humanity
-
మానని గాయం
ఆధునిక కాలంలో మనిషి అంతరిక్షాన్ని అందుకోగలిగాడు; చంద్రమండలం మీద అడుగు మోప గలిగాడు; సహజ మేధకు పోటీగా కృత్రిమ మేధను సృష్టించాడు; విశ్వామిత్ర సృష్టిని తలపించేలా మనుషులకు దీటైన మరమనుషులను సృష్టించాడు. ఇంతటి మహత్తర ఘనతలను చూసినప్పుడల్లా ‘మానవుడే మహనీయుడు/ శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మహనీయుడు... జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు మానవుడే!’ అనుకుంటూ గర్వంతో ఉప్పొంగిపోతాం. రేపో మాపో అంగారక గ్రహం మీద ఆవాసాలను ఏర్పాటు చేసే దిశగా మనుషులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు ఉత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతాం. మనిషి సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టాలంటే, ఎన్ని గ్రంథాలైనా చాలవు.చరిత్రలో ఇన్ని ఘన విజయాలు సాధించిన మనిషికి అనాది పరాజయాలు కూడా ఉన్నాయి. ఆధునికత సంతరించుకుని, అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి–అమరత్వాన్ని సాధించే దిశగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే, ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని నేటికీ కనుక్కోలేకపోవడం మాత్రం ముమ్మాటికీ మనిషి వైఫల్యమే! యుద్ధాలలో ఉపయోగించ డానికి అధునాతన ఆయుధాలను ఎప్పటికప్పుడు తయారు చేయగలుగుతున్న మనిషి – అసలు యుద్ధాల అవసరమే లేని శాంతియుత ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోలేకపోవడం కూడా వైఫల్యమే! ప్రపంచంలో మనిషికి క్షుద్బాధను మించిన దుర్భర బాధ మరొకటేదీ లేదు. పురాణ సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు ఆకలి ప్రస్తావన మనకు విరివిగా కనిపిస్తుంది. తాను ఆకలితో అలమటిస్తున్నా, అతిథికి అన్నం పెట్టి పుణ్యలోకాలకు వెళ్లిన రంతిదేవుడి కథ తెలిసినదే! ఆకలికి తాళలేక కుక్కమాంసం తిన్న విశ్వామిత్రుడి కథ పురాణ విదితమే! ఆకలి బాధ మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది.అందుకు విశ్వామిత్రుడి కథే ఉదాహరణ. పురాణాల్లో అక్షయపాత్రలు పుణ్యాత్ముల ఆకలి తీర్చిన గాథలు ఉన్నాయే గాని, సామాన్యుల ఆకలి తీర్చిన ఉదంతాలు లేవు. ఆకలితో అలమ టిస్తున్నా, త్యాగం చేయడం గొప్ప సుగుణమని చెప్పే పురాణాలు – ఆకలికి శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చెప్పలేదు.ఆధునిక సాహిత్యంలో ఆకలి ప్రస్తావనకు కరవు లేదు. స్వాతంత్య్రోద్యమం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని ఎలుగెత్తిన గరిమెళ్ల – ఆ పాటలోనే ‘పన్నెండు దేశాలు పండుతున్నాగాని/ పట్టెడన్నమె లోపమండీ/ ఉప్పు పట్టుకుంటే దోషమండీ/ నోట మట్టి కొట్టుకుపోతామండీ/ అయ్యో కుక్కలతో పోరాడి కూడు తింటామండీ’ అంటారు. స్వాతంత్య్రం రాక ముందు మన దేశంలోని ఆకలి బాధలు అలా ఉండేవి. ప్రపంచమంతా ఆర్థికమాంద్యంతో అతలా కుతలమైన హంగ్రీ థర్టీస్ కాలంలో కలాలతో కవాతు చేసిన కవులందరూ ఆకలి కేకలు వినిపించిన వారే! ‘ఆకలి ఆకలి తెరిచిన/ రౌరవ నరకపు వాకిలి/ హృదయపు మెత్తని చోటుల గీరే జంతువు ఆకలి/... ఈ ఆకలి హోరు ముందు/ పిడుగైనా వినిపించదు/ ఆకలి కమ్మిన కళ్లకు/ ప్రపంచమే కనిపించదు’ అన్న బైరాగి ‘ఆకలి’ కవిత పాఠకులను విచలితులను చేస్తుంది. ‘అన్నపూర్ణ గర్భగుడిని/ ఆకలి గంటలు మ్రోగెను/ ఆరని ఆకలి కీలలు/ భైరవ నాట్యము చేసెను/ ఘోర పరాజ యమా ఇది?/ మానవ మారణ హోమం/ తల్లీ! ఆకలి... ఆకలి!’ అంటూ సోమసుందర్ ఆకలి కేకలు వినిపించారు.‘నేను ఆకలితో ఉన్నాను/ నువ్వు చంద్రుడి వద్దకు వెళ్లావు... నేను తిండిలేక నీరసిస్తున్నాను/ నాకు వాగ్దానాలు మేపుతున్నావు’ అంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక పురోగతి ఒకవైపు, ఆకలి బాధలు మరోవైపుగా ఉన్న ఈ లోకంలో పాలకుల తీరును శ్రీశ్రీ ఎత్తిపొడుస్తారు. ఇప్పటికీ లోకం తీరు పెద్దగా మారలేదు. మానవుడు పంపిన ఉపగ్రహాలు అంగారకుడి వద్దకు వెళ్లినా, ఆకలి బాధలు సమసి పోలేదు; ఆకలి చావులు ఆగిపోలేదు.మనిషి ఘన విజయాల చరిత్రలో ఆకలి, అశాంతి– రెండూ మాయని మరకలు. ఈ రెండు మరకలూ పూర్తిగా చెరిగిపోయేంత వరకు మనిషి ఎన్ని విజయాలు సాధించినా, అవేవీ మానవాళికి ఊరటనూ ఇవ్వలేవు; మానవాళిని ఏమాత్రం ఉద్ధరించనూ లేవు. ఆకలికి, అశాంతికి మూలం మను షుల్లోని అసమానతలే! ప్రపంచంలో అసమానతలు తొలగిపోనంత వరకు ఆకలిని రూపుమాపడం, శాంతిని నెలకొల్పడం అసాధ్యం. నిజానికి సంకల్పం ఉంటే, సాధ్యం కానిదంటూ ఏదీ లేదు గాని, అసమానతలను రూపుమాపే సంకల్పమే ఏ దేశంలోనూ పాలకులకు లేదు. అందువల్లనే ఆకలి, అశాంతి మనుషులను తరతరాలుగా పట్టి పీడిస్తున్నాయి. అకాల మరణాలకు కారణమవుతున్నాయి. ఆకలి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ దాదాపు పాతికవేల నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. అంటే, ఏడాదికి సగటున ఏకంగా తొంభై లక్షల మంది ఆకలికి బలైపోతున్నారు. ఆకలితో మరణిస్తున్న వాళ్లలో పసిపిల్లలు కూడా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశుమరణాల్లో దాదాపు యాభై శాతం ఆకలి చావులే! నాణేనికి ఇదొకవైపు అయితే, మరోవైపు వంద కోట్లమందికి ఆకలి తీర్చడానికి తగినంత ఆహారం ప్రతిరోజూ వృథా అవుతోంది. ఈ పరిస్థితిని గమనించే ‘అన్నపు రాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట’ అని కాళోజీ వాపోయారు.ప్రపంచ ఆర్థిక శక్తుల్లో ఐదో స్థానంలో ఉన్న మన దేశం– ఆకలి సూచిలో నూట ఐదో స్థానంలో ఉండటం ఒక కఠోర వాస్తవం. అమృతోత్సవ భారతంలో ఆకలి సమస్య ఒక మానని గాయం! -
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
నా మతం మానవత్వం... ఇదే నా డిక్లరేషన్... తేల్చిచెప్పిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
మరోసారి దాతృత్వం చాటుకున్న వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం కాశీవారి పాకలు గ్రామానికి చెందిన పోలవరపు లోవలక్ష్మికి రూ.లక్ష, వాసంశెట్టి శ్రీలక్ష్మికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు.గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారన్న అక్కసుతో లోవలక్ష్మి, శ్రీలక్ష్మి ఇళ్లను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు.. తిరిగి బాధితులపైనే పోలీసు కేసులు పెట్టించారు. ఇటీవల ఏలేరు వరద పర్యటనలో భాగంగా ముంపు ప్రాంతాలకు వెళ్లిన వైఎస్ జగన్‌ను కలిసిన బాధితులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో చలించిపోయిన వైఎస్ జగన్.. బాధితులకు ఆర్థిక సాయంతో పాటుగా వారి పక్షాన న్యాయ పోరాటం కోసం లీగల్ టీమ్ ఏర్పాటు చేశారు. బాధితులకు పిఠాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా చెక్కులు అందజేశారు.ఇదీ చదవండి: ‘బాబూ.. అమరావతి మాత్రమే సెంటిమెంటా.. స్టీల్ ప్లాంట్ కాదా?’ -
మనిషితనం మాయమైందా?
సమాజం సహించలేని కొన్ని ఘటనలు ఆవేదన కలిగిస్తాయి. ఆగ్రహం రప్పిస్తాయి. చట్టాలెన్ని ఉన్నా ఆగకుండా సాగుతున్న అకృత్యాలపై ఏమీ చేయలేమా అన్న ఆక్రోశం రగిలిస్తాయి. కోల్‌కతా వైద్యశిక్షణార్థి ‘అభయ’ ఘటన నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే, మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లో పసిపిల్లల పాఠశాలలో నాలుగేళ్ళ వయసు చిన్నారులు ఇద్దరిపై పాఠశాల పనివాడి అమానుష కృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన వివరాలు వింటుంటేనే మనసు వికలమవుతుంది. ప్రజా నిరసనల రీత్యా మహారాష్ట్ర సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది సరే, పిల్లలకు బడిలోనే భద్రత లేకపోతే ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు గురించి చర్చిస్తే ఏమి లాభమన్న బొంబాయి హైకోర్ట్ తాజా వ్యాఖ్యలు నిష్ఠురమైనా నిజమే. ఇప్పుడిక ప్రతి స్కూలులో నెలరోజుల్లోగా సీసీ టీవీ కెమెరాలు పెట్టాలి, వారంలో మూడుసార్లైనా ఆ ఫుటేజ్‌ను పరిశీలించాలి లాంటి సర్కారీ ఆదేశాలు షరా మామూలే. కానీ, కోల్‌కతా నుంచి బద్లాపూర్ దాకా అన్నిచోట్లా రాజ్యవ్యవస్థ చేతిలో ప్రజావిశ్వాసం కుప్పకూలడం సమకాలీన భారత విషాదం. పసిపిల్లలపై అకృత్యం జరిగితే, ఆ తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సహకరించడానికి బదులు సదరు ‘ఆదర్శ విద్యాలయం’ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం విషాదం. విద్యాబుద్ధుల కోసం బడికి పిల్లల్ని పంపి, వారు అక్కడ భద్రంగా ఉంటారని భావించే కన్నవారికి ఇది భరించలేని కష్టం. పైగా, ఫిర్యాదు దాఖలుకు వారిని 11 గంటల పైగా వేచి ఉండేలా చేయడం దేనికి సంకేతం? ఇలాంటి ఘటనల్లో పాఠశాల వారినీ బాధ్యుల్ని చేస్తూ, ‘పోక్సో’ చట్టం కింద కేసు కట్టాలి. ఆ కనీస బాధ్యతను సైతం పోలీసులు విస్మరించడం క్షమించరాని దుర్మార్గం. చివరకు బొంబాయి హైకోర్ట్ ఆ లోపాన్ని ఎత్తిచూపాల్సి వచ్చింది. ‘అభయ’ ఘటనలోనూ అచ్చంగా ఇలాంటివే జరిగాయి. ఇలాంటి ఆటవిక చర్యలు ఎక్కడ జరిగినా జెండాలకు అతీతంగా రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఖండించాల్సి ఉండగా, స్వీయ రాజకీయలబ్ధికై ప్రయత్నించడం సిగ్గుచేటు. కోల్‌కతా ఘటనపై రచ్చ చేసే పార్టీ బద్లాపూర్పై నోరు మెదపదు. త్వరలో ఎన్నికలు జరగనున్న మహారాష్ట్రలోని బద్లాపూర్పై హంగామా చేసేవారు కోల్‌కతా ఘటనపై కంటితుడుపుకే పరిమితమవుతారు. రాజ్యాంగబద్ధ హోదాలోని బెంగాల్ గవర్నర్ టీవీ డిబేట్లలో కూర్చొని రాష్ట్ర సర్కార్‌ను దూషిస్తూ ఇంటర్వ్యూలిస్తుంటే ఏమనుకోవాలి? సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలపైనా నిజాయతీ వదిలేసి నీచ రాజకీయాలు చేస్తే దేశం ఏటు పోతుంది?ఉవ్వెత్తున ఎగసిపడ్డ భారీ నిరసనల నేపథ్యంలో కోల్‌కతా అంశంపై సుప్రీమ్ కోర్ట్, బద్లాపూర్ ఘటనపై బొంబాయి హైకోర్ట్ తమకు తాము స్వచ్ఛందంగా విచారణ చేపట్టడమే ఒకింత ఊరట. న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో మినుకు మినుకుమంటున్న ఆశాదీపానికి కోర్టు చొరవ ఒక చిన్న కాపుదల. ఇవాళ దేశంలో రోజూ 90 అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆనక హత్య చేసి, అడ్డు తొల గించడాలూ పెరిగిపోతున్నాయి. నోరు విప్పి చెప్పుకోలేని వారి పట్ల నీచప్రవర్తనలూ పెచ్చరిల్లుతున్నాయి. మన మధ్యే మామూలు వ్యక్తుల్లా తిరుగుతున్న మానవ మృగాలను నిరోధించడం కఠిన సమస్యే. అయితే, మనసుంటే మార్గాలుంటాయి. మహిళలు, పిల్లల కోసం ‘మినీ – పోలీస్ స్టేషన్ల’ను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం లాంటివి సిఫార్సు చేస్తున్నాయి. సుప్రీమ్ కోర్ట్ గురువారం బెంగాల్ సర్కార్‌కు ముక్కచీవాట్లు పెట్టిన నేపథ్యంలో సీఎం మమత సైతం తీవ్రతను అంగీకరించారు. అత్యాచార నేరాలపై అత్యంత కఠిన చట్టాలు చేయాలనీ, ఇలాంటి కేసుల్ని 15 రోజుల్లో పరిష్కరించేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలనీ ప్రధానిని కోరారు. అంతకన్నా ముందు సమాజంగా మనం ఆత్మశోధన చేసుకోవాలి. 2012 నాటి ‘నిర్భయ’ ఘటన తర్వాత కఠినచట్టాలు చేసినా పరిస్థితులు మారలేదంటే లోపం ఎక్కడున్నట్టు? వావివరుసలు లేవు, వయసులో చిన్నాపెద్దా విచక్షణ లేదు, చట్టం పట్ల భయభక్తులు అసలే లేవు. ఇలా ఉచ్చం నీచం మరిచి, చివరకు చిన్నారులపైనా మనుషులు మృగాలుగా మారడానికి దారి తీస్తున్న సాంఘిక, మానసిక పరిస్థితుల్ని లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మన వెనకాలే ఊడలు దిగుతున్న ఈ వికృత ధోరణిని పెంచి పోషిస్తున్న మన వినోద, వినిమయ సంస్కృతులు, వైయక్తిక ప్రవర్తనల్ని సమీక్షించుకోవాల్సి ఉంది. ఈ భూతాన్ని ఆపేదెలా అని సత్వరమే ఆలోచించాల్సి ఉంది. ఇప్పటికీ ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూసే సామాజిక వైఖరి, మగవాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే ఆధిపత్య భావజాలం లాంటి అనేక అంశాల్లో మనం మారాల్సి ఉంది. కోర్టుల చొరవ, ఆదేశాలతో రానున్న రోజుల్లో కోల్‌కతా కేసు, బద్లాపూర్ కేసులు త్వరితగతినే తేలితే తేలవచ్చు. నిందితులకు కఠిన శిక్షలూ ఖాయం కావచ్చు. కానీ, దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ ఒకటి రెండు కేసుల్లోనే కాదు... వెలుగులోకి రాని వందల ఘటనలకు మూలకారణమైన మౌలిక అంశాలపై మనం ఎప్పటికి కళ్ళు తెరుస్తాం? సాక్షాత్తూ శిష్యులపై రేప్‌తో 20 ఏళ్ళ జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు హర్యానాలో ఎన్నికల వేళ పదేపదే పెరోల్ ఇస్తూ పోతుంటాం. గత నాలుగేళ్ళలో 234 రోజులు ఆయన జైలు బయటే ఉన్నారు. మైనర్ బాలిక రేప్ కేసులో జీవిత ఖైదులో ఉన్న మరో బాబా ఆశారామ్ బాపూను ఆయుర్వేద చికిత్సకై తాజాగా బయటకు వదులుతాం. అన్ని వ్యవస్థలనూ నీరుగార్చి, అధికారం సహా అనేక బలహీనతలతో పాలకులు చేసే ఈ పాపాలన్నీ శాపాలు కాక మరేమవుతాయి? జనం మూడోకన్ను తెరవాల్సిన సమయం వచ్చింది. -
అనాధ బాలికకు అండగా నిలిచిన మంత్రి కోమటి రెడ్డి
-
దేవుణ్ణి చూసిన వాడు
‘వానలో కలిసిన చీకటి ఆకాశం నుంచి నల్లటి విషంలా కారుతోంది’ అని మొదలవుతుంది తిలక్ ‘దేవుణ్ణి చూసిన వాడు’ కథ. ఆ రాత్రి వానలో ఉలిక్కిపడి లేచిన గవరయ్యకు పెరటి వసారాలో ఏదో మూలుగు. ఏమిటది? లాంతరు తీసుకుని బయటకి వచ్చాడు. హోరుగాలి... భీకర వర్షం... మూలుగుతూ పడి ఉన్న ప్రాణి. లాంతరు ఎత్తి చూసి దిమ్మెరపోయాడు. భార్య. తనను వదిలిపెట్టి వెళ్లిన భార్య. ‘గవరయ్య భార్య లేచిపోయిందట’ అని ఊరంతా గేలి చేయడానికి కారణమైన స్త్రీ. మోసపోయి, నిండు గర్భంతో, నొప్పులు పడుతూ, మొహం చెల్లక వసారాలో పడి ఉంది. దూరంగా మెరుపు మెరిసింది. చెవులు చిల్లులుపడేలా పిడుగు. కాన్పు జరిగిపోయింది. కేర్‌మని– చేతుల్లోకి తీసుకోగానే సముదాయింపు పొందిన ఆ పసికూన గవరయ్యతో బంధమేసింది. క్షణం ఆలోచించలేదు అతడు. ఆమెను, ఆమె కన్న తనది కాని బిడ్డను లోపలికి తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఊరిపెద్దలు ‘లేచిపోయిందాన్ని ఏలుకుంటావా’ అని వస్తే గవరయ్య ఏం చేశాడు? కత్తి పట్టుకు వచ్చి ‘అడ్డు పడినవాళ్లను అడ్డంగా నరుకుతాను’ అన్నాడు. అతడు మనిషి. దేవుడు. మానవత్వంలో దేవుడిని చూసినవాడు.మధురాంతకం రాజారాం ‘కొండారెడ్డి కూతురు’ అనే కథ రాశారు. ఫ్యాక్షనిస్టు కొండారెడ్డి కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. పారిపోయి బతుకుతోంది. చాన్నాళ్ల తర్వాత ఊరి మనుషులు చూడటానికి వచ్చారు. తన మనుషులు. తన తండ్రి దగ్గర పని చేసే మనుషులు. కొండారెడ్డి కూతురు ఎంతో సంతోషపడింది. మర్యాదలు చేసింది. వారి చేసంచుల్లో చాటుగా ఉన్న ఆయుధాలు చూసి అంతలోనే నిశ్చేష్టురాలైంది. తనను, భర్తను చంపుతారన్నమాట. తండ్రి పంపించాడన్న మాట. కాని ఇంటికి వచ్చిన అతిథులను అవమానించవచ్చా? వారి కోసం ఏమిటేమిటో వండింది. కొసరి కొసరి వడ్డించింది. ఊరి ముచ్చట్లు అడిగి చెప్పించుకుంది. ఆ రాత్రి తనకు ఆఖరు రాత్రి. హాలులో కుర్చీ వేసుకుని భర్త గదికి కాపలా కూర్చుంది. వాళ్లు వస్తారు. తనని చంపుతారు. కొండారెడ్డికి పుట్టినందుకు తాను చస్తుంది. కాని భర్తను చంపడానికి వీల్లేదంటుంది. వాళ్లు వచ్చారు. నీడల్లా నిలబడ్డారు. చంపుతారనుకుంటే కాళ్ల మీద పడ్డారు. ‘అమ్మా మేమెందుకొచ్చామో తెలిసీ అన్నం పెట్టావు. చెడ్డ పనులు చేసే రోజు మీ అమ్మ ముఖం చూడకుండా తప్పుకునేవాళ్లం. చూస్తే చేయలేమని. ఇవాళ నీ ముఖం చూస్తూ నిన్నెలా చంపుతా మమ్మా’... ఏడుస్తూ కాళ్లు కడుగుతున్నారు. ఆమె మనిషే. దేవత కాకపోవచ్చు. కాని మానవీయత ఉన్న మనిషి వదనంలో దైవత్వం ఉంటుంది.‘మనందరం దేవుళ్లమే’ అంటాడు ‘సత్యమే శివం’లో కమలహాసన్. ‘సృష్టీ విలయం రెండూ మన చేతుల్లోనే’ అంటాడు ‘సెపియెన్స్’ పుస్తక రచయిత హరారి. ‘నేటి మనిషి రెండు విషయాల వల్ల మనిషి గుణాన్ని కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. ఒకటి ప్రకృతి విధ్వంసం– రెండు సాంకేతికతను పెంచి తాను మరుగుజ్జుగా మారడం’ అంటాడు హరారి. ప్రకృతికి ఎడంగా జరిగే కొద్ది, పరిసరాల్లో సిమెంటు పెరిగే కొద్ది, నాలుగు గోడల నుంచి నాలుగు గోడలకు అతని దినచర్య మారేకొద్ది సహజమైన మానవ స్పందనలు మొద్దుబారక తప్పదు. పెట్ డాగ్స్ సమక్షంలో అతడు పొందగలుగుతున్నది కొద్దిగా ఓదార్పే. పల్లెలో ప్రకృతిలో ఉన్నప్పుడు గొడ్డూ గోదా, మేకా ఉడుతా, కాకీ పిచుకా అన్నీ అతని స్పందనలను సజీవంగా ఉంచేవి. ‘ఎలా ఉన్నావు?’ నుంచి ‘ఎంత సంపాదిస్తున్నావు?’ను దాటి ‘ఏం కొన్నావు?’కు వచ్చేసరికి అతనిలో మొదలైంది పతనం.‘లాభం’ అనే మాట కనిపించని దారాలతో ఆడించే మాయావి. మనిషిని ఎంత ఓడిస్తే లాభం అంత గెలుస్తుంది. అంతేకాదు ‘మనిషి మీద నమ్మకం పోయింది’ అనే మాటను పుట్టించడం లాభాపేక్ష గల పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రాథమిక అవసరం. మనిషి మీద నమ్మకం పోయేలా... వాణ్ణి అది వస్తుగత, స్వార్థపరమైన, సంపద లాలసలో కూరుకుపోయేలా చేస్తుంది. లాభపడాలంటే, సుఖపడాలంటే చేయవలసింది మానవత్వాన్ని త్యాగం చేయడమే. అది పోగానే వాడు కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో, ప్రకృతితో, మానవాళితో ఎంత దారుణంగా అయినా వ్యవహరించవచ్చు. ‘మనిషి మీద నమ్మకం పోయేలా’ చేస్తే పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో లాభం ఏమిటంటే... ఏ మనిషీ మరో మనిషితో కలవడు. సమూహంగా మారడు. తిరుగుబాటు చేయడు. నలుగురు బాగుపడి కోట్ల మంది మలమలమాడే వ్యవస్థకు ఢోకా రానివ్వడు. అందుకే పెట్టుబడిదారీ వ్యవస్థ ‘యుద్ధం’ అనే ముద్దుబిడ్డను పదేపదే కంటూ ఉంటుంది. యుద్ధం మానవత్వానికి అతి పెద్ద విరుగుడు. అయితే మనిషి ఇలాగే ఉంటాడా? ఏ రచయితో అన్నట్టు ‘రగిలిస్తే రాజుకునే మహాఅగ్ని మానవత్వం’. కోల్‌కతా నిరసనల్లో ఇవాళ అదే చూస్తున్నాం. యుగాలుగా... చితి పెట్టిన ప్రతిసారీ బూడిద నుంచి మానవత్వం తిరిగి జనిస్తూనే ఉంది. కాకుంటే అందుకు కావల్సిన రెక్కలు సాహిత్యమే ఇస్తుందని గ్రహించాలి. తల్లిదండ్రులూ..! మీ పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు తప్పకుండా చేయండి. కాని నాలుగు మంచి పుస్తకాలు చదివించి మొదట మనిషిని చేయండి. ఏ విటమిన్ లేమికి ఏం తినాలి సరే... మానవత్వ లేమి ఉందేమో కనిపెట్టి విరుగుడుగా ఒక పుస్తకం చేతిలో పెట్టండి. ఎక్కడ పుస్తకాలు ఉంటాయో అక్కడ మానవత్వపు ఆవరణం ఏర్పడుతుంది. అదే దేవుడు తిరుగాడే తావు. ప్రపంచ మానవత్వ దినోత్సవ శుభాకాంక్షలు. -
వైఎస్ జగన్ మానవత్వం
-
మిగిలేది... మానవత్వ పరిమళమే!
సమాజం భ్రష్టు పట్టిపోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. నిజమే! కాని, మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రవర్తిస్తున్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.న్యూజిలాండ్ లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. రొయ్యల, చేపలూ లాగా అక్కడ ఫుడ్ మార్కెట్లో తాబేళ్ళను కూడా అమ్ముతారు. మనం చెప్పుకుంటున్న దయార్ద్ర హృదయుడు తాబేలు మాంసం కోసం రాడు. తాబేళ్ళను రక్షించడానికి వస్తుంటాడు. బేరమాడి మార్కెట్లో బతికి ఉన్న తాబేళ్ళన్నింటినీ కొంటాడు. వాటిని ట్రక్కులో వేసుకుని పోయి సముద్రంలోకి వదులుతాడు. అక్కడ తాబేళ్లు అంతరించి పోయే దశలో ఉన్నాయి. అందుకే ఈ పని! ఏదో విధంగా తమ పని గడిస్తే చాలుననుకుంటూ కాలుష్యాలు పెంచుతున్న మనుషుల మధ్య ఎంతో బాధ్యతతో ‘మనిషి’లా ప్రవర్తించే వారున్నారు. ‘ప్రపంచమేమీ గొడ్డుపోలేదు’ అని అన్నది అందుకే! పాపువా న్యూ గినియా – మార్కెట్ల దగ్గరా ఇలాంటి జీవ పరిరక్షకులు ఉన్నారు. ఇటీవల రాజస్థాన్ జైపూర్‌లో మానవత్వం మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ల హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయి, ఇద్దరు పిల్లలతో ఒక బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఆమె బట్టల కొట్టు ఉన్న ఆ వీధిలో ముస్లింలే ఎక్కువ మంది ఉన్నారు. ఒకరోజు హిందూ వర్గానికి చెందిన గుంపు – శోభాయాత్ర ఊరేగింపు తీస్తూ అల్లర్లు సృష్టించింది. అందులో భాగంగా అక్కడ ఉన్న 13 మంది ముస్లింలపై దాడిచేయడానికి వారి వెంట పడ్డారు. ఇదంతా గమనించిన మధూలిక ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చిన ముస్లింలను తన కొట్టులోకి పంపి వెంటనే షట్టర్ వేసేసింది. తర్వాత హిందూ దుండగుల్ని ధైర్యంగా ఎదుర్కొని, చాకచక్యంగా వారిని వెనక్కి పంపించింది. ‘మానవత్వం అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు ఆశ్రయమిచ్చాన’ని– ఆ తర్వాత ఆమె పత్రికల వారికి చెప్పింది. ఒక సామాన్య మహిళ ఆచరణాత్మకంగా, ఎంతో గొప్ప సందేశం ఇచ్చింది. హైదరాబాదు పాత బస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలా మంది ముస్లింలే. 2022, ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్ళికి మిత్రులందరినీ ఆహ్వానించాడు. అవి రంజాన్ రోజులు గనుక ‘రోజా’ పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం నమాజ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. వారంతా మరునాడు ఉపవాసం పాటించేందుకు ‘సహౌరీ’ ఏర్పాటు చేశాడు. స్వార్థప్రయోజనాల కోసం విద్వేషాలు నూరిపోసే వారి వలలో పడకూడదనీ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవడం అందరి బాధ్యత అనీ పాతబస్తీ అంజయ్య ఎప్పుడూ చెబుతుంటాడు. ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లాగారు తమ మసీదులో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21న మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజు చదివారు. ఇఫ్తార్ విందుకోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే, అక్కడ చర్చి ఫాదర్ ఆ విందు అహ్వానాన్ని అంగీకరించడమే కాకుండా, ఆ ఇఫ్తార్ విందు తమ చర్చిలోనే నిర్వహించాలని సూచించాడు. ఆ రకంగా తొలిసారి ఇస్తార్ విందు చర్చిలో, ఫాదర్ పర్యవేక్షణలో జరిగింది. పరమత సహనం, సహకారం అంటే ఇదే కదా! అసలైన భారతదేశపు ‘ఆత్మ’ అక్కడ తొణికిసలాడింది. ఆత్మ అంటే... ఆత్మ – పరమాత్మలు కావు. అంతరంగంలోని ఒక సమర్పణ భావం! ఆలోచనల ఐక్యత!! గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం. మనిషి మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించడం. ఇక్కడ చెప్పుకున్న సంఘటనలన్నింటికీ ఒక అంతస్సూత్రం ఉంది. ‘దేవుడు లేడు – మతం అనేది వ్యక్తిగతం – మన చివరి గమ్యం – మానవవాదం’ అనేది సాధించడానికి... ఇలా మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయేమో!క్రమంగా తరతమ భేదాలు మరిచి, మనుషులంతా ఒక్కటే అనే విషయం జీర్ణించుకునేందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో? మనిషికి మనిషే ముఖ్యం – దేవుళ్ళు కాదు, అనే భావనలోకి సమాజం ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా ‘మన మార్గం సుదీర్ఘమైంది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. ఇరవై ఒకటవ శతాబ్దపు స్త్రీ – పురుషుల్ని అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజు వారీగా కృషి చేస్తూనే ఉండాలి’ అన్న చే గువేరా మాటలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నిజమే– బూజు పట్టిన భావజాలాన్ని వదిలి, కొంచెం కొంచెంగా పైపైకి ఎదుగుతూనే ఉండాలి. పైకి ఎదిగితేనే (ఎగిరితేనే) అద్భుతమైన మానవత్వ దృశ్యాలు కనబడతాయి. నువ్వు బతికి ఉన్నావంటే...నీ జీవితపు విజయోత్సవాన్ని పంచుకోస్వర్గమనేది ఎక్కడైనా ఉంటే...దాన్ని భూమి మీదికి దించుకో–అని ఎలుగెత్తి చెబుతూ ముందుకు సాగాల్సి ఉంది.డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి -
Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
న్యూఢిల్లీ: మానవాళికి శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్, ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) నిర్వహించిన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్(జీబీడీ)–2021 అధ్యయనం వివరాలను లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా సగటు జీవితకాలం ఐదేళ్ల దాకా పెరుగుతుంది. కానీ అదే సమయంలో వ్యాధుల ముప్పు కూడా బాగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటివి ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా స్థూలకాయం, అధిక రక్తపోటు వంటివి బాగా వేధిస్తాయి’’ అని అధ్యయనం హెచ్చరించింది. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ ముప్పును వీలైనంతగా తగ్గించుకోవచ్చని అధ్యయనం సూచించింది. అధ్యయనం ఇంకా ఏం తేలి్చందంటే... → సగటు జీవితకాలం పురుషుల్లో ఐదేళ్లు, మహిళల్లో నాలుగేళ్లు పెరుగుతుంది. స్త్రీలలో 71.1 నుంచి 76 ఏళ్లకు, పురుషుల్లో 76.2 నుంచి 80.5 ఏళ్లకు పెరుగుతుంది. → పూర్తి ఆరోగ్యవంతమైన జీవితకాలం ప్రపంచవ్యాప్తంగా సగటున 2.6 ఏళ్లు పెరుగుతుంది. ఇది 2022లో 64.8 ఏళ్లుండగా 2050 నాటికి 67.4 ఏళ్లకు చేరుతుంది. → భారత్‌లో 2050 నాటికి పురుషుల సగటు జీవిత కాలం 75 ఏళ్లకు కాస్త పైకి, మహిళల్లో 80 ఏళ్లకు చేరుకుంటుంది. → మన భారతదేశంలో ఆరోగ్యవంతమైన జీవితకాలం స్త్రీ పురుషులిద్దరిలోనూ సమానంగానే ఉంటుంది. 2050 నాటికి 65 ఏళ్లు దాటేదాకా ఆరోగ్యంగా జీవిస్తారు. → జీబీడీ–2021 అధ్యయనం కోసం ప్రపంచవ్యాప్తంగా 11,000 సంస్థల సహకారం తీసుకున్నారు. 204 దేశాల నుంచి 371 రకాల వ్యాధులకు సంబంధించిన అంచనాలు, 88 రిస్క్ ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకున్నారు. → ప్రపంచవ్యాప్తంగా వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపై జనంలో అవాగాహన పెరుగుతుండడం సగటు జీవితకాలం పెరుగుదలకు దోహదపడుతోంది. → జీవితకాలం పెరుగుదల విషయంలో ప్రపంచ దేశాల మధ్య అసమానతలు చాలావరకు తగ్గుతున్నట్లు గుర్తించామని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్ ముర్రే చెప్పారు. → సగటు జీవనకాలం ప్రస్తుతం తక్కువగా ఉన్న దేశాల్లో 2050 నాటికి బాగా పెరగనుందన్నారు. హృద్రోగాలు, కరోనాతో పాటు తీవ్రమైన అంటు రోగాలతో పాటు పౌష్టికాహార లోపం తదితరాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుండటమే అందుకు కారణమని ముర్రే చెప్పారు. → భావి తరాలు స్థూలకాలం, అధిక రక్తపోటుతో బాగా బాధపడే ఆస్కారముందని అభిప్రాయపడ్డారు. -
లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే... అయ్యో అనడం మనిషి సహజ లక్షణం. సహానుభూతి అంటారు ఈ ఫీలింగ్‌ను. ఇంకొంతమంది ఆయ్యో అనడంతో ఆగిపోరు. తమకు చేతనైన సాయం చివరకు మాటసాయమైనా చేసే ప్రయత్నం చేస్తారు. ‘‘నేను ఉన్నాను’’.. ‘‘నువ్వు ఒంటరి కాదు’’ అన్న భరోసా... నిలువెత్తు డబ్బు, బంగారం పోసి కూడా కొనలేము. ఇదంతా ఇప్పుడెందుకు అంటే... ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) కనిపించిన ఈ ట్వీట్‌ను చూడండి. మనసులను కదిలించే చిన్ని గాథ! జర్మనీలోని ఆరేళ్ల బాలుడి కథ ఇది! మోటర్సైకిళ్లంటే మహా పిచ్చి! పెద్దయ్యాక రేసుల్లో పాల్గొనే వాడేనేమో కానీ... కేన్సర్ మహహ్మారి అంత ఎదిగేందుకు అవకాశం ఇచ్చేలా లేదు. అందుకే... ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఆన్లైన్లో పోస్ట్ పెట్టారు! ‘‘మా వాడికి బైక్‌లంటే బాగా ఇష్టం. వీలున్న వారు ఎవరైనా మోటర్‌సైకిల్‌పై మా ఇంటి ముందు నుంచి ప్రయాణించగలరా?. మా వాడి కళ్లల్లో ఆనందం ఇంకోసారి చూసుకోగలం’’ అని అభ్యర్థించారు. అందరివీ బిజి బిజీ బతుకులు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ... 20, 30 మంది వరకూ వస్తారనునన వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఓ సముద్ర కెరటంలా ‘మనీషి’ కదిలాడు. వేయి.. రెండు వేలు కూడా కాదు.. ఎకాఎకిన ఇరవై వేల మంది మోటర్ సైకిళ్లపై ఆ కుర్రాడి ఇంటి ముందు నుంచి వెళ్లారు. వాళ్లలో పొరుగు దేశాల నుంచి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ కుర్రాడి ముఖం చంద్రబింబంలా మెరిసి పోయి ఉంటుందా? కచ్చితంగా మెరిసిపోయే ఉంటుంది. వీడియో మూడు నాలుగేళ్ల కిందటిదే అయినా.. ఆ చిన్నారి తుదిశ్వాస విడిచి నెలలు గడుస్తున్నా.. మానవత్వం ఈ భూమ్మీద మిగిలే ఉందని, లోకం మనం అనుకునేంత చెడ్డదేం కాదని నిరూపించింది ఈ ఘటన. In Germany, a 6 year old boy who loved Motorcycles was diagnosed with cancer. His family posted online asking if someone can ride pass their house to cheer him up. They expected 20-30 people. But in the end, nearly20,000 bikers showed up. pic.twitter.com/ZX2Gqpw74m— Restoring Your Faith in Humanity (@HumanityChad) April 30, 2024 -
CM Jagan: ఏ కష్టం వచ్చినా.. క్షణం కూడా ఆలోచించకుండా సాయం (ఫొటోలు)
-
గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్...బాలుడికి అరుదైన వైద్యం
-
సీఎం జగన్ బాధితులకు ఆర్థిక సహాయం
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
-
సీఎం జగన్ మంచి మనసు..పెన్షన్ 3 వేలు కాదు, 5 వేలు !
-
WELCOME 2024: కొత్త సంవత్సరమా మనిషిని మేల్కొలుపు
రోడ్డున ప్రమాదం చూస్తే సాయానికి పరిగెత్తి వెళ్లే మనిషిని, చుట్టూ చెడు జరిగితే మనకెందుకులే అనుకోని మనిషిని, ఇరుగింట్లో ఆర్తనాదాలకు చలించే మనిషిని, పొరుగింట్లో కష్టానికి హాజరయ్యే మనిషిని, ద్వేషమే జీవితంగా బతకని మనిషిని, ఒకరు బాగుపడితే సంతోషపడే మనిషిని, అడుగంటిపోయిన మానవత్వాన్ని జాగృతం చేసుకునే మనిషిని, మనిషి మీద నమ్మకం నిలిపే మనిషిని, ఓ కొత్త సంవత్సరమా మేల్కొలుపు. వద్దు. నమ్మాల్సిన చోట నేరం చేసే మనిషి వద్దు. భర్తగా ఉంటూ, భార్యగా ఉంటూ, స్నేహితుడిగా ఉంటూ, అత్త మామగా ఉంటూ, బంధువుగా ఉంటూ... వీరిని నమ్మొచ్చు, వీరిని కాకపోతే ఎవరిని నమ్ముతాం... అనుకున్న సందర్భంలో కూడా నేరం చేసి, ప్రాణం తీసి మనిషి మీద నమ్మకమే పోగొట్టిన– 2023లో చాలాసార్లు కనపడిన మనుషి– కొత్త సంవత్సరంలో వద్దు. ‘అయ్యో... నా గోడు ఎవరూ వినట్లేదే’ అని కన్నపిల్లలతో పాటు నిస్సహాయంగా వెళ్లి చెరువులో దూకే కన్నతల్లి వద్దు. ‘నా బాధ అమ్మానాన్నలు వినట్లేదే’నని హాస్టల్ ఫ్యాన్లకు వేళ్లాడే ముక్కుపచ్చలారని పిల్లలూ వద్దు. నలుగురు సంతానం ఉన్నా, మీ దగ్గర ఉంచుకుని నాలుగు మెతుకులు పెట్టండి చాలు అంటున్నా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను పడేసి వారిని బాధించే స్వార్థసంతానం వద్దు. సాకులు చెప్పే సంతానం వద్దు. ముఖ్యంగా– తల్లిదండ్రుల శాపం అందుకునే సంతానం వద్దు. జీవితమంటే అనుక్షణం డబ్బు సంపాదనే అనుకునే, ఎంత ఉన్నా సరిపోదనుకునే మనిషి వద్దు. అందుకు ఉద్యోగ బాధ్యతలను కలుషితం చేసే, ప్రజల భవిష్యత్తును బలి పెట్టే మనిషి వద్దు. కల్తీ చేసే మనిషి, విషం లాంటి ఆహారం అమ్మే, కూరనారలను రసాయనం చేసే మనిషి వద్దు. వ్యసనపరులుగా మార్చే ఉత్పత్తులను తయారు చేసే మనిషి వద్దు. అందుకు అనుమతించే ప్రభుత్వ నేతలూ వద్దు. వైద్యం తెలియని వైద్యుడు వద్దు. దైవభీతి పాపభీతి లేని వైద్యుడు వద్దు. రోగి మీద దయ, సానుభూతి లేని వైద్యుడు వద్దు. రోగుల అశ్రువులను అంతస్తులుగా చేసి ఆస్పత్రులు నిర్మించాలనుకునే వైద్యుడు వద్దు. చదువుల పేరుతో తల్లిదండ్రుల కడుపులో గంజిని కూడా తాగే విద్యావ్యవస్థల యజమాని కూడా వద్దు. మూర్ఖుడు వద్దు. మూకస్వభావము ఉన్నవాడూ వద్దు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి సాటి మనిషిని ద్వేషించే వాడు వద్దు. బతకగోరని వాడు వద్దు. బతకనివ్వనివాడు వద్దు. అమాయకుల నుంచి లాక్కుని నింగినీ, నేలనూ మింగేసేవాడు వద్దు. ఉద్యోగుల గోడు వినని యజమాని వద్దు. పిలిస్తే పలకని పోలీసు వాడు వద్దు. న్యాయం వైపు నిలవని తీర్పు కూడా వద్దు. 2024 సంవత్సరమా... ఎన్నో ఆశలను కల్పిస్తూ అడుగిడుతున్న నూతన వత్సరమా... ఎంత జరిగినా ఏమి జరిగినా ‘మానవుడే మహనీయుడు’ అని నిరూపించే నిదర్శనాలను ఈ సంవత్సరం చూపు. మనిషిని మేల్కొలుపు. మనిషి తప్ప మరెవరూ ఈ జగతిని శాంతితో, కాంతితో నింపలేరు. కుడికాలు ముందు పెట్టి రా తల్లీ! -
సీఎం జగన్ హామీ.. గంటలో పరిష్కారం
-
నేనున్నానంటూ ఓ పేద కుటుంబానికి సీఎం జగన్ భరోసా
-
మనసున్న మారాజు సీఎం వైఎస్ జగన్
-
మరోసారి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన నిరుపేద విద్యార్థిని వాచ్చల్య శ్రీ ఉన్నత చదువు చదుకోవాలనే కోరికను ఎమ్మెల్యే తీర్చారు. రష్యాలో ఎంబీబీఎస్ సీటు వాచ్చల్య శ్రీ సాధించగా, రష్యాలో ఆమె చదువుకయ్యే సుమారు రూ.50 లక్షల ఖర్చును ఎమ్మెల్యే భరించి చదివించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ, కుటుంబంలో ఒక్కరు చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందన్నారు. ఇదీ చదవండి: కుమార్తెకు ఆదర్శ వివాహం చేసిన ఎమ్మెల్యే రాచమల్లు -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
అన్నమయ్య జిల్లా పర్యటనలో మంచి మనసును చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
మహావినాశనం ముందుంది? ఖచ్చితమైన అంచనాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు!
‘యుగాంతం’.. ‘మహావినాశనం’ వీటికి సంబంధించిన చర్చలు ప్రపంచంలో కొత్తేమీకాదు. ఈ ఆసక్తికర అంశాలపై పలు సినిమాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మానవాళి అంతం గురించి అంచనా వేయడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు అత్యాధునిక సూపర్ కంప్యూటర్ను ఉపయోగించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మానవాళి భవిష్యత్ గురించి కంప్యూటర్ రూపొందించిన నివేదికలను అధ్యయనం చేశారు. భూమిమీద మానవజాతి ఎప్పుడు అంతరించిపోతుందో తెలుసుకున్నారు. దీని ప్రకారం యుగాంతం మనకు అత్యంత సమీపంలోనే లేకపోయినప్పటికీ, 250 మిలియన్ సంవత్సరాల (ఒక మిలియన్ అంటే పది లక్షలు) దూరంలో ఉన్నట్లు తేలింది. అధ్యయనంలో పాల్గొన్న బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండర్ ఫార్న్స్వర్త్ మాట్లాడుతూ భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా మానవాళి మనుగడ దుర్భరంగా మారుతుందని అన్నారు. ఈ విధంగా మరణాలు విపరీతంగా సంభవిస్తాయని తెలిపారు. భవిష్యత్‌లో సూర్యుని నుంచి ఇప్పుడున్న దానికన్నా సుమారు 2.5 శాతం అధిక రేడియేషన్ విడుదల కానుంది. ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు ఇప్పటి కంటే రెండు రెట్లు అధికం కాగలవని ఆయన హెచ్చరించారు. ఈ నేపధ్యంలో అగ్ని పర్వత విస్ఫోటనాలతో ఏర్పడే సూపర్ ఖండం తేమతో కూడిన ఉష్ణమండల ప్రాంతాలను ఆక్రమిస్తుంది. ఫలితంగా భూభాగంలోని అధిక ప్రాంతాల్లో 40 నుండి 70 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. ఈ నూతన సూపర్ ఖండం మానవాళికి మూడు రెట్ల ముప్పును కలిగిస్తుంది. మానవులు, జంతువులు, క్షీరదాలకు అననుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పెరిగే రోజువారీ ఉష్ణోగ్రత తీవ్రతలు, అధిక తేమ స్థాయిలు కలసి మానవుల మనుగడకు అంతం పలకుతాయని ఫార్న్స్వర్త్ హెచ్చరించారు. అయితే ఈ విపత్తును నివారించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని నిలిపివేయడం ఒక్కటే మార్గమని ఆయన తెలిపారు. లీడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బెంజమిన్ మిల్స్ మాట్లాడుతూ శిలాజ ఇంధన వినియోగంలో పెరుగుదల భూమిపై మానవాళి అంతాన్ని వేగవంతం చేస్తుందని, ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే ఊహించిన దానికంటే ముందుగానే మానవాళి అంతానికి చేరుకోవచ్చని అన్నారు. భవిష్యత్‌లో భూమిపై నివాసయోగ్యంకాని సూపర్ ఖండం ఏర్పడినప్పుడు సంభవించే పరిణామాలు ఎలావుంటాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సూపర్ కంప్యూటర్లను వినియోగించి అధునాతన వాతావరణ నమూనాలను తెలుసుకునేందుకు పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: రష్యా అధికారిక కార్యక్రమాల్లో పుతిన్ డూప్? క్రెమ్లిన్ ఏమంటోంది?