boutique
-
అల్కరాజ్ అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుక్రవారం పెను సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో 2022 చాంపియన్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన కార్లోస్ అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న అల్కరాజ్ను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రపంచ 74వ ర్యాంకర్ బోటిక్ వాన్ డె జాండ్‌షుల్ప్ వరుస సెట్లలో ఓడించి తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం సాధించాడు. 2 గంటల 19 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోటిక్ 6–1, 7–5, 6–4తో మూడో సీడ్ అల్కరాజ్ను ఓడించి మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ రెండో రౌండ్లోనే ఓడిపోవడం ఇదే ప్రథమం. 2021లో క్వార్టర్ ఫైనల్ చేరిన అతను, 2022లో ఏకంగా విజేతగా అవతరించాడు. 2023లో అల్కరాజ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు. అల్కరాజ్తో మ్యాచ్‌లో బోటిక్ ప్రత్యర్థి సరీ్వస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 22 విన్నర్స్ కొట్టిన బోటిక్ 21 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు అల్కరాజ్ 27 అనవసర తప్పిదాలు చేశాడు. ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), పదో సీడ్ డిమినార్ (ఆస్ట్రేలియా) మూడో రౌండ్లోకి ప్రవేశించగా... 16వ సీడ్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా) రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. -
Golriz Ghahraman: దొంగతనం ఉదంతంలో న్యూజిలాండ్ మహిళా ఎంపీ రాజీనామా
వెల్లింగ్టన్: దుకాణాల్లో వస్తువులు దొంగలించిందన్న ఆరోపణలపై న్యూజిలాండ్ మహిళా ఎంపీ గోలిజ్ గ్రాహమన్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆక్లాండ్, వెల్లింగ్టన్ నగరాల్లోని బొటిక్, షాపింగ్‌మాల్‌లో మూడు సార్లు దొంగతనానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. షాపింగ్‌మాల్‌లో అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్, డ్రెస్‌ను ఆమె దొంగలిస్తున్న సీసీటీవీ ఫుటేజీలు బహిర్గతం కావడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు దర్యాప్తు కొనసాగుతుండటంతో గోలిజ్ తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన చర్యకు బేషరతు క్షమాపణలు చెప్పారు. గతంలో ఆమె మానవహక్కుల కేసులు వాదించే లాయర్‌గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి గ్రీన్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఇరాన్ నుంచి వలసవచ్చి 2017 సంవత్సరంలో న్యూజిలాండ్‌లో ఎంపీ అయిన తొలి వలస వ్యక్తిగా రికార్డులకెక్కారు. -
లాభసాటి బిజినెస్, మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్
జగిత్యాలటౌన్: మహిళల మోడ్రన్ డ్రెస్సింగ్‌కు కేరాఫ్‌గా బొటిక్‌లు నిలుస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ట్రెండుతో పాటు మహిళల ఆసక్తి, అభిరుచికి తగిన విధంగా అనేక రంగులు, డిజైన్లు, మెటీరియల్ ఒకేచోట లభిస్తుండటంతో బొటిక్‌లకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక షాపులో మెటీరియల్ కొనుగోలు చేసి దానికి లైనింగ్ మరోచోట, స్టిచింగ్ ఇంకో చోట ఇలా పలు దుకాణాలు తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణతో బిజీగా మారిన మహిళలకు వన్‌స్టెప్ సర్వీస్ అందజేస్తున్న బొటిక్‌లు వరంగా మారాయి. మెటీరియల్, లైనింగ్, డిజైనింగ్‌తో పాటు స్టిచింగ్ కూడా ఒకేచోట లభిస్తుండటంతో మహిళలు బొటిక్‌లకు క్యూ కడుతున్నారు. పండగలు, ఫంక్షన్లు, పార్టీలు, సందర్భం ఏదైనా బొటిక్కు వెళ్లి అకేషన్ డీటేల్స్ చెప్తే చాలు మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి కంప్యూటర్ డిజైనింగ్ మగ్గం వర్క్ ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా రెడీ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడం బొటిక్‌ల ప్రత్యేకత. అభిరుచికి అనుగుణంగా.. గతంలో కస్టమర్లు మ్యాచింగ్ బ్లౌజులు మాత్రమే అడిగేవారు. ప్రస్తుతం మారుతున్న మహిళల ఆలోచన, అభిరుచికి అనుగుణంగా మగ్గం వర్క్, బోట్‌నెక్, కంప్యూటర్ బ్లౌజులకు గిరాకీ పెరిగింది. అకేషన్ డీటేల్స్ చెప్తే ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేయడమే కాకుండా కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ సెలెక్షన్, డిజైన్, మగ్గం వర్క్‌తో ట్రెండీ బ్లౌజెస్ రెడీ చేసి ఇస్తాం. అందుబాటు ధరల్లో అనుకున్న డిజైన్లు అనుకున్న సమయానికి డెలివరీ ఇస్తున్నాం. బొటిక్ నిర్వహణతో స్వయం ఉపాధితో పాటు పదిమందికి పని కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – ప్రణీత, బొటిక్ నిర్వాహకురాలు మహిళల అభిరుచిని బట్టి బోట్‌నెక్, మగ్గం వర్క్, కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజెస్ అందుబా టులో ఉన్నాయి. మగ్గం వర్క్ బ్లౌజెస్ ధరలు రూ.1400 నుంచి రూ.10వేల వరకు ఉండగా, బోట్‌నెక్ బ్లౌజులకు రూ.400 నుంచి రూ. వెయ్యి చార్జ్ చేస్తున్నారు. కంప్యూటర్ డిజైన్డ్ బ్లౌజులకు రూ.500 నుంచి రూ.3వేల వరకు మెటీరియల్ డిజైన్ బట్టి ధర నిర్ణయిస్తారు. -
మూడు పొరల మాస్కులు ఉచితంగా ఇస్తున్నా
కష్టాలు అడ్డంకులను అధిగమించేలా చేస్తాయి కష్టాలు జీవితం పట్ల అవగాహన పెంచుతాయి కష్టాలు ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్పుతాయి యాభై ఏళ్ల రజితారాజ్ను కలిస్తే సమస్యలను అధిగమించే నేర్పుతో పాటు, ఇతరులకు సాయపడే గుణాలను ఎలా అలవరచుకోవచ్చో తెలుస్తోంది. సికింద్రాబాద్ మల్కాజిగిరిలో ఉంటున్న యాభై ఏళ్ల రజితారాజ్ స్వయంగా టైలరింగ్ నేర్చుకుని, దానినే ఉపాధిగా మలుచుకుని, కుటుంబం నిలదొక్కుకునేలా చేసింది. సమస్యలతో పోరాటం చేస్తున్న మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కల్పిస్తోంది. రోజూ కాస్త తీరిక చేసుకొని వందకు పైగా మాస్కులు కుట్టి, తన బొటిక్‌లోని టేబుల్ మీద ఉంచుతుంది. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకెళ్లచ్చు. బస్తీ వాసులకు, పేదలకు అలా ఉచితంగా మాస్కులు పంచుతూ కరోనా కట్టడికి తనవంతు బాధ్యతగా కృషి చేస్తున్న రజితారాజ్ తన స్వయంకృషి ని ఇలా మన ముందుంచారు. స్వీయ శిక్షణ ‘‘మాది వరంగల్. ఇంటర్ఫస్టియర్లో ఉండగానే పెళ్లయ్యింది. ఇరవై ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలు పుట్టారు. కుటుంబ పోషణకు ఏదైనా పనిచేయక తప్పనిస్థితి ఎదురైంది. ఏ పని చేయాలో ముందు దిక్కుతోచలేదు. చిన్నప్పటి నుంచి అమ్మ టైలరింగ్ చేస్తుంటే చూసి నేనూ కొంత నేర్చుకున్నాను. వారపత్రికల్లో వచ్చే డ్రెస్ డిజైన్స్ చూసి, ఇంట్లోనే ప్రాక్టీస్ చేసేదాన్ని. ఏం పని చేయగలనా అని ఆలోచించినప్పుడు మా నాన్నను అడిగితే కుట్టుమిషన్ కొనిచ్చారు. చుట్టుపక్కల వాళ్లకు బ్లౌజులు కుట్టేదాన్ని. అక్కణ్ణుంచి నోటి మాట ద్వారా ‘రజిత బాగా డ్రెస్ డిజైన్ చేస్తుంది’ అనే పేరొచ్చింది. ఇంటి నుంచే చుట్టుపక్కల లేడీస్‌కి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఆన్లైన్ లో నా డ్రెస్ డిజైన్స్ పెట్టాను. అక్కణ్ణుంచి ఆర్డర్స్ పెరిగాయి. ఏడుగురు మహిళలే.. మా కుటుంబసభ్యుల పేర్లలో మొదటి అక్షరం తీసుకొని, వాటిని కలిపి ‘చర్ప్స్’ అని బొటిక్ పెట్టాను. నేను పని నేర్పించిన వారినే ఎంప్లాయీస్‌గా పెట్టుకున్నాను. ఇప్పుడు పద్నాలుగు మంది పనివారున్నారు. అందులో ఏడుగురు మహిళలే. ముప్పై ఏళ్లు పిల్లల కోసమే బతికాను. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. జీవితాల్లో స్థిరపడ్డారు. నేను తీసుకున్న నిర్ణయం కుటుంబానికి ఎంత మేలు చేసిందో పిల్లలు చెబుతుంటే సంతోషం గా అనిపిస్తుంటుంది. కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు ఆడవారే త్వరగా మేలుకుంటారు. వచ్చిన ఏ చిన్న పని చేసైనా పిల్లలను వృద్ధిలోకి తీసుకు రావాలనుకుంటారు. నాకు కొద్దిగా వచ్చిన టైలరింగ్‌నే ఉపాధిగా మార్చుకున్నాను. ఇప్పుడు కొందరికి ఉపాధిని ఇవ్వగలుగుతున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న విద్యార్థులూ నా వద్ద వర్క్ నేర్చుకోవడానికి వస్తుంటారు. టైలరింగ్ పర్ఫెక్ట్గా వచ్చేంతవరకు నేర్పిస్తాను. అయితే సర్టిఫికెట్ ఇవ్వడానికి ఇది స్కూల్‌గా రిజిస్టర్ కాలేదు. సీరియల్ ఆర్టిస్టులు, టీవీ యాంకర్స్‌కి డ్రెస్సులు డిజైన్ చేస్తున్నాను. ఉచితంగా మాస్కులు.. ఇదో పెద్ద సాయం అనుకోను. వచ్చిన పనే నలుగురికి ఉపయోగపడితే చాలనుకుంటాను. కరోనా మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు నిత్యావసరాలు, మాస్కులు ఇచ్చి చేతనైన సాయం చేస్తున్నాను. మాస్కుల తయారీకి కాటన్ పన్నాలు కొనుక్కొచ్చి, మూడు పొరల మాస్కులు తయారు చేసి టేబుల్ మీద పెడుతుంటాను. ఎవరికి అవసరమున్నా అడిగి తీసుకెళుతుంటారు. అనాథ, వృద్ధాశ్రమాలకు ఉచితంగా మాస్కులు ఇచ్చి వస్తుంటాను. ఇప్పుడు వేడుకల సందర్భాల్లో మ్యాచింగ్, ఎంబ్రాయిడరీ మాస్కులు వాడుతున్నారు. వాటి ఆర్డర్లతో పాటు ఈ ఉచిత మాస్కుల తయారీ కూడా ఉంటుంది’ అని వివరించారు రజితారాజ్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నాన్న మాట.. బంగారు బాట..
విశాఖ సిటీ: వృత్తి అమ్మలాంటిది.. అన్నం పెడుతుంది.. పది మందికి ఉపాధి కల్పించేది వ్యాపారమే అనే సిద్ధాంతం నాన్న చెబుతుంటే విన్న మంచుకొండ శ్రీవైష్ణవి ఆలోచనలు చిన్నతనం నుంచే వ్యాపారం వైపు సాగాయి. ఓవైపు చదువుతూ.. మరోవైపు.. వాణిజ్య రంగంలో రాణించాలన్న ఆమె ఆలోచనలకు నాన్న అప్పలరాజు శ్రీరంగ పెట్టుబడి అందించారు. ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతూ.. ఎనిమిది నెలల క్రితం తన సొంత ఆలోచనలతో బొటిక్ ప్రారంభించింది. తన కుటుంబం బ్రాండ్ నేమ్ ఎంవీఎస్ పేరు కలగలిసేలా ఎంవీఎస్ 92.5 సిల్వర్ బొటిక్ పేరుతో బీచ్‌రోడ్డులో తన స్టార్టప్‌ను ప్రారంభించింది. రెగ్యులర్ జ్యుయలరీ షాపుల్లో సిల్వర్ ఆభరణాలు దొరికినా.. అంతకుమించిన వెరైటీలు, అందరికీ అందుబాటులో ఉండే ధరలతో తన కలల వ్యాపారాన్ని ప్రారంభించిన శ్రీవైష్ణవి.. రెండు నెలల్లోనే ఫేమస్ అయిపోయింది. అమ్మాయిల అభిరుచికి అనుగుణంగానూ, భిన్నమైన కుటుంబ సభ్యుల ఆలోచనలను అందుకునేలా వెరైటీలు దొరికే బొటిక్‌గా దూసుకుపోతోంది. అంతే కాదు.. నగరంలో సరైన ఉపాధి లేని స్వర్ణకారులకు ఆసరాగా నిలుస్తోంది. -
‘అందుకే అతన్ని వివాహం చేసుకున్నాను’
సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజ రెండు నెలల క్రితం వివాహ బంధంతో ఒక్కటయిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి ఈ జంట ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అంశాలను అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. సోనమ్ కపూర్ అంటేనే ఫ్యాషన్ ఐకాన్. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆనంద్ అహుజా కూడా ఫ్యాషన్ ప్రియుడే. ఫ్యాషన్ పట్ల ఇద్దరికి ఉన్న ఆసక్తే తమను ఒక్కటి చేసిందింటున్నారు సోనమ్. ఈ విషయం గురించి సోనమ్ తన ట్విటర్లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. దానిలో ‘ఫ్యాషన్ అంటే నాకు ఎంత ఇష్టమో అందరికి తెలిసిన విషయమే. నేను ఆనంద్‌ను వివాహం చేసుకుంది కూడా ఈ కారణం వల్లే. ఎందుకంటే ఆనంద్ ఫ్యాషన్ రంగంలో, రిటైల్ రంగంలో స్థిరపడిన వ్యక్తి కాబట్టి నాకు తొందరగా నచ్చాడు. ఫ్యాషన్ పట్ల ఉన్న ఆసక్తి వల్లే మేము ఇద్దరం వివాహం చేసుకున్నాం’ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ అహుజా ఢిల్లీకి చెందిన రిటైల్ వ్యాపారి. అంతేకాక దేశంలో తొలి మల్టీ బ్రాండ్ ‘స్నీకర్’ బోటిక్‌ను ప్రారంభించింది కూడా ఆనంద్ అహుజానే. దీంతోపాటు ‘భనే’ అనే బ్రాండ్‌ను కూడా ప్రారంభించారు. ఈ ఏడాది మే 8న సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. వివాహం జరిగిన కొద్ది రోజులకే సోనమ్ ‘క్యాన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018’లో పాల్గొన్నారు. -
‘అమ్మో’ ఆ విషయం చెప్పను : అనసూయ
సీతంపేట: రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త క్యారెక్టర్లో ఒదిగిపోయి సినీ ప్రేక్షకుల మది దోచుకున్న అనసూయ భరద్వాజ్ శుక్రవారం సాయంత్రం నగరంలో సందడి చేశారు. గురుద్వార కూడలి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘మగువ’ బొటిక్‌ను ఆమె ప్రారంభించారు. అక్కడ డిస్ప్లే చేసిన కలెక్షన్ తిలకించిన అనంతరం మాట్లాడుతూ బొటిక్‌లో శారీస్, చుడీదార్స్, హ్యాండ్లూమ్ కలెక్షన్, హ్యాండ్‌బ్యాగ్స్, టాప్స్ అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. హైదరాబాద్ తర్వాత వైజాగ్ తనని బాగా ఎక్సైట్ చేసే ప్రదేశమని, అందుకే విశాఖ అంటే చాలా ఇష్టమని చెప్పారు. ‘అమ్మో’ చెప్పను ప్రస్తుతం 5సినిమాలతో బాగా బిజీ గా ఉన్నానని అనసూయ చెప్పారు. ఎవరితో నటిస్తున్నారని అడగ్గా అమ్మో... చెప్పనని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల వద్ద సినిమాలు చేశానని, మరో ముగ్గురు దర్శకుల వద్ద సినిమాలు చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఆ దర్శకుల పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. నా భర్తే ఫేవరెట్ హీరో ఏ హీరో ఇష్టమని అడగ్గా తన భర్త భరద్వాజ్ ఇష్టమని సమాధానమిచ్చారు అనసూయ. తనకు డ్రీమ్‌రోల్ అంటూ ఏమీ లేదని, రంగమ్మత్తలా మంచి క్యారెక్టర్స్‌తో గుర్తింపు తెచ్చుకోవాలని ఉందన్నారు. హీరోయిన్‌కు తానేమీ తక్కువ కాదని, ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రతి మహిళ హీరోయిన్ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు. నా కోసం నిరీక్షిస్తున్న వారిని చూసి వైజాగ్‌లో నాకు చాలా మంది అభిమానులున్నారని ఈ రోజే తెలిసిందని మురిసిపోయారు. రంగమ్మత్తగా గుర్తింపు ఆనందాన్నిచ్చింది రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు వచ్చిందని, ఎక్కడకు వెళ్లినా రంగమ్మత్త అని పిలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అనసూయ. జబర్దస్త్ షోలో ఒకలా, రంగస్థలం సినిమాలో మరొకలా ఉన్నానని, ఇపుడు చాలా మంది తనను ప్రత్యేకంగా చూడటానికి ఆహ్వానిస్తుండటం సంతోషంగా ఉందని తెలిపారు. -
మంచి దొంగ.. లైసెన్స్ ఇచ్చేశాడు..
పూణె : ఒక వస్తువు పోగొట్టుకున్నామంటే తిరిగి పొందడం కష్టం. దొంగతనం జరిగిన తర్వాత ఆ వస్తువులు మళ్లీ సొంతదారులకు చేరడం అనేది కల్లే. ఇక ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు వంటివి పోగొట్టుకుంటే మళ్లీ అప్లై చేయాలంటే కాస్త తలనొప్పి వ్యవహారమే. అయితే దొంగతనం చేసినవారు...ఆ వస్తువుల్ని తిరిగి మనకి పంపిస్తే ఆ ఆనందమే వేరు కదా. పూణెకి చెందిన స్వప్న డేకి అచ్చంగా ఇలాంటి అనుభవమే ఎదురైంది. గత నెల 28న తనకు వచ్చిన పార్శిల్ తెరచి చూసిన ఆమె స్వీట్ షాక్‌కు గురయ్యానని చెప్పారు. అందుకు కారణం పోయిందనుకున్న డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందడమే. ఎంజీ రోడ్డులోని తన బొటిక్‌ను మూసివేసిన తర్వాత ప్రతీ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లడం స్వప్న డేకు అలవాటు. రోజూ స్కూటర్‌పై వెళ్లే ఆమెకు కొడుకు ఈ మధ్యనే ఒక ఎస్యూవీ కారును బహుమతిగా ఇచ్చాడు. మార్చి 17 సాయంత్రం కారు పార్క్ చేసి వాకింగ్ ముగించుకుని వచ్చేసరికి కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న పర్సును దుండగుడు చోరీ చేశాడు. అందులో డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు డబ్బులు కూడా ఉన్నాయి. అయితే పర్స్‌ను కొట్టేసిన దొంగ... బ్రాండెడ్ పర్సును, అందులో ఉన్న రూ. 1500లను తనతో పాటే అట్టిపెట్టుకుని లైసెన్స్‌ని మాత్రం కొరియర్ చేసి నిజాయితీని చాటుకున్నాడు. దీంతో స్వప్న డేకు మళ్లీ లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన పని తప్పింది. డబ్బులు కొట్టేసినా.. లైసెన్స్ తిరిగి ఇచ్చేశాడు గనుక అతడు మంచి దొంగ అని సంబరపడిపోతున్నారు స్వప్న. -
మోటరోలా ‘మోటో షాప్’ బోటిక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ మోటరోలా ఆఫ్‌లైన్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తొలి రిటైల్ స్టోర్ ‘మోటో షాప్’ను యూఎస్‌లోని చికాగో నగరంలో శనివారం ప్రారంభిస్తోంది. ‘స్మార్ట్‌ఫోన్స్, వేరబుల్స్‌ను శక్తివంతమైన టెక్నాలజీతో రూపొందించాం. నిజ జీవితంలో స్టోర్‌కు వెళ్లి, వాటిని ప్రత్యక్షంగా చూసి అనుభూతి చెందాల్సిందే. షాపింగ్ అనుభూతి మరింత వ్యక్తిగతంగా మలిచాం’ అని కంపెనీ తన బ్లాగ్‌లో పేర్కొంది. ఇతర గ్యాడ్జెట్ స్టోర్లకు భిన్నంగా మోటో షాప్‌ను తీర్చిదిద్దారు. ఉపకరణాల తయారీలో వాడిన విడిభాగాలన్నీ స్టోర్‌లోని మోటో మేకర్ టూల్లో అందుబాటులో ఉంటాయి. -
వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్
బొటిక్, డిజైనర్ దుస్తులు అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అనుకోవడం సహజం. అయితే ఎకానమీ రేట్లలో, యూనిక్ దుస్తులు లభిస్తాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. అలా మహిళల డిజైనర్ దుస్తులను రీజనబుల్ ధరల్లో అందరికీ అందుబాటులోనికి తేవాలనే ప్రయత్నాలు నగరంలోని డిజైనర్లు మొదలుపెట్టారు. వినూత్న బ్రైడల్ ప్యాకేజీలు, కుర్తాలు, డిజైనర్ చీరలు, బ్లౌజ్‌లు, గాగ్రాలు, అనార్కలీలతో పాటు వర్కింగ్ వుమెన్ కోసం ప్రత్యేక వెరైటీలు రూపొందిస్తున్నారు. రోజువారీ నుంచి పెళ్లి దుస్తుల వరకు అన్నింటినీ అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా నగరం నిలుస్తోంది. వధువు పెళ్లి బట్టలతో పాటు వధువు కుటుంబ సభ్యుల దుస్తుల బాధ్యత అంతా ఒక ప్యాకెజ్లా అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో వధువు తల్లితండ్రులు, తోబుట్టువులు ఇలా సభ్యుల సంఖ్య, అలాగే వారు ఎంచుకునే దుస్తుల డిజైన్లను బట్టి ప్యాకేజీలు ఉంటారుు. స్పెషల్ బ్లౌజెస్... డిజిటల్ ప్రింట్ ఉన్న మెటీరియల్‌తో స్టిచ్ చేసిన చూడీ స్లీవ్స్ బ్లౌజ్. చక్కటి కట్స్, ఫిట్టింగ్తో నేటి యువతను ఆకట్టుకునే ఈ ట్రెండీ బ్లౌజ్‌ని ప్లెరుున్ చీరలతోనే కాకుండా రకరకాల చీరలపై మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్ వర్క్ చేసిన గ్రే కలర్ శారీకి హైనెక్‌తో వున్న రెడ్ కలర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపిస్తుంది. కట్‌దానా మెటీరియల్‌పై పూర్తిగా హ్యాండ్ వర్క్ చేసిన ఈ బ్లౌజ్‌ని పలు రకాల చీరలకే కాదు గాగ్రాలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో పసువు రంగులతో డై చేసిన చక్కటి నిట్ వర్క్ బ్లౌజ్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఫినిషింగ్ వున్న లేటెస్ట్ ట్రెండ్ బ్లౌజ్‌ని ఇలా హాఫ్ శారీలకు మాత్రమే కాక చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. డిజైనర్ చీరలు... బ్లౌజ్‌లు, కుర్తాలు, డ్రెస్సులతో పాటు డిజైనర్ చీరలు రూపొందిస్తున్నారు. కోటా మెటీరియల్‌ని ఆరెంజ్, బ్లూ రంగులతో డై చేసి అందమైన చీరలుగా వులుస్తున్నారు. కట్‌వర్క్ చేసిన చీర అంచులకు కుందన్, ముత్యాలను చేతితో కుట్టి చూడచక్కగా తయూరు చేస్తున్నారు. కలంకారీ వర్క్‌ని ఎక్కువగా లేటెస్ట్ దుస్తుల డిజైన్లలో వాడుతున్నారు. సహజమైన రంగులతో చేసే ఈ వర్క్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగువారి కోసం, తెలుగు వారికి నచ్చే దుస్తుల రూపకల్పన చేస్తుంటాం. ఏ ప్రాంతం వారికైనా వారి ప్రాంతం, వారి ఇష్టాఇష్టాలు బాగా తెలుస్తాయి. అలా నేటివిటీ, టేస్ట్‌తో పాటు వచ్చిన కస్టమర్ అభిరుచి, రూపురేఖలకు అనుగుణంగా దుస్తులు తయారు చేస్తాం. అలాగే మా సర్వీసులు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా అందుబాటులో వున్నాయి. విదేశాల్లో, ఇతర నగరాల్లో వున్న వనితల అవసరాలకు తగిన విధంగా దుస్తులు రెడీ చేసి ఇస్తుంటాం. - లతాశ్రీ, లాష్ స్టూడియో -
ముగ్ధ...మనోహరమైన కల!
చాలా మంది యువతీ యువకులే కాదు వారి తల్లిదండ్రులూ తమ పిల్లల విషయంలో కంటున్న కల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల సంపాదన!! అయితే అవన్నీ అందిపుచ్చుకున్న పాతికేళ్ల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశి మాత్రం చేస్తున్న ఉద్యోగం వద్దనుకున్నారు. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి కృషి చేస్తున్నారు. ‘కంప్యూటర్ ముందు ఓ యంత్రంలా చేసే పనికన్నా దుస్తులపై మనసుపెట్టి చేసే డిజైన్లు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు శశి. నేడు సినీస్టార్స్ చేత ర్యాంప్‌పై ఆమె డిజైన్స్‌తో హొయలొలికిస్తున్న శశి ఉంటున్నది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో. ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఆమె ఓ బొటిక్‌ను నడుపుతున్నారు. రెండు వేల రూపాయలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధిని ఇవ్వగల స్థాయికి చేర్చింది. అతివలు ముచ్చటపడే దుస్తుల డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయగాథే ఇది. స్వశక్తే పెట్టుబడి రెండేళ్ల క్రితం వరకు ఇంజినీర్‌గా శశి నెల జీతం 50 వేలు. ఇప్పుడూ అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయలు దాటేదే! ‘కానీ, నాకు రాత్రీ పగలూ ఒకటే ఆలోచన... అద్భుతమైన దుస్తులను తయారు చేయాలి. పది మందికి నేనే ఉపాధి ఇవ్వాలి. ఆ కలను గత రెండేళ్లుగా నిజం చేసుకుంటున్నాను’ అన్నారు ‘ముగ్ధ’ పేరుతో సంప్రదాయ దుస్తులను డిజైన్ చేసే శశి. ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే పెళ్లికి మంచి సంబంధాలు వస్తాయి కాని, ఫలానా వారి అమ్మాయి బట్టలు కుడుతుంది అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పని మానుకో!’ అని శశి అమ్మ అంజలీదేవి, నాన్న సత్యనారాయణ హెచ్చరించారు. ఆమె ఇష్టాన్ని కాదన్నారు. ‘కుటుంబంలో ఎవరికీ లేని ఈ పిచ్చి నీకెందుకు పట్టుకుంది’ అని బాధపడ్డారు. వారిని ఒప్పించలేక తన స్వశక్తిని నమ్ముకుని ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేశారు శశి. అలా ఉప్పల్‌లో అమ్మానాన్నల చెంత ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆమె, బంజారాహిల్స్‌లోని ఓ స్లమ్ ఏరియాలో రూ.2,000 పెట్టి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే రేయింబవళ్లూ తన మదిలో మెదిలో ఆలోచనలతో డిజైన్స్ మొదలుపెట్టారు. ‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి నేనేమీ ప్రత్యేకమైన కోర్సులు చేయలేదు. ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నైట్ డ్యూటీకి వెళుతూ పగలు డిజైన్స్ పరిశీలించడానికి నగరమంతా తిరిగేదాన్ని. రకరకాల వారపత్రికలు తిరగేసేదాన్ని. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునేదాన్ని. ఆ ప్రయత్నానికి ఓ చిన్నగదిలో ఊపిరిపోయడం మొదలుపెట్టాను. వదిలి పెట్టకుండా తొమ్మిది నెలలు రకరకాల ప్రయోగాలు చేసి, ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను డిజైన్ చేశాను. తర్వాత సొంతంగా ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం వర్క్ పరికరాలను కొన్నాను’ అని శశి చెబుతుంటే కృషి చేస్తే మేరు పర్వతాన్నైనా సింహాసనంగా చేసుకోవచ్చు అనిపించకమానదు. ప్రశంసలతో ఉత్సాహం ‘నేను డిజైన్ చేసిన లంగా ఓణీలను చూసినవారు అమితంగా మెచ్చుకున్నారు. వారి ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. డిజైనింగ్ బాగుందని, కలర్ కాంబినేషన్స్ సూపర్ అని మెచ్చుకోళ్లు.. వాటికి తగ్గట్టే ఆర్డర్లూ పెరిగాయి. ప్రశంసల జాబితా పెరుగుతున్న కొద్దీ నాలో ఉత్సాహమూ రెట్టింపు అయ్యింది. దానికి తోడు ఆదాయమూ పెరిగింది. ఇంకా డిజైనింగ్‌లో కొత్త కొత్త అంశాలు జోడించడం, నాణ్యతను పెంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వ్యాపార రహస్యాలను తెలిపారు శశి. ఉపాధి వైపుగా అడుగులు ఉద్యోగం మానేయాలనే ఆలోచనను శశి తన స్నేహితుల ముందుంచినప్పుడు వారు ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. బంధువులూ అదే మాట. అమ్మనాన్నలూ అదే మాట. ‘ఆ పిచ్చి ఉండబట్టే ఈ రోజు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. మరో రెండుమూడు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, అమెరికాలోనూ ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ ను లాంచ్ చేయబోతున్నాను. పురుషుల డిజైన్స్‌నూ పరిచయం చేయబోతున్నాను. పాతికమంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా డిజైనింగ్‌లో మెలకువలు నేర్పగలుగుతున్నాను. ఇంకా పేదపిల్లల చదువు కోసం కొంత ఆదాయాన్ని విరాళంగా ఇవ్వగలుగుతున్నాను. సినీ స్టార్ల చేత ర్యాంప్‌షోలు చేయించగలుగుతున్నాను’అంటూ తన కల గురించి, ఆ కలను సాకారం చేసుకున్న విధం గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధి కల్పనల గురించి తెలిపారు ఈ నవతరం డిజైనర్. మొదట ‘నీ కల సరైంది’ కాదు అని తిట్టిన అమ్మనాన్నలే నేడు కూతురు స్వశక్తితో ఎదిగినందుకు సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తోంది’ అని గొప్పగా చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు తమకూ కావాలని పోటీపడుతున్నారు. సృజనకు స్వశక్తి పెట్టుబడిగా మారి, పట్టుదలతో కృషి చేస్తే ప్రశంసలు వాటి వెంటే వస్తాయి. అవే అందరిలోనూ ఉన్నతంగా నిలబెడతాయి. అందుకు శశి ఓ చక్కని ఉదాహరణ. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ తాప్సీ కోసం ప్రత్యేకంగా లంగా ఓణీని డిజైన్ చేశాను. తన చర్మకాంతిని ఇంకా కాంతిమంతం చేసేలా, మహారాణి కళ వచ్చేలా గోల్డ్ జరీ మెటీరియల్ ఎంచుకున్నాను. దేశంలోని ప్రసిద్ధ డిజైనర్స్ ఈ షోకి హాజరయ్యి, నా డిజైన్స్‌ని ప్రశంసించారు. - శశి, ఫ్యాషన్ డిజైనర్