెదికి మళ్ళీ పొందేందుకు దేవుడు ’పరమ కాపరిగా’, యేసుక్రీస్తుగా ఈ లోకానికొచ్చాడని అలా వివరించాడాయన. అందుకు ’పోగొట్టుకోవడం’ అనే ఒక జీవితానుభవాన్ని వాడుకొని ఆ సత్యాన్ని ఆయన తెలిపాడు. పొందే అనుభవాలకన్నా, పోగొట్టుకునే అనుభవాలే జీవితంలో అత్యంత విలువైన పాఠాలను నేర్పిస్తాయి. పోగొట్టుకున్నపుడున్న బాధకన్నా, వాటిని తిరిగి పొందినప్పుడు ఎన్నో రెట్లు ఎక్కువగా సంతోషిస్తామని దేవుడే తన అనుభవంగా వివరించిన ఉపమానమిది. కేవలం నాలుగు వచనాల ఈ ఉపమానంలో నాలుగుసార్లు ‘సంతోషం’ అనే మాటను ప్రభువు వాడాడంటే, అదెంత ప్రాముఖ్యమైన అనుభవమో అర్థం చేసుకోవచ్చు. లోకంలో అంతా అంతిమంగా వెదికేది ’సంతోషం’, ’ఆనందం’ కోసమే. కోటానుకోట్ల ఆస్తిపాస్తులున్న కుబేరులు కూడా ‘ఆనందం’ కరువైన నిరుపేదలుగా బతుకుతున్న ఆధునిక జీవనశైలిలో దాన్నెలా పొందాలో ప్రభువు చెప్పాడు. కొత్తదేదైనా సంపాదించుకున్న ‘ఆనందం’ కేవలం తాత్కాలికమైనది. కానీ పోగొట్టుకున్నది సంపాదించుకున్న ఆనందం చాలా గొప్పది, శాశ్వతమైనది. మనం పోగొట్టుకున్నది గాడి తప్పిన మన జీవితమే కావచ్చు, దారితప్పిన, మనల్ని వదిలేసిన మన సంతానం, తోబుట్టువులు కూడా కావొచ్చు. పోగొట్టుకున్న మన పరువు, ప్రతిష్టలూ కావొచ్చు. అయితే మనల్ని వదిలేసిన వాళ్ళే మళ్ళీ మనల్ని వెదుక్కొంటూ వెనక్కి రావాలన్నది లోకం చేసే వాదన. అలా కాదు, మనమే వారిని వెదికి తిరిగి సమకూర్చుకోవాలన్నది దేవుడు తానే ఆచరించి మనకు చేస్తున్న ప్రతిపాదన. మనమున్న చోటినుండి రెండు మెట్లు దిగి వెళ్ళడానికి అడ్డొచ్చేది మన ‘అహమే’!! అందువల్ల చాలాసార్లు మన ఆనందానికి అడ్డుకట్ట వేసేది కూడా అదే. కాని పరలోకం నుండి భూలోకానికి దిగిరావడానికి దేవునికే లేని ‘అహం’ రెండు మెట్లు దిగడానికి మనిషికెందుకటా? వినోదాన్ని ఆనందంగా భ్రమిస్తున్న, ఆనందాన్ని సంపాదించుకోవడానికి అనేక అడ్డుదార్లు తొక్కుతున్న నేటి లోకానికిది దేవుడు చూపించిన నిజమైన మార్గం. అందరికీ ఆనందాన్నిచ్చే దేవునికే పరమ ఆనందాన్నిచ్చిన అనుభవం, పోగొట్టుకున్న పాపిని తిరిగి సంపాదించుకున్నప్పుడన్న సత్యాన్ని బైబిల్లో చదివినప్పుడల్లా నా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి (లూకా 15:10). ఆనాడు యేసుప్రభువు ప్రవచనాలు విన్నవాళ్లలో తామెంతో నీతిమంతులమన్నట్టు పోజులు కొట్టే పరిసయ్యులు, శాస్త్రులున్నారు, పరమ పాపులుగా లోకం ముద్రవేసిన సుంకరులు, వేశ్యలు కూడా ఉన్నారు. పరిసయ్యుల చెవులకెక్కి వారిని మార్చలేని ఆయన బోధ ఎంతోమంది నాటి ‘పాపులను’ మార్చింది. అందుకే దేవుని వద్దకు తిరిగి రావాలనుకొని తొంబై తొమ్మిది మంది ‘నీతిమంతుల వల్ల కలిగే సంతోషం కన్నా, దేవుని కృపకు పాత్రుడైన ఒక పాపి వల్ల కలిగే సంతోషం పరలోకంలో ఎంతో గొప్పదని ప్రభువన్నాడు (15:7). అందుకే దేవుడు దీనులు, అభాగ్యులు, నిరుపేదలు, లోకం విసర్జించిన పాపుల పక్షపాతి అన్నది నిత్యసత్యం. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని మనసు తెలుసుకోవాలి, గెలవాలి...
మహాబలుడు గొల్యాతును చూసి ఇశ్రాయేలీయుల సైనికులంతా జడిసిపోతుంటే, బలం లేనివాడు, ఇంకా బాలుడే అయిన దావీదు ముందుకొచ్చి తాను అతనితో తలపడి అతన్ని ఎదిరిస్తానన్నాడు. కాకలు తీరిన వీరుల వంటి నా సైనికులు చెయ్యలేని పని, గొర్రెల కాపరివి, బాలునివైన నీవెలా చేస్తావని సౌలు రాజు ప్రశ్నిస్తే, దావీదు తన అనుభవాల్లో ఒకటి ఆయనకు వివరించాడు. ఒకసారి దావీదు తన గొర్రెలమందను కాస్తుండగా ఒక సింహం, ఎలుగుబంటి కలిసి మంద మీద దాడి చేసి ఒక గొర్రెపిల్లను నోటకరుచుకొని పారిపోతుంటే తాను వాటిని ఎదిరించి, తరిమి ఆ గొర్రెను విడిపించానని, అవి తనమీద దాడి చేస్తే వాటిని కొట్టిచంపానని దావీదు చెప్పాడు. సింహం, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవాయే గొల్యాతు నుండి కూడా తనను రక్షిస్తాడని దావీదు తన విశ్వాసాన్ని వెల్లడించాడు. జరిగిందేమిటంటే, గొల్యాతును దావీదు ఎదిరించగా, దేవుడు దావీదును కాపాడటమే కాదు, గొల్యాతును దావీదు చేతికి అప్పగించాడు. అతన్ని సంహరించి ఇశ్రాయేలు సైన్యానికి దావీదు ఎంతో అనూహ్యమైన ఘనవిజయాన్ని సాధించిపెట్టాడు (1 సమూ 17:33–51). దావీదును తదుపరి రాజుగా దేవుడభిషేకించిన కొన్నాళ్లకే జరిగిన ఘటన ఇది. సంకల్ప బలానికి, శరీర దారుఢ్యానికి అసలు సంబంధమే లేదు. ఆనాడు యుద్ధక్షేత్రంలో ఉన్న సైనికులంతా మహా బలవంతులే అయినా గొల్యాతును చూసి జడుసుకున్నారు. యుద్ధవిద్యలు తెలియనివాడు, గొర్రెల కాపరి, దుర్బలుడైన దావీదు మాత్రం అంతటి బలవంతుణ్ణి గెలిచి విజయం సాధించి పెట్టాడు. తనను గెలిపించేది తన దేవుడైన యెహోవాయేనన్న అతని విశ్వాస ప్రకటనలోనే అతని ఘనవిజయం ఖాయమైంది (17:37). నిజానికి ఒక గొర్రెపిల్లే కదా, పోతేపోయింది, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయంటూ దావీదు తన ప్రాణాలు తాను దక్కించుకున్నా అడిగేవారు లేరు, తప్పు బట్టే వాళ్లు కూడా లేరు. నిజానికి ఆ రెండు క్రూర మృగాలు దావీదును గాయపర్చినా, అతన్ని చంపినా, ఒక్క గొర్రెపిల్లకోసం అంత సాహసం అవసరమా? అంటూ అంతా అతన్నే నిందించేవారు. ఎందుకంటే గొర్రెపిల్లను వదిలేసి ప్రాణాలు దక్కించుకోవడమే తెలివి, గొర్రెపిల్ల కోసం ప్రాణాలకు తెగించడం తెలివి తక్కువ పని అన్నది లోకజ్ఞానం. కాని దావీదు తన ఉద్దేశ్యాలను నెరవేర్చే తన ఇష్టానుసారుడైన వాడంటాడు దేవుడు(అపో.కా.13:22). దావీదుకు దేవుని మనసు బాగా తెలుసు, అందుకే బలంలేని ఒక గొర్రెపిల్లకోసం తన ప్రాణాలకు తెగించాడు. యేసుక్రీస్తులో లోకానికి పరిచయం చేయబడిన దేవుడు కూడా పూర్తిగా దుర్బలులు, నిరాశ్రయులు, పీడితుల పక్షపాతి. ఆయన అనుచరులైన విశ్వాసులు కూడా అదే సిద్ధాంతాన్ని, స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎంతసేపూ బలవంతులు, ధనికుల కొమ్ము కాస్తూ బలహీనులను చిన్న చూపుచూసే విశ్వాసులు, పరిచారకులు ఎన్నటికీ యేసు అనుచరులు కాలేరు. లోకంలో వినిపించే ఆకలి కేకలు, పీడితుల ఆక్రందనలు, అంతటా కనిపించే బలవంతుల దోపిడీ, దౌర్జన్యం క్రైస్తవ విశ్వాసిని సవాలు చేసి అతన్ని ఆ దిశగా కార్యోన్ముఖుణ్ణి చేయకపోతే, ఆ విశ్వాసం లోపభూయిష్టమైనదనే అర్థం. అమెరికాలో నల్ల జాతీయుల బానిసత్వం నైతికంగా చాలా దారుణమనే అబ్రహాం లింకన్ తొలుత భావించేవాడు. కాని క్రైస్తవ విశ్వాసంలో ఎదిగే కొద్దీ అక్కడి బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్న భావన అతనిలో బలపడి చివరికి దేశంలోని తెల్లజాతీయులంతా ఒకవైపు వ్యతిరేకిస్తున్నా దేశాధ్యక్షుడిగా తెగించి నల్లజాతీయుల బానిసత్వాన్ని శాశ్వతంగా నిషేధిస్తూ, వారిని సమాన పౌరులను చేస్తూ జనవరి 1863లో ఆయన చేసిన చట్టం అమెరికా దేశ చరిత్రనే తిరగ రాసింది. చట్టాలను, దేశాలు, రాజ్యాల చరిత్రను కూడా తిరగరాసే శక్తిని దేవుడు విశ్వాసుల్లో నింపగలడు. ప్రజాస్వామ్యం, సమానత్వం, సమన్యాయం క్రైస్తవం ఈ ప్రపంచానికిచ్చిన బహుమానాలు. అలాంటి క్రైస్తవం లోనే దోపిడీ, దౌర్జన్యం, అసమానత్వం ప్రబలితే అదెంత అవమానకరం? – రెవ. డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దేవుని దృష్టిలో విశ్వాసమంటే క్రియలే!!
కారుచీకట్లో, కాకులు దూరని కారడవిలో దారితప్పిన వ్యక్తి గమ్యం చేరడు, ప్రాణాలతో కూడ ఉండడు. అందువల్ల అడవంతా ఎరిగిన ఒక మార్గదర్శకుడు అతని చెయ్యిపట్టుకొని సరైనదారిలోకి నడిపించడం అవశ్యం. దారి తప్పిన మానవాళిని దేవుడే యేసుక్రీస్తుగా అలా చెయ్యిపట్టుకొని దగ్గరుండి సరైన మార్గం లోనికి నడిపించడమే ‘రక్షణ’ అని బైబిల్ చెబుతోంది. గ్రీసు దేశానికి చెందిన తీతు అనే అన్యుడు అపొస్తలుడైన పౌలు పరిచర్య ద్వారా రక్షింపబడి అతని అనుచరుడిగా మారాడు. తానే బాగా శిక్షణనిచ్చిన తన అనుచరులను పౌలు తాను స్థాపించిన చర్చిల్లో కాపరులుగా నియమించాడు. అలా క్రేతు అనే ద్వీపంలోని చర్చికి తీతును నాయకుడిగా నియమించి, ఆ చర్చిని నడిపించడానికి అవసరమైన సలహాలు, నియమావళితో కూడిన ఒక పత్రికను అతనికి రాశాడు. అదే తీతుకు రాసిన పత్రికగా కొత్తనిబంధన గ్రంథంలో చేర్చబడింది. క్రేతు లోని ఆనాటి చర్చికే కాదు, ఈనాటి ప్రతి చర్చికి, విశ్వాసికీ కూడా మార్గనిర్దేశనం చేసే పత్రిక అది. దేవుడు సమస్త దుర్నీతినుండి మనల్ని విమోచించి, సత్క్రియాసక్తి గల తన సొత్తయిన ప్రజలుగా మనల్ని చేసుకోవడానికి, మనల్ని పవిత్రపర్చడానికి తనను తాను సిలువలో అర్పించుకున్నాడంటుంది ఆ పత్రిక (తీతు 2:14). కొత్త నిబంధన సారాంశమంతా ఈ ఒక్క వాక్యంలో ప్రస్తావించిన తీతు పత్రికను విశ్వాసులు ఎంత తరచుగా చదివితే అంత ప్రయోజనకరం. తల్లిదండ్రుల పోలికలు, స్వభావాలు పిల్లల్లో కనిపించడం అనివార్యం. యేసుక్రీస్తు ప్రేమలో మలచబడి ఆ పరలోకపు తండ్రికి ఆత్మీయ సంతానంగా పరివర్తన చెందిన విశ్వాసుల్లో కూడా దేవుని ముద్ర, ఆనవాళ్లు కనిపించి తీరాలి. దేవుడు పరిశుద్ధుడని, ప్రేమామయుడని బైబిల్ నిర్వచిస్తోంది (పేతురు 1:15,16).అయితే ఆయన ప్రేమ పూర్తిగా క్రియాత్మకమైనది. అందుకే ఎక్కడో పాతాళంలో పడిపోయిన మనిషిని వెదకడానికి లోకానికి యేసుక్రీస్తుగా మానవరూపంలో అతడున్న చోటికి దిగి వచ్చి మరీ అతన్ని రక్షించి ఆకాశమంత ప్రేమను చూపించాడు దేవుడు. దారితప్పిన మానవాళిని తిరిగి సంపాదించుకోవడం కోసం దేవుణ్ణి ఇలా కార్యోన్ముఖుణ్ణి చేసిన రెండు లక్షణాలు ఆయన పరిశుద్ధత, ప్రేమ. అందుకే విశ్వాసులు పవిత్రతను, సత్క్రియాసక్తిని పెంపొందించే దైవిక ప్రేమను కలిగి ఉండాలంటుంది తీతు పత్రిక. కానీ ఈ రోజుల్లో టార్చిలైటు వేసినా కనిపించని లక్షణాలు ఈ రెండే! పవిత్రతకు బదులు లౌక్యం, ప్రేమకు బదులు స్వార్ధం రాజ్యమేలుతున్న రోజులివి. దేవునికి ‘పాపం’ అత్యంత హేయమైన విషయమని బైబిల్ చెబుతున్నా అది అన్ని రూపాల్లోనూ తిష్టవేసుకొని కూర్చున్న పరిస్థితి చివరికి చర్చిల్లో, క్రైస్తవమంతటా కూడా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. ఇక స్వార్థం సంగతి చెప్పనవసరం లేదు. అంతెందుకు, మొన్న కేరళలో వరదలొచ్చి అంతా కొట్టుకుపోయిన మహావిపత్తులో చర్చిలు, విశ్వాసులు ఏ మాత్రం స్పందించారు? అక్కడ కేరళలో హాహాకారాలు చెలరేగుతుంటే, ఇక్కడ చర్చిలన్నీ ఎప్పటిలాగే ఆరాధనలు, ప్రార్థనల్లో బిజీ!! అదేమంటే, ప్రార్థన చేస్తున్నామన్న జవాబొకటి. అవతల ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ ఉంటే మనకున్నదేదో అతనికి పెట్టి ఆకలి తీర్చకపోగా, ప్రార్థన చేస్తున్నానంటే దాన్ని ప్రేమ అంటారా, స్వార్థమంటారా? దానికి తోడు ‘వాట్సప్’ లో వరదల ఫోటోలు, విశేషాలు మాత్రం జోరుగా ఫార్వర్డ్ చేసేసి గొప్ప సేవచేశామన్నట్టు పోజులు. ఎంత తిన్నావు? ఎంత సంపాదించావు? అని కాక ఎంత పెట్టావు? అనడిగే దేవుడాయన. పౌలు ప్రియ శిష్యుడైన తీతుకు ఆ మనసుంది గనుకనే యెరూషలేములో కరువు తాండవిస్తున్నపుడు అక్కడి వారి సహాయార్ధం నిధుల సమీకరణకు కొరింతి చర్చికి వెళ్లి వారి కానుకలు సమీకరించి తెచ్చి యెరూషలేములో బాధితులకు పంచాడు (2 కొరింథీ 8:16). మనం సత్క్రియల ద్వారా కాక దేవుని కృప వల్లనే రక్షింపబడ్డాము కాని రక్షింపబడిన తర్వాతి మన క్రియలు ఆయన ప్రేమను ఎంతగా ప్రకటించాయన్నదే దేవుని ప్రసన్నుని చేస్తాయి, ఆయన రాజ్యాన్ని నిర్మిస్తాయి. చర్చికి పరలోకంలో అలంకార వస్త్రాలుగా దేవుడిచ్చే ‘పరిశుద్ధుల నీతి క్రియలు’ అవే మరి!! (ప్రకటన 19:8). – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దూరం నుంచి ఒక రాయి
ఒకసారి యేసువద్దకు ఒక స్త్రీని కొందరు తీసుకొచ్చి ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా.. మరి నీవేమంటావు’ అని అడిగారు. ప్రభువు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసు ‘‘అవును... ఆమెను రాళ్లతో కొట్టి చంపవలసిందే... కానీ ఎవరిలోనైతే పాపం లేదో ఆ వ్యక్తి మాత్రమే ఆ శిక్షను అమలు చేయాలి’’ అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా రాళ్లు అక్కడ పడవేసి ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు. ఇక్కడ మనమంతా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా తప్పో, పాపమో చేస్తే మనమంతా ఆ పని చేసిన వారిని శిక్షించాలని. దూరం నుంచైనా ఒక రాయి వారిమీద వేయాలని ప్రయత్నిస్తాం. ఒకవేళ ఆ శిక్షను అమలు చేసే అవకాశం వస్తే మనమే అమలు చేస్తాం. అది అమలు చేసేటప్పుడు మనం తప్పు చేసే వాళ్లం కాదని, అసలు పాపమే చేయలేదనే భావనతో ఆ పని చేస్తాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనమందరమూ కూడా తప్పో, పాపమో చేస్తూనే ఉంటాం. అది బయటకు కనిపించక పోవచ్చు. హృదయంలో మనం కూడా అదే తప్పు ఆలోచనలు కలిగి ఉండి ఆ పనిని బయటకు చేసిన వానిని మాత్రం శిక్షించడానికి ముందుంటాం. ఒక్కసారి ఆలోచించాలి. యేసు తలయెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ మీద నేరారోపణ చేసిన వారెవరూ కనిపించలేదు. అపుడు యేసు ఆ స్త్రీని చూసి ‘‘అమ్మా..!. నీవు కూడా వెళ్లు, అయితే మళ్లీ పాపం చేయకు’’ అని చెప్పాడు. అంటే శిక్షతో కాకుండా క్షమించడం ద్వారా ఆ స్త్రీని మార్చాలనుకున్నాడు. భావోద్వేగాలను తమ నియంత్రణలో ఉంచుకున్నవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఆ స్త్రీని వాళ్లు తీసుకొస్తున్నప్పుడు గానీ ఆమెను శిక్షించాలనే తలంపుతో రాళ్లు చేత పడుతున్నపుడు గానీ వారిలో ఏ విధమైన ఆలోచనా లేదు, ఈమె పాపం చేసింది, మేము చేయలేదు కనుక ఈమెను శిక్షించాలి ఆనే ఆలోచన తప్ప! కానీ యేసు మాట్లాడిన ఆ ఒక్క మాట వారిని ఆలోచింప జేసింది. ఒక్కసారి మనం ఎదుటి వ్యక్తిని క్షమించడం అలవాటు చేసుకుంటే అది ఎంత సంతోషాన్నిస్తుందో అర్ధమౌతుంది. అయినా శిక్షించడానికి ఆయుధం ఉంటే చాలు. అదే క్షమించాలంటే హృదయంలో చాలా ధైర్యం కావాలి, అనేక సందర్భాలలో శిక్షలకన్నా కూడా ప్రేమ, క్షమాపణ తప్పు చేసిన వ్యక్తులలో మార్పులు తీసుకొస్తాయి. తప్పు చేసిన వ్యక్తి మారాలని కోరుకోవాలి కానీ మరణించాలని కోరుకోకూడదు. – రవికాంత్ బెల్లంకొండ -
చూపునిచ్చిన ప్రేమ
యెరికో ప్రాంతంలో ఉన్న ఒక బిక్షకుడు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా బిచ్చమెత్తుకోవడానికి తమ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ దారిగుండా నజరేయుడైన యేసు వెళుతున్నాడు అని ఆ బిక్షకుడు విని వెంటనే పెద్దగా అరవడం ప్రారంభించాడు. నేను గుడ్డివాడను కదా ఆయన నా అరుపులు వింటాడా అనే ఆలోచన చేయకుండా తన ప్రయత్నాన్ని తను చేస్తున్నాడు. మనలో చాలామందిమి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే ఒక నిర్ణయానికి వచ్చి ఇక అది జరగదు కదా అని ఏడుస్తూ కూర్చుంటాం. కానీ ఆ భిక్షకుడు అలా కూర్చోకుండా కళ్లు కనిపించకపోయినా తన గొంతుకతో అరుస్తున్నపుడు అక్కడ ఉన్నవారంతా అతడిని వారించారు. కానీ బిక్షకుడు అరవడం ఆపలేదు ఎప్పుడైతే మనం విశ్వాసంతో ఇది జరుగుతుంది, దేవుడు దీనిని చేయగలడు అని నమ్ముతామో ఖచ్చితంగా దేవుడు ఆ పనిని జరిగిస్తాడు. ఆ బిక్షకుడి∙విషయంలోనూ అదే జరిగింది. అందరూ అరవవద్దని అంటున్నా అతను ఇంకా పెద్దగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. అతడి హృదయంలో తన పట్ల ఉన్న విశ్వాసానికి ప్రభువు ఆగాడు. ఆ బిక్షకుడిని తన వద్దకు పిలవమని చెప్పగానే అప్పటి వరకూ అతను కూర్చోవడానికి ఆధారమైన తన బట్టను పారవేసాడు. అంటే నన్ను యేసు పిలుస్తున్నాడు.. అంటే ఇక నాకు ఆ బట్టతో పనిలేదు.. నాకు కళ్లొస్తున్నాయి.. అని భిక్షకుడు నమ్మాడు గనుకనే ఆ బట్టను పారవేయగలిగాడు ఈ సందర్బంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ‘‘విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా’’ (హెబ్రీ 11:6). మనం కూడా దేవుని యెద్దకు వెళుతున్నాం మరి నిజంగానే విశ్వాసంతోనే వెళుతున్నామా? అడుగుతున్నాము కానీ పొందలేకపోతున్నాము అంటే ఆ బిక్షకుడికి ఉన్న విశ్వాసం మనకు లేదన్నమాట, ఆ బిక్షకుడు తన దగ్గరకి రాగానే ప్రభువు అడిగిన మాట ‘నేను నీకేమి చేయగోరుచున్నావు’ అని. అంటే మనం ఆయనను నమ్మితే ఆయన సమాధానం ఇస్తాడు. దగ్గరకు పిలుచుకుంటాడు. ఆయనకు మనకు ఏం కావాలో తెలిసినా మనలనే అడుగుతాడు. మనం అడిగిందే చేస్తాడు. ఆ బిక్షకుడు దృష్టిని ఇమ్మని అడిగితే ప్రభువు ‘‘నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది’’ అంటున్నాడు. అంటే మన విశ్వాసం వలననే ప్రభువు పని చేస్తాడు. ఆ అంధుడు అరిచినపుడు ఆగడం, అతడిని తన దగ్గరకు పిలుచుకోవడం వెనక ప్రభువు ప్రేమ కనిపిస్తుంది. ఆ బిక్షకుడి పట్ల కరుణ కనిపిస్తుంది. ప్రభువు ప్రేమ చెట్టు వంటిది. చెట్టు ఎలాగైతే ఎందరొచ్చినా వాళ్ల ప్రాంతం, మతం, కులం చూడకుండా నీడనిస్తుందో ప్రభువు ప్రేమ కూడా చెట్టు వంటిదే. ఎలాంటి వారికైనా ఈ మహావృక్షం కింద నీడ దొరుకుతుంది. మనం చేయవలసినదల్లా ఒకటే ఆ చెట్టుకిందకు రావడం. – రవికాంత్ బెల్లంకొండ -
హృదయ పరివర్తన
సృష్టి ప్రారంభం నుండి మనిషి వెతుకుతూ ఉన్నాడు. సూక్ష్మమైన ప్రతి అంశంలో ఇంకా ఏదో దాగి ఉందని, దానిని కనుక్కోవడానికి మనిషి తపన పడుతూనే ఉన్నాడు. అయితే ఆ వెదికే క్రమంలో, తనను తాను పోగొట్టుకుంటున్నాడు. ఇంకా పోగొట్టుకుంటూ పోతే ఇక ఇక్కడ ఏమీ మిగలదు. తొలి దినాలనుండే ఇది ప్రారంభమైంది. అందుకే మారవలసింది హృదయమని గ్రహించిన దేవుడు ఆ హృదయాన్ని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇందుకు ‘శిక్ష’ కంటే కూడా ‘శిక్షణ’ అవసరమని గ్రహించిన దేవుడు తన కుమారుడైన యేసును ఈ భూమి మీదకు పంపాడు. యేసు బోధ ప్రారంభించాక హృదయాలను మార్చుకోవడానికి ఉపయోగపడే అనేక విషయాలను బోధిస్తూ వచ్చాడు. యేసు బోధ మొత్తాన్ని మనం పరిశీలిస్తే మనకు కనిపించేది ఒకటే అంశం (మత్తయి 19:19) నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమించు అనే తత్వం మనకు కనిపిస్తుంది. ఈ మాటను ప్రభువు తన జీవితంలో నెరవేర్చి చూపాడు. అది మనలను కూడా చేయమని చెబుతున్నాడు. ‘ప్రేమ, క్షమాపణ, తగ్గింపు’ ఈ మూడే మనిషిని మనిషిలా ఉంచుతాయి. ఈ మూడు లక్షణాలు ప్రతి మనిషిలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. కోపంలో మనిషి తాను ఏం చేస్తున్నాడో మరచిపోతాడు. తనను పట్టుకోవడానికి వచ్చిన సైనికులలో ఒకని చెవిని నరికిన తన శిష్యుడిని చూసి (మత్తయి 26:51,52) ‘కత్తి పట్టినవాడు కత్తిచేతే నశిస్తాడు. దానిని ప్రక్కన పడవెయ్యి’ అంటాడు. అంటే తనను తాను కాపాడుకోవడానికి యేసు కత్తిని వాడలేదు వాడొద్దు అని శిష్యులకు చెబుతున్నాడు. ఎవరైనా (మత్తయి 5:39) నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా చూపించమని బోధించాడు. ఈ మాటల వెనుక ప్రభువు మనుషుల హృదయాలను మార్చాలనే తపన కనబడుతుంది. మనలో ఎవరైనా ఒక తప్పు చేస్తే ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపించే వారే గానీ ఆ తప్పు చేసిన వారిని క్షమించి మార్చడానికి ఎవరూ ప్రయత్నించరు. అది సరికాదు. – రవికాంత్ బెల్లంపల్లి -
మునిగిపోయే గొప్ప ఓడ కాదు, గమ్యం చేర్చే చిన్న దోనె చాలు
ఆనాటి యూదుమత ప్రముఖుడొకాయన యేసుప్రభువు వద్దకొచ్చి నేను నిన్ను వెంబడిస్తాను, నీవెక్కడికెళ్లితే అక్కడికొస్తానన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్లున్నాయి, కానీ తనకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదని ప్రభువాయనకు జవాబిచ్చాడు(మత్తయి 8:20). ఆయన ఏర్పర్చుకొన్న 12 మంది శిష్యులతో సహా ఎంతో మంది ప్రభువును అప్పటికే వెంబడిస్తున్నారు. అప్పటికి మూడేళ్ళుగా యేసు తన వాళ్ళతో కలిసి ప్రతిరాత్రి ఎక్కడో ఒక చోట బస చేస్తూనే ఉన్నాడు, రాత్రి పూట ఎక్కడో ఒకచోట తలవాల్చుతూనే ఉన్నాడు. మరి అతనితో ఈ మాటెందుకు అన్నాడు? ఆయన తన పేదరికాన్ని ప్రకటించుకొంటున్నాడా? ’భూమియు దాని సంపూర్ణతయు, లోకమును అందులో నివాసం చేసేవన్నీ ఆయనవే’ అంటుంది బైబిల్(కీర్తనలు 24:1). విశ్వమంతా తనదే అయినా యేసుప్రభువు ఈ లోకంలో జీవించిన ముప్పైమూడున్నరేళ్లలో తన పరలోకపు తండ్రి అభీష్టం మేరకు దైవత్వాన్ని సంతోషంగా పరిత్యజించి దిగి వచ్చిన పరిపూర్ణ మానవుడు. సకల భోగభాగ్యాలతో రాజప్రసాదంలో అనుభవిస్తున్న అత్యంత విలాసవంతమైన జీవితాన్ని వదిలి మారువేషంలో(లేదా మహిమశరీరం వదిలి మానవ శరీరంలో) తన ప్రజలతో కొంతకాలం సహజీవనం చేసేందుకు పూనుకొన్న మహాచక్రవర్తి ఆయన. ఈ దశలో ఆయనకంటూ సొంత ఆస్తులేవీ లేవు, ఉండవు కూడా. ఆపదలో సాయాన్ని, రుగ్మతలో స్వస్థతనిస్తూ, పడిపోయినపుడు పైకిలేపే స్నేహితుడిగా, కన్నీళ్లు, కష్టాల్లో ఓదార్చే సొంత మనిషిగా ఆయన దీనులు, నిరుపేదల కోసం నిరంతరం శ్రమించాడు. అంటే ఈ లోకానికి ఏమీ లేనివాడుగా వచ్చి, వారితోనే వాళ్ళే తన సర్వంగా జీవించి ఏమీ లేని వారికి ఆయన ‘కొండంత అండ’ అయ్యాడు, వారి జీవితాల్లోనుండి విడదీయలేని భాగమయ్యాడు, వారి ’సొంత మనిషి లేదా సొంత ఆస్తి’గా మారాడు. తలవాల్చుకొనేందుకు కూడా తనకంటూ ఒక సొంత స్థలం లేనివాడే కాని అప్పుడూ ఇప్పుడూ కోట్లాదిమందికి యేసుప్రభువు ఆశ్రయదుర్గమయ్యాడు. ఈ రోజుల్లోలాగే, ఆ రోజుల్లో కూడా మతసంబంధమైన వ్యక్తులే అత్యంత ధనవంతులు. ఎంతో ఆస్థిపరుడైన ఒక శాస్త్రి తనను వెంబడిస్తానన్నపుడు అందుకే యేసుప్రభువు అతన్ని నిరాశపర్చే జవాబిచ్చాడు. నన్ను వెంబడించి నీవు కొత్తగా సంపాదించుకునేదేమీ ఉండదు సరికదా నీకిపుడున్నదంతా వదిలేయాల్సి వస్తుందని ప్రభువు అతనితో పరోక్షంగా అన్నాడు. ఊహించినట్టే అతను జడిసి వెనుదిరిగాడు. ఆస్తులు, విలాసాలు పొందే అవకాశం లేదనుకుంటే ఈనాటి చాలామంది బోధకులు కూడా అతని లాగే ప్రభువును వదిలేస్తారు. ఆస్తులు కాదు, మహిమైశ్వర్యవంతుడైన యేసే మాకు ’తిరుగులేని స్థిరాస్తి’ ఆనుకున్న ఇతర అనుచరులు మాత్రం ఆయన జీవనశైలినే అనుకరిస్తూ ఆయన్ను వెంబడించారు, అద్భుతమైన పరిచర్య చేశారు, పరలోకంలో ఆయనకు పాలిభాగస్థులయ్యారు. అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ ఓడను ఐర్లాండ్ లోని బెల్ఫాస్ట్లో అక్కడి చేయితిరిగిన 16 మంది మెకానిక్‌ల సారధ్యంలో నిర్మించారు. వారి నైపుణ్యాన్ని మెచ్చి ఆ 16 మంది మెకానిక్‌లను ఓడ యజమాని ఫ్రీ టికెట్లిచ్చి తీసుకెళ్తుండగా ఓడతోపాటే వాళ్లంతా మునిగి చనిపోయారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ 16 మంది కుటుంబాల ఓదార్పు కోసం బెల్ఫాస్ట్ బాప్టిస్ట్ చర్చిలో జరిగిన గొప్ప సంస్మరణ సభలో ‘మునిగిపోని పడవ’ అనే అంశంతో ఒక దైవజనుడు ప్రసంగించాడు. భయంకరమైన తుఫానులో కూడా తిబెరియా సముద్రంలో యేసుప్రభువున్న ఒక చిన్న పడవ మునిగిపోలేదు. యేసులేని జీవితం ఎంత గొప్పదైనా అది మునిగే ఓడేనని, యేసే ఉంటే చిన్న దోనెలాంటి జీవితమైనా అది పెనుతుఫానులను కూడా జయిస్తుందని ఆయన వివరిస్తే ఆ రోజున ఆ మెకానిక్‌ల పిల్లలు చాలామంది ప్రభువు పరిచర్యకు తమ జీవితాలు అంకితం చేసుకున్నారు. యేసు ఉన్న మునిగిపోని ఓడలుగా వాళ్ళు తమ జీవితాలను నిర్మించుకోవడమే కాక, మరెన్నో వందల జీవితాలను అలా వాళ్ళు ప్రభువులో నిర్మించారు. అలా ఒక పెను విషాదంలో ఆనంద కెరటం ఎగిసిపడింది. ’యేసుప్రభువే నా నిజమైన ఆస్తి’ అని సగర్వంగా ప్రకటించుకోవడమే సజీవ క్రైస్తవం. ఆస్తులు, డబ్బు చుట్టూ తిరిగే క్రైస్తవం, పరిచర్య ఎన్ని హంగులు, ఆర్భాటాలున్నా మృతప్రాయమైనదే, ఒకనాడు మునిగిపోయేదే!!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పరివర్తనకు చిరునామా యోహాను!!
శిష్యుల్లో యాకోబు, యోహాను అనే సోదరులకు ‘ఉరిమెడివారు’ (బొయనెర్గెస్) అని యేసుప్రభువే పేరు పెట్టాడు (మార్కు 3:17). ఉరుము ఒక్క క్షణం కోసం అందరి దృష్టీ ఆకర్షిస్తుంది, జడిపిస్తుంది కూడా. అంతమాత్రాన ’ఉరుము’ సాధించేదేమీ ఉండదు. ఈ ఇద్దరి జీవితం, ముఖ్యంగా యోహాను జీవితం అలాంటిదే. యేసు శిష్యుడు కాని ఒక వ్యక్తి దయ్యాల్ని వెళ్లగొడుతుంటే యోహాను అతన్ని అడ్డుకొని ప్రభువుతో చీవాట్లు తిన్నాడు(మార్కు 9 :38). యేసును, ఆయన శిష్యులను గ్రామంలోకి స్వాగతించని సమరయులమీదికి ఆకాశంనుంచి అగ్ని కురిపించి నాశనం చేయమని సూచించి ప్రభువుతో మరోసారి తిట్లు తిన్నాడు (లూకా 9:51). పరలోకంలో ప్రభువుకు కుడి ఎడమ స్థానాల్లో కూర్చునేందుకు తమ తల్లితో సిఫారసు చేయించుకొని భంగపడిన దురాశపరుడు యోహాను. ఉరుము లాగే దుందుడుకుతనం, ఆవేశం, హడావుడి, క్షణికోత్సాహం, శబ్దగాంభీర్యం యోహాను లక్షణాలు. అయితే ప్రభువు తన శిష్యుడిగా చేర్చుకున్న తొలిరోజుల అతని వ్యక్తిత్వమిది. అతని లోపాలన్నీ తెలిసే ప్రభువు అతన్ని శిష్యుడిగా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏ మాత్రం విలువలేని ఈ ‘ఉరుము’ ప్రభువు సహవాసంతో ఎదిగి కాలక్రమంలో వెలకట్టలేని ’వజ్రం’గా మారి దేవుని రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించింది. యోహాను ఎంతగా ఎదిగాడంటే, సిలువలో వేలాడుతున్న యేసును శిష్యులంతా వదిలేసి ప్రాణభయంతో పారిపోతే, అతనొక్కడే సిలువలోని ప్రభువు పక్కనే ధైర్యంగా నిలబడ్డాడు. ప్రభువుశక్తికి అంతకాలంగా సాక్షిగా ఉన్న యోహాను, మానవాళికోసం సిలువలో నిస్సహాయుడిగా వేలాడిన ప్రభువులో దైవత్వాన్ని, క్షమాపణను మరెక్కువగా చూశాడు. అదే అతని జీవితాన్ని సమూలంగా మార్చింది. అందుకే కొత్త నిబంధనలో ఒక సువార్తను, ప్రకటన గ్రంథాన్ని, మూడు పత్రికల్ని యోహాను రాశాడు. ‘దయ్యాలు వెళ్లగొట్టే ఫలానావాడు మనవాడు కాడు’ అన్న అతని ‘స్వార్థపరత్వం’ యేసుసాన్నిహిత్యంలో ’అంతా మనవాళ్ళే’ అన్న సార్వత్రికతగా మారింది. సమరయులను దహించేద్దామన్న అతని ఆగ్రహం, ఆవేశం, పరుశుద్ధాత్ముని ప్రేరణతో మానవాళికి ప్రభువు రాసిన ’ప్రేమపత్రిక’ గా పేరొందిన ’యోహాను సువార్త’ రాయడానికి అతన్ని పురికొల్పింది. ఎవరెక్కడున్నా నేను మాత్రం యేసు కుడి ఎడమ స్థానాల్లో ఉండాలన్న అతని ‘సంకుచితత్వం’, యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు కడవరి రోజుల్లో ఈ లోకం ఎంత అధ్వాన్నంగా తయారు కానున్నదో ప్రజలందరి శ్రేయస్సు కోసం వివరించే ప్రకటన గ్రంథాన్ని రాసే ‘ఆత్మీయత’ గా మారింది. శరీరం లావు తగ్గించే వ్యాపారంలో ఉన్నవాళ్లు ’ముందు’, ’తర్వాత’ అన్న శీర్షికలతో వేసే ఫొటోల్లాగా, ప్రభువు లోకి వచ్చినపుడు మనం ఎలా వున్నాం, ప్రభువు సహవాసంలో గడిపిన ఇన్నేళ్ళలో ఎంతగా పరిణతి చెందామన్న ఒక స్వపరిశీలన, అంచనా ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఒకప్పుడు విలువలేని ‘ఉరుము’ లాంటి యోహాను, ఆదిమ సౌవార్తిక ఉద్యమానికి స్తంభంలాంటివాడని పౌలు స్వయంగా శ్లాఘించాడంటే అతను ఆత్మీయంగా ఎంతగా ఎదిగాడో అర్ధం చేసుకోవచ్చు (గలతి 2:9). యేసుప్రభువును ఎరుగని ‘అంధకారం’ కంటే యేసుప్రభువులో ఉండికూడా ఎదగని, మార్పులేని ’క్రైస్తవం’ విలువలేనిదే కాదు, ప్రమాదకరమైనది కూడా. అత్యంత ప్రమాదకరమైన నేరస్థులకు రోమా ప్రభుత్వం విధించే భయంకరమైన శిక్షల్లో ఒకటి పరవాస శిక్ష. భయంకరమైన సర్పాలు, క్రూరమృగాలుండే ఎడారుల్లాంటి దీవుల్లో ఆ నేరస్థులను వదిలేస్తే క్షణక్షణం ప్రాణ భయంతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళు చనిపోతారు. అందరికీ యేసుప్రేమను బోధిస్తూ, ప్రభుత్వ భయం మాత్రమే తెలియవలసిన ప్రజలను ప్రేమామయులను చేస్తున్న అత్యంత ’భయంకరమైన నేరానికి’ గాను, రోమా చక్రవర్తి యోహానుకు పత్మసు అనే ఎడారిలాంటి భయంకరమైన ద్వీపంలో పరవాస శిక్షను విధించారు. కాని ఆ ద్వీపంలో యేసుప్రభువు నిత్యప్రత్యక్షతను క్షణక్షణం అనుభవిస్తూ ఆతను ప్రకటన గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు. అనుక్షణం మృత్యువు వెంటాడే పత్మసు ద్వీపంలో, యేసుసాన్నిహిత్యంతో యోహాను క్షణక్షణం పరలోకజీవితాన్ని జీవించాడు. యోహానులో ఇంతటి పరివర్తనకు కారకుడైన యేసుప్రభువు మనలో ఆ మార్పు ఎందుకు తేవడం లేదు? అనే ప్రశ్నను ప్రతి విశ్వాసి వేసుకోవాలి. అయితే జవాబు మనలోనే ఉంది. మారడానికి మనం సిద్ధంగా లేమన్నదే మనందరికీ తెలిసినా మనం ఒప్పుకోని జవాబు. సొంతప్రచారం చేసుకొంటూ, వ్యాపారం తరహాలో పరిచర్యను మార్కెటింగ్ చేసుకునే ‘ఉరిమేవాళ్ళు’ కాదు, ప్రేమతో, పరిశుద్ధతతో, నిస్వార్థతతో జీవిస్తూ లోకాన్ని ప్రభువు ప్రేమ అనే వెలుగుతో నింపుతూ ‘చీకటిని తరిమేవాళ్ళు’ దేవునికి కావాలి. - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అలాంటి దానివల్ల ప్రయోజనం ఏమిటి?
తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు అంటే నన్ను వెంబడించేందుకు అనర్హుడు అన్నాడు ఒకసారి యేసుప్రభువు (మత్తయి 10:38).అవమానానికి, క్రూరత్వానికి, ఓటమికి, శాపానికి, పాప శిక్షకు మరో రూపమైన సిలువను, దైవత్వానికి మానవరూపిగా అందరి ఆరాధనలకు పాత్రుడైన యేసుప్రభువు మోసి అదంతా భరించడమే ఎంతో అనూహ్యమైన విషయమైతే, నా అనుచరులు కూడా సిలువను మోయాలని ప్రభువు పేర్కొనడం, యేసు అనుచరులుగా విశ్వాసుల పాత్ర ఎంత క్లిష్టమైనదో తెలుపుతోంది. యేసుప్రభువు కప గురించి మనమంతా తరచుగా మాట్లాడుతాం, అతిశయపడతాం కూడా!! కానీ యేసుకోసం జీవించడమంటే, సిలువను మోయడమన్న యేసు నిర్వచనాన్నిమాత్రం కావాలనే విస్మరిస్తాం. ఇదే నేటి మన ప్రధాన సమస్య. చాలామంది సత్ క్రైస్తవులకు, క్రైస్తవ పండితులకే ఇది మింగుడుపడని విషయం. ప్రతిపనినీ సులభంగా, శ్రమ లేకుండా కంప్యూటర్ల సహాయంతో చేసుకునే నేటి సరళ జీవనశైలి లో, మనం సిలువను మోయడమేమిటి? అన్న ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. సిలువను మోయడమంటే ఏమిటి? అన్నది తెలుసుకునే ముందు మనం కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. యేసుప్రభువు ఏవేవో ఆకర్షణలు, ఆశలు, లాభాలు ముఖ్యంగా గొప్ప జీవితాన్ని ఎరగా వేసి మనల్ని తన అనుచరుల్ని చేసుకోలేదు. ఆయనది లోక విధానాలకు పూర్తిగా విరుద్ధమైన శైలి. లోకం అనేక ప్రలోభాలు చూపి ప్రజల్ని ఆకర్షించుకొంటుంది. నేటి క్రైస్తవంలో కూడా అదే జరుగుతోంది. క్రైస్తవులు తమకు ‘అనుకూలమైన’ పరిచారకులు, చర్చిలకోసం తెగ వెదుక్కొంటున్నారు. యేసును నమ్ముకుంటే మీరడిగిందల్లా ఇస్తాడని బోధించేవారు ఈరోజు సెలెబ్రిటీలు. అలా బోధించే చర్చీలు నిండిపోయి కాసుల వర్షం కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలకు కావలిసింది ఇదే. కానీ నన్ను వెంబడిస్తే మీ జీవితం వడ్డించిన విస్తరి అవుతుందని యేసు ఎన్నడూ బోధించలేదు. మిమ్మల్ని లోకపరంగా గొప్పవారిని చేస్తానని ఆయన అనలేదు. కానీ లోకాన్ని సుసంపన్నం చేసేంతగా ఆశీర్వాదకారకులవుతారని మాత్రం చెప్పాడు(అపో.కా 3:25). కానీ స్వచ్ఛందంగా సిలువను మోస్తూ తనను వెంబడించడమే నిజక్రైస్తవమని యేసుప్రభువు స్పష్టం చేశాడు. యేసు మోయడంతో చరిత్రలో సిలువ అర్ధమే మారిపోయింది. లోకానికి పాపక్షమాపణను ప్రసాదించడమే కాక, తనను భయంకరంగా చిత్రహింసలు పెడుతున్న వారినందరినీ క్షమించమని ప్రార్థించడం ద్వారా యేసుప్రభువు లోకానికి క్షమించడం అంటే ఏమిటో నేర్పాడు. ఆ క్షమాపణే ప్రధాన ఇతివృత్తంగా క్రైస్తవ విశ్వాసి జీవితం సాగాలన్నదే యేసుప్రభువు అభిమతం. ‘సిలువను మోస్తూ నన్ను వెంబడించండి’ అంటే మీ జీవితంలో క్షమాపణా పరిమళం నిండనివ్వండి అని అర్థం. ఎవరిని క్షమించాలి? అనడిగితే ‘అందరినీ’ అంటాడు ప్రభువు. పైగా ప్రభువు సిలువను మోసింది మానవాళికి పాపక్షమాపణను ప్రసాదించడం కోసం, లోక కళ్యాణం కోసం. విశ్వాసి బతకవలసింది కూడా పొరుగువారి క్షేమం కోసం, పదిమందికీ తద్వారా సమాజానికి మేలు చేయడానికే అన్నది ‘సిలువను మోయండి’ అని చెప్పడంలో యేసు ఉద్దేశ్యం. ‘సిలువ వేయడం’ మాత్రమే తెలిసిన లోకానికి యేసు ఇలా ‘సిలువ మోయడం’ నేర్పాడు. ఆ ఉద్యమాన్ని తన అనుచరులు ముందుకు తీసుకెళ్లాలని ఆశించాడు. ఈనాడు ‘నేను, నాకుటుంబం’ అనే పరిధిని దాటి ఆలోచించలేని స్వార్థంలో మనమంతా కూరుకుపోయాము. మరి ’నిన్ను నీవు ప్రేమించుకున్నంతగా నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్నమూలస్తంభం లాంటి క్రీస్తు ప్రబోధాన్ని ఈరోజుల్లో పట్టించుకునేదెవరు? సిలువను మోయడమంటే క్షమిస్తూ బతకడం, పదిమందికోసం బతకడం అని యేసు సిలువను మోసి నిరూపించాడు, అదే ఆయన మనకు బోధించాడు. క్షమాపణాస్వభావం లేని, పొరుగువాని క్షేమాన్ని గురించి ఆలోచించలేని, లోకాన్ని ప్రభావితం చెయ్యలేని ’బలహీన క్రైస్తవాన్ని’ యేసు ప్రబోధించలేదు. ఒకవేళ మనమంతా అనుసరిస్తున్నది అదే క్రైస్తవమైతే జాగ్రత్తపడవలసిన సమయమిది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అట్టహాసం లేని అద్భుతపరిచర్య
భయంకరమైన, దైవవ్యతిరేకమైన మన గతం ఒక గుదిబండలాగా మెడలో వేలాడుతూ ఉంటే జీవితంలో, పరిచర్యలో జయకరంగా ముందుకు సాగిపోవడం సాధ్యమేనా? లోకమైతే ఇది అసాధ్యమనే తేల్చేస్తుంది. కానీ దేవుడైతే నీ పాపగతాన్నంతా తుడిచివేయడమే కాదు, ఇంకెప్పుడూ జ్ఞాపకం చేసుకోనని కూడా వాగ్దానం చేశాడు (యెషయా 43:25). ఈ వాగ్దానం అపొస్తలుడైన పౌలుకు అర్థమైనంతగా మరెవరికీ అర్థం కాదేమో. యేసును, ఆయన ప్రేమను విపరీతంగా వ్యతిరేకించి, తూర్పారబట్టి, క్రైస్తవోద్యమాన్ని అడ్డుకోవడంలో అగ్రగణ్యుడిగా నిలబడిన భయంకరమైన గతం అతనిది. కొన్నాళ్ళకు యేసుప్రభువు ప్రేమను రుచి చూసిన తర్వాత క్రైస్తవోద్యమాన్ని ప్రపంచమంతా విస్తరించడంలో కూడా పౌలు అగ్రగణ్యుడే అయ్యాడు. అతని గతం ప్రపంచానికంతా తెలిసిన బహిరంగ సత్యం. అందుకే అప్పుడప్పుడే అంకురిస్తున్న క్రైస్తవం పౌలును నమ్మలేదు, ఆయన్ని చర్చి లోనికి అంగీకరించలేదు. దమస్కు శివార్లలో పౌలుకు యేసు సాక్షాత్కారం జరిగిన తర్వాత, అతనికోసం ప్రార్థించి, క్రైస్తవంలో అతనికి ఆరంభ పాఠాలు చెప్పమని ప్రభువు ఆదేశిస్తే, దమస్కులోనే ఉన్న అననీయా అనే భక్తుడు ‘అమ్మో ప్రభువా, అతనా?’ అన్నాడు. పౌలు ఆ తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చి అక్కడి చర్చిని, యేసుప్రభువు శిష్యుల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తే అతనికి భయపడి అంతా దూరంగా పారిపోయారు. అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో పౌలుకు సహాయంగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి బర్నబా!! బర్నబా కూడా కొద్ది కాలం క్రితమే యేసుప్రభువు ప్రేమ సామ్రాజ్యంలో పౌరుడుగా చేరిన కొత్త విశ్వాసి. కాని తన విశ్వాసంతో, సాక్ష్య జీవితంతో అప్పటికే విశ్వాసులందరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. పౌలును నాటి క్రైస్తవమంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో, బర్నబా ఒక్కడే అతన్ని, అతని దర్శనాన్ని అర్ధం చేసుకొని అతన్ని తోడుకొని వచ్చి యెరూషలేములో అందరికీ పరిచయం చేశాడు. అలా పరిచర్యలో పౌలు తొలి అడుగులు వేయడానికి బర్నబా అండగా నిలబడ్డాడు (అపో.కా.9:27). పౌలు గతాన్ని బట్టి అంతా అతన్ని దూరంగా పెడితే, బర్నబా ఒక్కడే అతన్ని ఆత్మీయంగా హత్తుకొని అతనికి బాసటగా నిలబడ్డాడు. ఆ పాలుగారే ఆ తర్వాత మహా దైవజనుడయ్యాడు, కొత్త నిబంధన బైబిల్లో అత్యధిక భాగం ఆయనే రాశాడు, ప్రపంచమంతా క్రైస్తవం వేళ్ళూనడానికి అతనే ప్రధాన కారకుడయ్యాడు. కాని పౌలు చేసిన ఈ అద్భుతమైన పరిచర్య వెనుక కనిపించని ప్రోత్సాహహస్తం బర్నబాదే. అసలు పరిచర్యలో బర్నబా పద్ధతే వేరు. ఎవరూ అడగకుండానే తన ఆస్తినంతా అమ్మి ఆ డబ్బునంతా తెచ్చి ఆదిమ చర్చిలో అతను అపొస్తలుల పాదాలవద్ద పెట్టాడు. చర్చి నాకేమి చేస్తుంది అని కాక చర్చికి నేనేమి చెయ్యగలను అని ఆలోచించే వారిలో ప్రథముడు బర్నబా. ఎవరూ చెప్పనవసరం లేకుండానే తన వంతు తాను చేయడంలో అతను దిట్ట. అలా ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉన్నాడు గనుకనే అతనికి ‘ప్రోత్సాహపుత్రుడు’ అనే బిరుదునిచ్చింది ఆదిమచర్చి (అపో.కా.4:36). బర్నబా కారణంగా ఎంతోమంది కొత్త విశ్వాసులు ఆనాటి చర్చిల్లో చేరారు (11:24). ఆనాటి అపొస్తలులందరికీ అతను బాసటగా నిలబడ్డాడు. కాని అతనికి ప్రచార యావ లేదు, పొగడ్తల యావ అసలే లేదు. తొలిరోజుల్లో క్రైస్తవం బలపడేందుకు తన ఆస్తిని, శక్తియుక్తులన్నింటినీ సర్వం ధారపోసిన అద్భుతమైన పరిచారకుడు, పౌలువంటి మహాసేవకునితోనే, చెయ్యిపట్టుకొని తొలి అడుగులు వేయించిన గొప్ప విశ్వాసి బర్నబా!! నిబద్ధత, నిస్వార్థత లేకున్నా అట్టహాసం, హడావుడి చెయ్యడం మాత్రమే తెలిసిన నేటి తరం టివి పరిచారకులు లక్షమంది కలిసి చెయ్యలేని పరిచర్యను, బర్నబా ఒక్కడే ఏ అట్టహాసం లేకుండా దేవునికి తలవంచి చేశాడు. అందుకే దేవుడిచ్చే నిత్యజీవకిరీటం ఎప్పటికీ బర్నబా వంటి వారిదే!! – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
ఇళయరాజాపై చర్యలు తీసుకోండి
తమిళనాడు ,టీ.నగర్: ఏసుక్రీస్తుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజాపై పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల జరిగిన ఒక సంగీత కార్యక్రమంలో మాట్లాడిన సంగీత దర్శకుడు ఇళయరాజా హఠాత్తుగా ఏసుక్రీస్తు పునరుత్థానం గురించి వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. ఏసుక్రీస్తు చనిపోయాడు, ఆ తరువాత తిరిగి లేచాడనే విశ్వాసం క్రైస్తవుల్లో ఉందని, అయితే అది వాస్తవం కాదంటూ పరిశోధనలు జరిపి యూట్యూబ్‌లో వేస్తున్నారంటూ ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అంతేకాకుండా వాస్తవంగా మరణించి తిరిగి లేవడం రమణ మహర్షికే చెందిందని అన్నారు. ఈ వ్యాఖ్యలు క్రైస్తవుల్లో ఆగ్రహావేశాలు తెప్పించగా క్రైస్తవ సంఘాలు ఆందోళనలు జరిపాయి. ఇలా ఉండగా చెన్నై కమిషనర్ కార్యాలయంలో క్రైస్తవ సంఘాలు ఇళయరాజాపై ఫిర్యాదు చేశాయి. తాము ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని విశ్వసిస్తున్నామని అన్నారు. అందువల్ల ఇళయరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా ఉండగా న్యాయవాది దినేష్ చెన్నై పోలీసు కమిషనర్, కలెక్టర్, ప్రభుత్వ కార్యదర్శి, ఇళయరాజాలకు నోటీసులు పంపారు. దీంతో చెన్నై జిల్లా కలెక్టర్ పోలీసు కమిషనర్‌కు ఇళయరాజాపై చర్యలు తీసుకోవలసిందిగా సిఫార్సులు చేశారు. -
మీ ప్రార్థనకు చేరువలోనే దేవుని జవాబుంది
తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా. యెరూషలేములోని ఆదిమ చర్చిని, విశ్వాసులను భయంకరంగా హింసించిన పౌలు ఇపుడు సిరియా లోని చర్చిల్ని ధ్వంసం చేసి, విశ్వాసులను చెరపట్టి యెరూషలేముకు తెచ్చి హింసించేందుకు అనుమతి పత్రికలతో బయలుదేరుతుంటే ప్రధాన యాజకులు, యూదులు బహుశా పట్టణంలో తోరణాలు కట్టి మరీ అతనికి గొప్ప వీడ్కోలునిచ్చి ఉంటారు (అపో.కా. 9:2). పట్టణమంతా ఇలా యూదుల కోలాహలంతో నిండి ఉంటే, పౌలు అరాచకాలకు బాధితులై భయపడి, పూర్తిగా కృంగిపోయిన నిస్సహాయులైన క్రైస్తవ విశ్వాసులు మాత్రం పౌలు చిత్రహింసలనుండి విడుదల కోసం యెరూషలేములోనే రహస్యస్థలాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. నిస్సహాయ స్థితిలో బలహీనులు చేసే ప్రార్థనకు వెయ్యి ఏనుగుల బలముంటుంది. సిరియాలో అరాచకం సృష్టించేందుకు వెళ్లిన పౌలును, వారి ప్రార్థనలకు జవాబుగా దమస్కు శివార్లలోనే దేవుడు పట్టుకున్నాడు. అక్కడ యేసుప్రభువు సాక్షాత్కారంతో పౌలు అనూహ్యంగా గొప్ప క్రైస్తవ సాక్షిగా మారాడు. సిరియాలోని క్రైస్తవులను తెగనరికి వారి తలలతో యెరూషలేముకు తిరిగొస్తాడనుకున్న పౌలు, ఇపుడు సువార్తికుడై చేతిలో బైబిలుతో తిరిగొచ్చి తాను చర్చిలను పడగొట్టి, విశ్వాసులను హింసించిన చోటే యేసే రక్షకుడంటూ సువార్త ప్రచారం చేస్తున్నాడు. ఇది అక్కడి యూదులకు, క్రైస్తవ విశ్వాసులకు కూడా అనూహ్యమైన పరిణామం. ఒకప్పటి ‘యూదుల హీరో’, ఇపుడు విశ్వాసులు, చర్చిల తరపున పరిచర్య చేసే ‘క్రైస్తవ హీరో’ అయ్యాడు. చేతిలో కత్తితో పౌలు ఎంత బీభత్సాన్ని సృష్టించాడో, ఇపుడు చేతిలో బైబిలుతో అంత శాంతిస్థాపన చేస్తున్నాడు. ఒకప్పుడు తుఫాను గాలులకు అల్లాడిన చెట్టుకొమ్మల్లాగా భయంతో హడలిపోయిన చర్చి, ఇప్పుడు దినదినం క్షేమాభివృద్ధినొందుతూ శాంతితో విలసిల్లిందని బైబిల్ చెబుతోంది (అపో.కా. 9:31). విశ్వాసుల ప్రార్థనకు జవాబుగా ఒకే అధ్యాయంలో కేవలం 30 వచనాల్లో దేవుడు చేసిన అద్భుతం ఇది. దీనులు, నిస్సహాయులు, కృంగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ప్రార్థనలకు దేవుడు గొప్ప శక్తినిచ్చాడు. వారి మొరలకు ఆయన తప్పక జవాబునిస్తాడు. ఎందుకంటే దేవుడు బలవంతులు, ధనికుల పక్షం కాదు, తాను పూర్తిగా దీనులు, పేదల పక్షపాతినని యేసుప్రభువు ఎన్నో వాక్యాల్లో, ఉదంతాల్లో స్పష్టం చేశాడు. దౌర్జన్యాన్ని దీనత్వంతో, దుర్మార్గాన్ని ప్రేమతో, అరాచకాన్ని క్షమాశక్తితో మాత్రమే ఎదుర్కొని శాశ్వతంగా శాంతిస్థాపన చేయగలమని యేసుప్రభువు విశ్వసించాడు, బోధించాడు, ఆచరణలో రుజువు చేశాడు కూడా. యెరూషలేములో బలహీనులైన ఆనాటి విశ్వాసులు చేసిన ప్రార్థనలు చరిత్ర గతినే మార్చేశాయి. పౌలు పరివర్తనతో యూదుల నోళ్లు మూతపడి, మరెప్పుడూ కోలుకోలేని విధంగా వారు పూర్తిగా బలహీనపడ్డారు, కాని చర్చి మాత్రం ఎంతో బలపడి తన జైత్రయాత్రలో ఘనవిజయాల దిశగా సాగిపోయింది. మీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో తీరని సమస్య, పూడ్చలేని లోటు ఉన్నాయా? మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మోకరించి, ‘దేవా నీవే నాకు దిక్కు, సాయం చెయ్యి’ అని ఒక నిస్సహాయుడిగా ప్రార్థించండి. దేవుడు ఊహించని విధంగా జవాబిస్తాడు. చర్చికి సమస్యగా ఉన్న పౌలు, విశ్వాసుల ప్రార్థనలకు జవాబుగా మారి అదే చర్చికి ఆశీర్వాదమైనట్టు, మీ సమస్యనే దేవుడు ఆశీర్వాదంగా మార్చుతాడన్నది బైబిల్ చెప్పే సత్యం, – రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్ -
అసలే 13...ఆపైన శుక్రవారం
జనాలకు కొన్ని వింత నమ్మకాలు ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లి ఎదురొచ్చినా, ఎవరైనా తుమ్మినా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం వంటివి. ఇలానే ప్రజల్లో ఇంకా చాలా మూఢ నమ్మకాలే ఉన్నాయి. ఒక్కోసారి ఏమైనా సంఘటనలు యాధృచ్చికంగా ఏర్పడినా.. అవి ఈ మూఢ నమ్మకాల వల్లే ఏర్పడ్డాయని కొందరు భావిస్తుంటారు. ఇలాంటి నమ్మకాల వల్ల కొన్ని సార్లు మంచి జరుగుతుంది, కొన్ని సార్లు చెడు జరుగుతుంది. అలాంటి ఒక వింత నమ్మకమే 13ను దురదృష్టంగా భావించడం. అవును ప్రపంచంలో చాలా దేశాల్లో 13ను దురదృష్ట సంఖ్యగా నమ్ముతారట. అలాంటి 13 వ తారీఖు కనుక శుక్రవారం వస్తే దానంత దరిద్రమైన రోజు మరొకటి ఉండదని అనుకుంటారట. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ఈ రోజు శుక్రవారం 13వ తేదీ. 13వ తేదీని ఎందుకు దురదృష్ట సంఖ్యగా చెబుతారో సరైన కారణాలు తెలియదు కానీ, ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే.. ఏసు క్రీస్తును సిలువ వేయడానికి ముందు రోజు జరిగిన ముఖ్య ఘట్టం లాస్ట్ సప్పర్. దీనిలో పాల్గొన్నవారు 13 మంది. ఆ మరుసటి రోజు అనగా శుక్రవారం క్రీస్తును సిలువ వేశారు. ఆ రోజున ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. ఇటువంటి బాధకరమైన సంఘటనలు జరిగాయి కాబట్టే ఏ నెలలోనైనా ఈ రెండు కలిసి వస్తే అంటే 13వ తేదీ శుక్రవారం వస్తే ఆ రోజు తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని బఫ్ఫేలోని ఓ విశ్వవిద్యాలయంలో ఆంత్రాపాలజీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫిల్ స్టివెన్స్ తెలిపారు. ఏజేసీ.కామ్‌లోని యూదుల ఇస్కారియట్ ప్రకారం క్రీస్తును మోసం చేసి సైనికులకు అప్పగించిన శిష్యుడు భోజన బల్ల వద్ద 13వ స్థానంలో కూర్చున్నాడని.. అందుకే 13 అనే అంకెను చెడు సంఖ్యగా భావిస్తారని తెలిసింది. కారణాలు ఏవైనా చాలా మంది మాత్రం 13 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. ఆ తేదీన ఎవ్వరూ గృహప్రవేశం చేయరు. పెద్ద పెద్ద భవనాలలో కూడా 13వ నంబరు అంతస్తు ఉండదు. ఒకవేళ 13వ అంతస్తు ఉన్నా.. ఆ మొత్తం అంతస్తును ఖాళీగా ఉంచుతారు. ఆ రోజున ఎవరూ వివాహం కూడా చేసుకోరు. గతంలో కూడా 13వ తేదీ శుక్రవారం వచ్చిన సందర్భాల్లో అనేక అనూహ్యమైన చెడు సంఘటనలు సంభవించాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే కొంతమంది 13వ తేదీ, శుక్రవారం రెండు కలసిరావడం చాలా అదృష్టంగా భావిస్తారట. ఏదైనా మనం చూసేదాన్ని బట్టే ఉంటుందని, కాబట్టి ఈ రోజంతా మంచి జరగాలని ఆశించి, రోజు చివరలో ఏం జరిగిందో విశ్లేషించుకోండని అంటున్నారు న్యూమరాలజిస్ట్‌లు. మరో విషయం ఏంటంటే నేడు శుక్రవారం 13వ తేదీ అనంతరం ఈ ఏడాదిలో జూలై నెలలో కూడా 13వ తేదీ శుక్రవారంతో కలిసి రాబోతోంది. మరి ఈ రెండు రోజుల్లో ఏమైనా వింత విశేషాలు జరుగుతాయేమో చూడాలి. -
క్రీస్తు కారుణ్యం మనకు ఆదర్శం
ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మనుష్యుల హదయాల్లో వెలుగును నింపిన పండుగ ఇది. మరణాన్ని జయించి తిరిగిలేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. యేసు పునరుత్థానం మనిషికి నిజమైన పరమార్థాన్ని తెలియచేసింది. దేవునికి అసాధ్యమేదీ ఉండదని నిరూపించింది. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రతీ యేటా కోట్లాదిమంది ఆ ఖాళీ సమాధిని చూసి పరవశంతో నింపబడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. క్రీస్తు జీవనశైలి ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైది. భువిపై ముప్పై మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకొని వచ్చింది. నిరాశ నిస్పృహల నుండి మనిషికి విడుదల ప్రసాదించింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. మహత్తర ఆధ్యాత్మిక భావాలు ఇమిడియున్న ఆయన బోధల ద్వారా ప్రయోగాత్మకమైన ఫలవంతమైన జీవితానుభవాలు పొందుకొనే సావకాశం ఏర్పడింది. గర్వం, అహంభావం, దురహంకారం ఏలుబడి చేస్తున్న ప్రస్తుత లోకంలో ఘనతర లక్ష్యాలు నిలువుగా నీరు గారిపోతున్నాయి. మనిషి మస్తిష్కంలో గూడుకట్టుకుపోయిన పాప స్వభావం వల్ల సమాజానికి చాలా కీడు జరుగుతోంది. పాపం మనిషిని ఎటువంటి నీచస్థానానికైనా దిగజారుస్తుంది. ఆఖరుకు పతనానికి నడిపిస్తుంది. సాటి మనిషిని ప్రేమించని రాక్షస సమాజంలో తన దివ్యమైన బోధల ద్వారా నవ్యపథ నిర్దేశం చేసిన ఘనుడు యేసుక్రీస్తు. పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించి తన ప్రేమతత్వాన్ని లోకానికి ఆచరణాత్మకంగా చాటిచెప్పాడు. తన పంతమే నెగ్గాలని ఉవ్విళ్లూరే ఉగ్రవాదానికి బలౌతున్న అభాగ్యులు ఎందరో. పైశాచిక మూర్ఖత్వపు దాడులు మానవాళి చరిత్రలో నెత్తుటి పుటలను లిఖిస్తున్నాయి. ఇటువంటి సమాజంలో మార్పును తీసుకురావాలన్న సదాశయంతో వెలువడిన క్రీస్తు సందేశాలు, బోధలు సదా ఆదరణీయం. ‘‘ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది.’’ అని క్రీస్తు కొండమీది ప్రసంగంలో తెలియచేశాడు. ఆత్మలో దీనత్వం అనగా తన నిస్సహాయతను సర్వశక్తుడైన దేవుని దగ్గర నిర్మొహమాటంగా ఒప్పుకోవడం. ఒక చంటిబిడ్డ తన తల్లిపై ప్రతి చిన్న విషయానికి ఏవిధంగా ఆధారపడుతుందో అలా పరమాత్మునిపై ఆధారపడటం. స్వనీతి కార్యములు మోక్షప్రాప్తినివ్వవని మనస్ఫూర్తిగా గ్రహించి పశ్చాత్తాపంతో దేవుని పాదాలను అశ్రువులతో అభిషేకం చేయడం. భౌతిక ప్రపంచంలోనైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోనైనా పతనానికి దోహదమయ్యే దుర్లక్షణాలను దేవుని శక్తిద్వారా పరిత్యజించడం. ‘‘తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.’’ అనే తన దివ్య బోధలతో శిలలను కూడా శిల్పంగా మార్చుతున్నాడు యేసు. భయరహిత వాతావరణం సృష్టించుకుంటూ దినదిన ప్రవర్ధమానం చెందడం క్రీస్తు బోధల ద్వారా నేర్చుకోవచ్చు.జీవితం విలువ తెలిసినవానికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ అహంకారం ఉండదు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుందనేది బైబిల్ ఉపదేశం. అసత్యపు బండలను కొట్టుకొని తునాతునకలౌతున్నమనిషిని సంపూర్ణతలోనికి నడిపించాలన్నదే క్రీస్తు ఆలోచన. జడత్వంతో నిండిన ఇంద్రియాలను చైతన్యపరచి, వర్ణరహిత వర్గరహిత సమసమాజ నిర్మాణం కోసం తన వంతు కృషి సలిపిన మహాఘనుడు యేసుక్రీస్తు. ‘ఒక చెంప మీద కొట్టిన వానికి మరొక చెంప చూపించు’ అని బోధించిన యేసు అక్షరాలా దానిని తన జీవితంలో నెరవేర్చగలిగారు. యేసు దివ్యనామము విశ్వమంతటా మారుమోగడానికి గల అనేక కారణాలలో ‘ఆయన కారుణ్యం’ ప్రధానమైనది.క్రీస్తు శరీరధారిగా ఉన్న రోజుల్లో యెరూషలేములోని మేడగదిలో తన శిష్యుల పాదాలను కడిగాడు. అది ప్రజల గుండెల్లో శాశ్వతకాలం నిలిచిపోయే ఓ అపురూప సంఘటన. అప్పటికే ఆయనకు ఆ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రజాదరణ ఉంది. అన్ని వర్గాల ప్రజలు ఆయనను గొప్పవానిగా, దేవునిగా గుర్తించి ఆయనను వెంబడిస్తున్నారు. యేసు భోజనపంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని పక్కన ఉంచి ఒక తువాలు నడుమునకు కట్టుకొని, పళ్లెములో నీళ్లు పోసి తాను ఏర్పరచుకొన్న శిష్యుల పాదాలు కడుగుటకు, వాటిని తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టాడు. తాను కాళ్ళు కడిగే శిష్యులు చాలా సామాన్యమైన వారు. వారు ఆనాటి సమాజంలో విశిష్టులు కారు. ఆ సందర్భంలో శిష్యులు ఆయనను వారించినా భావితరాలకు స్ఫూర్తి కలుగుటకు, సేవాతత్పరతను అందరూ అలవాటు చేసుకొనుటకు ఆవిధంగా యేసు చేశాడు. తాను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన్ను తాను తగ్గించుకొని చేసిన ఆ సర్వోత్తమ కార్యము సాక్షాత్కరించిన జీవితాల్లో ‘సేవ’ పట్ల యథార్థ దృక్పథాన్ని రగిలించింది. ‘నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు’, ‘మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి’ అన్న క్రీస్తు బోధనలు చేతల్లో నిరూపించబడ్డాయి. ఈ అసాధారణ సంఘటన ఆధారంగా అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యానికి ఓ వినూత్న నిర్వచనాన్ని ఇచ్చాడు. ‘ప్రజల యొక్క, ప్రజల ద్వారా, ప్రజల కొరకు’ అనే నినాదంతో నవ్యపథ నిర్దేశాన్ని చేశాడు. ‘మనుష్యులంతా సమానమే’ అంటూ వర్ణ వివక్షను రూపుమాపడానికి తనవంతు కృషి చేశాడు.క్రీస్తులో ఉన్న శాంత స్వభావాన్ని, కారుణ్యాన్ని, ప్రేమను ఆకళింపు చేసుకొన్న మదర్ థెరిసా భారతదేశ చరిత్రలో ఓ శ్రేష్టమైన స్థానాన్ని పొందింది. కేవలం మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికే దీవెనకరంగా మారిన మదర్ క్రీస్తు ప్రేమాగ్ని జ్వాలల్లో నుంచి ఎగసిన ఓ నిప్పురవ్వ. అనాథలకు, అభాగ్యులకు సేవ చేయాలన్న తపనతో ఈ దేశానికి వచ్చిన మదర్ ఎందరినో అక్కున చేర్చుకొంది. కడుపునిండా అన్నం, కంటినిండా నిద్ర, ఒంటి నిండా బట్టలను ఇచ్చి మానవీయ హృదయంతో ప్రజలను ఆదుకొంది. ఎక్కడ నుంచో వచ్చిన ఆమెను ‘మదర్’ అని సంబోధిస్తూ ఆమెను గౌరవించిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత స్థితిగతులను విడిచి లోకహితం కోసం పాటుపడాలన్న ఆకాంక్షతో కలకత్తా వీధుల్లో అనాథ పిల్లల పోషణ కోసం యాచన చేసేది. ఆ ప్రక్రియలో ఒకసారి వికృత చేష్టలకు బందీయైన ఒక వ్యక్తి, మదర్ థెరిసాపై ఉమ్ము వేశాడు. ‘దీనత్వం’ అంటే ఏమిటో నేర్చుకుంది కదా! ఆ ఉమ్మిని తుడుచుకొంటూ ‘‘నా కోసం ఇది ఇచ్చావు... అనాథ పిల్లల కోసం ఏమి ఇస్తావు?’’ అని తిరిగి అడిగింది. ఆ ఒక్క మాటతో గర్వపు పొరలు విడిపోయాయి. ఇంతగా అవమానించినా తిరిగి ఏమీ అనని మదర్ గుండెల్లో ఉన్న తగ్గింపును అర్థం చేసుకొన్నాడు. జీవితాంతం మదర్ థెరిసా ఆశ్రమానికి తనకు తోచినంత సహాయం చెయ్యడం ప్రారంభించాడు. నోబెల్ బహుమతి ప్రదానం రోజున మదర్ మాట్లాడుతూ ‘క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించగలగడమే నిజమైన క్రైస్తవ్యం’ అని తాను ఎవ్వరి నుంచి సేవాస్ఫూర్తిని పొందిందో ఆ విషయాన్ని కచ్చితంగా ప్రపంచానికి తెలిపింది. నేటికీ ఆమె ద్వారా స్థాపించబడిన సంస్థల ద్వారా విశేషమైన సేవలు పేదలకు అభాగ్యులను అందుతున్నాయి. కొంత చేసి ఎంతో చేశామని ప్రగల్భాలు పలికే నేటి సమాజంలో ఎంతో చేసినా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో నింపబడిన వ్యక్తులను కనుగొనడం కొంచెం కష్టమే. అటువంటి వారిలో విలియం కేరీ ఒకడు. ఇంగ్లండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి ఎన్నో విశిష్ట కార్యాలు చేశాడు. ఒక్కమనిషి తన జీవితకాలంలో ఇన్ని కార్యాలు చేయగలడా? అనిపించే విధంగా సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. అంతే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను 36 భాషల్లోకి అనువదించాడు. అనేక భారతీయ భాషల్లో నిఘంటువులు రాశాడు. పట్టాను బహూకరించే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. స్వదేశ భాషలో మొట్టమొదటి వార్తాపత్రికను ప్రారంభించాడు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాను సాధించాలనుకున్న వాటిని సాధించి తీరాడు. దేశచరిత్రలో, ప్రజల గుండెల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాడు. జీవన పరిణామాలన్నింటిని సమదృష్టితో చూడగలిగే స్థితప్రజ్ఞతను ఆకళింపు చేసుకున్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి ఒకసారి ఇంగ్లండ్ వెళితే తన స్నేహితుడొకడు వచ్చి అపహాస్యంతో, విలియం కేరీని కించపరచాలనే ఉద్దేశంతో ‘నీవు చెప్పులు తయారు చేసుకొనే వ్యక్తివని మర్చిపోవద్దు’ అన్నాడు. క్రీస్తు కారుణ్యంతో, వినమ్రతతో నింపబడిన కేరీ ‘అయ్యా! నేను చెప్పులు తయారు చేసేవాణ్ణి కాదు... వాటిని కేవలం బాగుచేసుకునేవాణ్ణి’’ అని బదులిచ్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన కేరీ ఇచ్చిన సమాధానం, అతనిలో ఉన్న తగ్గింపు ఆ వ్యక్తిని ఎంతగానో ఆశ్చర్యపరచింది. అంతేమరి! నిండుకుండ ఎప్పుడూ తొణకదు కదా! ‘కారుచీకటిలో కాంతిరేఖ’ అని కేరీని పిలవడంలో అతిశయోక్తి లేదుకదా! ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. ప్రపంచంలో నేటికీ కోట్ల సంఖ్యలో ప్రజలు క్రీస్తు కారుణ్యమునకు, దీనత్వమునకు ఆరాధకులే. ఆధ్యాత్మిక చింతన కోసం, జీవన సాఫల్యం కోసం తపించే ప్రతి ఒక్కరూ క్రీస్తులో ఉన్న మహోన్నత ప్రేమతత్వానికి మంత్రముగ్ధులే. మానవ హృదయ వైశాల్యాన్ని పెంచుతూ, గుణాత్మక పరివర్తనకు దోహదపడుతున్న క్రీస్తుప్రభువు తగ్గింపు జీవితం సదా అభినందనీయం. యేసుక్రీస్తు పరలోకములో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి, తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడని పౌలు మహాశయుడు తెలియజేశాడు. నిజమే.. యేసు పుట్టింది పశువులశాలలో. పసికందుగా పవళించింది గరుకైన పశువుల తొట్టెలో! దేవుడు ఈ లోకంలో పుట్టాలనుకుంటే ఆయన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో పూల పాన్పులు, అంతఃపురాలు ఆయనకు ఆహ్వానం పలుకలేవా? ఎందుకు ఆయన పశువులశాలలో పుట్టాడు? పశువుల శాల వంటి మానవ çహృదయాన్ని పావనపరచుటకు ఆయన పశువుల తొట్టెలో జన్మించాడు. రెండవ కారణం ‘‘పశువుల శాలలోనికి ఎవ్వరైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు’’. క్రీస్తును దర్శించుటకు కుల మత ప్రాంత వర్గ భేదాలు లేనేలేవు. వాస్తవానికి క్రీస్తు పుట్టినప్పుడు ఆయనను మొదటగా దర్శించుకున్నది గొర్రెల కాపరులు. రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న గొర్రెల కాపరులకు దూత ద్వారా శుభవార్త అందింది. భక్తి పారవశ్యంతో క్రీస్తును దర్శించుకొని పరమానందభరితులయ్యారు. ఇది నిజంగా విడ్డూరమే! లోకరక్షకుడు అందరికీ చెందినవాడు. ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని క్రీస్తు తన జన్మ ద్వారా నిరూపించాడు. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణాపూరితమైన మనసును వేరుచేయలేము. క్రీస్తు ప్రేమ అనిర్వచనీయమైనది. అవధులు, షరతులు లేనిది. విలువైన ఆయన ప్రేమలో వంచన లేదు. మధురమైన క్రీస్తు ప్రేమకు మరణం అంటే ఏమిటో తెలియదు. ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది నజరేతులోని ఒక వడ్లవాని ఇంటిలో. ఆ కాలంలో గలిలయలోని నజరేతుకు ఏమాత్రం పేరుప్రఖ్యాతులు లేవు. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యోసేపు అనే వ్యక్తికి అన్ని విషయాలలో సహాయం చేశాడు. కష్టమంటే ఏమిటో తెలుసు. చెమటోడ్చడం అంటే తెలుసు యేసుకు. మనిషి సాధక బాధకాలను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. ఆ కాలంలో పరమ పాపులుగా పిలువబడే సుంకరులతో అనేకసార్లు భోజనం చేశాడు. వారితో సహవాసం చేసి దైవ మార్గాన్ని వారికి ఉపదేశించాడు. దైవభక్తిలో ఎడతెగని, అలుపెరుగని అలౌకిక అనుభవాలు దాగి ఉంటాయని తెలియచెప్పాడు. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి çహృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి. ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి. కానీ తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చిన ప్పుడు కుష్టు వ్యాధిగ్రస్తులను కౌగిలించుకున్నాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధిగ్రస్తులను అంటరాని వారుగా పరిగణించేవారు. సమాజంలోనికి రానిచ్చేవారు కాదు. సొంత కుటుంబ సభ్యులు కూడా విపరీతంగా ద్వేషించేవారు. అలాంటివారిని తన దివ్య స్పర్శతో బాగుచేశాడు. వారికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. రోగ పీడితులను పరామర్శించాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. వికటముతో మాట్లాడి, చులకనగా వ్యవహరించిన వారిని కూడా ప్రేమపూర్వక పదజాలంతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. మట్టల ఆదివారం రోజున క్రీస్తు గాడిదపై ప్రయాణం చేశాడు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు అని జెకర్యా ద్వారా పలుకబడిన ప్రవచనం నెరవేరింది. పూర్వదినాల్లో ఏ రాజైనా గుర్రంపై ప్రయాణిçస్తూ మరో పట్టణానికి వెళ్తే యుద్ధానికి వస్తున్నాడని ఇట్టే గ్రహించేవారు. గాడిదపై వస్తుంటే సమాధానం కోసం వస్తున్నాడని గ్రహించేవారు. కలవరంలో నిండిపోయిన యెరూషలేము పట్టణానికి సమాధానాన్ని ప్రకటించడానికి క్రీస్తు గాడిదపై దీనుడుగా ప్రయాణం చేశాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి నేను విశ్రాంతిని కలుగచేతును’’ అని క్రీస్తు ఏనాడో ప్రకటించాడు. నేటి దినాల్లో మనిషి మనశ్శాంతి కోసం తపిస్తున్నాడన్నది కాదనలేని సత్యం. విశ్యవ్యాప్తంగా అన్ని రకాల ప్రజలు శాంతి కోసం అన్వేషిస్తున్నారు. కొందరు ధన ధాన్యాలలో శాంతిని వెదకుతుంటే మరికొందరు కీర్తి ప్రతిష్టలలో వెదకుచున్నారు. కొందరు బంధాల్లో శాంతిని పొందుకోవాలని తపిస్తుంటే మరికొందరు ఒంటరి తనంలోనే సంతోషాన్ని వెదకుచున్నారు. ఈ వెతుకులాటలో నిజమైన శాంతి దొరకక అనేకులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. వాస్తవాన్ని అంగీకరించే మనస్సుంటే శాంతి అనేది భౌతిక సంబంధమైన విషయాలపై ఆధారపడి లేదు. ప్రపంచంలో రెండు రకాల ప్రజలుంటారు. కొందరు శాంతి సమాధానాల కోసం పరితపిస్తారు, మరికొందరు శాంతితో జీవిస్తారు. ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి గలవాడు శాంతి సమాధానాలతో జీవిస్తాడని భారతదేశ రెండవ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సందర్భంలో తెలియజేశారు. అవును! పరమాత్ముడు సమాధానానికి సృష్టికర్త గనుక ఆయన పాదాల దగ్గర కాకపోతే మరెక్కడ శాంతి దొరుకుతుంది? క్రీస్తు పొంతి పిలాతు ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడి, వస్త్ర హీనునిగా చేయబడి, పరమ పవిత్రుడైనప్పటికీ మనిషి కోసం దోషిలా నిలువబడి, మానవ అపహాస్యాన్ని, హేళనను భరించిన సహనశీలి. తాను చేయని నేరాలను తలదించుకొని భరించాడు. చివరకు తనను యెరూషలేము వీధుల్లో ఈడ్చి, కల్వరి కొండపై మేకులతో సిలువకు కొట్టి, ముళ్ల కిరీటం ధరింపజేసి కిరాతకంగా హింసించిన వారిని కూడా క్షమించిన దయార్ద్ర హృదయుడు యేసు. ఒక్క ఎదురుమాట చెప్పినందుకే మొండెము నుండి తల వేరు చేయించిన చక్రవర్తులు ఎందరో చరిత్రలో ఉన్నారు. తమ మాటకు ఎదురు నిల్చినవారిని ఖండములుగా నరికినవారున్నారు. తమను అవమానపరచారని కత్తి వాతకు గురిచేసిన రాజులెందరో మానవ చరిత్రలో ఉండగా ప్రేమ చూపి సత్క్రియలు చేసి, దయను కురిపించి, ఆకలి తీర్చి, స్వస్థపరచి, మృతులను సైతం సజీవులుగా చేసిన మహోన్నతుడు యేసు. యేసు ఏమి సొంతం చేసుకోవాలని అనుకున్నాడు? ఆయన పుట్టింది ఎవరో పశువులపాకలో. ఒకసారి ఓ పరాయి పడవలో అమరమున తలవాల్చి నిదురించాడు. అనేక రాత్రులు ఒంటరిగా గెత్సేమనే తోటలో ప్రార్థనలో గడిపాడు. ఆఖరికి ఆయన మరణించిన తరువాత కూడా అరిమతయి యోసేపు అనువాని సమాధిలో ఉంచబడ్డాడు. ఇవన్నీ దేనికోసం? కేవలం మనిషిని సొంతం చేసుకోవాలన్న ఆశయంతో, తపనతో ఆయన దేన్నీ సొంతం చేసుకోలేదు. అవును! పరమాత్ముడు మనిషి çహృదయంలో వసించాలని ఆశిస్తున్నాడు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని క్రీస్తు పలికాడు. అది అక్షరాలా ఆయన జీవితంలో నెరవేరింది. ఒంటరిగా సిలువపై వేలాడుతూ ప్రజల పాపాల కోసం, పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడైన ఫ్లావియస్ జోసీఫసు కూడా క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించాడు. ఆ సమయంలో సిలువ చుట్టూ చేరిన అనేకులు సిలువ నుంచి దిగిరా! నీవు దైవకుమారుడని నమ్ముతామని క్రీస్తును సవాలు చేశారు. అంతమంది సవాలు చేస్తున్నా క్రీస్తు ఎందుకు సిలువను దిగలేదు? ఆ స్థానం నుంచి క్రీస్తు తప్పుకుంటే మానవునికి రక్షణ లేదు గనుక. పాప పరిహారం జరగదు గనుక.సమాధిలో ఉంచబడిన క్రీస్తు జీవితం ముగిసిపోయిందనుకున్నారంతా! ఆయన జీవితం సమాప్తమైనదని భావించారు. కానీ వారి అంచనాలను పటాపంచలు చేస్తూ మూడవ రోజున మరణ బంధనాలను తెంచుకొని యేసుక్రీస్తు బయటకు వచ్చారు. సమాధి ముందు పెట్టబడిన పెద్దరాయిగాని, చుట్టూ మోహరించి ఉన్న రోమన్ సైనికులు గాని ఆయన పునరుత్థానాన్ని అడ్డుకోలేకపోయారు. ఎన్నో ఏళ్లు మనిషిని ఏలుబడి చేసిన మరణం ఆరోజు మరణించింది. సత్యాన్ని ఏ ఒక్కరూ శాశ్వత సమాధి చేయలేరని ఋజువుచేయబడింది. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు గనుక ఇప్పుడు హెచ్చింపబడ్డాడు. సమాధి నుంచి బయటకు వచ్చాడు గనుక ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి లాజినస్. ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తుండగా పిలాతు భార్య ప్రొక్యులా ఇలా అడిగింది – ‘‘క్రీస్తు పై నీ అభిప్రాయం ఏమిటి?’‘. ‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణం కచ్చితంగా ఓడిపోతుంది. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి శ్రీకారం చుడతాడు. విశ్వంలో ఆయన పేరు మారుమ్రోగుతుంది. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి గాని, శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. ప్రియ నేస్తమా! ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? అన్యాయం జరిగిందని బాధపడుతున్నావా? ప్రజలంతా నిన్ను నిందిస్తూ వేధిస్తున్నారా? నీవు ఎందుకూ పనికిరావు, నీ వల్ల ఏదీ కాదు అనినిన్ను హేళన చేస్తున్నారా? మౌనం వహించు! నీవు చేయాలనుకున్న కార్యమును నెరవేర్చడానికి ముందుకు సాగిపో! మరణాన్ని జయించిన దేవుని అనిర్వచనీయమైన కృప మరియు శక్తి నీకు తోడుగా ఉంటాయి. ఆయన్ను గుండెల్లో ప్రతిష్టించి క్లిష్ట పరిస్థితులను చాకచక్యంగా ఎదుర్కో, నిందలూ అవమానాలూ వస్తున్నాయని కృంగిపోకు! ప్రపంచంలోని విజేతలందరూ ఏదోక సందర్భంలో వాటిని ఎదుర్కొన్నవారే. ధైర్యంతో ముందుకు సాగిపో! నీవు తప్పకుండా విజయం సాధిస్తావు. ఈ రోజు నీ తగ్గింపే రేపు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
-
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
సాక్షి, అమరావతి: కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
మన కోసమే సిలువ మరణం
ఇవాళ గుడ్ ఫ్రైడే, అంటే శుభ శుక్రవారం, యేసు క్రీస్తును కల్వరి సిలువ వేసినరోజే శుభ శుక్రవారం అని పిలువబడుతోంది, అదేంటి యేసు క్రీస్తు సిలువలో మరణించిన రోజు శుభ శుక్రవారం ఎలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఇలా లోకంలో నిజంగా యేసు క్రీస్తును ఎరుగని వారందరూ ప్రశ్నిస్తూ ఉంటారు కదూ? అయినా మరణించిన దినం చెడు అవుతుంది కానీ, మంచి దినం కాదు కదా అనే వారు కూడా ఉన్నారు. అయితే, యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థ » లిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది. దానికి కారణం అపవాదిని మరణము ద్వారా జయించిన ప్రభువు జీవిత కాలమంతా మరణ భయంతో పీడింపబడుతున్న మనలను విడిపించినదిగా ఉన్నది గనుక యేసు క్రీస్తు మరణము శుభ దినముగా పిలువబడుతుంది. అవును, ఎవరైతే యేసు క్రీస్తు ప్రేమను తెలుసుకొని ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆయన మరణములో ఉన్న జయము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, కాబట్టి, యేసు క్రీస్తు మరణించిన రోజు గుడ్ ఫ్రైడే అయింది. లోకమంతటా ఈ శుభ శుక్రవారమును పూర్వం ఆచారంగా ఆచరిస్తుంటారేమో గాని, యేసు క్రీస్తును ఎరిగిన వారు ఈ శుభ శుక్రవారమును ఎంతో ఆనందంగాను స్వీకరిస్తారు, మరొకసారి తమ పాప క్షమాపణల కొరకు ఆ కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసుప్రభువు మరణాన్ని జ్ఞాపకము చేసుకుని తమ్ము తాము సమర్పించుకుంటారు. ప్రతీ మనిషికీ మరణం తప్పదు. ఎంతోమంది దేశం కోసం, రాష్ట్రం కోసం మరణిస్తున్నారు. త్యాగంతో మరణిస్తున్నారు. ఇలా పలువిధాలైన మరణాలను మనము ఈ భూలోకంలో చూస్తున్నాము. కానీ, యేసు క్రీస్తు మాత్రం సర్వజనులను ప్రేమించి వారి పాప ప్రాయశ్చిత్త నిమిత్తము సిలువ వేయబడ్డాడు. అయితే, యేసు క్రీస్తు మరణం ఒక్కటే ప్రత్యేకమైనదిగా ఉంది. ఆయన మరణించినప్పటికీ మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడై లేచాడు.మీకు తెలుసా? ఆనాడు యెరూషలేము పట్టణములో సమాధులు భూమిలో తవ్వేవారు కాదు. కొండలలో తొలుచునవిగా ఉండేవి, అలాగే రాతి సమాధి లో యేసు క్రీస్తు శరీరాన్ని ఉంచి ఒక పెద్ద బండను ద్వారముగా అడ్డముగా నిలిపారు. అయితే మూడవ దినాన రాతి సమాధి తెరవబడింది, యేసు క్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచి యున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇది సత్యం. ఇది యథార్థం. ఈనాటికీ యేసు క్రీస్తు ఖాళీ సమాధి యెరూషలేము పట్టణములో మనం చూడగలం. యేసు క్రీస్తు మరణించడమే కాదు తిరిగి లేచాడు కనుక శుక్రవారం నాడు శుభ శుక్రవారంగా జ్ఞాపకం చేసుకుంటున్న వారందరు ఆదివారమును ఈస్టర్‌గా అంటే యేసు క్రీస్తు పునరుత్థానుడైన ఆదివారముగా జ్ఞాపకం చేసుకుంటారు. యేసు క్రీస్తు మరణం మానవ జాతికి జీవము కలుగజేసేదిగా ఉన్నందువలన సకల మానవుల పాప పరిహారార్థలిగా ప్రాణమిచ్చిన ప్రభువు మరణం సర్వలోకానికి ఆనందకరంగా మారింది. – బ్రదర్ కర్నే జాన్ -
రక్షకుని వీక్షణ
క్రీస్తు సందేశం ♦ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు ♦ దీనులను ఆదరించి అక్కున చేర్చుకోండి ♦ఆపదలో ఉన్న వారిని రక్షించండి ♦ నీతికొరకు ఆకలి దప్పులు కలిగి ఉండండి ♦మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి ♦ కనిపించే నీ సోదరుని ప్రేమించకపోతే కనిపించని దైవాన్ని ఎలా ప్రేమించగలవు? ♦ నీ కుడిచెంపను కొడితే ఎడమ చెంపను చూపు.. నా మాటలు సత్యం. అవే మిమ్ములను స్వతంత్రులను చేస్తాయి ♦ ప్రేమ నిండిన హృదయం నుండే అహింస, సహనం అలవోకగా ప్రవహిస్తాయి. న్యూయార్కు పట్టణంలోని ఒక షాపింగ్ మాల్లో ఒక రోజు ఓ దుండగుడు అత్యాధునిక మారణాయుధాన్ని చేత పట్టుకొని క్యాషియర్ జెస్సీకా వైపు గురి పెడుతూ, కౌంటర్లో ఉన్న డబ్బంతా వెంటనే ఇవ్వకపోతే చంపేస్తానని బెదరించాడు. అయితే క్రీస్తు విశ్వాసి అయిన జñ స్సికా ఏమాత్రం చలించక, గట్టిగా ‘జీసస్ నామంలో నిన్ను ఆదేశిస్తున్నాను, నీ మారణాయుధాన్ని కింద పడేసి పారిపో’ అని అరచింది. ఆశ్చర్యంగా ఆమె ఆదేశాన్ని పాటిస్తూ దుండగుడు తన మెషీన్‌గన్ కింద పడేసి వణుకుతూ చేతులు పైకెత్తాడు. ఈలోగా మాల్లో ఉన్న గార్డులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దుండగుడిని విచారించగా అతడు ఇలా చెప్పాడు: ‘‘ఆ అమ్మాయి స్వరంలో నుండి ఏదో గొప్ప శక్తి వచ్చి నన్ను నిర్వీర్యుణ్ణి చేసింది. నాలో గొప్ప భయం ఉద్భవించింది. అందుకే లొంగిపోవలసి వచ్చింది’’.. అని. క్రీస్తు నామంలో గొప్ప శక్తి ఉంది. దానిని గుర్తించి, క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తీ అన్ని పరిస్థితులలోనూ ధైర్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలడు. రేపు క్రిస్మస్. క్రిస్మస్ను ఉద్దేశిస్తూ, బైబిలు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది: ‘ఇదిగో దావీదు పట్టణమందు నేడు ‘రక్షకుడు’ మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’’ (లూకా 2:11) రక్షకుడు అంటే రక్షించేవాడని అర్థం. ఇహ లోక రక్షకులు కేవలం శరీరాన్ని దుండగుల హింసాత్మక చర్యల నుండి రక్షించడానికి సహాయపడతారు. అయితే క్రీస్తు ప్రభువు పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చిన ఏకైక రక్షకుడు. ఆయన.. శరీరాన్నే కాక నరకంలో నశించిపోకుండా, ‘ఆత్మ’ను కూడా రక్షించగల సమర్థుడు. ఆయనను విశ్వసించిన వారు పాపాన్ని అసహ్యించుకుంటారు. పుణ్యకార్యాలను చేస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. వారు దేనికీ భయపడరు. సత్యం కోసం జీవిస్తారు. సత్యాన్ని ప్రకటిస్తారు. క్రిస్మస్ శుభాకాంక్షలు. మీకు తెలుసా? ♦ క్రైస్ట్ అంటే అభిషేకించబడిన రాజు అని, మాస్ అంటే ఆరాధించడం అని అర్థం ∙యేసు అంటే రక్షకుడు అని అర్థం ♦ మేరి లేక మరియ అనే పేరుకు అర్థం సమర్పణ ♦ ప్రజలను పాపాల నుంచి రక్షించేవాడు కనుక యేసు అయ్యాడు ♦ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత మొదటిగా ముద్రించిన గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథమే. ఇది ప్రపంచ భాషలన్నింటిలోకీ తర్జుమా అయింది ♦ యేసుక్రీస్తు మాటలే తనకు దిశానిర్దేశం చేశాయని తన ఆత్మకథలో జాతిపిత మహాత్మాగాంధీ రాసుకున్నారు ♦ ఈ భూమి మీద ఆయన జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులతోనే నివసించాడు ♦ యేసుప్రభువు కాలంలో నేను జీవించి ఉంటే, ఆయన పాదాలను నా రక్తంతో కడిగి ఉండేవాణ్ణి అన్న వివేకానందుడి మాటలు మన దేశంలో క్రీస్తు పట్ల ఉన్న గౌరవాన్ని కళ్లకు కడతాయి ♦ హెబ్రూ భాషలో యేసును మెస్సయ అంటారు ♦ 16వ శతాబ్దంలో జర్మనీలోనూ, 15వ శతాబ్దంలో లివోనియా (ప్రస్తుతం లాత్వియా)లో మొదట క్రిస్మస్ చెట్టును అలంకరించడం అనే సంప్రదాయం మొదలైందంటారు ♦ శాంతాక్లాజ్ (సెయింట్ నికోలస్) క్రిస్టమస్‌కు మొదటి రోజు రాత్రి (డిసెంబర్ 24) చిన్నారులకు, పెద్దలకు కేకులను, ఆటబొమ్మలను, బహుమతుల్ని అందించే ఒక పాత్ర. శాంతా క్లాజ్ అనే పదం డచ్ భాష నుండి వచ్చింది ♦ కొందరు క్రైస్తవులు డిసెంబరు 25న, మరి కొంతమంది ఆర్థడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరి 7న క్రిస్టమస్‌ను జరుపుకుంటారు. – యస్. విజయ భాస్కర్ -
అజేయుల్ని చేసేది ఆ ఒక్కడే!
‘ఆ తర్వాత’ యేసుప్రభువు తిబెరియ సముద్రతీరంలో శిష్యులకు ‘మళ్లీ’ తనను ప్రత్యక్షపర్చుకున్నాడంటుంది బైబిలులోని యోహాను సువార్త (21:1). ఈ వాక్యంలోని ‘ఆ తర్వాత’, ‘మళ్లీ’ అనే మాటలు చరిత్ర గతినే మార్చిన ఒక మహోన్నత ఘటనకు సాదృశ్యాలు. రోమా ప్రభుత్వం, యూదులు కలిసి యేసును సిలువ వేయగా ఆయన చనిపోయిన ‘తర్వాత’, ప్రాణభయంతో శిష్యులంతా ఆయన్ను వదిలి పారిపోయి తమ భవిష్యత్తుంతా అంధకారమైందన్న నిరాశావాదంలో కూరుకుపోయిన ‘తర్వాత’, యేసు పునరుత్థానుడయ్యాడని తెలిసినా, ఆయనకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి పారిపోయిన తమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఇక దగ్గరకి రానివ్వరని శిష్యులు నిర్ధారణకు వచ్చిన ‘తర్వాత’, యేసు వారిని వెంబడిస్తూ యెరూషలేము నుండి తెబిరియ సముద్ర తీరానికి రావడం, వారికి ‘మళ్లీ’ ప్రత్యక్షమై వారితో సహవసించడం తిరుగులేని, ఎన్నటికీ తరగని దేవుని అద్భుత ప్రేమకు తార్కాణం! మూడేళ్ల క్రితం ఇదే సముద్రతీరంలో నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను చేస్తానన్న ప్రభువు వాగ్దానంతో (లూకా 5:10) వారి విశ్వాస యాత్ర ఆరంభమైంది. ఇపుడు భవిష్యత్తంతా అంధకారమయంగా కనిపించగా, యేసు లేకుండా మళ్లీ అదే ప్రదేశానికొచ్చారు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక్క చేపను కూడా పట్టలేకపోయిన ‘వైఫల్యం’ వారిని మరింత కృంగదీసిన నేపథ్యంలో, ‘సూర్యోదయవేళ’ (యోహాను 21:4) యేసు వారికి తీరంలో కనిపించి పలకరించాడు. పిరికితనం, విద్రోహం, ఇప్పుడు వైఫల్యంతో కూడిన వారి నిరాశావాదమంతా ప్రభువు సాక్షాత్కారంతో పటాపంచలయింది. నిజమే, లోకాన్నంతా వెలుగుమయం చేసే సూర్యోదయం, ఇంటి కిటికీలు తలుపులు తెరిస్తేనే, మన గుండె ద్వారాలు తెరిస్తేనే మన సొంతమవుతుంది. యేసు సహచర్యంతో వారానాడు ఆ తర్వాత బోలెడు చేపలు పట్టారు. ప్రభువు వారితో అదే తీరంలో ఆనాడే పునరుత్థాన వినూత్న యుగానికి చెందిన ఒక కొత్త నిబంధన వారితో చేసుకోగా, నాటి నుండి అసమాన సువార్తవీరులయ్యారు, హతసాక్షులై మానవ చరిత్రను తిరగరాశారు. లోకాన్ని మనమెంత ప్రేమించినా అది మనకిచ్చేది అంధకారమే, నిరాశావాదమే, వైఫల్యమే!! కాని ప్రభువు మళ్లీ ప్రవేశించడంతో విశ్వాస జీవితంలో సూర్యోదయమవుతుంది, బతుకు బాటంతా వెలుగుమయమవుతుంది. వెంటాడి మరీ చీకటిని పటాపంచలు చేసే శక్తి ఎన్నటికీ తరగని, మారని, వాడని దేవుని అద్భుతమైన ప్రేమది. అందుకే పాపులను, పడిపోయిన వారిని ప్రేమించి గుండెలకు నిండుగా హత్తుకొని వారి జీవితాలను దివ్యంగా పునరుద్ధరించే ప్రభువని యేసుకు పేరు. పిరికితనం, ద్రోహస్వభావం, పలాయనవాదం, నిరాశావాదం మనలోనే తిష్టవేసుకున్న మన అంతఃశత్రువులు. వైఫల్యం, అంధకారం అవి మనకిచ్చే బహుమానాలు. వాటి మీద విజయమిచ్చేవాడు, అలా మనల్ని అజేయులను చేసేవాడు మాత్రం ప్రభువే! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవిక శక్తి ఎన్నడూ దిగజారదు!
శాస్త్రులు, పరిసయ్యలు కొందరు యేసును ఒక సూచక క్రియ అంటే అద్భుతం చేయమని అడిగారు. యేసు చేసిన అద్భుతాలతో ఆ ప్రాంతమంతటా ఆయనకెంతో పేరు వచ్చింది. అయితే, పేరుకోసం, తన దైవత్వాన్ని రుజువు చేయడం కోసం యేసు ఎన్నడూ అద్భుతాలు చేయలేదు. ఆయా వ్యక్తుల అవసరాలు తీర్చడానికి మాత్రమే ఆయన అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాల గురించి విన్న వారు ఆయన అద్భుతాలు చేస్తుంటే ప్రత్యక్షంగా చూడాలని చాలామంది ఉబలాటపడ్డారు. యూదయలో రోమా ప్రతినిధిగా ఉన్న పిలాతు కూడా తన ఎదుట విచారణ కోసం తలదాచుకుని నిలబడి ఉన్న యేసు క్రీస్తు ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూసి ఆన ందించాలనే గాక, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన్ని విడుదల చేయాలనీ పిలాతు అభిమతం. కాని యేసు అద్భుతం చేయలేదు సరికదా తలవంచి పిలాతు విధించిన సిలువ శిక్షను భరించి చరిత్రలో రోమా ప్రభుత్వం సిలువ వేసి చంపిన కరడుగట్టిన నేరస్తులందరిలోకి అత్యంత సాత్వికుడిగా పేరు పొందాడు. యేసు అద్భుతాలు చేశాడని నాలుగు సువార్తలూ సవివరంగా పేర్కొన్నాయి. ఆయన శిష్యులు, ఇతర అపొస్తలులు కూడా చేసిన అద్భుతాల ప్రస్తావన అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. ఆయన కొందరికి స్వస్థత వరాన్నిస్తాడని, తనను విశ్వసించేవారు తాను చేసిన కార్యాలకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యేసే స్వయంగా చేసిన ప్రకటన కూడా బైబిలులో ఉంది (యోహాను 14:12). కాని ఈ స్వస్థతలు, అద్భుతాలు చేసే దైవిక శక్తిని లోక ప్రయోజనాలు, స్వార్థం, ధనార్జన కోసం వాడేందుకు అనుమతి మాత్రం బైబిలులో ఎక్కడా లేదు. ఈ వరాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు, పేరు సంపాదించడానికి, ప్రజల్ని అల్లకల్లోలం పాలు చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. పాపాలను క్షమించి పరలోకాన్ని ప్రసాదించ గల రక్షకుడిగా గాక, యేసును కేవలం స్వస్థతలు, అద్భుతాలు చేసే గారడీవాడిగా చిత్రీకరించడం కన్నా భ్రష్టత్వం మరొకటి లేదు. పరిశుద్ధాత్మశక్తి నిజంగా ఉన్న వాడి నోట డబ్బు మాటే రాదు. డబ్బున్న చోట పరిశుద్ధాత్ముడుండడు. ఈ రెండూ పర స్పర విరుద్ధాంశాలు. అవి ఎన్నడూ కలవవు. లోకాన్ని మార్చే ‘దైవిక శక్తి’ లోకంతో ఎన్నడూ రాజీపడదు. రాజీపడ్డ మరుక్షణం ఆ శక్తి నిర్వీర్యమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
సంశయం లేని నమ్మకమే దృఢవిశ్వాసం
మతం మనిషికుంది. దేవునికి లేదు. ఈ విధి విధానాలను బోధించడానికి, అమలు చేయడానికీ తనకంటూ ప్రత్యేక జనాంగంగా యూదులను ఏర్పర్చుకున్నా, యేసుకీస్తు వంశావళిలోనే రూతు అనే మోయాబీయురాలిని దేవుడు చేర్చడం ఆయన సార్వత్రికతకు స్పష్టమైన నిదర్శనం (మత్త 1:5). రూతు మోయాబీయాలనే అన్యురాలు. యూదు దేశంలో క్షామం ఏర్పడినప్పుడు నయోమి అనే తన భార్యను ఇద్దరు కుమారులను తీసుకుని ఎలీమెలెకు అనే వ్యక్తి మోయాబు దేశానికి వలస వెళ్లాడు. కాని అక్కడ మరిన్ని కష్టాలెదురై, ఎరీమెలకు, అతని ఇద్దరు కుమారులు చనిపోగా, వారిద్దరిలో ఒకరికి భార్యౖయెన రూతు తన అత్తను, ఆమె దేవుణ్ణి గొప్పగా విశ్వసించి ఆమెతో సహా వారి స్వస్థలమైన బెత్లెహాముకు తిరిగొచ్చింది. బతకడానికి వలస వెళ్లిన నయోమి కుటుంబం అక్కడ మరింత చితికిపోయి అలా తిరిగొచ్చింది. అయితే ధర్మశాస్త్రం వితంతువుల పునర్వివాహాన్ని అదే వంశంలో కొన్ని షరతులకు లోబడి జరిగేందుకు అనుమతించింది. ఆ పరిస్థితులలో పూట గyì చేందుకుగాను రూతు కోతలు జరుగుతున్న కాలంలో పరిగె ఏరుకోవడానికి, బోయజు అనే గొప్ప యూదు విశ్వాసికి చెందిన పొలానికి వెళ్లింది. చేలల్లో పంట కోసే సమయంలో కొన్ని పనలు, ధాన్యం నిరుపేదలు, పరదేశుల కోసం వదలాలన్న దేవుని నిబంధన మేరకు బోయజు ఆమెను తన పొలంలో పరిగె ఏరుకోమన్నాడు. పైగా ఆమె గురించి ఎంతో దయగా మాట్లాడి ఆమెను బాధించ వద్దని తన పనివారిని హెచ్చరించాడు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో, బోజయు తన ‘బంధువు ధర్మం’ చొప్పున రూతును పెళ్లాడగా వారికి మనుమడైన యెష్షయికి దావీదు జన్మించాడు. ఆ దావీదు వంశంలోనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు. అలా రూతు మోయాబీయురాలైనా, ఒక రాజవంశంలో భాగమైంది. దేవుని సంకల్పాలు అనూహ్యమైనవి, అమరమైనవి కూడా!! పరిగె ధాన్యాన్ని ఏరుకోవడానికి ఒక పరదేశిగా, నిరుపేదగా వెళ్లిన రూతును దేవుడు కనికరించి బోయజు అనే సద్వర్తనుడు, సొంత వంశస్తుని పొలానికి నడిపించి, చివరికి అతన్నే భర్తగా అనుగ్రహించి, యేసుక్రీస్తు వంశావళిలో భాగమయ్యే ధన్యతను దేవుడామెకిచ్చాడు. దేవుని విశ్వసించడమే రూతు చేసిన పని. ఆ తరువాత జరిగిందంతా దేవుని సంకల్పం మేరకు జరిగిపోయింది. అందుకే ఆయన మన గురించి చింతించే దేవుడని బైబిలు చెబుతోంది (1 పేతురు 5:7). విశ్వాసానికి విరుద్ధాంశం సంశయం!! విశ్వాసుల జీవితాల్లో అశాంతిని రేపేవే సంశయాలు, సందిగ్ధాలు!! దేవుని పట్ల మనకున్న విశ్వాసంలో స్పష్టత, దృఢత్వం ఉండాలి. ఆశీర్వాదాల వరదకు అవే కారణాలవుతాయి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవారాధనా? ధనారాధనా?
‘‘ఆదిమ కాలపు చర్చిల్లో విశ్వసించిన వాళ్లంతా ఏకహృదయం, ఏకాత్మగలవారు. తమకున్నవన్నీ తమవేనని ఎవరూ తలచలేదు. వాళ్లంతా (విశ్వాసులు) తమకు కలిగినవి సమిష్టిగా పంచుకున్నారు’’ అని బైబిల్ నాటి విశ్వాసుల ఔన్నత్యాన్ని శ్లాఘిస్తోంది (అపో.కా.4 4:32) ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల ఔన్నత్యాన్ని కోరుకున్నట్టే, పరలోకపు తండ్రిౖయెన దేవుడు కూడా తన సంతానమైన విశ్వాసులు ఆత్మీయంగా ఉన్నతస్థాయి నందుకోవాలని సంకల్పించాడు. వారికి దైవికలక్షణాలైన ప్రేమ, పవిత్రత, క్షమాపణ, ధర్మం, నిజాయితీ యథార్థత, నిస్వార్థత, నిష్కల్మషత్వాన్ని నేర్పించే పాఠశాలగా పరిశుద్ధాత్ముడే ప్రబోధకుడుగా యేసుక్రీస్తు ఆరోహణానంతరం ‘చర్చి’ని దేవుడు నిర్మించాడు. దేవుని ఆరాధనాస్థలాలైన చర్చిలు, సామాజిక, ఆర్థిక, ప్రాంతీయ, వర్ణ, వర్గ, భాషావివక్షలకు అతీతమైన వ్యవస్థగా ఆయన నిర్దేశించి నియమించాడు. ఆదిమ కాలంలో అపొస్తలుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆరంభమైన చర్చిలన్నీ ఆ కోవకే చెందినవిగా భాసిల్లి దైవసంకల్పాన్ని నెరవేర్చాయి. అంటే పరలోకానందాన్ని, అనుభవాన్ని, ఆనందాన్ని రుచి చూపించే తొలిమెట్లుగా చర్చిలు విలసిల్లాయి. ఆ చర్చిల కారణంగానే ఈ 2000 ఏళ్లలో ఎన్నడూ జరగనంత సువార్త పరిచర్య మొదటి రెండు శతాబ్దాల్లో జరిగింది. కాని ఈనాడు? ఈ 8 శతాబ్దాల్లో ఆయా వినూత్నావిష్కరణలతో మనిషి జీవితంలో వేగం పెరిగి నాణ్యత తగ్గింది. ఆవిరి యంత్రం, విద్యుచ్ఛక్తి, ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరణలతో మనిషి అనూహ్యమైన ప్రగతి సాధించాడు. అంతే అనూహ్యంగా జీవితంలో అత్యంత యాంత్రికమయ్యాడు. మరోవిధంగా చెప్పాలంటే, మానవ ప్రగతి యావత్తూ ప్రచ్ఛన్నంగా ‘ధనశక్తి’కి మనిషిని బానిసను చేసింది. మనిషి కుటుంబం, సమాజం చివరికి పవిత్ర ఆరాధనాస్థలాలు కూడా ధనశక్తికి దాసోహమయ్యాయి. దైవిక లక్షణాలు గల ఈ లోకంలో విలువ లేని ఒక వికృత వ్యవస్థను డబ్బు సమాంతరంగా సృష్టించి అంతటా వ్యాపింపజేసింది. ఆరోగ్యకరమైన సమాజానికి పునాదులైన మానవ సామాజిక, కుటుంబ బంధాలను పలచన చేయడమేగాక కలుషితం చేసింది డబ్బు. ఒక్క క్రైస్తవంలోనే కాదు అంతటా జరిగిన, జరుగుతున్న పరిణామమిది. కాకపోతే దేవుని స్థానాన్ని దైవారాధన స్థలాల్లో ధనం ఆక్రమించుకోవడం తద్వారా ఎదురయ్యే పరిణామాలకు కనీసం ‘చర్చి’ మినహాయింపుగా ఉండాలని దేవుడు సంకల్పించాడు కానీ అది జరగడం లేదు. దేవుని ప్రేమ, పవిత్రత, పర్యవేక్షణ స్థలంగా ఉండాల్సిన చర్చిలు ఈనాడు ‘రియల్ ఎస్టేట్’లుగా మారి అక్రమార్కులకు కోట్లు తెచ్చిపెడుతున్నాయంటే అది అనర్థమే కదా! – రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవ జ్ఞానముంటే సరిపోదు... దేవుడుండాలి!
తప్పిపోయిన తమ ఆరేళ్ల కొడుకు కోసం ఆ దంపతులు పిచ్చివాళ్లలా బజారంతా వెదుకుతున్నారు. గట్టిగట్టిగా వాడి పేరు పిలుస్తున్నారు. కిడ్నాప్ అయ్యాడేమోనని గజగజలాడుతున్నారు. కొద్దిసేపటికి ఒక ఐస్‌క్రీమ్ షాప్‌లో తాపీగా ఐస్‌క్రీమ్ తింటూ కనిపించాడు వాడు. ఎవరో కొనిచ్చాడు వాడికి. ఐస్‌క్రీమ్ అంటే వాడికెంతో ఇష్టం. దాంతో తల్లిదండ్రుల్ని వదిలి ఆ షాప్‌లోకి వెళ్లాడు. కాని తాను తప్పిపోతున్నానని వాడు గ్రహించలేదు. నికొదేము అనే యూదు పరిసయ్యుడు ఒక అర్ధరాత్రి యేసుక్రీస్తును కలుసుకొని మాట్లాడాడు. అతని ధర్మసంశయాలన్నింటికి జవాబుగా ‘నీవు కొత్తగా జన్మించాలి’ అన్నాడు యేసు! ‘అంటే నేను మళ్లీ నా తల్లి గర్భంలోకి ప్రవేశించాలా?’ అనడిగాడు నికొదేము అమాయకంగా. అందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించే నికొదేముకు తాను ధర్మమార్గం నుండి తప్పిపోయానన్న విషయం తెలియదని ప్రభువుకర్థమైంది. కనబడని గాలిని దాని శబ్దం, చెట్టు కొమ్మల కదలికను బట్టి గుర్తు పట్టినట్టే, ‘నూతనజన్మం’ కూడా అగోచరమైన ఆత్మీయ పరిణామమని, విశ్వాసిలో వచ్చే పరివర్తనం, ఆత్మీయ ఎదుగుదల, పెనుమార్పుల ద్వారా దాన్ని తెలుసుకుంటామని ప్రభువు వివరించాడు. పైగా పరలోకం నుండి వీచిన గాలి వంటిదే దైవకుమారుని రాక అని, ఆయన బోధలు, సూచకక్రియలు, జీవితం ద్వారా ఆయనే రక్షకుడని గ్రహించి ఆయన్ని స్వీకరించడమే ‘నూతన జన్మ’మని తద్వారానే నిత్యజీవితం లభ్యమవుతుందని యేసు ఎంతో నర్మగర్భంగా వివరించాడు (యోహాను 3:1–21). ఎంతో సంక్లిష్టమైన అంశాలను కూడా అత్యంత సరళంగా వివరించే ప్రభువు నికొదేముతో ఎంతో మర్మయుక్తంగా, లోతుగా మాట్లాడాడు. బహుశా అతడు పండితుడన్న గౌరవంతో కావచ్చు. కాని యేసు మాటలేవీ అతనికి అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి ధర్మశాస్త్ర పాండిత్యముంది, దైవ నియమావళి విధి విధానాలు తెలుసు. అతనికి దేవుని గురించి తెలుసు కాని దేవుడు తెలియదు. దేవుని మార్గంలో ఉన్నాననుకొంటున్నాడు కాని తప్పిపోయి దేవునికి దూరమైపోయాడన్న విషయం నికొదేముకు తెలియదు. లేకపోతే నిత్యజీవాన్నివ్వగలిగిన రక్షకుడైన యేసును వదిలి ఆ ర్రాతి ఖాళీ చేతులతో వెళ్లిపోయేవాడు కాదు. అతని చుట్టే కాదు, అతని ఆంతర్యం నిండా చీకటి ఉంది. అతని మెదడు నిండా దైవజ్ఞానముంది, గుండెలో మాత్రం దేవుడు లేని వెలితి ఉంది. ‘నీవెంత? నిన్ను మోసేది, భరించేది నేనే కదా?’ అన్నదట ఒక కరెంటు స్తంభం, ఒక కరెంటు తీగతో. ‘కావచ్చు, కాని కరెంటుండేది నాలోనే కాని నీలోకాదు కదా! అన్నదట తీగ సగర్వంగా. కరెంటు తీగను మోసే స్తంభంలో కరెంటు లేనట్టే దేవుని పిల్లలం, పరిచాలకులమని చెప్పుకునే చాలామందిలో దేవుడు లేకపోవడమే ఈనాటి ప్రధాన సమస్య. దేవుని గురించి తెలుసుకుంటే సరిపోదు, ఆ దేవుని కలిగి ఉంటేనే ఆయన శక్తి మనదవుతుంది. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దండించడానికీ అర్హత ఉండాలి!
బిషప్ పాటర్ ఒక ప్రయాణికుల నౌకలో యూరోప్ వెళ్తున్నాడు. ఆయనకూ ఒక అపరిచితునికీ కలిపి ఒక కేబిన్ ఇచ్చారు. బిషప్కు అతను మంచివాడు కాడనిపించింది. కెప్టెన్ వద్దకు వెళ్లి, నా బంగారు గొలుసు, ఖరీదైన వాచీ మీ వద్ద పెట్టొచ్చా? అనడిగాడు. ‘‘తప్పకుండా! కాని మీ కేబిన్ సహచరుడు కూడా ఇందాకే వచ్చి తన ఖరీదైన వస్తువులు నాకిచ్చి వెళ్లాడు’ అన్నాడా కెప్టెన్. వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని యూదు మత పెద్దలు యేసు వద్దకు తెచ్చి, ధర్మశాస్త్రప్రకారం ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలా? లేక నీ బోధ ప్రకారం క్షమించి వదిలేయాలా? అనడిగారు (యోహాను 8:7). చంపమంటే, మరి క్షమాపణకు సంబంధించిన నీ బోధలన్నీ వట్టి మాటలేనా? అనాలని, క్షమించమంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించావని నేరారోపణ చేయాలని వారి పన్నాగం. అయితే యేసు వాళ్ల చెంప ఛెళ్లుమనిపించే జవాబిచ్చాడు. ‘ఆమెను రాళ్లతో కొట్టి చంపండి. కాని ఎన్నడూ పాపం చేయని వాడే మొదటి రాయి వేయాలి’ అన్నాడాయన. పాపిని, క్షమాపణ పొంది సంస్కరించబడినప్పుడు విడుదలయ్యే ‘ప్రగతిశీల శక్తి’ ఎంత గొప్పదో యేసు రుచి చూపించాడు. వ్యభిచారం చేసిన స్త్రీయే పాపాత్మురాలన్న భావనతో ఉన్న ఆనాటి ప్రజలకు, ఆమెను చంపేందుకు చేతుల్లో రాళ్లతో వచ్చిన వాళ్ల సభ్యతా ముసుగు వెనుక దాక్కున్న ‘క్రూర పాప స్వభావాన్ని’ ఆయన బట్టబయలు చేశాడు. వాళ్ల ‘నటన’ లేదా ‘వేషధారణ’ ఆమె వ్యభిచారం కన్నా ఘోరమైన పాపమన్నాడు ప్రభువు. లోకానికి మంచివారు, చెడ్డవారు అనే రెండు తెగలే తెలుసు. కాని పైకి ఎంతో మంచిగా, హుందాగా కనిపించేవారు ఆంతర్యంలో ఎంత హీనంగా, అసహ్యంగా ఉంటారో, వాళ్లెంత దుర్మార్గులో యేసు రుజువు చేశాడు. సమాజంలో నిజమైన సమస్యలు చెడ్డవారితో కాదు, పైకి కనిపించని దుర్మార్గతతో జీవించే వాళ్లే లోలోపల సమాజాన్ని చెదపురుగుల్లాగా తినేస్తూ డొల్ల చేస్తుంటారు. అందుకే పాపిని శిక్షించాలి, కాని ఎన్నడూ పాపం చేయని వారు మాత్రమే ఆ శిక్ష విధించాలని మానవ చరిత్రలోనే మొదటిసారిగా యేసుక్రీస్తు చట్టానికి అద్భుతమైన విశ్లేషణనిచ్చాడు. నీ కంట్లో దూలముండగా అవతలి వ్యక్తి కంట్లోని నలుసునెందుకు ఎత్తి చూపిస్తావని యేసు ఒకసారి హెచ్చరించారు, కొందరుంటారు, తాము అణువంత కూడా మారరు కాని అవతలి వాళ్లను... వీలైతే లోకాన్నంతటినీ మార్చేయాలన్న దురద కలిగిన వ్యసనపరులు వాళ్లు. తమ ఉచిత సలహాలు, పాండిత్య ప్రతిభతో లోకాన్నంతా మార్చగల బలవంతులమనుకుంటారు కాని తమకు తాము బాగు చేసుకోలేని బలహీనులు వాళ్లు. అందుకే యేసు గజదొంగలను, వ్యభిచారులను, శత్రువులను క్షమించాడు. కాని పైకొకటి లోపల ఒకటిగా ఉండే పగటి వేషగాళ్లను చీల్చి చెండాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
పునరుత్థానం....భక్తుల ఆనందపరవశం
– భక్తిశ్రద్ధలతో ఈస్టర్ – క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు – ఆకట్టుకున్న క్రీస్తు జన్మదిన నాటక కథలు – జిల్లా వ్యాప్తంగా సంబరాలు కర్నూలు సీ క్యాంప్ : ఏసుక్రీస్తు పునరుత్థానుడైన సందర్భంగా ఈస్టర్ పండుగను క్రైస్తవులు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయా చర్చిల్లో వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. సూర్యోదయ ఆరాధనతో ఈస్టర్ ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గుడ్ ఫ్రైడే నాడు సిలువలో బందీఅయి చనిపోయిన క్రీస్తు తిరిగి లేచి తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడని, దీన్నే విశ్వాస పండుగ అని కూడా క్రైస్తవులు చెబుతుంటారు. నగరంలోని బిషప్చర్చి, కోల్స్ సెంటీనియక్ తెలుగు బాప్టిస్ట్ చర్చి, సీఎస్ఐ చర్చి, రాక్‌వుడ్ చర్చి, హోసన్న మందిరం, స్టాంటన్, ఇమ్మానియేలు ప్రార్థన మందిరం, లాంటి ప్రధాన ఆలయాల్లో పాస్టర్లు దైవ సందేశం వినిపించారు. ఈస్టర్ అంటే విశ్వాసం, నమ్మకం అని చనిపోడానికి ముందు క్రీస్తు తాను తిరిగిలేస్తానని చెబుతాడని, ఆమాట నిజమైతే పునరుత్థానం ఉంటుందని ఈస్టర్‌నాడు యేసుక్రీస్తు తిరిగి లేచాడుకాబట్టి పునరుత్థానం ఉంటుందని పాస్టర్లు పేర్కొన్నారు. ప్రతి మనిషి విశ్వాసం, ప్రేమ, నమ్మకం, జాలి, కరుణ, కలిగి ఉండాలని అవి లేని వారికి పరలోక రాజ్యం ఉండదని చెప్పారు. ఏటా గుడ్‌ఫ్రైడే, ఈస్టర్ పండుగలు వస్తుంటాయని, పండుగ వచ్చిన ప్రతీసారి ఒక కొత్త నిర్ణయంతో జీవితంలో ముందుకు సాగాలని కోరారు. సాయంత్రం యేసుక్రీస్తును స్మరిస్తూ క్రీస్తుజన్మ ఇతివృత్తంపై క్రైస్తవులు నాటకాలు ప్రదర్శించారు. -
కరుణాయముడు యేసు
జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ కర్నూలు (టౌన్): కరుణామయుడు యేసు ప్రభువని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఈస్టర్ పండగ పురస్కరించుకొని స్థానిక స్టాంటన్ చర్చి ఆవరణలో రన్‌ఫర్ జీసస్ పేరుతో నిర్వహిస్తున్న రన్‌ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా గాలిలోకి పావురాలను, బెలూన్లను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శత్రువులను సైతం ప్రేమించాలన్న క్రీస్తు మాటాలను క్త్రెస్తవులు ఆచరించడం అభినందనీయమన్నారు. మైనార్టీ వేల్ఫేర్ అధికారి మస్తాన్ వలీ మాట్లాడుతూ.. 236 దేశాల్లో 750 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే క్త్రెస్తవులు అత్యధికంగా ఉన్నారన్నారు. సిలువ వేసి మరణానికి కారుకులైన వారిని సైతం క్షమించమని దేవున్ని వేడుకున్న క్రీస్తు క్షమాగుణాన్ని కలిగి ఉన్నప్పుడే ప్రపంచశాంతి ప్రజ్వరిల్లుతుందన్నారు. రన్ ఫర్ జీసస్లో కర్నూలు క్త్రెస్తవులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్ స్థానిక స్టాంటన్ చర్చి నుంచి ్రప్రారంభమై కలెక్టరేట్ మీదుగా సి. క్యాంపు ప్రార్థన మందిరం వరకు సాగింది. పాస్టర్ల ప్రార్థనలతో రన్‌ను ముగించారు. పాస్టర్లు రెవరెండ్ సజీవన్, జాన్సన్, విక్టర్ ఇమ్మానియేలు, కార్యనిర్వహణ కార్యదర్శి డి.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాపీ ఈస్టర్!
కడుపు నిండా కరుణ... కడుపు నింపగల మహిమ. దయాదృష్టి ఎప్పుడూ ఫలభరితమే. అందుకే కాసింత రొట్టెముక్కను అమేయ అనంత ఆహార సంపదగా మార్చగల శక్తి జీసస్ సొంతం. కరుణామయమైన హృదయం వల్లనే అది సాధ్యం. ఆయన జీవన సందేశమంతా ఆ కరుణే. ఆ మృదు చేతి స్పర్శ నిండా కారుణ్యమే. రొటె ముక్కను విస్తృతం చేయగలిగిందంటే ఆయనది పెట్టే చేయి అని తెలియడం లేదా! ఆ చెయ్యి అలా శిలువ మీద ఆగిపోకూడదనీ పదుగురి ఆకలి తీర్చుతూ పగవారినీ కాచుతూ తిరిగి ఉత్థానం చెందారు జీసస్! ఈస్టర్ శుభదినాన ఆయనను తలచి కళ్లకద్దుకొని తినడం కోసమే ఈ వంటకాలు. కడుపునూ, గుండెనూ ఏకకాలంలో నింపే ప్రేమామృత ఆహారాలు. ఈస్టర్ ఎగ్స్/మార్జిపాన్ ఎగ్స్ కావలసిన పదార్థాలు: చక్కెర – 200గ్రా., నీళ్లు – 100 మి.లీ., క్రీమ్ ఆఫ్ టాటర్ – చిటికెడు, బాదం పౌడర్ – 100 గ్రా., లిక్విడ్ గ్లూకోజ్ – 1 టీస్పూను, వెనీల ఎసెన్స్ – కొన్ని చుక్కలు, ఫుడ్ కలర్ – కావలసినంత తయారి: ఒక పాన్‌లో చక్కెరను తీసుకొని నీళ్లు కలుపుతూ కరగపెట్టాలి. దానికి క్రీమ్ ఆఫ్ టార్టర్ను కలిపి స్టౌ మీద పెట్టి ఒక పొంగు వచ్చేదాకా మరిగించాలి. మంట తగ్గించి, దీనిలో బాదం పౌడర్‌ను వేసి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమం గిన్నె అంచులను అంటి పెట్టుకోకుండా ఉండే వరకు తిప్పుతూ ఉండాలి. తరవాత స్టౌ మీద నుంచి దించి చదునుగా, నున్నగా ఉన్న పీట మీద లేదా కిచెన్ ప్లాట్‌ఫాం మీద పరవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు దానిని బాగా మెదపాలి. ఈ పదార్థాన్ని మార్కెటో దొరికే ఎగ్ లేదా రకరకాల షేప్స్‌లో దొరికే మౌల్డ్స్‌లో వేసి చల్లారబెట్టాలి. చివరగా నచ్చిన ఆకారంలో ఐసింగ్‌తో డెకరేట్ చేసుకుంటే ఆకర్షణీయమైన ఈస్టర్ ఎగ్స్ రెడీ. స్టఫ్డ్ రోస్ట్ చికెన్ కావలసిన పదార్థాలు: కోడి – సుమారు రెండు కిలోల బరువున్నది స్టఫింగ్‌కి కావలసిన పదార్థాలు: బ్రెడ్ – నాలుగు స్లైసులు, ఉడకపెట్టిన క్యారట్ ముక్కలు – 1 కప్పు, ఉడకపెట్టిన బఠాణీలు – 1/4 కప్పు, బాదం పప్పులు – కొన్ని, పచ్చి మిరపకాయలు – 3, ఆలుగడ్డ – 1(ఉడకపెట్టి ముక్కలు చేయాలి), తరిగిన ఉల్లిపాయముక్కలు – 2 కప్పులు, అల్లం తరుగు – అర టీస్పూన్, తొక్క తీసి తరిగిన టొమాటో ముక్కలు – 1 కప్పు, సుల్తానాస్ – 2 టీస్పూన్లు, తరిగిన పుదీనా – 1 టీస్పూన్, నిమ్మరసం – ఒక కాయ నుండి తీసినది, బేకన్ ముక్కలు – సగం కప్పు(చిన్న ముక్కలు చేయాలి), చక్కెర – 1/2 టీస్పూన్, మిరియాల పొడి – 1/2 టీస్పూన్, ఉప్పు –తగినంత, నీళ్లు – తగినన్ని, బటర్ – తగినంత తయారి: ముందుగా కోడిని (డ్రెస్సింగ్ పూర్తయ్యాక) కడిగి ఉప్పుతో రుద్ది పక్కన పెట్టుకోవాలి. కోడి లోపలి కాలేయం, గుండె మొదలైన వాటిని ఉడకబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో కొద్దిగా బటర్ వేసి బ్రెడ్ ముక్కలను బ్రౌన్‌గా అయ్యే వరకు కాల్చాలి. పచ్చిమిర్చి, అల్లం, పుదీనాలను రుబ్బి ముద్దగా చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను బటర్లో దోరగా వేయించి అందులో అల్లం ముద్దను వేయాలి. దానికి చక్కెర, టొమాటో ముక్కలను కలపాలి. తరువాత ముందుగా ఉడికించిన కాలేయం, గుండె ముక్కలను వేసి ఉడికించాలి. ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలు, బేకన్, ఉడికించిన కూరగాయలు, ఆలూ, డ్రైఫ్రూట్స్‌ను వేసి కలపాలి. దీనికి మిరియాల పొడి, నిమ్మకాయ రసాన్ని చేర్చాలి. ఇలా తయారైన స్టఫ్పింగ్ను ఉప్పు రాసి సిద్ధంగా ఉన్న కోడిలోకి కూర్చి, సూది, దారంతో కుట్టేయాలి. అవెన్ని 240 డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. కోడిని అవెన్‌లో పెట్టే ముందు అవెన్ వేడిని 180 డిగ్రీలకు తగ్గించాలి. ఈ టెంపరేచర్లోనే కోడి అన్ని వైపులా బ్రౌన్‌గా అయ్యేవరకు రోస్ట్ చెయ్యాలి. దీనిని బయటకు తీసిన తరవాత రెండు కప్పుల వేడి నీళ్లున్న గిన్నెలో పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా తయారైన రోస్టెడ్ చికెన్‌ను ఫ్రై చేసిన ఆలూముక్కలతో సర్వ్ చెయ్యాలి. చాక్లెట్ ఎగ్స్ కావలసిన పదార్థాలు: డార్క్ కుకింగ్ చాక్లెట్ – అరకిలో, వైట్ కోకో బటర్ – 1 టీ స్పూన్ తయారి: కుకింగ్ చాక్లెట్‌ను చిన్న ముక్కలుగా చేసుకుని ఒక గిన్నెలో వేయాలి. స్టౌ మీద ఒక పెద్దగిన్నెలో నీళ్లు పోసి మరిగించి అందులో మొదట కట్ చేసుకున్న చాక్లెట్ ముక్కల గిన్నెను ఉంచాలి. సన్న మంట మీద చాక్లెట్ ముక్కలు కరిగే వరకు కలియపెట్టాలి. చాక్లెట్ ముక్కలు పూర్తిగా కరిగిన తరవాత అందులో కోకో బటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మౌల్డ్స్‌లో వేసి 5–10 నిముషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఫ్రిజ్‌లో నుంచి తీసిన తరువాత ప్రతి రెండు మౌల్డ్స్‌ను ఐసింగ్‌తో జతచేస్తే చాక్లెట్ ఎగ్స్ రెడీ అయినట్లే. ఇవి ఎండాకాలంలో త్వరగా కరిగిపోతాయి కాబట్టి వెంటనే తినాలి. హాట్ క్రాస్ బన్స్ కావలసిన పదార్థాలు: మైదా – 25 గ్రా, తాజా ఈస్ట్ – 1 1/2 టీస్పూన్, నీళ్లు – 135 మి.లీ., చక్కెర‡ – 50 గ్రా., కండెన్స్డ్ మిల్క్ – 1 టీస్పూన్, రిఫైండ్ ఆయిల్ – 1టీస్పూన్, కిస్మిస్ – 1 కప్పు, ఉప్పు – 1/4 టీ స్పూన్ తయారి: మైదా పిండిని జల్లెడ పట్టి మధ్యలో గుంటలా చేసుకోవాలి. దానిలో నీళ్లు, ఈస్ట్, చక్కెర వేసి కండెన్స్డ్ మిల్క్ కూడా చేర్చి మెత్తగా అయ్యే వరకు మెదపాలి. దీనికి రిఫైండ్ ఆయిల్ వేసి మళ్లీ మెదిపితే చపాతీల పిండిలా వస్తుంది. దీనిని ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత కిస్మిస్లు చేర్చి మరో అరగంట అలాగే ఉంచాలి. తరువాత ఈ పిండిని సున్నితంగా మళ్లీ మెదిపి చిన్న గోళీలుగా చేసుకోవాలి. వీటిని పొంగే వరకు అలాగే ఉంచి, తర్వాత బ్రష్‌తో పాలను అద్ది దాని మీద ఒక క్రాస్ (గీ) మార్క్‌ను పెట్టాలి. వీటిని 215 డిగ్రీ సెంటిగ్రేడ్ల వేడి మీద అవెన్‌లో పెట్టి 12–15 నిముషాల పాటు బేక్ చెయ్యాలి. ఈ బన్ల మీద ఇంకొక్కసారి పాలను, నూనెను బ్రష్‌తో అద్ది మరో రెండు నిముషాల పాటు అవెన్‌లో ఉంచితే పైన బాగా కాలిన హాట్ క్రాస్ బన్స్ తినడానికి సిద్ధం. ఈస్టర్ స్పెషల్ సలాడ్ కావలసిన పదార్థాలు: ఉడికించిన బఠాణీలు – కప్పు, ఉడికించిన క్యారట్ ముక్కలు – కప్పు, ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు – 1 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చి క్యాబేజీ – కప్పు, ఉడికించిన బీన్స్ ముక్కలు – సగం కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1/4 కప్పు, అక్రోట్ ముక్కలు – సగం కప్పు, కిస్మిస్ – 2 టీ స్పూన్లు, కొత్తిమీర – 2 టీ స్పూన్లు , సన్నగా తరిగిన క్యాప్సికమ్ – 1 టేబుల్ స్పూన్, ఉడికించిన గుడ్లు – 4, మయోనేస్ – 4 టీ స్పూన్లు తయారి: ఒక పెద్ద గిన్నెలో ఈ ముక్కలన్నింటినీ వేసి మయోనేస్ కూడా చేర్చి కలపాలి. గుడ్లని నాలుగు భాగాలుగా కట్ చేసి, దీని మీద డెకరేట్ చేసుకోవాలి. కిస్మిస్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈస్టర్ స్పెషల్ సలాడ్ రెడీ. ఈస్టర్ కేక్ కావలసిన పదార్థాలు: బటర్ – 110 గ్రా, చక్కెర – 110 గ్రా, గుడ్లు – 3(గిలక్కొట్టాలి), మైదా పిండి – 150 గ్రా, ఉప్పు – చిటికెడు, మిక్స్డ్ ఫ్రూట్ జాం – 1లేదా 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ – 1 కప్పు బాదం పేస్ట్ తయారీకి: చక్కెర – 125 గ్రా., బాదం పౌడర్ 125గ్రా., గిలక్కొట్టిన గుడ్డు–1, బాదం ఎసెన్స్ – సగం టీస్పూన్. ఫుడ్ కలర్– చిటికెడు (ఇష్టమైన రంగు). తయారి: వీటన్నింటినీ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలు చేసుకొని మీ కేక్ పాన్ సైజులో మందంగా చపాతీలాగా వత్తుకోవాలి. కేక్ తయారి: బటర్లో చక్కెర వేసి, కరిగే వరకు బాగా కలియతిప్పాలి. దీనిలోనే గిలక్కొట్టిన గుడ్లను కూడా వేసి మళ్లీ కలపాలి. మైదాపిండిలో ఉప్పును చేర్చి, కొద్దికొద్దిగా ఈ పిండిని పై మిశ్రమంతో కలుపుకోవాలి. దీంట్లో డ్రైఫ్రూట్స్ కూడా వేయాలి. ఈ మిశ్రమాన్ని బటర్ రాసిన కేక్ పాన్‌లో వెయ్యాలి. అవెన్‌ను ముందుగానే 180 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర వేడిచేసి పెట్టుకొని, కేక్పాన్ని అందులో పెట్టుకోవాలి. ఇలా 25నిముషాలపాటు బేక్ చెయ్యాలి. డెకరేషన్: చల్లారిన కేక్ మీద మిక్స్డ్ ఫ్రూట్ జామ్‌ను రాసి, ముందుగా చేసుకున్న బా దాం చపాతీలను ఆ కేక్‌కి పైనా, కిందా అతికించాలి. దీన్ని మరో పది నిముషాల పాటు అవెన్‌లో బేక్ చెయ్యాలి. తరువాత ఐసింగ్‌తో కావలసిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. -
కాళ్లు కడిగిన ప్రభువాయన!
హోలీవీక్ రేపు ఉదయం యేసుకు సిలువ శిక్ష. ఈ రాత్రి తనకు అత్యంత సన్నిహితుడైన 12 మంది శిష్యులతో చివరి పస్కా పండుగ ఆచరించాడు. సిలువలో బలికావడానికి ముందుగా విందు భోజనం! విందుకు ఆహ్వానించిన వ్యక్తి అతిధుల్లో అత్యంత ప్రముఖులు, మతబోధకుల కాళ్లు కడగడం యూదా సంప్రదాయం!! ఆహ్వానించిన వ్యక్తి పాత్రను యేసు స్వీకరించి విందులో శిష్యులందరి పాదాలు వంగి కడిగి తువాలుతో శుభ్రంగా తుడవడం శిష్యులు తట్టుకోలేకపోయారు. తనకు యూదా ఇస్కరియోతు ద్రోహం చేసి అప్పగించబోతున్నాడని ఎరిగి అతని పాదాలు కూడా ప్రభువు కడిగాడు. ఏ విధంగా చూసినా శిష్యులంతా యేసుప్రభువు కన్నా తక్కువవారు, కొద్ది గడియల్లో సిలువనెక్కనున్న యేసును వదిలి ప్రాణ రక్షణ కోసం పారిపోనున్నవారు. వారిలో ఒకరైతే యేసును అప్పగించనున్నవాడు... ఇలాంటి వారి పాదాలను ప్రేమతో కడిగాడు యేసుక్రీస్తు. పాదాభివందనాలు చేయించుకోవడం, పాదాలు కడిగించుకోవడమే గొప్పతనానికి సూచనగా విశ్వసించే లోకానికి తలవంచడం, ఒకరిపాదాలు ఒకరు కడుగుకునేంతగా ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రేమించుకోవడం నిజమైన గొప్పతనమని, అలా తమను తాము తగ్గించుకునేవారిని దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడని యేసు ఆచరణాత్మకంగా నిరూపించాడు. యేసులాంటి బోధకుడు లోకంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే బోధించిన ప్రతి అంశాన్ని జీవితంలో ఆచరించి చూపించాడాయన. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
యేసును అమ్మేసిన యూదా!
హోలీవీక్ యేసు తన శిష్యులతో బేతనియలోని మరియ, మార్తల గృహంలో సేదతీరుతున్నాడు. కాని ఆయన శిష్యుల్లో ఒకరైన యూదా ఇస్కరియోతు యెరూషలేములో ప్రధాన యాజకులతో యేసునప్పగించేందుకు ముప్ఫై నాణేలకు బేరం కుదుర్చుకున్నాడు. ముప్ఫై వెండి నాణేలకు సంతలో బానిసను కూడా కొనలేడు. అలాంటిది అంత తక్కువ మొత్తానికి సర్వోన్నతుడైన దేవుని కుమారుణ్ణే అమ్మేసేందుకు సిద్ధమయ్యాడతను. మునుపొక విందులో ఒక స్త్రీ ఖరీదైన అత్తరుతో ప్రభువునభిషేకిస్తే, మూడొందల దీనారాల అత్తరును అలా వృధా చేసే బదులు అది అమ్మి పేదలనాదుకోవచ్చు కదా అని పోజులు కొట్టాడీ యూదా (యోహాను 12:4). యూదాకు పదవీకాంక్ష, బోలెడు కోరికలున్నాయి. ఆ కారణంగా దురాశాపరుడు, స్వార్థపరుడయ్యాడు. బానిసలు, అత్తరు వంటి లోకాంశాల ఖరీదు తెలిసిన మహామేధావి అతను. కానీ మానవబంధాలు, ప్రేమలు, త్యాగం, దైవానుబంధం వంటి అమూల్యమైన అంశాల విలువ వారికి తెలియదు. యేసు వల్ల తన కోరికలు, కాంక్ష తీరవని అర్థమైన వెంటనే ఆయన్ను అమ్మకానికి పెట్టాడు, చివరికి జీవంతో సహా సర్వం కోల్పోయి భ్రష్టుడయ్యాడు యూదా. దేవుడు మనం కోరినదల్లా ఇవ్వడు. మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. సంపదలివ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు కాని ఆయన మహాసంతృప్తినైతే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అల్లావుద్దీన్ దీపం కాదు, మానవాళికి పరమతండ్రి! తాను మహామేథావిననుకున్న యూదాకు ఈ చిన్నవిషయం తెలియకపోవడం ఆశ్చర్యంగా లేదూ! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
దేవాలయాన్ని శుద్ధి చేసిన యేసు
దాదావీదు సమకూర్చిన సామాగ్రి, సంపదతో రాజధాని యెరూషలేములో సొలొమోను ఓ ఆలయాన్ని నిర్మించాడు. దేవుడు దాన్ని తన మహిమతో నింపాడు. కాలక్రమంలో ఇశ్రాయేలీయులకు దేవుని కన్నా ఆలయమే ప్రాముఖ్యమైంది. ఈ రోజుల్లో కూడా దేవునికి విశ్వాసికి మధ్య వారధిగా ఉండాల్సిన ఆలయం, వారిద్దరికీ మధ్య అడ్డుగోడగా మారింది. అప్పటికే ఆలయాన్ని నెబుకద్నెజరు అనే బబులోను రాజు ధ్వంసం చేస్తే, హేరోదు దాన్ని పునర్నిర్మించాడు. అయినా ఆలయం మతపరమైన అవినీతికి, మతదౌర్జన్యానికి నిలయంగా మారగా నాటి యూదు మతపెద్దలు, యాజకులు కలిపి ఒక ‘దళారీ వ్యవస్థ’గా మారి ప్రజల్ని దేవుని పేరిట పీడించి ధనార్జనకు పూనుకున్నారు. దైవకుమారుడైన యేసు ఆలయ ప్రక్షాళనకు పూనుకొని అక్కడి వ్యాపారులు, దళారుల మీద కొరడా ఝుళిపించాడు. ఎంతో సౌమ్యుడు, శాంతిపిపాసి అయినా యేసుప్రభువు ఆలయావినీతి పట్ల ఉగ్రరూపమెత్తాడు. దైవ నివాసాన్ని దొంగల గుహగా మార్చారంటూ అక్కడి వారిని పారదోలాడు. దేవుడు సృష్టించని ‘డబ్బు’ క్రమేణా ఆలయంలో దేవుని స్థానాన్నే ఆక్రమించిన దుర్మార్గతను, ప్రేమకు మారుపేరుగా ఉండాల్సిన దైవమానవ బంధాల్లో ‘వ్యాపార సంస్కృతి’ విస్తరించడాన్ని యేసు జీర్ణించుకోలేకపోయాడు. స్వయంగా దేవాలయ ప్రక్షాళనకు పూనుకున్నాడు. దేవునికన్నా దేవాలయాలు, చర్చిలే ఎక్కువ విశిష్టతను పొందడం దేవుని అవమానించడమే! దేవుని దృష్టిలో డబ్బు చిత్తుకాగితాలే, వెండి బంగారాలు ఇనుపముక్కలే! ఆయనకు కావలసింది విశ్వాసిలో నిర్మలత్వం, ప్రేమ, పదిమందికీ ప్రయోజనకరంగా మారగల విశ్వాసం, పేదల పట్ల ఆదరణ! – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
అవినీతి సొమ్ము రక్తపు సొమ్మే
– బిషప్ పూల ఆంథోని – జిల్లాలో ఘనంగా మట్టల ఆదివారం కర్నూలు సీక్యాంప్ : అవినీతి సొమ్ము రక్తపు సొమ్మేనని బిషప్ పూల ఆంథోని వ్యాఖ్యానించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా మట్టల ఆదివారాన్ని క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలో కోల్స్ చర్చి, ప్రార్థన మందిరం, బిషప్ చర్చిల్లో ప్రార్థనలు చేపట్టారు. అనంతరం మట్టలతో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిషప్ చర్చిలో ఫాదర్ కోల విజయరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిషప్ పూల ఆంథోని మాట్లాడారు. చరిత్రలో ఒకడు అవినీతి సొమ్ముకు ఆశపడి తన సొంత గురువును శత్రువులకు అప్పగించారన్నారు. ఆ గురువు యేసు ప్రభువే అని చెప్పారు. నీతిగా, నిజాయితీగా సంపాదించి పొదుపు చేసిన ప్రతీ రూపాయి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మానవులు మారు మనసు పొంది విరివిగా దాన ధర్మాలు, ఉపవాస ప్రార్థనలు చేసి నవసమాజ నిర్మాణానికి నాంది పలకాని సూచించారు. గుడ్‌ఫ్రైడే నాడు నగరంలో నిర్వహించే సిలువ యాత్ర కార్యక్రమానికి క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఫాదర్ ఒ.జోజిరెడ్డి, ఫాదర్ లూర్ధు, ఉపదేశి ఆంథోని, దళ సభ్యులు, క్యాథలిక్ అసోసియేషన్ సభ్యులు చర్చి యూత్, గాయకబృందం పాల్గొన్నారు. -
15న రన్ ఫర్ జీసస్
కర్నూలు (టౌన్) ; ఈస్టర్ పండగను పురస్కరించుకుని ఈనెల 15 వ తేదీన కర్నూలు నగరంలో నిర్వహించే రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిటీ పాస్టర్స్ సంఘం అధ్యక్షుడు రెవరెండ్ విలియం, సీనియర్ పాస్టర్ పాస్కల్ ప్రకాష్ పిలుపు నిచ్చారు. శనివారం స్థానిక కోల్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో రన్ ఫర్ జీసస్ టీ–షర్టులను అవిష్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు పి. విజయకుమార్, నిర్వాహకులు డి.సుధీర్, రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు నరేష్, దేవేంద్రప్ప, అనిల్‌నాథ్, డేవిడ్‌పాల్ పాల్గొన్నారు. -
లోకజ్ఞానంతో కాదు... దైవజ్ఞానంతో ఆంతర్యాన్ని నింపుకోవాలి!
యేసు ఎంతోమందికి తన శిష్యులుగా తర్ఫీదునిచ్చి దేవుని రాజ్య రాయబారులుగా తీర్చిదిద్దాడు. తన నామంతో మహాద్భుతాలు చేసే అధికారాన్ని వారికిచ్చాడు. అయితే ఇస్కరియోతు యూదా అనే శిష్యుడొక్కడే ఆ శిక్షణలో ఫెయిల్ అయ్యాడు. నిజానికి శిక్షణలో అగ్రస్థానం పొందే ఎన్నో విశేషాలు అతనికున్నాయి. అతను మేధావి. యెరికోలోని ఒక గొప్ప వ్యాపారస్తుని కొడుకు. బహుశా అందుకే మిగిలిన వారితో సరిగా కలిసేవాడు కాడేమో. ధనిక నేపథ్యమున్న వాడు గనుక డబ్బుకు కక్కుర్తి పడడని అతనికి డబ్బు సంచి ఇచ్చారు. కాని ఏం లాభం? ముప్ఫై వెండినాణేలకు యేసును యూదు మత పెద్దలకు అప్పగించాడు.ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. మనిషి ఆంతర్యం ఒక మహా అగాధం. దాన్ని లోకజ్ఞానంతో నింపే కొద్దీ, మురికికూపంగా మారుతుంది. ఒక కరడుగట్టిన పాపి విశ్వాసిగా మారే ప్రయాణం పొడవునా ఆత్మ ప్రక్షాళన అనివార్యమవుతుంది. మూడున్నరేళ్ల తమ శిక్షణకాలంలో శిష్యులు తమ ఆంతర్యాన్ని దేవుని సహచర్యంలో పొందిన ఎన్నో దివ్యానుభవాలతో నింపుకున్నారు. అలా వాళ్లంతా దైవజ్ఞాన ఖజానాలు, దేవుని ప్రేమ పండించే పరమ క్షేత్రాలయ్యారు. ఇలా ఎక్కడ ఇతరులు లాభపడ్డారో అక్కడ యూదా విఫలమయ్యాడు. దేవునితోనే తిరిగిన మేధావి, కాని దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని అజ్ఞానం, దౌర్భాగ్యం అతనిది. అందుకే ఆంతర్యాన్ని లోకజ్ఞానంతో కాదు, దైవజ్ఞానంతో నింపుకోవాలి. చౌకబారు వినోదంతో కాదు, నిరుపేదల సేవలో తరించే అనిర్వచనీయమైన ఆనందంతో నింపుకోవాలి. అది దేవుని సన్నిధిలో మోకరించి గడిపే ఏకాంత ప్రార్థనలో, బైబిలు పఠనలో మాత్రమే విరివిగా దొరుకుతుంది. గతంలో విలువైన బైబిలు జ్ఞానంతో మహాభక్తులు పునాది వేసిన చర్చిలే దేవుని ప్రేమను అద్భుతంగా ప్రకటించాయి. అయితే అవాస్తవాలను, సగం వాస్తవాలను కూడా నమ్మలేని నిజాలుగా చలామణి చేసే ‘ఇంటర్నెట్’ ఇపుడు చాలామంది బోధకుల జీవితాల్లో ‘బైబిల్’కు ప్రత్యామ్నాయమైంది. అలా దైవజ్ఞానానికి బదులు నకిలీ దైవజ్ఞానంతో నిండుతున్న చర్చిలకు, విశ్వాసులకు నిరుపేదల ఆకలికేకలు వినలేని ‘చెవిటితనం’ వినబడ్డా పాకులాడలేని ‘ఆత్మీయ అవిటితనం’ ఆవహించింది! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
బిషప్ ఇంటి ముందు యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: బిషప్ నివాసంలోకి వెళ్తున్న యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న బిషప్ నివాసంలోకి వెళ్లేందుకు యత్నిస్తుండగా.. సెక్యూరిటీ గార్డు అతన్ని అడ్డుకున్నాడు. దీంతో జీసెస్నినాదాలు చేస్తూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభువా..సీఎంకు మంచి బుద్ధిని ప్రసాదించు..!
– ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంఏ నవీన్‌కుమార్ కల్లూరు (రూరల్): ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ధిని, ప్రేమగల హృదయాన్ని ప్రసాదించాలని యేసు ప్రభువును రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంఏ నవీన్‌కుమార్ వేడుకున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలంటూ చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సమ్మెలో ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేసే మంచి బుద్ధిని ముఖ్యమంత్రికి, క్యాబినెట్ మంత్రులకు ఇవ్వాలని యేసు ప్రభును వేడుకున్నామన్నారు. కార్యక్రమంలో మల్లికార్జునస్వామి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రవి, చాంద్‌బాషా, ఉసేన్‌పీరా, వెంకటకృష్ణ, రంగముంజరి, రుక్మిణి, కల్పన, సరస్వతి పాల్గొన్నారు. -
లోక రక్షకుడు యేసు
కప్పట్రాళ్ల(దేవనకొండ) : లోక రక్షకుడు జీసస్ అని, ఆయనను ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం ఎస్పీ కుటుంసభ్యులు కప్పట్రాళ్ల గ్రామస్తుల సమక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. ముందుగా ఎస్పీ దంపతులు కేక్‌ను కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యేసు జననం, మరణం మానవాళి శ్రేయస్సుకే జరిగిందన్నారు. ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తోటి వారిని గౌరవించాలన్నారు. క్రైస్తవులు హిందువులను, ముస్లింలను కలుపుకుని పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా గ్రామం నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామంలో చర్చి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీచ్చారు. అనంతరం ఎస్పీ దంపతులు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల లక్ష్మన్నమాదిగ స్వగృహంలో భోజనం చేశారు. కార్యక్రమంలో పత్తికొండ సీఐ విక్రమ్‌సింహా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉదయించిన కరుణ.. హృదయ ఆలాపన
ఏసుండు జన్మించే రేయిలో... లాలీ లాలెమ్మ లాలీ... రక్షకుడు ఉదయించినాడు లోకమంతటా వెలుగు... వంటి కీర్తనలతో ఆదివారం ఉదయం నుంచి చర్చీ ప్రాంగణాలు మార్మోగాయి. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు గుండె నిండుగా చేసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి నూతన వస్త్రాలు ధరించి చర్చీలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఏసు జననం వృత్తాన్ని వివరించేలా ప్రార్థనా మందిరాల్లో పశువుల పాకను అలంకరించి ఊయలలో బాల ఏసును ఉంచి ప్రత్యేక పాటలు పాడారు. శనివారం అర్ధరాత్రి కేక్‌లను కట్ చేశారు. ఆయా చర్చీల్లో బిషప్‌లు, ఫాదర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. -
ప్రభు రక్షణలో...
దేవుడు ప్రేమాస్వరూపి (1 యోహాను 4:8). దేవుడు చేసిన సృష్టిని చూసినా, మనిషిని సృష్టించి అతనికిచ్చిన ప్రాధాన్యాన్ని చూసినా ఆశ్చర్యమనిపిస్తుంది.‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగాఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’’ (యోహాను 3:16). ‘‘ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు’’ (అపొ.కా. 16:31). ఇది యేసు సువార్త. అందరికీ శుభవార్త. మొదట ఆదాము, అవ్వల అవిధేయత వల్ల మానవ జాతి పాపంలో చిక్కుబడిపోయింది. తండ్రి చెప్పినమాట ‘‘మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు’’ (ఆది 2:17). కానీ, వారు ఆపుకోలేక, మాటను అతిక్రమించి పాపం చేశారు. ఈ లోకానికి మరణాన్ని తెచ్చారు. దేవునికి దూరమయ్యారు. అయితే తండ్రి ప్రేమను చంపుకోలేక ప్రాయశ్చిత్తంగా గొఱె< పిల్లను వధించి ఆదాముకు, అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించినట్లుగా చూస్తున్నాం. వారు ఆత్మీయంగా చనిపోయి తండ్రి సహవాసానికి దూరమయ్యారు. పాపం విస్తరించింది. అందుకే పాత నిబంధన కాలంలో ప్రతి ఏటా వారి పాపప్రక్షాళన కొరకు నిర్దోషమైనది, నిష్కళంకమైనది – అది ఎద్దు గాని, గొఱె< గాని, పక్షిజాతిలో తెల్ల గువ్వ గాని, పావురం గాని వధించి, దాని తల మీద చెయ్యి పెట్టి, వారి పాపం వాటిలోకి పోవడం, వారు నిర్దోషులవడం ఆనవాయితీగా ఉండేది. ఈ దహనబలి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానిదే. ఇది యెహోవాకు ఇంపైన హోమం. క్రొత్త నిబంధన కాలంలో యేసయ్య సిలువ మీద అర్పణ దహనబలి ‘‘క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను, దహనబలిగాను అప్పగించుకొనెను.’’ యేసయ్య నీలో నాలో ఉన్నాడు. నీ శరీరమే ఒక ఆలయం. నీవు, నేను ఆయన విలువ పెట్టి కొనబడినవారము. నీవు... నీవు కావు, నీవు ఆయన సొత్తు. ఆయన మహిమ నీకు, నాకు ఇచ్చాడు. ఆయన వధింపబడిన గొఱె<పిల్ల. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడు నీలో, నాలో ఉన్నాడు. ఆయన లేఖన్లాల్లో ఉన్నవన్నీ మన సొంతం’’(ప్రకటన 5:12). ప్రతి ఒక్కరికీ మరణం వచ్చింది. పాపం పెరిగిపోయింది. అయితే దేవుడు తన ప్రేమను చంపుకోలేక మనల్ని పాపం నుండి తప్పించడానికి రక్షకుణ్ణి ఏర్పాటు చేశాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. యేసయ్య మరణ, పునరుత్థానాల ద్వారా అందించబడిన ఉచితమైన రక్షణను అంగీకరించిన ప్రతి ఒక్కరూ పాపము యొక్క పట్టు నుండి, దాని ద్వారా కలుగబోయే మరణ శిక్ష నుండి తప్పింపబడుతారు. ‘ఎందుకంటే’ ‘‘మనమింకను పాపులమై ఉండగానే మన కోసం యేసయ్య చనిపోయాడు’’ (రోమా 5:8). ఆయన రక్తం ద్వారా దేవునితో సమాధానపరచబడిన వారమై, రక్షణను పొందుతున్నవారం. అందుకే పౌలు అంటున్నాడు... ‘‘యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచువాడెవడునూ సిగ్గుపడడు’’ (రోమా 10:9–11). ఒక్క అర్పణ చేత పరిశుద్ధపరచబడు వారిని (నిన్న, నేడు యుగయుగాలకు) సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు (హెబ్రీ 10:14). పాపాములతో, అపరా«ధములతో చచ్చినవంటి వారిని ఆయన ప్రేమతోనే క్రీస్తుతో కూడ బతికించెను. విశ్వాసం, కృప చేత రక్షించబడియున్నాము. యేసయ్య తన రెండు చేతులు చాచి నిన్ను, నన్ను పిలుస్తున్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును’’ (మత్తయి 11:28). అంతేకాకుండా నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను’’ (యోహాను 6:38). యేసయ్య సిలువ త్యాగం మనకర్థమైతే మనం ఆయన దగ్గరకు పోయి, ఆయన చేతుల్లో ఇమిడిపోయి, ఆయన కౌగిట్లో ఆయన హృదయాన్ని హత్తుకొని నిశ్చింతగా బతుకుతాం. ఎందుకంటే మనం ఎవ్వరమూ అందుకు అర్హులం కాదు. మనం ఎంతటి ఘోర పాపులమైనా ఆయన దగ్గరికి పోదాం. ఎందుకంటే ‘‘నశించిన దానిని వెదికి, రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను’’ (లూకా 19:10). మనం కష్టాలలో, బాధలలో ఉంటే – యేసయ్య సిలువను నిశితంగా చూస్తూ ఉంటే నీ కోసం, నా కోసం ఆయన చూపించిన ప్రేమ కనిపిస్తుంది. దేవుడు కోరుకుంటున్నాడు... యేసయ్య గురించి, ఆయన సిలువ మీద మన కోసం చేసిన త్యాగం గురించి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే రక్షణ లేదు. ఆయన వచ్చిన దానికి సార్థకత లేదు. ఎవరైతే యేసురక్తం కిందకు వస్తారో వారందరూ రక్షింపబడతారు. విడుదల పొందుతారు. ఆయన శరీరం వల్ల స్వస్థత పొందుతారు. దేవుడు కోరుకుంటున్నాడు... ఆయన కృపలో తన బిడ్డలు సంతోష సమాధానాలతో బతుకులు కొనసాగించాలని. ఇతరుల జీవితాలను వెలిగించేవారముగా ఈ లోకానికి ఒక సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నాడు. మనకు ఎంత ఎక్కువగా ఆయన ప్రేమ, ఆయన సిలువ త్యాగం అర్థమైతే అన్ని ఆశీర్వాదాలు మనతో ఉంటాయి. అవి స్వస్థత, రక్షణ. పాపక్షమాపణ, కాపుదల, ఐశ్వర్యం, నిత్యజీవం. శాంతి సమాధానం, ఆయన నీతి, పరిశుద్ధత, సంపూర్ణత, దేవుని సన్నిధి, విజయం, ఘనత, ఆయన మహిమ, ఆయన శక్తి, ప్రేమ, ఆయన జ్ఞానం సమస్తం మన సొంతం. యేసయ్య నీవు నన్ను కోరుకున్నావు. నన్ను ఏర్పరచుకున్నావు. నీ అరచేతులతో చెక్కుకున్నావు. నీ గాయపడిన హస్తాలలో భద్రపరుస్తున్నావు. నీ కృపతో నన్ను ఆవరించియున్నావు. నన్ను ‘ముదిమి వచ్చువరకు చంకనెత్తుకుంటాను’ అన్నావు. నీ నామం నాకు రక్షణ ఇచ్చింది. నీ వాక్యం నన్ను పరిశుద్ధపరిచింది. నీ రక్తం నన్ను కడిగింది. నీ రాజ్యంలో నాకు స్థానం ఇచ్చావు. నీ ఆత్మ నన్ను స్థిరపరచినది. ఎంతగా అంటే ఈ లోకంలో అందరూ విడిచిపోయేవారు అయితే నీవు నన్ను విడవవు, ఎడబాయవు. నేను మరిచినా నీవు మరువవు. ఎంతగా అంటే తల్లి మరిచినా నేను నిన్ను మరవను అన్నావు. అంతేకాదు. నీవు నా కనుపాపవి అన్నాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను దాచినట్లు ఎప్పుడూ నీ రెక్కల కింద దాచువాడవు నీవే! నీ ప్రేమను ఏమని చెప్పేది? నేను పిలిస్తే పరుగున వచ్చేస్తావు. నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తావు. నేను ఏడిస్తే, లాలించి తల్లిలా ఓదారుస్తావు, తండ్రిలా ప్రేమిస్తావు. ఎంత గొప్ప ప్రేమ నా యేసయ్యది!నేను అలసిపోతే నీ చేతిని అందిస్తావు. నేను పడిపోతే నీవు ఎత్తుకొని, నీ గుండెలకు హత్తుకుంటావు. నా ప్రతి పరిస్థితిలో నీవుంటావు. కష్టంలో, బాధలో, సంతోషంలో నీ కరుణతో నన్ను నడిపిస్తావు.యేసు వైపు చూస్తూ, మన సాక్ష్యంలో యేసును చూపిస్తూ, ఆయనకు మహిమకరంగా జీవిస్తూ, ఆయన కౌగిలిలో ఒదుగుతూ ముందుకు సాగిపోదాం. వై.ఎస్. విజయమ్మ -
అంతటాశోభ
మానవాళికి శుభసందేశమందించిన పరిశుద్ధాత్ముడి జన్మదిన వేడుకలు శనివారం అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రార్థనామందిరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రతి ప్రార్థన మందిరంలో క్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే ఘట్టాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేశారు. యేసు ప్రభువు పుట్టిన రోజున ఆకాశంలో ఒక తార తళుక్కుమని మెరిసిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగా క్రైస్తవులు విద్యుద్దీపాలతో కూడిన స్టార్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటా క్రిస్మస్ చెట్లను అందంగా ఏర్పాటు చేశారు. -
లోక రక్షకుడు ఏసు
- ఘనంగా కల్వరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రారంభం కర్నూలు (టౌన్): లోక రక్షకుడు ఏసు అని హైదరబాద్‌కు చెందిన అంతర్జాతీయ వర్తమానికులు పి. సతీష్ కుమార్ అన్నారు. పాపులను రక్షించేందుకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారన్నారు. సోమవారం రాత్రి కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో కల్వరి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరిగే వేడుకల్లో ముఖ్య అతిథిగా సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఏసు భోదనల ద్వారా పాపవిముక్తులు కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. ప్రతి ఏడాది క్రీస్తు జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దేవుని అడుగుజాడల్లో నడుస్తూ క్రైస్తవులు సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. వేడుకలకు కర్నూలుతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి కల్వరి పాస్టర్లు, సభ్యులు వేలాదిగా తరలి వచ్చారు. కల్వరి మినిస్ట్రిస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ప్రాధాన్యం, క్రీస్తు పుట్టుక నాటికలు ప్రదర్శించారు. -
పెళ్లి వేడుకలో మహాద్భుతం
సువార్త కానా అనే ఊళ్ళో జరిగిన పెళ్లికి యేసు తన తల్లి మరియ, శిష్యులతో సహా హాజరయ్యాడు. పెళ్లివారింటి వేడుకల్లో ద్రాక్షారస పానం అక్కడి సంప్రదాయం. మామూలుగా అయితే సంపన్నులు మాత్రమే ద్రాక్షారసం సేవిస్తారు. కాని వేడుకల్లో పేద గొప్ప తేడా లేకుండా అంతా సేవిస్తారు. అందువల్ల పెళ్లి వేడుకల్లో ద్రాక్షారసమే హైలైట్! ఈ పెళ్లిలో కూడా అందుకు ఏర్పాట్లు చేశారు. అతిథులు ఎక్కువ తాగారో, లేక లెక్కకు మించి వచ్చారో తెలియదు కాని పెళ్లిలో ద్రాక్షారసం నిండుకుంది. విందు చేస్తున్న వారిలో విషాదం నెలకొంది. తమదాకా ద్రాక్షారసం రాకపోతే అతిథులు దాన్ని అవమానంగా భావిస్తారు. అందుకు విందు పెద్దలు ‘పరిష్కారం’ చూపారు. ఇక్కడున్న వాళ్లకు ఏదో విధంగా ద్రాక్షారసం సర్దేద్దాం. ఇంకా రానున్న అతిథుల్ని మాత్రం ఆపేద్దామన్నారు వారు. ఎలా? ప్రతి యూదుని ఇంటి వెలుపల నీటి బానల్లో నీళ్లుంటాయి. అతిథులు అక్కడ కాళ్లు కడుక్కున్నాకే ఇంట్లోకి రావడం వారి శుద్ధీకరణ ఆచారం. బానల్లో నీళ్లు లేకపోతే అతిథులు ఇక రావడానికి లేదు. అందువల్ల బానల్లో నీళ్లు పారబోయమన్నారు వాళ్లు. ద్రాక్షారసం నిండుకోవడమే అవమానమైతే ‘మా పెళ్లికి రాకండి’ అని అలా చెప్పుకోవలసి రావడం మరింత అవమానకరం. అయినా గుడ్డిలో మెల్లలాగా అదే మంచిదనిపించి, అక్కడున్న ఆరు రాతి బానలూ ఖాళీ చేశారు. ద్రాక్షారసం నిండుకున్నదన్న విషయాన్ని మరియ, యేసుకు తెలిపింది. ‘అమ్మా! నా సమయమింకా రాలేదన్నాడు’ ప్రభువు. యేసు అసలు ద్రాక్షారసం తాగరు. అయితే సర్వజనరక్షణార్థం చేయనున్న సిలువ యాగానికి ముందు రాత్రి మాత్రం మహా పండుగ విందులో ఆయన ద్రాక్షారసం తన శిష్యులతో కలిసి తాగనున్నారు. ఆ సమయమింకా రాలేదన్నాడు ప్రభువు. కాని విందులో ద్రాక్షారసం కొంత తీర్చడానికి యేసు పూనుకున్నాడు. ఖాళీ అయిన ఆరు రాతి బానల్లో అంచుల దాకా నీళ్లు నింపించాడు. ఆ నీటినే ద్రాక్షారసంగా మార్చాడు. అంతా సమృద్ధిగా సేవించారు. ‘చివరిదాకా ఇంత రుచికరమైన’ ద్రాక్షారసమా? అని అచ్చెరువొందారు అంతా!! మహా విషాదంగా ముగియవలసిన పెళ్లి వేడుకను దేవుడు అలా ఎంతో ఘనమైన వేడుకగా మార్చారు. చుక్క ద్రాక్షారసం లేని పెళ్లి వేడుకలో ప్రభువు కృప వల్ల కాళ్లు కడుక్కునే నీళ్లంతా సమృద్ధిగా ద్రాక్షారసంగా ప్రవహించింది. ద్రాక్షపళ్లనే సృష్టించిన దేవుడు పెళ్లిలో ఉండగా, మిడిమిడి జ్ఞానంతో రాతి బానల్లోని నీటిని పారబోసి, అవమానాన్ని అధికం చేసుకోవాలనుకున్న కుటుంబాన్ని దేవుడు ఆ విధంగా ఆదుకున్నాడు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా యేసు చేతికి అప్పగిస్తే జరిగేది అదే! ఆయన సమస్యను తీరుస్తాడు. ఆయన తీర్చేవాడే కాదు, దాన్ని మహాశీర్వాదంగా మార్చే దేవుడు. లోకం మన సమస్యను తీర్చబోతూ మన అవమానాన్ని అధికం చేస్తుంది. కానీ దేవుడైతే మన పరువు ప్రతిష్ఠలు ఇనుమడించేలా సమస్యను తీరుస్తాడు. సమస్యకు వెయ్యి పరిష్కార మార్గాలున్నా, పనిచేసే పరిష్కారమొక్కటే... అది - యేసును ఆశ్రయించడమే!! - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
జీసస్ సమాధిపై ఆశ్చర్యకరమైన నిజాలు
మానవ చరిత్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవతామూర్తిగా యేసుక్రీస్తు పేరు గడించారనే విషయం మాత్రమే మనందరికీ తెలుసు. జెరుసలేం హోలీ సెపల్చేర్ లోని యేసుక్రీస్తు సమాధిని గత వారం తొలిసారి తెరిచారు. కానీ యేసు క్రీస్తు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశం అదొక్కటే కాదు. 30 ఏడీలో మరణించిన మెసయ్య సమాధులు భారత్, జపాన్ లలో కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. క్రైస్తవ సంప్రదాయం ఏం చెబుతోందంటే యేసుక్రీస్తుకు శిలువ వేసిన అనంతరం ఆయన దేహాన్ని సమాధి చేసేందుకు ప్రత్యేకమైన బండరాళ్లతో చిన్న నిర్మాణాన్ని తయారు చేశారు. దీన్ని ఎడిక్యూల్ అని పిలుస్తారు. ఎడిక్యూల్ అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. దీనికి చిన్ని ఇల్లు అని అర్ధం. ఆ నిర్మాణాన్ని దీపాలు, కొవ్వొత్తులతో అలంకరించి క్రీస్తు దేహానికి అభిషేకం చేసి గుడ్డతో చుట్టి సమాధి చేశారు. ఆ తర్వాత క్రీస్తు పునర్జర్మ ఎత్తినట్లు క్రైస్తవ సంప్రదాయం చెబుతోంది. కాగా, క్రీస్తును ఉంచిన సమాధి ఆయనకు శిలువ వేసిన ప్రదేశం నుంచి కొద్ది దూరంలోనే ఉంది. దీనిపై ప్రస్తుతం అథెన్స్ జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తున్నారు. హోలీ సెపల్చేర్ చర్చ్ జెరుసలేంలోని హోలీ సెపల్చేర్ చర్చిలో అసలైన జీసస్ సమాధి ఉందనే ప్రచారం జరిగింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంద్రి క్రైస్తవుల దృష్టిని కూడా ఈ చర్చి ఆకర్షిస్తోంది. అయితే చరిత్రకారులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. టాల్పాయిట్ జెరుసలేంలోని టాల్పాయిట్ పట్టణంలో 1922లో నిర్మితమైంది. 2007లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ నిర్మించిన 'ది లాస్ట్ టూంబ్ ఆఫ్ జీసస్'లో టాల్పాయిట్ లో జీసస్ సమాధి ఉందని పేర్కొన్నారు. 1980లో టాల్పాయిట్ లో జరిగిన తవ్వకాల్లో పూర్వికులకు సంబంధించిన ఎముకలు, దేహాలను భద్రపరిచే అత్యంత పురాతన పేటికలు లభ్యమవడమే ఇందుకు కారణం. వీటిపై పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్టులు, బిబ్లికల్ స్కాలర్లు ఒకరినొకరు ఏకీభవించుకోలేదు. గ్లాట్సన్ బ్యూరీ జెరుసలేంలోని బెత్లెహోమ్ యేసు జన్మస్ధలమని క్రీస్తు బోధనల్లో ఉంది. అయితే, యుక్త వయసులో జీసస్ బ్రిటన్ కు వెళ్లినట్లు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. బ్రిటన్ కు వలస వచ్చిన జీసస్ ప్రిడ్డీ, సోమర్ సెట్ ప్రాంతాల్లో స్ధిరపడ్డారని దీని సారాంశం. క్రీస్తు దేహాన్ని గ్లాట్సన్ బ్యూరీలో భద్రపరిచినట్లు ఈ కథ చెబుతుంది. భారత్, నేపాల్, జపాన్ లలో.. జీసస్ కు శిలువ వేయలేదని, ఆయన భారత్ కు వలస వచ్చి జీవనం కొనసాగించినట్లు 1800వ సంవత్సరంలో స్ధాపించిన అహ్మదీ ముస్లిం ఫెయిత్ అనే సంస్ధ చెబుతోంది. ఉత్తర కశ్మీర్ లోని రోజాబాల్ అనే పుణ్య ప్రదేశంలో క్రీస్తు దేహాన్ని సమాధి చేసినట్లు పేర్కొంది. నేటికి కూడా పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని చెప్పింది. అయితే, దీనిపై వివాదాలు ఉన్నాయి. ముస్లిం మత బోధకులు యోజా ఆసిఫ్, సయ్యద్ నజీరుద్దీన్ లకు చెందిన సమాధులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు స్ధానికులు చెబుతున్నారు. పదమూడేళ్ల ప్రాయంలో జీసస్ జెరుసలేంను విడిచి హిమాలయాలకు వచ్చినట్లు 1887లో రష్యా యుద్ధ ప్రతినిధి నికోలస్ నోటోవిట్చ్ పేర్కొన్నారు. తనకు లభ్యమైన ఓ డాక్యుమెంటులో ఇందుకు సంబంధించిన సమాచారం ఉందన్నారు. జీసస్ టిబెటన్ ఆచారాలను పాటిస్తూ బుద్ధిజాన్ని చదువుకున్నట్లు తెలిపారు. అయితే, చరిత్రకారులు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. 1930లో క్రీస్తుపై మరో కథ కూడా వెలుగు చూసింది. శిలువ నుంచి తప్పించుకుని తన సోదరుడు ఇసుకురిని తీసుకుని జీసస్ జపాన్ కు వచ్చినట్లు దీని కథనం. ఆ తర్వాత తన జీవితకాలన్ని మొత్తం షింజో అనే గ్రామంలో జీసస్ వెళ్లదీశారని పేర్కొంది. దీన్ని బలపరుస్తూ షింజో గ్రామంలోని సజిరో సవాగుచి కుటుంబం తాము జీసస్ వారసులమని ప్రకటించింది. 100 ఏళ్ల వయసు వరకూ జీసస్ జీవించారని చెప్పంది. ఆయన దేహాన్ని గ్రామానికి దగ్గరలో సమాధి చేసినట్లు పేర్కొంది. ఈ ప్రాంతాన్ని కూడా ఏళ్లుగా క్రైస్తవులు సందర్శిస్తూ వస్తున్నారు. -
నమ్మినవారికీ... సమస్యలుంటాయా?
సువార్త చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టి, మట్టి కప్పినంత తేలిక కాదు... ఒక జీవితాన్ని కట్టడం. అది దేవునికే సాధ్యం. మరియ, మార్తల ముద్దుల తమ్ముడు బేతనియకు చెందిన లాజరు. అతను యేసుకు కూడా ఎంతో ప్రియుడు. యూదు సమాజం దాదాపుగా వెలివేసిన యేసును వీళ్లు ఎంతో ప్రేమించడం - వారి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోయారు. అలాంటి లాజరు రోగంతో, మరణశయ్య మీదున్నాడు. యేసును ప్రేమించేవారికి కూడా రోగాలు, సమస్యలు వస్తాయా? అన్న తరతరాల ప్రశ్న అక్కడా తలెత్తింది. లాజరు మరణశయ్యపై ఉన్నాడని మరియ, మార్తలు పంపిన కబురందుకున్న యేసు వెంటనే రాకుండా కావాలనే ఆలస్యం చేశారు (యోహాను 11:6). యేసులో అసలు మహిమలున్నాయా? అన్న వివాదం అప్పటికే చెలరేగుతోంది. యెరూషలేములో యేసు ఒక గుడ్డివాని కళ్లు తెరిచాడు. నేల మీద తన ఉమ్మితో ఆయన బురద చేసి, దాన్ని అతని కళ్లకు పూసి, వెళ్లి కోనేట్లో కడుకొమ్మన్నాడు. యేసే తనకు కళ్లిచ్చాడంటూ ఆతడు అంతటా ప్రకటించడం సంచలనమైంది. ‘ఆయన నీకు బురద పూసినపుడు అంధుడవు కదా, ఆయనే యేసు అని ఎలా తెలుసు?’ అన్న ఎదురు ప్రశ్నతో యేసు శత్రువులతణ్ణి ఇరకాటంలో పెట్టి అదంతా అబద్ధమని ప్రచారం చేశారు. యేసు అనుచరులు మాత్రం మౌనం దాల్చారు. ‘అసత్యం’ ధాటికి ‘సత్యం’ ఒక్కొక్కసారి మౌనం వహించాల్సిందే! ఈ నేపథ్యంలో యేసు వచ్చి లాజరును బాగు చేస్తే తమకు బలమొస్తుందని యేసు అనుచరులు, ఆయన రాకపోతే యేసు చరిత్రను సమాప్తం చేయవచ్చని ఆయన శత్రువులూ ఎదురు చూశారు. అయితే యేసు రాలేదు; లాజరు చనిపోగా అతణ్ణి పాతిపెట్టారు. దాంతో యేసు శత్రువులకు వెయ్యేనుగుల బలం రాగా, విశ్వాసులు కృంగిపోయారు. ‘ఆ గుడ్డివాని కళ్లు తెరిచిన యేసు, లాజరు చనిపోకుండా ఆపలేడా?’ అని అక్కడున్న వారు ఎకసక్కాలాడారు (యోహాను 11:37). మహిమలు లేవు కాబట్టే యేసు మొహం చాటేశాడని శత్రువులు ఢంకా బజాయించారు. అయితే లాజరు చనిపోయిన నాలుగు రోజులకు యేసు వచ్చాడు. లాజరును సమాధిలో నుండి పిలిచి మరీ అతణ్ణి సజీవుణ్ణి చేశాడు. అది మరింత సంచలనమైంది! అంధుని ఉదంతాన్ని ఆయన రహస్యంగా చేసినందుకు వివాదాస్పదం చేసిన శత్రువుల నోళ్లకిపుడు శాశ్వతంగా తాళాలుపడ్డాయి. ఎందుకంటే లాజరును సమాధి చేసినవాళ్లంతా ఇప్పుడతణ్ణి సజీవంగా చూస్తున్నారు. దాంతో యేసు దేవుడన్న ‘సత్యం’ స్పష్టమైంది. యేసు అనుచరులు కూడా ఆయన రోగాలు బాగు చేసి మరణం బారిన పడకుండా ఆపేవాడే కాదు, చనిపోయినా ప్రాణంపోయగల శక్తిసంపన్నుడని ఎరిగి, విశ్వాసంతో మరో మెట్టెక్కారు. జీవితాల్లో సమస్యలు తీవ్రమైనపుడు, పరిష్కారాలు ఆలస్యమైనపుడు బాధపడకూడదు. దేవుడు తన సంపూర్ణ శక్తి నిరూపణకు సిద్ధమవుతున్నాడని విశ్వాసులు అర్థం చేసుకోవాలి. అసత్యానికి నోరెక్కువ, హోరెక్కువ! సత్యానిది మాత్రం కొండల్ని పెకలించగల మహాప్రవాహ నిశ్శబ్ద శక్తి!! ఆలస్యాలు అనూహ్యమైన దేవుని ఆశీర్వాదాలనిచ్చే ద్వారాలు. సత్యానిదెపుడూ చేతల భాష, విశ్వాసిని బలపరిచేబాట!! - రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
'జీసస్కు జన్మనివ్వబోతున్నా..'
వాషింగ్టన్: జెరుసలేంలోని ఏసుక్రీస్తు సమాధిపై చలువరాతిని ఏ క్షణంలో తెరిచారోగానీ ఆ భగవత్ స్వరూపుడిపై వింతవింత వార్తలు నిరంతరంగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన 19 ఏళ్ల అవివాహిత యువతి.. తాను గర్భవతినని, త్వరలోనే జీసస్ కు జన్మనివ్వబోతున్నానని వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసింది. 'ఒక అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ నమ్మరు. నా కడుపులో జీసస్ పెరుగుతున్నాడన్న విషయాన్ని కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. అద్భుతం జరిగాక.. అంటే, నేను జీసస్ కు జన్మనిచ్చాక లోకరక్షకుడి ముందు అందరూ మోకాళ్లువంచి నమస్కరిస్తారు' అని 19 ఏళ్ల హాలే అంటున్నారు. వినడానికే విస్మయం కలిగిస్తోన్న ఈ విషయం అసలెలా బయటికొచ్చిందంటే.. ప్రస్తుతం టీవీల్లో ప్రసారం అవుతోన్న కుటుంబ పంచాయితీల తరహాలోనే అమెరికాలో మానసిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన టీవీ కార్యక్రమ 'డాక్టర్ ఫిల్ షో' చాలా ఫేమస్. వింత వింత మానసిక వ్యాధుల బారినపడ్డవాళ్లు, వారి కుటుంబ సభ్యులు చెప్పే ఆసక్తికరమైన విషయాలెన్నో చూపిస్తారా షోలో. ఇటీవలే హాలే, ఆమె తల్లి క్రిస్టీతో కలిసి 'డాక్టర్ ఫిల్ షో'లో పాల్గొన్నారు. తాను జీసస్ కు జన్మనివ్వబోతున్నట్లు చెప్పిన ఆమె.. గతంలో తాను అమెరికన్ ఐడల్ పోటీలో పాల్గొన్నానని, జబ్బుతో బాధపడుతోన్న సోదరుడికి అవయవదానం చేశానని, ఇంకా ఏవేవో చెప్పుకుంది. కాగా, హాలే చాలాకాలంగా 'కంపల్సీవ్ డిజార్డర్'అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని, ఉన్నవి లేనట్లు, లేని వున్నట్లు ఊహించుకుంటుందని గర్భదారణ కూడా అలాంటి భ్రమేనని ఆమె తల్లి క్రిస్టీ చెప్పారు. ప్రెగ్నెస్సీకి సంబంధించిన 22 రకాల పరీక్షల్లోనూ ఫలితాలు నెగటివ్ అనే వచ్చాయని ఆమె తెలిపారు. చివరికి షో హోస్ట్ డాక్టర్ ఫిల్ మాట్లాడుతూ.. 'హాలే సుదీర్ఘకాలం చికిత్స తీసుకుంటే తప్ప ఆమె మానసిక వ్యాధి నయం కాదు'అని తేల్చారు. -
క్రీస్తు మార్గం అనుసరణీయం
కథోలిక సంఘ పీఠాధిపతి గాలి బాలి గుంటూరు ఈస్ట్: ఏసీ కళాశాల సమీపంలోని పునీత ఆగ్నేశమ్మ దేవాలయంలో బుధవారం కృతజ్ఞతా దివ్య పూజా బలి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కథోలిక సంఘ పీఠాధిపతిగా రెవరెండ్ డాక్టర్ గాలి బాలి 32 ఏళ్లపాటు సేవలందించినందుకుగాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత అరండల్‌పేట ఎనిమిదో లైను నుంచి గాలి బాలిని ఊరేగింపుగా దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు అడుగు జాడల్లో నడిచినందునే కథోలిక సంఘం ఆశీర్వాదం పొందిందన్నారు. సేవా కార్యక్రమాలే సంఘానికి ఊపిరి అని చెప్పారు. ఇదే స్ఫూర్తితో సంఘ సభ్యులంతా ముందుకు కదలాలని సందేశమిచ్చారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో పాస్టర్ పిల్లి ఆంథోని పాల్గొన్నారు. -
యేసు సందేశంతో...
ఏసుక్రీస్తు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడేం చేశారు? ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో రూపొందు తోన్న చిత్రం ‘తొలి కిరణం’. పీడీ రాజు ఏసుక్రీస్తుగా, అభినయ మేరీ మాతగా జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 28న పాటల్ని, క్రిస్మస్కి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటివరకూ క్రీస్తు జీవితంలో ఎవరూ స్పృశించని అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో పాటల్ని విడుదల చేయను న్నాం. ఆర్పీ పట్నా యక్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యం హైలైట్’’ నిర్మాత అన్నారు. -
నేనే మార్గం.. నేనే సత్యం... నేనే జీవం!
ప్రేమ, కరుణ, దయ, త్యాగం, సేవ, పాపక్షమాపణలకు ప్రతిరూపం యేసు. విశ్వమానవ పాపాలను తన పరిశుద్ధ రక్తంతో కడిగివేసి పాప క్షమాపణ కలిగేందుకు వచ్చిన మహనీయుడు యేసయ్య. దేవుని స్వరూపం కలిగినవాడై, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనక, మనుష్యుల పోలికలో పుట్టి, దాసుని స్వరూపాన్ని ధరించి, తన్ను తానే రిక్తునిగా చేసుకొన తలచి, ఈ లోకానికి దిగి వచ్చిన దైవకుమారుడు యేసు. తన సిలువ శిక్ష అనుభవించిన సిలువకు వన్నెతెచ్చి పూజార్హత కలిగించాడు యేసయ్య. అసలు ఎందుకు రావాల్సి వచ్చిందంటే - దేవుడైన యెహోవా సృష్టించిన ఆదాము- అవ్వ దేవుని మాట అతిక్రమించి సాతానుతో మోసగించబడ్డారు. వారి సంతానమైన మానవకోటి అంతా పాప బంధకములలో పడిపోయి జీవించుట వలన అందరికీ మరణం సంప్రాప్తమైనది (రోమా 5:12). రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలుగదని (లేవీ 17:11, హెబ్రీ 9:22) దానికి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాప రహితుడైన వాని రక్తం వలననే పాప క్షమాపణ జరుగుతుందని యెహోవా దేవుడు (త్రిత్వమైన దేవుడు) యేసుక్రీస్తు నామమున భూమిపై జన్మించి తన రక్తాన్ని సిలువలో చిందించి పాపులుగా చేయబడ్డ వారినందరినీ కృపాదానంతో నీతిమంతులుగా చేయుటకు వచ్చాడు. దేవుడు ప్రేమామయుడు. ఎందుకంటే మనం ప్రేమించితిమని కాదు.. తనే ముందుగా ప్రేమించి, మన పాపులకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను (1 యోహాను 4:10). అది కూడా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రైస్తవ మార్గం ప్రేమ మార్గం. ప్రభువు ప్రేమను వెల్లడిచేయు మార్గం. క్రీస్తు వద్ద నుండి ప్రేమను పొంది లోకానికి తెలియచేయడానికి పిలవబడిన వారము. రెండవ ఆజ్ఞ నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించు. (ఇది వైయస్సార్ గారికి ఎంతో ఇష్టమైనది). తండ్రి ప్రేమచేత క్రీస్తు ప్రేమలో మనలను ఏర్పరచుకొన్న విధానం గొప్పది. ఎంతగా అంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరికీ అప్పగించాడు (రోమా 8:32). ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే పాపులమైన మనకోసం సిలువలో కొన్ని గంటలు యేసయ్య చేతిని వదిలాడు. అందుకు నాల్గవ మాటగా ‘నా దేవా నా దేవా ఎలా నా చెయ్యి విడిచితివి’ అంటాడు. ఎందుకంటే సిలువలో లోకపాపమంతయు ఆయన మీద మోపబడింది. ఆదాము పాపముతో దూరమైన ఆయన సన్నిధిలోకి యేసయ్య రక్తం మరల ప్రవేశం కల్పిస్తున్నది. యేసయ్య చెప్పాడు - నేను మరల తీసుకోనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే పెట్టుచున్నాను (యోహాను 10:17-18). ఆయన తనతో ఉండాలని కోరుకుంటున్నాడు ఎంతటి ఆధిక్యతను ఇస్తున్నాడంటే ఆదాము ద్వారా పోగొట్టుకున్న అధికారమును ఈ భూమి మీద ఆయన సృష్టి అంతటి మీద తిరిగి కల్పించాడు. ♦ యోహాను 17:23 - నీవు నేను ఏకమై ఉన్నట్లుగా నీవు నాకనుగ్రహించిన వారందరు ఏకమవ్వాలని నీవు నాకిచ్చిన మహిమను వారికి ఇచ్చితిని. ♦ యోహాను 17:24 - నేను ఎక్కడ ఉంటానో నీవు నాకనుగ్రహించిన వారందరు నాతో కూడ ఉండాలని, నీవు ఇచ్చిన మహిమను చూడాలని ప్రార్థన చేశాడు. ♦ ఎఫెసీ 2:7 - క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టును. ♦ ప్రకటన 3:21 - నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. ♦ యోహాను 17:3 - సర్వశరీరులకు నిత్యజీవమిచ్చుటకు. ♦ ఎఫెసీ 1:7 - మన అపరాధములకు క్షమాపణ, విమోచన ఇవ్వటానికి వచ్చాడు. ♦ ఎఫెసీ 1:6 - జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు. తన చిత్త ప్రకారమైన దయాసంకల్పమును బట్టి కుమారులుగాను స్వీకరించుటకు మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడు. ♦ రోమా 3:24 - క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ♦ రోమా 8:39 - ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని వాక్యము సెలవిస్తుంది. ♦ రోమా 8:37 - మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఆయన ప్రేమ శాశ్వతమైనది (యిర్మీ 31:3) ♦ కొలస్సీ 2:10 - మనం ఆయన యందు సంపూర్ణులమై యున్నాము ♦ హెబ్రీ 10:14 - ఆయన అర్పణచేత పరిశుద్ధపరచబడు వారికందరికి (నిన్న నేడు రేపు) వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసియున్నాడు. ♦ హెబ్రీ 8:12 - నీ దోషముల విషయమై నీ పాపాలను ఇక ముందు ఎన్నడూ జ్ఞాపకం చేసికొననని వాగ్దానం. ♦ యోహాను 15:27 - ఆయన శాంతిని మీకిచ్చి వెళ్లుచున్నాను. ♦ యోహాను 20: 19 - యేసు ఆరోహణమైన తరువాత శిష్యులకు కనబడి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పెను. ♦ యెషయా 53:5 - ఆయన దెబ్బల వలన మనకు స్వస్థత. ♦ రోమా 10:9 - యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల రక్షించబడెదవు. ఆయన రక్తం ద్వారా కడిగి మనలను పరిశుద్ధులలో నడిపిస్తున్నాడు. ♦ హెబ్రీ 10:19 - ఆయన రక్తం ఆయన సన్నిధిలోకి ఆయన సహవాసంలోకి నడిపిస్తుంది. ♦ యోహాను 3:16; యోహాను 6:40 - కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవము పొందుటయే తండ్రి చిత్తము. ♦ మార్కు 16:17 - నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. నీ నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు. కొత్త భాషలు మాట్లాడుదురు. పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది తాగినను హాని చేయదు. నమ్మిన వారికి అధికారమును ఇస్తున్నాను. ♦ 2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్య్రం వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తం తాను దరిద్రుడాయెను. ♦ రోమా 8:30 - ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వానిని మహిమపరుస్తున్నాడు. ♦ ప్రకటన 5:12 - వధింపబడిన గొఱ్ఱెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమ నేత్రమును పొందనర్హులని చెప్పబడుతుంది. ♦ యోహాను 14:26 - మీకొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపెదను. ♦ ప్రకటన 1:6 - రాజులుగా, యాజకులుగా చేసినాడు. ♦ నిర్గమ 19:5-6 - ఆయన మాట వినేవారు నా స్వకీయ సంపాద్యమగుదురు. ♦ మత్తయి 1:23 - ఇమ్మానుయేలు దేవుడు తోడు. ♦ రోమా 8:14-16 - అబ్బా తండ్రీ దత్తపుత్రులుగా వారసులుగా చేసినాడు. ♦ యోహాను 14:6 - నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును. ♦ యోహాను 4:23 - ఆత్మతో ఆరాధించువారు కావలెనని వెదుకుచున్నాడు. ♦ ఆయన సిలువ ద్వారా కృప చేత ప్రేమ కుమ్మరించబడుచున్నది. అబ్రహాముకిచ్చిన వాగ్దానానికి వారసులుగా చేస్తాడు. ఆది 12:2-3 - నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించువారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. యేసయ్య మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆయన ప్రధాన యాజకుడు. ఆయన మనలను వెలిగించు జీవపు వెలుగు. మనం ప్రేమించే దానికంటే ప్రేమించబడుటయు అది కూడ దేవునితో ప్రేమించబడటం గొప్ప వరం. మనం చూపే ప్రేమ మనం చేసే పుణ్యకార్యాలు ఏమీ ఆధారం కావు. అవి ఏవీ దేవునికి ఒరగబెట్టేవి కావు. మనం చేసే కార్యాలు మనం చూపే ప్రేమ మాత్రమే మన కళ్లకు కనిపిస్తుంటుంది. కాని మనం పుట్టేటప్పుడు ఏమీ తీసుకొని రాము. చనిపోయేటప్పుడు మామూలుగా అయితే ఏమీ తీసుకొనిపోము. అదే క్రైస్తవునికి అయితే ఇక్కడ నుండి స్థల మార్పు. పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాము. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనం ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు. యేసయ్యతో సమానముగా అంటే అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మనం అనుకోవాల్సింది మన కోసం కాదు, నా కోసం యేసయ్య సిలువలో మరణించాడు అని. అవును ఇది సత్యం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని క్రీస్తుతో సజీవులుగా లేపుతున్నాడు. పరలోక ఆశీర్వాదములు ఇహలోక ఆశీర్వాదములు ఆయన సిలువలో చేసిన ఆర్పణ కారణం. ఆయన లేచిన రోజు ఈస్టర్. ఒకవేళ ఆయన చనిపోయి ఉండకపోతే మన పరిస్థితి నరకంలోనే పాపంలోనే ఉండేది. సాతానుకు ఏమాత్రం తెలిసినా యేసయ్య సిలువను ఆపి ఉండేది. ఆయన కృప ప్రేమ పొంగి పొరులుతూ ఉంటుంది. ఆయన సంకల్పం (1 తిమోతి 2:4-6): మనుష్యులందరు రక్షణ పొంది సత్యమందు జ్ఞానము గలవారైయుండవలెనని దేవుడు ఇచ్ఛయించుచున్నాడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తుయేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు. అందరూ రక్షణ పొందాలని రెండవ రాకడ ఆలస్యం చేస్తున్నాడు. అందరికీ ఈస్టర్కు క్రీస్తు యేసునామమున శుభములు కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు పునరుత్థానమే మనం పండుగ చేసుకోవడానికి కారణం. మనందరికి తెలిసినది యేసయ్య ఒక్కమారే చనిపోయాడని. మృతులలో నుండి తిరిగి లేచాడనేది. ఇది సత్యం. అదే పౌలు తన పత్రికల్లో వెల్లడి చేస్తున్నాడు (రోమా 6:10; 10:12). ‘‘లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతిపొందెను. సమాధి చేయబడెను. మూడవ దినమున లేపబడెను’’ (కొరింథీ 15:3-4). ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచ వెళ్లుచున్నానని (యోహాను 14:1-4) మరల ఒక దినమున దిగి వస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేనే మార్గమును.. నేనే సత్యమును... నేనే జీవమును. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు వెళ్లలేరు అని చెప్పాడు (యోహాను 14:6). అవును మరి ఆయన సిలువపై మన పాపాల ప్రాయశ్చిత్తం చెల్లించి, మూడు రోజులైన తరువాత పాపరహితుడైన యేసు సమాధి నుండి లేచుట ద్వారా మరణంపై విజయం సాధించాడు. పాపం మీద, మరణం మీద, సాతాను మీద, అపవాది క్రియల మీద, దాస్యపు ఆత్మ మీద విజయం సాధించాడు. మనం ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి ఆయనతో పరలోకంలో శాశ్వతంగా ఉండటానికి యేసయ్య మార్గమును సిద్ధపరిచాడు. మనం కూడా మరణించి పునరుత్థాన ం చెందటానికి మన ం ప్రభువుతో ఉంటామని, మన ప్రియులతో ఉంటామన్న గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు. అవి మన హృదయాలకు ఎంతో సంతృప్తినిస్తుంది. నిజం చెప్పాలంటే ఈస్టర్ నాడే మనకు పండుగ కాదు. ప్రతి రోజూ పండుగే. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఆయన పునరుత్థానుడు కాకపోతే మనకు రక్షణ ఎక్కడిది? మనకు దేవునితో ఉండే భాగ్యమేది? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు, ఈ లోకములో ఎప్పటికీ. అందుకే ప్రతి రోజూ ప్రతి సెకనూ స్తుతించాలి, కొనియాడాలి. అందుకే దావీదు అంటాడు ‘‘మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము... నా కోట... నేను నమ్ముకొను నా దేవుడు’’ అని. అవును మరి! నిజం చెప్పాలంటే ఈస్టర్ నాడే మనకు పండుగ కాదు. ప్రతి రోజూ పండుగే. ఎందుకంటే యేసయ్య ఈ లోకానికి రాకపోతే ఆయన పునరుత్థానుడు కాకపోతే మనకు రక్షణ ఎక్కడిది? మనకు దేవునితో ఉండే భాగ్యమేది? ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనతో ఉండాలని ఆశిస్తున్నాడు, ఈ లోకములో ఎప్పటికీ. అందుకే ప్రతి రోజూ ప్రతి సెకనూ స్తుతించాలి, కొనియాడాలి. - వై.ఎస్.విజయలక్ష్మి -
యేసు క్రీస్తు ముద్రలు
సందర్భం నేడు గుడ్ ఫ్రైడే మనందరి కొరకు బలిపశువుగా తనను తాను అర్పించుకొనుటకు ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు నామమున పాఠకులందరికీ వందనములు. ‘‘నేను క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించియున్నాను’’ (గలతీ 6:17) అని చెప్పిన పౌలు మాటలు ధ్యానించతగినవి. ‘‘వీరు నా స్వంతము’’ అంటూ యేసు ప్రభువు వేసిన ముద్రలని కొందరు వ్యాఖ్యానిస్తారు. అయితే పౌలు దమస్కు మార్గంలో యేసుప్రభువును సంధించినప్పటి నుండి, ఒకప్పుడు హింసకుడుగా ఉన్నవాడు, హింసింపబడిన వాడిగా మారినప్పటి నుండి తాను యేసయ్య కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడో తానే చెప్పాడు. 2 కొరింథీ 11:23-27లో ‘‘మరి విశేషముగా ప్రయాసపడితిని; అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని; అపరిమితముగా దెబ్బలు తింటిని; అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని; యూదుల చేత అయిదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని; ఒకసారి రాళ్లతో కొట్టబడితిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబగళ్లు సముద్రములో గడిపితిని; అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్య జనుల వలననైన ఆపదలలోను, పట్టణములో, అరణ్యములో, సముద్రములో, కపట సహోదరుల వలని ఆపదలలో ఉంటిని. ప్రయాసతోను, కష్టములతోను, జాగరణములతోను, ఆకలిదప్పులు, ఉపవాసములు, చలి, దిగంబరత్వముతోను ఉంటిని’’ అని చెప్తున్నాడు. ఈ దెబ్బల వలన వచ్చిన మచ్చలు పౌలు జీవించినంత కాలము అతని శరీరము మీద కనపడి ఉండవచ్చును. ఈ గాయాల మచ్చలను కేవలము మచ్చలుగా కాకుండ తాను ‘యేసయ్య సొత్తు’ అను సంగతిని గుర్తు చేసేందుకు వేయబడిన ముద్రలని పౌలు భావిస్తున్నాడు. ఈ ముద్రలు కేవలము చర్మము వరకే కాకుండా తన భావోద్రేకాలపైన, తన ఆత్మీయ జీవితంపైన పడ్డాయి. ఈనాడు ఇలాంటి ముద్రలు మనము నివసించు ప్రాంతాన్ని బట్టి ఉంటాయి. దేవుని కృప వలన ప్రస్తుతము మనకు అలాంటి పరిస్థితులు లేవు, కాని మనమందరము ఆలోచించాల్సిన విషయమేమంటే ఈ ముద్రలు మన ఆత్మీయ, నైతిక, మానసిక వైఖరిపైనను, మన వ్యక్తిత్వము పైనను పడినాయా లేదా అని! మనము క్రీస్తును నమ్ముకొనిన తర్వాత పాపము విషయమై మరణించి క్రీస్తు కొరకు జీవించాలి. మన అవయవములు ఆయన అధీనంలో ఉంచి, వాటిపైన ఆయన ముద్ర వేసుకోవాలి. పౌలులాగా మన శరీరాలపైన బాహ్య గుర్తులు లేకపోయినను, హృదయంలో ముద్రించుకోవాలి. ఆయనకు మనము కట్టు బానిసలమై పోవాలి. నిర్గమ 21:1-6లో ధర్మశాస్త్రము ప్రకారము వెలపెట్టి కొనబడిన బానిసకు 7వ సంవత్సరములో విడుదల ఇవ్వాలి. ఆ గడువు పూర్తయ్యాక తనకు విడుదల అవసరము లేదనియు, తాను జీవితాంతము తన యజమాని యొద్దనే ఉంటానని నిర్ణయము తీసుకొన్న బానిస చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉంటాడు. చెవికున్న రంధ్రము ద్వారా వాడు కట్టు బానిస అని ప్రపంచానికి తెలుస్తుంది. పౌలు అలాంటి బానిసత్వము కోరుకున్నాడు. రోమా 1:1లో ‘యేసుక్రీస్తు దాసుడను’ అని పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ముద్ర వేయించుకొని, ఆయనకు చెందిన వారమని చెప్పుకొనుటలో గొప్ప ఆధిక్యత ఉన్నది. ఈ సమాజంలో ఒకవేళ మనము ఒక గొప్ప కుటుంబానికి చెందిన వారమైతే అందును బట్టి అతిశయిస్తామేమో గాని, సర్వాధిపతియైన యేసయ్య సంబంధిగా గుర్తింపు తెచ్చుకోవడము చాలా గొప్ప ఘనత అని మనము అర్థం చేసుకోవాలి. మనము క్రీస్తు కొరకు శ్రమపడితే, మన జీవితాల నుండి క్రీస్తు ప్రత్యక్ష పరచబడుతాడు. మహిమ పరచబడుతాడు. పరిచర్యలో శ్రమలేనిదే ఏమీ సాధించలేము. ముద్రలు కలవారు మంచి నేలన పడిన విత్తనములాంటివారు. అట్టివారు నూరంతలు గాను, అరువదంతలు గాను, ముప్పదంతలుగాను ఫలిస్తారు (మత్తయి 13:8). పౌలు యేసయ్య మార్గంలోకి రాక ముందు తన శరీరంలోని సున్నతి గుర్తును బట్టి అతిశయించాడు గాని ఇప్పుడు క్రీస్తు కొరకు శ్రమపడుట వలన వచ్చిన గుర్తులను బట్టి అతిశయిస్తున్నాడు. ఫిలిప్పీ 3:5-6 ఉన్న వాక్య భాగములో ఈ విధంగా అంటున్నాడు - ‘‘ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై యుంటిని. అయినను ఏవేవి నాకు లాభకరముగా యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని.’’ కేవలము క్రీస్తును గురించిన జ్ఞానము, క్రీస్తు సిలువ యందు మాత్రమే అతిశయించు వాడిగా మారిపోయాడు. ఇంకొక సందర్భములో ఈ లోకములోని ప్రాముఖ్యమైన వాటన్నింటిని పెంటతో సమానముగా చూస్తున్నానంటున్నాడు. ‘క్రీస్తు ముద్రలు మన శరీరములో కలిగియుండుట’ అనునది మనం అన్వయించుకోవాలంటే క్రీస్తు సారూప్యములోనికి మారుతూ, ఆయన లక్షణాలు, స్వభావాలు కలిగియుండుట. మనము కొన్ని దినాలుగా సిలువ ధ్యానాలు చేసి ఉన్నాము కాబట్టి యేసుప్రభువు సిలువలో పలికిన ఏడు మాటల నుండి ఏ లక్షణాలు అలవరచుకోవాలో చూద్దాము. ‘‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి. ఆది 50:15-21లో యోసేపు తనను చంపచూసి, ఆ తర్వాత బానిసగా అమ్మేసిన తన అన్నల పట్ల క్రీస్తు లాంటి క్షమాపణ చూపాడు. అ.కా.7:54-60లో ఉన్న వాక్య భాగములో స్తెఫను తనను చంపేవారని క్షమించమని దేవుని వేడుకొనుటలో యేసయ్య ముద్రలు బాహ్యంగాను, అంతరంగంలోనూ చూపించాడు. ‘‘నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు’’ అని ప్రభువు తనతో పాటు సిలువ వేయబడిన దొంగతో చెప్పిన మాటల నుండి మనము నేర్చుకోవలసినది మనము చేయాల్సినది ఏమంటే మన తోటివారు మనతోపాటు పరలోకంలో ఉండాలనే తపన కలిగి ఉండాలి. ఉదాహరణకు పాత నిబంధనలో మోషే, క్రొత్త నిబంధనలో పౌలు ఇలాంటి తమ కోరికను వ్యక్తపరచారు. ‘‘అమ్మా, ఇదిగో నీ కుమారుడు’’ అని తన తల్లిని తనకు అత్యంత ప్రియమైన శిష్యునికి అప్పజెప్పడంలో తాను ధర్మశాస్త్రము నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు రాలేదని రుజువు చేసుకున్నాడు. మనము కూడా మన పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు మన జీవితము ద్వారా దేవుడు మహిమ పరచబడుతాడు. తిమోతి తన తల్లి యునీకే, అవ్వ లోయిలను గౌరవించి, ప్రేమించి, వారు బోధించిన విషయాల ప్రకారము జీవించుట ద్వారా తాను క్రీస్తు ముద్రలు కలిగియున్నాడని రుజువు పరుచుకొన్నాడు. ‘‘నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి’’ అను మాటలో పాపముగా చేయబడిన యేసయ్య చేయి తండ్రియైన దేవుడు విడిచినట్లుగా మనకు అర్థమవుతుంది. పాపము చేసినప్పుడు పవిత్రుడైన దేవుడు మన చేయి వదిలేస్తాడను విషయము తెలుసుకొని జాగ్రత్తగా ఉంటూ, ఎప్పుడైనా పాపములో పడితే, పశ్చాత్తాప హృదయముతో దేవుని సన్నిధికి వెళ్లినప్పుడు మనకు క్రీస్తు ముద్రలు ఉన్నాయని తెలుసుకోగలము. 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాప హృదయము తెలుసుకోగలము. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడైనాడు. ‘‘నేను దప్పిగొనుచున్నాను’’ అనే మాటలో తండ్రిలో తండ్రితో తిరిగి ఏకము కావాలనే తృష్ణ, ఆత్మల భారము యేసయ్య కనపరుస్తున్నాడు. మనము కూడా అలాంటి కోరికలు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు ముద్రలు మనలో కనబడుతాయి. ‘‘సమాప్తమైనది’’ - తండ్రి తనకప్పగించిన పని పూర్తి చేశానని చెప్తున్నాడు. 2 తిమోతి 4:7లో ‘‘మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని’’ అని పౌలు చెప్పినట్లు మనము కూడా చెప్పగలిగితే క్రీస్తు ముద్రలు మనలో ఉన్నట్లే. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’’ అను మాటలో యేసు ప్రభువు తిరిగి తండ్రితో ఏకమగుట చూస్తున్నాము. మనలను సృష్టించిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు. దానిని జాగ్రత్తగా ఆయనకు తిరిగి అప్పగించగలగాలి. రోమా 12:1లో సజీవ యాగముగా మనలను మనము దేవునికి అప్పగించుకోవాలని పౌలు అంటున్నాడు. పైన చెప్పబడిన విషయాలన్నీ జాగ్రత్తగా ధ్యానించి, మనము కూడా పౌలు లాగా క్రీస్తు ముద్రలు ధరించి యున్నామని చెప్పినపుడు దేవుడిని సంతోషపెట్టినవారమవుతాము. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమెన్! ‘‘తండ్రీ వీరేమి చేయున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము’’ (మత్తయి 5:44)లో శత్రువులను ప్రేమించమని తాను చెప్పిన మాటలు చేసి చూపిస్తున్నారు. యేసయ్య ముద్ర మనలో ఉన్నట్లు ఇతరులకు కనపడాలంటే శత్రువులను ప్రేమించుట, క్షమించుట, వారి కొరకు ప్రార్థించుట మనలో కనపడాలి. బి. విమలా రెడ్డి -
క్రిస్మస్ రోజు.. వర్మకు సవాలక్ష డౌట్లు
క్రిస్మస్ రోజున రాంగోపాల్ వర్మకు లెక్కలేనన్ని అనుమానాలు వచ్చాయి. ఐఎస్ఐఎస్ విషయంలో జీసస్‌తో లింకుపెట్టి తన అనుమానాలు అన్నింటినీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అవేంటో ఓసారి చూద్దామా.. జీసస్ అందరినీ ప్రేమిస్తారంటే, ఐఎస్ఐఎస్ను కూడా ఆయన ప్రేమిస్తారా అని తొలుత అడిగాడు. ఇక తర్వాత.. జీసస్కు, అల్లాకు మధ్య యుద్ధం జరిగితే జీసస్ గెలుస్తారని, ఎందుకంటే ఆయన కండలు అంత అద్భుతంగా ఉంటాయని అన్నాడు. రోమన్లు జీసస్‌ను అంత దారుణాతి దారుణంగా చంపితే, ఐఎస్ఐఎస్ మరి జీసస్ విషయంలో ఏం చేస్తుందోనని అనుమానం వ్యక్తం చేశాడు. జీసస్‌ను నమ్మే క్రిస్టియన్లు అందరినీ ప్రేమిస్తారని అంటారు కదా.. మరి ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్‌ను కూడా ప్రేమిస్తారా అని అడిగాడు. ఐఎస్ఐఎస్ నాయకుడు అబూ బకర్ నుంచి అల్ కాయిదా సభ్యుల వరకు అందరినీ జీసస్ ప్రేమిస్తే.. అప్పుడు అమెరికన్లు మసీదులలో వెతకడం మానేసి తమ సొంత దేవుడి విషయంలో సమీక్షించుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. చివరగా 'మిస్టర్ జీసస్'కు హేపీ బర్త్‌డే చెప్పాడు. శాంతా క్లాజ్ ఇచ్చిన చాక్లెట్లు తిన్న తర్వాత ఐఎస్ఐఎస్ విషయంలో ఏమైనా చేయగలరేమో ఒక్కసారి ఆలోచించాలని అడిగాడు. అవీ మన రామూ డౌట్లు! -
అదే క్రిస్మస్కు నిజమైన అర్థం!
‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈర్ష్యాద్వేషాలకు చోటుండదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. నా దృష్టిలో క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించిన పండగ. కానీ సెలబ్రేషన్స్‌తో పాటు షేరింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. అందుకే యేటా ఈ రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూంటా. మనకున్న దానిలో కొంత పేదలకు ఇస్తే అందులో ఉండే తృప్తి, ఆనందం వేరు. అదే క్రిస్మస్కి నిజమైన అర్థం. మాది బ్రహ్మసమాజం కమ్యూనిటీకి చెందిన కుటుంబం. నేను 2001లో క్రైస్తవ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాక ఎవరూ అడ్డు చెప్పలేదు. యూకేజీ వయసులోనే నేను చర్చకు వెళ్లేదాన్ని. అప్పటి నుంచే జీసస్‌తో కొంత అనుబంధం ఏర్పడింది. అప్పట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ 1985లో జరిగిన ఓ ప్రమాదం నన్ను పూర్తిగా మార్చేసింది. మరణం అంచుల దాకా వె ళ్తున్న నన్ను జీసస్ రక్షించాడని నా నమ్మకం. అందుకే ఆయన మార్గంలో వెళ్లడం మొదలుపెట్టా. క్రైస్తవ మార్గంలో వెళ్లడమంటే జీసస్‌లా అందరితో ప్రేమగా ఉండటమే! - జయసుధ -
ఇస్లాంలో యేసు
మానవజాతికి సన్మార్గం చూపడానికి దైవం అనేకమంది దైవప్రవక్తల్ని ప్రభవింపజేశారు. ఎన్నో దైవగ్రంథాలను అవతరింపజేశారు. ఉదాహరణకు పవిత్ర ఖురాన్ గ్రంథంలోని కొంతమంది ప్రవక్తల పేర్లు గమనించండి. 1. ఆదం అలైహిస్సలాం (ఆదాము) 2. ఇబ్ర హీం (అ) అబ్రాహాము 3. ఇస్మాయీల్ (ఇస్మాయేలు) 4. ఇస్హాఖ్ (ఇస్సాకు) 5. నూహ్ (నోవా) 6. ఇద్రీస్ (హానోక్) 7. లూత్ (లోతు) 8. యాఖూబ్ (యాకోబు) 9. యూసుఫ్ (యోసేపు) 10. అయ్యూబ్ (యోబు) 11. యూనుస్ (యోనా) 12. ఇలియాస్ (ఏలియా) 13. దావూద్ (దావీదు) 14. జక్రియా (జకర్యా) 15. అల్ ఎసా (ఎలీషా) 16. మూసా (మోషె) 17. ఈసా (ఏసు) 18. ముహమ్మద్ (స) వీరందరిపై దేవుని శాంతి, కారుణ్యం వర్షించుగాక: అలాగే తౌరాత్, జబూర్, ఇన్సీల్ (బైబిల్) ఖురాన్... దైవగ్రంథాలు... మరెన్నో సహీఫాలు. సృష్టికర్త ఈ విధంగా దైవప్రవక్తల్ని, గ్రంథాలను అవతరింపజేసిన అసలు ఉద్దేశ్యం... మానవాళికి సన్మార్గ పథాన్ని అవగతం చేయడం, స్వర్గమార్గాన్ని సుస్పష్టంగా తెలియజేయడం. సత్యాసత్యాలను, ధర్మాధర్మాలను, మంచీ చెడులను విడమరచి వారిని శాశ్వత సాఫల్యానికి అర్హులుగా చేయడం. నిజానికి ప్రారంభంలో మానవులంతా ఒకే ధర్మాన్ని అనుసరిస్తూ, ఒకే మార్గాన నడుస్తూ ఉండేవారు. ఆ తరువాత వారిలో వారికి విభేదాలు వచ్చాయి. అప్పుడు దైవం వారి వద్దకు శుభవార్తలు తెలియజేసే (సన్మార్గ దర్శకులను) పంపుతూ వచ్చాడు. ‘సత్యం’ గురించి ప్రజల్లో వచ్చిన విభేదాలను పరిష్కరించడానికి ఆయన ప్రవక్తలపై సత్యపూరిత గ్రంథాలను కూడా అవతరింపజేశాడు (2-212). ఇందులో భాగంగానే ఈసా ప్రవక్తను కూడా ఆయన పంపాడు. ఆయనపై ఇన్జీల్ (బైబిల్ ) గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఈసా (అ) గొప్ప దైవప్రవక్త. ఆయన పవిత్ర జననం గురించి పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది. ‘‘అప్పుడు దైవదూతలు మర్యంతో... (ఈసా ప్రవక్త మాతృమూర్తి) మర్యం! దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధపరిచాడు. యావత్ ప్రపంచ మహిళల్లో నీకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, తన సేవకోసం నియమించుకున్నాడు. కనుక మర్యం! నువ్వు ఇక నీ ప్రభువుకు విధేయురాలివై ఉండు. ఆయన దివ్య సన్నిధిలో సాష్టాంగపడుతూ ఉండు. మోకరిల్లే వారితో నువ్వు కూడా వినమ్రంగా తలవంచి ప్రార్థన చెయ్యి.’ ‘మర్యం! దేవుడు నీకు తన వైపు నుండి ఒక వాణికి సంబంధించిన శుభవార్త అందజేస్తున్నాడు. అతని పేరు మర్యం కుమారుడైన ఈసా మసీహా. అతను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ గౌరవనీయుడవుతాడు. దైవసాన్నిధ్యం పొందిన వారిలో ఒకడవుతాడు. అంతేకాదు, తల్లి ఒడిలో ఉన్నప్పుడూ, తరువాత పెరిగి పెద్దవాడైనప్పుడూ, అతను ప్రజలతో మాట్లాడతాడు. ఒక సత్పురుషుడిగా వర్థిల్లుతాడు.’ మర్యం ఈ మాటలు విని కంగారు పడుతూ ‘ప్రభూ! నాకు పిల్లాడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ పురుషుడూ తాకనైనా తాకలేదే!’ అన్నది. ‘ఇది అలాగే జరిగి తీరుతుంది. దైవం తాను తలచిన దాన్ని చేయగలడు. ఆయన ఒక పని చేయాలనుకున్నప్పుడు ‘అయిపో’ అంటే చాలు. అది వెంటనే అయిపో తుంది. దైవం అతనికి (మర్యం కుమారు డైన యేసుకు) గ్రంథజ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాత్, ఇన్జీల్ గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు’’ అన్నారు దైవదూతలు. (పవిత్ర ఖురాన్ - 3 - 42, 48) తరువాత దైవం అతన్ని (యేసును) తన ప్రవక్తగా నియమించి ఇస్రాయీల్ సంతతి ప్రజల వద్దకు పంపిస్తాడు. అతను దైవసందేశ హరునిగా వారి వద్దకు వెళ్లి ఇలా అంటాడు...‘‘నేను మీ ప్రభువు వద్దనుండి మీకోసం కొన్ని సూచనలు తెచ్చాను. ఇప్పుడు మీ ముందు మట్టితో పక్షి ఆకారం గల బొమ్మను చేసి అందులో (గాలి) ఊదుతాను. అది దైవాజ్ఞతో సజీవ పక్షిగా మారిపోతుంది. నేను దేవుని ఆజ్ఞతో పుట్టుగుడ్డికి చూపును ప్రసాదిస్తాను. కుష్టురోగికి స్వస్థతనిస్తాను. మృతుల్ని కూడా బతికిస్తాను. మీరు ఏమేమి తింటారో, మీ ఇళ్లలో ఏమేమి నిల్వ చేసి ఉంచుకుంటారో అంతా మీకు తెలియజేస్తాను. మీరు విశ్వసించేవారైతే, ఇందులో మీకు గొప్ప గొప్ప నిదర్శనాలున్నాయి (3-49). ఈ విధంగా దైవం ఈసా (అ) అంటే క్రీస్తు మహనీయులవారి ద్వారా అద్భుతాలు చేయించాడు. మహిమలు చూపించాడు. తద్వారానైనా ప్రజలు తనను శుద్ధంగా విశ్వసించి, సదాచరణలు ఆచరించి, సమాజ సంక్షేమానికి పాటుపడుతూ, సాఫల్యం పొందుతారని, ఎందుకంటే అసలు ఆరాధ్యుడు ఏకైక దైవం మాత్రమే. ఆయన తప్ప మరొక దైవం లేడు. ఆయన నిత్య సజీవుడు, ఎప్పటికీ నిద్రించనివాడు. కనీసం కునుకుపాట్లు కూడా పడనివాడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అనుమతి లేకుండా ఆయన సన్నిధిలో ఎవరూ సిఫారసు చేయలేరు. వారి (కళ్ల) ముందున్నదేమిటో, వారికి కనపడకుండా గుప్తంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. ఆయన తలచుకుంటే తప్ప, ఆయనకున్న జ్ఞానసంపదలోని ఏ విషయమూ ఎవరికీ తెలియదు. ఆయన రాజ్యాధికారం భూమ్యాకాశాలను పరివేష్టించి ఉంది. వాటి రక్షణ ఆయనకు ఏ మాత్రం కష్టమైన పని కాదు. ఆయన సర్వాధికారి, సర్వోన్నతుడు. మానవులారా! మీ ఆరాధ్యుడు ఒక్కడే. కరుణామయుడు, కృపాసాగరుడు అయిన ఆ దైవం తప్ప మీకు మరో దేవుడు లేనే లేడు. భూమ్యాకాశాల సృజనలో, రేయింబవళ్ల చక్రభ్రమణంలో, సముద్రాలలో పయనిస్తూ, మానవులకు ప్రయోజనం చేకూర్చే ఓడలలో, దేవుడు పైనుండి కురిపించే వర్షపు నీటిలో - తద్వారా ఆయన మృతి భూమికి ప్రాణ ం పోసే (చెట్లూ చేమల్ని పచ్చదనం చేసే పనిలో) పుడమిపై పలు విధాల జీవరాశుల్ని విస్తరింపజేసే ఆయన సృష్టి నైపుణ్యంలో వాయువుల సంచారంలో. నేలకు నింగికి మధ్య నియమబద్ధంగా సంచరించే మేఘమాలికల్లో బుద్ధిజీవులకు అసంఖ్యాక నిదర్శనాలున్నాయి. (2.163-164). ఈ విధంగా సృష్టికర్త అయిన దైవం మానవుల మార్గదర్శనం కోసం, వారి ఇహ పర సాఫల్యాల కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. ఆ ఏర్పాట్లలో భాగమే ప్రవక్తల ప్రభవన. గ్రంథాల అవతరణ. దైవాదేశాల ప్రకారం, దైవప్రవక్తల, దైవగ్రంథాల మార్గదర్శకంలో, ఎలాంటి హెచ్చు తగ్గులకు, అతిశయాలకు తావు లేకుండా నడుచుకుంటే తప్పకుండా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సాఫల్యం పొందవచ్చు. అమర సుఖాల శాశ్వత స్వర్గసీమను సొంతం చేసుకోవచ్చు. - ఎండీ ఉస్మాన్‌ఖాన్ -
పరలోక ధనాన్ని ఎలా కూర్చుకోవాలి?
సువార్త ఒక కోటీశ్వరుడు తానెంత ధనవంతుడినో తన చర్చి పాస్టర్కు వివరిస్తున్నాడు. తనకు ఉత్తరాన చమురు బావులు, దక్షిణాన వేలాది ఎకరాల్లో వ్యవసాయం, తూర్పున బోలెడు కర్మాగారాలు, పడమట ఎన్నో వాణిజ్య సంస్థలున్నాయన్నాడు. ‘కాని నీవు నిరుపేదవే’ ఎందుకంటే ఆ వైపు నీకేమీ లేవు కదా!’ అన్నాడా పాస్టర్ ఆకాశం వైపు చేయి చూపిస్తూ. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి విస్తారంగా పండిందట! అందువల్ల అతను తన పాతకొట్లు పడగొట్టి కొత్తవి, పెద్దవి కట్టించి చాలా ఏళ్లకు సరిపడా ధనాన్ని, ధాన్యాన్ని కూర్చుకొని ఇక తిని, తాగి సుఖించడానికి పూనుకున్నాడు. అయితే దేవుడు పిచ్చివాడా, ఈ రాత్రికే నీ ప్రాణం పోతే నీ గతి ఏమిటి? పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నించు’ అని అతన్ని హెచ్చరించాడు (లూకా 12ః 16-21). ధనార్జన తప్పు కాదు. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, వ్యవసాయ కార్యకలాపాలు లేకపోతే మన కనీసావసరాలెలా తీరుతాయి? పేదలకు జీవనోపాధి ఎలా? కాని ధనార్జనే ధ్యేయంగా, స్వార్థమే పరమార్థంగా బతకడాన్ని, తన స్వరూపంలో సృజించబడిన మనిషిలో పరలోక భావనలు లేకపోవడాన్ని మాత్రం దేవుడు హర్షించడు. ఎంతోమంది పనివారి అహర్నిశల శ్రమ, నీరు సూర్యరశ్మిని ధారాళంగా ఇచ్చిన దేవుని కృపతో పంట సమృద్ధిగా పండితే, అదేదో తానొక్కడి విజయమేనన్నట్టు ధనవంతుడు ఆ పంటను పనివారితో పంచుకోకుండా, దేవునికీ ఆయన భాగమివ్వకుండా తానే తిని తాగి సుఖించాలనుకోవడంలోని స్వార్థాన్ని, డొల్లతనాన్ని దేవుడెత్తి చూపించాడు. ‘నేనొకరికివ్వను, ఒకరిది తీసుకోను’ అన్నది మరికొందరి జీవన సిద్ధాంతం. సమాజంలో ఇది చాలా ప్రమాదకరమైన తెగ. ‘నాది నాకుంది, నీది నీవే ఉంచుకో!’ అన్న యాకోబు సోదరుడు ఏశావు తాలూకు శాపగ్రస్తుల సంతతివారు (ఆది 33:9). తీసుకోకపోతే ఫరవాలేదు కానీ విశ్వాసియైనవాడు తప్పక ఇచ్చేవాడై యుండాలి. ఎందుకంటే మనలోని దైవస్వభావంలో ‘ఇచ్చే గుణం’ ఇమిడి ఉంటుంది. శ్వాస తీసుకోకుండా బతకలేనట్టే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగువాడిని ప్రేమించకుండా, అతనికివ్వకుండా విశ్వాసి బతకలేడు. పైకి విస్తరిస్తున్నా నానాటికీ కుచించుకుపోతున్న సమాజం, స్వభావాల మధ్య మనం బతుకుతున్నాం. ఎంత ఉన్నా ఇంకా కావాలన్న నిరంతర తాపత్రయంలో ‘తృప్తి’ ఎండమావి అయింది. పరలోకంలో ధనం కూర్చుకొమ్మని దేవుడు ఆదేశిస్తే, ఈ లోకాన్నే ధనశక్తితో పరలోకంగా మార్చుకోబోయి పీడకలలాంటి నేటి సమాజాన్ని నిర్మించుకొని దానికి బానిసలమయ్యాం. ఒకప్పుడు 9 వేల సరుకులమ్మే సూపర్ మార్కెట్లు పదేళ్ల తర్వాత ఇపుడు సగటున 40 వే సరుకులు అంటే నాలుగింతలు అమ్ముతున్నాయన్నది ఒక సర్వే సారాంశం. కాని మనిషి ఆనందాన్ని అవి నాలుగింతలు అధికం చేయలేదు సరికదా సగానికి తగ్గించాయి. మనిషి నిండా ‘నేను’ అనేవాడే నిండిపోయి చుట్టూ తానే గీసుకున్న వలయానికే అతని జీవితం పరిమితమై కుళ్లి కపు కొడుతోంది. దేవుని నిజంగా ప్రేమిస్తే పాటి మనిషిని ప్రేమించకుండా విశ్వాసి బతకలేడు. దేవుడంటే చాలా ప్రేమ కాని పక్కవాడిని కనీసం కన్నెత్తి కూడా చూడననే వాడిదే కపట ప్రేమ. ‘నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు’ అన్న దైవోక్తిలోనే పరలోకంలో ధనవంతులమయ్యే మార్గం ఉంది. అందుకే ‘ప్రేమించకుండా ఇవ్వగలమేమో కాని ఇవ్వకుండా ప్రేమించలేము’ అంటాడు కార్ మైఖెల్ అనే మహాభక్తుడు. - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్