ముగ్ధ...మనోహరమైన కల! | Fashion designer Shashi interview | Sakshi
Sakshi News home page

ముగ్ధ...మనోహరమైన కల!

Published Wed, Oct 8 2014 10:08 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ముగ్ధ...మనోహరమైన కల! - Sakshi

ముగ్ధ...మనోహరమైన కల!

చాలా మంది యువతీ యువకులే కాదు వారి తల్లిదండ్రులూ తమ పిల్లల విషయంలో కంటున్న కల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల సంపాదన!! అయితే అవన్నీ అందిపుచ్చుకున్న పాతికేళ్ల్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శశి మాత్రం చేస్తున్న ఉద్యోగం వద్దనుకున్నారు. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి కృషి చేస్తున్నారు.
 
 ‘కంప్యూటర్ ముందు ఓ యంత్రంలా చేసే పనికన్నా దుస్తులపై మనసుపెట్టి చేసే డిజైన్లు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు శశి. నేడు సినీస్టార్స్ చేత ర్యాంప్‌పై ఆమె డిజైన్స్‌తో హొయలొలికిస్తున్న శశి ఉంటున్నది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో. ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఆమె ఓ బొటిక్‌ను నడుపుతున్నారు. రెండు వేల రూపాయలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధిని ఇవ్వగల స్థాయికి చేర్చింది. అతివలు ముచ్చటపడే దుస్తుల డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయగాథే ఇది.
 
 స్వశక్తే పెట్టుబడి
 
 రెండేళ్ల క్రితం వరకు ఇంజినీర్‌గా శశి నెల జీతం 50 వేలు. ఇప్పుడూ అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయలు దాటేదే! ‘కానీ, నాకు రాత్రీ పగలూ ఒకటే ఆలోచన... అద్భుతమైన దుస్తులను తయారు చేయాలి. పది మందికి నేనే ఉపాధి ఇవ్వాలి. ఆ కలను గత రెండేళ్లుగా నిజం చేసుకుంటున్నాను’ అన్నారు ‘ముగ్ధ’ పేరుతో సంప్రదాయ దుస్తులను డిజైన్ చేసే శశి. ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంటే పెళ్లికి మంచి సంబంధాలు వస్తాయి కాని, ఫలానా వారి అమ్మాయి బట్టలు కుడుతుంది అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పని మానుకో!’ అని శశి అమ్మ అంజలీదేవి, నాన్న సత్యనారాయణ హెచ్చరించారు. ఆమె ఇష్టాన్ని కాదన్నారు. ‘కుటుంబంలో ఎవరికీ లేని ఈ పిచ్చి నీకెందుకు పట్టుకుంది’ అని బాధపడ్డారు. వారిని ఒప్పించలేక తన స్వశక్తిని నమ్ముకుని ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేశారు శశి. అలా ఉప్పల్‌లో అమ్మానాన్నల చెంత ఉంటూ సాఫ్ట్‌వేర్  ఉద్యోగం చేసుకునే ఆమె, బంజారాహిల్స్‌లోని ఓ స్లమ్ ఏరియాలో రూ.2,000 పెట్టి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే రేయింబవళ్లూ తన మదిలో మెదిలో ఆలోచనలతో డిజైన్స్ మొదలుపెట్టారు. ‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి నేనేమీ ప్రత్యేకమైన కోర్సులు చేయలేదు. ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నైట్ డ్యూటీకి వెళుతూ పగలు డిజైన్స్ పరిశీలించడానికి నగరమంతా తిరిగేదాన్ని. రకరకాల వారపత్రికలు తిరగేసేదాన్ని. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునేదాన్ని. ఆ ప్రయత్నానికి ఓ చిన్నగదిలో ఊపిరిపోయడం మొదలుపెట్టాను. వదిలి పెట్టకుండా తొమ్మిది నెలలు రకరకాల ప్రయోగాలు చేసి, ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను డిజైన్ చేశాను. తర్వాత సొంతంగా ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం వర్క్ పరికరాలను కొన్నాను’ అని శశి చెబుతుంటే కృషి చేస్తే మేరు పర్వతాన్నైనా సింహాసనంగా చేసుకోవచ్చు అనిపించకమానదు.
 
 ప్రశంసలతో ఉత్సాహం
 
 ‘నేను డిజైన్ చేసిన లంగా ఓణీలను చూసినవారు అమితంగా మెచ్చుకున్నారు. వారి ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. డిజైనింగ్ బాగుందని, కలర్ కాంబినేషన్స్ సూపర్ అని మెచ్చుకోళ్లు.. వాటికి తగ్గట్టే ఆర్డర్లూ పెరిగాయి. ప్రశంసల జాబితా పెరుగుతున్న కొద్దీ నాలో ఉత్సాహమూ రెట్టింపు అయ్యింది. దానికి తోడు ఆదాయమూ పెరిగింది. ఇంకా డిజైనింగ్‌లో కొత్త కొత్త అంశాలు జోడించడం, నాణ్యతను పెంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వ్యాపార రహస్యాలను తెలిపారు శశి.
 
 ఉపాధి వైపుగా అడుగులు
 
 ఉద్యోగం మానేయాలనే ఆలోచనను శశి తన స్నేహితుల ముందుంచినప్పుడు వారు ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. బంధువులూ అదే మాట. అమ్మనాన్నలూ అదే మాట. ‘ఆ పిచ్చి ఉండబట్టే ఈ రోజు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. మరో రెండుమూడు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, అమెరికాలోనూ ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ ను లాంచ్ చేయబోతున్నాను. పురుషుల డిజైన్స్‌నూ పరిచయం చేయబోతున్నాను. పాతికమంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా డిజైనింగ్‌లో మెలకువలు నేర్పగలుగుతున్నాను. ఇంకా పేదపిల్లల చదువు కోసం కొంత ఆదాయాన్ని విరాళంగా ఇవ్వగలుగుతున్నాను. సినీ స్టార్ల చేత ర్యాంప్‌షోలు చేయించగలుగుతున్నాను’అంటూ తన కల గురించి, ఆ కలను సాకారం చేసుకున్న విధం గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధి కల్పనల గురించి తెలిపారు ఈ నవతరం డిజైనర్.

మొదట ‘నీ కల సరైంది’ కాదు అని తిట్టిన అమ్మనాన్నలే నేడు కూతురు స్వశక్తితో ఎదిగినందుకు సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తోంది’ అని గొప్పగా చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు తమకూ కావాలని పోటీపడుతున్నారు. సృజనకు స్వశక్తి పెట్టుబడిగా మారి, పట్టుదలతో కృషి చేస్తే ప్రశంసలు వాటి వెంటే వస్తాయి. అవే అందరిలోనూ ఉన్నతంగా నిలబెడతాయి. అందుకు శశి ఓ చక్కని ఉదాహరణ.

- నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల
 
 ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ తాప్సీ కోసం ప్రత్యేకంగా లంగా ఓణీని డిజైన్ చేశాను. తన చర్మకాంతిని ఇంకా కాంతిమంతం చేసేలా, మహారాణి కళ వచ్చేలా గోల్డ్ జరీ మెటీరియల్  ఎంచుకున్నాను. దేశంలోని ప్రసిద్ధ డిజైనర్స్ ఈ షోకి హాజరయ్యి, నా డిజైన్స్‌ని ప్రశంసించారు.
 - శశి, ఫ్యాషన్ డిజైనర్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement