ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు
స్వార్థం, విస్తరణవాదాన్ని భారత్ నమ్ముకోలేదని వెల్లడి
గయానా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రసంగం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు.
విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్‌లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం.
మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి.
మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి.
భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment