వివేకాన్ని ఉపయోగించాలి | Sense to use | Sakshi
Sakshi News home page

వివేకాన్ని ఉపయోగించాలి

Published Thu, Sep 18 2014 11:50 PM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

వివేకాన్ని ఉపయోగించాలి

వివేకాన్ని ఉపయోగించాలి

 వెలుగు బాట
 
మంచిని, మానవత్వాన్ని బోధించడమే అన్ని మతాలు చేయవలసిన పని. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలేకావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి, మతం అనిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే, అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం.

కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే. నిన్ను వలె నీపొరుగు వారిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. సర్వేజనా సుఖినోభవంతు అంటుంది హిందూ మతం. ‘నువ్వు నీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటి వారి కోసం కూడా అలాంటి స్థితినే కోరుకో’మన్నారు మహమ్మద్ ప్రవక్త (స). సమస్త మానవాళీ పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం అంటోంది ఇస్లాం ధర్మం.
 
కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మత ధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పంచుకోవాలి. మత ధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనాలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేగాని దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది.

గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురిచేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ కూడా ఇలా చెబుతుంది.

‘మంచికి, దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో అత్యాచారాల్లో ఎవ్వరితో సహకరించకండి, దైవానికి భయపడండి, దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’ (పవిత్ర ఖురాన్)    
 
- మహమ్మద్ ఉస్మాన్ ఖాన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement