కష్టాలు అడ్డంకులను అధిగమించేలా చేస్తాయి
కష్టాలు జీవితం పట్ల అవగాహన పెంచుతాయి
కష్టాలు ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్పుతాయి
యాభై ఏళ్ల రజితారాజ్‌ను కలిస్తే సమస్యలను అధిగమించే నేర్పుతో పాటు, ఇతరులకు సాయపడే గుణాలను ఎలా అలవరచుకోవచ్చో తెలుస్తోంది.
సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న యాభై ఏళ్ల రజితారాజ్ స్వయంగా టైలరింగ్ నేర్చుకుని, దానినే ఉపాధిగా మలుచుకుని, కుటుంబం నిలదొక్కుకునేలా చేసింది. సమస్యలతో పోరాటం చేస్తున్న మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. రోజూ కాస్త తీరిక చేసుకొని వందకు పైగా మాస్కులు కుట్టి, తన బొటిక్‌లోని టేబుల్ మీద ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకెళ్లచ్చు. బస్తీ వాసులకు, పేదలకు అలా ఉచితంగా మాస్కులు పంచుతూ కరోనా కట్టడికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్న రజితారాజ్ తన స్వయంకృషి ని ఇలా మన ముందుంచారు.
స్వీయ శిక్షణ
‘‘మాది వరంగల్. ఇంటర్‌ఫస్టియర్‌లో ఉండగానే పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణకు ఏదైనా పనిచేయక తప్పనిస్థితి ఎదురైంది. ఏ పని చేయాలో ముందు దిక్కుతోచలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తుంటే చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. వారపత్రికల్లో వచ్చే డ్రెస్ డిజైన్స్ చూసి, ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏం పని చేయగలనా అని ఆలోచించినప్పుడు మా నాన్నను అడిగితే కుట్టుమిషన్ కొనిచ్చారు. చుట్టుపక్కల వాళ్లకు బ్లౌజులు కుట్టేదాన్ని. అక్కణ్ణుంచి నోటి మాట ద్వారా ‘రజిత బాగా డ్రెస్ డిజైన్ చేస్తుంది’ అనే పేరొచ్చింది. ఇంటి నుంచే చుట్టుపక్కల లేడీస్‌కి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆన్‌లైన్ లో నా డ్రెస్ డిజైన్స్ పెట్టాను. అక్కణ్ణుంచి ఆర్డర్స్ పెరిగాయి.
ఏడుగురు మహిళలే..
మా కుటుంబసభ్యుల పేర్లలో మొదటి అక్షరం తీసుకొని, వాటిని కలిపి ‘చర్ప్స్’ అని బొటిక్ పెట్టాను. నేను పని నేర్పించిన వారినే ఎంప్లాయీస్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు పద్నాలుగు మంది పనివారున్నారు. అందులో ఏడుగురు మహిళలే. ముప్పై ఏళ్లు పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. జీవితాల్లో స్థిరపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంత మేలు చేసిందో పిల్లలు చెబుతుంటే సంతోషం గా అనిపిస్తుంటుంది. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆడవారే త్వరగా మేలుకుంటారు. వచ్చిన ఏ చిన్న పని చేసైనా పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలనుకుంటారు. నాకు కొద్దిగా వచ్చిన టైలరింగ్‌నే ఉపాధిగా మార్చుకున్నాను. ఇప్పుడు కొందరికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న విద్యార్థులూ నా వద్ద వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. టైలరింగ్ పర్‌ఫెక్ట్‌గా వచ్చేంతవరకు నేర్పిస్తాను. అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది స్కూల్‌గా రిజిస్టర్ కాలేదు. సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్‌కి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను.
ఉచితంగా మాస్కులు..
ఇదో పెద్ద సాయం అనుకోను. వచ్చిన పనే నలుగురికి ఉపయోగపడితే చాలనుకుంటాను. కరోనా మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు ఇచ్చి చేతనైన సాయం చేస్తున్నాను. మాస్కుల తయారీకి కాటన్ పన్నాలు కొనుక్కొచ్చి, మూడు పొరల మాస్కులు తయారు చేసి టేబుల్ మీద పెడుతుంటాను. ఎవరికి అవసరమున్నా అడిగి తీసుకెళుతుంటారు. అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా మాస్కులు ఇచ్చి వస్తుంటాను. ఇప్పుడు వేడుకల సందర్భాల్లో మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ మాస్కులు వాడుతున్నారు. వాటి ఆర్డర్లతో పాటు ఈ ఉచిత మాస్కుల తయారీ కూడా ఉంటుంది’ అని వివరించారు రజితారాజ్.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment