అనాథ శవాన్ని మోసుకుని తీసుకువెళ్తున్న కాశీబుగ్గ ఎస్‌ఐ కొత్తూరు శిరీష
సాక్షి, అమరావతి/కాశీబుగ్గ: మానవత్వం చాటుకున్న మహిళా ఎస్‌ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లిన ఆమె ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ ఫొటోలను ట్విట్టర్, ఏపీ పోలీస్ ఫేస్‌బుక్ పేజీలలో ట్యాగ్ చేసి, ‘మహిళా ఎస్‌ఐ.. మానవీయ కోణం’ అంటూ ప్రశంసించారు. ఆమెకు ప్రçశంసపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
హోం మంత్రి సుచరిత సైతం ట్విట్టర్‌లో శిరీషకు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉన్న అడవి కొత్తూరులోని పంటపొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం ఉన్నట్లు సోమవారం పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ శిరీష ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్న ఆమె.. ఆ శవాన్ని తరలించేందుకు ముందుకు రావాలని అక్కడున్న వారిని అభ్యర్ధించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే ముందడుగు వేసి.. వేరొకరి సాయంతో కిలోమీటర్‌కు పైగా మృతదేహాన్ని మోసుకెళ్లారు. స్థానికంగా ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు మృతదేహాన్ని అప్పగించడమేగాక, ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment