Shiva mallala
-
‘సత్య’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యనటీనటులు: హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయరచన-దర్శకత్వం: వాలీ మోహన్దాస్నిర్మాత: శివ మల్లాల(తెలుగులో)సంగీతం: సుందరమూర్తి కె.యస్సినిమాటోగ్రఫీ: ఐ.మరుదనాయగంఎడిటర్: ఆర్. సత్యనారాయణవిడుదల తేది: మే 10, 2024(తెలుగులో)ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే చిన్న సినిమాలను సైతం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలను అక్కడ, ఇక్కడ ఒకేసారి రిలీజ్ చేస్తే.. మరికొన్నింటిని అక్కడ రిలీజ్ చేసి హిట్ టాక్ వచ్చిన తర్వాత తెలుగులో విడుదల చేస్తున్నారు. అలా తెలుగులోకి వచ్చిన మరో తమిళ్ సినిమానే సత్య. తమిళ్లో ‘రంగోలి’పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి టాక్ని సంపాదించుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో సత్య పేరుతో విడుదల చేశాడు ప్రముఖ ఫోటో జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. అనువాదం సినిమానే అయినా.. స్టైయిట్ సినిమా మాదిరి ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో ‘సత్య’పై బజ్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(మే 10) తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్య ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.‘సత్య’ కథేంటంటే..సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్) గాజువాకలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అతని తండ్రి గాంధీ(ఆడుగలం మురుగదాస్) ఇస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొడుకుని పెద్ద కార్పొరేట్ కళాశాలలో చదివించాలనేది అతని కోరిక. అప్పు చేసి మరీ కొడుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. సత్యకు మాత్రం అక్కడ చదువుకోవడం అస్సలు నచ్చదు.తండ్రి కోసమే ప్రైవేట్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ తోటి విద్యార్థులు అతన్ని చిన్నచూపు చూస్తూ రకరకాల వివక్షకు గురి చేస్తారు. ఓ గ్యాంగ్‌తో ప్రతి రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు అదే కాలేజీలో చదువుతున్న పార్వతి అలియాస్ పారు(ప్రార్ధన సందీప్)తో సత్య ప్రేమలో పడతాడు. పారుకి కూడా సత్య అంటే ఇష్టమే కానీ.. బయటకు చెప్పదు. ఓ కారణంగా అందరి ముందు సత్యను లాగిపెట్టి కొడుతుంది. అప్పటి నుంచి సత్య ఆ కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతాడు. తన చదువు కోసం ఫ్యామిలీ పడుతున్న కష్టాలను చూసి చలించిపోయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఆ కీలక నిర్ణయం ఏంటి? పార్వతితో ప్రేమలో పడిన తర్వాత సత్య జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కొడుకును కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరికి సత్య తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్కూల్, కాలేజీ లవ్‌స్టోరీలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. సత్య మూవీ కాన్సెప్ట్ కూడా అదే. కాలేజీ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. అయితే ఈ ప్రేమ కథకి తండ్రి కొడుకుల ఎమోషన్ని యాడ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు దర్శకుడు. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్లో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కొడుకు కోసం పేరెంట్స్.. పెరెంట్స్ కోసం కొడుకు ఆలోచించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కథంతా ఎంటర్టైనింగ్గా సాగిస్తూనే...అంతర్లీనంగా ఓ మంచి సందేశాన్ని అందించారు.ప్రభుత్వ కాలేజీల్లో చదివితే చెడిపోతారనే భయంతో కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించడం.. ఫీజులు కట్టేందుకు వాళ్లు పడే బాధలు, కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సన్నివేశాలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణలు మనసును తాకుతాయి. అయితే దర్శకుడు ప్రతీది డైలాగ్స్ రూపంలో చెప్పకుండా..విజువల్స్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకుడే దాన్ని అర్థం చేసుకొని ఫీల్ అయ్యేలా చేశాడు. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఇందులో బాగా వర్కౌట్ అయింది. దర్శకుడికి తొలి సినిమా అయితే.. కొన్ని సన్నీవేశాలను తెరకెక్కించిన విధానం చూస్తే ఎంతో అనుభవం ఉన్న డైరెక్ట్లా అనిపిస్తాడు. స్క్రీన్‌ప్లే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. ప్రభుత్వ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుందో తెలియజేస్తూ కథను ప్రాంభించాడు. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్.. కార్పొరేట్ కళాశాలలో చదివించేందుకు వారు పడే కష్టాలు.. ఇలా ఎమోషనల్‌గా కథనం సాగుతుంది. హీరో ప్రైవేట్ కాలేజీలో చేరిన తర్వాత లవ్‌స్టోరీ మొదలవుతుంది. అక్కడ నుంచి కథనం సరదాగా సాగిపోతుంది. కాలేజీలో జరిగే చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు ఇవన్నీ ప్రతి ఒక్కరికి తమ కాలేజీ డేస్‌ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ హృదయాలను హత్తుకుంటాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంది. కథనం కాస్త స్లోగా సాగినా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..సత్యగా హమరేష్ చాలా బాగా నటించారు. పేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. భవిష్యత్తులో మంచి నటుడుగా రాణించే అవకాశం ఉంది.పారుగా నటించిన ప్రార్థన తెరపై క్యూట్ గా కనిపించింది. హీరో తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు శివ మల్లాల. అచ్చమైన తెలుగు సినిమా చూసినట్లే ఉంటుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అలా ‘సత్య’కు నిర్మాతను అయ్యాను : శివ మల్లాల
‘ఓ సారి చెన్నై వెళ్లినప్పుడు నా స్నేహితుడి ద్వారా నిర్మాత సతీష్ పరిచయం అయ్యాడు. ఆయన తన కుమారుడు హమరేష్ని హీరోగా పెట్టి నిర్మించిన రంగోలి సినిమాను నాకు స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించారు. సినిమా మొత్తం చూశాక క్లైమాక్స్ బాలేదని చెప్పేశాను. నేను చూసింది రఫ్ వెర్షన్ మాత్రమే. రెండు నెలల తర్వాత మళ్లీ తమిళ్ సినీ పెద్దలతో పాటు నాకు సినిమా చూపించాడు. ఆ తర్వాత స్టేజ్‌పై మాట్లాడుతూ.. తెలుగులో శివ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడని ఆయనే చెప్పాడు. అప్పటి వరకు నేను ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకోలేదు. కానీ సతీష్ నమ్మకంగా చెప్పడంతో.. నేను కూడా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నానని ప్రకటించాను. అలా నేను అనుకోకుండా సత్య సినిమాకు నిర్మాతను అయ్యాను’ అన్నారు జర్నలిస్ట్, శివమ్ మీడియా అధినేత శివ మల్లాల. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రంగోలి’. ఈ చిత్రాన్ని సత్య పేరుతో శివ మల్లాల మే 10న తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రంగోలి టైటిల్ ఇక్కడ వేరే వాళ్లు బుక్ చేసుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’పేరుతో రిలీజ్ చేస్తున్నాను. ఆర్జీవీ తెరకెక్కించిన సత్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అలాగే సినిమా ప్రమోషన్స్‌కి కూడా కలిసొస్తుందనే ఉద్దేశంతో ఈ చిత్రానికి సత్య అనే టైటిల్‌ని పెట్టాం. డబ్బింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అచ్చమైన తెలుగు సినిమాలాగే ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. క్లైమాక్స్‌లో మార్పులు చేశాం. తెలుగు ఆడియన్స్‌కి నచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. సినిమాలో ఫాదర్స్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు కథను విన్నాను. అన్ని కుదిరితే త్వరలోనే మరో సినిమాను నిర్మిస్తాను’ అని శివ మల్లాల అన్నారు. -
వెంటనే ఓకే చెప్పేశా!
‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం నుంచి ఒంగోలులో ప్రారంభమైంది. అర్జున్ జంధ్యాలని దర్శకునిగా పరిచయం చేస్తూ, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలిమ్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘ఆర్ఎక్స్ 100’ తర్వాత చాలా కథలు విన్నాను. అర్జున్ జంధ్యాల చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘బోయపాటి శ్రీనుగారి దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశాను. ఆయన నాకు గురువుగారు మాత్రమే కాదు. సోదర సమానులు. కార్తికేయగారి వల్లే ఈ చిత్రం ఇంత త్వరగా పట్టాలెక్కింది. కథానుగుణంగా ఒంగోలులో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అన్నారు అర్జున్ జంధ్యాల. ‘‘ఈ చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. గురువారం నుంచి ఫిబ్రవరి 8 వరకు ఒంగోలు పరిసరాల్లో తొలి షెడ్యూల్ చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లోనే కీలక సన్నివేశాలు, రెండు పాటలను తెరకెక్కిస్తాం. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. టైటిల్ త్వరలోనే వెల్లడిస్తాం’’ అని అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్య భరద్వాజ్, కెమెరా: ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ రామ్, ఆర్ట్ డైరెక్టర్: జీయమ్ శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ మల్లాల. -
ముగ్ధ...మనోహరమైన కల!
చాలా మంది యువతీ యువకులే కాదు వారి తల్లిదండ్రులూ తమ పిల్లల విషయంలో కంటున్న కల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల సంపాదన!! అయితే అవన్నీ అందిపుచ్చుకున్న పాతికేళ్ల్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ శశి మాత్రం చేస్తున్న ఉద్యోగం వద్దనుకున్నారు. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి కృషి చేస్తున్నారు. ‘కంప్యూటర్ ముందు ఓ యంత్రంలా చేసే పనికన్నా దుస్తులపై మనసుపెట్టి చేసే డిజైన్లు నాకు ఎంతో సంతృప్తినిస్తాయి’అంటారు శశి. నేడు సినీస్టార్స్ చేత ర్యాంప్‌పై ఆమె డిజైన్స్‌తో హొయలొలికిస్తున్న శశి ఉంటున్నది హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో. ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ పేరుతో ఆమె ఓ బొటిక్‌ను నడుపుతున్నారు. రెండు వేల రూపాయలతో మొదలైన తన ప్రయాణం ఇప్పుడు వంద మందికి పైగా ఉపాధిని ఇవ్వగల స్థాయికి చేర్చింది. అతివలు ముచ్చటపడే దుస్తుల డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయగాథే ఇది. స్వశక్తే పెట్టుబడి రెండేళ్ల క్రితం వరకు ఇంజినీర్‌గా శశి నెల జీతం 50 వేలు. ఇప్పుడూ అదే ఉద్యోగంలో ఉంటే లక్ష రూపాయలు దాటేదే! ‘కానీ, నాకు రాత్రీ పగలూ ఒకటే ఆలోచన... అద్భుతమైన దుస్తులను తయారు చేయాలి. పది మందికి నేనే ఉపాధి ఇవ్వాలి. ఆ కలను గత రెండేళ్లుగా నిజం చేసుకుంటున్నాను’ అన్నారు ‘ముగ్ధ’ పేరుతో సంప్రదాయ దుస్తులను డిజైన్ చేసే శశి. ‘సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంటే పెళ్లికి మంచి సంబంధాలు వస్తాయి కాని, ఫలానా వారి అమ్మాయి బట్టలు కుడుతుంది అంటే ఎవరూ ముందుకు రారు. ఈ పని మానుకో!’ అని శశి అమ్మ అంజలీదేవి, నాన్న సత్యనారాయణ హెచ్చరించారు. ఆమె ఇష్టాన్ని కాదన్నారు. ‘కుటుంబంలో ఎవరికీ లేని ఈ పిచ్చి నీకెందుకు పట్టుకుంది’ అని బాధపడ్డారు. వారిని ఒప్పించలేక తన స్వశక్తిని నమ్ముకుని ఇంటి నుంచి ఒంటరిగా బయటకు వచ్చేశారు శశి. అలా ఉప్పల్‌లో అమ్మానాన్నల చెంత ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే ఆమె, బంజారాహిల్స్‌లోని ఓ స్లమ్ ఏరియాలో రూ.2,000 పెట్టి ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే రేయింబవళ్లూ తన మదిలో మెదిలో ఆలోచనలతో డిజైన్స్ మొదలుపెట్టారు. ‘ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించడానికి నేనేమీ ప్రత్యేకమైన కోర్సులు చేయలేదు. ఎవరి దగ్గరా శిక్షణ పొందలేదు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే నైట్ డ్యూటీకి వెళుతూ పగలు డిజైన్స్ పరిశీలించడానికి నగరమంతా తిరిగేదాన్ని. రకరకాల వారపత్రికలు తిరగేసేదాన్ని. విడి విడిగా క్లాత్‌లు తీసుకొచ్చి కాంబినేషన్స్ చూసుకునేదాన్ని. ఆ ప్రయత్నానికి ఓ చిన్నగదిలో ఊపిరిపోయడం మొదలుపెట్టాను. వదిలి పెట్టకుండా తొమ్మిది నెలలు రకరకాల ప్రయోగాలు చేసి, ఆరు ప్రత్యేకమైన లంగా ఓణీలను డిజైన్ చేశాను. తర్వాత సొంతంగా ఒక ఎంబ్రాయిడరీ మిషన్, మగ్గం వర్క్ పరికరాలను కొన్నాను’ అని శశి చెబుతుంటే కృషి చేస్తే మేరు పర్వతాన్నైనా సింహాసనంగా చేసుకోవచ్చు అనిపించకమానదు. ప్రశంసలతో ఉత్సాహం ‘నేను డిజైన్ చేసిన లంగా ఓణీలను చూసినవారు అమితంగా మెచ్చుకున్నారు. వారి ఇంట్లో వేడుకలకు ఆర్డర్లు ఇవ్వడం మొద లుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. డిజైనింగ్ బాగుందని, కలర్ కాంబినేషన్స్ సూపర్ అని మెచ్చుకోళ్లు.. వాటికి తగ్గట్టే ఆర్డర్లూ పెరిగాయి. ప్రశంసల జాబితా పెరుగుతున్న కొద్దీ నాలో ఉత్సాహమూ రెట్టింపు అయ్యింది. దానికి తోడు ఆదాయమూ పెరిగింది. ఇంకా డిజైనింగ్‌లో కొత్త కొత్త అంశాలు జోడించడం, నాణ్యతను పెంచడం.. వంటి జాగ్రత్తలు తీసుకున్నాను’ అంటూ వ్యాపార రహస్యాలను తెలిపారు శశి. ఉపాధి వైపుగా అడుగులు ఉద్యోగం మానేయాలనే ఆలోచనను శశి తన స్నేహితుల ముందుంచినప్పుడు వారు ‘నీకేమైనా పిచ్చా’ అన్నారు. బంధువులూ అదే మాట. అమ్మనాన్నలూ అదే మాట. ‘ఆ పిచ్చి ఉండబట్టే ఈ రోజు వంద మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోగలిగాను. మరో రెండుమూడు నెలల్లో విజయవాడ, విశాఖపట్నం, అమెరికాలోనూ ‘ముగ్ధ ఆర్ట్ స్టూడియో’ ను లాంచ్ చేయబోతున్నాను. పురుషుల డిజైన్స్‌నూ పరిచయం చేయబోతున్నాను. పాతికమంది నిరుపేద అమ్మాయిలకు ఉచితంగా డిజైనింగ్‌లో మెలకువలు నేర్పగలుగుతున్నాను. ఇంకా పేదపిల్లల చదువు కోసం కొంత ఆదాయాన్ని విరాళంగా ఇవ్వగలుగుతున్నాను. సినీ స్టార్ల చేత ర్యాంప్‌షోలు చేయించగలుగుతున్నాను’అంటూ తన కల గురించి, ఆ కలను సాకారం చేసుకున్న విధం గురించి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉపాధి కల్పనల గురించి తెలిపారు ఈ నవతరం డిజైనర్. మొదట ‘నీ కల సరైంది’ కాదు అని తిట్టిన అమ్మనాన్నలే నేడు కూతురు స్వశక్తితో ఎదిగినందుకు సంతోషిస్తున్నారు. ‘మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, అందంగా దుస్తులను రూపొందిస్తుంది. ఇంకొంతమందికి ఉపాధి కల్పిస్తోంది’ అని గొప్పగా చెబుతున్నారు. స్నేహితులు అభినందిస్తున్నారు. ఆమె డిజైన్ చేసిన దుస్తులు తమకూ కావాలని పోటీపడుతున్నారు. సృజనకు స్వశక్తి పెట్టుబడిగా మారి, పట్టుదలతో కృషి చేస్తే ప్రశంసలు వాటి వెంటే వస్తాయి. అవే అందరిలోనూ ఉన్నతంగా నిలబెడతాయి. అందుకు శశి ఓ చక్కని ఉదాహరణ. - నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఎలైట్ ఫ్యాషన్ షోలో హీరోయిన్ తాప్సీ కోసం ప్రత్యేకంగా లంగా ఓణీని డిజైన్ చేశాను. తన చర్మకాంతిని ఇంకా కాంతిమంతం చేసేలా, మహారాణి కళ వచ్చేలా గోల్డ్ జరీ మెటీరియల్ ఎంచుకున్నాను. దేశంలోని ప్రసిద్ధ డిజైనర్స్ ఈ షోకి హాజరయ్యి, నా డిజైన్స్‌ని ప్రశంసించారు. - శశి, ఫ్యాషన్ డిజైనర్