Woman Palasa Kashibugga SI Sireesha Special Life Story - Sakshi
Sakshi News home page

శివుడైనా... శవమైనా ఒక్కటే.. ఇది నా డ్యూటీ

Published Wed, Feb 3 2021 1:28 PM | Last Updated on Wed, Feb 3 2021 5:13 PM

Women SI Sireesha Special Story In Srikakulam District - Sakshi

సాక్షి, శ్రీకాకుళం : ఖాకీ దుస్తుల్లో కాఠిన్యం కాదు.. కారుణ్యం కూడా ఉంటుంది. పోలీసులు కఠువుగా ఉంటారని అనుకుంటారు. విధి నిర్వహణలో ఒత్తిడి, జనం రూల్స్‌ పాటించకపోతే వచ్చే కోపం, నేరగాళ్లను వదలకూడదనే కాఠిన్యం ఉంటాయి. కానీ కొందరు పోలీసులు సమయానుసారం వారిలోని మానవత్వాన్ని బయటపెడుతుంటారు. కొన్నిసార్లు సాహసాలు చేస్తుంటారు. మరికొన్ని సార్లు మంచి పనులతో ఔరా అనిపించుకుంటారు. ఈ కోవలోకే వస్తారు పలాస కాశీబుగ్గ ఎస్‌ఐ శిరీష. పోలీసులంటే మరింత గౌరవ భావం ఏర్పడేలా గొప్పపని చేశారు.  చదవండి: మహిళా ఎస్‌ఐ మానవత్వం

శాంతిభద్రతల పర్యవేక్షణే కాదు మానవత్వం కూడా ఉందని ఆమె చాటుకున్నారు. అనాథ శవాన్ని ఆత్మబంధువులా మోసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న శిరీషను ‘సాక్షి’ పలకరించింది. తనలోని అంతరంగాన్ని పరిచయం చేసింది. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్న ఆమె తదనంతరం జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా అవమానాలు, కష్టాలు చవి చూసింది. ఆ వివరాలు తన మాటల్లోనే..

కుటుంబ నేపథ్యం.. 
మా స్వస్థలం విశాఖపట్నం సిటీ రామాటాకీస్‌ ప్రాంతం. ఎం.ఫార్మసీ చదువుకున్నాను. తల్లిదండ్రులు కొత్తూరు అప్పారావు( తాపీ మేస్త్రీ), రమణమ్మ(కూలీ)గా పనిచేసేవారు. అన్నయ్య సతీష్‌కుమార్‌ ఇండియన్‌ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. 2014లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా మద్దిలపాలెం ఎక్సైజ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పనిచేశాను.

ఆ మాటలు నిద్రపోనివ్వలేదు..
2014లో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మా ఎస్పీ ఆఫ్‌ ట్రాల్‌ కానిస్టేబుల్‌వి అని మందలించగానే నిద్ర లేని రాత్రులు గడిపాను. ఆ మాటతో బాధపడ్డాను. ఐతే ఓ ఎస్పీ ఆఫ్‌ట్రాల్‌ అంటే మరో ఎస్పీ తాను చదువుకుంటానంటే  ప్రోత్సహించారు. అందులో భాగంగా 8 నెలల పాటు సెలవు పెట్టాను..జీతం లేకపోయినా ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించాలని భావించాను. కానిస్టేబుల్‌గా పనిచేసిన కాలంలో సంపాదించిన రూ.1.50 లక్షలను తీసుకుని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పట్టుదలతో చదివి ఎస్‌ఐగా ఎంపికయ్యాను. అనంతపురంలో రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. నన్ను ఆఫ్‌ట్రాల్‌ అన్న ఎస్పీయే విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సన్మానం చేశారు. ఇదో మధురానుభూతి.

13 ఏళ్లకే పెళ్లి..  
బరువులు మోయడం.. సేవ చేయడం వంటి వాటిపై ట్రైనింగ్‌లోనూ తర్ఫీదు లభించింది. అంతకు ముందు మా కులం గురించి చెప్పాలి. మా కులంలో ఆడపిల్ల అంటే పరదా చాటున ఉండాల్సిందే. అందులో నాన్నకు నేను భారం అని భావించి 13 ఏళ్లకే పెళ్లి చేశారు. ఏం చేయాలో తెలియదు. నా భర్త వయస్సుకు నా వయస్సుకు సంబంధం లేదు. భార్యగా బాధ్యత ఏంటో తెలియదు.  ఎలా నెట్టుకురావాలో తెలియదు. జీవితంతో పోరాడాను. చదువుకోవాలని ఉంది. పుస్తకం కొనేందుకు డబ్బులేదు.

కష్టాలతో రాటుదేలా  
కష్టాలతో సావాసం చేసి ఎంతో నేర్చుకున్నాను. అందుకే సేవ అంటే తాను ముందుంటాను. అందులో నా తండ్రే స్పూర్తి. మా నాన్నకు పోలీస్‌ యూనిఫాం అంటే ఎంతో ఇష్టం. కర్తవ్యం సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ విజయశాంతిలా నన్ను చూడాలన్న నాన్న కల నెరవేర్చాను. ఆయన నడిపిన బాటలోనే సేవంటే ఇష్టపడతాను.

మృతదేహం ఎందుకు మోశానంటే.. 
పలాస మండలంలో అడవికొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి వాహనాలు వెల్లవు. అనాథ శవం ఉందని చెప్పగా సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుని శవం కనిపించింది. జాలి వేసింది. కొంతమంది భూత, ప్రేత పిశాచాలని.. ముట్టుకుంటే స్నానం చేయాలని.. అదో అపచారంలా భావించే వారికి ఇదో కనువిప్పు కావాలి. బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడం లేదు.  చివరికి  కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో స్ట్రెచర్‌ తీసుకురమ్మని చెప్పాను. స్ట్రెచర్‌పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్‌ ఇష్టపడలేదు.  ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. నేనే స్ట్రెచర్‌పై శవాన్ని ఉంచి మరొకరి సహకారంతో కిలోమీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశాను. నా దృష్టిలో శివుడైనా... శవమైనా ఒక్కటే.. ఇది నా డ్యూటీ.

చదువంతా వైఎస్సార్‌ పుణ్యమే.. 
ఎస్‌ఐగా శిరీష ప్రస్తానం మొదలైందంటే అది మహానుభావుడు దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పుణ్యమే. అత్తవారింటి నుంచి బయటపడ్డాక ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకంలో విశాఖలోని ఉమెన్స్‌ కళాశాలలో చదువుకున్నాను. ఎం.ఫార్మసీలో ఏకంగా నాలుగేళ్లపాటు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతోనే చదివాను. నేను నిత్య విద్యార్థిని. గ్రూప్‌–1 సాధించి డీఎస్పీ కావాలన్నదే లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతాకారులు సహకరిస్తారన్న నమ్మకం నాకుంది. డీజీపీ గౌతం సవాంగ్‌ స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. హోంమంత్రి సుచరిత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, తెలంగాణ పోలీసులు, తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండిసంజయ్‌ తదితరులు అభినందించడం మర్చిపోలేను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement