Gautam Sawang
-
కూటమి ప్రభుత్వ కక్ష.. బలవంతంగా రాజీనామా..
-
2018 గ్రూప్-1 మెయిన్స్‌పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్‌కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్‌దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్‌లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్‌లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
ఉద్యోగాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. గ్రూప్–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్‌పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది. ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గ్రూప్–1, గ్రూప్–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది. సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది. 2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. -
AP: నెలాఖరులో గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, విజయవాడ: ఈ నెలాఖరులోపు గ్రూప్ 1, గ్రూప్ -2 నోటిఫికేషన్లు ఇస్తామని, గ్రూప్-1లో 100, గ్రూప్-2 లో 900 పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 గ్రూప్ వన్ ప్రక్రియను రికార్డుస్ధాయిలో తొమ్మిది నెలల్లో పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈ గ్రూప్ వన్ ప్రక్రియ కూడా తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో రెండు పేపర్ల స్ధానంలో ఒకే పేపర్ ఉంటుందని తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ లో అయిదు పేపర్లకు బదులు నాలుగే ఉంటాయన్నారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ తరహాలో, రెండు పేపర్లు డిస్క్రిప్షన్ తరహాలో ఉంటాయని చెప్పారు. లాంగ్వేజ్ లో రెండు పేపర్లకి బదులు ఒక పేపర్ మాత్రమే ఉంటుందన్నారు. సిలబస్ లో ఎటువంటి మార్పులు ఉండవన్నారు. నిరుద్యోగ అభ్యర్ధులకు మేలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూపీఎస్సీ, మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లలో పరీక్షలను పరిశీలించిన తర్వాతే మార్పులు చేశామన్నారు. డిసెంబర్ లో 2200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోనే పరీక్షలు జరిపి జనవరిలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. APPSC Group-1&2 ఉద్యోగాల స్డడీ మెటీరియల్, బిట్‌బ్యాంక్, ప్రీవియస్ పేపర్స్, ఆన్లైన్ టెస్టులు, సక్సెస్ స్టోరీల కోసం క్లిక్ చేయండి -
ఏపీ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల
సాక్షి, కృష్ణా: గ్రూప్-1 పరీక్షా తుది ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలో బోర్డు చైర్మన్ గౌతం సవాంగ్ ఫలితాలను రిలీజ్ చేశారు. గ్రూప్-1లో ఖాళీల 110 పోస్టులకుగానూ తుది ఫలితాలను ప్రకటించారాయన. నోటిఫికేషన్ నుంచి ఫలితాలు వెల్లడి వరకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియ పూర్తి చేసింది. ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రికార్డు సమయంలోనే గ్రూప్ వన్ ఫలితాలు ప్రకటించాం. గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా పూర్తి చేశాం. మొదటిసారిగా సీసీ కెమెరాలను వినియోగించాం. 111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ర్యాంకర్ల వివరాలు ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ) సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం) మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు) అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ) ఆ పుకార్లు నమ్మొద్దు ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్ గౌతమ్ సవాంత్ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దని, గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని’’ తెలిపారాయన. గ్రూప్-1 ప్రక్రియ సాగిందిలా.. గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. జూన్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. -
AP: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. ఇది కూడా చదవండి: నేడు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ -
APPSC: గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, విజయవాడ: గ్రూప్-1 పరీక్షల కోసం దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరాలను వెల్లడించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 2వ తేదీ కాగా.. ఆ తేదీని నవంబర్ 5కి మార్చినట్లు వెల్లడించారు. ఎల్లుండి(4వ తేదీ) అర్థరాత్రి లోపు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. డిసెంబర్ 18న స్క్రీనింగ్ టెస్ట్, మార్చ్ 2023లో మెయిన్స్ పరీక్షలు ఉంటాయని.. ఈ దరఖాస్తు పొడిగింపును గమనించి వినియోగించుకోవాలని అర్హులకు సవాంగ్ సూచించారు. -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 ఫలితాల ప్రకటన
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మంగళవారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. మొత్తం లక్షా నలభై వేల మంది పరీక్షలు రాయగా. స్క్రీనింగ్ టెస్ట్‌కి యాభై వేల మందికి పైగా హాజరయ్యారు. 167 గ్రూప్ వన్ పోస్టులకి గాను 325 మంది ఇంటర్వ్యూలకి హాజరయ్యారు. కరోనాతో పాటు న్యాయపరమైన అంశాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఫలితాల్లో.. పిఠాపురం ప్రాంతానికి చెందిన సుష్మితకు ఫస్ట్ ర్యాంక్ దక్కింది. వైఎస్సార్ జిల్లా కొత్తులగుట్టకు చెందిన శ్రీనివాసులుకు రెండో ర్యాంక్, హైదరాబాద్‌కు చెందిన సంజన సిన్హాకు మూడో ర్యాంక్ దక్కింది. మొదటి పది స్ధానాలలో ఏడుగురు మహిళలు ఉండడం గమనార్హం. గ్రూప్-1 2018 నోటిఫికేషన్లో 167 పోస్టులకుగానూ.. 165 పోస్టులకు ఇప్పుడు ఫలితాలు ఇచ్చారు. వీటిలో 30 పోస్టులు డిప్యూటీ కలెక్టర్, 28 డిఎస్పీ పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోపు బోర్డు ముందు హాజరై.. హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారాయన. వచ్చే నెలలోనే గ్రూప్-2 నోటిఫికేషన్లు ఉంటాయని, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు ఉంటాయని, మరో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. -
దోషులను గుర్తించి శిక్షించాలనే చెప్పారు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సక్రమంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను గుర్తించి శిక్షించాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని పూర్వ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. దోషులు ఎంతవారైనా సరే కచ్చితంగా ఉపేక్షించొద్దనే చెప్పారని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి తనను ఉద్దేశించి కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలు పూర్తిగా అవాస్తవమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డిలను తన వద్దకు సీఎం పంపారని పత్రికల్లో ప్రచురితమైన సమాచారం పూర్తిగా అవాస్తవమన్నారు. తాను డీజీపీగా ఉండగా ఆ ముగ్గురూ ఎప్పుడూ కలవలేదని తెలిపారు. ఆ ముగ్గురూ తనకు రెండు కళ్లు లాంటివారని సీఎం జగన్మోహన్రెడ్డి అన్నట్లుగా తాను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త ఎన్.రాజశేఖరరెడ్డి వద్ద వ్యాఖ్యానించినట్లు కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచురించాయన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి కుటుంబాలు తనకు రెండు కళ్లు అని మాత్రమే ముఖ్యమంత్రి తనతో చెప్పారని, అదే విషయాన్ని 2019 సెప్టెంబర్‌లో తనను కలిసిన సునీత, రాజశేఖరరెడ్డి దంపతులకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా నిర్వహించి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని వారికి వివరించినట్లు చెప్పారు. అదే సమయంలో అమాయకులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన తనతో చెప్పారని కూడా వారికి తెలియజేశానన్నారు. తదనంతరం ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు, వాస్తవాలను కోర్టు ముందుంచాలని సీఎం జగన్ తమకు స్పష్టంగా నిర్దేశించారన్నారు. సక్రమంగా దర్యాప్తు చేయడమే కాకుండా అదే విశ్వాసాన్ని అందరిలోనూ కల్పించాలని సీఎం నిర్దేశించారన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఏ దశలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. -
ఏపీపీఎస్సీ చైర్మెన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
-
ఏపీ: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, 1992 బ్యాచ్‌కు చెందిన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఆయన 1994లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్‌లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతో పాటు సీఐడీ, రైల్వే ఎస్పీగా పనిచేశారు. విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్, మెరైన్ పోలీస్ విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. పలు కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. చదవండి: (సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్) -
సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్
సాక్షి, విజయవాడ: మంగళగిరిలోని 6వ బెటాలియన్ గ్రౌండ్లో బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. బెటాలియన్ పోలీసు కవాతు నిర్వహించింది. ఈసందర్భంగా బదిలీ అయిన డీజీపీ గౌతమ్ సవాంగ్, నూతన డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సవాంగ్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. 'నా 36 సంవత్సరాల పోలీసు సర్వీసు ఇవాళ్టితో ముగుస్తోంది. డీజీపీగా 2 ఏళ్ల 8 నెలల కాలం పనిచేశా. ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల ప్రకారం ఈ రెండున్నర ఏళ్ల పాటు పని చేశాను. చాలా సంస్కరణలు, పోలీసు వ్యవహార శైలిలో మార్పులు తెచ్చేందుకు కృషి చేశాను. ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసేందుకు పని చేశాను. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల 8 నెలల పాటు నన్ను డీజీపీగా కొనసాగించిన సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు. దిశా, మొబైల్ యాప్ నుంచి కూడా కేసులు నమోదు అయ్యేలా చేశాం. బాధితులు పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకున్నాం. 36 శాతం కేసులు డిజిటల్‌గా వచ్చిన ఫిర్యాదులే. 75 శాతం కేసుల్లో కోర్టులు విచారణ చేసి శిక్ష వేశాయి. స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40 వేలకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. స్పందన, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మహిళలు, చిన్నారుల భద్రత కోసం పనిచేశాం. దిశా యాప్ డౌన్లోడ్ లక్ష్యాన్ని సీఎం జగన్ నిర్ధేశించారు. ప్రస్తుతం కోటి 10 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేశారు. అలాగే పోలీస్ సేవా వెబ్ సైట్ ద్వారా డిజిటల్‌గా ఎఫ్ఐఆర్లను డౌన్ లోడ్ చేసే అవకాశం కల్పించాం. డీజీపీ కార్యాలయం నుంచి ఇన్ స్పెక్టర్ కార్యాలయం వరకు డిజిటల్‌గా అనుసంధానం చేశాం. ఏపీ పోలీసు వ్యవస్థలో డీజిటల్‌గా చాలా మార్పులు చేయగలిగాం. పోలీసులకు వీక్లి ఆఫ్‌లు కల్పించారు. 7,552 ఎకరాల్లో పండించిన గంజాయిని తొలిసారిగా ధ్వంసం చేశాం. పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో సవాళ్ళను ఎదుర్కొంటూనే పని చేయాల్సి ఉంటుంది. నూతన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పోలీస్ వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా. సీఎం జగన్ మనపై ఉంచిన బాధ్యతలు పూర్తిగా నిర్వహించాలి' అని గౌతమ్‌సవాంగ్ అన్నారు. -
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి) -
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : గంజాయి నియంత్రణ, నిర్మూలనలో దేశంలోనే ఇదో సరికొత్త రికార్డు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిది. అనకాపల్లి నియోజకవర్గం కోడూరులో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సంచులకు స్వయంగా నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారు. దళారులు, మావోయిస్టులు గిరిజనులను భయపెట్టి గంజాయిని సాగు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ప్రభుత్వం గంజాయి రవాణా, సాగుపై దృష్టిపెట్టింది. నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 577 కేసుల్లో 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం అలాగే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాల్లోని 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో మొత్తం 7,552 ఎకరాల్లోని గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి విలువ రూ.9,251.32 కోట్ల దాకా ఉంటుంది. ఎస్ఈబీ, శాంతి భద్రతల పోలీసులు 7,152 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తే.. 400 ఎకరాల వరకూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధ్వంసం చేయడం విశేషం. గంజాయి సాగును గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆథారిత శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో ‘ఆడ్రిన్ ఇమేజరీ’ని వినియోగించారు. ఓ పక్క సరిహద్దు గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూనే.. అదే సమయంలో అన్ని రవాణా మార్గాల్లో విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించారు. 120 అంతర్రాష్ట్ర మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో గిరిజనులు, స్థానికులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారిలో చైతన్యం కలిగేలా 1,963 అవగాహన కార్యక్రమాలు, 93 ర్యాలీలు నిర్వహించారు. అలాగే గంజాయి సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా కాఫీ, జింజర్, రాగులు, స్ట్రాబెర్రీ, మిరియాలు తదితర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టూరిస్టులుగా వచ్చి.. స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లుగా వస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు రైలు, బస్సు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలోనే విశాఖ ఏజెన్సీలోని గంజాయికి ప్రత్యేకమైన ఆదరణ ఉండటంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. అరెస్ట్ అయిన 1500 మందిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగర్లు 154 మంది ఉండటం గమనార్హం. గంజాయి ధ్వంసం కార్యక్రమంలో అడిషనల్ డీజీ(ఎల్ అండ్ బీ) రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ(గ్రే హౌండ్స్) ఆర్కే మీనా, ఎస్ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని గుట్టలుగా పేర్చి తగలబెడుతున్న దృశ్యం శారదా పీఠంలో డీజీపీ.. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థతో గిరిజనుల్లో పెనుమార్పు ఆపరేషన్ పరివర్తన్‌తో గిరిజన గ్రామాల ప్రజలు, యువతలో మార్పు మొదలైంది. వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గిరిజన యువతలో మార్పునకు కీలకంగా మారింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుగా గిరిజన యువత చేరడం, తద్వారా గంజాయి సాగుతో నష్టాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియజేయడం వంటివి కీలక పరిణామాలు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
జిల్లాకో సైబర్ సెల్, సోషల్ మీడియా ల్యాబ్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ మోసాలు, వేధింపులను అరికట్టేందుకు జిల్లాకో సైబర్ సెల్, ల్యాబ్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లకు వేర్వేరుగా బీటెక్ అర్హత ఉన్న ఎస్ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లు, సిబ్బందిని ఎంపిక చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకూ సైబర్ లీగల్ అడ్వయిజర్, సైబర్ నిపుణులను నియమిస్తామని చెప్పారు. సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌ల కోసం ఎంపిక చేసిన అధికారులు, సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి వెబినార్ ద్వారా సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, డెస్క్ ఫోరెన్సిక్, మొబైల్ ఫోరెన్సిక్, పాస్వర్డ్ రికవరీ, సీడీఆర్ అనాలసిస్, ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, ప్రోక్సీ ఎర్రర్ ఐడెంటిటీ, ఈ–మెయిల్, సోషల్ మీడియా తదితర టూల్స్లతో కూడిన ఈ సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా స్థాయిలోనే డిజిటల్ ఎవిడెన్స్, సోషల్ మీడియా ఐడెంటిటీ వంటి కీలక సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా దోషులను గుర్తించి సత్వరం శిక్షలు పడేలా చొరవ చూపుతామని చెప్పారు. ఇప్పటికే సైబర్ నేరాలకు పాల్పడుతున్న 1,551 మంది ప్రొఫైళ్లను గుర్తించి, వారిపై సైబర్ బుల్లీ షీట్స్ తెరిచినట్టు డీజీపీ వెల్లడించారు. జిల్లా స్థాయి సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను అనుసంధానిస్తూ రాష్ట్ర స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు అవసరమైన నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. -
మహిళా పోలీసులకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: మహిళలు, బాలల సంరక్షణలో కీలకమైన సచివాలయ మహిళా పోలీసులకు ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్) వరకు పదోన్నతులు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహిళా పోలీసుల నియామకం, శిక్షణ సిలబస్; జాబ్ చార్ట్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనలను ఖరారు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గుడి విజయకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా పోలీసు, సీనియర్ మహిళా పోలీసు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ), సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ), ఇన్స్పెక్టర్ (నాన్ గెజిటెడ్).. ఇలా ఐదు కేటగిరీలుగా వీరిని పరిగణిస్తారు. మొదటి స్థాయిలో ప్రత్యక్ష ఎంపిక ద్వారా మహిళా పోలీస్‌లను నియమిస్తారు. అనంతరం సీనియర్ మహిళా పోలీస్, ఏఎస్ఐ, ఎస్ఐ, ఇన్స్పెక్టర్ వరకు పదోన్నతులు ఇస్తారు. నియామకం, పదోన్నతులు ఇలా.. ► ఇకపై రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మహిళా పోలీసుల నియామకం ఉంటుంది. ► 90 శాతం మందిని నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన 10 శాతంలో 5 శాతం అర్హులైన హోమ్ గార్డులకు, మిగిలిన 5 శాతం గ్రామ/వార్డు సచివాలయాల వలంటీర్లకు కేటాయించారు. ► 5 అడుగులు ఎత్తు, 40 కిలోల తగ్గకుండా బరువు ఉన్న అభ్యర్థులు అర్హులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజనులకు ఎత్తు 148 సెంటీమీటర్లు, బరువు 38 కిలోలు ఉండాలి. ► దేహ దారుఢ్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్)లో 20 నిమిషాల్లో 2 కిలోమీటర్లు నడవాలి. దీంతోపాటు రాత, మెడికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. ► రెండేళ్లు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ► కానిస్టేబుల్ నుంచి సీఐ/ఇన్స్పెక్టర్ వరకు పోలీస్ శాఖలో ఉన్న రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిర్ణయాధికారాలు వీరికీ వర్తిస్తాయి. ► శాంతిభద్రతలు, మహిళలు, పిల్లల రక్షణ, ప్రజా సేవలు సహా పలు అంశాలపై ఇన్డోర్, 10 విభాగాల్లో అవుట్ డోర్ శిక్షణ ఉంటుంది. ► మహిళా పోలీస్‌గా కనీసం ఆరు సంవత్సరాలు, సీనియర్ మహిళా పోలీస్‌గా ఐదేళ్లు, ఏఎస్ఐగా ఐదేళ్లు, ఎస్ఐగా ఐదేళ్లు పనిచేసిన వాళ్లు ఆపై పదోన్నతులకు అర్హులు. సంబంధిత పోస్టులో పనితీరు, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణతను పరిగణనలోకి తీసుకుని పదోన్నతి ఇస్తారు. బోర్డు పరీక్షలకు 90%, పనితీరుకు 10 శాతం వెయిటేజి ఇస్తారు. ► మహిళా పోలీస్ నుంచి ఏఎస్ఐ వరకు జిల్లా పరిధిలో, ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు రేంజ్ పరిధిలో పదోన్నతులు, సీనియారిటీ, బదిలీలు ఉంటాయి. జాబ్ చార్ట్ ► శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలి. ► తమ పరిధిలోని విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులకు రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించాలి. ► అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. ► ఆత్మహత్యలు, ఒత్తిడి అధిగమించడంపై రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ► అవసరం మేరకు పోలీస్ స్టేషన్లలో కేసుల విచారణకు సహాయపడాలి. ► ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలి. ► బాల్య వివాహాల కట్టడికి ఐసీడీఎస్, రెవెన్యూ, ఇతర శాఖలతో కలిసి పనిచేయాలి. ► గృహ హింస, బాల్య వివాహం, లైంగిక వేధింపుల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ నిర్ణయం గొప్ప పరిణామం గ్రామ మహిళా పోలీస్ వ్యవస్థను సాధారణ పోలీసు విభాగంలో అంతర్భాగం చేయడం గొప్ప పరిణామమని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మహిళా పోలీస్ వ్యవస్థను పోలీసు శాఖలో ప్రత్యేక విభాగంగా పరిగణిస్తూనే వారి సేవలను మరింత సమర్థంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉపయోగించుకునేలా ప్రభుత్వం జీవో జారీ చేయడంపట్ల డీజీపీ బుధవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ‘యూనిఫామ్ అనేది ఒక గౌరవం. సగర్వంగా యూనిఫామ్ ధరించండి. ప్రజా సేవలో పునరంకితమవ్వండి. మహిళా పోలీసులకు పోలీస్ శాఖలో తగిన గౌరవం ఉంటుంది’ అని పేర్కొన్నారు. పోలీసు శాఖ పదోన్నతులతో సంబంధం లేకుండా మహిళా పోలీసులకు ప్రత్యేకంగా పదోన్నతులు లభిస్తాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, వార్డుకు ఒక మహిళను పోలీసు ప్రతినిధిగా నియమించిన ఘనత మన రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలందిస్తూనే, మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణే ధ్యేయంగా మహిళా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో విధులు నిర్వర్తించనున్న మహిళా పోలీసులకు నాలుగు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. మొదటి మూడు నెలలు పోలీస్ కళాశాలలో, మరో నెల క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తామన్నారు. మహిళా పోలీసుల పదోన్నతులపై తాజా జీవోను స్వాగతిస్తున్నామని పోలీస్ అధికారుల సంఘం పేర్కొంది. ఇంతవరకు ఈ వ్యవస్థపై నెలకొన్న అపోహలకు ప్రభుత్వం తెరదించిందని తెలిపింది. -
దేశంలోనే ఉత్తమ డీజీపీ గౌతమ్ సవాంగ్
DGP Gautam Sawang Best DGP In India: సాక్షి, అమరావతి: ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది. దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ (ఆప్షన్) ద్వారా అనేక మంది బాధితులకు సత్వర రక్షణ కల్పించేలా డీజీపీ చొరవ చూపినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని బాధితుల ఫిర్యాదులు, వేగవంతమైన దర్యాప్తులో ఎంతో సమయాన్ని ఆదా చేశారని సంస్థ వివరించింది. సాంకేతికను ఉపయోగించుకుని 85 శాతం కేసుల పరిష్కారానికి దోహదపడ్డారని, ఎస్‌వోఎస్ బటన్ ఆప్షన్ ద్వారా ఐదు నెలల్లోనే 2,64,000 డౌన్లోడ్లతో రికార్డు సృష్టించారని తెలిపింది. మహిళల కోసం ప్రారంభించిన దిశా మొబైల్ యాప్ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్లోడ్లను చేయడంతో అద్భుతాలు సాధించారని ది బెటర్ ఇండియా సంస్థ గౌతమ్ సవాంగ్ సేవలను ప్రశంసించింది. -
కోవిడ్ సమయంలో పోలీసుల సేవలు ప్రశంసనీయం
-
రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యసాయం అందించి ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు ఉద్దేశించిన ‘గుడ్ సమారిటన్’ అవార్డుల కోసం ఎంపిక కమిటీలను ప్రభుత్వం నియమించింది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉండే రాష్ట్ర స్థాయి కమిటీలో రవాణా శాఖ కమిషనర్, వైద్యారోగ్య శాఖ కమిషనర్, అదనపు డీజీ(రోడ్డు భద్రత) సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్/జిల్లా జడ్జి చైర్మన్‌గా ఉండే జిల్లా స్థాయి కమిటీలో జిల్లా ఎస్పీ, రవాణా శాఖ ఉప కమిషనర్, జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ సభ్యులుగా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మొదటి గంట(గోల్డెన్ అవర్)లోగా బాధితులను ఆస్పత్రికి తీసుకొచ్చిన వారికి రూ.5 వేల ప్రోత్సాహంతో పాటు ప్రశంస పత్రం అందించారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు తక్షణ సమాచారం అందిస్తే.. ఆ సమాచారం ఇచ్చిన వ్యక్తికి పోలీసులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇస్తారు. అనంతరం సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి ఆయన వివరాలు జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు. జాతీయ స్థాయిలోనూ నగదు, ప్రశంస పత్రం రోడ్డు ప్రమాద బాధితులను నేరుగా ఆస్పత్రికే తీసుకొస్తే.. ఆస్పత్రి అధికారులు ‘గుడ్ సమారిటన్’ రశీదు ఇచ్చి ఆ వివరాలను పోలీస్‌స్టేషన్‌కు పంపుతారు. అక్కడ నుంచి జిల్లా కమిటీకి ప్రతిపాదిస్తారు. ఆ విధంగా వచ్చిన ప్రతిపాదనలను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి నగదు బహుమతి, ప్రశంస పత్రాన్ని నెల రోజుల్లోగా అందిస్తాయి. ఏడాదిలో వచ్చిన ‘గుడ్ సమారిటన్’లలో అత్యంత విలువైన మూడు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేసి జాతీయ స్థాయి అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ విధంగా ఏడాదికి ఒకసారి దేశ వ్యాప్తంగా 10 అత్యుత్తమ ‘గుడ్ సమారిటన్’లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రూ.లక్ష చొప్పున పోత్సాహం, ప్రశంస పత్రం ఇస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘గుడ్ సమారిటన్’ అవార్డుల ప్రక్రియను 2026, మార్చి 31 వరకూ కొనసాగించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించింది. అందుకోసం జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను నియమించినట్టు డీజీపీ గౌతం సవాంగ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న 10కె, 5కె మారథాన్ తాడేపల్లిరూరల్: ఈనెల 5వ తేదీన నిర్వహించనున్న 10కె, 5కె రన్ పోస్టర్లను డీజీపీ గౌతమ్ సవాంగ్, అదనపు డీజీపీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్‌లు బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మణిపాల్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతి రన్నర్స్, రెడ్ ఎఫ్ఎం, డాక్టర్ రెడ్డీస్ వారి సహకారంతో మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడానికి డిసెంబర్ 5న విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా నగదు బహుమతి ప్రదానం చేస్తామన్నారు. పోటీలో పాల్గొనదలచిన వారు 9618558989, 7569304232 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. -
స్మార్ట్ పోలీసింగ్‌లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు..
సాక్షి, అమరావతి: జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన ఏపీ పోలీస్ శాఖను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించినందుకు ఏపీ పోలీసుశాఖను సీఎం మనస్పూర్తిగా అభినందించారు. ఇదేరీతిలో ప్రజలకు మరిన్నిసేవలను నిర్ణీతత సమయంలో అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. కాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు ఉన్నతాధికారులు సచివాలయంలో సీఎంని కలిశారు. ఆ తర్వాత.. స్మార్ట్ పోలీసింగ్ సర్వే వివరాలను సీఎం జగన్‌కి వెల్లడించారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ స్మార్ట్ పోలీసింగ్ సర్వేలో.. ఏపీ పోలీసింగ్ నెంబర్‌వన్ ర్యాంక్ సాధించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన ఈ ఫౌండేషన్.. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో సర్వే చేపట్టిందని డీజీపీ తెలిపారు. 2014లో డీజీపీల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్మార్ట్ పోలీసింగ్ పద్ధతులను పాటించామని తెలిపారు. ఆయా రాష్ట్రాలలో పోలీస్ ఫౌండేషన్ ఏడేళ్లుగా సర్వే నిర్వహిస్తుందన్నారు. ఈ ఏడాది ఏపీ తొలిసారిగా మొదటి ర్యాంకు సాధించిందని డీజీపీ వివరించారు. ఏపీ పోలీస్ శాఖ.. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపిఎఫ్‌ఐపిఎఫ్ అధ్యయనం చేస్తుందని అన్నారు. దీనిలో రిటైర్డు డీజీలు,ఐపీఎస్‌లు,ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌరసమాజ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పౌరులపట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం, జవాబుదారితనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానం సాధించిందని అన్నారు. సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులు పోలీస్ వ్యవస్థ, టెక్నాలజీ ఉపయోగం విభాగాల్లో అత్యుత్తమ ర్యాంకింగ్ కనబర్చిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ (బెటాలియన్స్) శంకభ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్ సర్వీసెస్) పాలరాజు, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ హజరయ్యారు. -
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో గురువారం నిర్వహించిన ఏపీ పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఒక్క పోలీసులు మాత్రమే రోడ్డు మీద నిలబడి ప్రజల ప్రాణాలను కాపాడారన్నారు. ఈ క్రమంలో 206 మంది పోలీసులు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. కోవిడ్ సమయంలో 24/7 హెల్ప్‌లైన్‌తో పోలీసు కుటుంబాలకు వైద్యసేవలు అందించిన ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ సతీమణి సుమిత్రా రవిశంకర్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. -
కరోనా కట్టడిలో పోలీసుల పాత్ర భేష్
సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: కరోనా కట్టడికి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని హోం మంత్రి మేకతోటి సుచరిత అభినందించారు. పోలీసుల సేవలకు ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపునిస్తోందని చెప్పారు. పౌర సమాజం కూడా పోలీసుల కృషిని గుర్తించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కరోనా వల్ల మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.3.72 కోట్ల ఆర్థిక సాయాన్ని మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ చెక్కులను హోం మంత్రి సుచరిత బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో ఆమె గుంటూరు నుంచి పాల్గొన్నారు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి పోలీసు సంక్షేమ నిధి నుంచి రూ.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని చెప్పారు. మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ కూడా ఉదారంగా స్పందించడం ప్రశంసనీయమన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం, వలస కూలీలకు సహాయం చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తదితర విధులను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. పోలీసుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఉద్యోగి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయని రీతిలో ఏపీ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుందన్నారు. కార్యక్రమంలో మ్యాన్‌కైండ్ ఫార్మా సీఈవో రాజీవ్ జునేజా, గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తదితరులు పాల్గొన్నారు.